నాయిక ‘సమంత’

c345a715-ad91-4f68-9b8d-879bdbed7592sakshi 13 jan 13 samanta sakshi 13 jan 13 samanta 1

చైతూ ఇప్పటికీ అమాయకుడే
‘ ఏం మాయ చేసావె’తో ఓ మజిలీ మొదలైంది.
ఆ పరిచయం, ఆ స్నేహం, ఆ బంధం.. ప్రేమ పెళ్లి వరకూ తీసుకెళ్లింది.
అందుకే నాగచైతన్య – సమంత ఎప్పుడు జోడీగా కనిపించినా అది సమ్‌థింగ్‌ స్పెషలే.
ఆ కెమిస్ట్రీతోనే సినిమాల్ని విజయ తీరాలకు చేర్చేశారు. ఇప్పుడు ‘మజిలీ’తో తమది హిట్‌ పెయిర్‌ అని మరోసారి నిరూపించారు. ‘మజిలీ’ విడుదలై, మంచి  ఫలితాన్ని రాబట్టిన వేళ చైతూ, సమంత ఇలా మనసు విప్పారు.హిట్టు మీ ఇద్దరికీ కొత్త కాదు. కానీ ‘మజిలీ’ విజయాన్ని మీరెలా ఆస్వాదిస్తున్నారు..?
సమంత: ఈ విజయం చాలా ప్రత్యేకం. పెళ్లయ్యాక మేం ఇద్దరం కలిసి చేసిన తొలి చిత్రమిది. సరైన సమయంలో సరైన కథ మా దగ్గరకి వచ్చింది. కథ విన్నప్పుడు, షూటింగ్‌ చేస్తున్నప్పుడు ‘ఈ సినిమాతో ఏదో మాయ జరుగుతుంది’ అనిపించింది. అదే జరిగింది.సమంత మీ లక్కీ ఛార్మ్‌ అని మరోసారి రుజువు అయ్యిందా?
సమంత: (నవ్వుతూ) తనే నా లక్కీ ఛార్మ్‌. ఎందుకంటే పెళ్లయ్యాక నా కెరీర్‌ చాలా మారింది.
చైతూ: మీరన్నది నిజమే. కానీ అదృష్టం అనడం కంటే నా బలం అనడం బాగుంటుంది. విజయాలు ఉన్నప్పుడు మన చుట్టూ అందరూ ఉంటారు. కానీ పరాజయాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరి ప్రోత్సాహం చాలా అవసరం. అలాంటి అండ నాకు సమంత రూపంలో దొరికిందిఇక మీదటా తరచూ జంటగానే కనిపిస్తారా?
చైతూ: ఓ హిట్టు వచ్చిందని వెంటనే మరో సినిమా చేయాలన్న ఆలోచన అస్సలు లేదు. ఇది వరకు కూడా ఇంతే. దర్శకులకు ఫోన్లు చేసి ‘మా ఇద్దరికీ సరిపడ కథ ఉందా?’ అని ఎప్పుడూ అడగలేదు. మాకు మేముగా ఏదీ ప్లాన్‌ చేయలేదు. ‘మనం’ విషయంలోనూ ఇదే జరిగింది.  మేమిద్దరం మళ్లీ కలిసి పనిచేయాలంటే అలాంటి మాయ మరోటి జరగాలి.పూర్ణగా నాగచైతన్యని  తెరపై చూసినప్పుడు ఓ ప్రేక్షకురాలిగా ఏం అనిపించింది?
సమంత: చైతూ కెరీర్‌లోనే అత్యుత్తమ నటన ప్రదర్శించాడు. తన పాత్రలో రెండు పార్శ్వాలు ఉన్నాయి. వాటిని చాలా చక్కగా చూపించాడు. ఇది వరకు నాకు తెలిసిన చై ఎందుకు తెరపై కనిపించడు? అనే బాధ ఉండేది. బయట తన ప్రవర్తన, నడుచుకునే విధానం, మాట్లాడే పద్ధతి చాలా గొప్పగా ఉంటాయి. అవి తెరపై కనిపించలేదేంటి? అనుకునేదాన్ని. ఆ మార్పు నాకు ‘మజిలీ’లో కనిపించింది.
చైతూ: నేనెప్పటికీ సమంత అభిమానినే. ద్వితీయార్థం మొత్తం తను నడిపించింది. నా నటన బాగుందంటే కారణం తప్పకుండా సమంతనే. ప్రేమకథా చిత్రాల్లో కథానాయిక పాత్రకీ ప్రాధాన్యం ఉండాలి. అప్పుడే అలాంటి కథలకు ఆదరణ దక్కుతుంది. తను ఒప్పుకోదు కానీ.. క్లైమాక్స్‌ మొత్తం తనదే.

ఇంట్లోవాళ్లు ఏమన్నారు?
చైతూ: విడుదలకు ముందే ఇంట్లో వాళ్లకు చూపించాను. సినిమా పూర్తయ్యాక నిశ్శబ్దంగా వెళ్లిపోయారు. ‘ఏం మాట్లాడకుండా అలా వెళ్లిపోయారేంటి’ అని భయపడ్డాను. మరుసరి రోజు అందరూ ఫోన్లు చేసి ‘మేం సినిమా చూసి చాలా ఎమోషన్‌ అయిపోయాం. అందుకే మాట్లాడలేకపోయాం. సినిమా మాత్రం చాలా బాగుంది’ అనేసరికి ఊపిరి పీల్చుకున్నా.

సాధారణంగా మీ సినిమాల విషయంలో మీ నాన్నగారి జోక్యం ఎక్కువగా ఉంటుంది. కానీ ‘మజిలీ’ భారం మొత్తం మీమీదే వేసేసినట్టున్నారు. కారణం ఏమిటి?
చైతూ: ‘నీకో కథ నచ్చితే నువ్వే నిర్ణయం తీసేసుకో. నా వరకూ తీసుకురానవసరం లేదు’ అని నాన్నగారు ఎప్పుడూ చెబుతుంటారు. ‘మజిలీ’ కథ విన్నప్పుడు ఒక్క డౌటు కూడా నాకు రాలేదు. అందుకే ఈ సినిమా చేయాలని నాకు నేనుగా నిర్ణయం తీసేసుకున్నాను. కానీ మనసులో ఓ భయం ఉండేది. ‘నాకు నేనుగా ఒప్పుకున్న సినిమా ఇది. ఫలితం అటూ ఇటూ అయితే.. నాన్నగారికి ఏం చెప్పాలి?’ అనుకునేవాణ్ని.

‘సూపర్‌ డీలక్స్‌’ చూశారా? సమంత నటన మీకెలా అనిపించింది?
చైతూ: ఈ కథ నాకు ముందే తెలుసు. కాబట్టి సమంతని ఆ పాత్రలో చూసి ఆశ్చర్యపోలేదు. ఈ సినిమాలో నటించిన ప్రతి నటుడికీ, నటికీ సెల్యూట్‌ చేయాలి. ఎందుకంటే ఇలాంటి కథలు చేయడానికి చాలా ధైర్యం కావాలి.

సమంత: చైతూ జిమ్‌లో ఉన్నప్పుడు ఈ కథ తనకు వినిపించా. ‘ఈ సినిమాలో నేను నటిస్తున్నా’ అన్నాను. ‘నువ్వు చేస్తున్నావా.. చేయ్‌ చేయ్‌’ అంటూ నావైపు అదోరకంగా చూశాడు.

ఫలానా సినిమా చేయొద్దు అని   ఎప్పుడైనా అంటే..?
సమంత: ఆయన ఎప్పుడూ చెప్పరు. అది ఆయనపై నాకు ఉన్న నమ్మకం.  పెళ్లయ్యాక నాపై నాకు నమ్మకం మరింత పెరిగింది. ఇంట్లో తను ఇచ్చిన ధైర్యంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నా. ఎలాంటి పాత్ర అయినా చేయగలను అనే నమ్మకం మరింత పెరుగుతోంది.

‘బంగార్రాజు’ ఎప్పుడు మొదలవుతుంది?
చైతూ: స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. జులైలో సినిమా ఉండొచ్చు. నాన్న, నేనూ కలసి నటిస్తాం.

‘నమ్మథుడు 2’లో మీరు కనిపిస్తారా?
సమంత: అవును.. ఆ సినిమా చేస్తున్నాను.

వేసవిలో విహార యాత్రలకు వెళ్తున్నారా?చైతూ:‘వెంకీ మామ’ షూటింగ్‌ ఉంది. కానీ మేలో కాస్త బ్రేక్‌ తీసుకుని ఎక్కడికైనా వెళ్లాలి.
సమంత: ఇప్పుడు నాకు బ్రేక్‌ చాలా అవసరం. ఎందుకంటే కెరీర్‌లో ఎప్పుడూ ఇంత ఒత్తిడి ఎదుర్కోలేదు. ‘మజిలీ’ సినిమా ఫలితం ఎలా ఉంటుందో అని చాలా బెంగ పడ్డాను. దాదాపు ప్రతి సినిమాకీ ఈ ఆందోళన ఉంటుంది. కానీ ఈ సినిమాకి ఎక్కువైంది. పరీక్షలు రాస్తున్నప్పుడు పాస్‌ అవుతామో లేదో తెలిసిపోతుంది. కానీ సినిమా అలా కాదు. ఓ సినిమా ఫలితాన్ని ఎవ్వరూ ముందుగా అంచనా వేయలేరు.
తొలిసారి కలిసినప్పుడు ఒకరి గురించి మరొకరు ఏం అనుకున్నారు?చైతూ: ‘ఏం మాయ చేసావె’ మొదలవ్వక ముందు కొన్ని ఫొటోలు చూపించారు. ‘ఈ అమ్మాయి పేరు సమంత.. మన సినిమాలో నటిస్తోంది’ అన్నారు. ఫొటోలు చూసి ‘అమ్మాయి బాగుంది.. హీరోయిన్‌గా ఓకే’ అనుకున్నా. ఆ తరవాత చెన్నైలో మా ఇద్దరిపై ఫొటో షూట్‌ కూడా చేశారు.సమంత: అసలు ఆ సమయంలో ఎవరి గురించీ ఆలోచించే పరిస్థితిలో లేను. ఎందుకంటే అప్పటికి నాకు అస్సలు తెలుగు రాదు. దానికి తోడు ఏడెనిమిది పేజీలున్న డైలాగులు చెప్పించేవారు. రోజూ సెట్‌కి రాగానే ఆ స్క్రిప్టులో తల దూర్చేసేదాన్ని. డైలాగ్‌ గుర్తొస్తే చేతులు ఒణికి పోయేవి. చైతూని చూడగానే.. ఫర్లేదు అమాయకుడే అనుకున్నా. నిజానికి ఇప్పటికీ తాను అమాయకుడే (నవ్వుతూ)
ఎంత నిద్ర చెడితే… అంత మంచి పాత్రలన్నట్టు!
‘అందం ఉంటే చాలదు, నటన వస్తేనే సరిపోదు. మంచి పాత్రలు రావాలి. అప్పుడే కథానాయికలు కాస్తా స్టార్లవుతారు’ ఈమధ్య ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమంతని ఉద్దేశించి అన్నమాటలివి. సమంత ఎప్పుడో స్టార్‌ అయిపోయింది. కానీ… ఆమెకు గొప్ప పాత్రలు ఇప్పుడే ఎదురవుతున్నాయి, కాదుకాదు మంచి మంచి పాత్రలకు తానే ఎదురెళుతోంది. విభిన్నమైన పాత్రలని ఎంచుకుని విజయాల్ని అందుకుంటోంది. కెరీర్‌లో మాంచి దూకుడుమీదున్న సమంతని ‘మీకు బాగా నచ్చిన మీ పాత్రలేంటి?’ అని అడిగితే – ఒక్కోదాని గురించీ ఇలా చెప్పుకొచ్చింది.

సినిమా : ఏమాయ చేసావె
పాత్ర : జెస్సీఏమిటి స్పెషల్‌ : జెస్సీకి తనకంటే రెండేళ్లు చిన్నవాడైన, తన మతానికి చెందనివాడైన కార్తిక్‌పైన ఇష్టం ఉంటుంది. ఇంట్లోవాళ్ల వ్యతిరేకతని దాటుకుని పెళ్లి చేసుకోలేనంత పిరికిదేమీ కాదు కానీ… ఆ తర్వాత తన భవిష్యత్తు ఏమిటనే సందిగ్ధం తనది. ఆ అస్పష్టత తన వ్యక్తిత్వంలోని లోపం. అదే జెస్సీని పక్కింటమ్మాయంత సహజంగా మనముందు నిలబెడుతుంది. హీరోతో ఆడిపాడే మామూలు కథానాయికలా కాకుండా ఆ అమ్మాయిలోని సంక్లిష్టతని చూపించాలన్నదే నాకున్న అసలైన ఛాలెంజ్‌.
తమిళంలో త్రిష చేస్తున్న పాత్రని, అప్పుడే సినిమాల్లోకి అడుగుపెట్టిన నా చేత చేయించడమే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. భయం వేసింది. తొలి చిత్రంతోనే అలాంటి పాత్ర దక్కడం నా అదృష్టం అని ఇప్పుడు అనిపిస్తోంది కానీ… షూటింగ్‌ అప్పుడు మాత్రం చాలా ఆందోళనగా ఫీలయ్యాను. కానీ పోనుపోను నాకు తెలియకుండానే జెస్సీలో పరకాయ ప్రవేశం చేయడం మొదలుపెట్టాను. ఇంటికెళ్లి ఏ పనిచేస్తున్నా కూడా ‘జెస్సీ అయితే ఈ సందర్భంలో ఎలా ఉంటుంది? ఎలా నవ్వుతుంది? ఎలా చూస్తుంది?’ అని ఆలోచించేదాన్ని. హీరోకి తన ప్రేమని చెప్పకనే చెబుతున్నప్పుడూ, తెలిసితెలిసీ అతణ్ణి బాధపెడుతున్నప్పుడూ ఓ నటిగా కాకుండా…
ఓ మామూలు అమ్మాయిలాగే ప్రవర్తించాలనుకున్నాను. ఒకస్థాయిలో నేను తనలాగే మారిపోయాను. అంతగా మనసుపెట్టి చేయగలిగాను కాబట్టే… ఆ పాత్ర ఇప్పటికీ అందరి మెప్పూ అందుకుంటోంది. ఆ జెస్సీ వల్లే నేను పరిశ్రమలో నిలబడగలిగాను. చైతూకి అది రెండో సినిమా. ఓ విధంగా తనకీ కొత్త సినిమానే. తనని తాను నిరూపించుకోవాలనే కసి ఉన్నా కూల్‌గానే కనిపించేవాడు. నేను సెట్లో కంగారుపడుతూ ఉంటే ‘ఆందోళనపడకు… అంతా మంచే జరుగుతుంది!’ అంటూ ధైర్యం చెప్పేవాడు. బహుశా చైతూపై నాలో ఫస్ట్‌ ఇంప్రెషన్‌ అప్పుడే పడిందేమో..?
సినిమా : రంగస్థలం
పాత్ర : రామలక్ష్మిఏమిటి స్పెషల్‌ : చెవిటివాడు, మొరటువాడైన చిట్టిబాబుని ప్రేమించి తల్లిదండ్రులని ఎదిరించి మరీ పెళ్లాడే ఫక్తు పల్లెటూరి అమ్మాయి రామలక్ష్మి. మొదట్లో అతని అమాయకత్వానికి నవ్వుకుంటూ ఉండే రామలక్ష్మి తర్వాతి భాగంలో హీరో ప్రతీకారంతో రగిలిపోతుంటే అతనికి తోడునిలుస్తుంది. హత్యలోనూ సహకరిస్తుంది! అప్పటిదాకా మోడర్న్‌ అమ్మాయి పాత్రలే చేసిన నేను పల్లెటూరమ్మాయిగా నటించి మెప్పించాలన్నదే ఇందులో నాకున్న పెద్ద సవాలు.
నాకు నచ్చిన మిగతా పాత్రలతో పోలిస్తే పెద్దగా సంఘర్షణలూ, వ్యక్తిత్వపరంగా పెద్దగా లేయర్‌లేవీ లేని పాత్ర ఇది! కానీ దాన్ని చేసేందుకు నేను పడ్డ శ్రమా, ఆ సినిమాకు దక్కిన విజయాలే ‘రామలక్ష్మి’ని నేనెంతో సంతృప్తిగా తలచుకునేలా చేశాయి. నేను అంత మాస్‌గా కూడా నటించగలనని తెలుసుకున్నదీ అప్పుడే. నగరంలో పుట్టి పెరిగిన నాకు గోదావరి జిల్లా అమ్మాయిల హావభావాలు చూపించడం అంత సులభం కాదేమో అనిపించింది. అందుకనే షూటింగ్‌ కోసం రాజమండ్రి వెళ్లినప్పుడు అక్కడి అమ్మాయిలని పిలిపించుకుని వాళ్లతో మాట్లాడటం మొదలుపెట్టాను. వాళ్ల వేషభాషల్ని క్షుణ్ణంగా పరిశీలించడం ప్రారంభించాను. మామూలుగా మనమంతా పల్లెటూరి అమ్మాయిలంటే ఏమీ తెలియనివాళ్లని చిన్నచూపు చూస్తుంటాం కదా! తొందరగా పెళ్లి చేసుకుంటారనీ, స్వతంత్రంగా ఉండలేరనీ అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్లు చాలా ధైర్యవంతులనే నిజం అప్పుడే నాకు అర్థమైంది. ఇంకొకటి, రామలక్ష్మి పాత్రకి నల్లగా కనిపించాలని చెప్పారు. మామూలుగానే నేను కాస్త చామనఛాయలో ఉంటాను… ఇంకాస్త నల్లబడాలని ఎండలో నిల్చునేదాన్ని. సినిమా విడుదలయ్యాక రామలక్ష్మి పాత్రకి వచ్చిన ప్రశంసల్ని పక్కనపెడితే ‘పెళ్లయ్యాక ముద్దు సన్నివేశాల్లో నటించొచ్చా?’ అని నోళ్లు నొక్కుకున్నారు చాలామంది. నిజానికి, అది ముద్దుకాదు… కెమెరా ట్రిక్‌ అన్నది వేరే విషయం. అయినా ‘పెళ్లయ్యాక హీరోలు ముద్దు సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు కథానాయికలు నటించకూడదా… ఏమిటీ!?’ అన్నదే నా ప్రశ్న.
సినిమా : సూపర్‌ డీలక్స్‌(తమిళం)
పాత్ర : వేంబుఏమిటి స్పెషల్‌ : పెళ్లై ఆరునెలలే అవుతున్న వేంబు… భర్తలేనప్పుడు తను ఇదివరకు ప్రేమించినవాడితో గడుపుతుంది. కలయిక సమయంలోనే అతను చనిపోతాడు. ఇంతలో భర్త రానేవస్తాడు. ఏం జరిగిందో అతనికి నిజాయతీగా చెబుతుంది. ‘ముందు ఈ శవాన్ని వదిలించుకుని… విడాకులు తీసుకుందాం!’ అనుకుని ఆ పనిలో పడతారు ఇద్దరూ. ఇదంతా గమనించిన ఓ పోలీసు వీళ్లని బ్లాక్‌మెయిల్‌ చేస్తాడు. ‘నువ్వెలాగూ చెడిపోయిందానివి కాబట్టి నాతోనూ గడుపు!’ అని వేంబుని బెదిరిస్తాడు. ఇందులో వేంబు పాత్ర చేసింది చెడే అయినా… ప్రేక్షకులకి ఆమెపైన ఏమాత్రం చులకనభావం రానీయకుండా నటన ఉండాలి!’ అన్నదే నాకు నేను పెట్టుకున్న నియమం. అసలు చెడు అనే పదానికీ, అనైతికత అనే భావనకీ జీవితంలో అర్థం ఉందా అని ప్రశ్నించే సినిమా ఇది. ఈ సినిమా దర్శకుడు కుమారరాజా ఏడేళ్లకిందట ‘అరణ్యకాండం’ అనే జాతీయ అవార్డు సినిమా తీసినవాడు. ‘సూపర్‌ డీలక్స్‌’ చిత్రంలో వేంబు పాత్ర కోసం ఇండస్ట్రీలో ‘వీళ్లు చాలా బోల్డ్‌’ అని పేరుతెచ్చుకున్న చాలామంది హీరోయిన్‌లకి కథ వినిపించాడట. అందరూ భయపడి పారిపోవడంతో నాకోసం హైదరాబాద్‌ వచ్చాడు. కథ విని రెండ్రోజుల్లో నిర్ణయం చెబుతానన్నాను. ఆ రోజు రాత్రంతా నిద్రపోలేదు. ఇంత సవాలుతో కూడిన పాత్రని వదులుకుంటే మళ్లీ దక్కదనిపించింది. కానీ ఎలా…? దానికి న్యాయం చేయగలనా అనే భయం పీడించింది. తర్వాతి రోజు జిమ్‌ చేస్తుండగా చైతూతో ‘సూపర్‌ డీలక్స్‌’లో కథానాయిక పాత్ర గురించి చెప్పాను. ఆసక్తిగా విని, ‘సూపర్‌ క్యారెక్టర్‌ కదా?’ అన్నాడు. ఆ తర్వాత ‘ఈ పాత్ర నేనే చేయాలనుకుంటున్నా!’ అని బాంబు పేల్చాను. తను షాకయ్యాడు. ‘ఏంటీ… ఈ పాత్ర నువ్వు చేస్తున్నావా’ అని పదే పదే అడిగాడు. చివరికి ‘ఆల్‌ ది బెస్ట్‌’ అన్నాడు. సినిమా షూటింగ్‌కి ముందు మూడు రోజులు నేను అస్సలు నిద్ర పోలేదు. కేవలం ఆ పాత్ర గురించే ఆలోచిస్తూ ఉన్నా. అప్పుడే తొలిసారి సెట్స్‌లోకి వెళ్తున్నంత భయంగా అనిపించింది. ఆ సినిమా విడుదలైన తరవాత రివ్యూలు చూసుకుని ఎంత మురిసిపోయానో. నాకు దొరికిన బెస్ట్‌ కాంప్లిమెంట్స్‌లో సగం.. ఆ సినిమా కోసం వచ్చినవేనంటే నమ్మండి! షూటింగ్‌కి ముందు భయాందోళనలతో ఎంతగా నా నిద్ర చెడితే అది అంత మంచిపాత్రన్నట్టని ఈ సినిమాతోనే అర్థమైంది.
చిత్రం : ఓ బేబీ.
పాత్ర : బేబీఏమిటి స్పెషల్‌ : శారీరకంగా ఇరవై ఏళ్ల అమ్మాయిగా మారిన… డెభ్భైఏళ్ల బామ్మ పాత్ర! వయసు తగ్గిన ఉత్సాహంతోపాటూ జీవితానుభవం ఇచ్చిన గాంభీర్యాన్నీ ఆ పాత్ర చూపించాలి. తన మనవడికంటే కొద్దిగా ఎక్కువ వయసున్న కుర్రాడొకడు ప్రేమిస్తున్నానని వెంటపడితే ఏం చెప్పాలో పాలుపోక నిల్చోవాలి. పైగా… ఈ ఒక్క పాత్రే సినిమా మొత్తాన్ని తన భుజాలపైన మోసి నడిపించాలి.చిన్నప్పుడు నేను అమ్మమ్మ, తాతయ్యలతో గడపలేదు. వృద్ధుల తీరు ఎలా ఉంటుందో… వాళ్ల ఆలోచనలు ఎలా ఉంటాయో దగ్గరగా చూసిందాన్ని కాదు. అందుకే షూటింగ్‌కు ముందు ఓ వృద్ధాశ్రమానికి వెళ్లి చాలాసేపు గడిపి వచ్చాను. ఇంత హోమ్‌వర్క్‌ చేసినా రాజేంద్రప్రసాద్‌గారి లాంటి సీనియర్‌ నటుణ్ణి నా స్నేహితుడిగానూ, రావు రమేష్‌గారిని నా కొడుకుగానూ భావించి నటించాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిపడిపోయాను. ఎంత చేసినా సహజంగా అనిపించలేదు. ఓ దశలో ‘కాసేపు షూటింగ్‌ ఆపేద్దాం’ అని చెప్పి గంటసేపు ఆ సెట్లోనే పచార్లు చేశాను. చివరికి ఏదోలా ఆ షాట్‌ ఓకే చేయించుకోగలిగాను. ఈ సినిమా చేస్తున్నంతసేపూ మా అమ్మ మీద ప్రేమ పెరిగిపోయింది. అమ్మ నా కోసం ఇంత చేసిందంటే… ఆమె ఎంతగా తన యౌవనాన్నీ, ఆశల్నీ త్యాగం చేసి ఉంటుందో అనిపించి ఉద్వేగానికి గురయ్యాను. ఓరోజు ఉండబట్టలేక ‘అమ్మా… చిన్నప్పుడు నీకంటూ ఏమైనా ఆశలూ, ఆశయాలూ ఉండేవా? వాటిని మధ్యలోనే వదులుకోవాల్సివచ్చిందా?’ అని అడిగాను. ‘నువ్వు సంతోషంగా ఉండడం కంటే నాకు ఎలాంటి ఆశలూ ఆశయాలూ లేవు’ అంటూ నవ్వేసింది. అమ్మలంతా అంతేనేమో మరి!
చిత్రం : మజిలీ
పాత్ర : శ్రావణిఏమిటి స్పెషల్‌ : శ్రావణి చిన్నప్పటి నుంచీ ప్రేమించిన అబ్బాయి మరొకరి ప్రేమలో విఫలమై తాగుబోతుగా మారి, క్రికెట్‌ కెరీర్‌నీ పోగొట్టుకుంటాడు. ఆమెకి అతనితోనే పెళ్లవుతుంది. అతను భార్య సంపాదనతోనే బతుకీడుస్తాడు! భర్త పట్టించుకోకున్నా అతన్నే ప్రేమించే పాత్ర. మరో కోణంలో చూస్తే ఎంతో పరిణతి ఉన్న నేటితరం అమ్మాయి తను. ఆ రెండు వైరుధ్యాలనీ చూపడమే ఈ పాత్ర గొప్పతనం.ఈ సినిమాలో నేను సెకండ్‌ హాఫ్‌లో కనిపించినా కథ మాత్రం నాచుట్టూనే తిరుగుతుంటుంది. సినిమా చూసి ‘చైతూని డామినేట్‌ చేసేశావ్‌’ అని చాలామంది కాంప్లిమెంట్లు ఇచ్చారు. అందులో నిజం లేదు. చైతూలోని అసలైన నటుడు ఈ సినిమాతోనే బయటకు వచ్చాడనిపించింది నాకు. ముఖ్యంగా-ఇద్దరి మధ్యా పండిన పతాక సన్నివేశాలు నాకు బాగా నచ్చాయి. నిజ జీవితంలో నేనూ, చైతూ అలా ఉండం. అలాంటి మేము… ఈ పాత్రల్ని సవాలుగా తీసుకున్నాం. ముందు ఈ కథ చైతూ దగ్గరకు వెళ్లింది. ‘శ్రావణి పాత్రకు సమంత అయితేనే బాగుంటుంది’ అని దర్శకుడు శివ నిర్వాణ పట్టుబట్టాడట. ‘నీకు నచ్చితేనే చెయ్‌. లేదంటే ఏదో ఒకటి చెబుదాంలే’ అని చై చెప్పాడు. కానీ కథ వినగానే నాకు చాలా నచ్చింది. మరోవైపు పెళ్లయ్యాక ఇద్దరం కలిసి చేస్తున్న తొలి సినిమా… ఆడకపోతేనో… అనే భయం కూడా వెన్నాడింది. చైతూతో మాత్రం ఇది తప్పకుండా హిట్టవుతుంది చూడు… అంటుండేదాన్ని. ‘మజిలీ’ విజయాన్ని పెళ్లయ్యాక మా ఇద్దరికీ అందిన తొలి బహుమతిగా భావిస్తున్నాను.
– మహమ్మద్‌ అన్వర్‌