MUSIC DIRECTORS

సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు

సాలూరు రాజేశ్వరరావు- తెలుగు సినీ రంగానికి సుమారు ఐదు దశాబ్దాలపాటు మధురమైన సంగీతాన్నీ అందించిన సంగీత దర్శకుడు కేవలం సాలూరు రాజేశ్వరరావు గారు మాత్రమే. ఎన్నో అజరామరమైన వెండితెర వెలుగులకు సంగీతపు మధురిమలు అందించినవారిలో ఆయన స్థానం ప్రత్యేకం.

నాడే తెలుగు సినీ గీతంలో హిందుస్తానీ, పాశ్చాత్య సంగీతాన్ని మేళవించిన అసమాన ప్రతిభా సంపన్నుడు సాలూరి రాజేశ్వరరావు. తొలిచిత్రంలోనే తన గాన, నటనా కౌశలాన్ని సాలూరి తెలుగు ప్రేక్షకులకు చాటి చెప్పాడు. శశిరేఖాపరిణయం (మాయాబజార్‌ 1936) ఆయన రెండవ చిత్రం. దీనిలో అభిమన్యుడి పాత్రని పోషిస్తూ కొన్ని పాటలు కూడా పాడారు. గాయక నటునిగా పేరు సంపాదించినా సంగీతకారునిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తృష్ణ ఈయనలో అధికంగా వుండేది.

అత్యంత యువ సంగీతదర్శకుడిగా చరిత్ర సృష్టించినా సినీ సంగీతదర్శకునిగా బాగా గుర్తింపు తెచ్చిన మొదటి సినిమా ఇల్లాలు (1940).ఆ చిత్రంతో తెలుగు శ్రోతలకొక కొత్తరకమైన సంగీతం పరిచయం చేయబడింది. “లలిత సంగీత”మన్న దానికి తెలుగులో మొదటిగా శ్రీకారం చుట్టి ఒక కొత్త వొరవడిని సృష్టించాడు. కలకత్తాలో బెంగాలీ సంగీతం ద్వారా ప్రభావితుడైన సాలూరి ఆధునికత్వం కోసం చేసిన ప్రయోగాలు తెలుగు సినీ పరిశ్రమలో అంతగా ఆదరణ పొందకపోయినా, తెలుగు పాటకు పాశ్చాత్య బాణీని యెలా జతపరచవచ్చో “ఇల్లాలు” ద్వారా; ఆ తరువాత ఈయన పాడిన లలిత గీతాల ద్వారా, సమర్ధవంతంగా నిరూపించాడు. ఆర్కెస్ట్రా నిర్వహణలో “హార్మొనీ” యొక్క ప్రాధాన్యత ఏమిటో ఆయనకు అర్థమయినంతగా మరెవ్వరికి కాలేదేమో!

ఇల్లాలు చిత్రం ద్వారా సాలూరి కి ఒక బాల సరస్వతి గారి స్వరం తోడై ఒక నూతనత్వానికి తెరలేపింది. వీరిరువురు కలిసి పాడిన పాటలు అత్యంత ప్రజాదరణ పొందడమే కాక గ్రాంఫోన్ రికార్డుల రూపం లోవెల్లువెత్తి తెలుగు సంగీత చరిత్రలో ఒక కమనీయమైన ఘట్టంగా శాశ్వతంగా నిలిచిపోయింది. ఆంధ్రదేశంలో సంగీతరంగానికి నలభయ్యవ దశకం ఒక స్వర్ణయుగమైతే దానిలో సుమారొక యెనిమిదేళ్ళపాటు రాజేశ్వరరావు, బాలసరస్వతులు రాజ్యమేలారంటే అతిశయోక్తి కాదు.జెమినీసంస్థకి ఆస్థాన సంగీత దర్శకుడిగా పని చేసి ఎన్నో మధురమయిన సుస్వరాలని అందిచారు.

సాలూరి ప్రతిభను యావద్భారత దేశానికి తెలియ జెప్పిన చిత్రం చంద్రలేఖ (1948). కర్ణాటక, హిందుస్తానీ, పాశ్చాత్య శాస్త్రీయ సంగీతాలని,లాటిన్‌ అమెరికన్‌, పోర్చుగీస్‌, స్పానిష్‌ జానపద సంగీత పోకడల్ని ఎంతో ప్రతిభావంతంగా సమ్మిళితం చేసి, ఆ కాలంలో వూహించలేనటువంటి పెద్ద వాద్యబృందంతో సృష్టించిన చిత్రమది.

సాలూరి కిరీటంలో కలికితురాయి మల్లీశ్వరి (1951). సినిమా సంగీతంలోను, సినిమా తీసే పద్ధతిలోను గణనీయమైన మార్పులు చెందినా, అర్ధ శతాబ్దం తర్వాతకూడా నేటికీ గల గలా ప్రవహించే నదిలా వీనులవిందు గొలుపుతున్న సాహిత్య సంగీతాల మేళవింపు “మల్లీశ్వరి”. బి.ఎన్‌.రెడ్డి కార్యదక్షతతో, దేవులపల్లి మల్లెపూరేకు బరువుతో వ్రాసిన సాహిత్యంతో, పసుమర్తి కృష్ణమూర్తి నృత్య సారధ్యంతో, ఘంటసాల భానుమతిల గళ మధురిమతో యీ చిత్రంలోని సంగీతం తక్కిన అన్ని హంగుల మాదిరిగానే నభూతో నభవిష్యతి. దీనిని మించిన సంగీతభరితమైన చిత్రం ఇంతవరకు రాలేదు, ఇక ముందు కూడా రాబోదని దృఢంగా విశ్వసించే చాలామంది వున్నారు. సాలూరే “మల్లీశ్వరి” పై వ్యాఖ్యానిస్తూ “చంద్రలేఖ” కథకు ఒక కాలం అంటూ లేదు కనుక అన్నిరకాల సంగీతం వినిపించడానికి అవకాశం కలిగింది. కాని, “మల్లీశ్వరి” చరిత్రకు సంబంధించిన చిత్రం. అటు కథాకాలానికి, ఇటు కాస్త ఆధునికంగానూ వుండేలా సంగీతం కూర్చవలసి వచ్చింది. శాస్త్రీయ రాగాలను తీసుకొని, సెమిక్లాసికల్‌ గా స్వరపరిచాను. అలాగే అందులోని ఏ పాటా కూడా ట్యూన్‌కి రాసింది కాదు! బి.ఎన్‌.గారికి సంగీతాభిరుచి ఎక్కువ కావడంతో ఒక్కో పాటకు ఐదారు వరసలు కల్పించవలసి వచ్చింది. ఆ చిత్రానికి మొత్తం ఆరునెలలపాటు మ్యూజిక్‌ కంపోజింగ్‌ జరిగింది” అన్నాడు.

ప్రతి సంగీత విద్యార్ధి మొదటిగా నేర్చుకొనే శ్రీగణనాధ సింధూరవర్ణ (మలహరి) అన్న పురందరదాస కృతితో చిత్రం ప్రారంభమవుతుంది. తరువాత తేలికగా పాడుకోగలిగే బాణీలలో పిల్లల పాటలు (ఉయ్యాల జంపాల, రావి చెట్టు తిన్నె చుట్టూ), హాస్య గీతం (కోతీబావకు పెళ్ళంట), ప్రకృతి పాట (పరుగులు తీయాలి), జావళి ( పిలచిన బిగువటరా), జానపదం (నోమీన మల్లాల), వీడ్కోలు పాట (పోయిరావే తల్లి), యక్షగానం (ఉషాపరిణయం), యుగళ గీతం, ఇలా అన్నిరకాల పాటలనందించి విభిన్న శ్రోతలను ఆనందపరచిన చిత్రమిది. మరింత ప్రత్యేకంగా పేర్కొనవలసినది, తెలుగువారందరూ ఎంతో గర్వపడ వలసినది, కాళిదాసుని మేఘసందేశానికేమాత్రం తీసిపోని సాలూరి, దేవులపల్లి, ఘంటసాల భానుమతుల సమిష్టి కృషిఫలితం ఆకాశవీధిలో అన్న పాట. ఈ రాగమాలిక(భీంపలాస్‌, కళంగద, కీరవాణి, హంసానంది) అనురాగరసంతో విరహగీతాన్ని విరచించే తూలిక!

శాస్త్రీయ సంగీత బాణీలు, కర్ణాటక హిందుస్తానీ రాగాలలో యుగళ్‌ బందీలు , పాశ్చాత్య సంగీత రూపాలు, … ఇలా చేపట్టిన ఏ ప్రక్రియలోనైనా అద్వితీయమైన సంగీతాన్ని విన్పించారు. అనేక సంగీత రీతుల్ని సమన్వయం చేయడంలో ఆయన సాధించిన విజయాలు మరెవ్వరూ సాధించలేదు. వాయిద్యాలపై ఆయనకున్న పట్టును గురించి చిత్రరంగంలో చాల గొప్పగా ఈనాటికీ చెప్పుకుంటారు.

ఈయన సుదూర సుస్వర సంగీతయాత్రలో 200కు పైగా చిత్రాలకు, ఎన్నో లలిత గీతాలకు, పెక్కు ప్రైవేటు రికార్డులకు సంగీతాన్ని అందించాడు. ఆయన 40 ఏళ్ళకు పైబడిన సినీ జీవితంలో కనీసం పేరైనా పేర్కొనవలసిన చిత్రాలు రాజు పేద (54), మిస్సమ్మ (1955), భలేరాముడు (1956), మాయాబజార్‌ (1957, 4 పాటలు మాత్రమే), అప్పుచేసి పప్పుకూడు, (1958), చెంచులక్ష్మి (1958), భక్త జయదేవ (1960), అమరశిల్పి జక్కన (1963), భక్త ప్రహ్లాద (1967). అభేరి (భీంపలాస్‌), కల్యాణి, మోహన, సింధుభైరవి,శంకరాభరణం ఈయనకు ప్రియమైన రాగాలు. శాస్త్రీయ రాగాల్లో ఆయన వినిపించిన వరసలను గురించి మరొక సుదీర్ఘమైన వ్యాసమే రాయవచ్చు. జగమే మారినది (కల్యాణి, దేశ ద్రోహులు 62), నా హృదయంలో నిదురించే చెలీ (శంకరాభరణం, ఆరాధన 62), పాడవేల రాధికా (మోహన, ఇద్దరు మిత్రులు 60), … లాంటి పాటలు మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.

ఏదో ఒక సంగీతానికే కట్టుబడి వుండాలని ఈయన మడికట్టుకు కూర్చోలేదు. మారుతున్న కాలాన్నిబట్టి పరిస్థితులు ఎన్నో మారుతున్నాయి. అదే విధంగా సినిమా సంగీతంలో కూడా మార్పులెన్నో వచ్చాయి. పాశ్చాత్య శాస్త్రీయ సంగీతాన్ని, జాజ్‌, పాప్‌, రాక్‌, డిస్కో వంటి అధునాతన పాశ్చాత్య సంగీతాన్ని మనం అడ్జస్ట్‌ చేసుకోక తప్పలేని పరిస్థితి. వాటిని మనం అనుసరించడంలో తప్పులేదు. కానీ, కేవలం అనుసరించడం, అనుకరించడం కోసమై మన సంగీతానికి ప్రాణసమానమైన ‘మెలొడీ’ ని ఈతరంవారు మర్చిపోతున్నారు అని అన్న ఆయన మాటలు ఎంతయినా నిజం. ముఖ్యంగా ఈనాడు! సాంఘికమైనా, పౌరాణికమైనా తను నమ్ముకున్న మెలొడీకి ప్రాధాన్యతనిస్తూ సంప్రదాయ రాగాల్లో వుండేటటువంటి మధురిమను వదులుకోకుండా చక్కని చిక్కని పాటలు అందించాడు.

సంగీతదర్శకుడు ‘ పెండ్యాల నాగేశ్వరరావు

పెండ్యాల నాగేశ్వరరావుగారు తెలుగు చిత్రాలకు దొరికిన అద్భుత సంగీత దర్శకులలో ఒక్కరు. తెలుగు సినిమాసంగీతాన్ని గగనదిశకు తీసుకువెళ్లి తారాపథంలో నిలబెట్టి, ఆచంద్రతారార్కం ఆ మధురసంగీతాన్ని వింటూ, పరవశిస్తూపాడుకునేలా చేసిన చలనచిత్ర సంగీతసమ్రాట్‌ పెండ్యాల నాగేశ్వరరావు. పెండ్యాల గారు సినీ జీవితం ప్రారంభించినకొత్తల్లో తల్లిప్రేమ (1941), సతీ సుమతి (1942) చిత్రాలకు హార్మోనిస్టుగా, సహాయ సంగీతదర్శకుడిగా పని చేశారు. స్వతంత్ర్య సంగీత దర్శకుడిగా పని చేయగల ప్రతిభ, పేరు ఉండి కూడా కొత్తపొకడలు నేర్చుకోవచ్చునన్న ఆశతోసాలూరు రాజేశ్వరరావు గారి దగ్గర సహాయకులుగా చేరారు. సాలూరు రాజేశ్వరరావు గారు విదేశీయ సంగీతాన్నీ, హిందుస్తానీ పోకడల్నీ తీసుకుని మన రాగాలతో మిళితం చేసి, ‘తెలుగుపాట’లా చేసి వినిపించగల సమర్థుడనిపెండ్యాల పేర్కొనేవారు. పెండ్యాల గారు సంగీతాన్ని అందించిన సినిమాలు దొంగరాముడు , ముద్దుబిడ్డ , భాగ్యరేఖ , జయభేరి , మహామంత్రి తిమ్మరుసు , శ్రీకృష్ణార్జున యుద్ధం , రాముడు భీముడు , శ్రీ కృష్ణ తులాభారం కొన్ని చాలు – వందకుపైగా సంగీతం కూర్చిన ఆ స్వరచక్రవర్తి సంగీతం గురించి చెప్పుకోవడానికి.

అద్భుతమైన పాటలే కాదు, పద్యాలు కూర్చారు. పౌరాణిక చిత్రాలకు సాంఘిక, జానపద చిత్రాలకూ అద్భుతమైన బాణీలు సమకూర్చడానికి తాను ఎంత రిహార్సిల్స్‌ చేసేవారో, గాయనీ గాయకులతో కూడా రిహార్సిల్స్‌ చేయించి మరీ పాడించేవారు. రంగస్థల నటుడు, హార్మోనిస్ట్‌ కూడా కావడంతో పద్యాల మీద రంగస్థలంలో తనకు గల పట్టు, చిత్రాల్లో కూడా పద్యాల మీద చూపి సినిమాల్లో కూడా ఓహో అనేలా పద్యాలు పాడించేవారు. గాయనీ గాయకుల టేలెంట్‌ గుర్తించి, వారి టేలెంట్‌ని సద్వినియోగం అయ్యేలా చేయడానికి మీదు మిక్కిలి శ్రమించేవారు పెండ్యాల.

శాస్త్రీయ సంగీతంలోనూ, హార్మోనియం వాయించడంలోను పేరు ప్రఖ్యాతులు పొందిన తండ్రి సీతారామాయ్య నుంచి గాత్రం, హార్మోనియం రెండూ నేర్చుకున్నారు మిగతా విద్యార్థులతో పాటు. అలాగే తండ్రి రంగస్థల ప్రదర్శనలకు హాజరు అవుతుంటే పెండ్యాల దృష్టి అటువేపు మళ్ళింది. అందుకే స్కూల్లో పాటలు పద్యాలు పాడటమే కాకుండా అప్పుడప్పుడు వేషాలూ వేస్తూ మెల్లిగా రంగస్థలం మీదకు నటుడుగా ప్రవేశించి హార్మోనియం కూడా మీటేవారు.

ఆరుద్ర పెండ్యాల, తిలక్‌ కాంబినేషన్లో రూపొందిన చిత్రాల్లో ఎంత చక్కని పాటలు రూపొందాయో, ఘంటసాల, సుశీల, పెండ్యాల కాంబినేషన్లోనూ అద్భుతమైన పాటలు వెలువడ్డాయి.

దొంగరాముడు, ముద్దుబిడ్డ, ఎమ్‌ఎల్‌ఎ, భాగ్యరేఖ, జయభేరి, భట్టి విక్రమార్క, ఈడూజోడూ, అత్తా ఒకింటి కోడలే, హరిశ్చంద్ర, మహాకవి కాళిదాసు, శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం, జగదేక వీరుని కథ, వాగ్దానం, మహామంత్రి తిమ్మరుసు, కులగోత్రాలు, శ్రీకృష్ణార్జున యుద్ధం, శ్రీకృష్ణ తులాభారం, రాముడు భీముడు, వెలుగునీడలు, ఉయ్యాల జంపాల, శ్రీకృష్ణ సత్య, బావామరదళ్లు, అక్కాచెల్లెలు ఇలా అనేక చిత్రాలను అద్భుతమైన సంగీతం సమకూర్చారు పెండ్యాల.

పెండ్యాల ప్రతిభని పసిగట్టిన గాలిపెంచల నరసింహారావు మాయలోకం (1945) చిత్రానికి హార్మోనిస్టుగా పిలిస్తే, దుక్కిపాటి మధుసూదనరావుగారి సలహాతో పెండ్యాల తిరిగి సినిమారంగానికి వచ్చారు. గృహప్రవేశం (1946) చిత్రనిర్మాణానికి సారథ్యం వహించిన కె.ఎస్‌.ప్రకాశరావు పెండ్యాలకి సహాయ సంగీతదర్శకుడి స్థానం ఇచ్చారు. ఆచిత్రానికి సంగీతర్శకుడు బాలాంత్రపు రజనీకాంతరావు. ఆయన ఆలిండియో రేడియోలో తీరిక లేకుండా వుంటారుగనక, సమర్థుడైన సహాయకుడు కావాలని నాగేశ్వరరావును తీసుకున్నారు. అంతే! పెండ్యాల ప్రజ్ఞ ప్రకాశరావుగారికిపూర్తిగా అర్థమైంది. తరువాత తాను నిర్మించిన, ద్రోహి(1948)కి పెండ్యాలకు సంగీతదర్శకుడుగా అవకాశం ఇచ్చారుప్రకాశరావుగారు. ఆ చిత్రానికీ, ఆ చిత్రంలోని కాఫీ ఖవాలీ, మనోవాంఛలు, పూవు చేరి, చిక్కిలిగింతలు మొదలైనపాటలకీ మంచి పేరొచ్చింది. పెండ్యాల సంగీతగాదర్శకుపెండ్యాల నాగేశ్వరరావుడు స్థిరపడ్డారు. సినిమాలోని సన్నివేశాన్ని అర్థం చేసుకుని, దానికి తగ్గట్టుగా ట్యూన్‌ వచ్చేవరకూ, ఒళ్లు వంచి పనిచెయ్యడం, తను అనుకున్నట్టే గాయనీగాయకుల చేతపాడించడం – పెండ్యాల గుణం. గాయనీ గాయకుల దగ్గర ఎంత ప్రతిభ వుందో, అంత ప్రతిభనీ పూర్తిగావినియోగించుకునే సంగీతదర్శకుడాయన. ఘంటసాలకీ, పెండ్యాలకీ ఒకరిమీద ఒకరికి అమితమైన అభిమానం. పెండ్యాల గారి దృష్టిలో ఘంటసాలని మించిన గాయకుడులేడు!. పెండ్యాల గారి వేలపాటల్లో – అది క్లబ్బుపాటైనాఅందులో కూడా మాధుర్యం తొంగిచూసినట్టే, హిందీపాటని అనుసరించినా, పాశ్చాత్యధోరణిని అనుకరించినా అందులోతెలుగుదనం వుట్టిపడుతుంది. సంగీతరస హృదయులకీ, గాయనీగాయకులకీ అందరికీ నచ్చే సంగీతం ఆయనది.

మీరజాలగలడా పాట పాడించడంలో సుశీలగారిని గుక్క తిప్పుకోవడానికీ, సంగతుల్ని వెయ్యడంలో ఎక్కడైనానిలబెట్టడానికీ వీలుకల్పంచకుండా పెండ్యాలగారు మొత్తం అనుకొన్నది రాబట్టేవరకూ విడిచి పెట్లేదు.

జగదేకవీరుని కథలోని శివశంకరీ పాట గురించి ఘంటసాల చెప్పేవారు. ‘పాట మొత్తం ఒకే టేక్లో పాడగలిగితేబావుంటుంది – ఎన్ని రోజులు రిహార్సల్లు తీసుకున్నా సరే’ అని పెండ్యాలగారంటే – ‘ఒకే టేక్లో మొత్తం పాడతానుచూడండి’ అని ఘంటసాల ‘పందెం’ వేసినట్టు అన్నారు. ‘వారం రోజుల పాటు ఇంకో రికార్డింగ్కి వెళ్లకుండా ఆపాటనే సాధన చేసి, అనుకున్నది సాధించిన మహాదీక్షాపరుడాయన’ అని పెండ్యాలగారు, ఘంటసాల మృతిసందర్భంగా చెబుతూ, ఆయన్ని స్తుతించారు.‌ ‌ ‌

సంగీతదర్శకుడు ‘ ఎస్.పి.కోదండపాణి.

ఎస్.పి.కోదండపాణి (1932 – 1974) సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకులు. వీరి పూర్తిపేరు శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి.

అద్దేపల్లి రామారావు గారి నా ఇల్లు చిత్రంలో బృందగానంలో మొదటి సారిగా 1953లో సినిమాలలో పాడే అవకాశం కలిగింది. సుసర్ల దక్షిణాముర్తి గారి వద్ద హార్మోనిస్టుగాను, సహాయకులుగా పనిచేశారు. 1955లో సంతానం చిత్రం ద్వారా స్వతంత్రంగా పాటపాడే అవకాశం లభించింది.

ఎస్. పి. కోదండపాణి గారు పరిచయం చేసిన బాలసుబ్రహ్మణ్యం ఇంతింతై వటుడింతై బాలుగా తెలుగువారందరికీ సంగీతాత్మీయుడై తెలుగు చరిత్రలో తనకొక సుస్థిర స్థానాన్ని సంపాదించాడు.

బాలు స్థానం పటిష్టం కావడానికి ఆయన అవిరళ కృషితో బాటు ఎస్. పి. కోదండపాణి గారి కృషి కూడా చాలా ఎక్కువగా పనిచేసింది. ఆయన బాలు స్వరాన్ని తన సంగీతంలో పరిచయం చేయడంతో బాటు చిత్ర రంగానికి పరిచయం చేయడానికి ఎంత శ్రద్ధ తీసుకున్నారో ఆ గళంలో పాట నిలబడడానికి అంతే శ్రద్ధ తీసుకున్నారు. ఆయన తొలి పాటను సంగీత దర్శకులందరికీ వినిపించి, అతనికి అవకాశాలిమ్మని కోదండపాణి గారే అడిగేవారట. బాలు గారికి ఆర్థికంగా సహాయపడడానికి తన దగ్గర సహాయకుడిగా పనిచేయించుకునేవారట. ఇతర సంగీతదర్శకుల దగ్గర బాలు గారు పాడిన పాటల్ని ప్రత్యేకంగా వెళ్ళి వినేవారట. పాటలో పొరబాట్లను క్షమించేవారు కాదట. చిన్న తప్పు చేసినా ఎత్తి చూపేవారట.

బాలు గారి భవిష్యత్తుకు ఎంత ఆరాట పడ్డారో ఆయన ఆరోగ్యం కోసం కూడా అంతే ఆరాటపడ్డారు కోదండపాణి గారు. ఒకసారి బాలు గారు కష్టబడి సైకిల్ తొక్కుకుంటూ కోడంబాక్కం వంతెన మీద వెడుతుంటే అప్పుడే కారు మీద వెడుతున్న కోదండపాణి గారు చూసారు. బాలు గారిని ఆపి ” ఏమిటయ్యా పంతులూ ! ఈ ఎండలో సైకిల్ మీద విహారం ఏమిటీ ? బుద్ధిలేదూ ? ఆరోగ్యం బాగుంటేనే పాట బాగుంటుంది. బస్సులో వెళ్ళు. ఇకెప్పుడైనా సైకిల్ మీద కనిపించావో ఊరుకోను ” అని మందలించారట. ఆయన శ్రద్ధ, కోరిక ఫలించి తెలుగు వారికి మరో అద్భుతమైన గాయకుడు లభించాడు.

శ్రీ కోదండ పాణి గారి గురించి బాలసుబ్రహ్మణ్యం “శ్రీ కోదండ పాణితో నా తొలి అనుభవాలను మీకు వివరంగా ముందే తెలియజెప్పాను. ఆయన సంగీత దర్శకత్వంలో పాడటం అంటే నాకు ఎంతో ఇష్టం. నేను చక్కగా పాడాలన్న కోరిక..ఆయనకు చాలా ఎక్కువ. ఎప్పుడైనా నేను పాడే పధ్దతి నచ్చకపోతే మెత్తగా గట్టిగా చీవాట్లు పెడతారు ఆయన. నేను ఎప్పుడైనా కారులో వేగంగా వెళ్లడం చూసారంటే ఏమిటా జోరు నిదానంగా పోరాదా అని ప్రశ్నించి మందలిస్తూంటారు. చాలా మంది నేనూ ఆయనా బంధువులు(నేను ఎస్.పి.బాలసుబ్రమణ్యం-ఆయన ఎస్.పి.కోదండపాణి కనుక) అనుకుంటారు. మా ఇనిషియల్స్ చూసి నాకు ఆయన బంధువులు కారు..అంతకన్నా అధికులు..దైవ సమానులు.

ఆయన సంగీత దర్శకత్వంలో నేను పాడిన ఎన్నో పాటలలో నాకు నచ్చిన పాట ఆస్తులు-అంతస్తులు చిత్రంలో సుశీలతో నేను పాడిన ఒకటైపోదామా అన్న పాట. మానసికంగా ఒకటై పోయిన శ్రీ కోదండపాణిగారు నాకు సంగీతపరంగా మానసికంగా గురువు ” అని అన్నారు.

చిరకాలం గుర్తుండే పాటలు

* బొమ్మను చేసి ప్రాణం పోసి – దేవత
* ఇది మల్లెల వేళయనీ – సుఖదుఃఖాలు
* జగమే రామమయం – శ్రీరామకథ
* చుక్కలన్ని చూస్తున్నాయీ – జ్వాలాద్వీప రహస్యం

సంగీతదర్శకుడు ఓగిరాల రామచంద్రరావు

గిరాల రామచంద్రరావు పాతతరం తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. వాహిని వారి చిత్రాలెన్నింటికో ఈయన సంగీతం అందించారు. ఓగిరాల తెలుగు చలనచిత్రరంగంలో మొట్టమొదటి నేపథ్యగాయకుడు, ఆయన మళ్ళీ పెళ్ళి (1939) చిత్రంలో వై.వి.రావుకి పాడారు.

ఓగిరాల రామచంద్రరావు పేరు తెలిసినవారు తక్కువే ఉండచ్చు, కానీ ఆయన గొప్పతనం తెలిసినవారు ఆయన గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. జాతీయ పురస్కారం అందుకున్న మొట్టమొదటి తెలుగు చిత్రం అయిన పెద్ద మనుషులు (1954)కి ఆయన సంగీతదర్శకుడు. 1939లో విడుదలైన జగదీశ్ పిక్చర్స్ వారి మళ్లీ పెళ్లి సంగీతదర్శకునిగా ఆయనకి మొదటి చిత్రం, ఇదే చిత్రంలో ఓగిరాల ఒక చిన్న పాత్రలో కనిపిస్తారు. ఆ చిత్రంలో బెజవాడ రాజారత్నం పాడిన “గోపాలుడే మన గోపాలుడే”, “చెలి కుంకుమమే పావనమే” వంటి పాటలు పేరుపొందాయి. ఇదే చిత్రంలో ఓగిరాల, కాంచనమాలతో కలిసి “నా సుందర సురుచిరరూపా” అనే పాటని ఆలాపించారు. ఈ పాటను ఆయన వై.వి.రావు గారికి పాడారు. ఈ విధంగా ఆయన తెలుగు చలనచిత్రసీమలో మొట్టమొదటి నేపథ్యగాయకుడు. 1939లో విడుదలైన శ్రీ వేంకటేశ్వర మహత్యంలో ఆయన శివుని వేషం వేశారు. ఆ చిత్రంలో శివుని వేషానికి ముందు వేరే నటుడిని తీసుకున్నారు, కానీ అతని మెడలో పాము వేయగానే ఆ నటుడు భయపడిపోయి ఆ వేషాన్ని వదులుకున్నాడు, దాంతో ఆ చిత్రానికి సంగీతదర్శకుడైన ఓగిరాల ఆ వేషం వేయడానికి ముందుకొచ్చారు.

1940లో విడుదలైన జగదీశ్ పిక్చర్స్ వారి విశ్వమోహినిలో బెజవాడ రాజారత్నం చేత ఓగిరాల పాడించిన పాటలు చాల పేరుపొందాయి. “ఈ పూపొదరింటా” చాలా ప్రముఖంగా వినిపించగా, “”భలే ఫేస్ భలే ఫేస్”, “మేళవింపగదే చెలియా వీణ” పాటలు కూడా బాగానే పేరు సంపాదించాయి. 1941లో విడుదలైన ప్రతిభా పిక్చర్స్ వారి మొట్టమొదటి చిత్రం పార్వతీకళ్యాణంకు ఆయన తదుపరి చిత్రం. గరుడ గర్వభంగం (1943), సీతారామజననం (1944) ఆయన తదుపరి చిత్రాలు, ఈ రెండూ చిత్రాలు ప్రతిభా పిక్చర్స్ సంస్థ నిర్మించినవే. సీతారామజననం చిత్రానికి ఓగిరాల, ప్రభల సత్యనారాయణతో కలిసి పని చేశారు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావుతో “గురు బ్రహ్మ గురు విష్ణు” శ్లోకాన్ని పాడించారు. ఆయన తదుపరి చిత్రం వాహినీ వారి స్వర్గసీమ (1945), ఈ చిత్రంలో నాగయ్య, బాలాంత్రపు రజనీకాంతరావుతో కలిసి పని చేశారు. ఈ చిత్రం పాటలన్నింటిలో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. సంగీతపరంగా స్వర్గసీమను విజయవంతం చేయడంలో ఆయన కృషి ఎంతో ఉంది. 1946లో విడుదలైన ప్రతిభా పిక్చర్స్ వారి ముగ్గురు మరాఠీలు సంగీతపరంగా విజయం సాధించింది. అక్కినేని నాగేశ్వరరావు, టి.జి.కమలాదేవి పాడిన “ఛల్ ఛలో వయ్యారీ షికారీ”, కన్నాంబ పాడిన “సతీ భాగ్యమే భాగ్యము”, “తీరుగదా ఆశా నేడు” మరియు బెజవాడ రాజారత్నం పాడిన “జీవనము యమునా జీవనము”, “రాటము భారతనారీ కవచము” తదితర పాటలు బాగా పేరు సంపాదించాయి. ఈ చిత్రంలో ముఖ్యంగా పేర్కోవలసిన పాట “జీవనము యమునా జీవనము”. ఈ విధంగా చూస్తే బెజవాడ రాజారత్నంకు గాయనిగా పేరు తెచ్చిపెట్టింది ఓగిరాల అని స్పష్టంగా తెలుస్తుంది. ఓగిరాల తదుపరి చిత్రాలు నాగయ్య గారి త్యాగయ్య (1946) మరియు వాహినీ వారి యోగి వేమన (1947). ఈ రెండూ చిత్రాలకు ఆయన నాగయ్య వద్ద సహాయకునిగా పనిచేశారు. యోగి వేమనలోని పాటలలో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన తదుపరి చిత్రం రక్షరేఖ (1949)కు హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రితో కలిసి పని చేశారు. 1949లో విడుదలైన వాహినీ వారి గుణసుందరి కథ అప్పట్లో అన్నీ రంగాలలో పెద్ద విజయం సాధించింది. 1950లో విడదలైన పరమానందయ్య శిష్యులు పరాజయం పొందినా పాటలు బాగానే పేరు సంపాదించాయి.

ఆయన తదుపరి చిత్రాలు మాయరంభ (1950), రాజేశ్వరి (1952), కుమారి (1952 – రాజేశ్వరి – తమిళం), సతీ సక్కుబాయి (1954). మాయరంభ లోని పాటలు, పద్యాలు ఓగిరాలకి బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఈ చిత్రంలో నటి అంజలీదేవి చేత ఓగిరాల ఒక బృందగీతం పాడించారు. సతీ సక్కుబాయి చిత్రంలో ఎస్.వరలక్ష్మి పాడిన పాటలు బాగా ఉంటాయి. ఆయన తదుపరి చిత్రం వాహినీ వారి పెద్ద మనుషులు (1954). పెద్ద మనుషులు తరువాత టి.వి.రాజుతో కలిసి శ్రీ గౌరీ మహత్యం చిత్రానికి పని చేశారు. నాగయ్య గారు తీసిన భక్త రామదాసు (1964) ఆయన చివరి చిత్రం. ఈ చిత్రానికి ఓగిరాల నాగయ్య, అశ్వత్థామ, హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రితో కలిసి పని చేశారు.

ఓగిరాల సంగీతం అందించిన చిత్రాలలో ముఖ్యంగా పేర్కొనవలసినవి గుణసుందరి కథ (1949) మరియు పెద్ద మనుషులు (1954). ఆ రెండూ వాహిని వారి చిత్రాలు కావడం, ఆ రెండిట్లో అద్దేపల్లి రామారావు ఓగిరాలకు సహాయకునిగా, వాద్యనిర్వాహకునిగా పనిచేయడం విశేషం. మరో విశేషం ఏమిటంటే ఆ రెండూ చిత్రాలకు నిర్మాత మరియు దర్శకుడు కె.వి.రెడ్డి గారే మరియు రెండిట్లో నాయిక శ్రీరంజని జూనియరే.

గుణసుందరి కథ చిత్రం విజయం సాధించడానికి ముఖ్య కారణాలలో ఓగిరాల సంగీతం ఒకటి. పి.లీల, టి.జి.కమలాదేవి, కస్తూరి శివరావు, శాంతకుమారి, మాలతి, ఘంటసాల తదితరులతో ఓగిరాల పాడించిన పాటలు బాగా జనాదరణ పొందాయి. ఈ చిత్రంలో పాటలన్నీ పింగళి నాగేంద్రరావు రాశారు. ఓగిరాల ఈ చిత్రంలో పి.లీల చేత పాడించిన ఒక్క “చిటి తాళం వేసెనంటే” మరియు “నాను సింగారినే మగనా” తప్ప మిగతావన్నీ భక్తి పాటలే, వాటిలో “శ్రీ తులసి ప్రియ తులసి” పాట చాలా కాలం అందరి ఇళ్ళల్లో వినిపించేది, ఆ పాట పాడుతూ ప్రతీ స్త్రీ తులసి మాతను ఆరాధించేది. శాంతకుమారి, మాలతి కలిసి పాడిన “కలకలా ఆ కోకిలేమో” మరియు “చల్లని దొరవేలె చందమామ” పాటలు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. ఘంటసాల ఈ చిత్రంలో “అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా” అనే నేపథ్యగీతం పాడారు. అలాగే కస్తూరి శివరావు, టి.జి.కమలాదేవి, వి.శివరాం పాడిన పాటలు కూడా పేరు పొందాయి.

పెద్ద మనుషుల చిత్రంలో రేలంగికి ఘంటసాల పాడిన “నందామయా గురుడ నందామయా” మరియు “శివశివ మూర్తివి గణనాథా” బాగా జనాదరణ పొందాయి. ఆ రెండూ పాటలను కొసరాజు రాశారు. పి.లీల ఈ చిత్రంలో మూడు పాటలు పాడింది, ఆమె పాడిన “నీ మీద ప్రాణాలు నిలిపింది రాధ” పాట హిందీ చిత్రం అల్‌బేలాలోని పాటకు అనుకరణగా సంగీతం అందించారు మరియు లీలనే పాడిన “అంతభారమైతినా అంధురాలనే దేవ” పాట మనస్స్సుకు హత్తుకునే విధంగా సంగీతం అందించారు. ఈ చిత్రం జాతీయ బహుమతి పొందిన మొట్టమొదటి తెలుగు చిత్రం. ఈ విధంగా జాతీయ బహుమతి పొందిన మొదటి తెలుగు చిత్రానికి సంగీతమందించిన వ్యక్తిగా ఓగిరాల కీర్తి పొందారు.

1905లో సెప్టెంబరు 10న బెజవాడలో ఓగిరాల జనార్దనశర్మ, సుబ్బమ్మ దంపతులకు జన్మించిన ఓగిరాల రామచంద్రరావు, 1957లో భక్త రామదాసు చిత్ర నిర్మాణ సమయంలో ఫ్లూ జ్వరం బారిన పడి జూన్ 17వ తేదీన మరణించారు. ఓగిరాల అంతిమయాత్రలో ఆయనంటే ఎంతో అభిమానమున్న ఘంటసాల సుమారు రెండు మైళ్ళు నడిచారు.

ఓగిరాల భార్య పేరు వరలక్ష్మి. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. కుమారుడి పేరు నరసింహమూర్తి మరియు కుమార్తె పేరు కల్పకవల్లి. నరసింహమూర్తి కొన్ని చిత్రాలలో బాలనటునిగా నటించారు. బ్రతుకుతెరువు (1953)లో సూర్యకాంతం కొడుకుగా, దొంగరాముడు (1955)లో చిన్ననాటి రాముడి స్నేహితునిగా, అప్పు చేసి పప్పు కూడు (1959)లో సూర్యకాంతం, రమణారెడ్డి కొడుకుగా నటించారు. అప్పు చేసి పప్పు కూడులో రేలంగి, నరసింహమూర్తి కలిసి పండించిన హాస్యం మరువలేనిది.. ఆయన ఈ మధ్యే కార్పరేషన్ బ్యాంక్‌లో సీనియర్ ఉద్యోగిగా పదవీ విరమణ పొందారు. ఓగిరాలకు జాతకాలు చూసే అలవాటు ఉండేది. ఓగిరాల కొంతమంది ప్రముఖ నటుల జాతకాలు రాసిపెట్టుకున్నట్టు ఆయన కుమార్తె కల్పకవల్లి చెప్పారు.

సంగీత దర్శకుడు ‘గాలిపెంచల నరసింహారావు

గాలి పెంచల నరసింహారావు ఆ పేరు వింటే చాలామందికి గుర్తుకువచ్చేది “సీతారాముల కళ్యాణం చూతము రారండి” పాట. ఇంతటి గొప్ప పాటకు చాలా గొప్ప సంగీతదర్శకుడు గాలి పెంచల.

గాలి పెంచల నరసింహారావు (1903 – 1964) తెలుగు చలనచిత్ర సంగీతదర్శకులలో మొదటి తరానికి చెందినవారు. దక్షిణభారతదేశంలో నిర్మితమైన మొట్టమొదటి చిత్రం సీతాకళ్యాణం (1934) ఆయన సంగీతం అందించిన మొదటి చిత్రం. ఆయన చివరి చిత్రం ఎన్.ఏ.టి.వారి సీతారామ కల్యాణం (1961), ఆ చిత్రం ఆయన సంగీతం అందించిన చిత్రాలలో అన్నింటికన్నా పెద్ద విజయం సాధించింది. ఈ చిత్రంలో ఆయన స్వరపరచిన సీతారాముల కళ్యాణం చూతము రారండి పాట ఎంతో పెద్ద విజయం సాధించింది. ఆ పాట ఇప్పటికి శ్రీరామనవమి నాడు మరియు పెళ్ళి కార్యక్రమాలలో వినిపిస్తూనే ఉంటుంది. ఆయన సంగీతం అందించిన తొలి మరియు చివరి చిత్రాలు ఒకే నేపథ్యం ఉన్న కథతో తయారుకావడం కాకతాళీయం. 1936లో విడుదలైన మాయాబజార్ లేక శశిరేఖా పరిణయం చిత్రంలో ఆయన స్వరపరిచిన వివాహభోజనంబు పాటయే ఘంటసాల స్వరపరిచిన 1957లోని మాయాబజార్లోని పాటకు ఆదర్శం. 1943లో వచ్చిన పంతులమ్మ చిత్రంలో కృష్ణవేణి అనే అమ్మాయికి పాడే అవకాశం ఇచ్చారు, ఆమె ఎవరో కాదు మధుర గాయని జిక్కి. ఈ చిత్రంలో ఆమె ఈ తీరున నిన్నెరిగి పలుకగా నాతరమా అనే పాట స్వయంగా నటిస్తూ పాడారు. 1945లో వచ్చిన మాయలోకం చిత్రం ద్వారా అలనాటి ప్రముఖ సంగీతదర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావును తన బృందంలో హార్మోనిస్టుగా అవకాశం ఇచ్చారు. 1947లో వచ్చిన పల్నాటి యుద్ధం చిత్రానికి ఆయనే సంగీతదర్శకుడు. ఈ చిత్రంలో తనకు సహాయకునిగా పనిచేసిన ఘంటసాలతో కొన్ని పాటలు పాడించారు. ఆ చిత్రంలోని పాటలు చాలా ప్రాధాన్యత ఉన్నవి, ఎందుకంటే అందులో అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా పాటలు పాడారు, అక్కినేని నాగేశ్వరరావు, ఘంటసాల కలిసి ఒక పాట పాడారు, ఘంటసాల, కన్నాంబ కలిసి ఒక యుగళగీతం (భక్తిగీతం) – తెరతీయగరాదా దేవా ఆలాపించారు మరియు అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వరలక్ష్మి కలిసి ఒక యుగళగీతం ఆలాపించారు. 1948లో వచ్చిన బాలరాజు చిత్రంలో ఈయన స్వరపరచిన పాటలు ఆ చిత్ర విజయానికి ముఖ్య కారణం. ఘంటసాల పాడిన చెలియా కనరావా, ఎస్.వరలక్ష్మి పాడిన ఎవరినే నేనెవరినే మొదలైన పాటలు, ఆ చిత్ర విజయానికి దోహదపడ్డాయి. ఆ చిత్రంలో కొన్ని పాటలను ఘంటసాల కూడా స్వరపరిచారు, అందుకు కారణం గాలిపెంచలనే. ఆయనకి సంగీతోపాధ్యాయ అని బిరుదు. నరసింహారావుగారు సంగీతం అందించిన చిత్రాలన్నీ సంగీతపరంగా పెద్ద విజయాలను సాధించాయి. మాలపిల్ల (1938) చిత్రంలో కథానాయకునిగా నటించిన గాలి వెంకటేశ్వరరావు ఈయన తమ్ముడు. ఆయన ఇంటిపేరును చాలామంది గాలిపెంచల అనుకుంటారు, కానీ ఆయన ఇంటిపేరు గాలి, అసలు పెరు పెంచల నరసింహారావు. కొన్ని చిత్రాలలో ఆయనపేరును జి.పెంచలయ్యగా, కొన్ని చిత్రాలలో గాలి పెంచలగా, కొన్ని చిత్రాలలో పూర్తి పేరును వేశారు.

మాలపిల్ల (1938), కృష్ణప్రేమ (1943) వంటి చిత్రాలలో కథానాయకునిగా నటించిన గాలి వెంకటేశ్వరరావు, గాలి పెంచల సోదరుడు. గాలి పెంచల శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న వ్యక్తి. ఆయన సంగీతం అందించిన చిత్రాలన్నీ సంగీతపరంగా పెద్ద విజయాలను సాధించాయి.

అగ్నిపరీక్ష (1951) చిత్రానికి సంగీతం అందించిన దాదాపు పదేళ్ళ తర్వాత ఆయన సీతారామకళ్యాణం చిత్రానికి సంగీతం అందించారు. ఘంటసాల సంగీతదర్శకుడిగా ఎదగడానికి ముఖ్య కారణం గాలి పెంచల. ఆయన సంగీతం అందించిన పల్నాటి యుద్ధం (1947), బాలరాజు (1948) చిత్రాలకు ఘంటసాలను సహాయకునిగా పెట్టుకున్నారు. బాలరాజు చిత్రంలో ఘంటసాల చేత కొన్ని పాటలకు స్వరరచనను చేయించారు. పల్నాటి యుద్ధం చిత్రంలో ఘంటసాల, కన్నాంబ చేత ఒక భక్తగీతం పాడించారు. ఆ పాట “తెరతీయగరాదా దేవా”. ఆ పాటకు సంగీతం, సాహిత్యం ఎంతో అద్భుతంగా ఉంటాయి. గాలి పెంచలకు “సంగీతోపాధ్యాయ” అని బిరుదు.

సంగీత జ్ఞాని ‘వి.ఎ.కె. రంగారావు ‘

‘సంగీత దర్శకుడు తమన్’

music director thaman

సంగీత దర్శకుడు ‘యువన్ శంకర్ రాజా’

సంగీత దర్శకుడు ‘ఇళయరాజా’

సంగీత దర్శకుడు ‘జి.వి.ప్రకాష్ కుమార్’

music gv prakash 1 ee