తెలుగు కథ… హిందీ సినిమా!

తెలుగు కథ… హిందీ సినిమా!
 

ఎఫ్‌2, ఆర్‌ఎక్స్‌ 100, అర్జున్‌రెడ్డి… ఇవి తెలుగు సినిమాలు మాత్రమే కాదు, హిందీలో రీమేక్‌ అవుతున్న మన కథలు కూడా! తెలుగు సినిమాలు ఇతర భాషల్లో రీమేక్‌ అవ్వడం, ఇతర భాషా కథలు తెలుగులోకి రావడం కొత్తేమీ కాదు గానీ, ఇటీవల కాలంలో మన కథలు మునుపెన్నడూలేని విధంగా ఇతర చిత్ర పరిశ్రమల్ని ఆకర్షిస్తున్నాయి. బాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండల్‌వుడ్‌… అందరూ తెలుగు కథని ఆసక్తిగా వింటున్నారు.

టాలీవుడ్‌లో సెన్సేషనల్‌ హిట్‌
‘అర్జున్‌రెడ్డి’… బాలీవుడ్‌లో ‘కబీర్‌ సింగ్‌’ పేరుతో రూపొందుతోంది. ఈ సినిమా కథతోపాటు, దర్శకుణ్నీ బాలీవుడ్‌ తీసుకుంది. అర్జున్‌రెడ్డి దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా హిందీ వెర్షన్‌కీ దర్శకత్వం వహిస్తున్నాడు. షాహిద్‌ కపూర్‌, కియారా అడ్వాణీ నటీనటులు. గతేడాది విడుదలైన మరో సంచలన చిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’. ఈ సినిమా కూడా బాలీవుడ్‌ని ఆకర్షించింది. వెంటనే ఆ సినిమా హిందీ హక్కులు కొనేశారు అక్కడి నిర్మాతలు. వెనకటి తరం హీరో సునీల్‌ శెట్టి తనయుడు అహాన్‌ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. సంక్రాంతికి విడుదలై బ్లాక్‌బస్టర్‌ అయిన బొమ్మ ‘ఎఫ్‌2’ కూడా బాలీవుడ్‌కి వెళ్తోంది. ఈ సినిమాతో దిల్‌రాజు నిర్మాతగానూ అక్కడ అరంగేట్రం చేయబోతున్నారు. ఇవి మాత్రమే కాదు, ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ‘ఆపరేషన్‌ గరుడవేగ’ అదే బాటలో ఉంది. ఇంకా ఆ జాబితాలో గీత గోవిందం, గూఢచారి కూడా చేరబోతున్నాయి. మరోవైపు తమిళం, కన్నడలోనూ మన సినిమాలు తరచూ రీమేక్‌ అవుతున్నాయి. అర్జున్‌ రెడ్డి, ఆర్‌ఎక్స్‌100,  గీత గోవిందం వీటిని తమిళంలోనూ రీమేక్‌ చేయబోతున్నారు.

కలెక్షన్లు అదుర్స్‌…
గతేడాది బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాల్లో భాగీ-2, సింబా ఉన్నాయి. టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా నటించిన భాగీ-2 తెలుగులో వచ్చిన ‘క్షణం’ సినిమాకి రీమేక్‌ కాగా, సింబా… జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమా ‘టెంపర్‌’కి రీమేక్‌. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన ‘సింబా’ గతేడాది డిసెంబరులో విడుదలై బాక్సాఫీసు దగ్గర రూ.400 కోట్లు వసూలు చేసింది. భాగీ 2 రూ.250 కోట్లు రాబట్టింది. ఈ సినిమానే కాదు, టైగర్‌ ష్రాఫ్‌ తన కెరీర్‌ని తెలుగు సినిమా రీమేక్‌లతోనే నిర్మించుకున్నాడని చెప్పాలి. అతడి పరిచయ చిత్రం హీరో పంటీ(పరుగు), రెండో సినిమా భాగీ(వర్షం) కూడా తెలుగు రీమేక్‌లే. ఇవి మాత్రమే కాదు, రౌడీ రాథోర్‌(విక్రమార్కుడు), వాంటెడ్‌(పోకిరి) కిక్‌(కిక్‌)… ఇలా చాలా సినిమాలే మన దగ్గర్నుంచి అక్కడికి వెళ్లాయి. తమిళంలోనూ మన కథలు కనిపిస్తాయి. ఒక్కడు, నువ్వొస్తావంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, జయం… ఇలా చాలా ఉన్నాయి. కన్నడలోనూ అత్తారింటికి దారేది, కుమారి 21ఎఫ్‌, బృందావనం, దూకుడు లాంటి సినిమాలను రీమేక్‌ చేశారు.

కథ కోసమే…
ఒక సినిమాను తెరకెక్కించాలంటే కథే మూలం. అందుకే ఊహాత్మక కథలతోపాటు పుస్తకాలూ, వాస్తవ సంఘటనలూ, బయోగ్రఫీలూ… ఇలా అన్నిదారులూ వెతుకుతుంటారు సినీ రచయితలు. ఇలా తెరకెక్కించిన కథలు అన్నిసార్లూ విజయవంతమవుతాయని చెప్పలేం. అందుకే ఇతర భాషా చిత్రాలమీదా ఓ కన్నేసి ఉంచుతారంతా. అక్కడ ఏదైనా సినిమాకి హిట్‌ టాక్‌ వస్తే వెంటనే ఆ కథా హక్కుల్ని కొనేస్తారు. హిట్‌ అయిన కథల్ని ఎంచుకుంటే రిస్కు తక్కువ. ఒక విధంగా ఇది విజయానికి దగ్గర దారి కూడా. ఈ కథలకు రూ.2-6 కోట్లు చెల్లించి కథ మీద నమ్మకం ఉండటంవల్ల చిత్రీకరణకు మరింత ఎక్కువ ఖర్చు చేయడానికి సిద్ధమవుతుంటారు నిర్మాతలు. భాష ఏదైనాగానీ, కథ, తీసే విధానం భిన్నంగా ఉంటే కచ్చితంగా హిట్‌ అవుతుందన్న నమ్మకంతోనే రీమేక్‌లకు ఓటేస్తున్నారు. మన కథలతోపాటు స్టార్‌ హీరోల డబ్బింగ్‌ సినిమాలకూ మంచి డిమాండ్‌ ఉంటోంది. మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ సినిమాల హిందీ డబ్బింగ్‌ హక్కుల్ని రూ.10-20 కోట్లకు పైనే చెల్లించి తీసుకుంటున్నారు. యువ దర్శకులూ, రచయితలతో టాలీవుడ్‌ ఇప్పుడు టాలెంట్‌వుడ్‌ అయిపోయింది మరి!

Director SivaNirvana

మజిలీ… మా వైజాగ్‌ కథే!
తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకు ప్రభావితం కాని కుర్రాళ్లు ఉండరు. కానీ ఆ ప్రభావం చాలామందిలో తాత్కాలికమే. ఎందుకంటే సినిమా కష్టాలు ఎలా ఉంటాయో వాళ్లకి తొందరగానే అర్థమవుతుంది. అవి తెలిశాక కూడా ‘సినిమానే జీవితం’ అనుకునేవారు అతి కొద్దిమంది ఉంటారు. అలాంటివారిలో శివ నిర్వాణఒకరు. దర్శకుడిగా మారడానికి అతడు సుదీర్ఘ ప్రయాణం చేశాడు. ‘నిన్నుకోరి’ తో హిట్‌ అందుకుని, ‘మజిలీ’తో మరోసారి మనముందుకు వచ్చిన శివ సినిమా జర్నీ గురించి అతడి మాటల్లో…

 

డిగ్రీ పూర్తవగానే ‘చదివింది చాలు ఇక సినిమాల్లోకి వెళ్లాల్సిందే’… అనుకుని ఇంట్లో చెప్పాపెట్టకుండా చెన్నై రైలెక్కేశాను. కొన్నాళ్లు అక్కడ ఉండివచ్చిన ఫ్రెండ్‌ని తోడు తీసుకువెళ్లాను. అక్కడ మణిరత్నం గారి దగ్గర అసిస్టెంట్‌గా చేరి, కొన్నాళ్లు పనిచేస్తే దర్శకుణ్ని కావొచ్చన్న నమ్మకంతో నా ప్రయాణం మొదలుపెట్టాను. చెన్నైలో దిగాక రైల్వే స్టేషన్లో స్నానం చేసి, దగ్గర్లోని షాపింగ్‌ మాల్‌లో సెక్యూరిటీ దగ్గర బ్యాగులు పెట్టి మణిగారి ఆఫీసుకి వెళ్లాం. పరిస్థితి చూస్తే ఆయన్ని కలవడం కాదు, గేటు దాటడమే కష్టంగా ఉంది. అలా అయిదు రోజులు తిరిగాక ఆరో రోజు సెక్యూరిటీ గార్డు పిలిచి రోజూ వస్తున్నారెందుకని అడిగాడు. మా వాడు విషయం చెబితే, ‘రాత్రి ఈ ప్రాంతంలో పెద్ద దొంగతనం జరిగింది. అనుమానంగా కనిపిస్తే పోలీసులు మక్కెలు ఇరగ్గొట్టి బొక్కలో పడేయగలరు’ అని బెదరగొట్టేశాడు. అప్పటికి మా దగ్గరున్న డబ్బూ అయిపోయింది. ఇంట్లో వాళ్లు మమ్మల్ని వెతుకుతున్నారనీ, అమ్మ నామీద బెంగ పెట్టుకుందనీ చెప్పాడో ఫ్రెండ్‌. లాభం లేదని తిరిగి వచ్చేశాం. ఆ తర్వాత నాన్నతో సినిమాలపైన నాకున్న ఇష్టం గురించి చెప్పాను. ‘వెళ్దువుగానీ ఇంకా చదువుకో’ అన్నారు. దాంతో తొమ్మిది నెలల్లో పూర్తయిపోతుందని బీఈడీలో చేరాను. కాదు పీజీ చెయ్యి అనడంతో ఎమ్మెస్సీ చేశాను. తర్వాత 2005లో వైజాగ్‌లో ట్రైన్‌ ఎక్కి హైదరాబాద్‌ వచ్చాను. అసలు నాకు సినిమా పిచ్చి ఎక్కడ మొదలైందో చెప్పాలంటే మళ్లీ వైజాగ్‌ వెళ్లాలి.

ఆ సినిమా మార్చేసింది!
మా ఊరు విశాఖ జిల్లా సబ్బవరం. టెన్త్‌ వరకూ అందరిలాగే నాకూ సినిమాలంటే ఆసక్తి. అప్పట్లో శివరాత్రి, వినాయక చవితికి టీవీలో వీసీపీ ద్వారా సినిమాలు వేసేవారు. అలాంటపుడు అక్కడ కచ్చితంగా ఉండేది మా బ్యాచ్‌. ఇంటర్మీడియెట్‌కి వైజాగ్‌లోని బీవీకే కాలేజీలో చేరి బైపీసీ గ్రూప్‌ తీసుకున్నాను. కాలేజీ ఒంటి గంటవరకూ ఉండేది. మధ్యాహ్నం ఖాళీ… అందరికీ. కానీ నేను మాత్రం మ్యాట్నీ సినిమా చూడ్డంలో బిజీగా ఉండేవాణ్ని. వైజాగ్‌లో అప్పట్లో 25 థియేటర్లు ఉండేవి. నేను చూడని సినిమా ఏ థియేటర్‌లో ఆడితే ఆరోజు అక్కడికి వెళ్లిపోయేవాణ్ని. ఆదివారం కాలేజీకి సెలవు కాబట్టి ఆరోజు మాత్రమే సినిమాకి సెలవు. 1997లో ‘ప్రేమించుకుందాం రా’ సినిమాని జగదంబా థియేటర్‌లో చూశాను. ఆ థియేటర్‌లో సినిమా చూడ్డం అదే ఫస్ట్‌ టైమ్‌. ఏసీ, డీటీఎస్‌, 70 ఎం.ఎం. ఆ అనుభవం చాలా విలాసంగా అనిపించింది. సినిమా ప్రేక్షకుడిగా నా అనుభవాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లింది. తర్వాత నుంచి ఆ థియేటర్లో రిలీజైన హాలీవుడ్‌, బాలీవుడ్‌ సినిమాల్నీ చూసేవాణ్ని. 1998లో వచ్చిన ‘సత్య’ సినిమా చూడ్డానికి దాదాపు రోజూ వెళ్లేవాణ్ని. కానీ రోజురోజుకీ జనాలు తగ్గిపోతుండేవారు. ‘ఈ సినిమా జనాలకి నచ్చలేదు, నాకెందుకు నచ్చుతోంది’ అన్న సందేహం వచ్చింది. తర్వాత అర్థమైందేంటంటే… పాటలూ, ఫైట్లూ, హీరోహీరోయిన్లకంటే కూడా కథ, తీసిన విధానం నాకు నచ్చిందని. ఆరోజునుంచి సినిమాలకి సంబంధించిన టెక్నికల్‌ టీమ్‌ ఎవరో కూడా చూడ్డం మొదలుపెట్టాను.

సీరియల్‌కీ పనిచేశాను…
ఇంటర్‌ తర్వాత డిగ్రీకి అనకాపల్లిలో చేరాను. అక్కడా నా సినిమా ప్రయాణం కొనసాగింది. బీఈడీ అక్కడే చేశాను. ఆపైన వైజాగ్‌ వచ్చి భాష్యం స్కూల్లో సైన్స్‌ టీచర్‌గా పనిచేస్తూ దూరవిద్యలో పీజీ చేశాను. రెండేళ్ల తర్వాత హైదరాబాద్‌ వచ్చి కృష్ణానగర్‌లో వాలిపోయాను. ఎంత కష్టమొచ్చినా భరించి నా సినిమా కలని నిజం చేసుకోవాలన్న దృఢ నిశ్చయంతో వచ్చాను. కానీ ఊహించినదానికంటే ఎక్కువ కష్టాలు పడాల్సి వచ్చింది. డైరెక్టర్‌ పరశురామ్‌గారిది నర్సీపట్నం. తెలిసిన వాళ్లద్వారా ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేరాలని ప్రయత్నించాను. కానీ అప్పటికే ఆయన దగ్గర డజనుకుపైగా అసిస్టెంట్లు ఉండటంతో చోటు దొరకలేదు. రోజూ ఏదో ఒక డైరెక్టర్‌ ఆఫీసుకి వెళ్లి అసిస్టెంట్‌గా చేరుతానని అడిగేవాణ్ని. ‘రేపు రా’, ‘వారం తర్వాత కనబడు’ అనేవారు. వాళ్లు చెప్పినట్టే వెళ్లేవాణ్ని. ఖాళీల్లేవని అప్పుడు చెప్పేవారు. కానీ నా దండయాత్ర కొనసాగుతూనే ఉండేది. మధ్యలో కొన్నిసార్లు షూటింగ్‌ చూడ్డానికి వెళ్లేవాణ్ని. డైరెక్టర్‌ కాదు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అయినా కాగలమా అన్న సందేహం వచ్చేది షూటింగ్‌ స్పాట్‌లో హడావుడి చూస్తే. ఇంకొందరు ‘సీరియల్‌ చేస్తున్నాం పనిచేస్తావా’ అనేవారు. ఆ ఛాన్స్‌నీ వదులుకునేవాణ్ని కాదు. అక్కడా ‘24 ఫ్రేమ్స్‌’ ఉంటాయి కదా! వి.ఎన్‌.ఆదిత్య గారి దగ్గర ‘మనసు మాట వినదు’ సినిమాకి మొదటిసారి అసిస్టెంట్‌గా పనిచేశాను. అలా కొందరితో పరిచయం ఏర్పడింది. తర్వాత ఒకసారి రామ్‌ గోపాల్‌వర్మ గారికి ఒక కథ చెప్పడానికి కలిశాను. అది ఓకే అవ్వలేదు కానీ ఆయన అప్పుడు చేస్తున్న ‘రక్తచరిత్ర’ షూటింగ్‌ని పరిశీలించే అవకాశం ఇచ్చారు. దాదాపు నెల రోజులు ఆ సినిమాతో పరోక్షంగా ప్రయాణించాను. తర్వాత మళ్లీ పరశురామ్‌ని సంప్రదిస్తే రమ్మన్నారు. ఆయన దగ్గర ‘సోలో’, ‘సారొచ్చారు’ సినిమాలకి అసిస్టెంట్‌గా పనిచేశాను. నిజం చెప్పాలంటే అప్పుడే నాకు వర్క్‌ నేర్చుకునే అవకాశం బాగా వచ్చింది. సినిమా రంగంలో ఒకరు చేయూత ఇవ్వందే పైకి రాలేం. ఎవరూ మనకు ఊరకే చేయందించరు కూడా. మన క్రమశిక్షణ, పనితీరు, స్వభావం అన్నీ పనిచేస్తాయి. ‘అవకాశం రాకపోవడం తప్పుకాదు. కానీ, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే తప్పే’ అనుకుని పనిచేసేవాణ్ని. ఇండస్ట్రీలో ఉండాలని మనం అనుకుంటాం, అలాగే మనతోటి వాళ్లూ ఫీలైతే మన గురించి పరిశ్రమలో అందరికీ తెలుస్తుంది.

షార్ట్‌ఫిల్మ్స్‌ ఓ పాఠం
పరశురామ్‌ గారి దగ్గర అనుభవంతో సొంతంగా సినిమా తీయగలనన్న నమ్మకం వచ్చింది. దాంతో పరిశ్రమలోని కొందరు వ్యక్తుల్ని కలిసి కథలు వినిపించేవాణ్ని. వాళ్లకి కథ నచ్చినా కూడా నేను తీయలేనేమో అన్న సందేహం ఉండేది. ఇలా కాదని, నా దగ్గరున్న కొద్దిపాటి మొత్తంతో, ఫ్రెండ్స్‌ సాయం తీసుకుని 2014లో ‘వన్‌మోర్‌ స్మైల్‌’, ‘లవ్‌ ఆల్‌జీబ్రా’ అని రెండు షార్ట్‌ఫిల్మ్స్‌ తీశాను. ఎవరికైనా కథ చెప్పి తర్వాత నా షార్ట్‌ఫిల్మ్స్‌ లింక్‌లు పంపించేవాణ్ని. బడ్జెట్‌, చిత్రీకరణ వ్యవధి ఈ అంశాల్నీ క్లియర్‌గా చెప్పేవాణ్ని. నా షార్ట్‌ఫిల్మ్స్‌ని చూసిన శివ తుర్లపాటి ఫోన్‌చేసి మెచ్చుకున్నాడు. తను టాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్‌. కలిసి షార్ట్‌ఫిల్మ్స్‌ తీద్దాం అన్నాడు. నా సినిమా లక్ష్యాన్ని ఆయనకి చెప్పాను. తనూ హెల్ప్‌ చేస్తానన్నాడు. నా కథల్ని తనతో పంచుకునేవాణ్ని. అలా నేను చెప్పిన ఓ కథ లైన్‌ని ‘కోన వెంకట్‌’గారికి చెప్పాడు. ఆయనకీ నచ్చింది. దాంతో వచ్చి కలవమన్నారు. వెళ్లి కథ మొత్తం చెప్పాను. అదే ‘నిన్నుకోరి’. తర్వాత ఆయన అనుభవాన్ని జోడించి స్క్రీన్‌ప్లే, డైలాగుల్ని ఇంప్రూవ్‌చేసి స్క్రిప్టు రెడీ చేశాం. నా కథ ఒక పక్కింటి అబ్బాయి కథలా ఉంటుంది. దానికి నానీ సరిపోతారనిపించింది. నానీకి కథ చెబితే ఓకే అన్నారు. దానయ్యగారు నిర్మాతగా వచ్చారు. చాలా సినిమాలకి కథ ఓకే అనుకున్నాక హీరో డేట్స్‌ కుదిరి అన్నీ తెరకెక్కడానికి ఏడాదైనా పడుతుంది. ‘నిన్నుకోరి’ మాత్రం నానీ ఓకే అనగానే త్వరత్వరగా పట్టాలెక్కింది. రెండు నెలల్లో షూటింగ్‌ మరో రెండు నెలల్లో పోస్ట్‌ ప్రొడక్షన్‌ అన్నీ పూర్తయిపోయి, సినిమా రిలీజై హిట్‌ టాక్‌ వచ్చింది. ఆరు నెలల్లో అంతా అయిపోయింది. ‘దీనికోసమేనా ఇన్నాళ్లు కష్టపడ్డాను’ అనిపిస్తుంది. కానీ అన్నాళ్లు కష్టపడి పనిచేయకుంటే ఆ సినిమాని అంత బాగా తీయగలిగేవాణ్ని కాదేమో!

జీవితాల నుంచే కథలు…

నాన్న ముత్యం నాయుడు, అమ్మ రామలక్ష్మి. చాలాసార్లు ‘నీకీ కష్టాలు అవసరమా వచ్చేయ్‌ ఇంటికి’ అన్నారు. కానీ నేను ఇష్టంగా చేస్తున్నానని నచ్చజెప్పేవాణ్ని.
* దాదాపు నాలుగేళ్లు ఎలాంటి ఆదాయం లేకుండా హైదరాబాద్‌లో ఉండటమంటే మాటలా! కానీ ఆ సమయంలో నా స్నేహితుడు సుందర్‌ రామ్‌, తమ్ముడు విజయ్‌… నా లక్ష్యం, కష్టం సినిమానే కావాలి తప్ప మరోటి కాకూడదని నాకు ఆర్థికంగా ఎంతో సాయపడ్డారు.
* జీవితంలో స్థిరపడేంతవరకూ పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. ‘నిన్నుకోరి’ తర్వాత ధైర్యం వచ్చి ఇంట్లో పెళ్లికి ఓకే చెప్పాను. గతేడాది ఏప్రిల్‌లో నా పెళ్లి జరిగింది. నా శ్రీమతి పేరు భాగ్యశ్రీ. మాకో అబ్బాయి.
* నా బలం నా డైరెక్షన్‌ టీమ్‌. వీళ్లు నా రూమ్మేట్స్‌, ఫ్రెండ్స్‌ కూడా. లక్ష్మణ్‌, నాయుడు, నరేష్‌… మేమంతా ఉంటే సినిమాని ఆడుతూ పాడుతూ చేసుకోగలం.
* నా సినిమాలకు బలం గోపీ సుందర్‌ సంగీతం కూడా. ఆయన మలయాళ సినిమాల్లోని పాటలు నాకు బాగా నచ్చుతాయి. తెలుగులోనూ మంచి పాటలు ఇచ్చారు. గోపీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఒకరోజు కూర్చుంటే రెండు మూడు ట్యూన్లు ఇచ్చేస్తారు. నచ్చకపోతే నచ్చలేదని చెప్పే ఫ్రీడమ్‌ ఉంటుంది.
* నేను కథలకోసం ఎక్కడెక్కడో ఆలోచించను. నా జీవితంలో, నా చుట్టుపక్కలవారి జీవితాల్లో జరిగే సంఘటనల్లో బాగా సంతోషం కలిగించే, బాగా బాధ పెట్టే సంఘటనల్ని స్ఫూర్తిగా తీసుకుంటాను. ఆ పాయింట్‌ నుంచి కథను అల్లుకుంటాను.

‘మజిలీ’ ఇలా…
నిన్నుకోరి తర్వాత కొందరు ఫోన్లు చేసి సినిమా తీయమని అడిగారు. కథ ఓకే అవ్వకుండా అలా మాటివ్వడం నాకు నచ్చదు. అవన్నీ కాదనుకుని ఇంటికి వెళ్లిపోయి మూడు నెలలు ఉన్నాను. దాదాపు పుష్కర కాలం తర్వాత నేను విశ్రాంతి తీసుకున్నది అప్పుడే. తర్వాత హైదరాబాద్‌ వచ్చి నా దగ్గరున్న కొన్ని కథల్ని సిద్ధం చేసుకున్నాను. ప్రేమకథలు కాకుండా కొత్తగా ప్రయత్నిద్దామనుకున్నాను. ఆ క్రమంలో నాగచైతన్య గారిని కలిశాను. ‘నిన్నుకోరి’ నాకు బాగా నచ్చింది. ఏదైనా వాస్తవిక, హృదయాన్ని హత్తుకునే కథ ఉంటే చెప్పమన్నారు. నా దగ్గర భార్యాభర్తల కథకి సంబంధించిన ఒక లైన్‌ ఉంది. దాన్ని ఇంప్రొవైజ్‌ చేసి చెప్పాను. చైతూకి నచ్చింది. జోడీగా సమంతాగారైతే బావుంటుందని చెప్పాను. తనూ విన్నాక ఓకే చెప్పారు. అలా ‘మజిలీ’ మొదలైంది. వాళ్ల కాంబినేషన్‌ అంటే ఒక మేజిక్‌లా ఉంటుంది. అది ఈ సినిమాలో బాగా కనిపించింది. కొన్ని సంభాషణలు చాలా అద్భుతంగా వచ్చాయి. ఈ సినిమాని కూడా విశాఖపట్నం నేపథ్యంలోనే తీశాను. కానీ ‘నిన్నుకోరి’ మాదిరిగా అందాల వైజాగ్‌ని కాకుండా పాత వైజాగ్‌ని చూపించాను. వైజాగ్‌లో ఉండకపోతే నాకు సినిమా ఆలోచన రాకపోయేది. నేను ఎక్కడ ఉన్నా కూడా అక్కడి సముద్రం, స్నేహితులు, ఆహారం, భాష… వీటి ప్రభావం నామీద ఉంటుంది. నా కథల్లో కనిపిస్తుంది!

Director Parasuram

ఆ లోటు ఎప్పటికీ తీరదు!

‘యువత’… నిఖిల్‌ని హీరోగా నిలబెట్టింది. ‘సోలో’… నారా రోహిత్‌ కెరీర్‌ని మలుపు తిప్పింది. ‘ఆంజనేయులు’… రవితేజ ఖాతాలో మరో విజయాన్ని జమచేసింది. ‘శ్రీరస్తు శుభమస్తు’… అల్లు శిరీష్‌కి తొలి సూపర్‌హిట్‌ని అందించింది. ఈ సినిమాలన్నింటినీ తీసిన దర్శకుడు పరశురామ్‌కి అనుబంధాలను తెరపైన ఆవిష్కరించడంలో మంచి పట్టుందన్న పేరుంది. తన జీవితంలో తెగిపోయిన బంధాలూ, ఎదురైన పరిణామాలే సినిమాల్లో కుటుంబ విలువలకు ప్రాధాన్యమివ్వడానికి కారణమంటారాయన. అంతలా ఆయన్ని కదిలించిన సంఘటనలు ఏంటంటే…

చిన్నప్పుడంతా ఆకతాయిగా తిరిగే నేను ఎంబీయే పూర్తి చేయడానికి మా అమ్మ మాటలే ప్రేరణ. చదువైపోయాక విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకున్న నేను సినిమాల్లోకి రావడానికి అమ్మ మరణానంతర పరిస్థితులే కారణం. ఎదిగే ప్రతి దశలో అంతలా తను నాపైన ముద్ర వేసింది. నేను పుట్టింది విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంకి దగ్గర్లోని బాపిరాజు కొత్తపల్లి అనే వూళ్లొ అయినా, పెరిగింది మాత్రం చెర్లోపాలెంలో. దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నేనూ అన్నదమ్ముల పిల్లలం. మా నాన్న కో-ఆపరేటివ్‌ బ్యాంకులో చిన్న ఉద్యోగి. అమ్మకి చదువంటే చాలా ఇష్టం. నన్నూ, అక్కనే కాకుండా తన ఐదుగురు అక్కచెల్లెళ్ల పిల్లలనూ అమ్మే చదివించేది. మాకున్న పౌల్ట్రీ ఫామ్‌ వ్యవహారాలనూ తనే చూసుకునేది. అల్లరి విషయంలో అమ్మ నన్ను కొట్టని రోజంటూ ఉండేది కాదు. సరిగ్గా చదవకుండానే మంచి మార్కులొస్తున్నప్పుడు, బాగా చదివితే ఇంకా ముందుకెళ్తావు కదా అని అంటుండేది. ఇప్పటికీ మా వూరికి బస్సులేదు. అలాంటి ప్రాంతం నుంచి వచ్చినా నేనూ, అక్కా, కజిన్స్‌ అంతా పీజీలు చేశామంటే కారణం అమ్మ వేసిన పునాదులే.

చాలా ఏళ్లు హాస్టల్లోనే
నేను రెండో తరగతి వరకూ చెర్లోపాలెంలో, తరవాత పెదబొడ్డేపల్లిలో ఆరో తరగతిదాకా చదివా. ఆ పైన జవహర్‌ నవోదయా స్కూల్‌ ఎంట్రెన్స్‌ పరీక్షలో సెలక్ట్‌ అవడంతో వైజాగ్‌లో హాస్టల్‌కి వెళ్లా. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ఏదో ఫంక్షన్‌కి వూరికి వెళ్లినప్పుడు కజిన్స్‌ అందరం దగ్గర్లోని నేలబావిలో ఈత కొట్టడానికి దిగాం. అలా ఆడుకుంటున్నప్పుడే ఓ కొబ్బరిమట్ట వచ్చి బావి మధ్యలో వేలాడింది. దాన్ని పట్టుకోవాలని నేనూ మరో పిల్లాడూ పోటీపెట్టుకున్నాం. నాకు ఈత పూర్తిగా రాకపోవడంతో కొబ్బరిమట్టను అందుకునేలోపే మునిగిపోవడం మొదలుపెట్టా. నేను చనిపోవడం ఖాయమని తెలుస్తూ ఉంది. ఒక్కసారిగా అమ్మానాన్నా అక్కా అందరూ గుర్తొచ్చి ఏడుపు తన్నుకొచ్చింది. చివరి నిమిషంలో చిన్నాన్న కొడుకు ఎలాగోలా బయటకి లాగాడు. వెంటనే అమ్మ దగ్గరికి వెళ్లి విషయం చెప్పకుండా చాలాసేపు ఏడ్చేశా. అమ్మకి చెబితే ఎలా స్పందిస్తుందోనని భయమేసి తరవాత కూడా తనకా సంగతి చెప్పలేదు. అలా రోజులు గడుస్తున్న సమయంలో ఓ వూహించని ఘటన నా జీవితాన్ని కుదిపేసింది.

 

అమ్మ దూరమైంది!
ఓసారి మా పౌల్ట్రీ ఫామ్‌కి వైరస్‌ సోకి కోళ్లన్నీ చనిపోయాయి. పెట్టుబడి మొత్తం పోయింది. అప్పటివరకూ అక్కా నేనూ ప్రభుత్వ స్కూళ్లలోనే చదివాం. సరిగ్గా డబ్బు పెట్టి పైచదువులు చదివించాలని అమ్మ ఆశపడ్డ సమయానికి అలా జరిగింది. దాంతో అమ్మ కాస్త డీలా పడింది. నేను ఆంధ్రా యూనివర్సిటీలో ఎంబీయే చదివేప్పుడు ఓ ఇంటర్నెట్‌ సెంటర్‌లో పార్ట్‌టైం పని చేసేవాణ్ణి. అలా రోజులు గడుస్తుండగా ఓసారి అమ్మకు ఒంట్లో బాలేదని ఫోన్‌ వస్తే వెళ్లా. డాక్టర్లు హెమోగ్లోబిన్‌ తక్కువగా ఉందన్నారు. స్నేహితులతో కలిసి రక్తం ఇచ్చి వచ్చా. ఓ పదిరోజుల తరవాత మళ్లీ అమ్మకు నీరసంగా ఉందంటే వెళ్లా. పరీక్షలు చేయిస్తే ఎక్యూట్‌ బ్లడ్‌ క్యాన్సరని తేలింది. రెండు మూడు నెలలకు మించి బతకడం కష్టమన్నారు. ఆ మాట వినగానే కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. ఏకంగా చనిపోయేంత జబ్బు ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. అక్కకు తెలిస్తే తనేదైనా చేసుకుంటుందేమోనన్న భయంతో చెప్పలేదు. నాన్న దగ్గరా ఓ పదిరోజులు దాచిపెట్టా. నటుడు జోగినాయుడు మా పెద్దమ్మ కొడుకు. తన భార్య ఝాన్సీ సాయంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం లేకపోయింది. జబ్బు బయటపడిన ఆర్నెల్లకు అమ్మ చనిపోయింది. నాకే కష్టం వచ్చినా అమ్మ ఉందిగా అనే ధైర్యం ఆ క్షణం దూరమైపోయింది.

అన్నయ్యని చూశాకే…
అమ్మ చనిపోయిన ఏడాదిలోపే ఉన్న కొద్దిపాటి భూముల్ని అమ్మేసి అక్క పెళ్లి చేశాం. తరవాత నాన్న తెలీని నైరాశ్యంలోకి జారిపోయారు. అలానే గడిపితే నేనూ డిప్రెషన్‌లోకి వెళ్తానేమోనని భయమేసి ఏదైనా ఉద్యోగం వెతుక్కుందామని హైదరాబాద్‌ వచ్చా. అప్పుడే ‘ఇడియట్‌’ సినిమా విడుదలైంది. వూళ్లొ ఉన్నప్పుడు జగనన్నయ్య దర్శకుడు అని తెలుసుకానీ, అతడి స్థాయేంటో ఇక్కడికొచ్చాకే అర్థమైంది. నా కళ్లముందు తిరిగిన వ్యక్తి కష్టపడి ఈ స్థాయికొచ్చినప్పుడు నేనెందుకు రాలేనూ అనిపించింది. అన్నయ్యని చూశాక ఆ రంగంలోకి వెళ్లాలన్న కోరిక పెరిగింది. ఓరోజు జోగి నాయుడు పిలిచి ‘నువ్వు ఒకప్పుడు సినిమాలు చూసి మా అందరికీ కళ్లకు కట్టినట్టు కథ చెప్పేవాడివి. తరవాత మేమెళ్లి సినిమా చూసినా అంత ఫీల్‌ వచ్చేది కాదు. ఇక్కడున్న ఎవరికీ నువ్వు తీసిపోవు. నువ్వు పెదనాన్న కాళ్లే పట్టుకుంటావో, ఏం చేస్తావో నీ ఇష్టం కానీ జగన్‌ దగ్గర అసిస్టెంట్‌గా చేరడమే నీ లక్ష్యంగా పెట్టుకో’ అన్నాడు. సినిమాల్లోకి రావాలనుందని జగనన్నయ్యకి చెబితే బాగా తిట్టాడు. ‘ఎంబీఏ చేశావు, అప్పట్లో విదేశాలకూ వెళ్లాలనుకున్నావు కదా. నేను పంపిస్తా వెళ్లూ’ అన్నాడు. కానీ నేను మాత్రం అన్నయ్య దగ్గరే చేరతానని కరాఖండీగా చెప్పడంతో కోపంతో కొన్నాళ్లు నాతో మాట్లాడటం మానేశాడు.

అలా ఉండగానే పెళ్లి…
ఓసారి ‘అమ్మానాన్నా ఓ తమిళమ్మాయి’ షూటింగ్‌ వైజాగ్‌లో జరుగుతుంటే నాన్నను తీసుకొని వెళ్లి అడిగించా. నాన్న మాట కాదనలేక అన్నయ్య నన్ను అసిస్టెంట్‌గా చేరమన్నాడు. ఆ తరవాత ‘ఆంధ్రావాలా’, ‘143’ సినిమాలకూ పనిచేశా. ఎక్కువ కాలం అన్నయ్య దగ్గరే పనిచేస్తే నా సామర్థ్యమేంటో నాకు తెలీదనిపించి వేరే ఎవరి దగ్గరైనా పనిచేస్తానని చెప్పి బయటికొచ్చేశా. తెలిసిన వాళ్ల సాయంతో దర్శకుడు దశరథ్‌ దగ్గర ‘శ్రీ’ సినిమాకి అసిస్టెంట్‌గా చేరా. అక్కడే దర్శకుడు చైతన్య దంతులూరి పరిచయమయ్యాడు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా చైతూ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా. అసిస్టెంట్‌ డైరక్టర్‌గా పనిచేస్తున్నప్పుడే మా కజిన్‌ ద్వారా అర్చన అనే అమ్మాయి పరిచయమైంది. ఎందుకో తెలీదు కానీ క్రమంగా తనంటే ఇష్టం పెరిగింది. నేనప్పటికి కాళ్లకు హవాయి చెప్పులే వేసుకుని తిరిగేవాణ్ణి. అలాంటి సమయంలో ప్రేమా పెళ్లి గురించి ఆలోచించడం కరక్టేనా అనిపించేది. కానీ ఆమెకూ నేను నచ్చడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. వాళ్లది చాలా పెద్ద కుటుంబం. నా పరిస్థితేమో అంతంతమాత్రం. దాంతో మా పెళ్లికి వాళ్లింట్లో అంగీకరించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో పెద్దలు ఒప్పుకోకుండానే అర్చనా నేనూ ఒక్కటయ్యాం.

అవకాశం వచ్చినట్టే వచ్చి…
దశరథ్‌ దగ్గర పనిచేసేప్పుడు ఆ ప్రాజెక్టు ఆలస్యం కావడంతో చైతూ సాయంతో వీరూ పోట్ల దగ్గర అసిస్టెంట్‌గా చేరా. వీరూ రాసిచ్చిన కథలూ, డైలాగులన్నీ నేను ఫెయిర్‌ చేసేవాణ్ణి. అలా తనవల్లే రచన, డైలాగులపైనా క్రమంగా అవగాహన పెరిగింది. దురదృష్టం కొద్దీ వీరూ ప్రాజెక్టు కూడా ముందుకెళ్లలేదు. ‘పరుగు’ సినిమాకి స్క్రిప్ట్‌ డిస్కషన్‌ కోసం ఎవరైనా కావాలని భాస్కర్‌ వెతుకుతున్న సమయంలో చైతూ ఆ విషయం చెప్పి అతణ్ణి కలవమన్నాడు. అలా ‘పరుగు’కి అడిషనల్‌ డైలాగ్‌ రైటర్‌గా, స్క్రిప్ట్‌ అసిస్టెంట్‌గా పనిచేశా. కథకు కొంత అదనపు వినోదాన్ని జోడించా. నా పనితీరు దిల్‌ రాజుగారికి నచ్చడంతో నేను చేరిన వారంలోపే మంచి కథ తయారు చేసుకుంటే సినిమా చేద్దామన్నారాయన. ‘పరుగు’ పూర్తయ్యాక సొంతంగా ఓ స్క్రిప్ట్‌ సిద్ధం చేసుకున్నా. అల్లు అర్జున్‌ కథల్ని బన్నీ వాసు వింటాడని తెలీడంతో అతనికే చెప్పా. వాసుకి కథ నచ్చింది కానీ బన్నీ పరిధికి చిన్నదవుతుందని అన్నాడు. తరవాత ‘ఆంధ్రావాలా’ నిర్మాత గిరిని కలిస్తే ఆ సినిమా చేద్దామన్నారు. కానీ ఏవో ఇబ్బందుల వల్ల అదీ ఆలస్యమైంది.

తొలిసినిమాతో పైపైకి…
సినిమా అలా వెనక్కెళ్తున్న సమయంలో ‘మంత్ర’ సినిమా తీసిన నిర్మాతలు ముందుకు రావడం, చందూ మొండేటి ద్వారా నిఖిల్‌ పరిచయమవడంతో నా తొలిసినిమా ‘యువత’ మొదలైంది. మా కష్టానికి మణిశర్మగారి సంగీతం తోడై సినిమా మంచి మ్యూజికల్‌ హిట్‌ అయింది. ఆ సినిమాకు అసిస్టెంట్లుగా పనిచేసిన చందూ, సుధీర్‌ వర్మ, కృష్ణ చైతన్యలు తరవాత దర్శకులుగా మారారు. నిఖిల్‌ సోలో హీరోగా నిలదొక్కుకున్నాడు. రాజారవీంద్ర ఓసారి రవితేజకు ఫోన్‌ చేసి ‘యువత’ సినిమా బావుందీ, చూడమని చెప్పాడు. రవికి కూడా అది నచ్చడంతో కలిసి సినిమా చేద్దామన్నారు. అలా మా ఇద్దరి కలయికలో ‘ఆంజనేయులు’ సినిమా విడుదలైంది. నిర్మాతలకు టేబుల్‌ ప్రాఫిట్‌నీ, దర్శకత్వంతో పాటు డైలాగ్‌ రైటర్‌గా నాకు మంచి పేరునీ ఆ సినిమా తీసుకొచ్చింది.

బన్నీ చెప్పిన మాట!
నా భార్య సినిమాల గురించి పెద్దగా ప్రస్తావించకపోయినా, డబుల్‌ మీనింగ్‌ డైలాగులేవీ లేకుండా కుటుంబ విలువలుండే మంచి సినిమాలు చేయమని తొలిసారి నాకు సూచించింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ‘సోలో’ కథ సిద్ధం చేసుకున్నా. నారా రోహిత్‌ కెరీర్లో పెద్ద విజయం సాధించిన సినిమా అది. తరవాత రవితేజతో ‘సారొచ్చారు’ సినిమా తీశా. విడుదలకు నాల్రోజుల ముందే కాపీ చూడగానే అది ఫ్లాపవుతుందని నాకు అర్థమైంది. ఆ వైఫల్యం నుంచి బయటికొచ్చి నాగచైతన్యకు ఓ కథ వినిపించా. తను సినిమా చేద్దామన్నా ఏవో కారణాల వల్ల అది ముందుకెళ్లలేదు. దర్శకుడు క్రిష్‌ నాకు మంచి స్నేహితుడు. ఆ కథను అతనికీ వినిపించా. అతనే బన్నీకి నా కథ గురించి చెప్పడంతో, బన్నీవాసు పిలిచి కథ చెప్పమన్నాడు. అక్కడా ఓకే కావడంతో ఆ కథపైన దృష్టిపెట్టా. ఈలోగా ఓ రోజు అరవింద్‌గారు పిలిచి ‘బన్నీ ఇప్పటికే రెండు సినిమాలు చేస్తున్నాడు. అవి పూర్తయ్యేవరకూ ఎదురుచూడటం కరెక్టు కాదు. శిరీష్‌కి ఏ కథలూ పెద్దగా నచ్చట్లేదు. పోనీ ఎవరితో సినిమా చేస్తావని అడిగితే నీ పేరు చెప్పాడు. శిరీష్‌కి ‘సోలో’ బాగా నచ్చిందట. సినిమా చేస్తావా మరి?’ అని అడిగారు. ఓరోజు బన్నీ పిలిచి ఓ చెక్కు చేతిలో పెట్టి, ‘నీ మీద నమ్మకంతో ఉన్నాం, ఏం చేస్తావో తెలీదు’ అనడంతో నా బాధ్యత మరింత పెరిగింది. ‘శ్రీరస్తు శుభమస్తు’ విడుదలవుతూనే హిట్‌టాక్‌ తెచ్చుకుంది. అరవింద్‌గారు పిలిచి ‘మరో కథ సిద్ధం చేసుకో, సినిమా మొదలుపెడదాం’ అన్నారు. ఆ మాట చాలు ఆయన నమ్మకం నిలబెట్టుకున్నా అనడానికి. నా తరవాతి సినిమా గీతా ఆర్ట్స్‌లోనే ఉంటుంది. చిన్నప్పుడోసారి నా కజిన్‌కి టెన్త్‌లో జిల్లా ఫస్ట్‌ వచ్చిందని పేపర్లో ఫొటో వేశారు. అమ్మ నాకది చూపించి, ‘ఇలా పిల్లల ఫొటోలు పేపర్లో చూసుకునే తల్లిదండ్రులది ఎంత అదృష్టమో తెలుసా’ అంది. సినిమాల్లోకి వచ్చాక నా ఫొటో చాలాసార్లు పత్రికల్లో వచ్చింది. వాటిని చూసినప్పుడల్లా అమ్మే గుర్తుకొస్తుంది. అందుకే నేను ఏ స్థాయికెళ్లినా అమ్మ లేని ఆ లోటు మాత్రం ఎప్పటికీ తీరదు.


సైన్సంటే ఇష్టం!

 

నాకు ఎలాంటి ఆధారం లేని సమయంలోనే నా భార్య అర్చన తోడుగా నిలిచింది. ఏదో ఒకరోజు నేను మంచి స్థానానికి వెళ్తానని నాకంటే బలంగా తనే నమ్మింది. అమ్మ స్థానాన్ని తను భర్తీ చేయకపోయుంటే నా జీవితం ఎటెళ్లేదా అనిపిస్తుంటుంది. మాకిద్దరు పిల్లలు. పెద్దబ్బాయి రిషిత్‌. చిన్నోడు అవ్యాన్‌.

* దర్శకులు చైతన్య దంతులూరి, ఆనంద్‌ రంగా, క్రిష్‌, ఎడిటర్‌ మార్తాండ్‌లు నాకు మంచి స్నేహితులు. నేను సినిమాలు చేయని సందర్భాల్లోనూ ఎప్పటికప్పుడు ఫోన్‌ చేసి నా బాగోగులూ, ప్రాజెక్టుల గురించి ఆరా తీస్తుంటారు.

* సైన్స్‌కి సంబంధించిన కొత్త పరిశోధనల గురించి తెలుసుకోవడం అంటే నాకు ఆసక్తి. మా అమ్మ ఆస్పత్రిలో ఉన్నప్పుడు బ్లడ్‌ క్యాన్సర్‌కి మందులేమన్నా ఉన్నాయా అన్న ఆశతో లైబ్రరీలకు వెళ్లి పత్రికలు తిరగేసేవాణ్ణి. అప్పట్నుంచీ అలా పరిశోధనల గురించి తెలుసుకోవడం అలవాటైంది.

Producer Nallamalupu Bujji

ఆ ఒక్క సినిమా చాలనుకున్నాను!

లక్ష్మీ, లక్ష్యం, రేసుగుర్రం లాంటి మాస్‌ చిత్రాల నిర్మాత… కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ముకుందా లాంటి యూత్‌ఫుల్‌ సినిమాల్నీ ఆయన నిర్మించారు. పిన్న వయసులోనే స్టార్‌ ప్రొడ్యూసర్‌గా పేరుతెచ్చుకున్న ఆ నిర్మాత నల్లమలపు శ్రీనివాస్‌(బుజ్జి). ప్రస్తుతం నాలుగు సినిమాల నిర్మాణ పనుల్లో ఉన్నారు. నిత్యం కొత్త కథలు వినడంలో బిజీగా ఉండే బుజ్జీని ఆయన కథని చెప్పమంటే ఇలా మొదలుపెట్టారు…


పదో తరగతిలో లెక్కల పరీక్ష తప్పాను. దాంతో ఏడాదిపాటు ఖాళీ. జీవితం గురించి మొదటిసారి సీరియస్‌గా ఆలోచించింది అప్పుడే. మళ్లీ పరీక్ష కట్టి పాసయ్యాను. మాకో లారీ ఉండేది. నాన్న దాన్ని నడిపేవారు. అమ్మ, నాన్న, అక్క, నేను… ఇదే మా కుటుంబం. కాలేజీలో చేరదామనుకునేసరికి నాన్న చనిపోయారు. దాంతో ఇంటి బాధ్యత నాపైన పడింది. గుంటూరులో మా పక్కింట్లో ఉండే రంగారావుగారు పత్తి విత్తనాల వ్యాపారం చేసేవారు. ఆయన దగ్గర సహాయకుడిగా చేరాను. రెండేళ్లలో కంపెనీలో ఆయన తర్వాత నేనే అన్న స్థాయికి వెళ్లాను. అక్కడ అయిదారేళ్లు పనిచేశాక అలాంటి వ్యాపారం సొంతంగా మొదలుపెట్టాను. బాగానే నడిచేది. ఇప్పటికీ ఆ వ్యాపారం ఉంది. సినీ నిర్మాత బెల్లం కొండ సురేష్‌ నాకు మేనమామ. విత్తనాల వ్యాపారం చేస్తూనే అప్పుడప్పుడూ హైదరాబాద్‌ వచ్చివెళ్లేవాణ్ని. వ్యాపార పనిమీద కొన్నిసార్లూ, మావయ్య ఇంటికి కొన్నిసార్లూ వచ్చేవాణ్ని. అలా వచ్చినపుడు ఒక్కోసారి సినిమా నిర్మాణ పరమైన పనులు అప్పగించేవారు మావయ్య. అలా 1997లో పరిశ్రమలోకి అనుకోకుండానే అడుగుపెట్టాను. నేను మొదట పనిచేసిన సినిమా ‘సాంబయ్య’. అప్పుడే శ్రీహరి గారితో పరిచయం. ‘అల్లుడూ…’ అని ఆప్యాయంగా పిలిచేవారు. పరిశ్రమలో అందరూ ఆయనలానే ఉంటారనుకునేవాణ్ని. కానీ మెల్లమెల్లగా అర్థమైంది సినిమా ప్రపంచం. ఆ దశలోనే దర్శకుడు వినాయక్‌ పరిచయం. ‘చెప్పాలని ఉంది’ సినిమాకి నేను ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌, వినాయక్‌ కో- డైరెక్టర్‌. వినాయక్‌, డైరెక్టర్‌ డాలీ, మిత్రుడు గోపీ, నేనూ రూమ్మేట్స్‌. జూబ్లీహిల్స్‌లో ఉండేవాళ్లం.

ఆదితో మొదలు…
నాకు సొంతంగా పనిచేయడమే ఇష్టం. మావయ్య దగ్గర పనిచేశానన్న మాటే కానీ, బాధ్యతలన్నీ నాకే అప్పగించేవారు. నేనేం చేస్తున్నానో చెప్పేవాణ్నంతే! ప్రారంభంలో ‘సాంబయ్య’, ‘వైజయంతి’, ‘మా అన్నయ్య’, ‘చెప్పాలని ఉంది’, ‘రా’ సినిమాలకి పనిచేశాను. ‘రా’కి నిర్మాతగా నా పేరు వేశారు కూడా. సినిమా రంగంలో నా అసలు ప్రస్థానం మొదలైంది ‘ఆది’తోనే. 2001లో వినాయక్‌, నేను స్విట్జర్లాండ్‌ వెళ్లాం. ఆ సమయంలో వినాయక్‌ నా పక్కన లేడు. అక్కడ ఎన్టీఆర్‌ కనిపిస్తే వెళ్లి పరిచయం చేసుకున్నాను. ‘నా దగ్గర మంచి డైరెక్టర్‌ ఉన్నాడు. కథ చెప్పిస్తాను వింటారా’ అనడిగితే సరేనన్నాడు. తర్వాత హైదరాబాద్‌లో కలిశాం. అప్పట్లో వినాయక్‌ ప్రేమకథలు బాగా రాసేవాడు. మణిరత్నం స్టైల్లో ఉండేవి ఆ కథలు. నాకో ప్రేమకథ చెప్పాడు. కథ బావుంది. ‘ఎన్టీఆర్‌తో సినిమా అంటే మనకి మంచి అవకాశం. కథ బాగా చెప్పి ఓకే చేయించు వినయ్‌’ అన్నాను. కథ ఎన్టీఆర్‌కీ నచ్చింది. తర్వాత ‘స్టూడెంట్‌ నెం.1’ షూటింగ్‌ జరుగుతోంది. అక్కడికి మమ్మల్ని పిలిచి ‘మీరు చెప్పిన కథ బావుంది. కానీ మాస్‌ కథ ఉంటే చూడండి’ అన్నాడు. అప్పటివరకూ మంచి ఉత్సాహంగా ఉన్న మేము గాలి తీసిన బుడగల్లా మారిపోయి రూమ్‌కి వెళ్లిపోయాం. మర్నాడు ఉదయం నాలుగు గంటలకి నిద్రలేపి వినయ్‌ ఓ కథ చెప్పాడు. అదిరిందన్నాను. తర్వాత ఎన్టీఆర్‌కి వినిపించాం. అదే ‘ఆది’. అప్పుడు మేమంతా యంగ్‌ కదా! ఫుల్‌ ఎనర్జీతో మనసు పెట్టి కష్టపడి పనిచేశాం. ‘ఆది’… సినిమా కోసం పనిచేసినవారందరూ తమ కెరీర్లకి మంచి పునాది వేసుకున్నారు. తర్వాత బాలయ్య గారితో ‘చెన్నకేశవరెడ్డి’ చేశాం. నిజానికి మావయ్య నిర్మాతగా బాలయ్య అప్పుడు వేరే దర్శకుడితో సినిమా చేయాలి. కానీ వేరే వాళ్లయితే నేను చేయనని చెప్పాను. బాలయ్య పిలిచి కారణం అడిగితే, ‘ఆది’ దర్శకుడితోనే చేద్దామన్నాను. అలా ‘చెన్నకేశవరెడ్డి’ తీశాం. మరో హిట్‌. ఆ తర్వాత మావయ్య బ్యానర్‌లోనే ‘కల్యాణరాముడు’ చేశాను.