Aug 7 2011
Aug 5 2011
2010 NANDI AWARDS LIST
Krish directed Vedam was adjudged as the Best Film for the year 2010 by Nandi Awards Committee. Nandamuri Balakrishna was declared as the Best Actor for his performance in the film, Simha while Nitya Menen won Best Actress award for her maiden film in Telugu - Ala Modalaindi .
Gangaputrulu and Prasthanam won Second Best and Third Best Film Awards respectively.
Nandi Awards for year 2010 were announced by the jury headed by director N Shankar. At a press meet held today (August 5, 2011) at Film Development Corporation, the jury announced the winners list to the media.
Complete list of Nandi Awards – 2010
Best Film: Vedam
Second Best Film: Gangaputrulu
Third Best Film: Prasthanam
Best Home Viewing Film: Andari Bandhuvaya
Best Popular Film: Maryada Ramanna
Best Film on National Integration: Parama Veera Chakra
Best Children’s Film: Little Buddha
Best Documentary: Advaitam
Second Best Documentary: Freedom Park
Best Book On Telugu Cinema: Telugu Cine Geya Kavula Charitra by Dr. Paidipala
Best Film Critic: Chakravarthi (Eenadu, Sitara)
Best Director: P Sunil Kumar Reddy (Gangaputrulu)
Best Actor: Nandamuri Balakrishna (Simha)
Best Actress: Nitya Menen (Ala Modalaindi)
Best Supporting Actor: AVS (Kotimooka)
Best Supporting Actress: Pragati (Emaindi Ee Vela)
Best Character Actor: Saikumar (Prasthanam)
Best Comedian: Dharmavarapu (Alasyam Amrutham)
Best Female comedian: Jhansi (Simha)
Best Villain: V Nagineedu (Maryada Ramanna)
Best Child Actor: Master Bharath (Bindaas)
Best First Film Of a director: Nandindi Reddy (Ala Modalaindi)
Best Screenplay Writer: Gautham Vasudev Menon (Ye Maaya Chesave)
Best Story Writer: R P Patnaik (Broker)
Best Dialogue Writer: P Sunil Kumar Reddy (Gangaputrulu)
Best Lyric Writer: Nandini Siddhar Reddy (Veera Telangana; Song: Nageti Chello Naa Telangana)
Best Cinematographer: Prasad Murella (Namo Venkatesha)
Best Music Director: Chakri (Simha)
Best Male Singer: M M Keeravani (Maryada Ramanna; Song: Telugu Ammayi)
Best Female Singer: Pranavi (Sneha Geetam; Song: Sa Ri Ga Ma Pa Da NI)
Best Editor: Kotagiri Venakteshwara Rao (Darling)
Best Art Director: Ashok (Varudu)
Best Choreographer: Prem Rakshit (Adhurs)
Best Audiographer: E.Radhakrishna (Brindavanam)
Best Costume Designer: Ram and Kumar (Varudu)
Best Makeup Artiste: Gangadhar (Brahmalokam to Yamalokam Via Bhoolokam)
Best Fight Master: Sekhar (Manasaara)
Best Male Dubbing Artiste: C.M.Raju (Darling)
Best Female Dubbing Artiste: Chinmayi (Ye Maaya Chesave)
Best Special Effects: Alagar Swamy (Varudu)
Special Jury Awards
Actress: Samantha Ruth Prabhu (Ye Maaya Chesave)
Director: Chandra Sidharth (Andhari Banduvaya)
Actors: Sunil (Maryada Ramanna) and Manoj (Bindaas)
Nandi honours for Balakrishna, Nitya MenonSPECIAL CORRESPONDENT
|
Aug 4 2011
సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు
నాడే తెలుగు సినీ గీతంలో హిందుస్తానీ, పాశ్చాత్య సంగీతాన్ని మేళవించిన అసమాన ప్రతిభా సంపన్నుడు సాలూరి రాజేశ్వరరావు. తొలిచిత్రంలోనే తన గాన, నటనా కౌశలాన్ని సాలూరి తెలుగు ప్రేక్షకులకు చాటి చెప్పాడు. శశిరేఖాపరిణయం (మాయాబజార్ 1936) ఆయన రెండవ చిత్రం. దీనిలో అభిమన్యుడి పాత్రని పోషిస్తూ కొన్ని పాటలు కూడా పాడారు. గాయక నటునిగా పేరు సంపాదించినా సంగీతకారునిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తృష్ణ ఈయనలో అధికంగా వుండేది.
అత్యంత యువ సంగీతదర్శకుడిగా చరిత్ర సృష్టించినా సినీ సంగీతదర్శకునిగా బాగా గుర్తింపు తెచ్చిన మొదటి సినిమా ఇల్లాలు (1940).ఆ చిత్రంతో తెలుగు శ్రోతలకొక కొత్తరకమైన సంగీతం పరిచయం చేయబడింది. “లలిత సంగీత”మన్న దానికి తెలుగులో మొదటిగా శ్రీకారం చుట్టి ఒక కొత్త వొరవడిని సృష్టించాడు. కలకత్తాలో బెంగాలీ సంగీతం ద్వారా ప్రభావితుడైన సాలూరి ఆధునికత్వం కోసం చేసిన ప్రయోగాలు తెలుగు సినీ పరిశ్రమలో అంతగా ఆదరణ పొందకపోయినా, తెలుగు పాటకు పాశ్చాత్య బాణీని యెలా జతపరచవచ్చో “ఇల్లాలు” ద్వారా; ఆ తరువాత ఈయన పాడిన లలిత గీతాల ద్వారా, సమర్ధవంతంగా నిరూపించాడు. ఆర్కెస్ట్రా నిర్వహణలో “హార్మొనీ” యొక్క ప్రాధాన్యత ఏమిటో ఆయనకు అర్థమయినంతగా మరెవ్వరికి కాలేదేమో!
ఇల్లాలు చిత్రం ద్వారా సాలూరి కి ఒక బాల సరస్వతి గారి స్వరం తోడై ఒక నూతనత్వానికి తెరలేపింది. వీరిరువురు కలిసి పాడిన పాటలు అత్యంత ప్రజాదరణ పొందడమే కాక గ్రాంఫోన్ రికార్డుల రూపం లోవెల్లువెత్తి తెలుగు సంగీత చరిత్రలో ఒక కమనీయమైన ఘట్టంగా శాశ్వతంగా నిలిచిపోయింది. ఆంధ్రదేశంలో సంగీతరంగానికి నలభయ్యవ దశకం ఒక స్వర్ణయుగమైతే దానిలో సుమారొక యెనిమిదేళ్ళపాటు రాజేశ్వరరావు, బాలసరస్వతులు రాజ్యమేలారంటే అతిశయోక్తి కాదు.జెమినీసంస్థకి ఆస్థాన సంగీత దర్శకుడిగా పని చేసి ఎన్నో మధురమయిన సుస్వరాలని అందిచారు.
సాలూరి ప్రతిభను యావద్భారత దేశానికి తెలియ జెప్పిన చిత్రం చంద్రలేఖ (1948). కర్ణాటక, హిందుస్తానీ, పాశ్చాత్య శాస్త్రీయ సంగీతాలని,లాటిన్ అమెరికన్, పోర్చుగీస్, స్పానిష్ జానపద సంగీత పోకడల్ని ఎంతో ప్రతిభావంతంగా సమ్మిళితం చేసి, ఆ కాలంలో వూహించలేనటువంటి పెద్ద వాద్యబృందంతో సృష్టించిన చిత్రమది.
సాలూరి కిరీటంలో కలికితురాయి మల్లీశ్వరి (1951). సినిమా సంగీతంలోను, సినిమా తీసే పద్ధతిలోను గణనీయమైన మార్పులు చెందినా, అర్ధ శతాబ్దం తర్వాతకూడా నేటికీ గల గలా ప్రవహించే నదిలా వీనులవిందు గొలుపుతున్న సాహిత్య సంగీతాల మేళవింపు “మల్లీశ్వరి”. బి.ఎన్.రెడ్డి కార్యదక్షతతో, దేవులపల్లి మల్లెపూరేకు బరువుతో వ్రాసిన సాహిత్యంతో, పసుమర్తి కృష్ణమూర్తి నృత్య సారధ్యంతో, ఘంటసాల భానుమతిల గళ మధురిమతో యీ చిత్రంలోని సంగీతం తక్కిన అన్ని హంగుల మాదిరిగానే నభూతో నభవిష్యతి. దీనిని మించిన సంగీతభరితమైన చిత్రం ఇంతవరకు రాలేదు, ఇక ముందు కూడా రాబోదని దృఢంగా విశ్వసించే చాలామంది వున్నారు. సాలూరే “మల్లీశ్వరి” పై వ్యాఖ్యానిస్తూ “చంద్రలేఖ” కథకు ఒక కాలం అంటూ లేదు కనుక అన్నిరకాల సంగీతం వినిపించడానికి అవకాశం కలిగింది. కాని, “మల్లీశ్వరి” చరిత్రకు సంబంధించిన చిత్రం. అటు కథాకాలానికి, ఇటు కాస్త ఆధునికంగానూ వుండేలా సంగీతం కూర్చవలసి వచ్చింది. శాస్త్రీయ రాగాలను తీసుకొని, సెమిక్లాసికల్ గా స్వరపరిచాను. అలాగే అందులోని ఏ పాటా కూడా ట్యూన్‌కి రాసింది కాదు! బి.ఎన్.గారికి సంగీతాభిరుచి ఎక్కువ కావడంతో ఒక్కో పాటకు ఐదారు వరసలు కల్పించవలసి వచ్చింది. ఆ చిత్రానికి మొత్తం ఆరునెలలపాటు మ్యూజిక్ కంపోజింగ్ జరిగింది” అన్నాడు.
ప్రతి సంగీత విద్యార్ధి మొదటిగా నేర్చుకొనే శ్రీగణనాధ సింధూరవర్ణ (మలహరి) అన్న పురందరదాస కృతితో చిత్రం ప్రారంభమవుతుంది. తరువాత తేలికగా పాడుకోగలిగే బాణీలలో పిల్లల పాటలు (ఉయ్యాల జంపాల, రావి చెట్టు తిన్నె చుట్టూ), హాస్య గీతం (కోతీబావకు పెళ్ళంట), ప్రకృతి పాట (పరుగులు తీయాలి), జావళి ( పిలచిన బిగువటరా), జానపదం (నోమీన మల్లాల), వీడ్కోలు పాట (పోయిరావే తల్లి), యక్షగానం (ఉషాపరిణయం), యుగళ గీతం, ఇలా అన్నిరకాల పాటలనందించి విభిన్న శ్రోతలను ఆనందపరచిన చిత్రమిది. మరింత ప్రత్యేకంగా పేర్కొనవలసినది, తెలుగువారందరూ ఎంతో గర్వపడ వలసినది, కాళిదాసుని మేఘసందేశానికేమాత్రం తీసిపోని సాలూరి, దేవులపల్లి, ఘంటసాల భానుమతుల సమిష్టి కృషిఫలితం ఆకాశవీధిలో అన్న పాట. ఈ రాగమాలిక(భీంపలాస్, కళంగద, కీరవాణి, హంసానంది) అనురాగరసంతో విరహగీతాన్ని విరచించే తూలిక!
శాస్త్రీయ సంగీత బాణీలు, కర్ణాటక హిందుస్తానీ రాగాలలో యుగళ్ బందీలు , పాశ్చాత్య సంగీత రూపాలు, … ఇలా చేపట్టిన ఏ ప్రక్రియలోనైనా అద్వితీయమైన సంగీతాన్ని విన్పించారు. అనేక సంగీత రీతుల్ని సమన్వయం చేయడంలో ఆయన సాధించిన విజయాలు మరెవ్వరూ సాధించలేదు. వాయిద్యాలపై ఆయనకున్న పట్టును గురించి చిత్రరంగంలో చాల గొప్పగా ఈనాటికీ చెప్పుకుంటారు.
ఈయన సుదూర సుస్వర సంగీతయాత్రలో 200కు పైగా చిత్రాలకు, ఎన్నో లలిత గీతాలకు, పెక్కు ప్రైవేటు రికార్డులకు సంగీతాన్ని అందించాడు. ఆయన 40 ఏళ్ళకు పైబడిన సినీ జీవితంలో కనీసం పేరైనా పేర్కొనవలసిన చిత్రాలు రాజు పేద (54), మిస్సమ్మ (1955), భలేరాముడు (1956), మాయాబజార్ (1957, 4 పాటలు మాత్రమే), అప్పుచేసి పప్పుకూడు, (1958), చెంచులక్ష్మి (1958), భక్త జయదేవ (1960), అమరశిల్పి జక్కన (1963), భక్త ప్రహ్లాద (1967). అభేరి (భీంపలాస్), కల్యాణి, మోహన, సింధుభైరవి,శంకరాభరణం ఈయనకు ప్రియమైన రాగాలు. శాస్త్రీయ రాగాల్లో ఆయన వినిపించిన వరసలను గురించి మరొక సుదీర్ఘమైన వ్యాసమే రాయవచ్చు. జగమే మారినది (కల్యాణి, దేశ ద్రోహులు 62), నా హృదయంలో నిదురించే చెలీ (శంకరాభరణం, ఆరాధన 62), పాడవేల రాధికా (మోహన, ఇద్దరు మిత్రులు 60), … లాంటి పాటలు మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.
ఏదో ఒక సంగీతానికే కట్టుబడి వుండాలని ఈయన మడికట్టుకు కూర్చోలేదు. మారుతున్న కాలాన్నిబట్టి పరిస్థితులు ఎన్నో మారుతున్నాయి. అదే విధంగా సినిమా సంగీతంలో కూడా మార్పులెన్నో వచ్చాయి. పాశ్చాత్య శాస్త్రీయ సంగీతాన్ని, జాజ్, పాప్, రాక్, డిస్కో వంటి అధునాతన పాశ్చాత్య సంగీతాన్ని మనం అడ్జస్ట్ చేసుకోక తప్పలేని పరిస్థితి. వాటిని మనం అనుసరించడంలో తప్పులేదు. కానీ, కేవలం అనుసరించడం, అనుకరించడం కోసమై మన సంగీతానికి ప్రాణసమానమైన ‘మెలొడీ’ ని ఈతరంవారు మర్చిపోతున్నారు అని అన్న ఆయన మాటలు ఎంతయినా నిజం. ముఖ్యంగా ఈనాడు! సాంఘికమైనా, పౌరాణికమైనా తను నమ్ముకున్న మెలొడీకి ప్రాధాన్యతనిస్తూ సంప్రదాయ రాగాల్లో వుండేటటువంటి మధురిమను వదులుకోకుండా చక్కని చిక్కని పాటలు అందించాడు.
Aug 4 2011
సంగీతదర్శకుడు ‘ పెండ్యాల నాగేశ్వరరావు
అద్భుతమైన పాటలే కాదు, పద్యాలు కూర్చారు. పౌరాణిక చిత్రాలకు సాంఘిక, జానపద చిత్రాలకూ అద్భుతమైన బాణీలు సమకూర్చడానికి తాను ఎంత రిహార్సిల్స్ చేసేవారో, గాయనీ గాయకులతో కూడా రిహార్సిల్స్ చేయించి మరీ పాడించేవారు. రంగస్థల నటుడు, హార్మోనిస్ట్ కూడా కావడంతో పద్యాల మీద రంగస్థలంలో తనకు గల పట్టు, చిత్రాల్లో కూడా పద్యాల మీద చూపి సినిమాల్లో కూడా ఓహో అనేలా పద్యాలు పాడించేవారు. గాయనీ గాయకుల టేలెంట్ గుర్తించి, వారి టేలెంట్‌ని సద్వినియోగం అయ్యేలా చేయడానికి మీదు మిక్కిలి శ్రమించేవారు పెండ్యాల.
శాస్త్రీయ సంగీతంలోనూ, హార్మోనియం వాయించడంలోను పేరు ప్రఖ్యాతులు పొందిన తండ్రి సీతారామాయ్య నుంచి గాత్రం, హార్మోనియం రెండూ నేర్చుకున్నారు మిగతా విద్యార్థులతో పాటు. అలాగే తండ్రి రంగస్థల ప్రదర్శనలకు హాజరు అవుతుంటే పెండ్యాల దృష్టి అటువేపు మళ్ళింది. అందుకే స్కూల్లో పాటలు పద్యాలు పాడటమే కాకుండా అప్పుడప్పుడు వేషాలూ వేస్తూ మెల్లిగా రంగస్థలం మీదకు నటుడుగా ప్రవేశించి హార్మోనియం కూడా మీటేవారు.
ఆరుద్ర పెండ్యాల, తిలక్ కాంబినేషన్లో రూపొందిన చిత్రాల్లో ఎంత చక్కని పాటలు రూపొందాయో, ఘంటసాల, సుశీల, పెండ్యాల కాంబినేషన్లోనూ అద్భుతమైన పాటలు వెలువడ్డాయి.
దొంగరాముడు, ముద్దుబిడ్డ, ఎమ్ఎల్ఎ, భాగ్యరేఖ, జయభేరి, భట్టి విక్రమార్క, ఈడూజోడూ, అత్తా ఒకింటి కోడలే, హరిశ్చంద్ర, మహాకవి కాళిదాసు, శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం, జగదేక వీరుని కథ, వాగ్దానం, మహామంత్రి తిమ్మరుసు, కులగోత్రాలు, శ్రీకృష్ణార్జున యుద్ధం, శ్రీకృష్ణ తులాభారం, రాముడు భీముడు, వెలుగునీడలు, ఉయ్యాల జంపాల, శ్రీకృష్ణ సత్య, బావామరదళ్లు, అక్కాచెల్లెలు ఇలా అనేక చిత్రాలను అద్భుతమైన సంగీతం సమకూర్చారు పెండ్యాల.
పెండ్యాల ప్రతిభని పసిగట్టిన గాలిపెంచల నరసింహారావు మాయలోకం (1945) చిత్రానికి హార్మోనిస్టుగా పిలిస్తే, దుక్కిపాటి మధుసూదనరావుగారి సలహాతో పెండ్యాల తిరిగి సినిమారంగానికి వచ్చారు. గృహప్రవేశం (1946) చిత్రనిర్మాణానికి సారథ్యం వహించిన కె.ఎస్.ప్రకాశరావు పెండ్యాలకి సహాయ సంగీతదర్శకుడి స్థానం ఇచ్చారు. ఆచిత్రానికి సంగీతర్శకుడు బాలాంత్రపు రజనీకాంతరావు. ఆయన ఆలిండియో రేడియోలో తీరిక లేకుండా వుంటారుగనక, సమర్థుడైన సహాయకుడు కావాలని నాగేశ్వరరావును తీసుకున్నారు. అంతే! పెండ్యాల ప్రజ్ఞ ప్రకాశరావుగారికిపూర్తిగా అర్థమైంది. తరువాత తాను నిర్మించిన, ద్రోహి(1948)కి పెండ్యాలకు సంగీతదర్శకుడుగా అవకాశం ఇచ్చారుప్రకాశరావుగారు. ఆ చిత్రానికీ, ఆ చిత్రంలోని కాఫీ ఖవాలీ, మనోవాంఛలు, పూవు చేరి, చిక్కిలిగింతలు మొదలైనపాటలకీ మంచి పేరొచ్చింది. పెండ్యాల సంగీత
గాదర్శకుపెండ్యాల నాగేశ్వరరావుడు స్థిరపడ్డారు. సినిమాలోని సన్నివేశాన్ని అర్థం చేసుకుని, దానికి తగ్గట్టుగా ట్యూన్ వచ్చేవరకూ, ఒళ్లు వంచి పనిచెయ్యడం, తను అనుకున్నట్టే గాయనీగాయకుల చేతపాడించడం – పెండ్యాల గుణం. గాయనీ గాయకుల దగ్గర ఎంత ప్రతిభ వుందో, అంత ప్రతిభనీ పూర్తిగావినియోగించుకునే సంగీతదర్శకుడాయన. ఘంటసాలకీ, పెండ్యాలకీ ఒకరిమీద ఒకరికి అమితమైన అభిమానం. పెండ్యాల గారి దృష్టిలో ఘంటసాలని మించిన గాయకుడులేడు!. పెండ్యాల గారి వేలపాటల్లో – అది క్లబ్బుపాటైనాఅందులో కూడా మాధుర్యం తొంగిచూసినట్టే, హిందీపాటని అనుసరించినా, పాశ్చాత్యధోరణిని అనుకరించినా అందులోతెలుగుదనం వుట్టిపడుతుంది. సంగీతరస హృదయులకీ, గాయనీగాయకులకీ అందరికీ నచ్చే సంగీతం ఆయనది.మీరజాలగలడా పాట పాడించడంలో సుశీలగారిని గుక్క తిప్పుకోవడానికీ, సంగతుల్ని వెయ్యడంలో ఎక్కడైనానిలబెట్టడానికీ వీలుకల్పంచకుండా పెండ్యాలగారు మొత్తం అనుకొన్నది రాబట్టేవరకూ విడిచి పెట్లేదు.
జగదేకవీరుని కథలోని శివశంకరీ పాట గురించి ఘంటసాల చెప్పేవారు. ‘పాట మొత్తం ఒకే టేక్‌లో పాడగలిగితేబావుంటుంది – ఎన్ని రోజులు రిహార్సల్లు తీసుకున్నా సరే’ అని పెండ్యాలగారంటే – ‘ఒకే టేక్‌లో మొత్తం పాడతానుచూడండి’ అని ఘంటసాల ‘పందెం’ వేసినట్టు అన్నారు. ‘వారం రోజుల పాటు ఇంకో రికార్డింగ్‌కి వెళ్లకుండా ఆపాటనే సాధన చేసి, అనుకున్నది సాధించిన మహాదీక్షాపరుడాయన’ అని పెండ్యాలగారు, ఘంటసాల మృతిసందర్భంగా చెబుతూ, ఆయన్ని స్తుతించారు.
Aug 4 2011
సంగీతదర్శకుడు ‘ ఎస్.పి.కోదండపాణి.
అద్దేపల్లి రామారావు గారి నా ఇల్లు చిత్రంలో బృందగానంలో మొదటి సారిగా 1953లో సినిమాలలో పాడే అవకాశం కలిగింది. సుసర్ల దక్షిణాముర్తి గారి వద్ద హార్మోనిస్టుగాను, సహాయకులుగా పనిచేశారు. 1955లో సంతానం చిత్రం ద్వారా స్వతంత్రంగా పాటపాడే అవకాశం లభించింది.
ఎస్. పి. కోదండపాణి గారు పరిచయం చేసిన బాలసుబ్రహ్మణ్యం ఇంతింతై వటుడింతై బాలుగా తెలుగువారందరికీ సంగీతాత్మీయుడై తెలుగు చరిత్రలో తనకొక సుస్థిర స్థానాన్ని సంపాదించాడు.
బాలు స్థానం పటిష్టం కావడానికి ఆయన అవిరళ కృషితో బాటు ఎస్. పి. కోదండపాణి గారి కృషి కూడా చాలా ఎక్కువగా పనిచేసింది. ఆయన బాలు స్వరాన్ని తన సంగీతంలో పరిచయం చేయడంతో బాటు చిత్ర రంగానికి పరిచయం చేయడానికి ఎంత శ్రద్ధ తీసుకున్నారో ఆ గళంలో పాట నిలబడడానికి అంతే శ్రద్ధ తీసుకున్నారు. ఆయన తొలి పాటను సంగీత దర్శకులందరికీ వినిపించి, అతనికి అవకాశాలిమ్మని కోదండపాణి గారే అడిగేవారట. బాలు గారికి ఆర్థికంగా సహాయపడడానికి తన దగ్గర సహాయకుడిగా పనిచేయించుకునేవారట. ఇతర సంగీతదర్శకుల దగ్గర బాలు గారు పాడిన పాటల్ని ప్రత్యేకంగా వెళ్ళి వినేవారట. పాటలో పొరబాట్లను క్షమించేవారు కాదట. చిన్న తప్పు చేసినా ఎత్తి చూపేవారట.
బాలు గారి భవిష్యత్తుకు ఎంత ఆరాట పడ్డారో ఆయన ఆరోగ్యం కోసం కూడా అంతే ఆరాటపడ్డారు కోదండపాణి గారు. ఒకసారి బాలు గారు కష్టబడి సైకిల్ తొక్కుకుంటూ కోడంబాక్కం వంతెన మీద వెడుతుంటే అప్పుడే కారు మీద వెడుతున్న కోదండపాణి గారు చూసారు. బాలు గారిని ఆపి ” ఏమిటయ్యా పంతులూ ! ఈ ఎండలో సైకిల్ మీద విహారం ఏమిటీ ? బుద్ధిలేదూ ? ఆరోగ్యం బాగుంటేనే పాట బాగుంటుంది. బస్సులో వెళ్ళు. ఇకెప్పుడైనా సైకిల్ మీద కనిపించావో ఊరుకోను ” అని మందలించారట. ఆయన శ్రద్ధ, కోరిక ఫలించి తెలుగు వారికి మరో అద్భుతమైన గాయకుడు లభించాడు.
శ్రీ కోదండ పాణి గారి గురించి బాలసుబ్రహ్మణ్యం “శ్రీ కోదండ పాణితో నా తొలి అనుభవాలను మీకు వివరంగా ముందే తెలియజెప్పాను. ఆయన సంగీత దర్శకత్వంలో పాడటం అంటే నాకు ఎంతో ఇష్టం. నేను చక్కగా పాడాలన్న కోరిక..ఆయనకు చాలా ఎక్కువ. ఎప్పుడైనా నేను పాడే పధ్దతి నచ్చకపోతే మెత్తగా గట్టిగా చీవాట్లు పెడతారు ఆయన. నేను ఎప్పుడైనా కారులో వేగంగా వెళ్లడం చూసారంటే ఏమిటా జోరు నిదానంగా పోరాదా అని ప్రశ్నించి మందలిస్తూంటారు. చాలా మంది నేనూ ఆయనా బంధువులు(నేను ఎస్.పి.బాలసుబ్రమణ్యం-ఆయన ఎస్.పి.కోదండపాణి కనుక) అనుకుంటారు. మా ఇనిషియల్స్ చూసి నాకు ఆయన బంధువులు కారు..అంతకన్నా అధికులు..దైవ సమానులు.
ఆయన సంగీత దర్శకత్వంలో నేను పాడిన ఎన్నో పాటలలో నాకు నచ్చిన పాట ఆస్తులు-అంతస్తులు చిత్రంలో సుశీలతో నేను పాడిన ఒకటైపోదామా అన్న పాట. మానసికంగా ఒకటై పోయిన శ్రీ కోదండపాణిగారు నాకు సంగీతపరంగా మానసికంగా గురువు ” అని అన్నారు.
చిరకాలం గుర్తుండే పాటలు
* బొమ్మను చేసి ప్రాణం పోసి – దేవత
* ఇది మల్లెల వేళయనీ – సుఖదుఃఖాలు
* జగమే రామమయం – శ్రీరామకథ
* చుక్కలన్ని చూస్తున్నాయీ – జ్వాలాద్వీప రహస్యం
Aug 4 2011
గాయని పి.లీల
జన్మించింది కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో నైనా, సంగీతం మీద పి. లీలకున్న అభిరుచి కారణంగా సంగీతం నేర్పించాలనే తలంపుతో పి. లీల తండ్రి మద్రాసులో మకాం పెట్టారు. ఆది నుంచి తెలుగువారి ప్రోత్సాహం పొందడం వల్ల తెలుగువారన్నా, తెలుగు భాష అన్నా లీలకు చాల ఇష్టం. శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ తన తొమ్మిదో ఏడాదే సంగీతకచేరి చేసారు పి.లీల. ఆంధ్రమహిళా సభలో తొలిసారి సంగీత కచేరి చేసిన ఆమెకున తెలుగు భాషమీద అభిమానం. ప్రేమ పెరిగింది. ‘భక్త తులసీదాసు’ చిత్రంకి బృందగానంలో ఒకరిగా పాడారు. తరువాత ‘మనదేశం’ చిత్రంలో బాలా త్రిపురసుందరీ….. అనే పాటను ఘంటసాల ప్రోత్సాహంతో పాడారు. అప్పటికి తెలుగు మాట్లాడడం, అర్ధం చేసుకోవడం లీలకు తెలియదు. అందుకే మలయాళంలో ఆ పాట రాసుకుని పాడారట. తెలుగు భాష రాకుండా తెలుగు పాటలు పాడితే బాగుండదని తెలుగు నేర్చుకున్నారు. తెలుగువారి వల్లనే గాయనిగా తనకు ప్రముఖ స్థానం లభించిందని పి. లీల అనేవారు. ఆకాశవాణిలో కూడా పాటలు పాడుతున్న పి.లీలను చూసి తొలుత ‘కంకణం’ తమిళ చిత్రంలో పాడించారు. ఈ చిత్రంలో పాడటానికి ముందుగానే కొలంబియా గ్రామఫోన్ కంపెనీ సరస్వతి స్టోర్స్ పి. లీల పాడిన ప్రయివేటు గీతాలను రికార్డులుగా విడుదల చేసారు. సంగీత దర్శకుడు సి.ఆర్. సుబ్బరామన్ సంగీతం సమకూర్చే తమిళ చిత్రాలకు పాటలు పాడుతూ, ఆయన వద్దనూ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు లీల.
ఘంటసాల ప్రోత్సాహంతో ఆయన సంగీత దర్శకత్వం వహించిన ‘మనదేశం’ చిత్రంలో బాలా త్రిపుర సుందరి… పాట పాడటంతో తెలుగులో గాయనిగా ఆమె కెరీర్ ప్రారంభం అయింది. కీలుగుర్రంలో దిక్కు తెలియదేమి సేతు, గుణసుందరికథలో ‘ఓ మాతా రావా, మొర వినవా…’ ‘ఉపకార గుణాలయవై ఉన్నావు కదే మాతా …,’ కల్పకమ తల్లివై ఘనత వెలిసిన గౌరి…, ‘ఏ ఊరు ఏలినావో…’ శ్రీతులసీ ప్రియ తులసీ పాటలను, ‘పాతాళభైరవి’ చిత్రంలో ‘తీయని ఊహలు హాయిని గొలిపే వసంత గానమె హాయి. కలవరమాయె మదిలో, నా మదిలో, ఎంత ఘాటు ప్రేమయో…, ‘పెళ్ళిచేసి చూడు’లో ‘మనసా నేనెవరో, నీకు తెలుసా…’ ఏడుకొండలవాడా వెంకటరమణా, ఎవరో…ఎవరో, చంద్రహారంలో ‘దయ గనవే తల్లిd…’ కృప గనవా నా మొర వినవా…’ ఏ సాధువులు ఎందు హింసలు బడకుండ… అని సాగే పద్యం, ‘మిస్సమ్మ’లో ‘తెలుసుకొనవె చెల్లిd…’ ‘కరుణించు మేరిమాతా…’ ‘రావోయి చందమామా…’ ‘ఏమిటో ఈ మాయా…’ ‘మాయాబజార్’లో ‘నీవేనా నను తలచినది..’ ‘చూపులు కలసిన శుభవేళా…’ ‘విన్నావ యశోదమ్మా..’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, నీ కోసమే నే జీవించునది… పెళ్ళి నాటి ప్రమాణాలులో ‘వెన్నెలలోనే వేడి ఏలకో..’ నీతోనే లోకము, నీతోనే స్వర్గము, లాలి మా పాపాయి ఆనందలాలీ…’ ‘అప్పుచేసి పప్పుకూడు’లో ‘రామనామ శరణం, భద్రాద్రిరామ శరణం’, ‘ఎచట నుండి వీచినో ఈ చల్లని గాలి’, ‘సుందరాంగులను చూసిన వేళల…,’ ‘ఆనందం పరమానందం..’ ‘చేయి చేయి కలుపరావె హాయి హాయిగా…,’ గుండమ్మకథలో ‘వేషము మార్చెను…’ ముద్దుబిడ్డలో జయమంగళ గౌరీదేవీ… ‘పాండవ వనవాసం’లో దేవా దీనబాంధవా… వంటి పాటలు సోలో గీతాలుగాను, యుగళగీతాలుగాను పాడారు లీలగా. తెలుగు చిత్రరంగంలో నిలదొక్కుకోడానికి, తెలుగు గాయని కాబోలు అని అనిపించుకోడానికి ఘంటసాల ప్రధాన కారకులైతే, సి.ఆర్, సుబ్బరామన్, ఓగిరాల రామచంద్రరావు, విజయా కృష్ణమూర్తి, సుసర్ల దక్షిణామూర్తి, మాస్టర్ వేణు, టి.వి.రాజు, ఎస్.రాజేశ్వరావు, పెండ్యాల ఇలా పలువురు సంగీత దర్శకులు, విజయా సంస్థ , నిర్మాతలు, దర్శకుల ప్రోత్సాహం మరుపురానిదనేవారు పి.లీల.
తన సినీ జీవితములో అనేక అవార్డులు అందుకొన్న లీలకు 1969లో కేరళ ప్రభుత్వ ఉత్తమ నేపథ్యగాయకురాలు అవార్డు అందుకొన్నది. 1992లో తమిళనాడు ప్రభుత్వం లీలను కళైమామణి పురస్కారంతో సత్కరించింది.
లీలపాడిన పాటల్లో అందమె ఆనందం, ఆనందమె జీవిత మకరందం, ఏమిటో ఈ మాయా…, లవకుశలో సుశీలతో కలిసి పాడిన పాటలు ఎంతో హాయినిస్తాయి.
సావిత్రి దర్శకత్వంలో రూపొందిన ‘చిన్నారి పాపలు’ చిత్రానికి సంగీత దర్వకత్వం నిర్వహించారు.
సినిమా సంగీతంలో వచ్చిన మార్పులు, మెలొడీకి, సాహిత్యానికి ప్రాధాన్యత తగ్గి వాయిద్యాల హోరు పెరిగి పోవడంతో పాటలు తగ్గించారు పి. లీల. పాట పాడకుండా ఉండలేని స్థితి కారణంగా జమునారాణి, ఎ.పి. కోమల ప్రభృతులతో కలసి సినిమా పాటల కచేరి, శాస్త్రీయ సంగీత కచేరీలు నిర్వహించేవారు.
Aug 4 2011
డాక్టర్ సి.నారాయణరెడ్డి
ఆయన ప్రముఖంగా కవి అయినప్పటికీ అయన కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి వెలువడ్డాయి. కళాశాల విద్యార్థిగా శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించేవాడు. సినారె కవిత తొలిసారి జనశక్తి పత్రిక లో అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించాడు. 1953 లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సి.నా.రె తొలి ప్రచురణ. వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి.
రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయన పరిశోధన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు, ప్రయోగములు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది. 1962 లో గులేబకావళి కథ చిత్రం లోని నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ అనే పాటతో ప్రారంభించి నేటి వరకు 3500 గీతాలు రచించాడు.
దాదాపుగా తెలుగు సినీరంగంలోని అందరి అగ్ర హీరోలతోపాటు, ఎందరో వర్ధమాన హీరోలకు పాటలు రాసిన ఖ్యాతిని దక్కించుకున్నారు. అంతేగాకుండా ఉర్దూ సాహితీ ప్రక్రియ ఆయన గజల్స్ కూడా తెలుగులో రాసి గజల్ కవిగా కూడా పేరుగాంచారు.
సినారె గ్రంథాలు ఇంగ్లీషు, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మళయాళం, ఉర్దూ, కన్నడం మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయనే స్వయంగా హిందీ, ఉర్దూ భాషల్లో కవితలల్లారు. అమెరికా, ఇంగ్లండు, ఫ్రాన్స్, రష్యా, జపాన్, కెనడా, ఇటలీ , డెన్మార్క్,థాయ్ ల్యాండ్, సింగపూర్, మలేషియా, మారిషస్, యుగోస్లోవియా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలను సందర్శించారు. 1990 లో యుగోస్లేవియాలోని స్రూగా లో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనం లో భారతీయ భాషల ప్రతినిథిగా పాల్గొన్నాడు.
1969లో తెలంగాణా అంతటా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లోనే సమైక్యతకు ఊపునిచ్చే … ” తెలుగు జాతి మనదీ – నిండుగ వెలుగు జాతి మనదీ…” అనే గీతం రాసి తెలంగాణా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నరు డాక్టర్ ‘సినారె’.
తొలి తెలుగు జ్ఞానపీఠ బహుమతి గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రాసిన ఏకవీర నవల ఆధారంగా వచ్చిన ఏకవీర. సినిమాకు మాటలు రాసింది మరో జ్ఞానపీఠ గ్రహీత సి.నారాయణరెడ్డి. నారాయణరెడ్డి తన సినీరచనా జీవితంలో సంభాషణలు రాసిన సినిమాలలో ఇది మొదటిది కాగా రెండవది అక్బర్ సలీం అనార్కలి.
Aug 4 2011
గీత రచయిత ‘కొసరాజు’
జానపదగీతాల్లోని లాలిత్యాన్ని, ఆ పొగరూ వగరూ ఏమాత్రం తగ్గకుండా తెలుగు సినిమాకు అమర్చిపెట్టింది కొసరాజు రాఘవయ్య చౌదరి.”ఏరువాక సాగాలోరన్నో…” అంటూ సేద్యగాళ్ళకు ఉత్సాహం రేకెత్తేలా ధైర్యం చెప్పినా “రామయతండ్రి ఓ రామయ తండ్రి మానోములన్ని పండినాయి రామయ తండ్రీ” అని గుహుడి చేత శ్రీరాముడ్ని ఏరు దాటించినా ఆయాపాటల్లో ఆద్యంతం కొసరాజు ముద్ర ప్రస్ఫుటంగా గోచరిస్తుంది.
కొసరాజుగా ప్రసిద్ది చెందిన ఈ తెలుగు సినిమా పాటల రచయిత పూర్తి పేరు కొసరాజురాఘవయ్య చౌదరి. తెలుగు సినిమా పాటల రచయితగా కొసరాజుది ప్రత్యేకపీఠం. ఆరోజుల్లోని చాలా చిత్రాలు కొసరాజు ముద్రని బాగా వాడుకున్నాయి. వ్యంగ్యం, హాస్యంమిళాయించిన పాట ఒకటి చిత్రంలో వుండాలి, అది రాఘవయ్య చౌదరిగారు రాయాలి – అని అప్పట్లో సినిమా జనాలకు ఒక సూత్రం ఉండేది. ఆ సూత్రానికి తగ్గట్టుగానేకొసరాజు వందలాది గీతాసుమాల్ని గుచ్చి ప్రకాశ పరిమళభరితం చేశారు. జానపదగీతాల్లోని లాలిత్యాన్ని, ఆ పొగరూ వగరూ ఏమాత్రం తగ్గకుండా తెలుగుసినిమాకు అమర్చిపెట్టింది కొసరాజు రాఘవయ్య చౌదరి. ఏరువాక సాగాలోరన్నో… అంటూ సేద్యగాళ్ళకు ఉత్సాహం రేకెత్తేలా ధైర్యం చెప్పినా రామయతండ్రి ఓ రామయతండ్రి మానోములన్ని పండినాయి రామయ తండ్రీ… అని గుహుడి చేత శ్రీరాముడ్ని ఏరు దాటించినా ఆయాపాటల్లోఆద్యంతం కొసరాజు ముద్ర ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. పనిగట్టుకుని హాస్యాన్ని పాటల్లోకి ప్రవేశపెట్టినవాడు కొసరాజురాఘవయ్య చౌదరి. అంతే కాకుండా ఆయన హాస్యాన్ని సాంఘిక విమర్శకు కూడా బాగా వాడుకున్నాడు. 1953 నుంచీ 1986 అక్టోబరు 27 వరకూ ఆయన మూడు వేలకు పైగా పాటలు రాశారు.
”పేరు కొసరాజు, తెలుగంటే పెద్దమోజు” అని స్వయంగా ప్రకటించుకున్న జానపద గీతాల రారాజు గురించి ఎంతరాసినా తక్కువే. తెలుగు పదం, తెలుగు పద్యం, తెలుగు తనం మూర్తీభవించిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. జేబులో బొమ్మ, కళ్ళు తెరచికనరా, ఏరువాకాసాగారో, జయమ్మునిశ్చయమ్మురా, వినరావినరానరుడా…, సరిగంచు చీరగట్టి… శివగోవింద గోవింద, డబ్బులోనె ఉందిరా, నందామయా గురుడ, శివశివమూర్తివి, తింటానిక్కూడుచాలదే, పల్లెటూరు మన భాగ్యసీమరా, చెంగుచెంగునా గంతులు వేయండి, సరదా సరదా సిగిరెట్టు, ఆడుతుపాడుతూ పనిజేస్తుంటే, ముక్కుచూడు ముక్కందం చూడు… ఇలా మూడున్నర దశాబ్దాల కాలంలో మూడువేలకు పైగా గీతాలు రాసి ‘కవిరత్న’గా, ‘జానపద కవి సార్వభౌముడు’గా పండిత పామరుల మన్ననలు పొందినవారు కొసరాజు రాఘవయ్య చౌదరి.
“చల్లపల్లి రాజావారి వివాహానికి వెళ్తే చెళ్ళపిళ్ళ, వేటూరి వంటి మహాకవులు వచ్చారు. వారి సరసన నన్నూకూచోబెట్టారు. వధూవరుల మీద నేను రాసిన పద్యాలు చదివితే, ‘ఈ పిట్ట కొంచెమే అయిన కూత ఘనంగా వుందే!’ అనిచెళ్లపిళ్ల వారు నన్ను ప్రశంసించారు, ఆశీర్వదించారు’” అని కొసరాజు చెప్పేవాడు. ఆయన ఇంకో విశేషం చెప్పేవాడు. జమీన్రైతు ఉద్యమం లేచిన తర్వాత, ఆయన రైతుని సమర్థిస్తూ ఎన్నో పాటలూ, పద్యాలూ రాసి సభల్లో పాడేవాడు. అప్పుడే ఆయన ‘కడగండ్లు’ అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకానికి పీఠిక రాయమని కొసరాజు ఎందరో సాహితీ వేత్తలనూ, రాజకీయవేత్తలనూ అర్థించాడట.
కేవలం హాస్యప్రధానమైన పాటలే గాకుండా, విభిన్నమైన అంశాలపై మంచి పాటలు రాశారు కొసరాజు. ”గాఢాంధకా రమలముకున్నా భీతి చెందక ! నిరాశలోనే జీవితాన్ని కుంగదీయక” అనే ఉత్తేజభరితమైన పాటలను రాశారు. ఉన్నవారు, ”లేనివారని బేధాలు తొలగిపో వాలనే భావంతో” కలవారి స్వార్ధం నిరుపేద దు:ఖం ఏనాటికైనా మారేనా; అని ప్రశ్నించారు. ”తోడికోడళ్ళు” చిత్రం కోసం ”ఆడుతు, పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది” అంటూ శ్రమైక జీవన సౌందర్యాన్ని చాటారు. అభ్యుదయ భావాలతో, సామ్యవాద దృక్పధంతో సమాజంలోని అవినీతిని ఎండగడుతూ అధిక్షేప గీతాలు రచించిన కొసరాజు పౌరాణిక చిత్రాలకు సైతం రసోచిత గీతాన్ని రాశారు.
”మంచి మనసులు” సినిమాకోసం ”మావా మావా మావా!ఏమే భామా భామా”అంటూ రాసిన పాట, సంగీతం సమకూర్చిన మహాదేవన్ గారిని స్వ రాల మామను చేసింది. ప్రేక్షకుల నీరాజనాలను అందుకుంది. మగవాళ్ళు, ఆడవాళ్ళు పరస్పరం కవ్వించుకునే గీతం ”వాలు వాలు చూపుల్తో గాలమేసి లాగిలాగి ప్రేమలోకి దించుతారు మీరుగాదా” అనేవి, ఆ తర్వాత తెలుగునాట ప్రేమోక్తలయ్యాయి. ఘంటసాల, జమునారాణి పాడిన ఈ పాట వారికి కూడా మంచిపేరు తెచ్చిపెట్టింది. ”దులపర బుల్లోడా! దుమ్ము దులపర బుల్లోడా” పాట భానుమతిగారి నోట రసవంతంగా వినిపించేలా రాశారు. మూగజీవుల పట్ల కారుణ్యభావాల్ని ప్రకటిస్తూ ”వినరా వినరా నరుడా; తెలుసుకోర పామరుడా;” అనే పాటను గోమాత స్వగతంగా రాశారు. ”చెంగుచెంగున గంతులు వేయండి” పాటకూడా ఈ భావంతో సాగేదే.
రాఘవయ్య తొలుత కథానాయకునిగా రైతుబిడ్డ (1939) అనే చిత్రములో నటించాడు. కవిగా రాఘవయ్య ప్రతిభ గుర్తించిన బి. ఎ. సుబ్బారావు, కె. వి. రెడ్డి వారి చిత్రాలకు పాటలు వ్రాయించారు. 1954లో విడుదలైన ‘పెద్ద మనుషులు’ చిత్రానికి రాఘవయ్య వ్రాసిన పాటలు ఆంధ్రదేశ ప్రెక్షకులను ఉర్రూతలూగించాయి. సుబ్బారావు గారి ‘రాజు పేద’ చిత్రములోని ‘జేబులో బొమ్మ జే జేలబొమ్మ’ బహుళ ప్రాచుర్యం చెందింది. రోజులు మారాయి (వహీదా రెహ్మాన్ నాట్యముతో)లో ‘ఏరువాక సాగారో’, ‘ఇల్లరికములో ఉన్న మజా’ , ‘అయయో జేబులో డబ్బులు పోయెనే’ , ‘ముద్దబంతి పూలు బెట్టి’ మొదలగు పాటలు కోట్లాది తెలుగు ప్రేక్షకుల మనసులలో చిరస్మరణీయముగా మిగిలిపోయాయి. అచ్చతెలుగులోని అందాలు, జానపదుల భాషలోని సొగసులు, పల్లెపట్టున ఉండే వారి భాషలోని చమత్కారాలు, విరుపులు రాఘవయ్య పాటలలో జాలువారతాయి. జేబులో బొమ్మ, కళ్ళు తెరచికనరా, ఏరువాకాసాగారో, జయమ్మునిశ్చయమ్మురా, వినరావినరానరుడా…, సరిగంచు చీరగట్టి… శివగోవింద గోవింద, డబ్బులోనె ఉందిరా, నందామయా గురుడ, శివశివమూర్తివి, తింటానిక్కూడుచాలదే, పల్లెటూరు మన భాగ్యసీమరా, చెంగుచెంగునా గంతులు వేయండి, సరదా సరదా సిగిరెట్టు, ఆడుతుపాడుతూ పనిజేస్తుంటే, ముక్కుచూడు ముక్కందం చూడు… ఇలా మూడున్నర దశాబ్దాల కాలంలో మొత్తము 200 చిత్రాలకు 1000 పాటలు వ్రాశాడు.
కొసరాజు సినిమా గీతాలు మినహా మరేమీ రాయలేదనుకుంటే పొరబడినట్లే. ఆయన సినిమా పాటలు, అద్భుతమైన ఆయన కావ్యాలను మింగేశాయి. కొసరాజు జాతీయోద్యమం, ఆంధ్రోద్యమం ప్రేరణతో రాసిన కావ్యాలు – ”గండికోట యుద్ధం”, ”కొండవీటి వైభవం”. ఈ రెండు కావ్యాల్లోనూ పద్యాలు తేలికైన పదాలతో మధురంగా సాగుతాయి. సినీ రచయిత మోదుకూరి జాన్సన్ మాటల్లో చెప్పాలంటే ”కొసరాజులో గురజాడ, గిడుగుల భాషావిప్లవముంది. కవిరాజు త్రిపురనేని భావవిప్లవపువేడి ఉంది. నవయుగ చక్రవర్తి గుర్రం జాషువా కన్నీటితడి ఉంది. అప్పటి స్వాతంత్య్ర సమరోత్సాహాల, ప్రజాభ్యుదయాల ప్రభావం ఉంది. కనుకనే ఆయన భావాలు ప్రజాహితాలు, ఆయన భాష పల్లెసీమ హృదయనాదం”.
కొసరాజు స్వతంత్ర శతకాలు కూడా రాశారు. ”శంభుకర్షిప్రభుశతకం, మిత్రనీతి, వీరశేఖర శతకం, భానుగీత, సినిమాడైరెక్టరు, కొసరాజు విసుర్లు-” ఇవన్నీ ఆయన కలం నుంచి వెలువడిన శతకాలే. అలాగే- బంగారువాన, కడగండ్లు, చిట్టిచెల్లి, రాష్ట్రగీతికలు, కాకర్ల గోపాలనాయుని వంశ చరిత్ర, నవభారతం వంటి ఎన్నో లఘురచనలు చేశారు. పల్నాటి ప్రతిభ, శివాజి, ఫాసిస్టుగీతాలు, దేవునిమొర, సుస్వాగతము, కుప్పుస్వామి చౌదరి, ఆనందబాష్పాలు… వంటి ఎన్నో లఘు రచనలు ఇంకా అముద్రితాలుగా ఉన్నాయి. వీటన్నిటితోపాటు ఆయన తన స్వీయచరిత్ర కూడా రాశారు. బుర్రకథలు రాయడంలో ఆయన దిట్ట. ఎన్నికలకు, సినిమాలకు ఎన్నో రాశారు. తెలుగు సాహిత్యంలో వివిధ సాహిత్యప్రక్రియలు చేపట్టి తన ప్రతిభేమిటో నిరూపించారు కొసరాజు. ఆయన తెలుగునాడు వినిపించే పలుకుబడులకు, సామెతలకు, నుడికారాలకు కావ్య గౌరవం కల్పించారు. ఆయన భాష సరళం. భావం సుకుమారం, పద్యకావ్యాలైనా, సినిమా గేయాలైనా, మళ్ళీ మళ్ళీ చదవాలని, వినాలని కోరుకునేలా రాశారు కొసరాజు.
ఆయన పొందిన సత్కారాలు అనేకం. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ నిర్వహించిన బుర్రకథల పోటీలో ”నవభారతం” బుర్రకథకు ఆయన ప్రథమ బహుమతి పొందారు. అఖిలభారత కాంగ్రెస్, ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్, రాజ్యలక్ష్మి వెంకన్న చౌదరి ఫౌండేషన్ వంటి సంస్థలు ఆయన్ని ఘనంగా సత్కరించాయి. తెనాలి క్లాసికల్ ఫిలిమ్ సొసైటీ నుంచి సముద్రాల రాఘవాచారి అవార్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే రఘుపతి వెంకయ్య అవార్డు, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ అందుకున్నారు.
”వ్రాసిన మాటలే వ్రాయుట కంటె, పాడిన పాటలే పాడుట కంటె, సరికొత్త రచనల సాగించినపుడె, కవి చమత్కారాన కథ రక్తికట్టు”- అంటూ నవ్యతకోసం పరితపించిన కొసరాజు తెలుగుభాష ఎంత కమ్మగా, కమనీయంగా ఉంటుందో తన రచనల్లో చూపారు. ”జాను దేశి కవిత నా నుడికారమ్ము, ఏ నిఘంటువులకు నెక్కకుండు, చిన్ననాటి నుండి జీర్ణించుకొన్నాను, పల్లెపదములన్న పరమ ప్రీతి”- అన్నట్లుగానే ఆయన రచనల్లో వందల సామెతలు, జాతీయాలు, పలుకుబడులు కనిపిస్తాయి.
ఇక సినిమా పాటల్లో ప్రబోధగీతాలు, సామ్యవాద గీతాలు, లోకంపోకడ తెలిపేవి, భవిష్యత్తును తెలిపేవి, పల్లెపదాలు, వ్యవసాయానికి, రైతులకు సంబంధించినవి, హాస్యగీతాలు… ఎన్నో రాశారు. జానపదగీతాల్లోని పల్లవులను, పలుకుబడులను బాణీలను, పొడుపుకథలను ఉపయోగించి తెలుగుసినిమా పాటలను ఆయన సారవంతం చేశారు. యక్షగానాలు, వీధిభాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు, భజనగీతాలు, పగటివేషగాళ్ళ పాటలు, రజకుల పాటలు, పాములోళ్ళపాటలు, గంగిరెద్దుల గీతాలు ఎన్నో రాశారు.
ఆయన తెలుగువాడిగా పుట్టినందుకు అనేక సందర్భాల్లో ఎంతో గర్వించారు. ఎన్నో పద్యాలు రాశారు. ”రైతు జన విధేయ రాఘవయ్య” మకుటంతో రాసిన శతకంలో ఆంధ్రప్రదేశ్‌కి, తెలుగుభాషకి జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తిచాటారు. ”సంస్కృతము కొరకు చలపట్టునొక్కండు, హిందియనుచు గంతులిడు నొకండు, తెలుగుకొరకు నేడ్చు ధీరుండు కరువయ్యె…’ అంటూ వాపోయారాయన.
కాదేదీ కవితకు అనర్హమన్న రీతిలో చెట్టు, గట్టు, పుట్ట, అట్టు, సిగరెట్టు, పండుగలు, పేకాటలు, తాగుళ్ళు, ఇల్లరికపుటల్లుళ్ళ గురించి ఎన్నో పాటలు రాశారు. వినోదాన్ని విషాదాన్ని, భక్తిని, రక్తిని సమయోచితంగా తనకలం ద్వారా ఆవిష్కరించాడు. సామెతలు, పలుకుబళ్ళు, తెలుగునుడికారంతో గేయ సాహిత్యానికి వన్నె తెచ్చిన కొసరాజు 1984లో రఘుపతి వెంకయ్య అవార్డును, 1985లో కళాప్రపూర్ణ బిరుదును పొందారు.
అభ్యుదయకవిగా, ప్రజాకవిగా, రైతుపక్షపాతిగా ఆంధ్రసాహితీ మాగాణంలో తెలుగునుడికారపు పంటలు కొల్లలుగా పండించిన కొసరాజు బుద్దిమానుకోని పేకాటరాయుళ్ళ మనస్తత్వానికి ప్రతీకగా నిలిచిందీపాట. ఇంకా ”భలే ఛాన్సులే… ఇల్లరికంలో ఉన్న మజా” ‘సరదా సరదా సిగరెట్టు” ‘ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా”, ‘మంగమ్మా: నువ్వుఉతుకు తుంటే అందం” అనే హాస్య గీతాలెన్నిం టినో తన కలం ద్వారా ఒలికించారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ”కొండవీటి వైభవం’ (ఖండకావ్యం), గండికోటయుద్ధం (ద్విపద కావ్యం), కొసరాజు విసుర్లు, సిన్మాడైరెక్టర్ అనే పుస్తకాలను రాసి సాహిత్య లోకానికి అందించారు. చివరిసారిగా సురేష్ ప్రొడక్షన్ వారి ”గురుబ్రహ్మ”చిత్రానికి 1986 అక్టోబర్ 27వ తేదీన ”వినరా, ఆంధ్రకు మారా” అనే బుర్రకథను రాసి, అదేరోజు రాత్రి పది గంటలకు పరమపదించారు. ఆయన హేతువాది. ఏరువాక… ఏటినీరు ఉండేంతవరకు కొసరాజే రసరాజు.
Aug 4 2011
సంగీత స్వర్ణయుగం {1940 – 1960}
హిందీలో అనిల్ బిశ్వాస్, నౌషాద్, సలిల్ చౌదరీ, శంకర్-జైకిషన్, రోషన్, S.D బర్మన్, తెలుగులో రాజేశ్వరరావు, పెండ్యాల, ఘంటసాల, గాలిపెంచల, చలపతిరావు, తమిళములో G. రామనాథన్, విశ్వనాథన్-రామమూర్తి, మహాదేవన్, S.V. వెంకటరామన్, కన్నడములో లింగప్ప, విజయభాస్కర్, రాజన్-నాగేంద్ర, రంగారావు, మలయాళములో దేవరాజన్, బాబురాజ్, V.దక్షిణామూర్తి వంటి ప్రసిద్ధ సంగీత దర్శకులతో చిత్రసంగీతం విలసిల్లిన కాలమది. వారిలో కొందరు గొప్ప గాయకులు కూడా.
అట్టివారిలో ప్రముఖులు ఘంటసాల, పంకజ్ మల్లిక్, హేమంతకుమార్, S.D బర్మన్, సాలూరి, నాగయ్య, ఏ. ఎం. రాజా. ఇంక ముఖ్యంగా తెలుగు నేపథ్య గాయకుల విషయానికి వస్తే తక్కిన భాషల్లో వారికి లేనంతటి వైవిధ్యం ఇక్కడుంది. ఎం.ఎస్. రామారావు, వి.జె.వర్మ, ఘంటసాల, పిఠాపురం, మాధవపెద్ది, ఏ.ఎం. రాజా, పి.బి. శ్రీనివాస్, రఘునాథ్ పాణిగ్రాహి ల కంఠాలలో ఒకరి దానితో మరొకరికి పోలిక లేదు.
ఏ.యం.రాజా (అయిమల మన్మథరాజు రాజా) (1929-1989) 1950వ దశకములో తమిళ, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడు. విప్రనారాయణ, చక్రపాణి, ప్రేమలేఖలు, మిస్సమ్మ పాటలు రాజా గాత్ర మాధుర్యానికి కొన్ని మచ్చు తునకలు. ఈయన వివిధ భాషలలో 10,000 పాటలు పాడి, వందకు పైగా సినిమాలకు సంగీతం సమకూర్చాడు.
తమిళంలో సుసర్ల దక్షిణామూర్తి దర్శకత్వంలో సంసారం, సంసారం అనే పాట (తెలుగులో దీనిని ఘంటసాల పాడారు) రాజా పాడిన మొట్టమొదటి సినిమా పాట. తెలుగులో వీరు పాడిన మొదటి పాటలు ‘ఆకలి’ ‘ఆదర్శం’, ‘సంక్రాంతి’ (1952) చిత్రాలలోనివి. కానీ గాయకుడిగా గుర్తింపు పొందింది పక్కింటి అమ్మాయి (1953) సినిమాలో పాడిన పాటలతో.
రాజా గళంలో ఒక వినూత్నమయిన సౌకుమార్యం, మార్దవం, మాధుర్యం ఉంది. తలత్, రఫీల జాడలు అక్కడక్కడ కనబడినా రాజా కంఠస్వరం ప్రత్యేకమైనది. ఎక్కడ వినబడినా గుర్తించడం కష్టం కాదు. కాని అనుకరించడం మాత్రం సులభం కాదు. ఆ ప్రత్యేకత వల్లనే సినిమారంగంలో రాజా మెల్లమెల్లగా పైకెదిగారు. ఆ కాలపు సంగీత దర్శకులందరు శ్రుతి చేసిన పాటలను అన్ని దక్షిణ భారత భాషలలో, హిందీలో పాడసాగారు. లింగప్ప దర్శకత్వంలో కన్నడ చిత్రం ‘స్కూల్‌మాస్టర్’(1958, తరువాత తెలుగులో ‘బడిపంతులు’గా డబ్ చేయబడింది.) లో జమునారాణితో కలసిపాడిన ‘అతిమధుర అనురాగ’ అనే పాట, దేవరాజన్ దర్శకత్వంలోని ‘ఆకాశగంగయుడె కరయిల్’ చెప్పుకోదగ్గవి. సింహళ భాషలో కూడా రాజా పాడారు. హిందీలో బహుత్ దిన్ హుయే (తెలుగులో బాలనాగమ్మ కథ ఆధారంగా; సంగీత దర్శకుడు ఈమని శంకర శాస్త్రి) అనే సినిమాలో కూడా పాడారు.
అన్ని భాషలలో పాడుతున్నా, తెలుగు తమిళ సినిమాలలోనే రాజా ఎక్కువగా పాడేవారు. ఆ సమయంలోనే ఎం. జీ. రామచంద్రన్ నటించిన ‘జెనోవా’ చిత్ర నిర్మాణ సమయంలో పీ. జీ. కృష్ణవేణిని (జిక్కీ గా మనకు చిరపరిచితం ఈమె గాత్రం) చూడడం తటస్థించింది. ఇద్దరూ కలిసి సినిమాలలో యుగళ గీతాలు పాడేవారు. అలా ఆ పరిచయం ప్రేమగా మారింది. కొందరు ఇది ‘ప్రేమలేఖలు’ చిత్రీకరణ సమయంలో జరిగిందంటారు. ఆ ప్రేమ అలా పెరిగి పాటలలోనే కాకుండా జీవితంలో కూడా భాగస్వాములయ్యారు. వారికి నలుగురు ఆడ పిల్లలు, ఇద్దరు కొడుకులు. అందులో ఒకరికి రాజాలా కంఠస్వరం ఉందట. ఇద్దరు కూతుళ్లు కూడా బాగా పాడేవారేనట.
రాజా సంగీత జీవితపు ఆరంభ దశలో అతనికి ఎక్కువ ఖ్యాతిని తెచ్చినవి మూడు చిత్రాలు – ప్రేమలేఖలు(1953; హిందీలో ‘ఆహ్’, తమిళములో ‘అవన్’), అమరసందేశం(హిందీలోని ‘బైజూ బావరా’ ఆధారంగా తీసినది), విప్రనారాయణ(1954). హిందీలో ముఖేశ్ పాడిన పాటలను రాజా తెలుగు, తమిళ భాషల్లో పాడారు. శంకర్ జైకిషన్ల దర్శకత్వంలో రికార్డు చేయబడినవి ఈ పాటలు. లతా మంగేష్కర్ పాటలను జిక్కి పాడారు. ‘పాడు జీవితము యౌవనము’, ‘విధి రాకాసి కత్తులు దూసి’, ‘రారాదా మది నిన్నే పిలిచెగాదా’ (జిక్కీతో), ‘నీవెవ్వరవో చిరునవ్వులతో’ (జిక్కీతో) రాజా ఇందులో పాడిన పాటలు. ఈ చిత్రం హిందీలోకంటే తెలుగులో ఎక్కువగా ఆదరణ పొందడానికి కారణం రాజా-జిక్కీ పాటలే. ఆ కాలంలో రేడియో సిలోన్లో జనరంజకమైన ఈ పాటలు తరచుగా వస్తుండేవి.
సంగీత ప్రధానమైన ‘అమర సందేశం’లో ముఖ్యంగా చెప్పుకోవలసినవి ఆయన పాడిన రెండు సోలోలు: ‘మధురం మధురం మనోహరం’, ‘ఆనతి కావలెనా గానానికి సమయము రావలెనా’ (దర్బారీ కానడ రాగంలో తెలుగులో వచ్చిన ఒక గొప్ప పాట), రఘునాథ పాణిగ్రాహితో కలిసి పాడిన సంగీత సంవాద గీతం ‘మానస లాలస సంగీతం’.
ఇదే చిత్రంలో శ్రీశ్రీ, ఆరుద్రలిరువురూ తమ రచనగా గొప్పగా చెప్పుకున్న ‘సదసత్కళా’ అనే సీసపద్యం చాలా చక్కనిది. రాజా పాడిన ఈ పద్యం ఒక చిత్రకవిత్వమే. ఇందులో మొదటి పాదం ‘స’తో మొదలయి, ‘స’తో ముగుస్తుంది, రెండవ పాదం ‘రి’తో, మూడవది ‘గ’తో, అలాగే మిగిలినవి.
ఇక రాజ రాజేశ్వరుల అపూర్వ సృష్టే ‘విప్రనారాయణ’. రాజా ఈ చిత్రంలో భానుమతితో పాడారు. ‘విప్రనారాయణ’ లోని పాటలు ఇప్పటికీ ఏమాత్రం వసివాడని కుసుమాలే. రాసలీలను చిత్రించే ‘చూడుమదే చెలియా’ పాటలో ‘…నారి నారి నడుమ మురారి’ అని మంద్రస్వరంలో రాజా పాడుతుంటే కలిగే అనుభూతి నిజంగా అపూర్వమైనదే. ఈ రాజరాజేశ్వరుల సహకారం అంతటితో ఆగిపోలేదు. సుశీలతో పాడిన మిస్సమ్మ(1955) చిత్రంలోని ‘బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే’ ఒక మరపు రాని పాట. ఈ పాట ఎంత బాగుంటే కదా హిందీ ‘మిస్ మేరీ’ లో ఈ పాట వరుసను మాత్రమే హేమంతకుమార్ అలాగే ఏ మార్పు చేయకుండా ఉంచుకొన్నారు. బంగారు పాప(1954), భాగ్యరేఖ(1957) చిత్రాలలో రాజా పాడిన పాటలు కూడా తీపి గుర్తులే!
ఈ కాలంలో వచ్చిన పాటల్లో తప్పకుండా ఉదహరింపవలసినవి: ‘నేనూ ఒక మనిషినా’ (మేలుకొలుపు, 1956, పెండ్యాల, శ్రీశ్రీ-తాపీ), ‘అందాల రాణీ’ (ఆర్. బాలసరస్వతితో; వీరకంకణం, 1957, సుసర్ల, ఆరుద్ర), ‘తానేమి తలంచేనో’ (ఆర్. బాలసరస్వతితో; దాంపత్యం, 1957, రమేశ్ నాయుడు, ఆరుద్ర), ‘ప్రభూ తొలిసంజ’ (సిపాయి కూతురు, 1959, ఎం. సుబ్రహ్మణ్యరాజు, మల్లాది). ఇలా 1953-57 మధ్య కాలంలో రాజా నక్షత్రంలా ఒక వెలుగు వెలిగారు. ముఖ్యంగా ఒక రెండు సంవత్సరాల పాటు (1953-55) ఘంటసాల కంటే రాజా గాత్రానికే నిర్మాతలు, సంగీత దర్శకులు ప్రాధాన్యతనిచ్చారు.
నేపథ్యగానం పుంజుకోవడం, రామారావు, నాగేశ్వరరావులు ప్రముఖ నాయక పాత్రధారులుగా నిలదొక్కుకొనడం దాదాపు ఒకేసారి (1950-51 ప్రాంతం) జరిగాయి. ఘంటసాల కంఠంతో వారిద్దరి పాత్రలు పెనవేసుకుపోవడం అదే కాలంలో జరిగింది. 1953-57 మధ్యకాలంలో వారిద్దరికీ రాజా పాడిన పాటలు కొన్ని బహు ప్రశంసలు పొందినా ఆ తరువాత ఆ నాయకులకు పాడే అవకాశం ఆయనకు దొరకలేదు. మన చిత్ర నాయకులు ఎన్నడూ ధీరోదాత్తులు కాబట్టి దానికి తగ్గట్లు కంఠదారుఢ్యం లేక రాజా గొంతు పేలవంగా వుండేదని ఒక విమర్శ లేకపోలేదు. ఇలా రాజా కొంతవరకు నష్టపోయారు.
తొలినుండి రాజాకు స్వంతంగా స్వరకల్పన చేయాలనే ఆశ ఉండేది. చివరకు ఆ ఆశ తెలుగు చిత్రం శోభ (1958) తో ఫలించింది. ఇది హిందీ చిత్రం ‘దులారి’కి (నౌషాద్ సంగీతం) అనుకరణ. అందులో జిక్కీతో పాడిన యుగళగీతం ‘అందాల చిందు తారా’ ((హిందీలో లత, రఫీ పాడిన మిల్మిల్కే గాయేంగే దో దిల్ యహా అన్న పాటకు అనుసరణ) బాగా ప్రజాదరణ పొందింది. ఆ సినిమా బాగా ఆడకపోవడంతో పాటలూ మరుగున పడ్డాయి. కానీ రాజాను ఒక గొప్ప దర్శకునిగా రూపొందించినది తమిళ చిత్రం ‘కల్యాణ పరిశు’ (తెలుగులో పెళ్లి కానుక, 1960). దీని వెనుక ఒక చిన్న కథ కూడ ఉంది.
1950వ దశకంలో తమిrళ చిత్రరంగంలో శ్రీధర్ చిత్రకథ, సంభాషణల రచనలో గొప్ప పేరు సంపాదించారు. అన్నపూర్ణావారి తెలుగు చిత్రాల తమిళ ప్రతులకు వీరు మాటలను రాశారు. శ్రీధర్ చిత్రకథ, సంభాషణలు రాసిన మొదటి చిత్రం ‘ఎదిర్ పారాదదు’ (ఎదురు చూడనిది; ఈ చిత్రానికి తెలుగు ఇలవేలుపు చిత్రానికి పోలికలు ఉన్నాయి.). రాజా ఇందులో పాడిన ‘శిర్పి చెదుక్కాద పొర్చిలైయే’ (శిల్పి చెక్కని స్వర్ణ ప్రతిమా) చాలా ప్రసిద్ధమైన పాట. శ్రీధర్‌కు తాను స్వతంత్రంగా దర్శకుడు కావాలనే కోరిక ఉండేది. ఒకసారి కలిసి రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు శ్రీధర్ తన మొదటి సినిమాకి సంగీత దర్శకుడిగా తీసుకుంటానని రాజాకి మాటిచ్చాడు. ఆ అవకాశం ‘కల్యాణపరిశు’తో కలిసి వచ్చింది.
కొత్తవిధమైన కథ, వ్యావహారిక భాషలో మాటలు, కొత్త నటి (సరోజా దేవి), రాజా స్వరపరిచిన మధుర గీతాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు. ఈ సినిమా ఇప్పటికీ తమిళ ప్రజల మనసుల్లో ముద్రవేసికొని ఉంది. దీపావళి పండుగ సమయంలో ఇందులోని ‘ఆడే పాడే పసివాడా’ అనే పాట ఇప్పటికీ వినబడుతూనే ఉంటుంది. ఈ చిత్రంలో రాజాకు అసిస్టెంటుగా పని చేసిన సెబాస్టియన్ డిసూజా (2006లో ఈయనకు శతజయంతి జరిగింది. పాశ్చాత్య సంగీతంలో ప్రసిద్ధికెక్కిన కౌంటర్ మెలోడీని(Counter-melody) చిత్రగీతాలలో ప్రవేశపెట్టిన ఒక గొప్ప అరేంజర్ వీరు) శంకర్-జైకిషన్ వంటి ప్రసిద్ధ సంగీత దర్శకులకు కూడా సహదర్శకుడే. అన్నీ ఒకటై కూడి ‘కల్యాణపరిశు’, దాని తెలుగు అనుకరణ ‘పెళ్లికానుక’ పాటలు ఒక కొత్త దారిని చూపించాయి.
భార్య అయిన జిక్కీ కంటే రాజా చిత్రాలలో ఎక్కువగా సుశీల పాడారు. అలా అని జిక్కీ పాటల మాధుర్యం తక్కువేమీ కాదు. రాజా దర్శకత్వంలో బహుశా జిక్కి పాడిన అత్యుత్తమమైన పాట ‘తుళ్ళాద మనముం తుళ్ళుం’ (తెలుగులో ‘పులకించని మది పులకించె’). పెళ్లికానుక సినిమాలో మిగిలిన అన్ని పాటలూ ‘కల్యాణ పరిశు’ మెట్టులోనే ఉన్నా ‘కన్నులతో పలుకరించు వలపులు’ మాత్రం కొత్తది. దీనికి కారణం తమిళంలోని ‘ఆశయినాలే మనం’ అనే పాట, పాండురంగ మాహాత్మ్యములోని ‘వన్నెల చిన్నెల నేరా’ అనే పాట పల్లవుల ఆధారం. మద్రాస్ ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాజాను 1959లో అత్యుత్తమ సంగీత దర్శకునిగా గౌరవించింది.
‘పెళ్లి కానుక’ విడుదలతో రాజాకు మరిన్ని అవకాశాలు రాసాగాయి. జెమినీ గణేశన్ గొంతుకు రాజా ఒక అద్దం అయ్యారు. తరువాత శ్రీధర్ దర్శకత్వంలో శివాజీ గణేశన్ చిత్రమైన ‘విడివెళ్ళి’కి (శుక్రతార) రాజా సంగీతాన్ని నిర్దేశించారు. తన స్వంత చిత్రంలో శివాజీ గణేశన్ సౌందరరాజన్‌ను కాక రాజాను పాడమన్నాడు. శ్రీధర్ దర్శకుడైన మరొక చిత్రం ‘మీండ శొర్గం’ (మరలి వచ్చిన స్వర్గము, తెలుగులో ‘స్త్రీ జీవితం’గా 1959లో విడుదలైంది). దీనికి సంగీత దర్శకుడు చలపతి రావు. ఇందులోని ‘కలైయే ఎన్ వాళ్కైయిన్ దిశై మాట్రినాయ్’ అనే పాట రాజాకు అపారమైన కీర్తిని తెచ్చి పెట్టింది. వైజయంతీమాల, జెమినీ గణేశన్‌లతో శ్రీధర్ కాశ్మీర్లో షూట్ చేసిన ‘తేన్ నిలవు’కి (1960, తెలుగులో “విరిసిన వెన్నెల”గా డబ్బింగు చేయబడింది) కూడా సంగీత దర్శకుడు రాజాయే. ఇందులోని హంసానంది రాగంలో ‘కాలైయుం నీయే మాలైయుం నీయే’ అనే పాట, సుశీలతో పాడిన యుగళగీతం ‘నిలవుం, మలరుం’ చక్కనైన పాటలు. ఈనాడు కూడా తమిళనాడులో ఈ చిత్రంలో నటించిన జెమినీ గణేశన్‌ను, పాటలను పాడిన రాజాను పదేపదే తలచుకొంటారు.
ఒక కోణంనుండి చూస్తే ఈ చిత్రం అతని జీవితానికి పెద్ద అడ్డంకిని కూడా కలిగించింది. ఎందుకో కానీ ఈ చిత్రపు రీరికార్డింగు (నేపథ్య సంగీతం) విషయంలో రాజా ఆలస్యం చేశారట. దానితో శ్రీధర్ ఈ చిత్రాన్ని సమయానికి విడుదల చేయలేక పోయారట. ఎం. జీ. రామచంద్రన్ మధ్యవర్తిత్వం చేసి రాజాచే పని పూర్తి చేయించారట. ఐనా కూడా శ్రీధర్ ‘నెంజిల్ ఒరు ఆలయం’ (తెలుగులో ‘మనసే మందిరం’) చిత్రానికి రాజానే సంగీత దర్శకుడుగా ఎన్నుకొన్నారట. మరెందుకో రాజా అంగీకరించలేదు. దీనితో ఆయన పతనం ప్రారంభమయింది.
రాజాతో మెలగడం కొద్దిగా కష్టమని వినికిడి. తాను కూర్చిన స్వరాలను ఎవరైనా దొంగిలిస్తారానే అపోహ ఉండేదట. ఏది ఏమైనా రాజా మార్కెట్ దిగజారింది. తెలుగు చిత్రసీమలో నాగేశ్వరరావు, ఎన్. టీ రామారావుల పాటలను ఘంటసాల గొంతుతో తప్ప మిగిలినవారి గళముతో వినడానికి ప్రజలు ఇష్టపడలేదు. ముఖ్యంగా ఆ కాలపు ఇద్దరు హీరోలకు ఎక్కువగా పాటలు ఘంటసాల పాడారు. ఘంటసాల, రాజాలు ఇద్దరు ఒకే చిత్రంలో పాడినా, ఘంటసాల సంగీత దర్శకత్వంలో రాజా ఎప్పుడూ పాడలేదు, కాని రాజా దర్శకత్వంలో ఘంటసాల (శొభ చిత్రానికి) పాడారు. తమిళములో పీ. బీ. శ్రీనివాస్ అదే సమయంలో ప్రవేశించారు. కొందరు దర్శకులు రాజాకు బదులు అతనిచేత పాడించారు. మరొకటి, సంగీత దర్శకుడైన తరువాత మిగిలిన సంగీత దర్శకులు అతనిచే పాడించడానికి కొద్దిగా సందేహించారేమో, తెలియదు. ఈ సంఘటనలు రాజాను మాత్రమే కాదు, అతని భార్య జిక్కిని కూడా తాకాయి. మెల్లమెల్లగా సినిమా రంగంనుండి నిష్క్రమించి తన పాటలను సభలలో, కార్యక్రమాలలో భార్యతో కూడా పాడసాగారు (ఆ కాలంలో అతని ఆర్కెస్ట్రాలో మరొక రాజా గిటార్ వాయించేవాడు. అతనే ఇప్పటి ఇళయరాజా. ఈయన చాలా యేళ్ల తరువాత 1990లలో జిక్కిచే మళ్ళీ పాడించారు). అదీ కాక రాజా తాను సంపాదించే కాలంలో కొన్ని టాక్సీలను కొని నడిపించే వారు. కాబట్టి జీవితం గడవడానికి కష్టమేమీ లేకపోయింది.
రాజా గాయకుడు దర్శకుడు మాత్రమే కాదు, ఒక నటుడు కూడా. ‘పక్కింటి అమ్మాయి’ (1953) చిత్రంలో రాజా నటనను అందరూ మెచ్చుకొన్నారు. ఇందులో ఒక విచిత్రమేమంటే, ఇదే పాత్రను హిందీ చిత్రంలో (పడోసన్, 1968) గాయక దర్శకుడు కిశోర్ కుమార్ వేయగా, మళ్లీ తీసిన (1976) తెలుగు చిత్రంలో ఈనాటి గాయక దర్శకుడు బాలసుబ్రహ్మణ్యం పోషించారు. ఇంత ఆదరణ పొందిన ఈ చిత్రానికి ‘పాషేర్ బారీ’ అనే బెంగాలీ నాటకం (సినిమాగా 1952లో) మాతృక. రాజా తెలుగు, తమిళ చిత్రాలలో మాత్రమే కాక మలయాళం, కన్నడ, హిందీ, సింహళ చిత్రాలలో కూడా పాడారు. మలయాళ సినీ రంగంలో హీరో సత్యన్‌కు గాత్రదానం ఎక్కువగా చేసింది రాజాయే. మలయాళంలో రాజా సంగీత దర్శకత్వం కూడా చేశారు. 1987లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేపర్లోని ఒక ఇంటర్వ్యూలో రాజా ఇలా అన్నారట:
“నా పాటలను ప్రజలు ఇంకా ఆదరించి మెచ్చుకొంటున్నారనే విషయం నాకెంతో సంతోషం. నేను కూడా ఆ పాటలను స్టేజిపైన పాడుతూ జీవితాన్ని గడుపుతున్నాను. అందుకే సంగీత దర్శకుడునిగా నా జీవితంలో సంభవించిన ఒడిదుడుకులకు నాకేమీ విచారం లేదు. అంతా విధి లీల. కాని నేననుకొన్నది సాధించాను. అయినా కూడా ఇంకా బాగా చేయాలనే ఆశ పోలేదు. ‘కల్యాణపరిశు’, ‘తేన్ నిలవు’ పాటలకంటె ఇంక మంచి పాటలే కట్టగలను. ఏదేమైనా నేను సంతృప్తితోనే ఉన్నాను. సినిమాలలో పాటలు పాడాలనుకొన్నాను, పాడాను. మంచి సంగీత దర్శకుడు కావాలనుకొన్నాను, అయినాను. ఇది చాలు నాకు”.
ఆ తరువాత 1970 ప్రాంతంలో మళ్లీ రాజా ‘వీట్టు మాప్పిళ్ళై’ అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో రాజా, జిక్కీ కలిసి పాడిన ‘రాశి నల్ల రాశి’ అనే పాట ప్రజల మన్ననకు పాత్రమయింది. శంకర్-గణేశ్ దర్శకత్వంలో కూడా వీరు 1970లలో పాడారు. ఇదే సమయంలో తెలుగులో, ‘పుట్టినిల్లు మెట్టినిల్లు’ అనే చిత్రంలో కూడా ‘సిరిమల్లె సొగసు’ అనే పాటని సుశీలతో పాడారు. కానీ అప్పటికే శ్రోతల అభిరుచులు, చిత్ర గీతాలలో హంగులు మారాయి. ఫలితంగా రాజాకు ఆదరణ ఎక్కువగా లభించలేదు. కాని రాజా-జిక్కీలు దేశవిదేశాలలో తమ పాటల కచేరీలు చేస్తూనే వున్నారు. వాటికి ఆదరణ మాత్రం తగ్గలేదు. 1989 ఏప్రిల్ నెల ఏడవ తారీకు ఒక కచేరికి వెళ్ళుతున్నప్పుడు పరిగెత్తే రైలు ఎక్కుతున్నప్పుడు కాలు జారి పట్టాల కింద పడి రాజా మరణించారు. పెట్టె లోపలనుండి భార్య జిక్కీ ఇదంతా చూడడం ఆమె దురదృష్టం. ఈ సంవత్సరంలో ఏ. ఎం. రాజా 80వ జయంతి, 20వ వర్ధంతులను పునస్కరించుకుని ఆయనను జ్ఞాపకం చేసుకోవడమే ఈ వ్యాస రచనకు మాకు ప్రేరణ నిచ్చింది.
రాజా అన్ని భాషలలో చేర్చి సుమారు ఐదారు వందల పాటలు పాడి ఉంటారని అంచనా (తప్పక వేయికన్నా తక్కువ). వారు బహుశా తెలుగుతో కూడా మొత్తం ఇరవై లేక ముప్ఫై చిత్రాలకు సంగీత దర్శకత్వం చేసి ఉండవచ్చు. అతని సమకాలీన గాయకులు (ఘంటసాల, టీ. ఎం. సౌందరరాజన్, పీ. బీ. శ్రీనివాస్) వేల సంఖ్యలో పాడారు. సంగీత దర్శకత్వంలో కూడా ఇలాగే. రాసిలో తక్కువైనా వాసిలో ఏమాత్రమూ తక్కువ కానివి రాజా పాటలు. తెలుగులో ఘంటసాల ఆ కాలంలో అందరికన్న మిన్న. కాని తమిళ చిత్రసీమలో నాటికీ, నేటికీ రాజాయే అత్యుత్తమ గాయక-దర్శకుడు. రాజాను గురించి ప్రశంసలు తమిళ సినీపత్రికలలో ఇప్పటికి చదువుతుంటాం. ఈనాటికి కూడా తమిళంలో రాజా పాడిన పాటలు చాలా విరివిగా, సులువుగా దొరుకుతాయి. హెచ్.ఎం.వి/సరెగమ వారు తెలుగులో రెండు రాజా పాటల సంకలనాలను వెలువరిస్తే తమిళంలో విడుదల చేసినవి పదిహేను!
రాజా కంఠంలోని ప్రత్యేకతలు – మార్దవత, స్వరశుద్ధత. ప్రేమగీతాలను పాడడంలో అతని కతడే సాటి. మంద్ర స్వరాలను స్పష్ఠంగా శ్రుతి తప్పకుండా పాడేవారు. అతని సంగీత దర్శకత్వంలో ప్రాధాన్యత మెలడీకే.
ఎన్నో చిత్రాల్లో ప్రేమ గీతాలు పాడిన ఏ. ఎం. రాజా, జిక్కి జంట ఆ సంవత్సరమే తమ గాన బంధాన్ని శాశ్వత సంబంధంగా మార్చుకున్నాయి.
రాజా సంగీతం సమకూర్చిన ‘ కళ్యాణ పరిశు ‘ తమిళ చిత్రం, దాని తెలుగు రూపమైన ‘ పెళ్ళికానుక ‘ చిత్రాలకు అవార్డులతోబాటు ప్రేక్షకుల రివార్డులు కూడా భారీగానే లభించాయి.
పల్లవికీ చరణానికీ మధ్య అంతరాలలోని వాద్య సంగీతంలో కూడా ఈ మాధుర్యం కనిపిస్తుంది. ఇందులో ఎక్కువగా వేణువు, వాయులీనాలు ఉంటాయి. శోకమయ గీతాలలో గాత్రం లీనమయినా, స్పష్టత కనిపిస్తూనే ఉంటుంది. అనవసర ఉచ్ఛ్వాసనిశ్వాసాలు మనకు గోచరించవు. ఈ విశిష్టమైన గుణాలవల్లే రాజా పాటలు ఇప్పటికీ మన మనసుల్లో చోటు చేసుకున్నాయి. ఇకముందు తరాలలో కూడా ఇలానే నిలిచివుంటాయి.
సుమారు వివిధ భాషలలో పదివేల పాటలను పాడి, సుమారు వంద చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏ. ఎం. రాజా జీవితం విషాదాంతం. మదురైలో సంగీత కార్యక్రమం ముగించుకుని తిరిగివస్తూ కదిలే రైలు ఎక్కబోయి ప్లాట్ ఫారం మీదనుండి జారిపోయి రైలుకి, ప్లాట్ ఫారం కి మధ్య ఇరుక్కుని చనిపోయారు.
ఎంత దూరమీ పయనం…. అంటూ మొదలుపెట్టిన ఆయన సంగీత ప్రయాణం ఈ సంఘటనతో ముగిసింది.
Recent Comments