Art Director ‘Brahma Kaali’

కుంచె ఇస్తారనుకుంటే… చీపురిచ్చారు!

కుంచె ఇస్తారనుకుంటే... చీపురిచ్చారు!<br />

 

సినిమా… కథకుడి ఊహ అయితే, కళా దర్శకుడి సృష్టి. కొన్ని సినిమాలు చూసినపుడు శ్రీకారం నుంచి శుభం వరకూ వేరే ప్రపంచంలోకి వెళ్లొచ్చిన అనుభూతి కలుగుతుంది. తెలుగు సినిమాల్లో అలాంటి ఎన్నో ఊహా ప్రపంచాలకు వాస్తవ రూపం ఇచ్చారు ఆర్ట్‌ డైరెక్టర్‌ బ్రహ్మ కడలి. పేరులోనే సృష్టికర్తని పెట్టుకున్న ఈయన తన ప్రయాణం గురించి ఏం చెబుతారంటే…

రతన్‌పుర్‌… జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఊరు. ఇది నేను పుట్టిపెరిగిన ఊరు కాదు, సృష్టించిన ఊరు. ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ కోసం హైదరాబాద్‌లో రతన్‌పుర్‌ సెట్‌ వేశాం. సినిమాలో కథ ఎక్కువ భాగం ఈ ఊళ్లోనే జరుగుతుంది. అందుకే ఊరిని సృష్టించాలనుకున్నాం. మధ్య భారతదేశంలోని ఓ టౌన్‌షిప్‌ని పోలి ఉంటుందా ఊరు. ఇళ్లు, దుకాణాలు, సెలూన్‌, పోలీస్‌స్టేషన్‌, బ్యాంకు, పెట్రోల్‌ బంకు, వాటర్‌ ట్యాంకు, రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌తోపాటు ముఖద్వారాన్నీ సృష్టించాం. సాధారణంగా సెట్‌ వేయడానికి ముందు స్కెచ్‌ వేస్తాం. దీన్ని మాత్రం ముందు మినియేచర్‌గా తయారుచేశాం. చిన్న చిన్న మార్పులతో ఫైనల్‌ చేసుకున్నాక సెట్‌ వేశాం. రూ.5కోట్లు ఖర్చయింది. హీరో పవన్‌ కల్యాణ్‌ గారికి బాగా నచ్చింది. ఆ సినిమా కథ ఆయన రాసిందే. ఆ సెట్‌ శాశ్వతంగా ఉండిపోయేలా వేయించాలనుకున్నారు కానీ కుదరలేదు. ఒకరోజు నా భుజంమీద చేయివేసి సెట్‌ మొత్తం కలియదిరిగి… ‘ఇది నా ఇరవై ఏళ్ల కల. నీవల్ల నిజమైంది. థ్యాంక్యూ’ అన్నారు. నా కెరీర్‌లో అతిపెద్ద, అత్యంత సంతృప్తినిచ్చిన సెట్‌ అది. కల్యాణ్‌ గారితో గబ్బర్‌సింగ్‌, గోపాల గోపాల, కాటమరాయుడు సినిమాలకీ పనిచేశా. ‘గబ్బర్‌సింగ్‌’ నా కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌. ఆ అవకాశం ఎలా వచ్చిందో చెప్పేముందు అక్కడివరకూ చేరడానికి చేసిన ప్రయాణం గురించీ మీకు చెప్పాలి.

బొమ్మలు గీయడం అనుకున్నా…

మా సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట. నాన్న మోహనరావు, అమ్మ నాగవేణి. మాది వ్యవసాయ కుటుంబం. నాకో తమ్ముడు సురేష్‌, చెల్లి కనకదుర్గ. పదో తరగతి వరకూ ఊళ్లోనే చదువుకున్నా. కాలేజీకి దగ్గర్లోని పెనుగొండ వెళ్లాను. చదువుకునే రోజుల్లో బొమ్మలు బాగా వేసేవాణ్ని. ఇంట్లో వాళ్లకి ఇది నచ్చేది కాదు. మా మావయ్యలు సముద్రుడు, ప్రసాదరావు… మాత్రం నన్ను ఫైన్‌ఆర్ట్స్‌ చదివిస్తే బావుంటుందనుకున్నారు. పెద్ద మావయ్య హైదరాబాద్‌లో ఉండేవారు. డిగ్రీ మధ్యలోనే ఆపేసి… 1994లో హైదరాబాద్‌ రమ్మన్నారు. మొదట తన స్నేహితుడికి చెందిన కంపెనీలో ప్రింటింగ్‌ విభాగంలో ఇంఛార్జిగా పెట్టారు. ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీలో చేరేంతవరకూ అక్కడ పనిచేద్దామనుకున్నా. దాదాపు ఏడాది పాటు పనిచేశాక నేను వచ్చిన పని అది కాదనిపించి మానేశా. తర్వాత ఒక యాడ్‌ ఏజెన్సీలో డిజైనర్‌గా చేరా. నేను చేరిన కొన్ని నెలలకు ఆ సంస్థ మూత పడింది. ఆ సమయంలో నా ఫ్రెండ్‌ నాగూర్‌బాబు కూడా హైదరాబాద్‌లో ఉండేవాడు. వాళ్ల అన్నయ్య హీరో శ్రీకాంత్‌ గారి మేకప్‌మేన్‌. నాకు

కుంచె ఇస్తారనుకుంటే... చీపురిచ్చారు!<br />

ఆర్ట్‌లో ప్రవేశం ఉంది కాబట్టి…

ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరితే భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆర్ట్‌ డైరెక్టర్‌ పేకేటి రంగా గారి దగ్గర ‘మావిచిగురు’ సినిమాకి అబ్జర్వర్‌గా చేర్పించారు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ అంటే పబ్లిసిటీ డిపార్ట్‌మెంట్‌ అనుకున్నా. స్కూల్‌ రోజుల్లో సినిమా టైటిల్స్‌ని వాటి డిజైన్లలోనే గీసేవాణ్ని. ఆ ధైర్యంతో సెట్‌కు వెళ్లా. తీరా వెళ్లాక ‘బాబూ, ఇక్కడే సెట్‌ వేసేది. ఇది మొత్తం ఊడ్చేసెయ్‌’ అంటూ చేతిలో చీపురు పెట్టాడో సీనియర్‌. కాసేపు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ మధ్యలో వెళ్లడం పద్ధతి కాదని ఆ పనిచేశా. ఆ విభాగంలోని సృజనాత్మకత నచ్చి తర్వాతా కొనసాగా. ఆపైన మరో ఆర్ట్‌ డైరెక్టర్‌ మనీషా రాజుగారి దగ్గర అప్రెంటిస్‌గా చేరి ‘వినోదం’కి పనిచేశా. రాజుగారు చాలా బిజీ ఆర్ట్‌ డైరెక్టర్‌. ఆయన అసిస్టెంట్‌లకూ బాగా పని ఉండేది. దాంతో చాన్నాళ్లు ఆయన దగ్గరే కొనసాగాను. మూడేళ్లు రూపాయి కూడా రెమ్యునరేషన్‌ రాలేదు. ‘పని నేర్చుకుంటున్నాం అదే పదివేలు’ అనుకునేవాళ్లం. రాజు గారు మాత్రం ఎప్పుడైనా ‘ఖర్చులకు డబ్బులున్నాయా’ అని అడిగి ఎంతోకొంత చేతిలో పెట్టేవారు. తర్వాత ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా దగ్గర శివమణి, సూపర్‌ లాంటి 15 సినిమాలకు పనిచేశా. ఎ.ఎస్‌.ప్రకాశ్‌, తోట తరణిలాంటి వారి దగ్గరా ఒకట్రెండు సినిమాలకు పనిచేశా. ఆ తర్వాత ఆనంద్‌సాయి గారి శిష్యరికం చేసే అవకాశం వచ్చింది. బొమ్మరిల్లు, మున్నా, పరుగు, జల్సా… ఇలా దాదాపు ఓ డజను సినిమాలకు ఆయన దగ్గర పనిచేశా.

అనుకోకుండా ఆర్ట్‌ డైరెక్టర్‌నయ్యా…

సినీ ప్రయాణంలో వివిధ క్రాఫ్ట్‌లలో పనిచేస్తున్న జూనియర్‌ టెక్నీషియన్ల మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లోని వాసువర్మతో నాకూ అలా స్నేహం కుదిరింది. నాగచైతన్య తొలి చిత్రం ‘జోష్‌’తో ఆయన డైరెక్టర్‌గా పరిచయమయ్యారు. నన్ను ఆ సినిమాకి ఆర్ట్‌ డైరెక్టర్‌గా చెయ్యమన్నాడు వాసు. మరికొన్నాళ్లు అనుభవం సంపాదించాలని నాకుండేది. తను పట్టుపట్టడంతో అంగీకరించా. ఆ సినిమాకి నిర్మాత దిల్‌ రాజు గారు. మంచి బ్యానర్‌. కానీ సినిమా అనుకున్నంతగా ఆడకపోవడంతో తర్వాత ఎవరి నుంచీ పిలుపురాలేదు. నేనుగా వెళ్లి అడిగేంత ధైర్యం లేదు. ఆ సమయంలో ఆనంద్‌ సాయి ఫోన్‌చేసి ‘ఎక్కడ ఉన్నావ్‌, ఏం చేస్తున్నావ్‌’ అని అడిగారు. ‘ఇంట్లోనే ఉన్నా, ఒకట్రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. అవి మొదలవ్వడానికి టైమ్‌ పడుతుంది’ అని చెప్పా. ఆయనకు ఏం అర్థమైందోగాని ఆఫీసుకి రమ్మని చెబ్తే వెళ్లాను. ‘ఖాళీగా ఉంటే ఇండస్ట్రీ మర్చిపోతుంది. ఏదో పనిచేస్తూనే ఉండాలి. ‘ఆరెంజ్‌’ లొకేషన్‌ రెక్కీ కోసం ఆస్ట్రేలియా వెళ్తున్నా. ‘కొమరం పులి’ క్లైమాక్స్‌ మిగిలి ఉంది. సెట్‌లో ఉండి ఆ పనులు చూస్కో. అసిస్టెంట్‌ అనుకోకు, కలిసే చేస్తున్నాం అని చెబుతా’ అన్నారు. ‘మీకు అసిస్టెంట్‌గా చేస్తున్నానంటే నాకేమీ నామోషీ కాదు’ అని చెప్పి ఆ మరుసటిరోజు నుంచే సెట్‌కు వెళ్లా. తర్వాత ‘ఆరెంజ్‌’ షూటింగ్‌ కోసం రెండు నెలలు
ఆస్ట్రేలియా వెళ్లమన్నారు.

కుంచె ఇస్తారనుకుంటే... చీపురిచ్చారు!<br />

హరీష్‌ మాటిచ్చారు…

ఆస్ట్రేలియా వెళ్లబోయే ముందు ‘మిరపకాయ్‌’కి ఆర్ట్‌ డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది. ప్రొడక్షన్‌ కంట్రోలర్‌ బ్రహ్మానందం గారు హరీష్‌శంకర్‌కి నాపేరు సూచించారట. ‘ఆస్ట్రేలియా వెళ్తున్నా, చేయలేన’ని చెప్పా. షూటింగ్‌ ప్రారంభం కావడానికి టైమ్‌ పడుతుంది కాబట్టి ఫర్లేదన్నారు. నేను తిరిగి వచ్చేంతవరకూ ఓ అసిస్టెంట్‌ని పంపించమంటే, సరేనన్నా. ఆర్ట్‌ డైరెక్టర్‌ లొకేషన్స్‌ చూపించే పనుల్నీ చూస్తుంటారు. ‘మిరపకాయ్‌’ కాలేజీ నేపథ్యంలో ఉంటుంది. కాలేజీ లొకేషన్‌ కోసం ఎంత వెతికినా దొరకలేదట. డైరెక్టర్‌కి సహనం రోజురోజుకీ తగ్గుతోందని తెలిసింది. చివరకు ఆస్ట్రేలియా నుంచి వచ్చీరావడంతోనే ‘మూడు లొకేషన్లు చూపిస్తా, ఏదో ఒకటి కచ్చితంగా నచ్చుతుంద’ని చెప్పా. చూపించిన మొదటి లొకేషనే తనకి బాగా నచ్చేసింది. ‘ఇకమీదట నా ప్రతి సినిమాకీ ఆర్ట్‌ డైరెక్టర్‌ నువ్వే’ అని ఆరోజు చెప్పాడు హరీష్‌. ఆ సినిమా హిట్‌ అయింది. హరీష్‌కి తర్వాత ‘గబ్బర్‌సింగ్‌’ డైరెక్షన్‌ అవకాశం వచ్చింది. కానీ కల్యాణ్‌గారు తన ఫ్రెండ్‌ ఆనంద్‌సాయిని దాటి నాకా అవకాశం ఇస్తారనుకోలేదు. హరీష్‌ నా పేరుని కల్యాణ్‌గారి దృష్టికి తీసుకువెళ్లినపుడు… ‘మీకు ఎవరు కంఫర్ట్‌గా ఉంటే వాళ్లని పెట్టుకోండి’ అన్నారట. హరీష్‌ ఆ మాట చెప్పేసరికి ఎంతో సంతోషించా. నేనేంటో నిరూపించుకోవడానికి మంచి అవకాశం అనుకున్నా. కల్యాణ్‌ గారిని కలిసినపుడు ‘ఏం చేయబోతున్నారు’ అని అడిగితే అప్పటికే సిద్ధం చేేసుకున్న లొకేషన్లూ, సెట్‌లూ, హీరో హీరోయిన్ల కలర్‌ ప్యాలెట్ల స్కెచ్‌లను చూపించా. అవన్నీ చూసి ‘గో ఎహెడ్‌’ అన్నారు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ తర్వాత నేను వెనుదిరిగి చూసుకోలేదు. తర్వాత హరీష్‌ తోనే ‘రామయ్యా వస్తావయ్యా’ చేశా. డైరెక్టర్‌ బాబీ మంచి స్నేహితుడు. తన మొదటి చిత్రం ‘పవర్‌’, తాజా చిత్రం ‘వెంకీ మామ’ సినిమాలకూ పనిచేశా. ‘వెంకీ మామ’ సినిమాని నెల రోజులపాటు కశ్మీర్‌లో షూటింగ్‌ చేశాం. అందులో కనిపించే ఆర్మీ సెటప్‌లన్నీ సెట్‌లు వేసినవే. నన్ను బాగా ప్రోత్సహించిన దర్శకుల్లో పూరీ జగన్నాథ్‌ ఒకరు. ఆయనతో ఇద్దరు అమ్మాయిలతో, హార్ట్‌ ఎటాక్‌, టెంపర్‌ సినిమాలకు పనిచేశా. టెంపర్‌ కోసం వెదురు కర్రలతో ఒక హౌస్‌ సెట్‌ వేశా. దానికి మంచి గుర్తింపు వచ్చింది.

నిద్రాహారాలు ఉండవు…

ఆర్ట్‌ డైరెక్టర్‌గా దాదాపు 25 సినిమాలు చేశా. భారీ బడ్జెట్‌వే కాదు, చిన్న, మధ్యస్థాయి బడ్జెట్‌ సినిమాలకూ పనిచేశా. ఈ ఏడాది మొదట్లో విడుదలైన ‘నాంది’ కూడా నాకు మంచి పేరు తెచ్చింది. ఈ మధ్యనే ‘షూటౌట్‌ ఎట్‌ ఆలేర్‌’ వెబ్‌ సిరీస్‌కూ పనిచేశాను. సినిమాకి ఏమాత్రం తక్కువ కాని అనుభవం అది. నటీనటులు వేసుకునే డ్రెస్‌లు తప్పించి పాటలూ, ఫైట్లూ, సీన్లలో కనిపించే ప్రతి వస్తువూ ఆర్ట్‌ డైరెక్టర్‌ సృష్టి. ఇది సృజనాత్మక విభాగం. దాంతోపాటు తక్కువ బడ్జెట్‌లో, సకాలంలో పని చేస్తేనే ఇక్కడ విజయం సాధ్యమవుతుంది. లొకేషన్‌లో కొన్నిసార్లు డైరెక్టర్‌కి కొత్త ఆలోచన రావొచ్చు. అప్పటికప్పుడు అందుకు తగ్గట్టు సెట్‌ని సిద్ధం చేయాలి. అలాంటపుడు నిద్రాహారాలూ ఉండవు. ఇది టీమ్‌ వర్క్‌. నాకు ఏదైనా సందేహం వస్తే డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లోని మిత్రులు విజయ్‌ కనకమేడల, రమేష్‌రెడ్డి, బాబీలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా. ఈ వృత్తిలో ఉండటంవల్ల శ్రీహరికోటలోని ఇస్రోకు, హైదరాబాద్‌లోని ఆక్టోపస్‌, కశ్మీర్‌లోని ఆర్మీ కార్యాలయాలకు వెళ్లగలిగా. దేశవిదేశాల్లో అనేక ప్రాంతాల్ని చూడగలిగా. అలాంటపుడూ, చేసిన పనికి గుర్తింపు వచ్చినపుడూ కష్టాలన్నీ మర్చిపోతా.


అదే రిటైర్మెంట్‌ ప్లాన్‌…

కుంచె ఇస్తారనుకుంటే... చీపురిచ్చారు!<br />

నా పూర్తిపేరు బ్రహ్మేశ్వరరావు. నా శ్రీమతి రాధిక. మాది ప్రేమ వివాహం. వాళ్లది గుంటూరు జిల్లా కొలకనూరు. హైదరాబాద్‌లో చదివేది. మా కజిన్‌ క్లాస్‌మేట్‌. తనను చూడగానే నచ్చేసింది. తనకు అంగీకారమైతే పెళ్లి చేసుకుంటా నని మా చెల్లితో చెప్పించా. రెండ్రోజుల తర్వాత నా ప్రేమను అంగీకరించింది. కానీ వాళ్లింట్లో ఒప్పుకోలేదు. సినిమా రంగంలోని వాళ్లు వద్దని అభ్యంతరం చెప్పారు. మేం పెళ్లి చేసుకున్న ఆరు నెలలకు వాళ్ల మనసు మారింది.

* మాకు ఇద్దరు అబ్బాయిలు. తన్విన్‌ సాయి, రిత్విక్‌ సాయి. గురువుగారు ఆనంద్‌సాయి మీద గౌరవంతో పిల్లల పేర్ల చివర్లో సాయి అని పెట్టాను.

* కథనుబట్టి సినిమాకి అవసరమయ్యే ప్రాపర్టీస్‌ మారుతుంటాయి. వాటిని తెచ్చుకోవడానికి ఆర్ట్‌ డైరెక్టర్లకి కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశాల్లో వస్తువులు అద్దెకు ఇచ్చే దుకాణాలు ఉంటాయి. మన దగ్గర అలాంటిది ఒకటి ఉండాలన్న ఆలోచనతో ‘రైట్‌ చాయిస్‌ ప్రాప్స్‌’ పేరుతో హైదరాబాద్‌లో షాప్‌ తెరిచా. ఇది నా రిటైర్మెంట్‌ ప్లాన్‌ కూడా.

Singer srutiranjani

361151b8-b4ea-4563-b481-43e6508b9195 384ae7e5-8c37-4c3e-b1f2-9104230d8cf9

Hero Vijay (Tamil)

బండమొహం, వీడు హీరో ఏంటి… అన్నారు!

బండమొహం, వీడు హీరో ఏంటి... అన్నారు!<br /><br />

 
దక్షిణాదిలోని మిగతా సినిమా పరిశ్రమల్ల్లా తమిళ సీమకి నిన్నామొన్నటిదాకా ‘మెగాస్టార్‌’లు ఎవరూ లేరు. ఇప్పుడా టైటిల్‌ని సొంతం చేసుకున్నాడు విజయ్‌! సినిమా కలెక్షన్స్‌లోనే కాదు… పారితోషికంలోనూ అక్కడి సూపర్‌స్టార్‌ని మించిపోతున్నాడు! తెలుగు-తమిళ భాషల్లో రాబోతున్న ఆయన తర్వాతి చిత్రం ‘బీస్ట్‌’కి వందకోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నాడని భోగట్టా. ఈ విజయ్‌ ఒకప్పుడు నష్టజాతకుడిగా ముద్రపడ్డవాడు… నటించడానికే అర్హుడుకాడంటూ అవమానాలు ఎదుర్కొన్నవాడు. అలాంటివాడు మెగాస్టార్‌ ఎలా అయ్యాడో చూద్దామా…

 పాప పేరు విద్య. రెండున్నరేళ్లకి ముద్దులు మూటగట్టడమే కాదు… తన మాటల ప్రవాహంలో ముంచెత్తుతుండేది. ఆ పాప తెలిసీతెలియకుండా పాడుతుంటే వాళ్లన్నయ్య పదేళ్ల విజయ్‌ వచ్చీరాకుండా గిటార్‌ వాయిస్తుండేవాడు. ఆ అన్నాచెల్లెలిది ప్రత్యేక ప్రపంచం. బడి నుంచి ఇంటికొస్తే తన చుట్టూనే తిరిగేవాడు. అమ్మతోపాటూ ఆ పాపకి తనూ స్నానం చేయించేవాడు, అన్నం తినిపించేవాడు. అప్పుడప్పుడూ బడి నుంచి ఇంటి గేటు ద్వారా కాకుండా వెనకవైపు పైపు గుండా కిచెన్‌ కిటికీలో నుంచి ‘ఢా’మ్మంటూ దూకి అమ్మనీ చెల్లెల్నీ భయపెట్టడం విజయ్‌ సరదాల్లో ఒకటి. ఆ రోజు కూడా అలాగే దూకిన విజయ్‌కి కిచెన్‌లో ఎవ్వరూ కనిపించలేదు. ఇంట్లో ఎన్నడూలేని నిశ్శబ్దం. అమ్మ చెల్లెలితోపాటూ బెడ్రూమ్‌లో ఉంది. విద్య ఆ రోజు పడకపైన నీరసంగా పడుకుని ఉంది. చెల్లెల్ని అలా చూసిన విజయ్‌ తట్టుకోలేకపోయాడు. ఆ రోజు రాత్రి ఏమీ తినలేదు. ఉదయానికంతా విద్య పరిస్థితి విషమించింది. ఒకరిద్దరు వైద్యులొచ్చి వెళ్లారు. చివరిగా అమ్మ ఏడుస్తూ బెడ్రూమ్‌ నుంచి కిందకొచ్చింది. ‘విజయ్‌ ఒకసారి చెల్లెల్ని చూసిరా…!’ అంది. వెళితే… ఆ పాప నిర్జీవంగా ఉంది! ఆ తర్వాత ‘విజయ్‌ నోటి నుంచి ‘విద్యా…’ అన్న పెద్ద అరుపు వినిపించింది. అంతే, ఆ తర్వాత మాట్లాడటం మానేశాడు. ఎవరైనా కదిపితే ఏడుస్తుండేవాడు. ఆ బాధ నుంచి వాడే బయటకొస్తాడులే అనుకున్నాం కానీ… ఆ విషాదం వాడి చిన్నిగుండెలో అలాగే గడ్డకట్టిపోయింది. మాట్లాడటం తగ్గించేశాడు. ఒకప్పటి అల్లరిపిల్లాడు కాస్తా వయసుకి మించిన నెమ్మదితనం అలవర్చుకున్నాడు. ఇప్పటికీ వాడు అంతే. కాకపోతే, చెల్లెలు చనిపోయిన ఏడాది తర్వాత వాడి ముఖాన తొలిసారి నవ్వులు పూయించింది మాత్రం సినిమాలే!’ అంటారు విజయ్‌ వాళ్లమ్మ శోభ. ఆమె సినిమా గాయనీ, రచయిత్రి. నాన్న ఎస్‌ఏ చంద్రశేఖర్‌ పేరున్న దర్శకుడు. సినిమాలతో కొడుకులో మళ్లీ హుషారొస్తోందని గమనించిన ఆ ఇద్దరూ ఎన్నో చిత్రాల్లో చిన్నారి విజయ్‌కాంత్‌గానూ, రజినీకాంత్‌గానూ చేసే అవకాశాలు ఇప్పించారు. కానీ తల్లిదండ్రులుగా విజయ్‌పైన వాళ్ల ఆశలు వేరే ఉండేవి…

ఇల్లు విడిచి వెళ్లిపోయాడు…
‘చెల్లెలు ఎలా చనిపోయిందీ… ఏదో తెలియని జ్వరంతో కదా! అలాంటి పరిస్థితి మరే పాపకీ రాకూడదు. అందుకే నువ్వు డాక్టరువి కావాలి… అవుతావా?’ అని పదేళ్ల నుంచే చెప్పడం మొదలుపెట్టాడట వాళ్ల నాన్న చంద్రశేఖర్‌. అందుకోసమే అన్నట్టు విజయ్‌ చక్కగా చదివేవాడు. పదో తరగతికి వచ్చాక సినిమాల్లో నటించడం కాదుకదా చూడటమూ మానేశాడు. ఇంటర్‌కొచ్చాక చదువే ప్రపంచమైపోయింది. అది చూసి కొడుకు ఎలాగూ డాక్టర్‌ అవుతాడనే నమ్మకంతో వాళ్లనాన్న ఆసుపత్రి కట్టేందుకు రంగం సిద్ధం చేశాడు! కానీ ఇంటర్‌ రెండో సంవత్సరంలో విజయ్‌ ట్రాక్‌ మారింది. అయితే సినిమా నటుడిగానో కాకుంటే దర్శకుడిగానో మారాలన్నదే లక్ష్యంగా మార్చుకున్నాడు. అది విని నాన్న అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. ‘నువ్వు దారి తప్పుతున్నావ్‌… ఇక బాగుపడవ్‌. నా కళ్లముందు ఉండొద్దు!’ అన్నాడు. అంతే… ఇల్లు విడిచి వచ్చేశాడు ‘అమ్మానాన్నా నేను వెళ్లిపోతున్నా… దయచేసి వెతక్కండి!’ అని లెటర్‌ రాసిపెట్టి మరీ!

‘మీవాడు పనికిరాడు’
ఎంత కోపం ఉన్నా… ఒక్కగానొక్క కొడుకు అలా వెళ్లిపోయాడనగానే ఆ తల్లిదండ్రులిద్దరూ తల్లడిల్లిపోయారు. రోజంతా వెతికారు. రాత్రయినా దొరకలేదు. అపరాత్రివేళ చంద్రశేఖర్‌కి ఓ అనుమానం వచ్చింది. వాళ్లకి దగ్గర్లోని ఓ థియేటర్‌కి వెళ్లాడు. అక్కడో ఫ్లాప్‌ సినిమా నడుస్తోంది. చంద్రశేఖర్‌ ఇంటర్వెల్‌ దాకా బయటే ఉండి… లోపలికెళితే అక్కడున్నాడట విజయ్‌. అంటే, రోజంతా ఆ థియేటర్‌లో అన్ని షోలూ ఒకే ఫ్లాప్‌ సినిమా చూస్తూ కూర్చున్నాడన్నమాట. వీడిది మామూలు సినిమాపిచ్చి కాదు అని అప్పుడు అర్థమైందట వాళ్లనాన్నకి. ఇంటికి తీసుకొచ్చి ‘నీకు సినిమా అవకాశం ఇప్పిస్తాను కానీ… కనీసం ఏదైనా డిగ్రీ చెయ్‌!’ అని నచ్చచెప్పాడట. ఏదో డిగ్రీ ఎందుకని సినిమాల గురించి నేర్పించే ‘విజువల్‌ కమ్యూనికేషన్‌’లోనే చేరాడు విజయ్‌. మూడేళ్లపాటు ఎలా ఉగ్గబట్టుకున్నాడో తెలియదుకానీ… డిగ్రీ చేతికి రాగానే ‘నాన్నా… ఇక నా దారి నేను చూసుకుంటా!’ అన్నాడు. తన పోర్ట్‌ఫోలియో పట్టుకుని స్టూడియోల చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. మరోవైపు, అతనికి తెలియకుండా, తండ్రి చంద్రశేఖర్‌ కూడా తన ప్రయత్నాలేవో చేయడం మొదలుపెట్టాడు. ‘నేను పక్కా కమర్షియల్‌ డైరెక్టర్‌ని. కానీ మావాణ్ణి నా తరహా సినిమాల్లో కాకుండా ఓ మంచి క్లాసిక్‌ సినిమా ద్వారా పరిచయం చేయాలనుకున్నాను. నాటి పేరున్న దర్శకులందరికీ వాడి ఫొటో చూపించి ‘నేను కొంత డబ్బు పెడతానండీ… మీరు సినిమా తీయండి!’ అన్నాను. ‘సారీ! మీవాడు హీరో ఏంటండీ, అసలు నటుడిగానే పనికిరాడు… బండమొహం వాడిది!’ అని మొహంమీదే చెప్పేశారు…’ అని గుర్తుచేసుకుంటారు చంద్రశేఖర్‌. తండ్రీకొడుకులిద్దరూ చెరో మార్గంలో ప్రయత్నించాక ఇక ఏదైతే అదవుతుందని ఓ పెద్ద సాహసానికి ఒడిగట్టారు…

‘ఇతను హీరోనా!’
‘విజయ్‌కేం! వాళ్లనాన్న డైరెక్టర్‌ కాబట్టి హీరో కాగలిగాడు…’ అన్నది విజయ్‌ ఎదుగుదల మీదున్న ఆక్షేపణ. ఆ మాటల్లో కొంతవరకే నిజం ఉందికానీ పూర్తిగా కాదు. చంద్రశేఖర్‌-శోభ దంపతులు సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి ముందు ఎన్నో కష్టాలుపడ్డారు. బాత్రూమ్‌లు కూడా లేని సింగిల్‌ రూమ్‌ అద్దె ఇంట్లోనే జీవితాన్ని ప్రారంభించారు. విజయ్‌ ఆ ఇంటే పుట్టాడు. అప్పట్లో శోభ గాయనిగా కచేరీలు చేస్తేకానీ ఇల్లు గడవని పరిస్థితి. అలా కచేరీలకి వెళ్లి ఆరుబయట ఏదైనా చెట్టుకి ఊయలకట్టి పడుకోబెట్టి ఆమె వెళ్లి పాటలు పాడి వచ్చేదట. విజయ్‌కి ఏడేళ్లు వచ్చేదాకా ఆర్థికంగా ఇలా సతమతమవుతూనే వచ్చింది ఆ కుటుంబం. ఆ తర్వాతే దంపతులిద్దరూ విజయ్‌కాంత్‌తో ‘చట్టం ఒరు ఇరుట్టరై’ సినిమా తీశారు. తెలుగులో చిరంజీవి హీరోగా ‘చట్టానికి కళ్లులేవు’, హిందీలో అమితాబ్‌తో ‘అంథా కానూన్‌’… ఇలా కన్నడ, మలయాళంలోనూ రీమేక్‌ చేశారు ఆ సినిమాని. అన్నిచోట్లా బంపర్‌హిట్టు సాధించడంతో ఆ కుటుంబం నిలదొక్కుకుంది. ఆ తర్వాత ఎన్నో సూపర్‌హిట్టు సినిమాలు అందించినా… 1992 నాటికి వరస ఫ్లాపులొచ్చాయి. సరిగ్గా అప్పుడే విజయ్‌ హీరోగా సినిమాల్లోకి వెళతానని పట్టుబట్టాడు. చేసేది లేక అప్పు తెచ్చి రూ.60 లక్షలతో విజయ్‌ని హీరోగా పెట్టి ‘నాళయ తీర్పు’ అనే సినిమా తీశారు. పన్నెండేళ్ల ఎం.ఎం.శ్రీలేఖని సంగీతదర్శకురాలిగా పరిచయం చేసి గిన్నిస్‌ రికార్డు సృష్టించిన ఆ చిత్రంలోని పాటలు సూపర్‌హిట్టయ్యాయి కానీ… సినిమా పెద్ద ఫ్లాపయింది. ఎద్దుపుండు కాకికి ముద్దన్నట్టు నాటి పత్రికలన్నీ విజయ్‌ నటనని చీల్చిచెండాడాయి. ‘తండ్రి దర్శకుడైనంత మాత్రాన తగుదునమ్మా అని హీరోగా వస్తే ఎలా!’ అంటూ ఏకిపారేశాయి. ‘సరిగ్గా క్రిస్మస్‌ రోజు ఆ రివ్యూలు వచ్చాయి. ఆ రాతల్ని చూసి కొత్త బట్టలన్నీ విసిరేసి భోరుమని ఏడుస్తూ కూర్చున్నాను. దాదాపు రెండు నెలలపాటు ఫ్రెండ్స్‌నీ రానివ్వలేదు. అదెంత తప్పో ఆ తర్వాతే అర్థమైంది. నిజానికి, ఆ స్నేహితులే నన్ను మళ్లీ మనిషిని చేశారు. ‘పొగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలిరా విజయ్‌! ఇవే పత్రికలు రేపు నీ గురించి ఆహాఓహో అని రాసేలా చేయాలి..!’ అని కసిని పెంచారు. ఆ కసితోనే ఈసారి ఇల్లు తనఖాపెట్టి మరి ఓ సినిమా తీయడం మొదలుపెట్టారు…

బండమొహం, వీడు హీరో ఏంటి... అన్నారు!<br /><br />

‘కెప్టెన్‌’ ఆదుకున్నారు…
‘మానాన్నగారి తొలి సినిమాతో స్టార్‌ అయిన కెప్టెన్‌’ విజయ్‌కాంత్‌ నాకు సాయపడటం కోసం వచ్చారు. నా రెండో సినిమాకి పైసా పారితోషికం తీసుకోకుండానే అతిథిపాత్ర చేసేందుకు ఒప్పుకున్నారు. అలా సెందూరపాండి(తెలుగులో బొబ్బిలి రాయుడు) అనే సినిమా తీశాం. విజయ్‌కాంత్‌గారి ఆ అతిథిపాత్రే నన్నూ, నా సినిమానీ ‘బీ’ అండ్‌ ‘సీ’ ప్రేక్షకుల్లోకి తొలిసారి తీసు కెళ్లింది. సినిమా సూపర్‌హిట్టయింది. మొదటి సినిమాతో కోల్పోయిన నాన్న ఆస్తులు తిరిగొచ్చేశాయి. కానీ తర్వాతేమిటీ… ప్రతిసారీ విజయ్‌కాంతో రజినీకాంతో వచ్చి ఆదుకోరుకదా! నన్ను మాత్రమే చూసి ప్రేక్షకులెలా థియేటర్‌లకి రావాలి?’ అన్న ప్రశ్న మొదలైంది నాలో!’ అంటాడు విజయ్‌. ఆ ప్రశ్నకి సమాధానంగానే డాన్స్‌పైన కసరత్తు మొదలుపెట్టాడు. కరాటే నేర్చుకున్నాడు. పగలూరాత్రీ ఇంకే ధ్యాసాలేకుండా సాధన చేశాడు. అలా దాదాపు ఏడాది! ఆ తర్వాత సరికొత్త విజయ్‌గా ‘రసిగన్‌’ అనే సినిమా చేశాడు. ఒకప్పుడు బండమొహంగాడు అన్న ప్రేక్షకులే ‘అరె… వీడు డ్యాన్సు భలే చేస్తున్నాడ్రా, ఫైట్సు అదరగొడుతున్నాడ్రా!’ అనడం మొదలుపెట్టారు. ఆ సినిమా ‘సిల్వర్‌ జూబ్లీ’ చేసుకుని, సూపర్‌హిట్ల పరంపరకి ప్రారంభంగా మారింది. రెండేళ్లపాటు వరస మాస్‌ సినిమాల తర్వాత ‘పూవే ఉనక్కాగ’(తెలుగు శుభాకాంక్షలు) చిత్రంతో క్లాస్‌ ప్రేక్షకుల్నీ కట్టిపడేశాడు. మరో మూడేళ్ల తర్వాత మలయాళ దర్శకుడు ఫాజిల్‌ తీసిన ‘కాదలుక్కు మరియాదై’తో స్టార్‌ స్టేటస్‌ అందుకున్నాడు. ఆ ఏడాది ఓ పత్రిక తమిళనాడు వ్యాప్తంగా ఉన్న మహిళా కళాశాలల్లో ఓ సర్వే నిర్వహిస్తే 70 శాతం మంది ‘ఒకప్పుడు రజినీకాంత్‌. ఇప్పుడు మాత్రం మా ఫేవరేట్‌ విజయ్‌’ అంటూ ఓటేశారు! ఇప్పటిదాకా ఆ స్థానంలో ఏ మార్పూ లేదు. ఇక వరసగా ‘ఖుషీ’, గిల్లీ(తెలుగు ఒక్కడు), పోకిరి(తెలుగు రీమేక్‌) వంటివి తమిళనాడు లోనే కాదు కేరళలోనూ అతణ్ణి స్టార్‌ని చేశాయి. కానీ… ఎందుకో 2007 నుంచి ఆ ప్రాభవం తగ్గడం మొదలైంది…

ఐదేళ్లు… నో హిట్‌!
ఏ స్థాయి హీరోకైనాసరే వరసగా ఒకట్రెండు ఫ్లాపులొస్తేనే తట్టుకోవడం కష్టం. అలాంటిది విజయ్‌కి వరసగా ఐదేళ్లపాటు ఏడు సినిమాలు ఫెయిలయ్యాయి. కానీ విజయ్‌ కుంగిపోలేదు. కసిగా ఓ మంచి అవకాశం కోసం చూస్తూ వచ్చాడు. ఆ అవకాశం శంకర్‌ చిత్రం ‘స్నేహితుడు’ రూపంలో వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘తుపాకి’ తెలుగులోనూ హిట్టు కొట్టింది. ‘అదిరింది’, ‘సర్కార్‌’, ‘విజిల్‌’, తాజాగా ‘మాస్టర్‌’ వంటి సినిమాలు విజయ్‌ని మనకి మరింతగా చేరువచేశాయి! ఆ మూడూ కలిసి వెయ్యికోట్లపైచిలుకు కలెక్షన్స్‌ రాబట్టాయి. ఈ నేపథ్యంలోనే తొలిసారి ‘బీస్ట్‌’తో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంలో నటించబోతున్నాడు. ఆ తర్వాత వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న మరో సినిమాకి సైన్‌ చేశాడు.

దానికీ మౌనమే…
విజయ్‌ తన అభిమాని సంగీతనే పెళ్ళిచేసుకున్నాడు. వాళ్లకి ఇద్దరు పిల్లలు. అబ్బాయి జేసన్‌ యూట్యూబ్‌లో వీడియో జాకీగా కనిపిస్తుంటాడు. తన కూతురికి చెల్లెలు విద్య పేరుని గుర్తుకు తెచ్చేలా దివ్య అని పేరుపెట్టాడు విజయ్‌. ఆ పాప బ్యాడ్మింటన్‌లో రాణిస్తోంది. ఇదిలా ఉంటే ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’(విజయ్‌ ప్రజా సంఘం) పేరుతో గత 15 ఏళ్లుగా విద్య, వైద్యరంగాల్లో సేవలందిస్తున్నాడు. ఈ సంఘం రాజకీయపార్టీగా మారుతుందనే అంచనాలు గట్టిగా ఉన్నా విజయ్‌ దానిపైన పెదవి విప్పడం లేదు… ఎప్పట్లాగే మౌనంగానే ఉండిపోతున్నాడు!