Artist Vijay Setupathi

జూనియర్‌ ఆర్టిస్టుగానూ ఛాన్స్‌ ఇవ్వలేదు!

 
సందేహమే అక్కర్లేదు… దక్షిణాదికి దక్కిన మరో సూపర్‌స్టార్‌ అతను! మన ఐదు రాష్ట్రాలవాళ్లూ తమ భాషలకతీతంగా ప్రేమిస్తున్న నటుడు. స్టార్‌ అంటే తమ ఇమేజ్‌ని ఆకాశమంత పెంచే ‘సూపర్‌హీరో’గానే కనిపించాల్సిన అవసరం లేదంటూ తనదైన పాత్రలతో కొత్త నిర్వచనం ఇస్తున్నాడు. విలన్‌, సహాయ నటుడు, హిజ్రా… ఏది చేసినా విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంటున్నాడు. ఇటీవల జాతీయ అవార్డు కూడా అందుకున్న విజయ్‌ సేతుపతి జీవిత గమనం ఏ సినిమా స్క్రిప్టుకీ తీసిపోదు…
రోజు దర్శకుడు బాలుమహేంద్రని చూడాలనుకున్నాను. కొన్ని నెలల ప్రయత్నం తర్వాత ఆవాళే అపాయింట్‌మెంట్‌ దొరికింది. వెళుతున్నప్పుడే ‘వసంతకోకిల’, ‘నిరీక్షణ’ వంటి ఎన్నో సినిమాలు కళ్లముందు కదలాడి ఉద్విగ్నానికి లోనయ్యాను. ఆయన ముందుకెళ్లగానే ‘బాబూ! నేను ఇప్పటికిప్పుడు చేసే సినిమాలంటూ ఏమీ లేవు. నువ్వు ఛాన్స్‌ కోసం వస్తే మళ్లీరా!’ అన్నారు. ‘మీ దగ్గరకి నేను అందుకోసం రాలేదండీ!’ అన్నాను. ‘మరి..?’ అన్నట్టు చూశారు తన నళ్లకళ్లద్దాలని కాస్త పైకెత్తి. ‘నటుడిగా ఛాన్స్‌ అడగడానికి నాకంటూ మంచి పోర్ట్‌ఫోలియో ఫొటోలు లేవు. నా దృష్టిలో మీరు గొప్ప ఫొటోగ్రాఫర్‌ కూడా. నా ఫొటోలు తీసిపెడతారా!’ అని అడిగాను. మన సినీరంగానికి ఆణిముత్యాల్లాంటి చిత్రాలనిచ్చిన అంతపెద్ద దర్శకుణ్ణి అలా ఫొటోలు తీయమనడం తప్పే అయినా… అప్పట్లో అదో పెద్ద కల నాకు. నా కోరిక వినగానే ‘నన్నెవరూ ఇలా అడగలేదయ్యా!’ అంటూ పెద్దగా నవ్వేశారు. అప్పటికప్పుడు తన కెమెరా సిద్ధం చేసి రకరకాల యాంగిల్స్‌లో ఫొటోలు తీశారు. వాటి ప్రింట్లని నాకు ఇస్తూ ‘నేను చూసిన చక్కటి ఫొటోజెనిక్‌ ఫేస్‌లలో నీదీ ఒకటి. మంచి నటుడివి అవుతావ్‌!’ అని ఆశీర్వదించారు. నటుడిగా నాపైన నాకు నమ్మకం వచ్చిన తొలి సందర్భం అది. నాకు నమ్మకం వస్తే చాలా… ప్రపంచం నమ్మొద్దూ… కనీసం నా భార్యయినా నమ్మొద్దూ! నా సమస్య అదే అప్పట్లో. నా భార్య జెస్సీకి నా సినిమా ప్రయత్నాలు అస్సలు నచ్చేవి కావు. అందుకే బాలుమహేంద్రగారు తీసిన ఫొటోలని తనకి కనిపించకుండా మా ఇంట్లో అద్దం వెనక భద్రంగా దాచాను. అవసరమైనప్పుడు వాటిని తీసుకుని వెళుతుండేవాణ్ణి. ఓ రోజు అవి జెస్సీ కంటపడ్డాయి. ఆరోజు మా అమ్మానాన్నా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ల ఎదుట గొడవపడటం బావుండదనేమో… ‘నీతో మాట్లాడాలి. బయటకొస్తావా!’ అంది. అప్పటికి మావాడు సూర్య కడుపులో ఉన్నాడు… నాలుగో నెల. నేను తన వెనకే వెళ్లాను. ఇద్దరం ఇంటి నుంచి కాస్త దూరంగా వెళ్లగానే చటుక్కున నా కుడిచేతిని తీసుకుని తన పొట్టపైన పెట్టి ‘పుట్టబోయే మన బిడ్డపైన ఒట్టేసి చెప్పు విజీ… మరోసారి సినిమాలకి ప్రయత్నించనూ అని!’ అంది. తన కళ్లలోకి చూశాను. కోపం, భయం, ఆవేదనా… అన్నీ కలగలిసి కన్నీళ్లుగా ఉబుకుతున్నాయి. నాకళ్లలోనూ నీళ్లు తిరిగాయి. నా చేతిని తన పొట్టపైన అలాగే ఉంచి ‘ఒట్టు… ప్రయత్నించను!’ అన్నాను. అనడమే కాదు తన చేతిలో ఉన్న ఫొటోలని తీసుకుని ముక్కలుగా చించేసి ‘పద ఇంటికి పోదాం!’ అన్నాను. తనని మెల్లగా ఇంటివైపు నడిపిస్తూ… నా చేతిలో ఉన్న ఫొటో ముక్కల్ని చెత్త బుట్టలో పడేశాను…

ఎందుకు పనికొస్తానబ్బా…
మా ఆవిడ జెస్సీకి సినిమాలపైనున్న ఆ భయం… ఓ రకంగా మనందరిదీ కూడా. కాలికింద ఉన్న ఆధారాన్ని కాదనుకుని ఆకాశానికి ఎగరాలన్న ప్రయత్నంగానే దాన్ని ఓ మధ్యతరగతి మనస్తత్వం భావిస్తుంది. జెస్సీ భయం అర్థంలేనిదేమీ కాదు. అప్పట్లో మా ఆర్థిక పరిస్థితి కూడా ఏమంత బావుండేది కాదు. మా నాన్న కాళిముత్తు… సివిల్‌ ఇంజినీరు. చిన్న చిన్న బిల్డింగ్‌ కాంట్రాక్టులకి పనిచేస్తుండేవాడు. సంఘసంస్కర్త పెరియార్‌ ఈవి రామస్వామిగారి ‘ద్రవిడ’ సిద్ధాంతాలని వంటపట్టించుకున్నవాడు. సంఘసంస్కరణల్లో పోరాడినవాడు… పరమ నాస్తికుడు. ఇంట్లో నలుగురం పిల్లలం… మా అన్నయ్యా, తర్వాత నేనూ, నా తర్వాత ఓ తమ్ముడూ, ఓ చెల్లెలూ. మాకంటూ ఆయన ఏ ఆస్తీ సంపాదించినవాడు కాదు. ‘సివిల్‌ ఇంజినీర్‌వై ఉండి ఒక్క ఇల్లైనా సంపాదించలేకపోయావ్‌!’ అని మేం ఎగతాళిగా మాట్లాడితే చిరునవ్వుతో చూస్తుండిపోయేవాడు. ఆయన ఏదీ సీరియస్‌గా తీసుకోడు. అదేమిటో సంపాదనంటే ఆయనకి చాలా చిన్నచూపు. జీవితంలో మేమెంత ధైర్యంగా, గౌరవంగా బతకాలో పదేపదే చెప్పినా… పొదుపు మాట మాత్రం ఎత్తేవాడు కాదు. సహజంగానే అమ్మకి నాన్న తీరు నచ్చేది కాదు. పాపం… డబ్బులేక ఎన్ని కష్టాలు పడిందో ఏమో, ‘డబ్బే అన్నింటికీ మూలం’ అని చెబుతుండేది. మా స్వస్థలం తమిళనాడులోని రాజపాళయం అయినా… నా పదకొండో ఏట చెన్నై వచ్చేశాం. చదువులో బిలో యావరేజీ విద్యార్థిని… స్పోర్ట్స్‌, కల్చరల్స్‌ వంటివాటిలోనూ పెద్దగా ఆసక్తిలేదు. ‘అటు చదువూలేదు… ఇటు ఇతర వ్యాపకాలూ లేవు. నేను ఎందుకు పనికొస్తానబ్బా!’ అన్న ప్రశ్నతోనే టీనేజీ గడిచిపోయింది. నేను డిగ్రీ ముగించేనాటికి అన్నయ్య పీజీ చేస్తున్నాడు. తమ్ముడూ, చెల్లెళ్లిద్దరూ చదువుతున్నారు. నాన్న ఒక్కడి జీతంతోనే ఇంతమంది కడుపునిండటం కష్టమయ్యేది. అందువల్ల డిగ్రీ పూర్తయిన వారం రోజులకి ఓ సిమెంటు కంపెనీలో అకౌంట్స్‌ అసిస్టెంట్‌గా చేరాను. అప్పట్లో సీఏ, ఐసీడబ్ల్యూఏల్లో చేరానుకానీ… వాటిల్లో ఫౌండేషన్‌ కోర్సు కూడా దాటలేకపోయాను! ఓ ఏడాదిపాటు సిమెంటు కంపెనీలో పనిచేశాక… అక్కడివాళ్లు ఎవరో చెప్పారు దుబాయ్‌కి వెళితే ఇప్పుడు వస్తున్న దానికంటే నాలుగురెట్లు ఎక్కువ జీతం వస్తుందని. దాంతో నా ఫ్రెండ్స్‌ దగ్గర తలాకొంత అప్పుతీసుకుని దుబాయ్‌ వెళ్లాను. రాత్రీపగలూ అని లేకుండా పనీ… అంతంతమాత్రం భోజనం… విపరీతమైన వేడి… ఇన్ని సమస్యలు ఉంటేనేం, అక్కడ నేను ఊహించినదానికన్నా ఎక్కువ జీతమే వచ్చింది. మూడేళ్లలో మా కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేశాను. అన్నయ్యా, తమ్ముడూ సెటిలైపోయారు. ఆ ఆనందంలో ఉండగానే నాకు ఆన్‌లైన్‌లో జెస్సీ పరిచయమైంది.
ఆన్‌లైన్‌ ప్రేమ పండింది…
కాలేజీలో చదువుకునేటప్పుడు ఓసారీ, ఉద్యోగానికి వెళ్లేటప్పుడు మరోసారీ నేను ప్రేమలో పడ్డా… అవన్నీ వన్‌సైడ్‌ లవ్వులే. ఆ అమ్మాయిలకి నా ప్రేమని చెప్పేంత ధైర్యం చాలలేదు. కానీ జెస్సీ ‘యాహూ మెసెంజర్‌’లº పరిచయమైన వారానికే ప్రపోజ్‌ చేసేశాను. ఆ రోజే తను ఓకే చెప్పింది కూడా! మరో ఐదు నెలలకి కేరళకి చెందిన జెస్సీ మా ఇంటి కోడలైంది. పెళ్ళిలోనే తనని మొదటిసారి నేను నేరుగా చూడటం! పెళ్ళయ్యాక  నాన్న నన్ను దుబాయ్‌ వెళ్లొద్దనడంతో ఇక్కడే ఉండిపోయాను. మా ఫ్రెండ్స్‌తో కలిసి ఇంటీరియర్‌ డెకరేషన్‌ బిజినెస్‌ చేశాను కానీ… అది సరిగ్గా సాగక ఆపేశాను. ఆ తర్వాత రెడీమేడ్‌ కిచెన్‌లు తయారుచేసే ఓ కంపెనీలో మార్కెటింగ్‌ విభాగంలో చేరాను. ఆ సంస్థ కోసం ఓసారి వ్యాన్‌లో వెళ్తుండగానే… ఆ వెనక ఓ పోస్టర్‌ కనిపించింది. అదో రంగస్థల నాటకం ప్రదర్శనకి సంబంధించిన ప్రకటన. చెన్నైకి చెందిన ‘కూత్తుపట్టరై’ అనే సంస్థది. ఆరోజు నా డ్యూటీ కాగానే ప్రదర్శనకెళ్లాను. రంగస్థలంపైన సహజంగా మనకుండే చిన్నచూపునంతా ముక్కలుముక్కలు చేసిందా నాటకం. నటనంటే ఇంత సహజంగా గొప్పగా ఉంటుందా అనిపించింది. అప్పుడే నేనూ వాళ్లలా నటుణ్ని కావాలనుకున్నాను. ఆ సంస్థ నిర్వాహకుడి దగ్గరకెళ్లి నా కోరిక చెబితే ‘మాకు నటులు అక్కర్లేదు కానీ… అకౌంటెంట్‌ కావాలి. వస్తారా!’ అన్నారు. ‘సరే’ అన్నాను. అలా వాళ్లు నాటకాలేస్తుంటే నేను అకౌంట్స్‌ రాస్తుండేవాణ్ణి. ఏడాది తర్వాత నా ఉత్సాహం చూసి నన్నూ నటించమన్నారు. ‘నాకు ఎవ్వర్నీ అనుకరించడం రాదు… మిమిక్రీ అయినా చేయలేను. నాకు నటన వస్తుందా!’ అని అడిగితే ‘అదీ మంచిదే. నీపైన ఎవరి ప్రభావమూ ఉండదు… నీలోని నువ్వే బయటకొస్తావు’ అని చెప్పారు. అదీ ప్రారంభం. మరో ఆరునెలల తర్వాతే బాలుమహేంద్రగారి దగ్గరకెళ్లి ఫొటోలు తీయించుకున్నాను. జెస్సీ మొదట్లో నటనపట్ల నా ఆసక్తిని పెద్దగా పట్టించుకోకున్నా… రాన్రానూ తనలో ఆందోళన పెరిగింది. గర్భిణి అయ్యాక అది ఇంకా ఎక్కువైంది. ఫలితమే ఆ రోజు నా చేత అలా ఒట్టేయించుకోవడం!
ఓ సంఘర్షణ…
మా ఆవిడా, అమ్మా నా నటనని వ్యతిరేకించినా… నాన్న ప్రోత్సహించాడు. ‘డబ్బులు రావేమోనని భయపడితే… నీకు జీవితంలో నటించే అవకాశం మళ్లీ రాకపోవచ్చు. కాబట్టి ధైర్యంగా వెళ్లు!’ అనేవాడు. నాకూ జెస్సీకీ మధ్య ఘర్షణని అర్థం చేసుకుని తనే కోడలికి అతికష్టంపైన నచ్చజెప్పాడు. అలా నాన్న ఇచ్చిన ధైర్యంతో మళ్లీ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టాను. ధనుష్‌ హీరోగా పుదుప్పేట్టై(తెలుగులో ధూల్‌పేట) అనే సినిమాకి ఆడిషన్‌కి వెళ్లి సెలెక్టయ్యాను. ఆ తర్వాత, ఎం.కుమరేశన్‌ సన్నాఫ్‌ మహలక్ష్మి(తెలుగు ఇడియట్‌) సినిమాలో, వర్ణం అని మరో సినిమాలోనూ నటించాను. రోజుకి రూ.250 ఇచ్చేవారు కానీ ఆ మూడు సినిమాల్లోనూ టైటిల్స్‌లో నా పేరు కనిపించదు. విలన్‌ గ్రూపులో ఒకడిగా, హీరో ఫ్రెండ్స్‌ మధ్య వెనక నిల్చున్న వ్యక్తిగా… ఇలా నేను చేసినవి చాలా చిన్న పాత్రలు మరి! అప్పట్లో ప్రతిరోజూ అవమానాలతోనే ఇంటికి వచ్చేవాణ్ణి. జూనియర్‌ ఆర్టిస్టుగా కూడా పనికిరావు పొమ్మని తిట్టేవారు. అప్పుడే ఓ టీవీ సీరియల్‌లో హీరో పాత్ర వచ్చింది. ఓ ప్రైవేటు టీవీ ఛానెల్‌లో కొత్త దర్శకులకి పోటీపెడుతుంటే ఆ కొత్తవాళ్ల కోసం కొన్ని షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించాను. కార్తిక్‌ సుబ్బరాజ్‌, శీనూ రామస్వామి, నలన్‌ కుమారస్వామి వంటి యువదర్శకులు అలా పరిచయమయ్యారు. వాళ్లలో శీను రామస్వామి 2010లో నాకో స్క్రిప్టు ఇచ్చి చదవమన్నాడు. మూడు రోజుల తర్వాత ఫోన్‌ చేసి ఆ కథలో హీరోని నేనేనని చెప్పాడు. ఏదో ఒకటి ఓ మంచి అవకాశం వస్తే చాలనుకుని చేశాను. ‘తెన్‌ మేర్కు పరువకాట్రు’ అన్న ఆ సినిమా కమర్షియల్‌గా హిట్టు సాధించడమే కాదు… మూడు జాతీయ అవార్డులు అందుకుంది. ఆ తర్వాత నా దశ తిరిగిపోయింది… అనే అనుకున్నాను కానీ, అలా జరగలేదు…
‘కథ చెప్పాలా తమరికి!’
నా సినిమా హిట్టయ్యాక కొంతమంది నిర్మాతలొచ్చారు. నేను ఎంత తక్కువ రెమ్యూనరేషన్‌ అడిగినా ‘నీకు అంత మార్కెట్‌లేదు!’ అనేవారు. ‘సరే సార్‌! కథ నచ్చితే ఫ్రీగా చేస్తాను’ అనేవాణ్ణి. ‘నీ మొహానికి కథ కూడా చెప్పాలా. కావాలనుకుంటే చెయ్‌…!’ అనేవారు కానీ నేను మాత్రం కథ చెప్పాలనే పట్టుబట్టేవాణ్ణి. ఆ నేపథ్యంలోనే ‘పిజ్జా’ కథతో వచ్చాడు నాకు టీవీల్లో పరిచయమైన కార్తిక్‌ సుబ్బరాజ్‌. తెలుగులో కూడా డబ్‌ అయి మంచి హిట్‌ అందుకున్న ఆ సినిమానే… నన్ను స్టార్‌ని చేసింది. దానితో మొదలుపెట్టి ఈ ఏడేళ్లలో 45 సినిమాలు చేసేశాను. ప్రతి పాత్రా జీవితంలో నుంచి వచ్చిందై ఉండేలా చూసుకున్నాను. ప్రతిదాన్నీ ఓ పరీక్షలాగే అనుకుని నటిస్తున్నాను. మరో వందేళ్ల తర్వాత నా పేరుకన్నా నా పాత్రలే నిలవాలనీ… అవి వీలున్నంత ఎక్కువగా ఉండాలనే నేను ఆశపడుతున్నాను. చిన్నదైనా సరే ‘సైరా’లోనూ, విలన్‌గానైనా ‘ఉప్పెన’లోనూ ఆ కోరికతోనే చేశాను. ఇక, ‘సూపర్‌ డీలక్స్‌’ సినిమాలోని శిల్ప అన్న హిజ్రా పాత్ర కూడా నేను కోరుకుని… ప్రాథేయపడి మరీ చేసిందే. దానికోసం నాలుగు నెలలపాటు మనసావాచా ఓ మహిళగానే మారిపోయాను. స్త్రీ ఔన్నత్యాన్ని అర్థం చేసుకున్నాను. ఆ పాత్రే నాకు దక్కిన పెద్ద అవార్డు… దానికి జాతీయ అవార్డూ వస్తే అంతకన్నా ఏం కావాలి.

 

 

Director Jeetu Josef (Drusyam)

ప్రేమ, సినిమా… ఏది కావాలో తేల్చుకో… అంది!

 

ఏడేళ్ల క్రితం దృశ్యం, ఇప్పుడు దృశ్యం-2…! ఉత్కంఠతో ప్రేక్షకుల గుండె లయని పరుగులెత్తించడమే కాదు… వాళ్ల కళ్లనీ తడిచేయడం వల్లే ఈ సినిమాలు కోట్లు కురిపిస్తున్నాయి. దేశంమెచ్చిన ఈ చిత్రాల సృష్తికర్త జీతూ జోసఫ్‌. ఓ పెద్ద సంక్షోభాన్ని ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం ‘ఒకరి కోసం ఒకరం’ అన్నట్టు ఎదుర్కొనే తీరే ఈ సినిమాలని మిగతా క్రైమ్‌ థ్రిల్లర్‌లకన్నా భిన్నంగా నిలుపుతోంది! ‘ఆ ఫ్యామిలీ సెంటిమెంట్‌’ నా జీవితంలో నేను స్వయంగా చూసింది… నిజానికి అదే నా జీవితాన్ని నిలిపింది!’ అంటాడు జీతూ. ఎందుకో చూడండి…

‘అదో చర్చ్‌. అప్పుడే ప్రార్థన ముగిసి అందరూ బయటకొస్తున్నారు. మెట్లు దిగి వస్తున్న వాళ్ల మధ్య అప్పుడే విరిసిన గులాబీలా ఆ అమ్మాయి! మెట్లు ఎక్కుతూ ఉన్న ఆ అబ్బాయి తనని కన్నార్పకుండా చూస్తున్నాడు. ‘రేయ్‌… ఇది చర్చ్‌ రా!’ అని ఫ్రెండ్స్‌ కసురుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రార్థన కోసం కళ్లుమూసినా తనే కనిపిస్తుందని… చర్చ్‌లోపలకీ వెళ్లలేదు ఆ అబ్బాయి. బదులుగా ఆ అమ్మాయి ఏ కాలేజీయో ఆరాలు తీయడం మొదలు పెట్టాడు. తర్వాతి రోజే ఆ కాలేజీకెళ్లాడు. ఆ అమ్మాయి దగ్గరకెళ్లి ‘నిన్న మిమ్మల్ని చర్చ్‌లో చూశాను!’ అంటూ నసిగాడు. ‘అవును… నేనూ చూశా నీ వాలకాన్ని!’ విసురుగా అంది ఆ అమ్మాయి. ‘మిమ్మల్ని చూడగానే ప్రేమలో పడిపోయాను!’ అన్నాడు. ‘అదొట్టి ఆకర్షణ… ప్రేమ కాదు!’ అంది. ‘కాదండీ… నాది ప్రేమే. నా లవ్‌ ప్రపోజల్‌కి సాక్షిగా మా అమ్మానాన్నల్నీ అక్కయ్యల్నీ పిలుచు కొచ్చాను చూడండి!’ అంటూ వాళ్లవైపు చూపించాడు. వాళ్లని చూశాక ఆ అమ్మాయికి మతిపోయింది ‘ఓ ఫ్యామిలీలో ఇలా కూడా ఉంటారా!’ అని నవ్వేసింది. అతని తల్లి దండ్రులూ నవ్వుతూ దగ్గరకొచ్చారు. ఆమెతో మాట్లాడారు. ‘నా డిగ్రీ పూర్తికానివ్వండి… తర్వాత ఆలోచిద్దాం!’ అంటూ వెళ్లిపోయింది. పోతూపోతూ అతనికి మాత్రమే వినిపించేలా ‘ఐ లైక్‌ ఇట్‌’ అని చెప్పింది. అతని పెదాలపైన చిర్నవ్వు విరిసింది. తిన్నా, పడుకున్నా ఆ చిర్నవ్వు చెక్కుచెదరడం లేదు. అలా ఏడాది గడిచింది. ఆ అమ్మాయిని చూడటానికి వెళ్లాడతను. ‘పెళ్ళి నాకిష్టమే కానీ… జీవితంలో నువ్వేం చేయాలనుకుంటున్నావ్‌!’ అని అడిగింది. ‘సినిమా డైరెక్టర్‌ని అవుదామనుకుంటున్నా!’ అని చెప్పాడు. ఆ అమ్మాయి అతనివైపు సాలోచనగా చూస్తూ ‘ఆ మాట చెబితే మావాళ్లు పెళ్లికి ఒప్పుకోకపోవచ్చు. వాళ్లే కాదు సదాచార సిరియన్‌ క్రైస్తవ కుటుంబా లేవీ అంగీకరించవు. ఆలోచించుకో!’ అంది. ‘నాకు నీ ఇష్టం ఏమిటన్నదే ముఖ్యం..!’ అన్నాడతను. ‘మావాళ్ల ఇష్టమే నాది కూడా. సినిమానా… నాతో పెళ్లా… ఏదో ఒకటి తేల్చుకో!’ అంది. గుండెని ఎవరో రంపంతో కోస్తున్నంత బాధ అతనికి. కన్నీళ్లతో ఆ అమ్మాయిని చూస్తూ చెప్పాడు ‘నాకు నువ్వే కావాలి… లిండా!’ అని..’ – ఇదేదో నేను సినిమా కోసం రాసుకున్న స్క్రిప్టు కాదు. పాతికేళ్లకిందట నా జీవితంలో ఎదురైన సంఘటనలివి. అలా సినిమా ఊసెత్త కూడదనే షరతుతోనే లిండా నా జీవితం లోకి అడుగుపెట్టింది. తనకిచ్చిన మాటని అక్షరాలా పాటించాను. కానీ ఇద్దరం కలిసి సినిమాకెళ్లినప్పుడు అందులోని అద్భుతమైన షాట్లు చూసి అందరూ చప్పట్లు కొడుతున్నప్పుడు ‘ప్చ్‌… నేనూ ఇలాంటి ప్రశంసలు అందుకోవాల్సినవాణ్ణే కదా!’ అనుకుని కన్నీళ్లు పెట్టుకునేవాణ్ణి. ఈ బాధ పెరుగుతున్న కొద్దీ… అసలీ సినిమా వ్యామోహం నాలో పుట్టించినవాళ్లని చంపేయాలన్నంత కసి వచ్చేది. వాళ్లెవరంటారా… చెబుతాను.

‘వావ్‌… వాట్‌ ఏ టేక్‌!’
కేరళలో ఎర్నాకుళం జిల్లాలోని ఎలంజి అనే చిన్న గ్రామం మాది. నాన్న వి.వి.జోసఫ్‌ ఎమ్మెల్యేగా కూడా చేశారు. ఇంట్లో నాకు ముగ్గురన్నయ్యలూ, ఓ అక్క. అందరూ బాగా చదువుకుని ఉన్నతస్థానాల్లో ఉన్నవాళ్లే. నేనే వాళ్ల దృష్టిలో దారి తప్పిన తమ్ముణ్ణయ్యాను! ఇంటర్‌ దాకా బాగా చదివాను కానీ హాస్టల్‌లో ఉంటున్నప్పుడు మా పెదనాన్న పిల్లలు నన్ను సినిమాకి తీసుకెళ్లారు. వాళ్లు ఊరికే సినిమా చూడటం కాదు, ‘ఆ టేక్‌ చూశావా… ఎలా తీశాడో! అబ్బబ్బా ఏం యాంగిల్‌రా అది!’ అంటూ విశ్లేషిస్తుండేవారు. నాకు అవేవీ అర్థం కాక తెల్లమొహం వేస్తే… వివరించి చెప్పేవారు. వాళ్లు ఈ సంగతులన్నీ చెబుతున్నకొద్దీ ‘ఇందులో ఇంతుందా!’ అని ఆశ్చర్యపోతుండే వాణ్ణి. అప్పటి నుంచి సినిమాలు చూడటమే కాదు… పుస్తకాలుగా వస్తే వాటి స్క్రీన్‌ ప్లేలూ చదివేవాణ్ణి. ఇంటర్‌ ముగిసేనాటికి ఈ సినిమా పిచ్చి బాగా ముదిరిపోయింది. నాన్నతో నేను సినిమాల్లోకి వెళతానని చెబితే విస్తుపోయాడు. ‘నిన్ను ఇంజినీర్‌ని చేయాలన్నది నా కల. అది నెరవేర్చకున్నా ఫర్వాలేదు కానీ కనీసం ఏదో ఒక డిగ్రీ అయినా చెయ్యి. ఆ తర్వాత నీ ఇష్టం!’ అన్నాడు. సినిమాలు బాగా చూడొచ్చని డిగ్రీలో ఆర్ట్స్‌ గ్రూపు తీసుకున్నాను. డిగ్రీ చదువుతూ పుణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరేందుకని ఎంట్రన్స్‌కి సిద్ధమయ్యాను. మరో వారంలో పరీక్షలనగా కామెర్లు రావడంతో ఆగిపోయాను. ఆ తర్వాత ఎవరో చెప్పారు ‘కమర్షియల్‌ సినిమాలు తీయడానికి ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరక్కర్లేదు. ఎవరిదగ్గరైనా అసిస్టెంట్‌గా చేరడం మంచిది!’ అని. నేను ఎవరిదగ్గర చేరాలో అర్థం కాలేదు. ఏదో ఒక మార్గం దొరుకుతుందిలే అని చూస్తున్నప్పుడే… లిండా పరిచయమైంది. తన షరతులతో సినిమా ఆశలన్నింటినీ అటకెక్కించాను. మా పొలంలో రబ్బరు చెట్లు పెంచడం మొదలుపెట్టాను. ఈలోపు నాన్న చనిపోవడంతో మాకు టౌన్‌లో ఉన్న స్థలంలో ఓ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ కట్టించి ఆ బాధ్యతా చూస్తుండేవాణ్ణి. మొదట్లో ఇదంతా కష్టమనిపించినా ఆ తర్వాత ఇవన్నీ అలవాటైపోయాయి. జీవితానికి ఓ ఛాలెంజ్‌ అన్నది లేకుండా పోయింది. ఉదయం ఆలస్యంగా లేవడం, కాసేపు రబ్బరు తోటని చూసుకోవడం, టౌనుకి వెళ్లడం రావడం… అంతా రొటీన్‌గా మారింది! వీటికి తోడు ఉండనే ఉంది… సినిమాలు తీయలేకపోతున్నాననే బాధ. ఆ బాధని మరచిపోవడానికి మరింతగా రబ్బరు తోటల్లో పనిచేసేవాణ్ణి. ఎంతగా కప్పెట్టాలనుకున్నా ఏదైనా ఓ మంచి సినిమా చూస్తున్నప్పుడు ఆ ఆవేదన నా కళ్లలో దాగేదికాదు. నేను పడుతున్న ఈ బాధని ఎవరూ పట్టించుకోవడం లేదని అనుకుంటూ ఉండేవాణ్ణి కానీ… నా భార్య నా మనస్సునంతా ఓ పుస్తకంలా చదివేస్తోందని గ్రహించలేదు!

మళ్లీ తనవల్లే…
2000లో అనుకుంటా నా మోకాలికి కీ-హోల్‌ సర్జరీ చేయాల్సి వచ్చింది. అందుకోసం కేరళ రాజధాని తిరువనంతపురం ఆసుపత్రిలో చేరాను. సర్జరీ అయ్యాక అక్కడ ఉంటున్న మా కజిన్‌ గీత ఇంటికి నేనూ, నా భార్యా వెళ్లాము. వాళ్ల డైనింగ్‌ టేబుల్‌ మీద జైరాజ్‌ అనే మలయాళ దర్శకుడు తీసిన ‘కరుణం’ సినిమా బ్రోచర్‌ ఉంది. ‘ఇదెక్కడిది గీతా…!’ అని అడిగితే ‘మాకు తిరుచ్చూరులో ఓ ఇల్లుందిరా… ఆ ఇంటిని ఈ సినిమా డైరెక్టర్‌ అద్దెకు తీసుకున్నాడు!’ అంది. కాసేపక్కడ కబుర్లాడి నేనూ, లిండా వచ్చేశాం. వచ్చిన నాలుగు రోజులకి గీత ఫోన్‌ చేసి ‘అన్నయ్యా! దర్శకుడు జయరాజ్‌ నిన్ను కలవాలంటున్నాడు… ఓ సారి వెళ్లొస్తావా’ అంది. ‘అదేమిటీ… నా సినిమా ఇంట్రెస్ట్స్‌ గురించి నీకెవ్వరు చెప్పారు!’ అన్నాను. ‘వదిన చెప్పింది. తనవల్ల నువ్వు సినిమాలకి దూరమయ్యావని చాలా బాధపడుతోంది. ఆ రోజు జయరాజ్‌ గురించి చెప్పడం విని… తనే నీ కోసం ఛాన్స్‌ అడగమని రిక్వెస్ట్‌ చేసింది!’ అంది. నాకు కన్నీళ్లు ఆగలేదు… నా మనసులోని బాధని లిండా ఇంతగా పట్టించుకుందా..! తన పరిధిలో తాను ప్రయత్నించి ఇంత గుంభనంగా ఉండిపోయిందా!’ అన్న ఆలోచన నన్ను కదిలించింది. తన దగ్గరకెళితే ‘వ్యవసాయం, వ్యాపారంలాంటి రొటీన్‌ పనులు నీకు సెట్‌ కావు. ఇలాగే కొనసాగితే జీవితాంతం స్తబ్దంగా ఉండిపోతావు అనిపించింది. నావల్ల నువ్వు అలా కాకూడదు అనిపించింది. అందుకే ఈ చిన్న ప్రయత్నం…!’ అని చెప్పింది. అలా నా భార్య ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి అడుగుపెట్టాను. జయరాజ్‌కి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ‘బీభత్సం’ అనే హిందీ సినిమా, ‘తిలకం’ అనే మలయాళ సినిమాలకి పనిచేశాను. మూడేళ్ల తర్వాత నేనూ ఒక కథ సిద్ధం చేసుకున్నాను.

ఈసారి అమ్మ వంతు!
నా మొదటి కథ వినగానే ఓ ప్రొడ్యూసర్‌ దిలీప్‌ అనే హీరోతో చేద్దామని చెప్పాడు. ‘నేనూ డైరెక్టర్‌నైపోతున్నానోచ్‌!’ అని గాల్లో తేలిపోయాను కానీ… వారం తిరక్కుండానే గాలి తీసిన బెలూన్‌లా మారిపోయాను. కారణాలేవీ చెప్పకుండానే ఆ ప్రొడ్యూసర్‌ సినిమా చేయడం కుదరదని చెప్పేశాడు. వేరే కథ కావాలన్నాడు. నెలరోజుల్లో ‘డిటెక్టివ్‌’ అనే కథ రాసి తీసుకెళ్తే… ‘కొత్త డైరెక్టర్‌లని నమ్మి ఏ హీరో కూడా ముందుకు రావడం లేదు. సారీ…!’ అని చెప్పేశాడు. ఏడుపొక్కటే తక్కువగా అతని ఆఫీసు నుంచి బయటకొచ్చాను. అయినా నా ప్రయత్నం మానుకోకూడదని ప్రఖ్యాత హీరో సురేశ్‌గోపికి కథ వినిపించాను. ‘చాలా బావుందండీ. ప్రొడ్యూసర్స్‌ ఉంటే చెప్పండి చేద్దాం!’ అన్నాడు. సురేశ్‌గోపికి కథ నచ్చిందని చెప్పినా నిర్మాతలెవరూ ఒప్పుకోలేదు. ఓ రోజు- ఇలా అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారుతున్నాయని నేనూ, నా భార్యా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే మా అమ్మ చూసింది. ‘ఎందుకేడుస్తున్నార్రా! మనకున్న ఆస్తి మొత్తం అమ్మేద్దాం… నువ్వు కోరుకున్న సినిమా తీద్దాం. కానివ్వండి!’ అంది. అనడమే కాదు… ఆరోజే స్థలాలు తనఖాపెట్టి డబ్బు తెచ్చిచ్చింది. అలా మా అమ్మ లీలమ్మని సహనిర్మాతగా చేసుకుని డిటెక్టివ్‌ సినిమా మొదలుపెట్టాం. సగం సినిమా పూర్తిచేశాక… మళ్లీ డబ్బు సమస్య. కానీ అప్పటికే కథ వైవిధ్యంగా ఉందనే టాక్‌ వ్యాపించడంతో మహిత్‌ అనే ప్రొడ్యూసర్‌ ఆ సినిమా కొని షూటింగ్‌ పూర్తి చేయించాడు. అలా ‘డిటెక్టివ్‌’ పూర్తయింది. సినిమా పెద్ద హిట్టయింది… అమ్మ తనఖా పెట్టిన స్థలాలన్నీ మళ్లీ మా చేతుల్లోకి వచ్చేశాయి. ఆ తర్వాత నేను తిరిగి చూసుకోలేదు. గత 13 ఏళ్లలో పది సినిమాలు తీస్తే వాటిలో తొమ్మిది పెద్ద హిట్టు. వాటిల్లో ‘దృశ్యం’ భాషలకి అతీతంగా మీ అందరికీ నన్ను చేరువ చేసింది. మరి దీనికి స్ఫూర్తేమిటంటారా…

ఆయన మా నాన్నే!
కేరళలో జరిగిన ఓ హత్య కేసు దృశ్యం సినిమాకి ప్రేరణ. కాకపోతే ఆ నిజం కేసులో- ఆ వ్యక్తి పోలీసులకి దొరికిపోయాడు. అలా దొరక్కుండా తన కుటుంబం కోసం అతను చివరికంటా పోరాడితే ఎలా ఉంటుందన్నదే దృశ్యం కథ! ఇందులోని మోహన్‌లాల్‌ (తెలుగులో వెంకటేశ్‌) పాత్రలో మా నాన్న ఛాయలున్నాయి. నాన్న ఎమ్మెల్యే అయినా సరే బస్సుల్లోనే ప్రయాణించేవాడు. ఏడాదికో రెండేళ్లకో తప్ప కొత్త బట్టలూ తీసుకోడు. కరెంటూ, నీళ్లూ క్షణం వృథా అయినా సహించేవాడు కాదు. ఇదంతా నేను ‘దృశ్యం’ కథలో భాగం చేశాను. దానికి మధ్యతరగతి కుటుంబాల్లోని భయాలనీ, తమవాళ్ల కోసం ఎంతకైనా పోరాడే తెగువనీ కలిపాను. ఈ అంశాలే దృశ్యం సినిమాలని మామూలు థ్రిల్లర్‌ల కంటే భిన్నంగా నిలిపాయనుకుంటున్నాను. తెలుగు, తమిళం, హిందీలోనే కాదు చైనీస్‌లో, సింహళంలో తీసినా పెద్ద హిట్టయ్యేలా చేసిందని భావిస్తున్నాను. నిజానికి, ‘దృశ్యం’ అనే కాదు… నేను తీసిన ప్రతి సినిమాలోనూ ఏదో ఒకరకంగా ఈ సెంటిమెంట్స్‌ని తడుముతూనే ఉన్నాను. ఎన్ని సినిమాలు తీసినా… తరిగిపోనంత ‘ఫ్యామిలీ సెంటిమెంట్‌’ని నా కుటుంబమే అందిస్తూ ఉంది.

తెలుగులో తొలిసారి…
ఏడేళ్లకిందట ‘దృశ్యం’ రీమేక్‌, రెండేళ్ల క్రితం జ్యోతిక- కార్తీ అక్కాతమ్ముళ్లుగా చేసిన ‘దొంగ’ డబ్బింగ్‌ సినిమాలతో మీకు పరిచయమైన నేను ‘దృశ్యం-2’తో తొలిసారి నేరుగా తెలుగు సినిమా చేస్తున్నాను. విక్టరీ వెంకటేశ్‌కి యాక్షన్‌ చెప్పబోతున్నాను. భాష వేరైనా సరే సాధారణంగా నా సినిమాలనే మళ్లీ మళ్లీ తీయడం ఇష్టం ఉండదు. కానీ ఈ సినిమా ద్వారా ఓ సారి తెలుగు కుటుంబాల్నీ ఇక్కడి సంస్కృతినీ దగ్గరగా చూడొచ్చనిపించింది. అందుకే సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ ఆఫర్‌ ఇస్తే వద్దనలేకపోయాను!
 

Director Prabhu Salman

అర్ధరాత్రి దొంగల్లా పారిపోయాం!

 

మనిషికీ మనిషికీ మధ్యే కాదు… ప్రకృతికీ మనిషికీ మధ్య ఉండాల్సిన మైత్రిని చెబుతాయి దర్శకుడు ప్రభు సాల్మన్‌ చిత్రాలు. హీరో ఇమేజ్‌ని పెంచడం కోసం పర్యావరణ అంశాలని తోడుతెచ్చుకోవడం కాకుండా… ప్రకృతి పరిరక్షణే ప్రధానాంశంగా హీరోహీరోయిన్లని ఎంచుకోవడం ఆయనకున్న అలవాటు. రానా హీరోగా వచ్చిన ‘అరణ్య’ అలాంటిదే! ఇదివరకు ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’ వంటి డబ్బింగ్‌ సినిమాలతో మనకి పరిచయమైన సాల్మన్‌ సినిమాలే కాదు… జీవితం కూడా స్ఫూర్తి నింపేదే. విధి విసిరే సవాళ్లని ఎదుర్కోవడమెలాగో వివరించేదే. ఆ ప్రయాణం…

దయం ఏడుగంటలు… అప్పుడే నిద్రలేచాను. రెప్పలు విప్పబోతే వెలుగు సూదిలా గుచ్చి ఇబ్బందిపెడుతోంది. అప్పుడు కాలింగ్‌ బెల్‌ మోగింది. ‘ఎవరూ… ఇంటి ఓనరా? నిన్ననే కదా కోపంగా మాట్లాడి వెళ్లాడు… ఇల్లూ ఖాళీచేయ మన్నాడు… మళ్లీ పొద్దున్నే వచ్చాడా…!’ అనిపించింది. నేను లేద్దామా వద్దా అనుకుంటుండగానే మావాడు పరుగెత్తు కుంటూ వెళ్లి గడియ తీశాడు. ‘పాలు… బాబూ!’ అన్న గొంతు వినిపించింది.పాలప్యాకెట్‌ తీసుకుని ‘ఉండు డబ్బులు తెస్తా!’ అంటూ లోపలికి వచ్చాడు వాడు. వాళ్లమ్మని డబ్బడిగితే తను ‘నాన్నని అడుగు!’ అంటోంది. వాడొచ్చి నన్ను లేపాడు. నేను ఏమీ ఎరగనట్టు ‘ఏమిట్రా!’ అని కళ్లు నులుముకుంటూ లేస్తే విషయం చెప్పాడు. బయటకొచ్చి ‘చిల్లర లేదు, రేపిస్తా!’ అన్నాను. ‘నిన్నా… మొన్నా కూడా ఇవ్వలేదు సార్‌!’ అన్నాడు. బాగా గిల్టీగా అనిపించింది. ‘కాస్త ఆగు!’ అని చెప్పి నా బ్యాగులో ఎప్పుడో దాచిన 20 రూపాయల నోటు తెచ్చిచ్చాను. మా ఇంట్లో మిగిలిన ఆఖరి నోటు అది. ఆ రోజంతా- ఎంతో ఇష్టంగా అద్దెకు తీసుకున్న ఆ మిద్దె ఇంటిని కళ్లారా చూసుకున్నాను. నా తొలి సినిమా హిట్టయ్యాక తీసుకున్న డబుల్‌ బెడ్రూమ్‌ ఇల్లది. ఆ హిట్టుతో నిర్మాతకి బాగా లాభాలొచ్చినా నా చేతుల్లో పెద్దగా ఏమీ మిగల్లేదు. నేననుకున్న ప్రాజెక్టులేవీ పట్టాలకెక్కలేదు. అనుకోకుండా చేసినవి కాసులు రాల్చలేదు. చూస్తుండగానే ఊరంతా అప్పులైపోయాయి. ఇంటి అద్దె కూడా కట్టలేకపోయాను. మేమిచ్చిన ఆరు నెలల అడ్వాన్స్‌ కూడా తీరిపోయి ‘బాబూ! ఇల్లు ఖాళీచేస్తారా… లేదా!’ అనడం మొదలుపెట్టాడు ఓనరు. ప్రతిసారీ తలతీసేసినట్టయ్యేది. అందుకే వేరే దారేదీ లేని పరిస్థితిలో ఆ రోజు రాత్రి పెట్టేబేడా సర్దుకుని గుట్టుచప్పుడు కాకుండా ఆ ఇంటి నుంచి బయటకొచ్చేశాం. ఓ రకంగా అప్పులవాళ్లనీ, అద్దె అడిగే ఓనర్‌నీ తప్పించుకుని దొంగల్లా పారిపోయాం. నా సంగతి సరే… ఏ పాపమూ ఎరగని నా భార్యాపిల్లల్నీ నలుగురి దృష్టిలో దగాకోర్లుగా నిలబెడుతున్నానన్న బాధ నా గుండెని మెలిపెట్టింది. ఆ అర్ధరాత్రివేళ ఆటోలో వెళుతూ అమాయకంగా నిద్రపోతున్న నా పిల్లల్ని చూసి ‘మీకు అద్భుతమైన భవిష్యత్తు ఇవ్వాలనుకున్నవాణ్ణి… ఇలా చేస్తున్నాను. సారీ అమ్మా!’ అంటూ వెక్కివెక్కి ఏడ్చాను.

మరో జన్మే ఎత్తాను…
ఆ రోజు రాత్రి ఎక్కడికి పోవాలో తోచక మా ఆవిడ బలవంతం మీద చెన్నై శివార్లలో ఉన్న మా అత్తగారి ఇంటికి వెళ్లాం. నా మనసు అవమానంతో గింజుకుంటున్నా వాళ్లు మాత్రం నన్ను సొంత బిడ్డలాగే ఆదరించారు. అక్కడికెళ్లాక నెలలోనే బాగా చిక్కి పుల్లలా అయిపోయాను. మొదట్లో అప్పుల బాధవల్ల అనుకున్నాను కానీ… నెలన్నరలో ఆరు కేజీలు తగ్గడంతో ఏదో సమస్య ఉందనిపించింది. ఆసుపత్రికి వెళితే… నా కడుపులో టీబీ వచ్చిందన్న బాంబు పేల్చారు వైద్యులు. మూలిగే నక్కపైన తాడిపండన్న చందంగా మారింది పరిస్థితి. విధి నాపైన అన్నివైపుల నుంచీ దాడిచేస్తోందేమో అనిపించింది. ఓ గదిలో పెట్టి ఎటూ వెళ్లే అవకాశం లేకుండా దాడికి దిగితే పిల్లి కూడా తిరగబడుతుందంటారు! మరి నేను మనిషిని… ఆ మాత్రం విధిపైన తిరగబడలేనా అనిపించింది! శక్తినంతా కూడగట్టుకుని పోరాడటం మొదలుపెట్టాను. ప్రభుత్వాసుపత్రిలోనే చికిత్స తీసుకోవడం ప్రారంభించాను. నాపైన నేను నమ్మకం పెంచుకోవాలని అప్పటిదాకా నేను అందుకున్న విజయాల్నీ ఎదుర్కొన్న సవాళ్లనీ ఓచోట రాసుకున్నాను. వాటిని క్లుప్తంగా చెబుతాను…

తమిళనాడులోని నైవేలి అనే ప్రాంతం మాది. లిగ్నైట్‌ గనులకీ, కరెంటు ఉత్పత్తికీ ప్రసిద్ధిగాంచిన టౌన్‌షిప్‌ అది. 14 చదరపు కిలోమీటర్లున్న టౌన్‌షిప్‌లో ‘అమరావతి’ అని ఒక్క థియేటరే ఉండేది… అందులోనూ 1960లనాటి సినిమాలు మాత్రమే వేసేవారు. తిరుచ్చిరాపల్లిలో డిగ్రీలో చేరాకే అసలు సినిమాలంటే ఏమిటో తెలిసింది. అప్పట్లో కాలేజీల్లో వేసే నాటకాల్లో చురుగ్గా పాల్గొనేవాణ్ణి. నా రచనాతీరూ, నటుల నుంచి నాక్కావాల్సింది రాబట్టడం వంటివి చూసి నా స్నేహితులంతా ‘నీ డైరెక్షన్‌ బావుందిరా!’ అనేవారు. ఆ ప్రోత్సాహంతో సహజంగానే నాలో సినిమాపిచ్చి మొదలైంది. పీజీ ముగించేనాటికి అది కాస్తా ముదిరిపోయింది. ఇంట్లోవాళ్లు వద్దంటున్నా వినకుండా ‘ఒక్కసారి కెమెరాని తాకితే చాలు…’ అన్న లక్ష్యంతో చెన్నై బస్సెక్కాను. అక్కడ ఆ కోరిక నెరవేరడానికి మూడేళ్లు పట్టింది. స్టూడియోల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న నన్ను ఓ సినిమా కోసం శరత్‌కుమార్‌కి ‘డూప్‌’గా తీసుకున్నారు. అక్కడ పరిచయమైన దర్శకుడు అగత్తియన్‌ సాయంతో ‘ప్రేమలేఖ’ సినిమాకి సహాయదర్శకుణ్ణయ్యాను. అప్పట్లో ఖుష్బూ భర్త సుందర్‌ ఓ సినిమా తీస్తూ ఏదో పొరపొచ్చాలు వచ్చి మానేస్తే మిగిలిన భాగాన్ని నన్ను పూర్తిచేయమని కోరారు ఆ సినిమా నిర్మాతలు. అలా నా పేరు రాకున్నా ఆ పని చేసిపెట్టడంతో… ఆ నిర్మాణ సంస్థ తమ తర్వాత సినిమాకి నాకే దర్శకత్వ బాధ్యతలు అప్పగించింది. అలా అర్జున్‌ హీరోగా కన్నోడు కాన్బదెల్లాం (తెలుగులో ప్రేమ ఘర్షణ) అన్న సినిమా చేశాను. ఆ సినిమా మంచి హిట్టయింది. పరిశ్రమలో చక్కటి గుర్తింపొచ్చింది కానీ… చేతిలో డబ్బులు మిగల్లేదు. అయినా-దర్శకుడిగా ఓ స్థాయి మెయిన్‌టెయిన్‌ చేయాలంటూ పెద్ద ఇల్లు అద్దెకు తీసుకున్నాను. ఆడంబరాలకి పోయాను. అప్పులు చేశాను. వాటికి తాగుడు అలవాటూ ఆజ్యం పోసింది. వీటన్నింటి ఫలితమే నాటి నా ఆర్థిక పరిస్థితి. నా విజయాలూ, బలాలూ, బలహీనతలపైన ఓ స్పష్టత వచ్చాక ముందు నా ఆరోగ్యంపైన దృష్టిపెట్టాను. దురలవాట్లతో పోరాడాను… దానికి క్రైస్తవ భక్తితోపాటూ మా ఆవిడ ప్రేమా ఎంతో బలాన్నిచ్చింది. అలా మరోజన్మ ఎత్తినట్టే అనిపించింది. ఆరునెలల్లోనే తేరుకుని… ఓ సినిమా స్క్రిప్టు సిద్ధంచేశాను.

‘రోజుకి ఐదువేలు చాలు’
అప్పట్లో కరణ్‌ అనే సహాయ నటుడు హీరోగా నిలదొక్కుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటే నా స్క్రిప్ట్‌ వినిపించాను. ‘నాకు ఒక్క కెమెరా ఇచ్చి… రోజుకి ఐదువేలు డబ్బులివ్వండి చాలు, సినిమా తీసిస్తాను!’ అని చెప్పాను. టీవీ సీరియళ్లకే రోజుకి లక్షరూపాయలు ఖర్చవుతున్న రోజులవి! కరణ్‌ నేను ఆశించిన దానికంటే ఎక్కువే డబ్బులిచ్చి సినిమా తీయమన్నాడు. 2006లో వచ్చిన ‘కొక్కి’ అన్న ఆ సినిమా పెద్ద హిట్టయింది. అప్పుడు వచ్చిన డబ్బుతో నేను చేసిన మొదటి పని పాత అద్దె ఇంటి బకాయిలన్నీ తీర్చేయడం…

ఆ ఓనర్‌కి క్షమాపణ చెప్పడం. అప్పటి నుంచి నా భార్య పునీతకే ఆర్థిక బాధ్యతలు అప్పగించడంతో… ఇంకెప్పుడూ మాకు సమస్యలు రాలేదు. బయటివాళ్లు నిర్మాతగా ఉంటే నేననుకున్న సినిమాలు తీయలేననే ఆలోచనతో నేనే నిర్మాతగా మారాలనుకున్నాను. ఓ ఫైనాన్షియర్‌ దగ్గర్నుంచి ఐదు లక్షలూ, నా సొంత డబ్బు ఒకటిన్నర లక్షని పెట్టుబడిగా పెట్టి సినిమా మొదలుపెట్టాను. దక్షిణాది సినిమా అప్పటిదాకా చూడని అడవి నేపథ్యాన్ని చూపాలనుకున్నాను. అలాంటి ఓ ప్రాంతం కోసం దట్టమైన కేరళ అడవుల్లో పదివేల కిలోమీటర్లు కాలినడకన తిరిగాను. చివరికి ప్రముఖ పర్యటక ప్రాంతం మున్నార్‌ సమీపంలో ఉండే కురాంగణి అనే గ్రామాన్ని ఎంచుకున్నాను. నా పాత సినిమాల్లో సైడ్‌ క్యారెక్టర్‌ చేసిన విధార్థ్‌ని హీరోగా తీసుకున్నాను. ఎన్నో వడపోతల తర్వాత హీరోయిన్‌గా అమలాపాల్‌ని ఎంపిక చేసుకున్నాను. 2011 నాటి దీపావళినాడు విడుదలైన ‘మైనా’(తెలుగులో ప్రేమఖైదీ) ఆ రోజే వచ్చిన ఓ టాప్‌హీరో సినిమాని సైతం తోసిరాజని పెద్ద హిట్టయింది. జాతీయ అవార్డుల్నీ సంపాదించిపెట్టింది. కమల్‌హాసన్‌ ఈ సినిమా చూసి ప్రతి పాత్రనీ విశ్లేషిస్తూ గంటపాటు ప్రసంగించారు. రజినీకాంత్‌ ‘ఈ సినిమాలో ఓ చిన్న పాత్ర ఇచ్చినా నేను గర్వపడేవాణ్ణయ్యా!’ అంటూ నన్ను ఆలింగనం చేసుకున్నారు. నాకు పర్యావరణ స్పృహ ఏర్పడింది ఈ సినిమాతోనే! అలా అడవిలోకి చొచ్చుకెళుతున్న మనిషికీ- అక్కడే తరతరాలుగా ఉన్న ఏనుగులకీ మధ్య జరుగుతున్న ఘర్షణపైన ఓ కథ సిద్ధం చేసుకున్నాను. అదే ‘గుమ్కీ’…!

 

గజరాజుకి దండంపెట్టా…
శివాజీగణేశన్‌ మనవడు విక్రమ్‌ ప్రభుని ఈ సినిమాతో హీరోగా పరిచయం చేశాను. ఇందులో నటించిన కుట్టి అనే ఏనుగు ద్వారానే గజరాజుల్ని ఏ రకంగా ముద్దు చేయాలి… వాటికి ఎప్పుడు యాక్షన్‌ చెప్పాలి… అవి సృష్టించే ఒక్కో శబ్దానికీ అర్థమేమిటీ… వంటివన్నీ నేర్చుకున్నాను. ఇంత చేసినా షూటింగ్‌ చివర్లో ఓ పెద్ద సమస్యని ఎదుర్కోవాల్సి వచ్చింది. మా ఏనుగుని షూటింగ్‌ కోసం కేరళ నుంచి తమిళనాడు సరిహద్దుకు తెప్పించాల్సి వచ్చేది. మధ్యలో 14 చెక్‌పోస్టులుండేవి. అక్కడి వాళ్లందరికీ నచ్చజెప్పి తెచ్చాక… ఏనుగు చెవులకీ కళ్లకీ మధ్య ఓ చిన్న బుడిపెలాంటిదొచ్చింది. అదేమిటని అడిగితే ‘ఏనుగుకి మదం పడుతోంది సార్‌!’ అన్నాడు మావటి. మరో ఏనుగుని షూటింగ్‌కి తెచ్చేంత డబ్బు కానీ వీలుకానీ మాకు లేదు. మేం చేయాల్సింది కూడా 10 గంటల షూటింగ్‌ మాత్రమే. దాంతో నేను షూటింగ్‌ చేస్తాననే చెప్పాను. ‘నాకు తెలియదుసార్‌… జనాలని చూస్తే అది రెచ్చిపోవచ్చు. మీ ప్రాణానికి నేను హామీ ఇవ్వలేను!’ అంటూ మావటి దూరంగా వెళ్లిపోయాడు. ఏం చేయను… ఆ ఏనుగే నా దేవుడనుకుని దండం పెట్టి చివరి షెడ్యూల్‌ మొదలు పెట్టాను. అదృష్టమో దైవనిర్ణయమో తెలియదు కానీ షూటింగ్‌ జరిగినంత సేపూ ఆ ఏనుగు కామ్‌గానే ఉండిపోయింది! గుమ్కీ సినిమా తమిళంలో సూపర్‌డూపర్‌ హిట్టయింది… తెలుగులోనూ మంచి ప్రశంసలొచ్చాయి.

రానా అడవి బిడ్డే అయ్యాడు…
అసోం అడవుల్లో అభివృద్ధి పేరుతో ఏనుగుల దారిని అడ్డుకుని ప్రభుత్వం గోడకట్టిన సంఘటనే నా ‘అరణ్య’ కథకి మూలం. అలాంటిచోట ఓ సిసలైన పర్యావరణ పోరాటయోధుడు ఉంటే ఎలా ఉంటుంది అన్న ప్రశ్న వస్తే నాకు అసోంలో సొంతంగా అడవిని పెంచిన జాదవ్‌ పాయెంగ్‌ కనిపించారు. ఆయన స్ఫూర్తితోనే హీరో పాత్రని రాసుకున్నాను. ఆ పాత్రకి ఎవరెవర్నో అనుకున్నాం కానీ… ఎవరూ నాకు నచ్చలేదు. రానా పేరు చెప్పగానే ‘అరె… ఇంతకాలం ఆయనెందుకు తట్టలేదు!’ అనిపించింది. విషయం చెబితే హైదరాబాద్‌ వచ్చి కథ చెప్పమన్నారు. కథల విషయంలో సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఎంత ఖరారుగా ఉంటుందో దక్షిణాది సినీ పరిశ్రమ మొత్తానికి తెలుసు. నాకా కథ ‘చెప్పడం’ సరిగ్గా రాదు… ‘చూపడమే’ వచ్చు. అందువల్ల సురేశ్‌ బాబుగారు ఒప్పుకోరేమోనన్న అనుమానంతోనే వెళ్లాను. కానీ 20 నిమిషాలపాటు నా ఆలోచనలు టూకీగా చెప్పగానే ఆయనా, రానా కథలో లీనమైపోయారు. ఆ రోజు నుంచి మూడేళ్లపాటు మరే సినిమాలోనూ పనిచేయకుండా శ్రమించారు రానా. కేవలం శాకాహారమే తింటూ 15 కేజీల బరువు తగ్గారు! గుమ్కీలో నేను ఒక్క ఏనుగుతో షూటింగ్‌ జరిపితే ఇందులో 18 ఏనుగులతో చేయాల్సి వచ్చింది. ఏనుగులు పరుగెత్తేటప్పుడు కెమెరాలు పట్టుకుని వాటి ముందూ వెనకా పరుగెత్తడం- మామూలు కష్టం కాదు. నేను నా సినిమా స్క్రిప్టులో ఏనుగుల సంచారాన్ని అడ్డుకుంటూ కట్టిన గోడని కూల్చేసినట్టే క్లైమాక్స్‌ రాశాను… అది కేవలం నా అభిలాష మాత్రమే. అప్పటికి నిజంగా అలా జరగలేదు. కానీ, నా సినిమా విడుదల కావడానికి వారం ముందే ఆ గోడని కూల్చేసి… ఏనుగుల రాచబాటని పునరుద్ధరించారట! ఆ విషయాన్ని చెబుతూ అక్కడి అధికారులు ‘మీ స్క్రిప్టు ఆ ఏనుగుల పాలిట ఓ ప్రార్థనలా పనిచేసిందండీ!’ అంటుంటే నాకు ఆనందంతో కన్నీళ్లాగలేదు!