About

Posts by :

Singer Rahul sipliganj

6bf10a52-7baf-44b2-8d52-494a751d305b

Lyricist Kasarlasyam

వర్మ మాటలకి కన్నీళ్లొచ్చేశాయి!

 

పదేళ్లకిందటి పాట ‘నీలపురి గాజుల ఓ నీలవేణి’, రెండేళ్లకిందటొచ్చిన ‘బొమ్మల్లే ఉన్నదిరా పోరీ’, గతేడాది అదరగొట్టిన ‘దిమాక్‌ ఖరాబ్‌’, ఈ ఏడాది సంచలనం సృష్టించిన ‘రాములో రాములా’… వీటి మధ్య ఉన్న సామ్యం, సంబంధం ఏమిటీ…? సామ్యం అందరికీ తెలిసిందే… ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు యువతని ఊపేసిన పాటలివి. ఇక సంబంధం అంటారా… అవన్నీ కాసర్ల శ్యామ్‌ రాసినవి! తెలుగు పాటలమ్మ తోటకి కొత్త మాలిగా వచ్చి మత్తెక్కించే గీతాలు పూయిస్తున్న ఈ యువ కలం వెనకున్న కథ… అతని మాటల్లోనే…

మార్చి 17… కరోనా మనదేశంపైన అప్పటికింకా తన పంజా విప్పలేదు. ఆ రోజు ఉదయాన్నే హైదరాబాద్‌ నుంచి బయల్దేరి చెన్నై చేరుకున్నాం. విమానాశ్రయం నుంచి నేరుగా టి.నగర్‌లోని ఇళయరాజాగారి ఇంటికి వెళ్లాం. కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’ పాటల సిట్టింగ్‌ కోసం ఈ ప్రయాణం. రాజాగారి ముందు కూర్చుని పల్లెల్లో పిల్లలు పాడుకునే జాజిరి గీతాల శైలిలో ఓ పాట రాశాను. నేను ఆ పాటని పాడి వినిపిస్తున్నప్పుడే రాజాగారు నవ్వి ‘నీకు పాడటం కూడా వచ్చా! సరే ట్రాక్‌లో నువ్వే పాడు!’ అని నా చేతే పాడించారు. ఇళయరాజా ముందు గీత రచయితగా కూర్చోవడం, నా పాట ఓకే కావడం, దాన్ని నేనే పాడటం… ఇవన్నీ మనసుని దూదిపింజలా చేస్తున్నాయి కానీ గుండెలోని మరోమూల నుంచి సన్నగా కన్నీటి తడి కూడా మొదలైంది. సాయంత్రం అయ్యేటప్పటికి ఆ తడి పెరిగి ‘దూదిపింజ మనసు’ని బరువుగా మార్చింది. ఆ కన్నీటి తడికి కారణం ఆ రోజు చెన్నైలో నేనున్న ఆ ప్రాంతం… దానితో ముడిపడ్డ మా నాన్న జ్ఞాపకం. ఈ టి.నగర్‌లోనే ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ దేదీప్యమానంగా వెలిగింది. ఆ వెలుగుని చూసి ఇక్కడికొచ్చిపడి తన ఆశల్ని మసిచేసుకున్న ఎంతోమంది రంగస్థల నటుల్లో మా నాన్న మధుసూదనరావూ ఒకరు. ఇక్కడే ఓ గదిని అద్దెకి తీసుకుని తినీతినకా సినిమా అవకాశాల కోసం తిరిగినవాడాయన. నాన్న అలా ఓడిపోయి వెను   తిరిగిన అదే ప్రాంతానికి ఇప్పుడు కాస్తోకూస్తో జనాదరణ సాధించిన పాటల రచయితగా నేను వెళ్లడం… నన్ను ఉద్వేగానికి లోను చేస్తోంది. ఆరోజు టి.నగర్‌, ఉస్మాన్‌ రోడ్డు, పానగల్‌ పార్కు… నాన్న మాటల్లో ఒకప్పుడు వినిపించే పేర్లన్నీ గుర్తుచేసుకుంటూ ఆ ప్రాంతంలో నడవడం మొదలుపెట్టాను. అలా నడుస్తూ ఆయన వేలుపట్టుకుని నేను ఇప్పటిదాకా నడిచిన నా పాటల ప్రయాణాన్ని నెమరేసుకున్నాను…

నా దశని మార్చారు…
మాది హన్మకొండ. రంగస్థల నాటకాలకి పెట్టని కోట అది. అప్పట్లో ప్రఖ్యాత జానపద గాయకులు వరంగల్‌ శంకరన్న, సారంగపాణీలు ప్రతి బడికీ వచ్చి పిల్లలతో నాటకాలు వేయించేవారు. ఆరోతరగతిలో ఉన్నప్పుడు వాళ్ల కంట్లోపడ్డాను. నాకు ‘మంత్రాల ముత్తిగాడు… తంత్రాల సత్తిగాడు’ అనే పాటనీ, దాని డ్యాన్సునీ నేర్పిస్తే మహారాజులా పెట్టుడు మీసం మెలేసి డ్యాన్సులు చేశాను. ఆ నటనకి నాకు జిల్లాలోనే ఫస్ట్‌ ప్రైజు వచ్చింది. ‘ఎవరీ పిలగాడు’ అని తెలియనివాళ్లు అడిగితే ‘కాసర్ల మధుసూదనరావు వాళ్లబ్బాయి!’ అని చెబుతుండేవారు అందరూ. అప్పుడే నాకు అర్థమైంది… నాన్నకి అక్కడున్న గౌరవం ఏమిటో. చిన్నప్పుడే రంగస్థల నాటకాల్లో పేరుతెచ్చుకున్న నాన్న సినిమాల్లో అవకాశాల కోసం వెళ్లారు. అప్పటికే నీటి సరఫరా శాఖలో ఉద్యోగిగా ఉన్న ఆయన లాంగ్‌ లీవు పెట్టిమరీ మద్రాసులో మకాంపెట్టారు. నెలకోసారి మాత్రమే ఇంటికొచ్చేవారు. వచ్చినప్పుడల్లా వరంగల్‌ థియేటర్‌లలో తాను నటించిన సినిమాలని  చూపేవారు. అన్నీ చిన్న చిన్న పాత్రలే. ‘చలిచీమలు’, ‘రోజులు మారాయి…’ ఇలా 26 సినిమాల్లో కనిపించినట్లు చెబుతారు. మొత్తానికి సినిమాల్లో ఆయన ఆశించినంత స్థాయికి వెళ్లలేకపోయారు. ఇంట్లో మేం ముగ్గురం పిల్లలం… అన్నయ్యా, నేనూ, మా చెల్లి. ఉద్యోగంలో ‘లాంగ్‌ లీవ్‌’ కారణంగా నాన్నకి సగం జీతమే వచ్చేది. ఆ సగం జీతంతో ఇటు మా కడుపులు నిండటం, అటు మద్రాసులో నాన్న సినిమా ప్రయత్నాలు సాగడం కష్టమైంది. ఒకదశలో నాన్న ఉద్యోగం పోయే ప్రమాదమూ వచ్చింది. అదే జరిగితే పిల్లలం మాకు భవిష్యత్తు ఉండదనుకున్నారేమో… సినిమాలకి శాశ్వతంగా స్వస్తి పలికి వచ్చేశారు. మా కోసం ఆ నిర్ణయం తీసుకోవడం వెనక కళాకారుడిగా ఆయన ఎంత నరకం అనుభవించి ఉంటారో ఇప్పుడు అర్థమవుతోంది! నేను మెల్లగా వరంగల్‌ శంకరన్న, సారంగపాణీల శిష్యుణ్ణయ్యాను. చుట్టుపక్కలవాళ్లందరూ ‘మీకు తగ్గ వారసుడే వచ్చాడు!’ అనేవారు నన్ను చూపించి. మెల్లగా నాన్నతోపాటూ నాటకాల్లో నటించడం మొదలుపెట్టాను. పదో తరగతయ్యాక నేరుగా సినిమా యాక్టర్‌ని అయిపోదామని కలలు కనడం ప్రారంభించాను. అప్పుడే నాన్న నా జీవిత గమనాన్ని మార్చే మాట చెప్పారు… ‘సినిమా రంగంలో నటులుగా నిలబడాలంటే అద్భుతమైన నటనా సామర్థ్యం ఉండాలి లేదా మనకి గట్టి నేపథ్యమన్నా కావాలి. అవి రెండూ మనకు లేవు. సినిమాల్లో మనలాంటివాళ్లకున్న ఒకే అవకాశం పాటలూ, సంగీతం ద్వారా వెళ్లడమే. అది కూడా నువ్వు పీజీ చేశాకే…!’ అన్నారు. అంతేకాదు నా దృష్టిని అప్పట్నుంచీ సాహిత్యంవైపు మళ్ళించారు. తెలుగులోని గొప్ప కవితా సంకలనాలన్నీ నా చేత చదివించారు. కాళోజీ, అలిసెట్టి ప్రభాకర్‌లాంటివాళ్ల దగ్గరకు నన్ను తీసుకెళ్లారు! అలాంటి వాతావరణంలో ఉంటే… కలం కవితలు రాయకుండా ఉంటుందా? ఇంటర్‌ చదివేటప్పటికే నాటక సమాజాల కోసం పాటలు రాయడం ప్రారంభించాను. అప్పట్లో అక్షరాస్యత కార్యక్రమాల కోసం జానపద బృందాల్లో పాటలు పాడేవాళ్లు కావాలంటే నేను వెళ్దామనుకున్నాను. నాన్న వద్దంటారని తెలిసి… ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లి ఓ జానపద బృందంలో చేరిపోయాను. దాదాపు మూడు నెలలపాటు వరంగల్‌ జిల్లాలోని పల్లెపల్లెకీ వెళ్లి పాటలు పాడాను, అప్పటికప్పుడు గేయనాటికలు రాసి నటించాను. ఆ అనుభవమే నాకు తెలుగు నుడికారంలోని మట్టిపరిమళాన్ని పరిచయం చేసింది. పలుకుబడులూ, సామెతల్ని నా పాటల్లో అందంగా చొప్పించడం అప్పటి నుంచే మొదలైంది.

మొదటి పాట…
డిగ్రీలోకి వెళ్లడానికి ముందే సినిమా గేయరచయితగా మారాలని మనసు తహతహ లాడినా నాన్న చెప్పినట్టు పీజీ దాకా ఆగాను. అది కాగానే హైదరాబాద్‌ బస్సెక్కాను. మొదట్లో కడుపు నింపుకోవడం కోసం ప్రైవేటు జానపద గీతాలు తయారుచేసే క్యాసెట్టు కంపెనీలతో కలిసి పనిచేయడం మొదలుపెట్టాను. తెలుగు విశ్వవిద్యాలయంలో జానపదాలపైన ఎం.ఎ., ఎంఫిల్‌ కోర్సులో చేరడంతో హాస్టల్‌ సమస్య తప్పింది. యూనివర్సిటీ పరిచయాల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల కోసం ప్రచార గీతాలు రాయడంతోపాటూ నాటకాలూ వేసేవాణ్ణి. ఆ తర్వాత వివిధ రాజకీయ పార్టీలకీ ప్రచార గీతాలు రాసివ్వడం మొదలుపెట్టాను. అప్పట్లో ప్రతి క్యాసెట్టుకీ లక్ష రూపాయలు చేతికొచ్చేవి. దాంతో డబ్బుకి ఢోకాలేకుండా పోయింది. వీటితోనే కాలంగడుపుతున్న నన్ను మళ్లీ నాన్నే నిద్రలేపారు. ‘నువ్వు హైదరాబాదుకి ఏ లక్ష్యంతో వెళ్లావు… చేస్తున్నదేమిటీ?’ అని నిలదీశారు. దాంతో మళ్లీ స్టూడియోల చుట్టూ తిరగడం మొదలుపెట్టాను. రెండేళ్ల తర్వాత నా స్నేహితుడి ద్వారా ‘చంటిగాడు’ సినిమాకి అవకాశం వచ్చింది. ఆ సినిమా దర్శకురాలు జయ ఓ జానపద గీతం రాయమన్నారు. రాసిచ్చాను కానీ… తీరా సిట్యుయేషన్‌ మారిపోవడం వల్ల ఆ పాట తీసేయడంతో ఉసూరుమనిపించింది. కొద్దిరోజుల తర్వాత జయ మళ్లీ ఫోన్‌ చేశారు. ‘హీరో ఇంట్రడక్షన్‌ కోసం ఓ పెద్ద రచయిత పాట రాశారు కానీ అది నాకు నచ్చలేదు. ఆయన్ని ఇంకో వెర్షన్‌ అడిగే సమయం లేదు. నువ్వు రాసివ్వగలవా?’ అన్నారు. ట్యూన్‌ విని అప్పటికప్పుడే రాసిస్తే ఆమె వెంటనే ‘ఓకే’ చెప్పారు. ‘కొక్కొరొకో…’ అనే ఆ పాటని శంకర్‌ మహదేవన్‌ పాడారు. ఆయనకి నేను వీరాభిమానిని! నా పేరుతో వచ్చిన తొలి పాటని నా అభిమాన గాయకుడే పాడటంతో నా ఆనందానికి అవధుల్లేవు.

‘నీలపురి గాజుల…’
అప్పట్లో తెలుగు విశ్వవిద్యాలయంలో నేను వీధినాటక బృందం ఒకటి నడుపుతుండేవాణ్ని. కృష్ణవంశీ ‘మహాత్మా’ సినిమాలో ‘ఇందిరమ్మ ఇంటిపేరు…’ పాటలో కనిపించేందుకు ఓ వీధినాటక బృందం కావాలనుకున్నారు. ఎవరో మా గురించి చెబితే రమ్మన్నారు. చిత్రీకరణప్పుడు రాత్రుల్లో సరదాగా నేను రాసిన ‘నీలపురి గాజుల…’ పాట పాడుకునేవాళ్లం. అది కృష్ణవంశీకి నచ్చి ఆ పాటని సినిమాలో వాడదామన్నారు. నా చేతే పాడించారు కూడా! ఆ సినిమాలో హీరోయిన్‌ పాత్ర పేరు మొదట కస్తూరి అనే పెట్టారు. కానీ నీలపురి గాజుల పాటలో ‘కృష్ణవేణీ’ అని వస్తుంది కాబట్టి ఆ పేరే ఖరారు చేశారు… అప్పటికి సగం సినిమా షూటింగ్‌ పూర్తయినా సరే! ఆ పాట ఆయనకి అంతగా నచ్చింది. ఆ తర్వాత దర్శకుడు మారుతి తొలి సినిమా ‘ఈరోజుల్లో’ని ‘ట్రింగ్‌ ట్రింగ్‌’, ‘బస్టాప్‌’ చిత్రంలోని ‘కలలకే కనులొచ్చినా…’ పాటలు కాలేజీ కుర్రాళ్లకి బాగా కనెక్ట్‌ అయ్యాయి. ఓసారి సంగీత దర్శకుడు సాయి కార్తిక్‌, రామ్‌గోపాల్‌ వర్మ ‘రౌడీ’ సినిమా అవకాశం ఉంది రమ్మని పిలిచాడు. నేను వెళ్లగానే వర్మ ‘నీకు పెళ్లైందా?’ అని అడిగారు. ‘ప్రేమ పెళ్లండీ…’ అని చెప్పాను. ‘అయితే నీ భార్యని నువ్వు ఎక్కువే ప్రేమిస్తావు. సరే… నీ భార్య చచ్చిపోయిందనుకుని ఆమె కోసం ఓ పాట రాయి’ అన్నారు. ఆ మాటకి నా కళ్లలో జివ్వున నీళ్లు తిరిగాయి. నా భార్య రాధిక అప్పుడు నిండు గర్భిణి. అసలే రేపోమాపో కాన్పు… ఎలా ఉంటుందో ఏమోనని ఆందోళనలో ఉండగా వర్మ అలా అనడాన్ని తట్టుకోలేకపోయాను. ఏడుస్తూనే ఇంటికెళ్లాను. అయినా సరే నేను ఓ ప్రొఫెషనల్‌ రైటర్‌నని నిరూపించాలనుకున్నాను. అర్ధగంటలో ‘నీ మీద ఒట్టు…’ పాట రాసిచ్చాను! ఆ వేగం ఆయనకి నచ్చినట్టుంది. ఇంకో పాట… మరో పాట అంటూ అన్ని పాటలూ నాచేతే రాయించారు. వర్మని మెప్పించడం… అదీ సింగిల్‌ కార్డు సాధించడం ఇండస్ట్రీలో నాకు మంచి గుర్తింపునిచ్చింది. నా కెరీర్‌లో ‘నీలపురి గాజుల…’ పాట ఓ మంచి మలుపునిస్తే మణిశర్మ సంగీత దర్శకత్వంలో ‘లై’సినిమాలోని ‘బొమ్మోలె…’ మరో పెద్ద మలుపునిచ్చింది. దాని తర్వాత నేను రాసినవన్నీ హిట్టు పాటలే. పూరీ జగన్నాథ్‌గారి ఇస్మార్ట్‌ శంకర్‌లోని ‘దిమాక్‌ ఖరాబ్‌’, ‘బోనాలు’ పాటలు నాస్థాయిని పెంచాయి. ఇక ‘రాములో రాములా…’ నన్ను ప్రపంచంలోని తెలుగువారందరి చెంతకు చేర్చింది. ఓ రోజు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు పిలిచి ‘నీ పాట నన్ను నిజంగానే ‘ఆగం’ చేస్తోందిరా! నా మనవళ్లందరూ నా పాట(సామజవరగమనా!)ని కాదని నీదే వింటున్నారు. 2020… నీ నామ సంవత్సరం అనిపిస్తోంది. దున్నెయ్‌ ఇక…’ అన్నారు. అంతకంటే పెద్ద ఆశీర్వచనం ఏం ఉంటుంది?!

ఆ సంతృప్తితోనేనా?
ఇండస్ట్రీలో నా విజయాలకి నాన్న ఎంత సంతోషించారో… ఎంత సంబరపడ్డారో! ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించనీయకుండానే ఆయన్ని పక్షవాతం కబళించింది. హైదరాబాద్‌కి తీసుకొచ్చి ఆయన్ని నేనే చూసుకుంటూ ఉండేవాణ్ణి. అప్పుడే ‘రాజా ది గ్రేట్‌’ సినిమాలో టైటిల్‌ సాంగ్‌ కోసం పల్లవి రాయమన్నారు. రాశాను. ఇంతలో నాన్న పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు. మళ్లీ నేను మనిషిలా మారడానికి ఇరవై రోజులు పట్టింది. మన ఇండస్ట్రీలో మామూలుగా ఎవరికోసమూ ఏ పాటా ఆగదు. కానీ అనిల్‌ రావిపూడి నా కోసం ఆ పాటని ఆపాడు. ఆ రకంగా ఆ పల్లవికీ, చరణానికీ మధ్య నాన్న ప్రాణం పోయింది!

కృష్ణవంశీ తీస్తున్న ‘రంగమార్తాండ’ ఓ రంగస్థల కళాకారుడి కథ! నాన్న కూడా రంగస్థల నటుడు కావడం… ఒకప్పుడు ఆయన అవకాశాల కోసం వెతికిన ప్రాంతంలోనే నేను ఇప్పుడు మరో రంగస్థల నటుడికి సంబంధించిన కథకి పాటలు రాయడం… ఇవన్నీ యాదృచ్ఛికమేనని తెలిసినా మనసు నమ్మనంటోంది. దీని వెనక ఇంకేదో అంతస్సూత్రం ఉందని నమ్మమంటోంది. ఇలాంటి నమ్మకాలే ఒక్కోసారి జీవితానిక్కావాల్సిన స్ఫూర్తినిస్తాయనిపిస్తోంది..!

 

3dd520a7-b144-41e3-8174-e625b2fbb2a4

 

comedian Kadambarikiran

kadambarikiran 1 kadambarikiranc2b3defa-a73c-4f5a-bd0f-d0d55951e181

Hero Varun sandesh

f9d1a614-d79d-4770-84ba-014a260f018d

Heroine Tabu

ec7ce2ce-3441-417b-8fca-5b5cd9a88643

Heroine Mehreen

2d34adfe-436d-4c06-b1e4-53c07000391dIMG_0751

Director G.Asok

హ్యాపీడేస్

చిరంజీవి ఫాన్స్ అంతా నా ఫాన్సే!

‘రేపటి పౌరులు’ చిత్రంలో బాలనటుడిగా తెరంగేట్రం చేసిిన అశోక్ కాస్త పెద్దయ్యాక ఇంజనీరింగ్ పట్టాతో పాటు ‘కొరియోగ్రాఫర్’ అవతారమెత్తారు. వరసపెట్టి 60 డాక్యుమెంటరీలు తీయడమే కాక ‘ఉషోదయం’ అనే పిల్లల చిత్రానికి గాను 2007లో ఉత్తమ దర్శకుడిగా జ్యూరీ నంది పురస్కారం కూడా అందుకున్నారు. ‘ఫ్లాష్ న్యూస్’, ‘ఆకాశరామన్న’ చిత్రాల తర్వాత ‘పిల్ల జమిందార్’తో అందరి దృష్టిలో పడ్డారు. త్వరలో ‘సుకుమారుడు’గా దర్శనమివ్వబోతున్న ఆ నవ దర్శకుడు చెబుతున్న హ్యాపీడేస్ ఇవి.కాలేజీలో ప్రవేశించే నాటికే నేనొక బుల్లి సెలబ్రిటీని. అప్పటికే కొన్ని వందల డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వడంతో పాటు రేపటి పౌరులు, నవభారతం, గడుగ్గాయ్ లాంటి కొన్ని సినిమాల్లో బాలనటుడిగా నటించేశా. అదీగాక ఒంగోల్లో జరిగే ప్రతి ఫంక్షన్‌లో నా డాన్స్ విధిగా ఉండాల్సిందే. చిరంజీవిగారి డాన్స్‌లు చేసి చేసి ‘జూనియర్ చిరంజీవి’గా మనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండేది. ఈ డాన్స్‌ల్లో మునిగి ఎక్కడ ఫెయిలైపోతానో అని అమ్మ భయం. కళలు కూడు పెట్టవని కొందరు శ్రేయోభిలాషులు చెవిలో ఇల్లుగట్టుకుని పోరేసరికి మెల్లగా మునిసిపల్ హైస్కూల్ నుండి నా ‘సీటు’ కదిపి పదో తరగతికి ‘నాగార్జున రెసిడెన్షియల్’లో వేశారు. ఇంటర్మీడియట్ కూడా అక్కడే చదవాల్సి వచ్చింది.చెల్లి ఫోర్జరీతో గుంజీళ్లు తప్పేవి
రెసిడెన్షియలైనా ఇంటినుండే కాలేజీకి వెళ్తుండేవాణ్ణి. మన అడ్డా ఎక్కువగా శ్రీనివాస్+ శ్రీదేవి జంట థియేటర్ల దగ్గరో, రత్నమహల్ వద్దో ఉండేది. చిన్నప్పుడు మా చెల్లి అరుణతో పాటు కూచిపూడి, భరతనాట్యం, కథక్ నేర్చుకోవడం వల్ల డాన్స్ నా ఆరోప్రాణం అయింది. ముఖ్యంగా చిరంజీవిగారి స్టెప్స్ అంటే పడి చచ్చేవాణ్ణి. సినిమా పిచ్చితో రాత్రుళ్లు సెకండ్ షోలు చూసి ఆలస్యంగా నిద్రలేవడం, లేటయినప్పుడల్లా తెలివిగా కాలేజీకి టి.వి.ఎస్ బండి వేసుకెళ్లి దారిలో బండి రిపేరొచ్చిందని అబద్దాలు చెప్పడం … రోజూ రిపేర్లేమిట్రా అని మా లెక్చరర్స్ విస్తుపోవడం … ఇలా నడుస్తుండేది. ఒక్కోసారి పూర్తిగా డుమ్మా కొట్టేసేవాణ్ణి.

అందుకుగాను నాన్నతో లెటర్ రాయించి తీసుకు వెళ్లాల్సి వచ్చేది. ఫోర్జరీ చేయడంలో మా చెల్లిది అందెవేసిన చెయ్యి. ‘ఇస్నోఫీలియా వల్ల మా అబ్బాయి నిన్న రాలేకపోయా’డని నాన్న సంతకంతో లెటర్ తయారుచేసి నన్ను ఒడ్డున పడేసేది. లేదంటే అమ్మాయిల ముందే గుంజీళ్లు తీయాల్సి వచ్చేది. ఇంట్లో ఈ వేషాలన్నీ కనిపెట్టారో ఏమో-ఇంటర్ సెకండియర్‌కి అద్దంకి వెళ్లేదారిలో గుళ్లాపల్లి దగ్గర ఉండే ‘నాగభైరవ రెసిడెన్షియల్’ కాలేజిలో చేర్పించారు. మనం ఆడిందే ఆటగా పాడిందే పాట గా సాగిన జీవితం ఒక్కసారి దారితప్పినట్టు అనిపించింది. మనసుంటే మార్గం ఉంటుందనే తత్వం బాగా వంటబట్టినవాణ్ణి కాబట్టి మెల్లగా దారులు వెతకడంలో నిమగ్నమయ్యా.

వీరబాబుగార్కి దొరికిపోయాం
ముందుగా మస్తాన్ అనేవాణ్ణి మిత్రుడిగా చేసుకున్నా. ఎంచేతంటే వాడు అప్పటికే మూడేళ్లుగా అక్కడే చదువుతున్నాడు. కాలేజీ లూప్‌హోల్సన్నీ బాగా తెలిసినవాడు. ఏ వేళప్పుడు, ఏ దారిగుండా బయటకి పారిపోవొచ్చో చెప్పేవాడు. మా కాలేజీ నుండి ఒంగోలు అరగంట ప్రయాణమే కాబట్టి తప్పించుకుని మెయిన్‌రోడ్ ఎక్కేసి ఏ లారీనో పట్టుకుని సినిమాకు చెక్కేసేవాళ్లం. ఒకరోజు ‘కొదమసింహం’ సినిమా చూసి మెల్లగా గోడ దూకబోతుండగా ఎదురుగా మా కరస్పాండెంట్ వీరబాబుగారు వీర లెవల్లో నిల్చుని చూస్తున్నారు. మా పై ప్రాణాలు పైనే ఉష్ … శిక్ష తప్పలేదనుకోండి. కొన్నాళ్లు బుద్ధిమంతుడిలా ఉన్నా. కానీ చిరంజీవిగారి సినిమా నన్ను నిలవనిచ్చేది కాదు. అలవాటు పడ్డ ప్రాణం కదా! వాచ్‌మేన్‌కు ఐదో, పదో సమర్పించి చెక్కేస్తుండేవాళ్లం.

మూడు నెలలు తప్పించుకు తిరిగా
డాన్స్ బ్రహ్మాండంగా చేస్తానని తెలిసి కొందరు అమ్మాయిలకి డాన్స్ నేర్పించమని ఆర్డర్ వేసి మగపురుగైనా వెళ్లలేని లేడీస్ హాస్టల్లోకి నన్ను పంపేవారు. ఆ క్రమంలో తక్కువ కాలంలోనే అందరి నోళ్లలో నాలుకైపోయా. ఆ ఏడాది డిసెంబర్ 31కి నేను కంపోజ్ చేసిన ఐటమ్ సాంగ్స్ పెట్టించారు. ఆ మర్రోజే నాన్న బర్త్‌డే కాబట్టి ఎంత రాత్రయినా ఇంటికి వెళ్లాలనే తొందర్లో అటూ ఇటూ తిరుగుతున్నాను. ప్రోగ్రాం అయినవెంటనే ఒకమ్మాయి వచ్చి నా చేతికి గులాబి పువ్వుతోపాటు ‘గ్రీటింగ్’ ఇచ్చింది. బహుశా నన్ను అభినందిస్తున్నదేమోనని విప్పి చూసి తెల్లబోయా. అదొక ప్రేమలేఖ. చెమటలు పట్టేశాయి. గబగబ జేబులో కుక్కేసి, కంగారుగా టాయిలెట్ రూమ్‌కు పరిగెత్తి సాంతం చదివా. ఈ విషయం లీకైతే తాట వలిచేస్తారని 3 నెలల వరకు ఆ అమ్మాయిని తప్పించుకుని తిరిగానంటే నమ్మండి.

చిలిపి చేష్టలు తారాస్థాయిలో ఉండేవి
బాత్రూమ్‌లు తక్కువ ఉండడంతో ఆరుబయట పెద్ద తొట్టి పెట్టి దాన్నిండా నీళ్లు పోసి ఉంచేవారు. అక్కడ చచ్చినా స్నానం చేసేవాణ్ణి కాదు. ‘తొట్టి’గ్యాంగ్ మాత్రం అక్కడే జలకాలాడేది. స్టడీ అవర్ రాత్రి 8 గంటలకి మొదలయ్యేది. ఆలోపు స్నానం చేసి పరిగెత్తాలి. బాత్రూంలో ముందుగా స్నానం చేయడం ఎలా అనే ఐడియా వేసి సబ్బులన్నీ కలిపేసేవాణ్ణి. ఎవరి సబ్బు వాళ్లు ఏరుకునే లోగా నా స్నానం అయిపోయేది. కొంటె పనులకు కొదవుండేది కాదు. కుమార్ అనేవాడు స్నానం చేస్తుంటే వాడి టవల్‌ని దాచేసేవాళ్లం. దాంతో వాడు బాగా చీకటి పడ్డాక ఆదిమానవుడి అవతారంలో బాత్రూం నుండి దొంగలా బయటకి వచ్చేవాడు. స్టడీ అవర్‌కి వాడెందుకు లేట్‌గా వస్తున్నాడో మాకు తప్పించి మరెవరికీ తెలియని మిస్టరీ అది.

ఒక్కోసారి కాంటీన్‌కి ముందుగా వచ్చేసి ఏం తోచక టేబుల్ మీద ఉండే సాంబారు మగ్గులో పక్కనే ఉండే ఉప్పును సాంతం ఒంపేసి ఆ మగ్గుని ఒకరికి తెలియకుండా ఒకరం టేబుల్స్ మార్చేసి… ఆ సాంబారు ముందుగా పోసుకున్న వాడి ముఖకవళికల్ని గమనించేవాళ్లం. కొన్నాళ్లకి మాలోనే ఎవరో ఉప్పు కలుపుతున్నారని పసిగట్టి స్పూను సాంబారుని తీర్థంలా చేతిలో పోసుకుని రుచి చూసి ఆ తర్వాతే అన్నంలో కలుపుకునేవారు.

ర్యాగింగ్ ర్యాగింగ్ ర్యాగింగ్
ఇంటర్మీడియట్ తర్వాత విజయవాడ దగ్గర్లోని ‘కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజీ’లో చేరాను. కొత్తలో ర్యాగింగ్ చేస్తారని తెలిసి చాలా భయపడిపోయాను. ఒకరోజు అనుకోకుండా 9మంది సీనియర్స్ బిలబిలమంటూ క్లాసులోకి వచ్చేసి ‘చిరంజీవి ఫ్యాన్స్ ఎంతమందో చేతులెత్తండి’ అన్నారు. 20 మంది ఎత్తారు. వెంటనే చిరంజీవికి సంబంధించి కొన్ని ప్రశ్నలు వేశారు. వాళ్లు చెప్పలేకపోయేసరికి ఎండలోకి తరిమేశారు. తర్వాత బాలకృష్ణ ఫ్యాన్స్ ఎవరన్నారు – మరికొందరు చేతులెత్తారు. బాలకృష్ణ వాళ్ల అబ్బాయి పేరేంటని అడిగారు. ఎవరూ చెప్పలేకపోయేసరికి నేను చెప్పాను.

అంతే! నీవే నిజమైన బాలకృష్ణ అభిమానివని మెచ్చుకుని వచ్చే సండే ‘నిప్పురవ్వ’ సినిమాకి మాకందరికీ టికెట్లు తీసుకొచ్చి ఇవ్వమని ఆర్డర్ వేసి వెళ్లారు. మరోసారి మాలో కొందర్ని హాస్టల్స్‌కు తీసుకెళ్లారు. ఒక దగ్గర టూత్‌పిక్ మొదలుకుని మూడడుగుల పొడవుండే కర్రలున్నాయి. ఎవరికి ఇష్టమైన కర్రని వాళ్లని సెలక్ట్ చేసుకోమన్నారు. సెలక్ట్ చేసుకున్నవాటితో కొడతారేమోనని భయపడి మాలో ఒకడు టూత్‌పిక్ సెలక్ట్ చేసుకున్నాడు దెబ్బ తగలదు కదా అని. దాంతో హాస్టల్ కాంపౌండు చుట్టుకొలతని కొలుచుకుని రమ్మన్నారు. ఒకన్ని కర్ర పట్టుకుని తాతలా నడవమన్నారు.

చికుబుకు చికుబుకు రైలే …
ఒకరోజు సుధాకర్ అనే మిత్రుడు కరకట్ట రోడ్డు పక్కన లూనా పైనుండి పడేయడంతో కాలికి దెబ్బతగిలి ఇంట్లోనే ఉండిపోయా. సిద్ధార్థ కాలేజీకీ మాకూ సై అంటే సై అన్నట్టు ఉండేది. ఇల్లు వెతుక్కుంటూ మా సీనియర్ ‘బాబు’ వచ్చి నన్ను అర్జెంటుగా తయారవమన్నాడు. కాలు నెప్పిగా ఉన్నా తప్పలేదు. బైక్‌మీద సరాసరి స్టెల్లా కాలేజీకి తీసుకెళ్లి ‘నీవు ఇప్పుడు డాన్స్ చేయాలి. మన కాలేజీ తరపున కాంపిటేషన్‌లో పాల్గొనాలి’ అన్నాడు. బదులు చెప్పలేక, కాలు నెప్పితోనే ‘చికుబుకు చికుబుకు రైలే’ పాటకి డాన్స్ చేశా. డాన్స్‌మూడ్‌లో చూసుకోలేదు … రక్తం కారిపోతోంది. తనే కట్టుకట్టించి ఇంట్లో దింపేసి వెళ్లాడు. మూడు రోజుల తర్వాత కాలేజీకి వెళ్లా. అప్పటికే ఫ్రెండ్స్ అంతా స్వీట్స్ పంచేసుకున్నారు డాన్స్ కాంపిటేషన్‌లో కాలేజీకి ఫస్ట్ ఫ్రైజ్ వచ్చిందన్న ఆనందంలో. చూడండి ఎంత అన్యాయమో.

ప్రేమలూ – చీవాట్లూ
నా సీనియర్ ఒకమ్మాయి నాతో పాటు ప్రోగ్రామ్స్‌లో డాన్స్ చేస్తుండేది. ఒకరోజు లోన్లీగా ఉన్నప్పుడు దగ్గరకొచ్చి “నీవు లేకుండా జీవించలేను. ఒక్క అరగంటలో రిప్లయ్ ఇవ్వాలి … అదీ పాజిటివ్‌గా” అని బాంబు పేల్చి, చేతిలో చీటీ పెట్టేసి వెళ్లిపోయింది. ఇదెక్కడి గొడవరా బాబూ అని కంగుతిన్నాను. అదే రోజు చివరి పీరియడ్ ప్రిన్స్‌పాల్‌ది కావడంతో అతడు క్లాసుకు వస్తాడో, రాడో కనుక్కుందామని ఆ అమ్మాయి క్లాస్‌రూమ్ ముందునుండే వెళ్లాను. నేను ప్రిన్సిపాల్ గదికి వెళ్లడం ఆ అమ్మాయి చూసింది. ‘ప్రేమలేఖ’ విషయం చెప్పేసి ఉంటానని డిసైడ్ చేసుకుని అదే రోజు సాయంత్రం బైక్ స్టాండ్ దగ్గర పట్టుకుని నిలదీసింది. ‘ఇష్టం లేకపోతే లేదని చెప్పాలి గానీ, ప్రిన్సిపాల్‌కి కంప్లెయింట్ చేస్తావా’ అని విరుచుకుపడింది. నేను ఏం చెప్పినా తను వినే స్థితిలో లేదు. పరోక్షంగా ప్రిన్సిపాల్ నన్ను రక్షించాడన్నమాట.

పోలీస్ స్టేషన్లో ఒక రాత్రి
ఒకసారి సంక్రాంతి సెలవుల్లో ఒంగోలు వెళ్లాను. ఊర్లో గాయత్రి యాగం జరుగుతోందని తెలిసి వాలంటీర్‌గా హెల్ప్ చేద్దామని అనంతభట్ల శ్రీనివాస్ అనే మిత్రుడితో కలిసి వెళ్లాను. యాగం అయ్యేసరికి రాత్రి పదకొండు దాటింది. ఇంటికి నడుచుకుంటూ బయల్దేరాం. మా వెనక తొట్టిగ్యాంగ్ వస్తోంది. కొంత కాలంగా అమ్మాయిల టీజింగ్ జరుగుతోందని నిఘా వేసి ఉంచారట పోలీసులు. మా మాటల్లోనే పెట్రోలింగ్ వ్యాన్ రావడం, మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని వ్యాన్ ఎక్కించి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లడం క్షణాల్లో జరిగిపోయాయి. మా వెనకాల వస్తున్న గ్యాంగు పోలీసుల్ని చూడగానే చెల్లాచెదురైపోయింది కాబట్టి వాళ్లెవరూ దొరకలేదు. పోలీసులు యక్షప్రశ్నలు వేస్తుంటే అక్కడే ఉన్న ఒక లేడీ కానిస్టేబుల్ “అమ్మాయిలు వాళ్ల వెంట పడేలా ఉన్నారు కానీ, వీళ్లు అమ్మాయిల వెంట పడేలా ఉన్నారా?” అని మమ్మల్ని తెచ్చిన పోలీసులకు చీవాట్లు పెట్టి మమ్మల్ని పంపించేసింది.

ఫైనల్ సెమిస్టర్ రాయకముందే సినిమాల్లో ‘కంపోజర్ అసిస్టెంట్’గా ఛాన్స్ రావడంతో మద్రాసు వెళ్లిపోవడం, తర్వాత దాదాపు 200 పై చిలుకు సినిమా నృత్యాలకు కొరియోగ్రాఫర్‌గా చేయడం, లండన్ ‘లెబియన్’ యూనివర్సిటీకి వెళ్లి లాటిన్ స్టయిల్లో ‘సల్సా లంబా’ అనే డాన్స్ నేర్చుకుని రావడం … తర్వాత దర్శకత్వ శాఖలో చేరిపోవడం ఒకటి తర్వాత ఒకటి జరిగిపోయాయి కానీ, అందమైన నా కాలేజీ డేస్ మాత్రం మదిలో నిశ్చలంగా మిగిలిపోయాయి.

direc asok 1 direc asok 2fb94d501-61d5-4eb4-944d-e5dd591b368c

Writer Abburi ravi

b0c0291d-dbe5-46e7-8d14-9969a40b21d6

Director Ravibabu

direc ravibabub4a64c75_12-crop--9d8267

cinematographer Ratnavelu

IMG_0752 IMG_0753