హీరో ఆర్య

మూడు రోజులు శవాల మధ్యే ఉన్నా..!

మూడు రోజులు శవాల మధ్యే ఉన్నా..!

 

చిన్నప్పటి నుంచీ సినిమా కలలు కనడం వేరు… అకస్మాత్తుగా పరిశ్రమలోకి వచ్చి కెరీర్‌ని నిలుపుకోవడం వేరు. ఎత్తూపల్లాలూ, ఆటుపోట్లూ ఇద్దరికీ ఒకటే అయినా… అనుకోకుండా ఈ రంగంలోకి వచ్చినవాళ్లకి అవి విసిరే సవాళ్లు చాలా పెద్దవి. హీరో ఆర్య ఈ రెండో కోవకి చెందినవాడు. పదహారేళ్లకిందట ఓ మామూలు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉన్న అతని కాలికి అనూహ్యంగానే సినిమా తీగ తగిలింది. ఆ తీగని పట్టుకుని ఆర్య చేసిన ప్రయాణంలో ‘సార్పట్ట’లాంటి శిఖరాలే కాదు ఎన్నో లోయలూ ఉన్నాయి. ఆ సాహసాల ప్రయాణం అతని మాటల్లోనే…

చిన్న ప్రేమ కథతో మొదలుపెడతాను. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ వేసవి సెలవులప్పుడు మా అమ్మమ్మవాళ్ల ఊరెళ్లాను. అక్కడో అమ్మాయిని చూడగానే ప్రేమించేశాను. కాకపోతే, ప్రేమిస్తే ఎక్కువసేపు వాళ్లతోనే గడపాలనే ఇంగితం నాకప్పుడు లేదు. ఎప్పుడూ నాకెంతో ఇష్టమైన ఫుట్‌బాల్‌లో మునిగితేలుతుండేవాణ్ణి. ఓ వారం గ్యాప్‌ తర్వాత ఆ అమ్మాయి ఎదురుగా వెళ్లి నవ్వితే ముఖం తిప్పుకుంది. పదిరోజులైనా అదే వరస. ఓ రోజు ఎందుకిలా చేస్తున్నావని నిలదీస్తే ‘నీకు నాపైనకన్నా ఆటలపైనే ప్రేమ ఎక్కువలా ఉంది. నాట్‌ ఓన్లీ దట్‌, నువ్వు రివటలా మాన్లీనెస్‌లేకుండా ఉన్నావని నా ఫ్రెండ్స్‌ ఎగతాళి చేస్తున్నారు…’ అంది. ఆ చివరి వాక్యాలు నా గుండెల్లో గునపంలాగా దిగాయి. అప్పట్లో బాగా అమ్మ కూచీని నేను. వెంటనే అమ్మదగ్గరకు వెళ్ళి, కళ్ళనీళ్ళతో జరిగిందంతా చెప్పాను. ‘అరె… మీ వయసులో ఇవన్నీ మామూలేరా! ఆ అమ్మాయి తప్పేమీ లేదని నువ్వు పోనుపోను అర్థం చేసుకుంటావ్‌!’ అని ఓదార్చింది. నిజానికి అప్పుడు నాకు అమ్మ మీదే చాలా కోపం వచ్చింది. ‘నాకు ఆటలపైన ఇంత ఇంట్రెస్ట్‌ రావడానికి నువ్వే కారణం. అందువల్లే నేను సన్నగా ఉన్నాను!’ అని చెప్పాను. ‘సరేలే బాబూ! చెన్నై వెళ్లాక జిమ్‌లో చేరుదువులే… అప్పుడు గ్రీకువీరుడిలా తయారవుతావ్‌!’ అంది అమ్మ భరోసా ఇస్తున్నట్టు. ఆ భరోసానే నన్ను పదహారేళ్లకే జిమ్‌వైపు నడిపించింది. నేను నటుణ్ణి కావడానికి కూడా ఓ రకంగా అదే కారణమైంది.

నాన్న కలలు వేరు…
కేరళకి చెందిన ముస్లిం కుటుంబం మాది. నేను పుట్టాక నాన్న తన బిజినెస్‌ కారణంగా చెన్నైకి వచ్చి స్థిరపడ్డారు. మామూలుగా మగపిల్లలు వ్యాయామాల్ని తండ్రి ప్రోత్సాహంతోనే నేర్చుకుంటారు. కానీ మా ఇంట్లో అందుకు పూర్తిగా భిన్నం. అమ్మే నన్ను ముందు ఆటలవైపూ, ఆ తర్వాత కసరత్తుల వైపూ నడిపించింది. నాన్నకి వీటిపైన పెద్దగా ఆసక్తి లేదు. నేను అమెరికా వెళ్లి చదువుకోవాలన్నది ఆయన కల. ఆయన భయంతో బాగానే చదువుతూ ర్యాంకులు సాధిస్తూ వచ్చాను. కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చదివాను. అమెరికా వెళదామని జీఆర్‌ఈ రాశానుకానీ… డబ్బులు సరిపోలేదు. దాంతో ఏడాదిపాటు ఉద్యోగం చేసి ఆ తర్వాత వెళదామనుకున్నా. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా ఓ ఐటీ కంపెనీలో చేరాను. మరో మూణ్ణెలల్లో యూఎస్‌ విమానం ఎక్కడానికి ప్రణాళికలూ సిద్ధంచేసుకున్నాను. అప్పుడే అమెరికాలో 9/11 సంఘటన చోటుచేసుకుంది. ఆ ఆంక్షలన్నీ ఎత్తేసేటప్పటికి ఆరునెలలు గడిచాయి. ఈలోపు అమెరికన్‌ కాలేజీల్లో కొత్త విద్యాసంవత్సరం కూడా మొదలైపోవడంతో ఆ తర్వాతి ఏడాది చూద్దామని ఆగిపోయాను. మరోవైపు నేను చేస్తున్న ఐటీ ఉద్యోగం కాంట్రాక్టు పూర్తయిపోయింది. మళ్లీ ఉద్యోగాలు దొరకడం గగనమైంది. ఎటూపాలుపోని నాకు కొత్తదారి చూపించింది… మోడలింగ్‌!

సినిమా ఆసక్తి లేదన్నా…
మోడలింగ్‌ అనగానే పెద్దగా ఊహించుకోకండి. చిన్నచిన్న అందాల పోటీలూ, ర్యాంప్‌ వాక్‌ కార్యక్రమాల్లో పెద్ద మోడళ్ల వెనకాల ఊరికే నిల్చోమని చెప్పేవారు. వాళ్లు పదోపరకో ఇస్తుంటే పాకెట్‌మనీగా ఉపయోగించు కునేవాణ్ణి. అప్పట్లో నాకు పరిచయమైన మనోజ్‌ అనే స్నేహితుడు టీవీల్లో యాంకర్‌గా ఉంటూ… సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుండేవాడు. నన్నూ రమ్మంటే ఆసక్తిలేదని చెప్పాను. వాడెంత మంచివాడంటే… తాను స్టూడియోలకి వెళ్లినప్పుడు నా ఫొటోలూ చూపించి నాకూ ఓ ఛాన్స్‌ ఇమ్మని అడిగేవాడు. అలా ఇద్దరికీ ఓ చిన్న సినిమాలో అవకాశం వచ్చింది… తనకేమో హీరో ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌లో ఒకడిగా… నాకేమో హీరోయిన్‌ని చెరపట్టే పోలీసు విలన్‌గా! డబ్బొస్తుంది కదా ఏదైతే ఏమనుకుని ‘సరే’ అన్నాను. ఈ మధ్యలోనే ఓ విచిత్రం జరిగింది. ‘12బి’ వంటి వైవిధ్యమైన సినిమా తీసిన దర్శకుడు జీవా తన కొత్త సినిమా కోసం నటుల్ని వెతుకుతూ ఉన్నారట. ఆయన ఓ ముస్లిం అమ్మాయిని పెళ్లిచేసుకుని మతం మార్చుకున్నారు. ఓ రోజు మసీదుకి వస్తూ నన్ను చూశారట. తాను అనుకున్న క్రికెటర్‌ పాత్రకి నేను సరిపోతానని భావించి… స్క్రీన్‌ టెస్ట్‌కి రమ్మని కబురు పంపారు. అంత మంచి దర్శకుడు పిలుస్తున్నాడని విని… గాల్లో తేలిపోతున్నట్టే స్టూడియోకి వెళ్లాను.

యాక్షన్‌ నం.1,2,3…
‘నీకు నటన కాదు కదా… నవ్వడం కూడా రావడం లేదబ్బాయ్‌!’ అన్నాడు దర్శకుడు జీవా స్క్రీన్‌ టెస్టు చేస్తూ! ఆ మాటతో ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు అవకాశమివ్వరన్న గట్టి నమ్మకంతో ఇంటికొచ్చాను. కానీ వారం తిరక్కుండానే జీవా ఫోన్‌ చేశారు. ‘నీకు యాక్టింగ్‌ రాకున్నా నీ పర్ఫెక్ట్‌ ఫిజిక్‌ కారణంగానే ఈ సినిమాకి సెలెక్ట్‌ చేస్తున్నా. ఆ శరీరం ఇచ్చినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్‌ చెప్పాలి నువ్వు!’ అన్నాడు. ‘కాదు… సార్‌. మా అమ్మకి చెప్పాలి’ అని ఇంటర్‌లో జరిగిన నా ప్రేమ కథ చెప్పాను! అది విని నవ్వేశారు. కానీ ఆ నవ్వు ఆ నిమిషానికే పరిమితమైంది. షూటింగ్‌ మొదలైనప్పటి నుంచీ నాపాలిట యముడిలా తయారయ్యాడాయన. ఏ ఎక్స్‌ప్రెషనూ రావడంలేదని అందరి ముందూ చెడామడా తిట్టేవాడు. పాపం… ఆయన మాత్రం ఏం చేస్తాడు! కెమెరా వెనక నుంచి ఆయన ఎన్ని సార్లు నటించి చూపినా నేను అందుకోలేకపోయేవాణ్ణి. ప్రతి సీనుకీ 30-40 టేకులు తీసుకునేవాణ్ణి. ఓ దశలో నాకు ఇది పెద్ద నరకంలా తోచింది. ఇదివరకే ఓ చిన్న పాత్రకి ఒప్పుకున్నానని చెప్పాను కదా… ఆ సినిమా వాళ్లు పిలుస్తున్నారని చెప్పి ఇక్కడి నుంచి ఉడాయించాలనుకున్నాను! ఆ మాట మా సినిమా అసోసియేట్‌ డైరెక్టర్‌తో చెబితే… నన్ను కొట్టినంత పనిచేశాడు. ‘అంత కృతజ్ఞత లేనివాడివా నువ్వు?!’ అన్నాడు చురచుర చూస్తూ. ఆయన నన్ను కొట్టకున్నా… ఆ ప్రశ్న చెంపదెబ్బలాగే తగిలింది. దాంతో నటనలో మెల్లగా లీనం కావడం మొదలుపెట్టాను. దర్శకుడు జీవా కూడా ఓ చిన్నపిల్లాడి చేత అక్షరాలు దిద్దిస్తున్నట్టు రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌ని నేర్పించాడు. వాటికి యాక్షన్‌ 1(నవ్వు), యాక్షన్‌ 2(ఏడుపు)… ఇలా నంబర్లేసి ప్రాక్టీస్‌ చేయమనేవాడు. అలా రోజంతా కూర్చుని 20 ఎక్స్‌ప్రెషన్స్‌ సాధన చేసేవాణ్ణి. పోనుపోను షూటింగ్‌ స్పాట్‌లో తిట్టిన వాళ్లే మెచ్చుకోవడం మొదలుపెట్టారు. మొత్తానికి షూటింగ్‌ పూర్తయ్యేనాటికి నటుణ్ణయిపోయాననే నమ్మకం వచ్చింది. అప్పుడే జమ్‌షద్‌ అన్న నా అసలు పేరుని దర్శకుడు ఆర్యగా మార్చి అందరికీ పరిచయం చేశాడు. ఉల్లం కేక్కుమే(తెలుగులో ‘ప్రేమించి చూడు…’) అన్న ఆ సినిమాతో అందరం మా దశ తిరిగిపోతుందని వందశాతం నమ్మాం! కానీ ఆ సినిమా విడుదలకి మూడేళ్లు ఆలస్యమైంది!

సినిమా మొత్తానికీ ఒక్కటే డ్రెస్‌!
చేసింది మంచి సినిమానే అయినా… విడుదలకి నోచుకోకపోవడం వల్ల ఇండస్ట్రీలో నాకు మరే అవకాశమూ రాలేదు. మళ్లీ ఉద్యోగం వైపు వెళ్లాలంటే… ఏడాది గ్యాప్‌ కారణంగా ఐటీ నైపుణ్యాల్లో వెనకపడిపోయున్నాను. మళ్లీ జీరో నుంచి మొదలుపెట్టడం నాకిష్టంలేదు. దాంతో నా ప్రొఫైల్‌ పట్టుకుని స్టూడియోల చుట్టూ తిరగడం ప్రారంభించాను. ఏ నేపథ్యమూ లేని యువకులు అవకాశాల కోసం ఎన్ని అవమానాలు ఎదుర్కొంటారో అప్పుడు అర్థమైంది నాకు..! అలా రెండేళ్లు ఎన్నో మెట్లెక్కి దిగాక… దర్శకుడు విష్ణువర్థన్‌ కలిశాడు. చాలా చిన్న బడ్జెట్‌ సినిమా అతనిది. సినిమా మొత్తం నాకు ఒక్క కాస్ట్యూమే. అదీ ఒక్క డ్రెస్సునే ప్రతిరోజూ ఉతికి ఇచ్చేవాళ్లు. ‘అరిందుమ్‌ అరియామలుం’(తెలుగులో ‘కలిసుంటే…’) అన్న ఆ సినిమాలో నవదీప్‌, ప్రకాశ్‌రాజ్‌తో కలిసి నటించాను. ప్రివ్యూ సమయంలో టైటిల్‌ కార్డుపైన తొలిసారి నా పేరుని చూశాక కన్నీళ్లాగలేదు. ఆ సినిమా సూపర్‌హిట్టు కావడమే కాదు… నాకు ఫిలింఫేర్‌ అవార్డూ తెచ్చిపెట్టింది. దర్శకుడు విష్ణువర్థన్‌ అదే వేడిలో ‘పట్టియల్‌’(తెలుగులో ‘గాయం’ పేరుతో డబ్‌ అయింది) సినిమా తీస్తే అదీ సూపర్‌హిట్టయింది. ఆ రెండింటి తర్వాతే నా మొదటి సినిమా రిలీజైంది. ఆలస్యమైనా… జీవాగారి ముద్ర కారణంగా సూపర్‌హిట్టుగా నిలిచింది. అలా కెరీర్‌ స్టార్టింగ్‌లో హ్యాట్రిక్‌ విజయాలని చవిచూస్తుండగానే… నాకంటూ జీవితాన్నీ, పేరునీ ఇచ్చిన దర్శకుడు జీవా గుండెపోటుతో చనిపోయారు. సొంత అన్నయ్య చనిపోయినట్టే విలవిల్లాడిపోయాను. దర్శకుడు బాలతో ‘నేను దేవుణ్ణి’ సినిమా చేసేదాకా అందులో నుంచి బయటపడలేకపోయాను.

అచ్చం అఘోరీలాగే…
సినిమా షూటింగ్‌కి ముందే- ఓ అఘోరి సాధువు తలకిందులుగా(శీర్షాసనంతో) తపస్సు చేస్తున్న ఫొటో చూపించాడు బాల. ‘నువ్వు డూప్‌ లేకుండా ఇలా చేయాలి!’ అన్నారు. అదెలా చేయాలో నేర్పించాలని ఓ యోగామాస్టర్‌ని అడిగితే అందుకు కనీసం ఏడాది పడుతుందన్నారు! ఆయన దగ్గరే సాధన మొదలుపెట్టాను. తిండీతిప్పలూ మాని రోజుకి 20 గంటలు సాధన చేశాను. రెండువారాలకి పట్టు సాధించగలిగాను. బాల ఎదుట ఆ శీర్షాసనం వేసి చూపిస్తే ‘నువ్వు రాక్షసుడివిరా…’ అన్నారు బాల మెచ్చుకోలుగా. ఆ సాధన ఒక ఎత్తైతే షూటింగ్‌కి ముందు కాశీ శ్మశానవాటికల్లో తిరగడం ఒక ఎత్తు. మూడురోజులు అక్కడి శవాల మధ్యే నన్ను కూర్చోబెట్టి అఘోరీ సాధువుల్ని గమనిస్తూ ఉండమన్నాడు. మొదట్లో కళ్లు తిరిగేవి, డోకు వచ్చేది. ‘మన భారతీయ సినిమాల్లో ఇప్పటిదాకా ఎవరూ అఘోరీగా చేయలేదు. నీకెవ్వరూ రిఫరెన్స్‌ లేరు. కాబట్టి… ఇవన్నీ నువ్వు చూడాల్సిందే’ అన్నాడాయన. ఇన్ని కష్టాలు పడితేనే… ‘నేను దేవుణ్ణి’ సినిమా నా కెరీర్‌నే మార్చేసింది. ఆ సినిమాతో అవకాశాలెన్ని వస్తున్నా కొత్తతరహా కథలూ, దర్శకులకే ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టాను. తెలుగులో ‘వరుడు’లాంటి సినిమా అలా చేసిందే. ‘నేను అంబానీ’, ‘రాజారాణీ’ వంటి సినిమాలు నాకు ఇక్కడా అభిమానుల్ని సంపాదించిపెట్టాయి.

పన్నెండు గంటలూ… ఏడునెలలూ!
2018 తర్వాత నాకు పెద్దగా కలిసిరాలేదు. మళ్లీ నన్ను నేను నిరూపించుకునే అవకాశం కోసం కసిగా చూస్తున్నప్పుడే ‘సార్పట్ట’ తలుపుతట్టింది. 2020 ఫిబ్రవరి నుంచి మూడునెలలే మేం షూటింగ్‌ అనుకున్నాం. ఇందుకోసం రోజూ 12 గంటల ప్రాక్టీస్‌ చేయడం మొదలుపెట్టాను. తీరా షూటింగ్‌కి వెళ్లేదశలో కరోనా లాక్‌డౌన్‌ వచ్చిపడింది. కానీ నెలా, రెండు నెలల్లో షూటింగ్‌ ఉంటుందనే నమ్మకంతో శిక్షణ మానుకోలేదు. అలా ఏడునెలలు చేశాను! అదలా ఉంటే, చిత్రీకరణ మళ్లీ మొదలైన కొన్నాళ్లకే బడ్జెట్‌ చేయిదాటిపోయింది. దర్శకుడు రంజిత్‌ చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. అంత మంచి సినిమా ఆగిపోతుందేమోనని విలవిల్లాడిపోయాను. అప్పుడే నాకు సన్నిహితుడైన నిర్మాత షణ్ముగం సహ నిర్మాతగా ప్రాజెక్టులోకి వచ్చి ఆదుకున్నాడు. ఎన్నో ఇబ్బందుల మధ్య ఈ సినిమాని
గట్టెక్కించిన ఆయన… రిలీజుకి వారంముందు గుండెపోటుతో చనిపోయాడు. ఆ వార్తతో చిన్నపిల్లాడిలా ఏడ్చేశాను. దర్శకుడు జీవా చనిపోయినప్పటి రోజులు మళ్లీ గుర్తుకొచ్చాయి. సినిమా విడుదలయ్యాకా మరోసారి కన్నీటి జడిలో తడిసిపోయాన్నేను… కాకపోతే ఇవి ఆనందభాష్పాలు. అందుక్కారణం సినిమా విజయం మాత్రమే కాదు. మరొకటీ ఉంది…

 


మూడు రోజులు శవాల మధ్యే ఉన్నా..!

తెలుగులో నానీ ‘భలే భలే మగాడివోయ్‌’ సినిమా తమిళ రీమేక్‌ ‘గజినీకాంత్‌’లో నేనే హీరోని. సాయేషా అందులో హీరోయిన్‌. గజినీకాంత్‌తోపాటూ మరో రెండు సినిమాలు కలిసి చేసిన మేం ఒకరినొకరం ఇష్టపడ్డాం. పెద్దవాళ్లని ఒప్పించి రెండేళ్ల కిందట పెళ్ళిచేసుకున్నాం. ‘సార్పట్ట’ సినిమా విడుదలైన రెండోరోజే మాకు పాప పుట్టింది. ఓ పెద్ద విషాదాన్ని మరిపించిన ఆనందభాష్పాలకి ఆ రెండో కారణం… నా చిట్టితల్లి రాకే!

దర్శకురాలు లక్ష్మీ సౌజన్య

నాన్నపోతే.. చుక్క కన్నీరు కార్చలా

నాన్నపోతే.. చుక్క కన్నీరు కార్చలా

‘రాక్షసి’, ‘మొండిది’, ‘రాతిగుండె’… వరుడు కావలెను సినిమా కథానాయిక భూమిక గురించి అందరూ అనుకునే మాటలివి! పనిలో దిగితే తననూ అలాగే అంటారంటుంది నవ యువ దర్శకురాలు లక్ష్మీ సౌజన్య. కాకపోతే, భూమికది ప్రేమ పోరాటమైతే… ఆ పాత్ర సృష్టికర్త సౌజన్యది బతుకు పోరాటం. సినిమా కథల్ని మించిన ఆ పోరాటగాథ తన మాటల్లోనే..

11 ఏళ్లకే ఎస్‌ఎస్‌సీ పాస్‌..   బాలిక రికార్డు! – 1995లో నా గురించి వచ్చిన ఓ వార్త హెడ్డింగ్‌ ఇది. మరో పదమూడేళ్ల తర్వాత మళ్లీ నా పేరు వార్తల్లోకెక్కింది. ఈసారి విభిన్నమైన కారణంతో. దాని శీర్షిక…తండ్రికి తలకొరివి పెట్టిన తనయ -అని. సరిగ్గా ఇంకో పదమూడేళ్లకి… కొత్త దర్శకురాలితో ‘వరుడు కావలెను’ – అన్న హెడ్డింగ్‌తో మరో వార్త వచ్చింది…
ఈ మూడు వార్తలకూ అటూ-ఇటూ ఉన్నదే నా జీవితం అని చెప్పాలి. ఆ వార్తల్లో ఇమడ్చని ఎన్నో కష్టనష్టాలూ, చూసిన జయాపజయాల పడుగూపేకే నా ఈ ప్రయాణం…స్వాతంత్య్రం తర్వాత గుంటూరు కరవు మండలాల నుంచి రాయలసీమ తుంగభద్ర నది పక్కన స్థిరపడ్డ రైతు కుటుంబాల్లో… మాదీ ఒకటి. నాన్నకి ఐదేళ్లున్నప్పుడే మా తాతయ్యవాళ్లు కర్నూలు దగ్గర్లోని వెంకటాపురం అన్న గ్రామానికొచ్చారట. నాన్న అక్కడే చదువుకుని ఎమ్మెస్సీలో గోల్డ్‌మెడలిస్టయ్యాడు. కాకపోతే 1970ల నాటి కర్నూలులోని యువకుల్లాగే అక్కడి ఫ్యాక్షన్‌ రాజకీయాలతో ఆయనకి పరిచయాలేర్పడ్డాయి. మా ఇంట్లోనూ తుపాకులూ బాంబులూ ఉండేవంటారు! ఆ తర్వాత నాన్న అవన్నీ వదిలేసి గుంటూరు నరసరావుపేటకొచ్చారు. నేను అక్కడే చదువుకున్నాను. మూడో తరగతి నుంచి నేరుగా ఐదో తరగతిలోకి, అట్నుంచటు ఏడుకి, తర్వాత ఏకంగా పదో తరగతిలోకి చేర్చుకున్నారు. ప్రత్యేక అనుమతులతో పదకొండేళ్లకే పదో తరగతి పరీక్ష రాసి పాసయ్యాను. నాన్న ప్రయివేటు ట్యూషన్‌లు చెప్పినా సరైన ఆదాయం లేకపోవడంతో పొలం పనులూ చేసేవారు. చిన్నప్పటి నుంచి నేనూ ఆ పనులన్నీ నేర్చుకున్నాను. మా అన్నయ్య నెలల బిడ్డగా ఉన్నప్పుడే ఏదో అంతుతెలియని వ్యాధితో కాళ్లూచేతులూ పడిపోయాయట. మాటలూ రాక మంచానికే పరిమితమయ్యాడు. అమ్మా నేనే తనకన్నీ చూసేవాళ్లం. ఆడపిల్లనైనా సరే పగలూ రాత్రని చూడకుండా సైకిల్‌మీద వెళ్లి ఇంటిక్కావాల్సిన సమస్తం తెచ్చిపెడుతుండేదాన్ని. ఈ పనుల వల్లో లేక నా స్వభావమే అంతేనేమో తెలియదు కానీ మా ప్రాంతంలో నేనో మగరాయుడిలా మారిపోయాను. దానికి మొండితనమూ జతైంది. అది ఎలా మొదలైందో చెబుతాను…
వార్డెన్‌ని కొట్టేశాను…
నాన్న తనలాగే నేనూ ఎమ్మెస్సీలో గోల్డ్‌మెడలిస్టుని కావాలని ఎంపీసీలో చేర్చారు. నాకేమో మ్యాథ్స్‌ అంటే చచ్చేంత భయం. నేను వద్దంటున్నా విన్లేదు. దాంతో లెక్కలపైనున్న భయాన్నంతా కోపంగా మార్చుకున్నాను. అప్పటికే టీనేజీలోకి వచ్చేశాను కదా… అబ్బాయిలెవరైనా వెకిలి వేషాలేస్తే చుక్కలు చూపించేదాన్ని. శ్రావణ శుక్రవారాలప్పుడు అనుకుంటా… అమ్మాయిలం అందరం ఓణీలు వేసుకుని వెళ్లేవాళ్లం. ఆ ఓణీలతో మేం నడిచి వెళ్లే అందం చూడాలనుకున్నాడేమో… మా క్లాసు తుంటరి ఒకడు మా సైకిల్‌ టైర్‌ల గాలి తీసేస్తుండేవాడు! మేం సైకిల్‌ తోసుకుంటూ వెళ్లడాన్ని సరదాగా చూస్తుండేవాడు. నాకెందుకో అనుమానం వచ్చి ఓ రోజు నిఘాపెడితే… అసలు నిజం బయటపడింది. అంతే… అసెంబ్లీలో నిలబెట్టి వాడికి లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ పీకాను. మరోసారి, మా వార్డెన్‌ ఎందుకో కోపంతో నాలుక మడిచి కొట్టడానికి పైపైకి వస్తుంటే గెడ్డంకేసి గట్టిగా కొట్టాను. నోరంతా రక్తంతో నిండిపోయి విలవిల్లాడిపోయాడు. ఇలాంటివాటికి తోడు నా బుర్రకి మ్యాథ్స్‌ బొత్తిగా ఎక్కకపోవడంతో ఇంటర్‌ మొదటి ఏడాది ఫెయిలైపోయాను! ‘ఇంటికెళ్లి గేదెలు మేపుకోమ్మా’ అంటూ గేలిచేశారు అందరూ. అప్పటికి జ్ఞానోదయమై నాన్న దగ్గర బుద్ధిగా మ్యాథ్స్‌ నేర్చుకుని ఇంటర్‌ ముగించాను. ఇంతలో నాన్న నర్సరావుపేటలో నా పేరుతోనే ‘సౌజన్యా రెసిడెన్షియల్‌ స్కూల్‌’ అని పెట్టారు. ఆయనతోపాటూ నేనూ దాన్ని చూసుకోవడం ప్రారంభించాను. అందుకని డిగ్రీ కరస్పాండెన్స్‌లోనే చేశాను. ఉపాధ్యాయ వృత్తిలో తనకి తోడుగా నిలుస్తున్నానని నాన్న సంబరపడుతున్నప్పుడే… సినిమాలు నా దారిని మార్చాయి…

నాన్నపోతే.. చుక్క కన్నీరు కార్చలా

న్యూస్‌రీడర్‌గా నేను…
సినిమాలపైన మొదట్నుంచి నాకు పెద్ద ఆసక్తేమీ లేదు… ఊళ్ళో సెలవులప్పుడు నేలటికెట్టుతో పాత చిత్రాలు చూడటం తప్ప. కానీ లోలోపల నాకో దుగ్ధ ఉండేది. నాన్నకి ఉపాధ్యాయుడిగా ఎంత మంచి పేరున్నా బంధువులు ఆయన్ని బతకలేని బడిపంతులుగానే చూసేవారు. ప్రభుత్వోద్యోగులుగానూ, వ్యాపారస్తులుగానూ స్థిరపడ్డ తమకి ఆయన సాటికాదన్నట్టు ఉండేవారు. నాన్నని వాళ్ల మధ్య సగౌరవంగా నిలబెట్టాలంటే నాకు రెండే దారులు ఉన్నాయనుకునేదాన్ని. ఒకటి క్రీడలూ, రెండు…  సినిమాలు. నేను కబడ్డీ ఛాంపియన్‌ని. అటువైపు మరింతగా ముందుకెళ్లాలంటే సరైన శిక్షణా, పోషణా కావాలి. మాకు అంత డబ్బులేదు. దాంతో నా దృష్టి సినిమాల వైపు మళ్ళింది. అదీ సినిమాల్లో డైరెక్టర్‌కే అందరూ ఎక్కువగా విలువిస్తారని విని… నేనూ ఆ ఛెయిర్‌లో కూర్చోవాలనుకున్నాను. దొరికిన సినిమా పత్రికలన్నీ చదవడం మొదలుపెట్టాను.
ఓ రోజు నాన్నకి ఈ విషయం చెబితే ‘ఇదేం పిచ్చి?! మనకి అందులో ఎవరు తెలుసని…?’ అంటూ వారించాడు. ఆయన వద్దనేకొద్దీ నాలో పట్టుదల పెరిగింది. ఆరునెలల తర్వాత ‘నువ్వు రాకపోతే పో… నేను హైదరాబాద్‌ వెళతాను!’ అని బయల్దేరబోయాను. చివరికి ‘ఇంత మొండితనం పనికిరాదు’ అని తిట్టి నన్ను హైదరాబాద్‌ తీసుకొచ్చారు. ఆయన స్నేహితుల సాయంతో దేవదాస్‌ కనకాల యాక్టింగ్‌ స్కూల్‌లో చేర్చారు. అక్కడే యాంకర్‌ సుమతో నాకు పరిచయమైంది. మొదట్లో హాస్టల్‌లో ఉంటూ వచ్చిన నేను ఆ తర్వాత వాళ్లింట్లోకి మారిపోయాను. సుమతో కలిసి అప్పుడప్పుడూ షూటింగ్‌లకి వెళుతుండేదాన్ని. ఓ లోకల్‌ ఛానెల్‌లో న్యూస్‌రీడర్‌గా అవకాశం వస్తే చేరిపోయాను. ఆ తర్వాత ఈటీవీ, జెమిని టీవీల్లో యాంకరింగ్‌ చేశాను. అలా ఓసారి మహేశ్‌బాబునీ ఇంటర్వ్యూ చేసే అవకాశం దక్కింది. ఈ మధ్యలో దేవదాస్‌ కనకాల ఇన్‌స్టిట్యూట్‌ సాయంతో చెన్నైలోని అడయార్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో దర్శకత్వం కోర్సు కూడా చేశాను. ఆ తర్వాత చిన్నపాటి యాడ్స్‌ తీయడం ప్రారంభించాను. ఓసారి దూరదర్శన్‌ నుంచి పిలిచి ఓ యాడ్‌ చేయమన్నారు. ‘నేను చేయాలా?’ అని మొదట్లో తటపటాయించినా ‘దర్శకత్వం అన్నాక ఆడామగా అన్న తేడా లేదు. అన్నీ చేయాల్సిందే’ అనుకుని రంగంలోకి దిగాను… ఇంతకీ వాళ్లు చేసివ్వమన్నది ఓ కండోమ్‌ యాడ్‌..!

ది బెస్ట్‌ ‘ఏడీ’…
నేను చేసిన యాడ్‌ వెలుగులోకి రాగానే ‘ఈ యాడ్‌ ఎవరో అమ్మాయి చేసిందట!’ అన్న టాక్‌ యాడ్‌ రంగంలోనే కాదు… ఇటు సినిమాల్లోనూ వ్యాపించింది. ఆ యాడ్‌ చూశాకే దర్శకుడు తేజ తన ‘ధైర్యం’ సినిమాలో సహాయ దర్శకురాలిగా రమ్మన్నారు. అంతకన్నా కావాల్సిందేముంది… ఆ సెట్‌లో శాయశక్తులా శ్రమించి మంచి పేరు తెచ్చుకున్నాను. ఆ తర్వాత శేఖర్‌ కమ్ములగారి ‘గోదావరి’ సినిమాకీ పనిచేశాను. ఆ రెండు సినిమాలతో పరిశ్రమలో నాకు మంచి ‘ఏడీ’గా పేరొచ్చేసింది. మంచానికే పరిమితమైన మా అన్నయ్య చనిపోవడంతో అమ్మా నాన్నల్ని నా దగ్గరకి తెచ్చుకున్నాను. తర్వాత కృష్ణవంశీగారి దగ్గర చేరాను. జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘రాఖీ’తో మొదలుపెట్టి మూడు సినిమాలకి పనిచేశాను. నాకు ‘రాక్షసి’ అని పేరుపెట్టింది ఆయనే!
కృష్ణవంశీగారి ‘శశిరేఖా పరిణయం’ సినిమాలో పనిచేస్తుండగానే… హైదరాబాద్‌లోని ఓ పెద్ద ప్రయివేటు ఆసుపత్రి నుంచి ఫోన్‌ వచ్చింది. ‘మీ నాన్నగారు ఇక్కడ చెకప్‌కి వచ్చారు. ఓసారి మీతో మాట్లాడాలి…’ అని చెప్పారు అక్కడి చీఫ్‌ డాక్టర్‌.

ఆయన మాటలే…
ఉరుకులు పరుగుల మీద అక్కడికి చేరుకున్నాను. ‘మీ నాన్నకి పాంక్రియాస్‌ క్యాన్సర్‌ వచ్చిందమ్మా… ఫోర్త్‌ స్టేజీ! ఆరు నెలలకన్నా బతకడం కష్టం’ అన్నారు డాక్టర్లు. మెదడంతా ఒక్కసారిగా మొద్దుబారిపోయింది… నిలువునా పాతాళంలోకి కూరుకుపోతున్నట్టే అనిపించింది. నాన్నని తీసుకుని ఇంటికెళ్లేలోపే- పెళ్ళి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. నాకో మగతోడు కావాలన్నది అందుకు కారణం కాదు. ‘ఒక్కగానొక్క కూతురికి పెళ్ళి చేయకుండా పోయాడే’ అన్న మాట నాన్నకి రాకూడదనుకున్నాను. ఆయన దగ్గరకెళ్లి ‘మీరు ఎవర్ని చూసినా ఓకే నాన్నా… తాళి కట్టించుకుంటాను!’ అన్నాను. నాన్న నావైపు సూటిగా చూసి ‘నిన్ను ఎవడో ఒకడి చేతుల్లో పెట్టి ‘నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో బాబూ!’ అని చెప్పేంత అబలగా నేను నిన్ను పెంచలేదు. దర్శకురాలివి కావాలి అన్న లక్ష్యంతో నువ్వు జర్నీ చేస్తున్నావు. అవసరమైతే ఆ ప్రయాణంలో చచ్చిపోకానీ… దాన్ని వదిలి మాత్రం రావొద్దు!’ అన్నాడు. ఆ మాటలకి ఆయన చేతులు పట్టుకుని భోరున ఏడ్చేశాను. నాన్న ఎంత ఠీవిగా చావుని ఆహ్వానించారంటే… తనని 51 ఏళ్లకే మరణం కబళిస్తున్నా ఏ క్షణంలోనూ భయపడ్డది లేదు. పైగా ‘నేను పోతే నువ్వు అందరిలా ఏడవకూడదురా సౌజీ! అన్ని పనులూ నువ్వే దగ్గరుండి చూడాలి. అమ్మకి పసుపుకుంకుమలు తీసే తతంగమంతా వద్దు… తన బొట్టు నాతోనే వచ్చింది కాదు… నాతో పోనూకూడదు’ అన్నారు. వైద్యులు చెప్పిందానికన్నా ఓ నెలముందే… ఓ రోజు రాత్రి ఒంటిగంటకి కన్నుమూశారు నాన్న. అప్పటికప్పుడు ఆయన భౌతికకాయంతో నరసరావుపేటలోని మా సొంతింటికెళ్లాను. తలకొరివి పెట్టడానికి – కొడుకు వరసైన అబ్బాయిలు తటపటాయిస్తుంటే… ఆ పని నేనే చేశాను. గుండెలో బాధ సుడులు తిరుగుతున్నా… నాన్నకిచ్చిన మాట ప్రకారం చుక్క కన్నీరు రానివ్వలేదు. కర్మ తర్వాత నాన్న కోరుకున్నట్టే అమ్మ చేతికి బంగారు గాజులు తొడిగాను. ఇరుగుపొరుగు నోళ్లు నొక్కుకున్నా పట్టించుకోకుండా అమ్మ బొట్టుని అలాగే ఉంచేశాను..!

నాన్నపోతే.. చుక్క కన్నీరు కార్చలా

అవే కథలయ్యాయి…
నాన్న తన మరణాన్ని ఎదుర్కొన్న విధానం, స్త్రీలపైన ఆయనకున్న ఆ గౌరవం నా గుండెల్లో నిలిచిపోయాయి. వాటిలో నుంచి ఎన్నో కథలు పుట్టాయి..! ఆ కథల్నే ఊతంగా మార్చుకుని దర్శకురాలిని అయి తీరాలన్న పట్టుదలతో అడుగులేశాను. కథతో ఓ కామెడీ హీరో దగ్గరకెళితే ఆడవాళ్ల దర్శకత్వంలో చేయనని మొహానే చెప్పేశాడు. శర్వానంద్‌తో మరో సినిమా పట్టాలకెక్కినట్టే ఎక్కి ఆగిపోయింది. ఇన్ని ఇబ్బందులున్నా… మళ్లీ ఏడీగా వెళ్లదలచుకోలేదు. అలా వెళితే డబ్బొస్తుంది కానీ… ఎప్పటికీ దర్శకురాల్ని కాలేను అనిపించింది. దాంతో ఆర్థిక బాధలు చుట్టుముట్టాయి. చివరికి ఓ ఫ్రెండ్‌తో కలిసి చిన్న క్యాంటిన్‌ నడిపాను. సినిమా ప్రయత్నాలు ఏవీ కుదరక నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్న దశలోనే బాహుబలి ఎడిటర్‌ కోటగిరి వెంకటేశ్వరరావు నన్ను నిర్మాత చినబాబు దగ్గరకు తీసుకెళ్లారు. ‘వరుడు కావలెను’ కథ చెప్పగానే ఆయనకి నచ్చింది. అప్పటి నుంచి నా తల్లిదండ్రుల తర్వాత నేను గౌరవించే వ్యక్తిగా మారారు! 2020లో మేం షూటింగ్‌ మొదలుపెట్టగానే కరోనా లాక్‌డౌన్‌, ఇతరత్రా కారణాలతో షూటింగ్‌ ఆగిపోయింది. మొదలయ్యాకా మళ్లీ ఎన్నెన్నో సమస్యలు. వాటన్నింటినీ దాటుకుని ఎన్నో ఏళ్ల నా కలని ఇప్పుడు సినిమాగా మీ ముందుకు తెచ్చాను. దీని ఫలితం నాకెంతో సంతృప్తినిచ్చినా.. నాన్న ఈ విజయాన్ని చూసుంటే బావుండేది అన్న బాధ మనసులోతుల్లో కదలాడుతూనే ఉంది.

లిజోమోళ్‌జోస్‌

ఎలుకలు పట్టడానికి వెళ్ళా..!

ఎలుకలు పట్టడానికి వెళ్ళా..!<br />

ఆ మధ్య ‘ఒరేయ్‌ బామ్మర్ది’లో సిద్ధార్థ్‌ పక్కన మెరిసి… తాజాగా ‘జైభీమ్‌’లో చిన్నతల్లిగా నటించి… ఒక్కసారిగా అందరి చూపూ తనవైపు తిప్పుకుంది లిజోమోళ్‌జోస్‌. చిన్నతల్లిగా ప్రేక్షకుల చేత కూడా కన్నీళ్లు పెట్టించిన ఈ మలయాళ కుట్టి తన మనసులోని ముచ్చట్లను చెబుతోందిలా..


సినిమాల్లోకి ఎలా అంటే..

మా స్వస్థలం కేరళలోని ఇడుక్కి. మాది చాలా చిన్న కుటుంబం. నాన్న రాజీవ్‌కు సొంత వ్యాపారం ఉంది. అమ్మ లీసమ్మ అటవీశాఖలో ఉద్యోగి. చెల్లి పేరు లియా. చిన్నప్పటినుంచీ కాలేజీ లెక్చరర్‌గా స్థిరపడాలనుకున్నా. అందుకే డిగ్రీ అయ్యాక పాండిచ్చేరీ యూనివర్సిటీ నుంచి లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్సెస్‌లో పీజీ చేశా. ఆ తరువాత పీహెచ్‌డీ చేయాలనేది నా కోరిక. అయితే ఓ రోజు మా ఫ్రెండ్స్‌ వాట్సాప్‌గ్రూప్‌లో ఒక సినిమా అవకాశం ఉందనీ, ఆసక్తి ఉన్నవాళ్లు ఫొటోలు పంపించమనీ ఓ మెసేజ్‌ వచ్చింది. అది చూసి ప్రయత్నిద్దామని ఫొటోలు పంపించడంతో ‘మహేషింటే ప్రతికారం’లో అవకాశం వచ్చింది. ఆ తరువాత మరికొన్ని అవకాశాలు వచ్చాయి. సినిమాల్ని కేవలం సరదాగా చేయాలనుకున్నా కాబట్టి ఇంట్లోవాళ్లూ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.


అన్నీ మధుర జ్ఞాపకాలే…

ఎలుకలు పట్టడానికి వెళ్ళా..!<br />

ప్పటివరకూ నేను చేసిన సినిమాలతో పోలిస్తే జై భీమ్‌ కోసం కాస్త డైటింగ్‌ చేయాల్సి వచ్చింది. అదేవిధంగా ఆ గిరిజన తెగ అలవాట్లూ, మాట్లాడే విధానం… వంటివన్నీ తెలుసుకునేందుకు కొన్నిరోజులు వాళ్లతో గడిపాను కూడా. పాముకాటుకు వాళ్లు వేసే ఔషధాల గురించీ పూర్తిగా తెలుసుకున్నా. వాళ్లతో కలిసి ఎలుకలు పట్టేందుకూ వెళ్లేదాన్ని. ఓసారి ఎలుకమాంసం కూడా రుచిచూశా. ఇక, సూర్య గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా మొత్తం పూర్తయ్యేవరకూ ఆయన అందించిన సహకారం అంతాఇంతా కాదు. ఓసారి మదురైలో షూటింగ్‌ ఉండటంతో అందరం వెళ్తున్నాం. ఆయన సడెన్‌గా ‘ఇక్కడ జిగర్‌ఠండా దొరుకుంది. ఎప్పుడైనా తాగావా’ అని అడిగారు. లేదని చెప్పడంతో టీం మొత్తానికి ఆ పానీయాన్ని ఇప్పించారు. ఇలాంటి జ్ఞాపకాలెన్నో నా సొంతమైనందుకు చాలా ఆనందంగా ఉంది.


శిక్షణ ఇచ్చాకే… షూటింగ్‌!

మిళంలో నేను చేసిన ‘శివప్పు మంజల్‌ పచ్చయ్‌’(ఒరేయ్‌ బామ్మర్ది) చూశాకే నన్ను ‘జై భీమ్‌’లో తీసుకున్నారు. అయితే నాకా విషయం ముందు చెప్పకుండా, ఆడిషన్‌ చేసి, ఆ తరువాతే కథను వివరించారు. షూటింగ్‌ మొదలు కావడానికి ముందు మాకందరికీ కొంతకాలం ట్రైనింగ్‌ కూడా ఇచ్చారు. ఆ సమయంలో కాళ్లకు చెప్పులు వేసుకోకుండా నడవమనేవారు. మణికంఠన్‌ని మామా అని పిలవడం, మేకప్‌ వేసుకోవడం… నాతో నటించిన పాపను కూతురిగానే చూడటం… ఇవన్నీ బాగా అలవాటు అవడంతో షూటింగ్‌ సమయంలో ఏ ఇబ్బందీ కలగలేదు.


అక్కడ ఇంగ్లిష్‌ కోసమే చేరా…

పాండిచ్చేరి యూనివర్సిటీలో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటారు. వాళ్లతో ఇంగ్లిష్‌లోనే మాట్లాడగలం. అలా మాట్లాడటం వల్ల నాకు కూడా ఇంగ్లిష్‌పైన పట్టు వస్తుంది కాబట్టే అక్కడ చేరా.


ముగ్గురం ఒకే బైక్‌పైన…

టూవీలర్‌ డ్రైవింగ్‌ నేర్చుకుంటున్న రోజులవి. ఓసారి సరదాగా ఇద్దరు ఫ్రెండ్స్‌ని వెనకాల కూర్చోబెట్టుకుని బండి నడుపుతున్నా. కొంతదూరం వెళ్లేసరికి పోలీసులు పట్టుకున్నారు. మొదట భయం వేసినా… ఏదో సర్ది చెప్పి బయటపడ్డాం. ఆ తరువాతా మరో రెండుసార్లు అలాంటి అనుభవాలే ఎదురుకావడంతో… ముగ్గురం వెళ్లడం మానేశాం.


నచ్చే ఆహారం: మాంసాహారం. నాకు వంట కూడా వచ్చు. నేను కంద చికెన్‌ కర్రీని అద్భుతంగా చేస్తా.

ఇష్టపడే నటులు: మోహన్‌లాల్‌ నటనంటే ఇష్టం. అయితే ఆమిర్‌ఖాన్‌కు వీరాభిమానిని.

తీరిక దొరికితే: ప్రయాణాలు చేస్తా. లేదా నచ్చిన పాట పెట్టుకుని హాయిగా డాన్స్‌ చేస్తా.