సంగీతదర్శకుడు ఓగిరాల రామచంద్రరావు

గిరాల రామచంద్రరావు పాతతరం తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. వాహిని వారి చిత్రాలెన్నింటికో ఈయన సంగీతం అందించారు. ఓగిరాల తెలుగు చలనచిత్రరంగంలో మొట్టమొదటి నేపథ్యగాయకుడు, ఆయన మళ్ళీ పెళ్ళి (1939) చిత్రంలో వై.వి.రావుకి పాడారు.

ఓగిరాల రామచంద్రరావు పేరు తెలిసినవారు తక్కువే ఉండచ్చు, కానీ ఆయన గొప్పతనం తెలిసినవారు ఆయన గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. జాతీయ పురస్కారం అందుకున్న మొట్టమొదటి తెలుగు చిత్రం అయిన పెద్ద మనుషులు (1954)కి ఆయన సంగీతదర్శకుడు. 1939లో విడుదలైన జగదీశ్ పిక్చర్స్ వారి మళ్లీ పెళ్లి సంగీతదర్శకునిగా ఆయనకి మొదటి చిత్రం, ఇదే చిత్రంలో ఓగిరాల ఒక చిన్న పాత్రలో కనిపిస్తారు. ఆ చిత్రంలో బెజవాడ రాజారత్నం పాడిన “గోపాలుడే మన గోపాలుడే”, “చెలి కుంకుమమే పావనమే” వంటి పాటలు పేరుపొందాయి. ఇదే చిత్రంలో ఓగిరాల, కాంచనమాలతో కలిసి “నా సుందర సురుచిరరూపా” అనే పాటని ఆలాపించారు. ఈ పాటను ఆయన వై.వి.రావు గారికి పాడారు. ఈ విధంగా ఆయన తెలుగు చలనచిత్రసీమలో మొట్టమొదటి నేపథ్యగాయకుడు. 1939లో విడుదలైన శ్రీ వేంకటేశ్వర మహత్యంలో ఆయన శివుని వేషం వేశారు. ఆ చిత్రంలో శివుని వేషానికి ముందు వేరే నటుడిని తీసుకున్నారు, కానీ అతని మెడలో పాము వేయగానే ఆ నటుడు భయపడిపోయి ఆ వేషాన్ని వదులుకున్నాడు, దాంతో ఆ చిత్రానికి సంగీతదర్శకుడైన ఓగిరాల ఆ వేషం వేయడానికి ముందుకొచ్చారు.

1940లో విడుదలైన జగదీశ్ పిక్చర్స్ వారి విశ్వమోహినిలో బెజవాడ రాజారత్నం చేత ఓగిరాల పాడించిన పాటలు చాల పేరుపొందాయి. “ఈ పూపొదరింటా” చాలా ప్రముఖంగా వినిపించగా, “”భలే ఫేస్ భలే ఫేస్”, “మేళవింపగదే చెలియా వీణ” పాటలు కూడా బాగానే పేరు సంపాదించాయి. 1941లో విడుదలైన ప్రతిభా పిక్చర్స్ వారి మొట్టమొదటి చిత్రం పార్వతీకళ్యాణంకు ఆయన తదుపరి చిత్రం. గరుడ గర్వభంగం (1943), సీతారామజననం (1944) ఆయన తదుపరి చిత్రాలు, ఈ రెండూ చిత్రాలు ప్రతిభా పిక్చర్స్ సంస్థ నిర్మించినవే. సీతారామజననం చిత్రానికి ఓగిరాల, ప్రభల సత్యనారాయణతో కలిసి పని చేశారు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావుతో “గురు బ్రహ్మ గురు విష్ణు” శ్లోకాన్ని పాడించారు. ఆయన తదుపరి చిత్రం వాహినీ వారి స్వర్గసీమ (1945), ఈ చిత్రంలో నాగయ్య, బాలాంత్రపు రజనీకాంతరావుతో కలిసి పని చేశారు. ఈ చిత్రం పాటలన్నింటిలో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. సంగీతపరంగా స్వర్గసీమను విజయవంతం చేయడంలో ఆయన కృషి ఎంతో ఉంది. 1946లో విడుదలైన ప్రతిభా పిక్చర్స్ వారి ముగ్గురు మరాఠీలు సంగీతపరంగా విజయం సాధించింది. అక్కినేని నాగేశ్వరరావు, టి.జి.కమలాదేవి పాడిన “ఛల్ ఛలో వయ్యారీ షికారీ”, కన్నాంబ పాడిన “సతీ భాగ్యమే భాగ్యము”, “తీరుగదా ఆశా నేడు” మరియు బెజవాడ రాజారత్నం పాడిన “జీవనము యమునా జీవనము”, “రాటము భారతనారీ కవచము” తదితర పాటలు బాగా పేరు సంపాదించాయి. ఈ చిత్రంలో ముఖ్యంగా పేర్కోవలసిన పాట “జీవనము యమునా జీవనము”. ఈ విధంగా చూస్తే బెజవాడ రాజారత్నంకు గాయనిగా పేరు తెచ్చిపెట్టింది ఓగిరాల అని స్పష్టంగా తెలుస్తుంది. ఓగిరాల తదుపరి చిత్రాలు నాగయ్య గారి త్యాగయ్య (1946) మరియు వాహినీ వారి యోగి వేమన (1947). ఈ రెండూ చిత్రాలకు ఆయన నాగయ్య వద్ద సహాయకునిగా పనిచేశారు. యోగి వేమనలోని పాటలలో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన తదుపరి చిత్రం రక్షరేఖ (1949)కు హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రితో కలిసి పని చేశారు. 1949లో విడుదలైన వాహినీ వారి గుణసుందరి కథ అప్పట్లో అన్నీ రంగాలలో పెద్ద విజయం సాధించింది. 1950లో విడదలైన పరమానందయ్య శిష్యులు పరాజయం పొందినా పాటలు బాగానే పేరు సంపాదించాయి.

ఆయన తదుపరి చిత్రాలు మాయరంభ (1950), రాజేశ్వరి (1952), కుమారి (1952 – రాజేశ్వరి – తమిళం), సతీ సక్కుబాయి (1954). మాయరంభ లోని పాటలు, పద్యాలు ఓగిరాలకి బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఈ చిత్రంలో నటి అంజలీదేవి చేత ఓగిరాల ఒక బృందగీతం పాడించారు. సతీ సక్కుబాయి చిత్రంలో ఎస్.వరలక్ష్మి పాడిన పాటలు బాగా ఉంటాయి. ఆయన తదుపరి చిత్రం వాహినీ వారి పెద్ద మనుషులు (1954). పెద్ద మనుషులు తరువాత టి.వి.రాజుతో కలిసి శ్రీ గౌరీ మహత్యం చిత్రానికి పని చేశారు. నాగయ్య గారు తీసిన భక్త రామదాసు (1964) ఆయన చివరి చిత్రం. ఈ చిత్రానికి ఓగిరాల నాగయ్య, అశ్వత్థామ, హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రితో కలిసి పని చేశారు.

ఓగిరాల సంగీతం అందించిన చిత్రాలలో ముఖ్యంగా పేర్కొనవలసినవి గుణసుందరి కథ (1949) మరియు పెద్ద మనుషులు (1954). ఆ రెండూ వాహిని వారి చిత్రాలు కావడం, ఆ రెండిట్లో అద్దేపల్లి రామారావు ఓగిరాలకు సహాయకునిగా, వాద్యనిర్వాహకునిగా పనిచేయడం విశేషం. మరో విశేషం ఏమిటంటే ఆ రెండూ చిత్రాలకు నిర్మాత మరియు దర్శకుడు కె.వి.రెడ్డి గారే మరియు రెండిట్లో నాయిక శ్రీరంజని జూనియరే.

గుణసుందరి కథ చిత్రం విజయం సాధించడానికి ముఖ్య కారణాలలో ఓగిరాల సంగీతం ఒకటి. పి.లీల, టి.జి.కమలాదేవి, కస్తూరి శివరావు, శాంతకుమారి, మాలతి, ఘంటసాల తదితరులతో ఓగిరాల పాడించిన పాటలు బాగా జనాదరణ పొందాయి. ఈ చిత్రంలో పాటలన్నీ పింగళి నాగేంద్రరావు రాశారు. ఓగిరాల ఈ చిత్రంలో పి.లీల చేత పాడించిన ఒక్క “చిటి తాళం వేసెనంటే” మరియు “నాను సింగారినే మగనా” తప్ప మిగతావన్నీ భక్తి పాటలే, వాటిలో “శ్రీ తులసి ప్రియ తులసి” పాట చాలా కాలం అందరి ఇళ్ళల్లో వినిపించేది, ఆ పాట పాడుతూ ప్రతీ స్త్రీ తులసి మాతను ఆరాధించేది. శాంతకుమారి, మాలతి కలిసి పాడిన “కలకలా ఆ కోకిలేమో” మరియు “చల్లని దొరవేలె చందమామ” పాటలు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. ఘంటసాల ఈ చిత్రంలో “అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా” అనే నేపథ్యగీతం పాడారు. అలాగే కస్తూరి శివరావు, టి.జి.కమలాదేవి, వి.శివరాం పాడిన పాటలు కూడా పేరు పొందాయి.

పెద్ద మనుషుల చిత్రంలో రేలంగికి ఘంటసాల పాడిన “నందామయా గురుడ నందామయా” మరియు “శివశివ మూర్తివి గణనాథా” బాగా జనాదరణ పొందాయి. ఆ రెండూ పాటలను కొసరాజు రాశారు. పి.లీల ఈ చిత్రంలో మూడు పాటలు పాడింది, ఆమె పాడిన “నీ మీద ప్రాణాలు నిలిపింది రాధ” పాట హిందీ చిత్రం అల్‌బేలాలోని పాటకు అనుకరణగా సంగీతం అందించారు మరియు లీలనే పాడిన “అంతభారమైతినా అంధురాలనే దేవ” పాట మనస్స్సుకు హత్తుకునే విధంగా సంగీతం అందించారు. ఈ చిత్రం జాతీయ బహుమతి పొందిన మొట్టమొదటి తెలుగు చిత్రం. ఈ విధంగా జాతీయ బహుమతి పొందిన మొదటి తెలుగు చిత్రానికి సంగీతమందించిన వ్యక్తిగా ఓగిరాల కీర్తి పొందారు.

1905లో సెప్టెంబరు 10న బెజవాడలో ఓగిరాల జనార్దనశర్మ, సుబ్బమ్మ దంపతులకు జన్మించిన ఓగిరాల రామచంద్రరావు, 1957లో భక్త రామదాసు చిత్ర నిర్మాణ సమయంలో ఫ్లూ జ్వరం బారిన పడి జూన్ 17వ తేదీన మరణించారు. ఓగిరాల అంతిమయాత్రలో ఆయనంటే ఎంతో అభిమానమున్న ఘంటసాల సుమారు రెండు మైళ్ళు నడిచారు.

ఓగిరాల భార్య పేరు వరలక్ష్మి. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. కుమారుడి పేరు నరసింహమూర్తి మరియు కుమార్తె పేరు కల్పకవల్లి. నరసింహమూర్తి కొన్ని చిత్రాలలో బాలనటునిగా నటించారు. బ్రతుకుతెరువు (1953)లో సూర్యకాంతం కొడుకుగా, దొంగరాముడు (1955)లో చిన్ననాటి రాముడి స్నేహితునిగా, అప్పు చేసి పప్పు కూడు (1959)లో సూర్యకాంతం, రమణారెడ్డి కొడుకుగా నటించారు. అప్పు చేసి పప్పు కూడులో రేలంగి, నరసింహమూర్తి కలిసి పండించిన హాస్యం మరువలేనిది.. ఆయన ఈ మధ్యే కార్పరేషన్ బ్యాంక్‌లో సీనియర్ ఉద్యోగిగా పదవీ విరమణ పొందారు. ఓగిరాలకు జాతకాలు చూసే అలవాటు ఉండేది. ఓగిరాల కొంతమంది ప్రముఖ నటుల జాతకాలు రాసిపెట్టుకున్నట్టు ఆయన కుమార్తె కల్పకవల్లి చెప్పారు.

సంగీత దర్శకుడు ‘గాలిపెంచల నరసింహారావు

గాలి పెంచల నరసింహారావు ఆ పేరు వింటే చాలామందికి గుర్తుకువచ్చేది “సీతారాముల కళ్యాణం చూతము రారండి” పాట. ఇంతటి గొప్ప పాటకు చాలా గొప్ప సంగీతదర్శకుడు గాలి పెంచల.

గాలి పెంచల నరసింహారావు (1903 – 1964) తెలుగు చలనచిత్ర సంగీతదర్శకులలో మొదటి తరానికి చెందినవారు. దక్షిణభారతదేశంలో నిర్మితమైన మొట్టమొదటి చిత్రం సీతాకళ్యాణం (1934) ఆయన సంగీతం అందించిన మొదటి చిత్రం. ఆయన చివరి చిత్రం ఎన్.ఏ.టి.వారి సీతారామ కల్యాణం (1961), ఆ చిత్రం ఆయన సంగీతం అందించిన చిత్రాలలో అన్నింటికన్నా పెద్ద విజయం సాధించింది. ఈ చిత్రంలో ఆయన స్వరపరచిన సీతారాముల కళ్యాణం చూతము రారండి పాట ఎంతో పెద్ద విజయం సాధించింది. ఆ పాట ఇప్పటికి శ్రీరామనవమి నాడు మరియు పెళ్ళి కార్యక్రమాలలో వినిపిస్తూనే ఉంటుంది. ఆయన సంగీతం అందించిన తొలి మరియు చివరి చిత్రాలు ఒకే నేపథ్యం ఉన్న కథతో తయారుకావడం కాకతాళీయం. 1936లో విడుదలైన మాయాబజార్ లేక శశిరేఖా పరిణయం చిత్రంలో ఆయన స్వరపరిచిన వివాహభోజనంబు పాటయే ఘంటసాల స్వరపరిచిన 1957లోని మాయాబజార్లోని పాటకు ఆదర్శం. 1943లో వచ్చిన పంతులమ్మ చిత్రంలో కృష్ణవేణి అనే అమ్మాయికి పాడే అవకాశం ఇచ్చారు, ఆమె ఎవరో కాదు మధుర గాయని జిక్కి. ఈ చిత్రంలో ఆమె ఈ తీరున నిన్నెరిగి పలుకగా నాతరమా అనే పాట స్వయంగా నటిస్తూ పాడారు. 1945లో వచ్చిన మాయలోకం చిత్రం ద్వారా అలనాటి ప్రముఖ సంగీతదర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావును తన బృందంలో హార్మోనిస్టుగా అవకాశం ఇచ్చారు. 1947లో వచ్చిన పల్నాటి యుద్ధం చిత్రానికి ఆయనే సంగీతదర్శకుడు. ఈ చిత్రంలో తనకు సహాయకునిగా పనిచేసిన ఘంటసాలతో కొన్ని పాటలు పాడించారు. ఆ చిత్రంలోని పాటలు చాలా ప్రాధాన్యత ఉన్నవి, ఎందుకంటే అందులో అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా పాటలు పాడారు, అక్కినేని నాగేశ్వరరావు, ఘంటసాల కలిసి ఒక పాట పాడారు, ఘంటసాల, కన్నాంబ కలిసి ఒక యుగళగీతం (భక్తిగీతం) – తెరతీయగరాదా దేవా ఆలాపించారు మరియు అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వరలక్ష్మి కలిసి ఒక యుగళగీతం ఆలాపించారు. 1948లో వచ్చిన బాలరాజు చిత్రంలో ఈయన స్వరపరచిన పాటలు ఆ చిత్ర విజయానికి ముఖ్య కారణం. ఘంటసాల పాడిన చెలియా కనరావా, ఎస్.వరలక్ష్మి పాడిన ఎవరినే నేనెవరినే మొదలైన పాటలు, ఆ చిత్ర విజయానికి దోహదపడ్డాయి. ఆ చిత్రంలో కొన్ని పాటలను ఘంటసాల కూడా స్వరపరిచారు, అందుకు కారణం గాలిపెంచలనే. ఆయనకి సంగీతోపాధ్యాయ అని బిరుదు. నరసింహారావుగారు సంగీతం అందించిన చిత్రాలన్నీ సంగీతపరంగా పెద్ద విజయాలను సాధించాయి. మాలపిల్ల (1938) చిత్రంలో కథానాయకునిగా నటించిన గాలి వెంకటేశ్వరరావు ఈయన తమ్ముడు. ఆయన ఇంటిపేరును చాలామంది గాలిపెంచల అనుకుంటారు, కానీ ఆయన ఇంటిపేరు గాలి, అసలు పెరు పెంచల నరసింహారావు. కొన్ని చిత్రాలలో ఆయనపేరును జి.పెంచలయ్యగా, కొన్ని చిత్రాలలో గాలి పెంచలగా, కొన్ని చిత్రాలలో పూర్తి పేరును వేశారు.

మాలపిల్ల (1938), కృష్ణప్రేమ (1943) వంటి చిత్రాలలో కథానాయకునిగా నటించిన గాలి వెంకటేశ్వరరావు, గాలి పెంచల సోదరుడు. గాలి పెంచల శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న వ్యక్తి. ఆయన సంగీతం అందించిన చిత్రాలన్నీ సంగీతపరంగా పెద్ద విజయాలను సాధించాయి.

అగ్నిపరీక్ష (1951) చిత్రానికి సంగీతం అందించిన దాదాపు పదేళ్ళ తర్వాత ఆయన సీతారామకళ్యాణం చిత్రానికి సంగీతం అందించారు. ఘంటసాల సంగీతదర్శకుడిగా ఎదగడానికి ముఖ్య కారణం గాలి పెంచల. ఆయన సంగీతం అందించిన పల్నాటి యుద్ధం (1947), బాలరాజు (1948) చిత్రాలకు ఘంటసాలను సహాయకునిగా పెట్టుకున్నారు. బాలరాజు చిత్రంలో ఘంటసాల చేత కొన్ని పాటలకు స్వరరచనను చేయించారు. పల్నాటి యుద్ధం చిత్రంలో ఘంటసాల, కన్నాంబ చేత ఒక భక్తగీతం పాడించారు. ఆ పాట “తెరతీయగరాదా దేవా”. ఆ పాటకు సంగీతం, సాహిత్యం ఎంతో అద్భుతంగా ఉంటాయి. గాలి పెంచలకు “సంగీతోపాధ్యాయ” అని బిరుదు.

గీత రచయిత జూనియర్ ‘సముద్రాల’

తెలుగు చలనచిత్ర సాహిత్య కళామతల్లిని, నవ్యమైన, రసవంతమైన, నందనవనాలలో, పూబాటలందు నడిపించిన రచయిత సినీ కవికులపతి, సినీ భీష్ములు, శ్రీమాన్ సముద్రాల వెంకటరాఘవాచార్యులు ( సముద్రాల సీనియర్‌ ) కుమారుడే ఈ జూనియర్‌ సముద్రాల.

అందమె ఆనందం
అందమె ఆనందం
ఆనందమే జీవిత మకరందం!

ఆయన రాసిన మొట్టమొదటి పాటే పాపులర్‌ అయింది. ఆయనే సముద్రాల జూనియర్ గా ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా రచయిత. ” బ్రతుకు తెరువు సినిమా వచ్చింది, నాకు బతుకు తెరువు నిచ్చింది” అంటూ ఈ గీత రచయిత సముద్రాల జూనియర్ చెప్పుకునే వారట. ఆయన అసలు పేరు సముద్రాల రామానుజాచార్యులు.

తండ్రి బాటలోనే సాగుతూ సినీరంగంలో స్థిరపడాలని రామానుజాచార్య చిన్ననాటనే నిర్ణయానికొచ్చారు. వీరిది పండితవంశం. ఆంధ్ర, సంస్కృతాలు కరతలామలకం. తెనుగు ఛందస్సు, వ్యాకరణం జన్మసంస్కారంగా అబ్బాయికి అబ్బేశాయి. కవిత్వాంశతో పుట్టారు. అద్భుతమైన పద్యాలు రాసేవారు.

చెన్నై వాహినీ స్టూడియో శబ్దశాఖలో రికార్డిస్టుగా తొలినాళ్ళలో రామానుజం పనిచేశారు. ఆ ఉద్యోగం వదిలిపెట్టి, వెండితెరపై ‘ కలం ‘ కారీ పనితనానికి దిగారు. వినోదావారి “శాంతి” చిత్రంలో చిన్నసముద్రాల పాటలు రాశారు. అప్పుడే జూనియర్ గా పేరుపడ్డారు. ఒకవైపు తన తండ్రి సినీరచనా విన్యాసాలకు తోడ్పడుతూనే, తన శైలీ విన్నాణాన్నీ ప్రదర్శించుకునేవారు.

తండ్రిగారికీ అంత ఇష్టం లేకపోయినా ఇతరుల ఆకాంక్షలకి తల ఒగ్గి, రామానుజం సినిమా రచన చెయ్యడానికి ఉద్యమించాడు. నీ రాత ఎలా వుంటే అలా జరుగుతుంది. నీ యిష్టం! అన్నారు తండ్రిగారు. దాంతో ఆయన రచయితగానే ప్రవేశించాడు. వినోదావారు ‘శాంతి’ (1952) సినిమా మొదలు పెడుతూ రామానుజం చేత పాటలు రాయించారు. తర్వాత ‘అమ్మలక్కలు’ (1953)లోనూ, ‘బ్రతుకు తెరువు’ (1953)లోనూ పాటలు రాశాడు.

“బ్రతుకుతెరువు” సినిమా జూనియర్ సముద్రాలకు బతుకు తెరువు చూపించి, పాటల రచయితగా పరిశ్రమలో నిలదొక్కుకునేలా చేసింది. ఆ సినిమాలోని “అందమె ఆనందం…..ఆనందమె జీవిత మకరందం…..” నభూతో నభవిష్యత్ గా నిలవడం జూనియర్ ఇంద్రజాలమే!

సముద్రాల జూనియర్ అని రాయడానికి సినిమావారికి మహా బద్ధకం. అందుకే టైటిల్ కార్డ్స్ లో ‘ సముద్రాల (జూ)’ అని వేస్తుండేవారు. ఇలా చేసినప్పుడల్లా రామానుజాచార్యకు తిక్క రేగుతూ ఉండేది. “నాన్నగారి పేరు పక్కన ‘సీ’ అని వేసినా ఫరవాలేదు. ఇంగ్లీషులో సీ అంటే సముద్రమే. నా పేరు దగ్గర ‘జూ’ అంటే కుదురుతుందా చెప్పండి? నేను అక్కడినుంచి వచ్చానేమో అని ఎవరన్నా అనుకునే ప్రమాదం ఉంది కదండీ!” అని వాపోయేవారు. అయినా ఈ ‘ జూ ‘ బాధ తరచూ ఆయనకు తప్పేదికాదు.

జూనియర్ గారు సినిమాపాటల కెమిస్ట్రీ సులువుగానే అర్థం చేసుకోగలిగారు. సినిమాగీతాలు, సంభాషణల మీటర్ ను ఇట్టే పట్టేశారు. మాటలయినా, పాటలయినా క్షణాలమీద అత్యద్భుతంగా రాసిస్తేనే నిలబడతామని గ్రహించారు. అప్పటినుంచీ ఉరుకులూ పరుగులే!

యన్‌.టి.రామారావుకి- రామానుజం రికార్డిస్టుగా ఉన్నప్పట్నుంచీ తెలుసు. ఆయన సాహిత్యాభిలాష తెలుసు. పాటలు రాస్తున్న విషయమూ తెలుసు. అంచేత తను ప్రారంభిస్తున్న ‘తోడు దొంగలు’ (1954)కు రచన చెయ్యమని అడిగి ఆ సినిమాకి రాయించారు. అది రామానుజం మాటలు రాసిన తొలి సినిమా. దర్శకత్వ శాఖలో కూడా పనిచెయ్యాలని, ఆయన ఎన్‌.ఎ.టి.లో సెట్సు మీద కూడా పనిచేశాడు. రామానుజం రెండో సినిమా ‘జయసింహ’ (1955) జయ పతాకం ఎగరవేసినప్పట్నుంచి, రామానుజం ‘సముద్రాల జూనియర్‌’గా మారి సంభాషణలు రాయడం మీదనే దృష్టి సారించాడు. ‘పాండురంగ మహాత్మ్యం’ (1957), ‘మంచి మనసుకి మంచి రోజులు’ (1958), ‘శాంతి నివాసం’ (1960), ‘ఆత్మ బంధువు’ (1962), ‘ఉమ్మడి కుటుంబం’ (1967) ‘స్త్రీ జన్మ’ (1967), ‘తల్లా? పెళ్లామా?’ (1970), ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ (1975) లాంటి 70 చిత్రాలకు పైగా రచన చేశాడు జూనియర్‌ సముద్రాల.

“నర్తనశాల” చిత్రములో కీచకుడి పాత్ర కోసం కొన్ని సంభాషణలు రాయాల్సివున్నా, అనారోగ్యం కారణంగా సీనియర్ సముద్రాల వల్ల కాలేదు. ఆ బాధ్యతను జూనియర్ తన భుజాలమీద వేసుకుని, అడిగిందే తడవుగా రాసిచ్చారు. వీటిని పలికిన కీచక పాత్రధారి ఎస్.వి.రంగారావు…రామానుజాచార్యను పొగడ్తల్లో ముంచెత్తడం సన్మానం కింద లెక్కే!

“ధరణికి గిరి భారమా (మంచిమనసుకు మంచిరోజులు) , కలనైనా నీ వలపే (శాంతినివాసం) , పయనించే ఓ చిలుకా (కులదైవం) , రావే ప్రేమలతా (పెళ్ళిసందడి) , శ్రీకర కరుణాలవాల (బొబ్బిలి యుద్ధం) , మనవి సేయవే (రేచుక్క – పగటిచుక్క) ” పాటలు జూనియర్ సముద్రాల చిత్కళకు ప్రతిరూపాలు.

“పాండురంగ మహాత్మ్యము” లో ఆయన రాసిన “జయ కృష్ణా! ముకుందా! మురారీ!” గీతం అప్పట్లో 2 రికార్డులుగా, 4 సైడ్లుగా వెలువడింది. రికార్డులన్నింటినీ వేల వ్రక్కలు చేసింది. ‘ టైం లేదు ‘ అనుకునే నేటి తరం కూడా ఎన్ని సైడ్లు తీసుకున్నప్పటికీ ఈ పాటను అభిమానిస్తుండటం గొప్పల్లో గొప్ప.

“అందమె ఆనందం” పాట రాశానని తండ్రి రాఘవాచార్యకు చెప్పబోతే, “కీట్స్ ‘A thing of beauty is joy for ever’ ను తెలుగులోకి తిప్పిరాశావా ఏంటి” అని ఆయన సణిగారట! అక్కడే ఉన్న మరో పెద్దాయన కలుగజేసుకుని మనస్సు, ప్రేమ సార్వదేశికమైనవి, సార్వకాలికమైనవి అని సర్దిచెప్పి గండం గట్టెక్కించారట!……

“జయసింహ” చిత్రం జూనియర్ సముద్రాల విశ్వరూపాన్ని ఆవిష్కరించింది. ఈ సినిమాకి మాటా, పాటా ఆడుతూ పాడుతూ ఆయన కానిచ్చేశారు. “ఈనాటి ఈ హాయీ, కల కాదోయి, నిజమోయీ” అన్న పాట తెలుగుసినిమా యుగళగీతాల్లో ఎప్పటికీ ముందువరసలోనే ఉండే సత్తా ఉన్న పాట.

జూనియర్ సముద్రాల స్నేహశీలి, మృదుభాషి, మానవతావాది. అందరినీ ‘ బ్రదర్ ‘ అని సంబోధిస్తూ మాట్లాడేవారు. ఘంటసాలతో ‘ ఒరేయ్ ‘ అనుకునే స్నేహం ఉంది. పాటల ట్యూన్ల విషయంలో ఘంటసాల మాష్టారు, జూనియర్ గారు ఆడుకునే సరససల్లాపాలు చూసేవారికి చూడముచ్చట.

1940 నాటి గుంటూరు నవ్యకళాపరిషత్తులో అనిసెట్టి సుబ్బారావు, కుందుర్తి ఆంజనేయులు, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ లతో పాటు జూనియర్ కూడా సభ్యుడే. జూనియర్, సీనియర్ రాసిన పద్యాలు చక్రపాణిగారి ఆధ్వర్యంలో “కడలిపొంగులు” పేరుతో పుస్తకరూపం ధరించాయి.

వారు లేకున్నా వారి పాటలు నేటికీ తెలుగు లోగిళ్ళలో “ఊగేములే! తులతూగేములే!” అంటూ ఊసులాడుతున్నాయి. జూనియర్ సముద్రాల ఒడ్డుకు తెచ్చి పడేసిన మంచిముత్యాల సినీగీతాలు కోమల కవితాధారలుగా, మనోహర తారలుగా, మధుర సితారలుగా ఆంధ్రులను ఆనందింపజేస్తూనే ఉన్నాయి.

మహేష్ బాబు పై తెలంగాణా వాదుల దాడి

కధానాయకుల మాస్ మంత్రం