Artist Bittiri Satti

ఫొటోలు ముఖాన కొట్టారు
ఫూలఫూల షర్ట్‌, ఫొడుగు లాగు… సిత్రమైన రూఫం. బెత్తెడు జుట్టు… బిత్తిరి మాటలు… చూడాలనిపించే ఫోగ్రాం.  ‘సాఫిత్రక్కా… సాఫిత్రక్కా’ అంటూ ‘తీన్‌మార్‌’ మోగించి… లెక్కలేనన్నంత మంది అభిమానులను సంఫాదించిన.. బిత్తిరి సత్తిని ‘హాయ్‌’ ఫలుకరించింది. కావలి రవి బిత్తిరి సత్తి అయిన తీరు, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా పడ్డ కష్టాలు, కొత్త సినిమా కబుర్లు ఇలా ఎన్నో విషయాలు చెఫ్పాడు. ఫదండి చదివేద్దాం.

ఫొటోలు ముఖాన కొట్టారు

‘తుపాకి రాముడు’తో కథానాయకుడవుతున్నారంట?
చిన్న డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా మొదలైన నా ప్రయాణం సినిమాల వరకు వెళ్లిందంటే అదంతా ప్రేక్షకుల దయే. ఏ పని చేతకాని ఒక వ్యక్తి అందరికి ప్రయోజనం చేకూర్చే ఒక పెద్ద పనిని ఎలా చేశాడో చెబుతుందీ చిత్రం. ఈ చిత్రంలో నేను కథానాయకుడిగా నటించా.

డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ఎదిగేప్పుడు పడిన కష్టాలేంటి?
ఆ జీవితం ఏమాత్రం సాఫీగా సాగలేదు. ఎన్నో కష్టాలు పడ్డా. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా సభ్యత్వం పొందడానికి ఆఫీసు ముందు గంటల తరబడి నిలబడేవాడిని. ‘నేను మిమిక్రీ చేస్తాను, పాటలు పాడతా. అందుకే డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ కావాలని వచ్చా’ అని చెబితే ముఖం మీదే నవ్వేవారు. నాకు మిమిక్రీ వచ్చు. చిన్న చిన్న వేడుకలకు స్నేహితులు, బంధువుల ముందు వివిధ పాత్రలతో మిమిక్రీ చేసేవాడిని. ముకుంద రెడ్డి అనే వ్యక్తి మా ఇంటి పక్కనే ఉండేవాడు. అతడిని గమనిస్తూ ఉండేవాడిని. నా ఈ బిత్తిరి సత్తి పాత్రకు ప్రేరణ ఆయనే. యూనిట్‌లో ఉన్నవారందరిని అనుకరించి చూపించేవాడిని. ఆ సమయంలోనే వ్యవసాయానికి చెందిన ఒక ఎన్జీవోలో పనిచేసేవాడిని. అప్పుడు నా జీతం నెలకు పద్దెనిమిది వందలు. 2000 నుంచి 2005వ సంవత్సరం వరకు ఈ ఉద్యోగం చేస్తూనే అవకాశాల కోసం ప్రయత్నించేవాడిని. 2005లో డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా జీవితం మొదలైంది. పదేళ్లపాటు డబ్బింగ్‌ చెప్పా.

అవకాశాల కోసం చేసిన ప్రయత్నాలు?
శబ్దాలయా డబ్బింగ్‌ థియేటర్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే కృష్ణను పరిచయం చేసుకున్నా. జనరేటర్‌ రూమ్‌ పక్కనే చిన్న గదిలో తను ఉండేవాడు. నేనూ తనతో కలిసి అక్కడే ఉండేవాడిని.. అక్కడికి ఎవరు ప్రముఖులు వచ్చినా తను నన్ను పరిచయం చేసేవాడు. అలా డబ్బింగ్‌ చెప్పే అవకాశాలు పెరిగాయి. డబ్బింగ్‌ చెబుతూనే సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవాడిని.

మొదట వీ6లో అవకాశం వచ్చినా వదులుకున్నారట…?
మొదట 6టీవీలో అవకాశం వచ్చింది. ‘నర్సయ్య తాతా’ అనే ఒక గెటప్‌తో ఎంట్రీ ఇచ్చా. అప్పుడు నాకు ఇచ్చిన జీతం ఎంతో తెలుసా అక్షరాలా ముప్పయివేల రూపాయలు. అప్పుడే వీ6 ఛానెల్‌ నుంచి పిలుపు వచ్చింది. కావలి రవికుమార్‌ను బిత్తిరి సత్తిగా ఈ ఛానెల్‌ను మార్చేసింది. ఈ బిత్తిరి సత్తి అనే పాత్ర… నాలుగు రకాల పాత్రల సమ్మేళనం. నలుగురు మానసిక రోగులను కలిపి ఈ పాత్రను రూపొందించా. జీతం ఎంత కావాలని అడిగారు. 35,000 కావాలని అడిగా. వారు 30,000 ఇస్తామన్నారు. నేను చేయనని చెప్పా. అలా చేతికి అందిన అవకాశాన్ని చేజార్చుకున్నా.  తరువాత నేను పనిచేస్తున్న ఛానెల్‌ నుంచి బయటకు వచ్చేశా. మళ్లీ వీ6కి వెళ్లా. వాళ్లు కుదరదన్నారు. ఒప్పించడానికి ప్రయత్నించా. రెండు నెలల తరువాత అవకాశమిచ్చారు.

బిత్తిరి సత్తి పాత్ర ఎలా మొదలైంది?
ఈ పాత్రకు కావాల్సిన దుస్తులను నేనే డిజైన్‌ చేశా. పూల చొక్కా, చిన్న లాగు, చిన్న క్రాఫ్‌తో బిత్తిరి సత్తి కనిపిస్తాడు. మొదటి రోజు ఏం చేయాలో తెలియదు? ఎలా చేయాలో అర్థం కాలేదు.‘ఆడ దావత్‌ అయితే యాటను కోసిండ్రు మస్తు తిన్నా.. నువ్వు కూడా వస్తవా అక్కా’.. ‘యే  మీది మోటరు మీది మోటరు… అంటూ కింద పడ్డా. ‘ఏ ఎవర్రా నూకెసిండ్రూ’ అంటూ వెనక్కి చూసి అరుగు తగిలిందా నేనెవరో నూకిసిండ్రు అనుకున్నా’ అంటూ ఇలా పాత్రలను చేసి చూపించా. వాళ్లకు నచ్చడంతో టెలీకాస్ట్‌ చేసేశారు.

ఈ మార్గంలోకి వస్తానన్నప్పుడు అమ్మానాన్న ఏమన్నారు?
నాన్న వీధినాటకాలు (యక్షగానం) వేసేవారు. ఈ నాటకాల కోసం ఆస్తులనూ అమ్మేశారు. ఆయనకు కళ అంత ఇష్టం. ఆయన దగ్గర నుంచే నాకు ఈ కళ అబ్బిందనుకుంటా. అమ్మకు మాత్రం నాపై బెంగగా ఉండేది. నాన్న ఎప్పుడూ వద్దనలేదు.

వ్యవసాయం చేశా నాతో పెరిగిన నా తోటి వారు ఒక్కోరూ ఒక్కో రంగంలో ఎదిగిపోయారు. అప్పుడే నాకనిపించింది. నాకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని. దాంతో వ్యవసాయం వైపు దృష్టి సారించా. అలా 2010లో పాలీహౌస్‌లో జర్బరా పూలను సాగు చేశా. ఆర్థికంగా బాగా నిలదొక్కుకున్నా. వ్యవసాయం చేసుకుంటూనే అవకాశాల కోసం ఆఫీస్‌ల చుట్టూ కారేసుకుని తిరిగేవాడిని.
తట్టుకోలేక ఏడ్చేశా ఒక సినిమాలో పాత్ర అడగడం కోసం దర్శకుడిని కలవడానికి నా ఫొటోలు తీసుకుని వెళ్లా. ఆ సమయంలో అక్కడ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఉన్నారు. ఆయన నన్ను అస్సలు పట్టించుకోలేదు. ఆ సందర్భంలో నేను ఫొటోలు ఇవ్వడంతో అతను చిరాగ్గా వాటిని నా ముఖంపైకి వేసిరేశాడు. అవి వచ్చి నా కంటికి తగిలాయి. బాధ తట్టుకోలేక ఏడ్చేశా.
తేనేటీగలు కుట్టాయి వారం రోజుల్లో మా అక్క పెళ్లి. నేను, తనూ కలిసి పొలానికి వెళ్లాం. తను తేనె కావాలంటే తేనె తుట్టెను రాయితో కొట్టా. ఆ తేనెటీగలు వచ్చి అక్కనూ నన్నూ కుట్టాయి. అక్కకు నోటి దగ్గర కుట్టాయి. ఇంటికి వెళ్లాం. నేను చేసిన పనికి నాన్న చేతుల్లో నాకు పడిన దెబ్బలు ఇప్పటికీ గుర్తే.

-ప్రమీల పుట్టిగారి

Hero Gopichand

మా కోసం నాన్న స్కూలే పెట్టారు
‘కష్టం తెలిసిన మనిషి… కసితో పెరిగినవాడు గోపీచంద్‌’.

మా కోసం నాన్న స్కూలే పెట్టారు

- దర్శకుడు పూరి జగన్నాథ్‌.

ఈ మాటలు చాలు గోపీచంద్‌ జీవితం… అతనెదుర్కొన్న కష్టాలు… అనుభవించిన బాధలు చెప్పడానికి… ఎనిమిదేళ్ల వయసులోనే తన తండ్రిని కోల్పోయాడు గోపీచంద్‌. ఆ తర్వాత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు. సినిమాలే వద్దనుకున్న అతను అన్నయ్య మరణంతో ఇటువైపు అడుగులేశాడు. ప్రతినాయకుడిగా, నాయకుడిగా ప్రత్యేకమైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించాడు. తన తండ్రి, దర్శకుడు టి.కృష్ణ పేరును నిలబెట్టే తనయుడనిపించుకున్నాడు. నాన్న తమ కోసమే ఏర్పాటుచేసిన స్కూల్‌… రష్యాలో పార్ట్‌టైం ఉద్యోగం, శ్రీకాంత్‌తో బంధుత్వం, ప్రభాస్‌తో స్నేహం… ఇలా అనేక  విషయాలు ‘హాయ్‌’తో పంచుకున్నాడు.
* మీ బాల్యం ఎలా గడిచింది? ఎక్కడ చదువుకున్నారు?
పుట్టింది నేను టంగుటూరు పక్కన, కాకుటూరువారి పాలెంలో. మా తాతయ్య పొగాకు వ్యాపారం చేసేవారు. నాన్నదీ అదే ఊరు. అక్కడే పెళ్లి చేసుకొని, తాతయ్యలాగే పొగాకు ఎగుమతి వ్యాపారం చూసుకొనేవారట. తర్వాత సినిమాలపై ఆసక్తితో చెన్నై వెళ్లారు. దాంతో మమ్మల్ని చదువు కోసం ఎక్కడ చేర్పించాలా అని చాలాచోట్ల ఆరా తీశారు. చెన్నైలో ఎక్కడా నచ్చకపోవడంతో మా కోసమని ఒంగోలులో నిల్‌ డిస్పరాండమ్‌ పేరుతో ఓ స్కూల్‌ పెట్టారు. చెన్నై నుంచి డి.కోమలం అనే ప్రిన్సిపాల్‌నీ తీసుకొచ్చారు. నిల్‌ డిస్పరాండమ్‌ అనేది ఫ్రెంచ్‌ పదం. నిరాశపడొద్దు అనేది దానర్థం. ఒంగోలు, టంగుటూరు చుట్టుపక్కలున్న నాన్నగారి స్నేహితుల పిల్లలు, మిగతావాళ్లు ఆ స్కూల్‌లో చదువుకొనేవాళ్లు. స్కూల్‌తో పాటు, హాస్టల్‌ ఉండేది. నేను, మా అన్నయ్య, మా చెల్లెలు.. ముగ్గురం అక్కడే చదువుకొన్నాం. ఆ జీవితమే వేరుగా ఉండేది. మూడో తరగతి అయ్యాక, నాన్న ‘నేటి భారతం’ తీశారు. తర్వాత చెన్నై వెళ్లాం. అక్కడ రామకృష్ణ మిషన్‌ స్కూల్‌లో మా చదువు సాగింది. అక్కడి నుంచే నేను రష్యా వెళ్లా. మా చెల్లెలు బీడీఎస్‌ చేసింది. మా నాన్న ఏర్పాటు చేసిన నిల్‌ డిస్పరాండమ్‌ స్కూల్‌ ఇప్పుడూ ఉంది. నాన్న స్నేహితులు ఆ స్కూల్‌ని నిర్వహిస్తున్నారు.
* సినిమాల్లో నటించాలనే కోరిక ఎప్పుడు పుట్టింది?
నాకైతే ఆ ఆలోచనే ఉండేది కాదు. చదువు అవ్వగానే వ్యాపారం చేయాలనుండేది. మా అన్నయ్య ప్రేమ్‌చంద్‌ నాన్నబాటలోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. నాన్న పేరు నిలబెట్టేందుకు అన్నయ్య ఉన్నాడు కదా అనుకొనేవాణ్ని. దాంతో నా ఆలోచనలు చదువుపైనే ఉండేవి. కానీ మా అన్నయ్య అనుకోకుండా ఓ ప్రమాదంలో చనిపోయారు. దాంతో సినిమా రంగంలో ఎవరో ఒకరు ఉండాలనుకొన్నాం, నాన్న పేరు నిలబెట్టాలనుకొన్నాం కదా అనే ఆలోచన వచ్చింది. అప్పుడే నేను సినిమా రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నా. అదే విషయాన్ని మా నాన్నకి మంచి మిత్రుడు, నాకు చిన్నప్పట్నుంచి తెలిసిన నాగేశ్వరరావు మావయ్యకి చెప్పా. అన్నయ్యకి అలా జరిగింది కదా, మళ్లీ నువ్వెందుకని ఆయన భయపడ్డారు. అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారి దగ్గరికి వెళితే, నన్ను చూసి ‘బాగున్నాడు కదా, సినిమా చేద్దాం’ అన్నారు. దాంతో మా నాన్నకి స్నేహితులైన నాగేశ్వరరావు, తిరుపతిరావు, హనుమంతరావు కలిసి నాతో ‘తొలివలపు’ నిర్మించారు. అన్నయ్య మరణం తర్వాత కుటుంబమంతా అండగా నిలిచింది. నేను నటుడిగా నిలదొక్కుకున్నా. చెల్లెలికి పెళ్లి చేశాం.
* శ్రీకాంత్‌, మీరూ బంధువులయ్యారు కదా. అప్పటికీ, ఇప్పటికీ మీ మధ్య అనుబంధంలో మార్పులేమైనా వచ్చాయా?
తొలి సినిమా కోసం హైదరాబాద్‌ వచ్చినప్పట్నుంచే నాకు శ్రీకాంత్‌గారు తెలుసు. ముత్యాల సుబ్బయ్యని కలవడానికి వెళ్లినప్పుడు రామానాయుడు స్టూడియోలో శ్రీకాంత్‌గారు పరిచయమయ్యారు. తన గురించి అప్పటిదాకా వినడమే. ఆ పరిచయం తర్వాత తెలిసింది ఆయన ఎంత మంచి వ్యక్తో. లోపల ఒకటి పెట్టుకొని బయటికి మరొకలా మాట్లాడే రకం కాదు. ఆయన బంధువు కాకముందు ఎలా ఉండేవారో, ఇప్పుడు కూడా అంతే. మార్పేమీ లేదు. కాకపోతే ఇప్పుడు బంధువులం కాబట్టి ఎక్కువగా కలుస్తుంటాం. శ్రీకాంత్‌ సోదరి కూతురే నా భార్య రేష్మ. ఇంట్లో నాకూ, రేష్మకీ మధ్య సినిమాకి సంబంధించిన చర్చలు తక్కువే. కలిసి బాగా సినిమాలు చూస్తుంటాం, తను సెట్‌కి తరచుగా వస్తుంటుంది. అయితే సినిమా గురించి మరీ లోతుగా తెలియదు. నా సినిమాలో ఏది బాగుందో, ఏది బాగోలేదో చెబుతుంటుందంతే.
* మీరు విదేశాల్లో చదువుకుంటున్నప్పుడు డబ్బుకి ఇబ్బంది పడిన రోజులేమైనా ఉన్నాయా?
డబ్బుకి లోటుండేది కాదు కానీ… ప్రతిసారీ ఇంటి నుంచి డబ్బు తెప్పించుకోవడం సరైంది కాదనిపించేది. మాదాల రంగారావుగారి అబ్బాయిలు రష్యాలో ఉంటూ వ్యాపారం చేసేవాళ్లు. వాళ్ల దగ్గరే పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తూ నా ఖర్చులకి సరిపడేలా డబ్బు సంపాదించేవాడిని. రంగారావుగారి అబ్బాయిలు నన్ను చాలా బాగా చూసుకొనేవాళ్లు.
* మీ అబ్బాయి విరాట్‌కృష్ణ ఏం చేస్తున్నాడు?
వాడికి యాక్షన్‌ సినిమాలంటే బాగా ఇష్టం. ఎప్పుడూ నా సినిమాల్ని చూస్తూ, అలా ఫైట్లు చేయాలని ప్రయత్నిస్తుంటాడు. నువ్వు అక్కడ అలా కొట్టావు కదా, నేను కూడా నిన్ను కొడతా అంటూ నాపైనే ప్రయోగాలు చేస్తుంటాడు. ‘అది సినిమా నాన్నా.. బయట  అలా చేయకూడదు’ అని చెబుతుంటా (నవ్వుతూ). వాడితో గడుపుతున్నంతసేపూ సమయమే గుర్తుకు రాదు. బయట ఎన్ని ఒత్తిళ్లున్నా ఇంటికెళ్లాక వాడితో ఆడుకుంటే అంతా ప్రశాంతంగా ఉంటుంది.

ఒక్క సినిమా తప్ప…కథ విన్నప్పుడు ఒక నమ్మకం ఏర్పడుతుంది. సినిమా చేసేటప్పుడు మరొక రకమైన నమ్మకం కలుగుతుంది. ఇక డబ్బింగ్‌ థియేటర్లో సినిమా భవితవ్యం దాదాపు తెలిసిపోతుంటుంది. నేను చేసిన సినిమాల్లో ఒక్కటి తప్ప, అన్నీ నేను ఊహించినట్టే ఫలితాలు తీసుకొచ్చాయి. ఆ ఒక్క సినిమా ‘గౌతమ్‌ నందా’. అది ఆడకపోవడానికి వేరే కారణాలున్నాయి.
నేను నాలాగే ఉంటా‘‘చిన్నప్పట్నుంచీ నేను సిగ్గరిని. అది ఎప్పటికీ పోదు. కొద్దిమంది చాలా కలుపుగోలుగా మాట్లాడుతుంటారు. నా దృష్టిలో అదొక కళ. నాలాంటి వాళ్లు అలా ఉండటానికి ప్రయత్నించారనుకో, నటిస్తున్నట్టే ఉంటుంది తప్ప సహజంగా ఉండదు. అందుకే నేను నాలాగే ఉంటా. ఎదుటివాళ్లతో చనువు ఏర్పడేంతవరకు కాస్త బెరుగ్గానే ఉంటుంది. చనువు  ఏర్పడిందంటే ఇక వాళ్లతో మాట్లాడుతూనే ఉంటా.  కథానాయికలతో కూడా ఒకట్రెండు రోజుల్లో కలిసిపోతుంటా.
కావాల్సింది కథే..‘‘నేను దర్శకుడిని నమ్ముతా. అదీ కథ చెప్పాకే. చివరికి నాకు కావల్సింది కథే. ఎవర్నయినా ఆ కథే తీసుకెళుతుంది. ‘నువ్వు కథలు మరీ ఎక్కువ అడుగుతుంటావ’ని అంటుంటారు. ఈ రోజు అడగటం వల్ల ఎదుటివాళ్లు ఫీల్‌ అయితే అవ్వొచ్చు. రేపు అతణ్ని, నన్నూ కాపాడేది ఆ కథే కదా! ఒక్కసారి కథ ఒప్పుకొన్నాక, కథ చదివేసుకొన్నాక సెట్లో దర్శకుడితో స్క్రిప్టు గురించి కానీ, సన్నివేశాల గురించి కానీ మళ్లీ మాట్లాడను. దర్శకుడు ఏం చెబితే అది చేసుకుంటూ వెళ్లిపోతుంటా. ఏ విషయంలోనూ జోక్యం చేసుకోను. నాతో సినిమా చేసే దర్శకుడికి అంత స్వేచ్ఛ ఉంటుంది. వాళ్లకీ తీస్తున్న సినిమా జీవితంతో సమానం కదా. అందుకే వాళ్లు ప్రాణం పెట్టి పనిచేస్తారు’’.
రోజు సరిపోదు‘‘చిత్రీకరణ లేని రోజులంటే ఖాళీ అనే అనుకుంటారంతా. కానీ నాకు ఆ రోజు ఏ మాత్రం సరిపోదు. నాకు సంబంధించిన పనుల్ని స్వయంగా చేసుకోవడమే మొదట్నుంచీ అలవాటు. ఒకరిపై ఆధారపడటం ఇష్టం ఉండదు. ఈ రోజు నేను ఆధారపడటం మొదలుపెట్టానంటే రేపన్న రోజున నాకేమీ తెలిసే అవకాశం ఉండదు. అసలు మన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాదు. అందుకే వీలైనంతవరకు నా పనుల్ని నేనే చూసుకుంటా. నేను చేయలేనివి ఒకట్రెండు పనులేమైనా ఉంటే పక్కవాళ్లకి చెబుతుంటా’’.
ప్రభాస్‌ నేనూ కలిస్తే…‘‘చిత్ర పరిశ్రమలో నాకు బాగా సన్నిహిత మిత్రుడంటే ప్రభాసే. తనకీ నాలాగా సిగ్గు ఎక్కువ. కానీ ప్రభాస్‌ నాకంటే బాగా మాట్లాడతాడు. మేం స్నేహితులం కాబట్టి ఎప్పుడూ కలుస్తూనే ఉంటారనుకుంటారు. మేం కలవడానికి ఒక్కోసారి నెల పట్టొచ్చు, నాలుగు నెలలు పట్టొచ్చు. ఎక్కువగా ఫోన్‌లోనే మాట్లాడుకుంటాం. మా ఇద్దరికీ కుదిరిన రోజు, కలిసి కూర్చున్నామంటే ఇక సమయం తెలియదు. ఒకొక్కసారి రాత్రి మొత్తం గడిచిపోతుంటుంది. మా మధ్య కబుర్లు ఎక్కువగా సినిమాల గురించే. తను ట్రూ హార్టెడ్‌ పర్సన్‌. నేను మొదటిసారి తనని చూసింది వాళ్ల ఆఫీసులో. జూబ్లీహిల్స్‌ క్లబ్‌కి  ఎదురుగా కృష్ణంరాజుగారి ఆఫీసు ఉండేది. ‘తొలివలపు’ ఫ్లాప్‌ అయ్యాక అక్కడికి వెళితే ప్రభాస్‌ కనిపించాడు. చూడగానే పెద్ద హీరో అవుతాడనిపించింది. అప్పుడే మేం స్నేహితులం అయ్యాం కానీ, ‘వర్షం’ సినిమాతో మా మధ్య అనుబంధం పెరిగింది. మా ఇద్దరికీ మళ్లీ కలిసి సినిమా చేయాలని ఉంది కానీ.. అందుకు తగ్గ కథ కుదరాలి కదా’’.
ఆ రుచి దేనికుంది?‘‘కొత్త కొత్త రుచులంటూ రెస్టారెంట్లకి వెళ్లి ఏవేవో ఆర్డర్‌ చేస్తాం. కానీ అక్కడ ఎన్ని తిన్నా… ఇంటికొచ్చి పప్పులో మామిడికాయ పచ్చడి, నెయ్యి వేసుకొని తిన్నంత రుచి దేనికైనా వస్తుందా? అందుకే ఇంటికి రాగానే అమ్మతో అవన్నీ పెట్టించుకొని తినాల్సిందే, కడుపు నింపుకోవల్సిందే. అలా ఎప్పటికైనా మన సంస్కృతి విలువేంటో తెలుసుకోవల్సిందే, తిరిగిరావల్సిందే. మన సంస్కృతి సంప్రదాయాలు గొప్పవి. విదేశాల్లోనూ మన భారతీయత గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. మనం మాత్రం పాశ్చాత్య సంస్కృతి మాయలో పడి మన గొప్పతనాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. కొంతమందికి తెలిసొస్తోంది ఆ విలువేంటో’’.
* మీ నాన్న టి.కృష్ణ కమ్యూనిజం భావాలతో సినిమాలు చేశారు కదా. ఆయన ప్రభావం మీపై ఎంత వరకు ఉంటుంది?
నిజంగా కమ్యూనిజం గురించి నాకు లోతుగా తెలియదు. ఇప్పటికీ కమ్యూనిజం గురించి నాకు నేను అనుకొనేదొక్కటే. ప్రతి ఒక్కరూ సమానమే అని. ఉన్నవాడి దగ్గర ఒకలాగా, లేనివాడి దగ్గర ఒకలాగా ఉండటం, ఒకొక్కరితో ఒకలాగా మాట్లాడటం నాకు నచ్చదు. నాన్నని చూసి నేర్చుకొన్నదంటే అదే. డబ్బు ఈ రోజు వస్తుంది, రేపు పోతుంది. మనుషులు అలా కాదు, ఉన్నవాళ్లని వదులుకోకూడదు.
* నాన్న బాటలో దర్శకత్వం వైపు వెళ్లాలని ఎప్పుడూ అనిపించలేదా?
దర్శకత్వం అంటే చాలా కష్టమైన పని. అన్ని క్రాఫ్ట్‌లతోపాటు, భాషపైనా పట్టుండాలి. నాకు అంత లేదని తెలుసు. దర్శకత్వంతో పోలిస్తే నటనే సులభం అనిపించింది. అందుకే అటువైపు వెళ్లే ఆలోచన చేయలేదు. మా అన్నయ్య దర్శకుడు కావాలనుకున్నారు. ఆ ప్రయత్నాల్లో ఉండగానే ఆయన చనిపోయారు. అప్పటికి నేను రష్యాలో ఉన్నా. వీసా సమస్యలతో ఆయన్ని చివరిచూపూ చూడలేకపోయా. అన్నయ్య మరణం నన్ను బాగా కుంగదీసింది. నెల రోజులు కాలేజీకి కూడా వెళ్లలేదు. ఇప్పటికీ మా అన్నయ్యని  చాలా చాలా మిస్‌ అవుతుంటా. మేమిద్దరం స్నేహితుల్లాగే ఉండేవాళ్లం. నాకూ తనకీ మధ్య రెండేళ్ల వయసే తేడా. నా తర్వాత చెల్లి. నన్ను స్కూల్‌కి తన సైకిల్‌మీదే తీసుకెళ్లేవాడు అన్నయ్య. తన స్నేహితులంతా నాకూ స్నేహితులే.

Actor Mohanlal

…నేను నేర్చుకున్నది అదే
...నేను నేర్చుకున్నది అదే

గుర్తుందా? అప్పుడు ‘యోధ’ సినిమాలో ‘అక్కసోటో’ అని ముద్దుముద్దుగా పిలిపించుకున్న నటుడు… ఇప్పుడు ‘జనతాగ్యారేజీ’లో, మన్యంపులిలో నట విశ్వరూపం చూపిస్తూ ‘ది కంప్లీట్‌ మేన్‌’ అయ్యారు. అయినా మోహన్‌లాల్‌ ఊరికే కంప్లీట్‌ మ్యాన్‌ అవ్వలేదు. ఖాళీ దొరికితే సేవచేస్తారు. తీరిక దొరికి మనసు స్పందిస్తే అనేక విషయాలపై అలవోకగా బ్లాగులు రాస్తారు. నటనకోసం పదేళ్లు నేర్చుకోవాల్సిన కథాకళిని ప్రాణాలన్నీ పెట్టి నెలరోజుల్లోనే నేర్చుకున్నారు. అదీ ఆయన సత్తా… ‘హాయ్‌’ అంటూ మాట కలిపితే  ఎన్నో విషయాలపై మనసువిప్పారు…
* వైఫల్యాలు లేకుండా సినీజీవితం, సవాళ్లు లేకుండా జీవితం ఉండవు కదా! మరి మీ జీవితంలో గెలుపుఓటములని ఎలా ఎదుర్కొన్నారు?
హ్హ..హ్హ మొదటే ఇంత కఠినమైన ప్రశ్నా? నాది నలభై ఒక్క సంవత్సరాల సినీ జీవితం. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో వృత్తిపరంగా ఎన్నో విజయాలు చూశాను. అలాగే వైఫల్యాలని కూడా. అయితే ఒకమాట, వైఫల్యాలని  ఎదుర్కోవడం, విజయాలని ఆస్వాదించడంలోనూ ఒకటే తీరునాది. విజయం కోసం మరీ ఎక్కువగా పరితపించిపోను. అలాగని గెలుపు వచ్చినప్పుడు అంతా నావల్లే అనుకోను. అథ]ఃపాతాళంలో ఉన్నప్పుడూ, గెలుపు పలకరించినప్పుడు నాది ఒకటే తీరు. ఈ అలవాటు ఇప్పటిదికాదు. సినీ జీవితంలో అడుగుపెట్టినప్పుడే నేర్చుకున్నాను. కానీ ఒక సినిమా 365 రోజులు ఆడాలని చాలా బలంగా  అనుకుంటాను.
* మీరు సినిమాల్లోకి వచ్చి నలభై సంవత్సరాలవుతుంది కదా.. వందల సినిమాల కోసం పనిచేశారు. ఈ ప్రయాణంలో ఎలాంటి మార్పులని గమనించారు? ...నేను నేర్చుకున్నది అదే
నేను గమనించిన అతిపెద్ద మార్పు సాంకేతిక విప్లవమే. దాని కారణంగానే సినీ నిర్మాణంలో ఊహించని విధంగా గొప్ప సినిమాలు వచ్చి చరిత్ర సృష్టించాయి.  అక్కినేని,  శివాజిగణేశన్‌, రాజ్‌కుమార్‌ వంటి వాళ్లతో పనిచేయడం గొప్ప అనుభవం. వాళ్ల వల్లే నేనింతటి వాడిని అయ్యానేమో! అంకిత భావంతోనే పెద్ద బడ్జెట్‌ సినిమాలని నిర్మించాం. అలాంటి సినిమాలు తీయగలమని అనుకోలేదు.  మలయాళం సినిమా ఎదుగుతోంది. తెలుగు, తమిళ సినిమాలు ఎదుగుతున్నట్టుగానే. చక్కని ఎక్స్‌పోజర్‌ అందుతోంది. గతంతో పోలిస్తే ప్రింట్‌, సోషల్‌ మీడియా నటీనటులకి పెద్ద బలంగా మారాయి. సినిమాలని విస్తృతంగా ప్రచారం చేసుకోడానికి ఉపయోగపడుతున్నాయి.
* ‘యోధ’ మొదలుకుని ‘ఒడియన్‌’ వరకూ నటుడిగా కొన్ని తరాల వారిని మీరు ప్రభావితం చేశారు కదా! ఇప్పటి తరం నటులకు ఏం చెబుతారు?
నా జీవితంలో ఎంతో మంది లెజెండ్స్‌ని చూశాను. వాళ్ల కమిట్‌మెంట్‌నీ దగ్గరగా చూశాను. పరిశ్రమని వాళ్లు గౌరవించే విధానం కూడా చూశాను. మనం ఎదగడం ఎంత ముఖ్యమో ఎదుటివారిని గుర్తించి, గౌరవించడం కూడా అంతే ముఖ్యం అని వాళ్ల నుంచే నేర్చుకున్నాను. ‘మైండ్‌ ఫుల్‌నెస్‌’ అనేపదం బాగా నచ్చుతుంది. నా హృదయానికి దగ్గరగా ఉండే పదం అది. ఒక్క నటనలోనే కాదు జీవితంలోనూ అది చాలా అవసరం.
* అక్కినేని నాగేశ్వరరావువంటి  మహా నటులతో చేశారు. వారి నుంచి మీరు ఏం గ్రహించారు?
వాళ్ల నుంచి ప్రేమించడం నేర్చుకున్నాను. అలాగే హస్యచతురత కూడా. వాళ్లతో దగ్గరగా పనిచేసే వాళ్లకు మాత్రమే ఈ విషయాలు తెలుస్తాయేమో! నాకా అదృష్టం దక్కింది. చాలా నిరాండంబరంగా డౌన్‌టు ఎర్త్‌గా ఉండే వ్యక్తి ఆయన. వాళ్లలో వృత్తిపట్ల నిబద్ధతని గమనించాను. ఇక్కడా నేనా మైండ్‌ఫుల్‌నెస్‌ని గమనించాను. హృదయపూర్వకంగా పనిచేయడం ఎలానో నేర్చుకున్నాను. నేను తర్వాత తరానికి కూడా అలాగే ఉండమని చెబుతాను.
* మైండ్‌ఫుల్‌నెస్‌ అనే పదం ఎక్కువగా వాడుతున్నారు. మీరు జీవితాన్ని ఆధ్యాత్మికంగా చూస్తారా?
ఆధ్యాత్మికత అనేపదాన్ని, జీవితాన్ని వేర్వేరుగా చూడాల్సిన అవసరం లేదు. మీరు చేసే డ్యాన్స్‌లో, పాడుతున్నప్పుడు, అన్నింటిలోనూ ఆ ఆధ్యాత్మికత ఉంటుంది. ఇక్కడా నేను ఆ మైండ్‌ఫుల్‌నెస్‌ అనే విధానాన్నే పాటిస్తాను. సింపుల్‌గా చెప్పాలంటే చేసే ప్రతి పనిలోనూ ఆధ్యాత్మికత ఉంటుంది. దాన్నే మనసా, వాచా, కర్మణా ఆచరించడం అనుకుందాం. దాన్నర్థం చేసుకుంటే జీవితంలో విజయాలు సాధారణ విషయాలవుతాయి.

...నేను నేర్చుకున్నది అదే
* మీ అబ్బాయి గురించి..?
మా అబ్బాయి ప్రణవ్‌ ఆస్ట్రేలియాలో ఫిలాసఫీలో డిగ్రీ పూర్తి చేశాడు. మా సొంత నిర్మాణ సంస్థనే చూసుకుంటున్నాడు. డైరెక్షన్‌ అంటే ఇష్టం. అందుకే మొదట దర్శకత్వ శాఖలో శిక్షణ పొందాడు. కొన్ని చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రియదర్శన్‌ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు.
* దక్షిణాదిన వస్తున్న చిత్రాల్లో బడ్జెట్‌పరంగా, సాంకేతికంగా ఉన్నతంగా ఉంటున్నాయి కానీ… కథ, కథనాల పరంగా ఉన్నతంగా ఉండటం లేదని ఓ విమర్శ ఉంది. అది నిజమేనా?
నా కొత్త సినిమా ‘ఓడియన్‌’ తీసుకోండి. అది పెద్ద బడ్జెట్‌ చిత్రం. అందులో సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలు పాటించాం. అలాని నేలవిడిచి సాము చేయలేదే. కుటుంబం, విలువలు, స్థానికత వంటి విషయాలకే పెద్ద పీట వేశాం. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని దాంతోనే అద్భుతాలు చేయాలని అనుకోలేదు. ఒక సినిమాకి ఈ రెండూ సమపాళ్లలో ఉంటేనే విజయం సాధిస్తుంది. ఇప్పుడొస్తున్న కొన్ని చిత్రాలు అలా ఉన్నమాట నిజమైనా ఒక మంచి పాట, మంచి సంగీతం, మంచి సన్నివేశం… అన్నిటికీ మించి పట్టి నిలిపేసే ఎమోషన్‌ చిత్రానికి ప్రాణప్రదాలే. రెండున్నర గంటలు పాఠకుడిని కట్టిపడేయడం పక్కా స్క్రీన్‌ప్లేతోనే సాధ్యం. అయితే ఇప్పుడు అన్ని సాంకేతిక హంగులను వాడుకుంటూనే చాలా మంచి సినిమాలు వస్తున్నాయి. తమిళ, మలయాళ, తెలుగు చిత్రాల్లో ఎన్నో గొప్పవి ఉంటున్నాయి.
* కష్టం అనిపించిన పాత్ర ఏదైనా ఉందా?
ఏది కష్టం అనిపించలేదు. శారీరకంగా కష్టమనిపించినవి ఉన్నాయి కానీ… నటనాపరంగా కష్టం అనిపించనవి అయితే లేవు.
* డ్రీమ్‌రోల్‌?
లేదు.
* వానప్రస్థం సినిమాలో కఠినతరమైన కథాకళిని నెలరోజుల్లో నేర్చుకున్నారు కదా! కష్టం అనిపించలేదా? ఏళ్లు తరబడి సాధన చేయాల్సిన నాట్యాన్ని అంత తక్కువ రోజుల్లో ఎలా నేర్చుకున్నారు?
సినిమాలో ఆ పాత్ర డిమాండ్‌ చేసినప్పుడు అదెంత కష్టం అనే విషయాన్ని నేను ఆలోచించలేదు. ఆ పాత్రకు న్యాయం చేయాలంటే చేయక తప్పనిసరి పరిస్థితి.
* వానప్రస్థంలో మీ నటవిశ్వరూపం చూసిన  ఓ విదేశీ నటుడు మీరు ఏ అమెరికాలోనో, యూరోప్‌లోనో పుడితే ఆస్కార్లన్నీ ఇతనికే సొంతమయ్యేవి అన్నారట. నిజమేనా?
పొగడ్త నిజమే. కానీ నాకు ఈ దేశంలో పుట్టడం, ఇక్కడ నటుడిగా రాణించడం మాత్రమే ఇష్టం.   తక్కినవన్నీ నాకనవసరం
* మీటూ గురించి ఏం చెబుతారు?
చెప్పడానికేం లేదు.

లాల్‌స్టోర్‌అభిమాన నటుడి సంతకం, అతని ముఖచిత్రంతో ముద్రించిన టీషర్టు, ఆయన ఇష్టంగా చెప్పిన ఊసులు, ఆయన వేసుకున్న దుస్తులు, ఆయనపై రాసిన పుస్తకాలంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఆ అభిమానం వృథాపోకుండా ‘లాల్‌స్టోర్‌’ అనే ఈకామర్స్‌ సైట్‌ ద్వారా అభిమానుల ద్వారా అందించిన సొమ్ముని సేవకార్యక్రమాలకు మళ్లిస్తున్నారు మోహన్‌లాల్‌. ఆయనపై రాసిన పుస్తకాలని ఈ సైట్‌లో కొనుగోలు చేయొచ్చు.
...నేను నేర్చుకున్నది అదేదృశ్యం చిత్రాన్నే చూడండి. మా ప్రొడక్షన్‌లో మలయాళంలో తీశాం. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా ఇది రీమేక్‌ చేశారు. ప్రతి భాషలోనూ ఇది విజయవంతమైంది. దానికి కారణం ఈ చిత్రంలో ఉన్న విషయం. సింహళ భాషలో అనువదించి దీన్ని శ్రీలంకలో విడుదల చేస్తే అక్కడా మంచి విజయం సాధించింది. హిందీలో అజయ్‌దేవగన్‌, తమిళంలో కమల్‌, తెలుగులో వెంకటేష్‌ చేశారు. ప్రతి వాళ్లూ ఆ పాత్రకు న్యాయం చేశారు.


ఇప్పుడొస్తున్న కుర్రాళ్లనే చూడండి. ప్రతివాళ్లూ వాళ్ల ప్రత్యేకత చూపడానికి ప్రయత్నిస్తున్నారు. తెలుగులో నేను జూనియర్‌ ఎన్టీఆర్‌తో ఒక చిత్రం చేశాను. ఆయన ఎప్పుడూ వంద శాతం ప్రతిభ చూపడానికి ప్రయత్నిస్తారు.


ఒకప్పుడు నాకు సంగీతం అంటే ప్రత్యేకమైన ఆసక్తి. ఆ ఆసక్తితోనే ‘లాలిజమ్‌’ అనే మ్యూజిక్‌ బ్యాండ్‌ నిర్వహించేవాడిని.


కొన్నాళ్లు కేరళలో అవయవదానానికి గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా పనిచేశాను. నేను కూడా నా కళ్లను దానం చేశాను.


నాకు రాత అంటే ఇష్టం. బ్లాగులు రాయడం అంటే చాలా ఇష్టం. ఐదేరాళ్లుగా బ్లాగులు రాస్తున్నాను. ట్రావెలాగ్స్‌ని ఇష్టంగా రాస్తాను. ‘యాత్ర’ పేరుతో రాస్తున్నాను.


నా పనిని నేను ఇష్టపడుతూ ఎంజాయ్‌ చేస్తూ పనిచేస్తాను. అదే నాకు ఇంధనం. ఆ ఇష్టం పోతే నేను ఆ పనిని ఆపేస్తాను.


నాది మీలాంటి జీవితమే. మీరేం చేస్తారో నేనూ అదే చేస్తాను. నేనో సెలబ్రిటీని కాబట్టి దానికి  తగ్గట్టుగా ఉండాలని అనుకోను.


...నేను నేర్చుకున్నది అదే
దర్శకుడు చెప్పింది చేయడం.. నటుడిగా  వంద శాతం ఇవ్వడం, ఆ చిత్రం విజయవంతమవడం అనేక ఇతర విషయాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే విజయం రావాలని కోరుకుంటానుగానీ, అపజయానికి కుంగిపోవడం ఉండదు.


కొత్తవాళ్లకయినా, పాతవాళ్లకయినా నేను చెప్పేదొకటే. వృత్తి విషయంలో మీకెంత అంకితభావం ఉందో ప్రశ్నించుకోండి.


నా సంతోషమే నా ఫిట్‌నెస్‌ రహస్యం.


డైరెక్టర్‌, నటుడికి మధ్య కమిట్‌మెంటే ఆ సినిమా భవిష్యత్తుని నిర్దేశిస్తుంది.

- శ్రీ సత్యవాణి గొర్లె, ఎం.రవికుమార్‌
- చిత్రాలు: సతీష్‌లాల్‌

cinema ‘Raitubidda’

c81d344a-2def-4ccd-8813-faf50d2c96f8

Director sujit

6a947878-cc79-4a47-9e2e-d14d63a2a503

Hero sampornesh

Heroine Sraddhakapoor (saaho)

50727805-9f5e-4e3a-a0e3-03623de510faheroine sraddha kapoor 2 heroine sraddhakapoor 1సల్మాన్‌కి నో చెప్పాను!
సాహో సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో శ్రద్ధాసక్తులతో ఎదురుచూస్తున్నారు. వాళ్ల ఆసక్తి ప్రభాస్‌ మీద అయితే… శ్రద్ధ మాత్రం శ్రద్ధా కపూర్‌ పైనే. ఈ బాలీవుడ్‌ ముద్దుగుమ్మ తొలిసారి ఓ తెలుగు సినిమాలో కనిపించబోతోంది. అందం, అభినయంతో ఉత్తరాదిలో ఇప్పటికే తనకంటూ ఒక ఇమేజ్‌ని సంపాదించుకున్న నటి శ్రద్ధ. సాహోలో ఆమె పాత్ర పోలీసు అధికారి అమృతా నాయర్‌ గురించి తెలుసుకునేముందు… శ్రద్ధ నిజ జీవిత పాత్ర గురించి తన మాటల్లోనే తెలుసుకుందామా!నాన్న శక్తి కపూర్‌… సినిమా ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు. అమ్మ శివాంగి… నటి, గాయని. లతా మంగేష్కర్‌కి దగ్గరి బంధువు. నేనూ చిన్నపుడు సంప్రదాయ సంగీతంలో శిక్షణ తీసుకున్నాను. చిన్నప్పట్నుంచీ సినిమా డైలాగులు చెప్పడం, పాటలకు డ్యాన్సులు చేయడం అలవాటైపోయింది. నాన్నతోపాటు షూటింగ్‌లకూ వెళ్లేదాన్ని. కానీ యాక్టింగ్‌ అంటే ఇష్టమైనా కూడా ఇంట్లో ఎప్పుడూ ఆ విషయం చెప్పలేదు. అమితాబ్‌ బచ్చన్‌, శ్రీదేవి, వహీదా రెహ్మాన్‌ నటులుగా నాకెంతో స్ఫూర్తి.  ఇవన్నీ కూడా నా సినిమా కలకు కారణమయ్యాయి. ఎక్కడ వద్దంటారోనని వాళ్లతో నా సినిమా ఇష్టాన్ని చెప్పేదాన్ని కాదు. నాకు పదహారేళ్లపుడు మా స్కూల్‌ నాటకంలో నన్ను చూసిన సల్మాన్‌ఖాన్‌ సినిమా ఆఫర్‌ ఇచ్చారు. కానీ నాకు అప్పుడు చదువుకోవాలని ఉండటంతో కాదనుకున్నాను. అమెరికాలోని బోస్టన్‌ యూనివర్సిటీలో సైకాలజీ చదవడానికి వెళ్లాను. ఫస్టియర్‌ పూర్తిచేసి వేసవి సెలవులకు ఇంటికి వచ్చాను. ఆ టైమ్‌లో ఫేస్‌బుక్‌లో నా ఫొటోలు చూసిన నిర్మాత అంబికా హిందుజా ‘తీన్‌ పత్తీ’లో చేస్తావా అని అడిగారు.
అమితాబ్‌, బెన్‌కింగ్స్‌లే, మాధవన్‌ ఆ సినిమాలో నటించారు. మంచి అవకాశం అనిపించింది. ఇంట్లో అప్పుడు చెప్పాను. నిజానికి నాది అందులో తక్కువ నిడివి ఉన్న పాత్ర. అయినా కథ నచ్చి చేశాను. కారణం ఏదైనా చదువు మధ్యలో వదిలేయకపోవడమే మంచిది. కాలేజీ రోజులు మన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికీ, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికీ మంచి అవకాశం. దాన్ని మిస్సవకూడదెవరూ.

అవకాశాలు వరసకట్టలేదు…
నేనెవరో తెలియకుండానే మొదటి సినిమాలో అవకాశం వచ్చింది. అందులో అమితాబ్‌తో కలిసి చేసినపుడు చాలా నెర్వస్‌గా ఫీలయ్యాను. కానీ ఆయన చాలా అభిమానంగా, హోమ్లీగా ఉంటూ నా భయాన్ని పోగొట్టారు. రెండో సినిమా యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ‘లవ్‌ కా ది ఎండ్‌’. దీనికి కూడా ఆడిషన్‌ చేశారు. ఈ రెండు సినిమాల తర్వాత కూడా ఆడిషన్స్‌ చేసి నన్ను తీసుకున్నవాళ్లు తిరిగి ఫోన్‌చేసి వద్దని చెప్పిన సందర్భాలున్నాయి. కుటుంబ నేపథ్యంకంటే కూడా మన సినిమాలు బాగా ఆడితేనే ఇక్కడ స్థానం, లేకుంటే కష్టం…
ఆ విషయం నాకు మొదట్లోనే అర్థమైంది. మూడో సినిమా ‘ఆషికీ 2’నే నా మొదటి సినిమా అనుకుంటారు చాలామంది.
యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌లో మూడు సినిమాలకు ఒప్పందం కుదిరింది. ‘లవ్‌ కా ది ఎండ్‌’ మొదటి సినిమా. అది అంతగా ఆడలేదు. తర్వాత ‘ఔరంగజేబ్‌’లో అవకాశం ఇచ్చారు. అదే టైమ్‌కి ‘ఆషికీ 2’ ఆఫర్‌ వచ్చింది.
ఈ కథ నాకు బాగా నచ్చడంతో ధైర్యంచేసి యశ్‌రాజ్‌… ఒప్పందం క్యాన్సిల్‌చేశాను. మోహిత్‌ సూరి దర్శకత్వంలో వచ్చిన ‘ఆషికీ 2’లో సింగర్‌గా కనిపించాను. సినిమా పెద్ద హిట్‌. అందులోని నా పాత్ర ‘ఆరోహీ’ పేరుతోనే నన్ను ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. తర్వాత మోహిత్‌ దర్శకత్వంలోనే ‘ఏక్‌ విలన్‌’లో చేశాను. అది కూడా మంచి హిట్‌. నా మొదటి రూ.100 కోట్ల సినిమా అది. కమర్షియల్‌ సినిమాల పరంగా ముందుకు వెళ్తుండగా ప్రయోగాత్మక చిత్రం ‘హైదర్‌’లో ఛాన్స్‌ వచ్చింది. ఆ సినిమా కూడా మంచి హిట్‌. తర్వాత ‘ఏబీసీడీ 2’… ఇలా వరస హిట్‌లు వచ్చాయి. అదే సమయంలో తర్వాత వచ్చిన ‘రాక్‌స్టార్‌ 2’, ‘ఓకే జానూ’ అంతగా ఆడలేదు. గతేడాది వచ్చిన ‘స్త్రీ’తో మరో హిట్‌ అందుకున్నాను. హిట్‌లు ఆనందించడానికీ, ఫ్లాప్‌లు చింతించడానికీ కాదూ, అన్నీ నేర్చుకోవడానికే అన్నది నా సిద్ధాంతం.

కథల ఎంపిక…
ఏదైనా కథ విన్నాక ఆ పాత్రని నేను చేస్తే బావుంటుందా లేదా అని మాత్రమే ఆలోచిస్తాను తప్ప ఈ సినిమా చేస్తే నాకేం వస్తుందనే కోణంలో ఆలోచించను. మొదట్లోకంటే ఇప్పుడు ఒక పాత్రని ఎంచుకోవడంలో ఇంకొన్ని ఎక్కువ ప్రశ్నలు వేసుకుంటున్నాను.  దర్శకుడు నా పాత్రని బాగా చూపిస్తాడా, సెట్‌లో ప్రతిరోజునీ ఆస్వాదించగలనా లేదా అని కూడా చూసుకుంటాను. ఎందుకంటే ఒక్కో సినిమా మూడు నెలల నుంచి ఏడాదిపాటు ఉంటుంది. ఇష్టంలేకపోతే చేయడం కష్టం. అందుకే మనస్ఫూర్తిగా ఓకే అనుకుంటేనే చేస్తానని చెబుతాను. ఎప్పటికప్పుడు వినూత్నమైన పాత్రలు చేయకపోతే ప్రేక్షకులకే కాదు, నటులకీ బోర్‌ కొట్టేస్తుంది.
ఆ కోణంలోనూ ఆలోచిస్తాను.

నాన్నే చూసుకుంటారు…
నేను ఒంటరిగా ఉండగలనేమోనని పరీక్షించుకోవడానికి కొన్నేళ్ల కిందట ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాను. ఒక నెలరోజులుండి చూద్దాం అనుకున్నాను. కానీ అది విమానాశ్రయానికి చాలా దగ్గరగా ఉండటంతో నిత్యం శబ్దాలతో నిద్ర పట్టేది కాదు. విషయం నాన్నకి తెలిసి వెంటనే జుహూలోని మా అపార్ట్‌మెంట్‌కి తీసుకువెళ్లారు. నెల అనుకున్నది వారం కూడా సాధ్యంకాలేదు. ఆర్థిక ప్రణాళికల్లో నేను ఇంకా పూర్‌. నా ఆర్థిక వ్యవహారాలన్నీ నాన్నే చూస్తారు. షాపింగ్‌ మాత్రమే నేను చేసుకుంటాను. మేం ఉంటున్న ఫ్లాట్‌కి పక్కనే సొంతంగా ఫ్లాట్‌ కొన్నాను. దాన్ని నా ఆఫీసులా ఉపయోగించుకుంటాను. ఫ్రెండ్స్‌తో భేటీలూ అక్కడే. భవిష్యత్తులో కూడా ఏం కొన్నా కొనకపోయినా స్థిరాస్తిలో మాత్రం పెట్టుబడి పెడతాను. ఇది నాన్న చూపిన బాట. ఆయన కూడా అందులోనే పెట్టుబడులు పెడుతూ వచ్చారు.

ఆయనతో సినిమా నా కోరిక
బాలీవుడ్‌లో ప్రముఖవ్యక్తుల నెట్‌వర్క్‌లో ఉంటేనే సినిమాలు వస్తాయని ప్రారంభంలో కొందరు సలహా ఇచ్చారు. కానీ అవసరం కోసం స్నేహాలు కలుపుకోవడం నాకు చేతకాదు. ‘ఏబీసీడీ 2’లో హిప్‌ హాప్‌ డాన్సర్‌గా చేశాను. అప్పుడే డాన్స్‌లో ఏబీసీడీలు నేర్చుకున్నాను. ‘హసీనా పార్కర్‌’ పాత్ర చేసినపుడు ఎనిమిది కిలోలు బరువు పెరగాల్సి వచ్చింది. వాళ్ల కుటుంబ సభ్యులతో కొద్దిరోజులు మాట్లాడాను. ఆమె గురించి చాలా చదివాను కూడా. ఏక్‌ విలన్‌, హైదర్‌,
ఏబీసీడీ 2, బాఘీ, రాక్‌ఆన్‌ 2, హాఫ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ సినిమాల్లో పాటలూ పాడాను. అలా నా సినిమా కోసం చేయగలిగిందంతా చేస్తాను. ప్రస్తుతం ఛిఛోరే, స్ట్రీట్‌ డ్యాన్సర్‌ సినిమాలు చేస్తున్నాను.
సినిమాల్లోకి వచ్చి దశాబ్దం కావొస్తోంది. ఇప్పటివరకూ జర్నీ బాగుంది. ఎన్నో భిన్నమైన పాత్రలు చేశాను.  ఛాలెంజింగ్‌గా అనిపిస్తే నెగెటివ్‌ పాత్ర చేయడానికైనా సిద్ధమే. సంజయ్‌ లీలా భన్సాలీ సినిమాలో చేయాలన్నదే ఇక్కడ నాకింకా తీరాల్సిన కోరిక. సినిమాలవల్ల కొన్నిసార్లు కుటుంబ సభ్యుల్నీ స్నేహితుల్నీ మిస్సవుతాను. నేను వర్కహాలిక్‌. పనిని ప్రేమిస్తాను. పనిలో పడితే మిగతా ప్రపంచాన్ని మర్చిపోతాను. అలాకాకుండా పనినీ, వ్యక్తిగత జీవితాన్నీ సమంగా బ్యాలెన్స్‌ చేసుకోవాలన్నది నా కోరిక, ప్రయత్నం.

సాహో… ఎందుకంటే…బాహుబలి ప్రభాస్‌ సరసన చేయడం, అదీ ప్రాధాన్యం ఉన్న పాత్ర దొరకడం, తెలుగు-హిందీ భాషల్లో చిత్రీకరించడంతోపాటు మరో రెండు దక్షిణాది భాషల్లోకి డబ్‌ కావడం… ఇవన్నీ ఒక్క సినిమాతో సాధ్యమవుతుంటే ఎవరు కాదంటారు.  దాదాపు రెండేళ్లపాటు సాహోతో ప్రయాణించాను. సెట్‌లో అడుగుపెట్టిన రోజునుంచే ఒక కుటుంబంతో ఉన్నట్టు ఫీలయ్యాను. ప్రభాస్‌ది చాలా కూల్‌ యాటిట్యూడ్‌. నిజాయతీగా, సరదాగా, స్నేహపూర్వకంగా ఉంటాడు. దర్శకుడూ, నిర్మాతలూ కూడా అంతే. దాదాపు సెట్‌లో ఉన్న ప్రతిరోజూ నాకు ఇంటి భోజనమే వచ్చేది.  నావల్ల ఎలాంటి ఆలస్యమూ, ఇబ్బంది ఉండకూడదని ప్రయత్నిస్తూ నాకిచ్చిన తెలుగు డైలాగుల్ని ఎంత కష్టమైనా కంఠతా చెప్పేసేదాన్ని. షూటింగ్‌ పూర్తయిన రోజున… ‘సినిమా అప్పుడే అయిపోయిందా’ అన్న భావన కలిగింది.  సినిమా రిలీజ్‌ దగ్గరపడుతున్నకొద్దీ నాకు టెన్షన్‌ పెరుగుతుంది, వణుకు మొదలవుతుంది. అవన్నీ ఓ చిరునవ్వు చాటున దాచేయాలని చూస్తానుకానీ కుదరదు. 24 గంటల ముందునుంచీ అమ్మని పట్టుకుని కూర్చుంటాను. ‘దేవుడా ఈ ఒక్కరోజునీ ఏదోలా ముందుకు నడిపించు, నన్ను గెలిపించు’ అని కోరుకుంటాను.
శాకాహారిగా మారిపోయా!స్కూల్‌ రోజుల్లో నవలలు బాగా చదివేదాన్ని. సినిమాల్లోకి వచ్చాక టైమ్‌ అంతగా దొరకడంలేదు. రెండేళ్లుగా మళ్లీ చదవడం ప్రారంభించాను. ఆ తర్వాత నా జీవనశైలిలో కొన్ని మార్పులు వచ్చాయి. వెజిటేరియన్‌గా మారాను.
* ఒకట్రెండు రోజులు టైమ్‌ దొరికితే ఇంట్లో ఉంటూ కుటుంబ సభ్యులూ, ఫ్రెండ్స్‌తో కాలక్షేపం చేస్తాను. సినిమాలు చూస్తాను.
* ఎప్పుడైనా బ్రేక్‌ తీసుకుని విహారానికి వెళ్తే రోజంతా హోటల్‌ రూమ్‌లోనే ఉండి… సాయంత్రాలు మాత్రమే బయటకు వెళ్తాను. అప్పటివరకూ హోటల్‌లో రకరకాల రుచుల్ని ఆస్వాదిస్తాను. ఎక్కడికి వెళ్లినా జ్ఞాపకంగా ఏదో ఒక వస్తువుని నాతోపాటు తెస్తాను.
* స్కూల్‌ రోజుల్లో ఒకబ్బాయిమీద క్రష్‌ ఉండేది. సినీ హీరోల్లో హృతిక్‌రోషన్‌ అంటే క్రష్‌. అది ఎప్పటికీ పోదేమో!
* ఇన్‌స్టాగ్రామ్‌లో నావి ఫ్యాషన్‌ ఫొటోలకంటే కూడా సాధారణమైన ఫొటోలే పెడతాను. అక్కడైనా నన్ను నేనో మామూలు వ్యక్తిగా చూసుకోవాలనుకుంటాను.
* పుకార్లని అస్సలు పట్టించుకోను.  ఎవరో ఏదో రాస్తారు, అవన్నీ పట్టించుకుని వాటికి తగ్గట్టు నన్ను మార్చుకోలేను.
* టొమాటో, పెరుగు మిశ్రమంతో ఫేస్‌ప్యాక్‌ చేయించుకుంటాను. ఇంట్లో కలబంద మొక్క ఉంది. తరచూ కలబంద గుజ్జు రాస్తాను. అవి నా చర్మానికి అద్భుతంగా పనిచేస్తాయి.
* అమ్మచేసే సంప్రదాయ మహారాష్ట్రియన్‌ ఫుడ్‌ బాగా ఇష్టం.
* పరిశ్రమలో వరుణ్‌ ధావన్‌, మోహిత్‌ సూరి, ఆదిత్య కపూర్‌… నాకు మంచి మిత్రులు.
* తనకంటూ ఒక గుర్తింపుతోపాటు మంచి వ్యక్తిత్వం ఉండే వ్యక్తినే పెళ్లిచేసుకుంటా. అది ఎప్పుడన్నది చెప్పలేను.
* నటిని కాకపోతే గాయనినయ్యేదాన్ని.

mytri movie makers producers naveen yerneti,y.ravisankar,mohan cherukuri

మా ‘మైత్రి’ హిట్టైంది!
శ్రీమంతుడు, జనతా గ్యారేజ్‌, రంగస్థలం లాంటి ఆల్‌టైమ్‌ హిట్‌ సినిమాల్ని నిర్మించిన సంస్థగా ‘మైత్రి మూవీ మేకర్‌్్స’కు టాలీవుడ్‌లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ‘మైత్రి’ బ్యానర్‌ సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలూ భారీగానే ఉండేలా స్వల్పవ్యవధిలోనే నమ్మకాన్ని సంపాదించింది. పేరులో స్నేహం ఉన్నట్టే ఈ నిర్మాణ సంస్థ వెనక ఉన్నది ముగ్గురు స్నేహితులు… వాళ్లే నవీన్‌ ఎర్నేటి, వై.రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి. తాజాగా ‘డియర్‌ కామ్రేడ్‌’తో మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్న ఆ ముగ్గురు మిత్రులు తమ సినిమా ప్రయాణం గురించి చెబుతున్నారిలా…

నవీన్‌: మా ముగ్గురిదీ విజయవాడ. చిన్ననాటి స్నేహితులం. దాదాపు ఒకటే వయసు. మా ముగ్గురి మధ్యనా మరో కామన్‌ విషయం సినిమా పిచ్చి. స్కూల్‌ రోజులనుంచీ సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్లం. కాస్త పెద్దయ్యాక రిలీజ్‌ సినిమాలు చూడ్డం అలవాటైంది. అలాగని చదువుని నిర్లక్ష్యం చేయలేదు. అది ఉంటేనే ఆటలు సాగుతాయని మాకు తెలుసు. ముగ్గురం వేర్వేరు చోట్ల ఇంజినీరింగ్‌ చేశాం. ఆ తర్వాత నేనూ, మోహన్‌ అమెరికా వెళ్లి ఐటీ రంగంలో స్థిరపడ్డాం. రవి హైదరాబాద్‌లో ఉంటూ  వ్యాపారం చేసేవాడు. తన స్నేహితుల్లో కొందరు సినీ నిర్మాణంలో ఉంటే వాళ్లతోపాటు కొన్నాళ్లు జర్నీ చేశాడు. మేం అమెరికాలో 2000 ప్రాంతంలో సొంత ఐటీ కంపెనీలు పెట్టాం. అవి విజయవంతంగా నడుస్తున్నాయి.
మోహన్‌: మేం ఎక్కడున్నా, ఏ పనిచేస్తున్నా సినిమాపైన ఆసక్తి మాత్రం మాతోపాటు కొనసాగుతూనే ఉండేది. ఓసారి మాటల మధ్యలో అమెరికాలో తెలుగు సినిమాల్ని డిస్ట్రిబ్యూషన్‌ చేయాలనే ఆలోచన మా మధ్య చర్చకు వచ్చింది. 2006లో ‘రాఖీ’తో డిస్ట్రిబ్యూషన్‌ని ప్రారంభించాం. 2017 వరకూ డిస్ట్రిబ్యూషన్‌లో ఉన్నాం. మేం పంపిణీ చేసినవాటిలో అరుంధతి, రోబో, దూకుడు, అత్తారింటికి దారేది… చాలా పెద్ద హిట్‌లు అయ్యాయి. తెలుగులో వచ్చిన ప్రతి సినిమానీ మేం డిస్ట్రిబ్యూట్‌ చేయలేదు. మాకు కథ నచ్చితేనో, హీరో-దర్శకుల కాంబినేషన్‌ బావుంటేనో ఎంపికచేసుకునేవాళ్లం. ఒక ప్రేక్షకుడిగా సినిమా అభిరుచి అక్కడ పనిచేసింది. సినిమా జయాపజయాల ప్రభావం ఎక్కువగా డిస్ట్రిబ్యూటర్‌పైనే ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్‌లో చేతులు కాల్చుకున్న వాళ్ల ఉదాహరణలు చాలా ఉన్నాయి. కానీ మేం అక్కడ లాభాలు పొందగలిగాం. కారణం కథల ఎంపికలో తీసుకున్న జాగ్రత్తలే. మేం సినిమాని తీసుకుని అమెరికాలోని వివిధ నగరాల్లో మళ్లీ విడివిడిగా అమ్మేసేవాళ్లం. దానిద్వారా సినిమా ఫలితానికి ముందే మా చేతికి డబ్బు వచ్చేది. కొన్ని నగరాల్లో మా దగ్గరే హక్కులు పెట్టుకునేవాళ్లం. అలా కూడా లాభాల్ని పొందగలిగేవాళ్లం.
రవి: డిస్ట్రిబ్యూషన్‌ అనుభవంతో సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాం. 2013 నుంచి కథ కోసం వేట మొదలుపెట్టాం. ఆ ప్రయత్నంలో కొరటాల శివగారిని కలిశాం. మహేష్‌బాబు గారితో ఆయన యూటీవీ మూవీస్‌కి ఒక సినిమా చేయాల్సి ఉంది. ఏవో కారణాలవల్ల ఆఖరి క్షణంలో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అదే ‘శ్రీమంతుడు’. శివగారు ఆ కథ మాకు వినిపించారు. బ్రహ్మాండంగా ఉందనిపించింది. మేం ఇండస్ట్రీకి కొత్త. మాతో సినిమా చేయడానికి మహేష్‌ ఏమంటారోనని చిన్న సందేహం ఉండేది. సినిమా గురించి మాట్లాడ్డానికి మేం ఆయన్ని రామోజీ ఫిల్మ్‌సిటీలో కలిశాం. తర్వాత చేయడానికి అంగీకరించారు. ఫిల్మ్‌సిటీ నుంచి జూబ్లీహిల్స్‌లోని మా ఆఫీసుకి వచ్చేంతవరకూ అది కలా నిజమా అన్నట్టు అనిపించింది. మహేష్‌ వెనక ఎంత మంది నిర్మాతలు క్యూలో ఉంటారో తెలియంది కాదు. దానికితోడు మేం దాదాపు ఏడాదిగా కథ కోసమే వెతికాం. అలాంటిది ఏకంగా మహేష్‌తోనే మొదటి సినిమా ఛాన్స్‌ వచ్చేసరికి లంకెబిందెలు దొరికినంత సంబరపడ్డాం. ఆ కథ మా దగ్గరికి రావడం, మహేష్‌ మాతో సినిమాకి అంగీకరించడం… ఇవన్నీ వారంరోజుల్లోనే జరిగిపోయాయి. డిస్ట్రిబ్యూషన్‌ అనుభవం, నిర్మాతల్లో ఎన్నారైలూ ఉండటంతో ఆయన మా గురించి సందేహించలేదు. డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నపుడూ మహేష్‌ని తరచూ కలిసేవాళ్లం. అలా ముందునుంచీ పరిచయం ఉండటంతో షూటింగ్‌ చాలా సాఫీగా సాగిపోయింది. శివ-మహేష్‌ కాంబినేషన్‌ తిరుగులేనిది. మేం చేయాల్సిందల్లా సినిమాకి ఏం అవసరమో అది తెచ్చివ్వడమే. అదే చేశాం. ఆ సినిమాకి బడ్జెట్‌ అనుకున్నదానికంటే కాస్త ఎక్కువే అయింది. కానీ సినిమా విడుదలకి ముందే అంతకంటే ఎక్కువ బిజినెస్‌ చేయడంవల్ల ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోలేదు. ‘ఒక మంచి సినిమా తీస్తున్నాం’ అనుకున్నాం. 2015లో వచ్చిన ఆ సినిమాకి మార్నింగ్‌ షోకే బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ వచ్చింది. అలా మొదటి సినిమాతో హిట్‌ కొట్టడం మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
నవీన్‌: శ్రీమంతుడు సమయంలోనే శివ మాకు ‘జనతా గ్యారేజ్‌’ కథ చెప్పారు. బాగా నచ్చింది. ఎన్టీఆర్‌తో సినిమా తీయాలని ముందు నుంచీ అనుకుంటున్నాం. ఆయనకీ కథ నచ్చడంతో వెంటనే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కింది. మొదటి సినిమాతో మా బ్యానర్‌కు ఒక గుర్తింపు వచ్చింది. రెండో సినిమాలో తేడా జరిగితే, మొదటి సినిమా గాలివాటంలా వచ్చిన హిట్‌ అనుకుంటారేమోనని ఇంకాస్త జాగ్రత్తగా పనిచేశాం. నిర్మాతగా కథలో మేం వేలుపెట్టలేం. సినిమాలో భారీతనం కోసం ఏదైనా చేయాలనుకున్నాం. అలా మోహన్‌లాల్‌గారిని తీసుకొచ్చాం. కొన్ని పాటల్ని భారీ సెట్‌లు వేసి తీశాం. ‘జనతా గ్యారేజ్‌’తో మరో విజయం సొంతమైంది.
మోహన్‌: కథ ఏంటో కూడా అడగకుండా సుకుమార్‌ గారితో సినిమాకి ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆయన మీద మాకున్న నమ్మకం అలాంటిది. అయితే పక్కా కమర్షియల్‌ సినిమా తీస్తానని సుక్కూ మాటిచ్చాడు. అలా ‘రంగస్థలం’ కథ వినిపించాడు. రామ్‌చరణ్‌ని హీరోగా పెట్టాలన్న ఆలోచన ఆయనదే. ఆ సినిమా షూటింగ్‌ 2017 ఏప్రిల్‌లో మొదలైంది. గోదావరి జిల్లాల్లోనే చేయాలనుకున్నాం. కానీ ఎండలూ, ఉక్కపోత బాగా ఎక్కువగా ఉండటంతో అక్కడ షూట్‌ చేసే పరిస్థితి లేకపోవడంతో హైదరాబాద్‌లో ‘రంగస్థలం’ ఊరు సెట్‌ వేసి తీశాం. రామ్‌చరణ్‌ తన బెస్ట్‌ నటనని చూపించారందులో…. మొదటిరోజునుంచీ ఆ సినిమా మీద మాకు నమ్మకం ఉండేది కానీ రూ.200 కోట్లు కలెక్ట్‌ చేస్తుందనుకోలేదు.
రవి: మేం పక్కా కమర్షియల్‌ సినిమాలే తీయాలని పరిశ్రమలోకి వచ్చాం. కానీ మా మొదటి మూడు సినిమాల్లో కమర్షియల్‌ ఎలిమెంట్‌తోపాటు మెసేజ్‌ కూడా ఉండటం యాదృచ్ఛికంగా జరిగింది. అందువల్ల మా బ్యానర్‌కి మరింత విలువ పెరిగింది. తొలి మూడు సినిమాల్లో ముగ్గురు స్టార్‌ హీరోలూ, ఇద్దరు గొప్ప దర్శకులూ, ఒక మంచి సంగీత దర్శకుడితో పనిచేశాం. ఆ ఆరుగురినీ మా సంస్థ ఎప్పటికీ మర్చిపోదు. వాళ్లతో మళ్లీ మళ్లీ పనిచేయడానికి ఎదురు చూస్తుంటాం. ఇప్పటికే సుకుమార్‌- అల్లుఅర్జున్‌ కాంబినేషన్‌లో సినిమా ఓకే అయింది. దేవీ ఎంత బిజీ అయినా మా బ్యానర్‌లో సినిమాకి ఎప్పుడూ ‘నో’ చెప్పలేదు. అంతకంటే ముఖ్యంగా ఆయనిచ్చిన నాలుగు సినిమాల్లోనూ ఒక్కపాట కూడా బాగోలేదనడానికి లేదు. అందుకే ఆయనంటే మాకు ప్రత్యేకమైన అభిమానం. ఆయనతో మా అనుబంధం కొనసాగుతూనే ఉంటుంది.

నవీన్‌: నేను డెట్రాయిట్‌లో మోహన్‌ న్యూజెర్సీలో ఉంటాం. మా కుటుంబాలు ఉండేదీ అక్కడే. మాకు సినిమాలు కాకుండా ఇక్కడ ఇతర వ్యాపారాలూ ఉన్నాయి. నెలలో ఒకసారైనా ఇండియా వచ్చిపోతుంటాం. అప్పుడు షూటింగ్‌ స్పాట్‌లకూ వెళ్తుంటాం. సినిమా రిలీజ్‌ సమయంలో మాత్రం నెలన్నరపాటు ఇక్కడే ఉంటాం. ఒక విధంగా అక్కడ ఆరు నెలలు, ఇక్కడ ఆరు నెలలూ ఉంటాం. రవి మాత్రం పూర్తిగా ఇక్కడే ఉంటాడు. ఎక్కడున్నా రోజూ రెండు మూడు గంటలు మా సినిమాల గురించి చర్చిస్తాం. సినిమా రంగంలో సక్సెస్‌ రేట్‌ చాలా తక్కువ. అదృష్టవశాత్తూ మా బ్యానర్‌లో విజయాల శాతం బావుంది. సక్సెస్‌ మీట్‌లు పెట్టినపుడు డిస్ట్రిబ్యూటర్లూ, ఎగ్జిబిటర్లూ వచ్చి సంతోషం వ్యక్తం చేస్తుంటే… ఇంకో హిట్‌ ఇవ్వాల్సిన బాధ్యత గుర్తొస్తుంది. చాలామంది డిస్ట్రిబ్యూటర్లు కొన్ని సంవత్సరాల తర్వాత మా సినిమాలతోనే తిరిగి ఆర్థికంగా నిలదొక్కుకో గలిగామని చెబుతుంటారు.
మోహన్‌: పరిశ్రమలోని అందరు హీరోలూ, దర్శకులతో పనిచేయాలనేది మా అభిలాష. రవి తరచూ కథలు వింటాడు. ఏదైనా కథ బావుందనిపిస్తే మాకు చెబుతాడు. ముగ్గురం కథ విన్నాకే కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం. నిర్మాణ సమయంలో మాత్రం కొన్నిసార్లు అక్కడికక్కడ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటపుడు ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా మిగతా ఇద్దరూ ఆమోదిస్తారు. ప్రతి సినిమా బృందంతోనూ ఎంతో సానుకూల వాతావరణంలో పనిచేస్తాం. హెల్దీ వాతావరణంలో పనిచేస్తే ఫలితం కూడా అలానే ఉంటుందనేది మా నమ్మకం. ఒకసారి కథనీ, దర్శకుణ్నీ నమ్మాక వాళ్లకి ఏం కావాలంటే అది ఇవ్వడమే మా బాధ్యత. సవ్యసాచిలో మాధవన్‌ ఉంటే బావుంటుందని డైరెక్టర్‌ అనగానే అంగీకరించాం. రంగస్థలంలో టైటిల్‌ సాంగ్‌ని వెయ్యి మందితో భారీగా తీశాం. దాన్ని వందమందితోనూ తీసేయెచ్చు. కానీ దర్శకుడు భారీగా తీద్దాం అనేసరికి మాకూ సబబుగానే అనిపించింది. భవిష్యత్తులోనూ ఇదే విధంగా పనిచేస్తాం.
రవి: ‘అర్జున్‌రెడ్డి’ని రిలీజ్‌ రోజునే ముగ్గురమూ చూశాం. ఆఫీసుకి తిరిగొచ్చి దాదాపు నాలుగు గంటలపాటు దాని గురించే చర్చించుకున్నాం. తర్వాత వెంటనే విజయ్‌ని కలిసి సినిమా తీయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాం. ‘డియర్‌ కామ్రేడ్‌’తో రెండేళ్లు ప్రయాణించాం. అందరూ ఎంతో కష్టపడ్డారు. ఫలితమే ఈ విజయం. మా బ్యానర్‌లో ఇకనుంచి ఏటా అయిదారు సినిమాలైనా వస్తాయి. నెలకు సగటున పది కథలైనా వింటాం. వాటిలో ఒక్కటి నచ్చినా గొప్ప విషయమే! మేం తీసిన మొదటి మూడూ భారీ బడ్జెట్‌ సినిమాలు. కానీ పరిశ్రమలో ఇప్పుడు చిన్న, మధ్యస్థాయి బడ్జెట్‌ సినిమాలు ఎక్కువగా విజయం సాధిస్తున్నాయి. అందుకే మేం కూడా అలాంటి సినిమాలు తీయడం మొదలుపెట్టాం. దానివల్ల భిన్నమైన జోనర్లలో ప్రయోగాత్మక సినిమాలు చేసే అవకాశమూ వస్తుంది. అలా తీసిన ‘సవ్యసాచి’, ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ ‘చిత్రలహరి’ మా నమ్మకాన్ని నిలబెట్టింది. త్వరలో మా బ్యానర్‌నుంచి నానీ ‘గ్యాంగ్‌ లీడర్‌’ వస్తోంది. ‘సుకుమార్‌ రైటింగ్స్‌’ సంస్థతో కలిసి సుకుమార్‌కి అసిస్టెంట్‌గా చేసిన బుచ్చిబాబు దర్శకుడిగా ‘ఉప్పెన’ తీస్తున్నాం.
సాయిధరమ్‌తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ దీంట్లో హీరో. మరో నాలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
మా విజయానికి కారణం సినిమామీద ఉన్న ఇష్టమే. కథలు వినడం నుంచి స్క్రిప్టులు చదవడం, షూటింగ్‌కి వెళ్లి పనుల్ని చూడటం, దర్శకులూ హీరోలతో ట్రావెల్‌ చేయడం దాకా… సినిమా ప్రపంచంలో ఇష్టంగా జర్నీ చేస్తున్నాం. ఆ ఇష్టంలేకుంటే ఇక్కడ విజయం సాధించలేం.

Director Naga Aswin

direc nag aswin 1 direc nag aswin 2
తొలి సంపాదన నాలుగువేలు
నాగ అశ్‌‘విన్‌’

క్యాజువల్‌ నైట్‌ ప్యాంటు…పాత టీషర్ట్‌… పెరిగిన గడ్డం.. పెద్ద జుట్టు… ఓ బక్క పల్చని మనిషి ఇంట్లో బాబును ఎత్తుకొని అటూఇటూ తిరుగుతున్నాడు. ఆడిస్తున్నాడు. ఆయనేనా? అని అనుకుంటుండగానే  దగ్గరికొచ్చి సాదరంగా ఆహ్వానించాడు. ఆయనే జాతీయ తెలుగు ఉత్తమ చిత్రం ‘మహానటి’ దర్శకుడు నాగ అశ్విన్‌.
అబ్బా ఎంత నిరాడంబరత! అని ఆశ్చర్యపోయే లోపే… వంటింట్లోకి వెళ్లి ట్రేలో నాలుగు మంచినీళ్ల గ్లాసులు పెట్టుకొని తీసుకొచ్చి అందించాడు… ఎంత ఒద్దిక!
‘ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది.. అన్నీ ఉన్న విస్తరి అణగిమణగి ఉంటుంది’ అని అమ్మమ్మలు చెప్పే సామెత గుర్తొచ్చింది.
‘మహానటి’తో సావిత్రిని నేటి తరం గుండెల్లోనూ కొలువుదీర్చి… కీర్తిసురేశ్‌కు దేశంలోనే ఉత్తమ నటిగా గుర్తింపు తెప్పించి… తెలుగు ప్రజలు గర్వించే మంచి సినిమా దర్శకుడు నాగ అశ్విన్‌తో ‘హాయ్‌’ అంటూ మాటలు కలిపితే.. బోలెడు విషయాలు చెప్పాడు.

జీవిత కథకు పురస్కారం
‘మహానటి’కి జాతీయ పురస్కారం వచ్చిందని ఒక జర్నలిస్ట్‌ మిత్రుడే తొలుత నాకు ఫోన్‌ చేశారు. తర్వాత టీవీ పెట్టి చూశాను. ఇది సావిత్రి గారికి ఇచ్చిన గౌరవం. ఆమె ఎంతో గొప్ప నటి… అయినా ఎందుకో ఎప్పుడూ జాతీయ పురస్కారం అందుకోలేదు. ఇప్పుడు ఆమె జీవిత కథకు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి సహకరించిన సావిత్రిగారి కుమార్తె చాముండేశ్వరి, కుమారుడు సతీష్‌లకు ముందుగా కృతజ్ఞతలు. తీయడానికి ముందుకొచ్చిన ప్రియాదత్‌, స్వప్నదత్‌లకు అభివందనాలు. ఈ సినిమా పూర్తిచేయడానికి సహకరించిన నటులు, సాంకేతిక నిపుణులు.. ఇలా ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.

సావిత్రిగారు ఎప్పుడూ నటించలేదు
చిన్నప్పటి నుంచి ఇంట్లో పాత సినిమాలు చూసేవాళ్లు. నేనూ వాటిని చూసేవాడ్ని. అలా సావిత్రిగారి హావభావాలు, ఆహార్యం నాకు ఎంతో నచ్చేవి. సావిత్రి గారు ఎప్పుడూ, ఎక్కడా నటించలేదు. సినిమాల్లోని పాత్రల్లోనూ ఆమె జీవించారు. జీవితంలోనూ తనకు ఇష్టమొచ్చినట్లే జీవించారు. మనసులో ఎలా ఉంటే అలాగే బయటికి నడుచుకునేవారు. అందుకే ఆమె నన్ను ఇన్‌స్పైర్‌ చేశారు. ఆమె కథ నేటి తరానికి చెప్పాలనిపించింది. ఆమె తాగి చనిపోయిందని, ఏవేవో ఆమె జీవితంలో జరిగాయని… రకరకాల కథలు ప్రచారంలో ఉండేవి. అలా కాదు.. ఆమెను గొప్పగా గుర్తుపెట్టుకోవాలని ఈ ప్రయత్నం చేశా. రెండేళ్లు కష్టపడ్డాం. ఈ చిత్రాన్ని సావిత్రిగారి గురించి తెలిసిన పెద్దలే కాక, యువత, ఇప్పటి పిల్లలు కూడా ఇష్టపడటం నాకు చాలా సంతోషాన్నిచ్చింది.

కీర్తి మొదట చేయనంది
ఈ కథకు మొదట ఎంతో మందిని మనసులో అనుకున్నాం. ప్రియా, స్వప్నలు… మేమనుకున్న వారి ఫొటో, సావిత్రిగారి ఫొటో పక్కపక్కన పెట్టి… చాలా మందికి వాట్సప్‌ గ్రూపుల్లో పంపారు. వారి అభిప్రాయాలు స్వీకరించారు.  కీర్తిసురేష్‌ను అనుకున్నాక.. ఆమె చేయలేను అని చెప్పింది. మిగతా సినిమాలు ఎప్పుడైనా చేయొచ్చు… ఇలాంటి అవకాశం మళ్లీ రాదని చెప్పి ఒప్పించాం. ఆమె కష్టానికి ప్రతిఫలం దక్కింది. దీపికపదుకొనే, ఆలియాభట్‌ వంటి వారు పోటీలో ఉన్నా… కీర్తి ఉత్తమ నటిగా ఎంపికవడం చాలా గొప్ప విషయం. అవార్డు ప్రకటించిన వెంటనే ఫోన్‌ చేసి అభినందించా.

స్కూల్‌ మేగజీన్‌ ఎడిటర్ని
హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదివేటప్పుడు స్కూల్‌ మేగజీన్‌ ఎడిటర్‌గా ఉండేవాడ్ని. కథనాలు, వ్యాసాలు రాసేవాడ్ని. అప్పుడు రానా నా క్లాస్‌మేట్‌. స్కూల్‌ ఆవరణలో ఎక్కువగా కొండరాళ్లు, చెట్లు  ఉండేవి. విరామంలో అలా బండరాళ్లలోకి వెళ్లిపోయి… బెల్‌ కొట్టగానే మళ్లీ వెనక్కి పరిగెత్తుకొచ్చే వాళ్లం. ఒకసారి అలా అక్కడి బండరాళ్లు పగలగొడుతుంటే చూశా. ఫొటోలు తీశా. ‘అసలు స్కూల్‌లో ఏం జరుగుతోంది? అడవి నాశనం చేస్తున్నదెవరు? అంటూ… ఓ పరిశోధన కథనం రాసి పత్రికలో ప్రచురించా. మా స్కూల్‌ మేగజీన్‌కి ఒక టీచర్‌ పర్యవేక్షకురాలిగా ఉండేవారు. ఆమెకు తెలియకుండా… ఈ పనిచేశాం. తర్వాత ప్రార్థన సమయంలో ప్రిన్స్‌పల్‌గారు ఆ టీచర్‌కి చీవాట్లు పెట్టారు. నాకూ చీవాట్లు పడ్డాయి.

ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ నచ్చక
నాన్న జయరామ్‌రెడ్డి, అమ్మ జయంతి. ఇద్దరూ వైద్యులే. చిన్నప్పటి నుంచి నేను తక్కువే మాట్లాడతా. అయితే యాక్టివ్‌గా ఉంటా. ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలని చూస్తుంటా. అమ్మా, పిన్నమ్మ అందరూ ఫస్ట్‌ ర్యాంకర్లే. నేను ఎప్పుడూ ఫస్ట్‌ వచ్చేవాడ్ని కాదు. ఈ విషయంలో అమ్మ బాధపడేది. ఫస్ట్‌ర్యాంకర్ని కాదు గానీ… టాప్‌ టెన్‌లో అయితే ఉండేవాడ్ని. ఏదో ఒక సబ్జెక్టులో మంచి మార్కులొచ్చేవి. నాకు ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ లాంటి రెగ్యులర్‌ కోర్సులు చదవడం ఇష్టం లేదు. అందుకే ఇంటర్‌ అయ్యాక… ఎన్ని పోటీ పరీక్షలుంటే అన్నీ రాశా. మణిపాల్‌లో మల్టీమీడియా కోర్సులో సీటొచ్చింది. అక్కడికి వెళ్లిపోయా. అక్కడే నాకు వీడియో ఎడిటింగ్‌పై అవగాహన వచ్చింది. అమ్మానాన్నలు ఎప్పుడూ నామీద ఒత్తిడి చేయలేదు. నేను ఏది చేసినా ప్రోత్సహించారు. మొదట మీడియాలో స్థిరపడతాడేమో అనుకున్నారు. తర్వాత యాడ్స్‌… చివరికి ఇలా దర్శకుడ్ని అయ్యా.

సొంతంగా తీద్దామనుకున్నా
‘లైఫ్‌ఈజ్‌ బ్యూటిఫుల్‌’ తర్వాత… ఫ్రెండ్స్‌ంతా కలిసి ఒక బృందంగా ఏర్పడి పనిచేసేవాళ్లం. అప్పుడు ఒక యాడ్‌ తీశాను. ఏదో రాసుకొని కొంతమందికి వినిపించేవాడ్ని. ఇదే సమయంలో ఒక షార్ట్‌ ఫిల్మ్‌ తీశా. అది ఫిల్మ్‌ఫెస్టివల్‌కు వెళ్లింది. దీంతో ప్రియాంక, సప్నలకు నాపై నమ్మకం వచ్చింది. వాళ్లకే ఒక కథ వినిపించాను. అది చర్చల దశలో ఉన్నప్పుడే ‘ఎవడే సుబ్రమణ్యం’ రాసుకున్నా. తక్కువ బడ్జెట్‌లో సొంతంగా అయినా తీసి… నన్ను నేను నిరూపించుకోవాలని ఏర్పాట్లు చేసుకున్నా. ఈ కథ సప్నదత్‌ వాళ్లకు నచ్చింది. వాళ్లు నానీని తీసుకొచ్చి ఈ కథకు మరింత న్యాయం చేశారు. విజయ్‌ పాత్రకు ముందునుంచి తననే అనుకున్నా. తను నాకు లైఫ్‌ఈజ్‌ బ్యూటిఫుల్‌ నుంచి పరిచయం. విజయ్‌ మంచి నటుడు అవుతాడని అప్పుడే అనుకునేవాడ్ని.

మూడో చిత్రం వాళ్లతోనే..
వైజయంతీ మూవీస్‌, స్వప్న సినిమాస్‌లతో కలిసే మూడో చిత్రం చేయాలనుకుంటున్నా. ఇందులో మరో నిర్మాణ సంస్థ ఎవరైనా భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉంది. ఎన్నో ఏళ్ల క్రితమే ఈ సబ్జెక్టుపై సినిమా తీయాలని అనుకుంటున్నాం. అన్నీ అనుకూలిస్తే… ఇదే చేపడతాం. కథ ఇంకా స్క్రిప్ట్‌ దశలోనే ఉంది. నటీనటులను ఎవరనేది అప్పుడే అనుకోవడం లేదు.

తొలి రెమ్యునరేషన్‌పై ఇంక్‌ పడింది
ఏవేవో రాసి తీయాలని ఆశపడేవాడ్ని. అది చూసి అమ్మనే నన్ను దర్శకులు శేఖర్‌కమ్ముల దగ్గరికి పంపారు. అప్పటికే ఆయన ‘గోదావరి’ సినిమా పనులతో బిజీగా ఉన్నారు. ‘నెక్ట్స్‌ ప్రాజెక్టుకు చేద్దాం’ అన్నారు. నేను మంచు మనోజ్‌ నటించిన ‘నేను మీకు తెలుసా?’ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను. అప్పట్లో నాకు నాలుగువేలు రెమ్యునరేషన్‌ ఇచ్చారు. అదే నా తొలి సంపాదన. నాలుగు వెయ్యిరూపాయల నోట్లు. వాటిపై ఇంక్‌ పడింది. ఎక్కువ ఇంక్‌ పడ్డ నోట్‌ని అమ్మకిచ్చి దాచాను. మిగతా డబ్బు మామూలుగానే ఖర్చు పెట్టాను. తర్వాత లీడర్‌, లైఫ్‌ఈజ్‌ బ్యూటీఫుల్‌ చిత్రాలకు అసిస్టెంటుగా చేశాను. క్యాస్టుమ్స్‌ చూసుకునేవాడ్ని. ‘లీడర్‌’ ట్రైలర్‌ను కట్‌ చేశా. అది శేఖర్‌కమ్ములకు నచ్చి విడుదల చేశారు. సినిమాను ఎంత ఫ్రెండ్లీ వాతావరణంలో తీయొచ్చో ఆయన వద్దే నేర్చుకున్నా.

కూరగాయలు పండిస్తా
ఉప్పల్‌ దగ్గర చిన్న పొలం ఉంది. అక్కడికి వెళ్లి కూరగాయల సాగులో పనులు చేస్తా. పొలం దున్నడం, విత్తనాలు వంటి వాటిల్లో సాయపడతా. పొలంలో ఏదో నాకు తోచిన పనిచేస్తుంటా.

టైం అంతా మా అబ్బాయితోనే!
ఎవడే సుబ్రమణ్యం అయ్యాక… పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనుకున్నా. అప్పటికే రెండేళ్లుగా ప్రియాంకదత్‌తో స్నేహం ఉండేది. ఒకానొక సందర్భంలో సరే మనమే చేసుకుందామని నిర్ణయించున్నాం. ఇంట్లో ఒప్పుకొన్నారు. సంతోషంగా ఉన్నాం. మా బాబు రుషి. ఇప్పుడు సమయం మొత్తం వాడికే సరిపోతోంది. చూశారుగా ఎత్తుకొని తిప్పమని ఒకటే అల్లరి…(నవ్వు).

ఇష్టమైన వంట : ముద్దపప్పు అన్నం, పచ్చిపులుసు
బాగా చేసేవంట : బిర్యానీ
ఆరాధ్య దర్శకులు : కేవీ.రెడ్డి, సింగీతం శ్రీనివాసరావు, కె.విశ్వనాథ్‌
రచయిత : జంధ్యాల
ఇష్టమైన ప్రదేశం : కొండప్రాంతాలు
నచ్చిన నటుడు : వెంకటేశ్‌(చిన్నప్పుడు)…
నచ్చిన నటి : ఐశ్వర్యారాయ్‌
మెచ్చే ఆట : టెన్నిస్‌
పుస్తకం : స్కూల్‌ రోజుల్లో ‘కర్పూర దీప యాత్ర’(నాన్‌ డీటెయిల్డ్‌) బాగా ఆకట్టుకుంది. ఆ పుస్తకమిప్పుడు దొరకడం లేదు.
సామాజిక సేవ : సామాజిక సేవ చేయడం గొప్ప కాదు. మన బాధ్యత. నీటి పొదుపు, కాలుష్య నియంత్రణ, నదుల సంరక్షణలాంటివి ప్రతి ఒక్కరూ చేయాలి.
విమర్శలు బాధ పెట్టలేదు‘మహానటి’ చిత్రంపై వచ్చిన విమర్శలు నన్ను ఏమీ బాధ పెట్టలేదు. మంచి హిట్‌ ముందు అవన్నీ చిన్నవిగా కన్పించాయి. స్క్రీన్‌ప్లే కోసం కొన్ని మార్పులు చేశాం.  ఆమె జీవితంలో ముఖ్యమైన ఇంకా కొంతమంది గురించి ఈ సినిమాలో ప్రస్తావించలేకపోయాం. స్క్రిప్ట్‌లో రాసుకున్నాం గానీ… చిత్రీకరించలేకపోయాం. కొన్ని సన్నివేశాలు తీసీ ఫైనల్‌ కాపీలో ఉంచలేకపోయాం. సావిత్రి గారి జీవితం మొత్తం చేయాలంటే మూడు గంటల సినిమా సరిపోదు. సీరీస్‌ చేయాల్సి ఉంటుంది. మాకు వీలైనంత వరకూ ఆమె గౌరవానికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా తీయగలిగాం.
- అయితరాజు రంగారావు, ఈనాడు, హైదరాబాద్‌
రాళ్లపల్లి రాజావలి, ఫొటోలు : రాజమౌళి