Director Prabhu Salman

అర్ధరాత్రి దొంగల్లా పారిపోయాం!

 

మనిషికీ మనిషికీ మధ్యే కాదు… ప్రకృతికీ మనిషికీ మధ్య ఉండాల్సిన మైత్రిని చెబుతాయి దర్శకుడు ప్రభు సాల్మన్‌ చిత్రాలు. హీరో ఇమేజ్‌ని పెంచడం కోసం పర్యావరణ అంశాలని తోడుతెచ్చుకోవడం కాకుండా… ప్రకృతి పరిరక్షణే ప్రధానాంశంగా హీరోహీరోయిన్లని ఎంచుకోవడం ఆయనకున్న అలవాటు. రానా హీరోగా వచ్చిన ‘అరణ్య’ అలాంటిదే! ఇదివరకు ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’ వంటి డబ్బింగ్‌ సినిమాలతో మనకి పరిచయమైన సాల్మన్‌ సినిమాలే కాదు… జీవితం కూడా స్ఫూర్తి నింపేదే. విధి విసిరే సవాళ్లని ఎదుర్కోవడమెలాగో వివరించేదే. ఆ ప్రయాణం…

దయం ఏడుగంటలు… అప్పుడే నిద్రలేచాను. రెప్పలు విప్పబోతే వెలుగు సూదిలా గుచ్చి ఇబ్బందిపెడుతోంది. అప్పుడు కాలింగ్‌ బెల్‌ మోగింది. ‘ఎవరూ… ఇంటి ఓనరా? నిన్ననే కదా కోపంగా మాట్లాడి వెళ్లాడు… ఇల్లూ ఖాళీచేయ మన్నాడు… మళ్లీ పొద్దున్నే వచ్చాడా…!’ అనిపించింది. నేను లేద్దామా వద్దా అనుకుంటుండగానే మావాడు పరుగెత్తు కుంటూ వెళ్లి గడియ తీశాడు. ‘పాలు… బాబూ!’ అన్న గొంతు వినిపించింది.పాలప్యాకెట్‌ తీసుకుని ‘ఉండు డబ్బులు తెస్తా!’ అంటూ లోపలికి వచ్చాడు వాడు. వాళ్లమ్మని డబ్బడిగితే తను ‘నాన్నని అడుగు!’ అంటోంది. వాడొచ్చి నన్ను లేపాడు. నేను ఏమీ ఎరగనట్టు ‘ఏమిట్రా!’ అని కళ్లు నులుముకుంటూ లేస్తే విషయం చెప్పాడు. బయటకొచ్చి ‘చిల్లర లేదు, రేపిస్తా!’ అన్నాను. ‘నిన్నా… మొన్నా కూడా ఇవ్వలేదు సార్‌!’ అన్నాడు. బాగా గిల్టీగా అనిపించింది. ‘కాస్త ఆగు!’ అని చెప్పి నా బ్యాగులో ఎప్పుడో దాచిన 20 రూపాయల నోటు తెచ్చిచ్చాను. మా ఇంట్లో మిగిలిన ఆఖరి నోటు అది. ఆ రోజంతా- ఎంతో ఇష్టంగా అద్దెకు తీసుకున్న ఆ మిద్దె ఇంటిని కళ్లారా చూసుకున్నాను. నా తొలి సినిమా హిట్టయ్యాక తీసుకున్న డబుల్‌ బెడ్రూమ్‌ ఇల్లది. ఆ హిట్టుతో నిర్మాతకి బాగా లాభాలొచ్చినా నా చేతుల్లో పెద్దగా ఏమీ మిగల్లేదు. నేననుకున్న ప్రాజెక్టులేవీ పట్టాలకెక్కలేదు. అనుకోకుండా చేసినవి కాసులు రాల్చలేదు. చూస్తుండగానే ఊరంతా అప్పులైపోయాయి. ఇంటి అద్దె కూడా కట్టలేకపోయాను. మేమిచ్చిన ఆరు నెలల అడ్వాన్స్‌ కూడా తీరిపోయి ‘బాబూ! ఇల్లు ఖాళీచేస్తారా… లేదా!’ అనడం మొదలుపెట్టాడు ఓనరు. ప్రతిసారీ తలతీసేసినట్టయ్యేది. అందుకే వేరే దారేదీ లేని పరిస్థితిలో ఆ రోజు రాత్రి పెట్టేబేడా సర్దుకుని గుట్టుచప్పుడు కాకుండా ఆ ఇంటి నుంచి బయటకొచ్చేశాం. ఓ రకంగా అప్పులవాళ్లనీ, అద్దె అడిగే ఓనర్‌నీ తప్పించుకుని దొంగల్లా పారిపోయాం. నా సంగతి సరే… ఏ పాపమూ ఎరగని నా భార్యాపిల్లల్నీ నలుగురి దృష్టిలో దగాకోర్లుగా నిలబెడుతున్నానన్న బాధ నా గుండెని మెలిపెట్టింది. ఆ అర్ధరాత్రివేళ ఆటోలో వెళుతూ అమాయకంగా నిద్రపోతున్న నా పిల్లల్ని చూసి ‘మీకు అద్భుతమైన భవిష్యత్తు ఇవ్వాలనుకున్నవాణ్ణి… ఇలా చేస్తున్నాను. సారీ అమ్మా!’ అంటూ వెక్కివెక్కి ఏడ్చాను.

మరో జన్మే ఎత్తాను…
ఆ రోజు రాత్రి ఎక్కడికి పోవాలో తోచక మా ఆవిడ బలవంతం మీద చెన్నై శివార్లలో ఉన్న మా అత్తగారి ఇంటికి వెళ్లాం. నా మనసు అవమానంతో గింజుకుంటున్నా వాళ్లు మాత్రం నన్ను సొంత బిడ్డలాగే ఆదరించారు. అక్కడికెళ్లాక నెలలోనే బాగా చిక్కి పుల్లలా అయిపోయాను. మొదట్లో అప్పుల బాధవల్ల అనుకున్నాను కానీ… నెలన్నరలో ఆరు కేజీలు తగ్గడంతో ఏదో సమస్య ఉందనిపించింది. ఆసుపత్రికి వెళితే… నా కడుపులో టీబీ వచ్చిందన్న బాంబు పేల్చారు వైద్యులు. మూలిగే నక్కపైన తాడిపండన్న చందంగా మారింది పరిస్థితి. విధి నాపైన అన్నివైపుల నుంచీ దాడిచేస్తోందేమో అనిపించింది. ఓ గదిలో పెట్టి ఎటూ వెళ్లే అవకాశం లేకుండా దాడికి దిగితే పిల్లి కూడా తిరగబడుతుందంటారు! మరి నేను మనిషిని… ఆ మాత్రం విధిపైన తిరగబడలేనా అనిపించింది! శక్తినంతా కూడగట్టుకుని పోరాడటం మొదలుపెట్టాను. ప్రభుత్వాసుపత్రిలోనే చికిత్స తీసుకోవడం ప్రారంభించాను. నాపైన నేను నమ్మకం పెంచుకోవాలని అప్పటిదాకా నేను అందుకున్న విజయాల్నీ ఎదుర్కొన్న సవాళ్లనీ ఓచోట రాసుకున్నాను. వాటిని క్లుప్తంగా చెబుతాను…

తమిళనాడులోని నైవేలి అనే ప్రాంతం మాది. లిగ్నైట్‌ గనులకీ, కరెంటు ఉత్పత్తికీ ప్రసిద్ధిగాంచిన టౌన్‌షిప్‌ అది. 14 చదరపు కిలోమీటర్లున్న టౌన్‌షిప్‌లో ‘అమరావతి’ అని ఒక్క థియేటరే ఉండేది… అందులోనూ 1960లనాటి సినిమాలు మాత్రమే వేసేవారు. తిరుచ్చిరాపల్లిలో డిగ్రీలో చేరాకే అసలు సినిమాలంటే ఏమిటో తెలిసింది. అప్పట్లో కాలేజీల్లో వేసే నాటకాల్లో చురుగ్గా పాల్గొనేవాణ్ణి. నా రచనాతీరూ, నటుల నుంచి నాక్కావాల్సింది రాబట్టడం వంటివి చూసి నా స్నేహితులంతా ‘నీ డైరెక్షన్‌ బావుందిరా!’ అనేవారు. ఆ ప్రోత్సాహంతో సహజంగానే నాలో సినిమాపిచ్చి మొదలైంది. పీజీ ముగించేనాటికి అది కాస్తా ముదిరిపోయింది. ఇంట్లోవాళ్లు వద్దంటున్నా వినకుండా ‘ఒక్కసారి కెమెరాని తాకితే చాలు…’ అన్న లక్ష్యంతో చెన్నై బస్సెక్కాను. అక్కడ ఆ కోరిక నెరవేరడానికి మూడేళ్లు పట్టింది. స్టూడియోల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న నన్ను ఓ సినిమా కోసం శరత్‌కుమార్‌కి ‘డూప్‌’గా తీసుకున్నారు. అక్కడ పరిచయమైన దర్శకుడు అగత్తియన్‌ సాయంతో ‘ప్రేమలేఖ’ సినిమాకి సహాయదర్శకుణ్ణయ్యాను. అప్పట్లో ఖుష్బూ భర్త సుందర్‌ ఓ సినిమా తీస్తూ ఏదో పొరపొచ్చాలు వచ్చి మానేస్తే మిగిలిన భాగాన్ని నన్ను పూర్తిచేయమని కోరారు ఆ సినిమా నిర్మాతలు. అలా నా పేరు రాకున్నా ఆ పని చేసిపెట్టడంతో… ఆ నిర్మాణ సంస్థ తమ తర్వాత సినిమాకి నాకే దర్శకత్వ బాధ్యతలు అప్పగించింది. అలా అర్జున్‌ హీరోగా కన్నోడు కాన్బదెల్లాం (తెలుగులో ప్రేమ ఘర్షణ) అన్న సినిమా చేశాను. ఆ సినిమా మంచి హిట్టయింది. పరిశ్రమలో చక్కటి గుర్తింపొచ్చింది కానీ… చేతిలో డబ్బులు మిగల్లేదు. అయినా-దర్శకుడిగా ఓ స్థాయి మెయిన్‌టెయిన్‌ చేయాలంటూ పెద్ద ఇల్లు అద్దెకు తీసుకున్నాను. ఆడంబరాలకి పోయాను. అప్పులు చేశాను. వాటికి తాగుడు అలవాటూ ఆజ్యం పోసింది. వీటన్నింటి ఫలితమే నాటి నా ఆర్థిక పరిస్థితి. నా విజయాలూ, బలాలూ, బలహీనతలపైన ఓ స్పష్టత వచ్చాక ముందు నా ఆరోగ్యంపైన దృష్టిపెట్టాను. దురలవాట్లతో పోరాడాను… దానికి క్రైస్తవ భక్తితోపాటూ మా ఆవిడ ప్రేమా ఎంతో బలాన్నిచ్చింది. అలా మరోజన్మ ఎత్తినట్టే అనిపించింది. ఆరునెలల్లోనే తేరుకుని… ఓ సినిమా స్క్రిప్టు సిద్ధంచేశాను.

‘రోజుకి ఐదువేలు చాలు’
అప్పట్లో కరణ్‌ అనే సహాయ నటుడు హీరోగా నిలదొక్కుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటే నా స్క్రిప్ట్‌ వినిపించాను. ‘నాకు ఒక్క కెమెరా ఇచ్చి… రోజుకి ఐదువేలు డబ్బులివ్వండి చాలు, సినిమా తీసిస్తాను!’ అని చెప్పాను. టీవీ సీరియళ్లకే రోజుకి లక్షరూపాయలు ఖర్చవుతున్న రోజులవి! కరణ్‌ నేను ఆశించిన దానికంటే ఎక్కువే డబ్బులిచ్చి సినిమా తీయమన్నాడు. 2006లో వచ్చిన ‘కొక్కి’ అన్న ఆ సినిమా పెద్ద హిట్టయింది. అప్పుడు వచ్చిన డబ్బుతో నేను చేసిన మొదటి పని పాత అద్దె ఇంటి బకాయిలన్నీ తీర్చేయడం…

ఆ ఓనర్‌కి క్షమాపణ చెప్పడం. అప్పటి నుంచి నా భార్య పునీతకే ఆర్థిక బాధ్యతలు అప్పగించడంతో… ఇంకెప్పుడూ మాకు సమస్యలు రాలేదు. బయటివాళ్లు నిర్మాతగా ఉంటే నేననుకున్న సినిమాలు తీయలేననే ఆలోచనతో నేనే నిర్మాతగా మారాలనుకున్నాను. ఓ ఫైనాన్షియర్‌ దగ్గర్నుంచి ఐదు లక్షలూ, నా సొంత డబ్బు ఒకటిన్నర లక్షని పెట్టుబడిగా పెట్టి సినిమా మొదలుపెట్టాను. దక్షిణాది సినిమా అప్పటిదాకా చూడని అడవి నేపథ్యాన్ని చూపాలనుకున్నాను. అలాంటి ఓ ప్రాంతం కోసం దట్టమైన కేరళ అడవుల్లో పదివేల కిలోమీటర్లు కాలినడకన తిరిగాను. చివరికి ప్రముఖ పర్యటక ప్రాంతం మున్నార్‌ సమీపంలో ఉండే కురాంగణి అనే గ్రామాన్ని ఎంచుకున్నాను. నా పాత సినిమాల్లో సైడ్‌ క్యారెక్టర్‌ చేసిన విధార్థ్‌ని హీరోగా తీసుకున్నాను. ఎన్నో వడపోతల తర్వాత హీరోయిన్‌గా అమలాపాల్‌ని ఎంపిక చేసుకున్నాను. 2011 నాటి దీపావళినాడు విడుదలైన ‘మైనా’(తెలుగులో ప్రేమఖైదీ) ఆ రోజే వచ్చిన ఓ టాప్‌హీరో సినిమాని సైతం తోసిరాజని పెద్ద హిట్టయింది. జాతీయ అవార్డుల్నీ సంపాదించిపెట్టింది. కమల్‌హాసన్‌ ఈ సినిమా చూసి ప్రతి పాత్రనీ విశ్లేషిస్తూ గంటపాటు ప్రసంగించారు. రజినీకాంత్‌ ‘ఈ సినిమాలో ఓ చిన్న పాత్ర ఇచ్చినా నేను గర్వపడేవాణ్ణయ్యా!’ అంటూ నన్ను ఆలింగనం చేసుకున్నారు. నాకు పర్యావరణ స్పృహ ఏర్పడింది ఈ సినిమాతోనే! అలా అడవిలోకి చొచ్చుకెళుతున్న మనిషికీ- అక్కడే తరతరాలుగా ఉన్న ఏనుగులకీ మధ్య జరుగుతున్న ఘర్షణపైన ఓ కథ సిద్ధం చేసుకున్నాను. అదే ‘గుమ్కీ’…!

 

గజరాజుకి దండంపెట్టా…
శివాజీగణేశన్‌ మనవడు విక్రమ్‌ ప్రభుని ఈ సినిమాతో హీరోగా పరిచయం చేశాను. ఇందులో నటించిన కుట్టి అనే ఏనుగు ద్వారానే గజరాజుల్ని ఏ రకంగా ముద్దు చేయాలి… వాటికి ఎప్పుడు యాక్షన్‌ చెప్పాలి… అవి సృష్టించే ఒక్కో శబ్దానికీ అర్థమేమిటీ… వంటివన్నీ నేర్చుకున్నాను. ఇంత చేసినా షూటింగ్‌ చివర్లో ఓ పెద్ద సమస్యని ఎదుర్కోవాల్సి వచ్చింది. మా ఏనుగుని షూటింగ్‌ కోసం కేరళ నుంచి తమిళనాడు సరిహద్దుకు తెప్పించాల్సి వచ్చేది. మధ్యలో 14 చెక్‌పోస్టులుండేవి. అక్కడి వాళ్లందరికీ నచ్చజెప్పి తెచ్చాక… ఏనుగు చెవులకీ కళ్లకీ మధ్య ఓ చిన్న బుడిపెలాంటిదొచ్చింది. అదేమిటని అడిగితే ‘ఏనుగుకి మదం పడుతోంది సార్‌!’ అన్నాడు మావటి. మరో ఏనుగుని షూటింగ్‌కి తెచ్చేంత డబ్బు కానీ వీలుకానీ మాకు లేదు. మేం చేయాల్సింది కూడా 10 గంటల షూటింగ్‌ మాత్రమే. దాంతో నేను షూటింగ్‌ చేస్తాననే చెప్పాను. ‘నాకు తెలియదుసార్‌… జనాలని చూస్తే అది రెచ్చిపోవచ్చు. మీ ప్రాణానికి నేను హామీ ఇవ్వలేను!’ అంటూ మావటి దూరంగా వెళ్లిపోయాడు. ఏం చేయను… ఆ ఏనుగే నా దేవుడనుకుని దండం పెట్టి చివరి షెడ్యూల్‌ మొదలు పెట్టాను. అదృష్టమో దైవనిర్ణయమో తెలియదు కానీ షూటింగ్‌ జరిగినంత సేపూ ఆ ఏనుగు కామ్‌గానే ఉండిపోయింది! గుమ్కీ సినిమా తమిళంలో సూపర్‌డూపర్‌ హిట్టయింది… తెలుగులోనూ మంచి ప్రశంసలొచ్చాయి.

రానా అడవి బిడ్డే అయ్యాడు…
అసోం అడవుల్లో అభివృద్ధి పేరుతో ఏనుగుల దారిని అడ్డుకుని ప్రభుత్వం గోడకట్టిన సంఘటనే నా ‘అరణ్య’ కథకి మూలం. అలాంటిచోట ఓ సిసలైన పర్యావరణ పోరాటయోధుడు ఉంటే ఎలా ఉంటుంది అన్న ప్రశ్న వస్తే నాకు అసోంలో సొంతంగా అడవిని పెంచిన జాదవ్‌ పాయెంగ్‌ కనిపించారు. ఆయన స్ఫూర్తితోనే హీరో పాత్రని రాసుకున్నాను. ఆ పాత్రకి ఎవరెవర్నో అనుకున్నాం కానీ… ఎవరూ నాకు నచ్చలేదు. రానా పేరు చెప్పగానే ‘అరె… ఇంతకాలం ఆయనెందుకు తట్టలేదు!’ అనిపించింది. విషయం చెబితే హైదరాబాద్‌ వచ్చి కథ చెప్పమన్నారు. కథల విషయంలో సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఎంత ఖరారుగా ఉంటుందో దక్షిణాది సినీ పరిశ్రమ మొత్తానికి తెలుసు. నాకా కథ ‘చెప్పడం’ సరిగ్గా రాదు… ‘చూపడమే’ వచ్చు. అందువల్ల సురేశ్‌ బాబుగారు ఒప్పుకోరేమోనన్న అనుమానంతోనే వెళ్లాను. కానీ 20 నిమిషాలపాటు నా ఆలోచనలు టూకీగా చెప్పగానే ఆయనా, రానా కథలో లీనమైపోయారు. ఆ రోజు నుంచి మూడేళ్లపాటు మరే సినిమాలోనూ పనిచేయకుండా శ్రమించారు రానా. కేవలం శాకాహారమే తింటూ 15 కేజీల బరువు తగ్గారు! గుమ్కీలో నేను ఒక్క ఏనుగుతో షూటింగ్‌ జరిపితే ఇందులో 18 ఏనుగులతో చేయాల్సి వచ్చింది. ఏనుగులు పరుగెత్తేటప్పుడు కెమెరాలు పట్టుకుని వాటి ముందూ వెనకా పరుగెత్తడం- మామూలు కష్టం కాదు. నేను నా సినిమా స్క్రిప్టులో ఏనుగుల సంచారాన్ని అడ్డుకుంటూ కట్టిన గోడని కూల్చేసినట్టే క్లైమాక్స్‌ రాశాను… అది కేవలం నా అభిలాష మాత్రమే. అప్పటికి నిజంగా అలా జరగలేదు. కానీ, నా సినిమా విడుదల కావడానికి వారం ముందే ఆ గోడని కూల్చేసి… ఏనుగుల రాచబాటని పునరుద్ధరించారట! ఆ విషయాన్ని చెబుతూ అక్కడి అధికారులు ‘మీ స్క్రిప్టు ఆ ఏనుగుల పాలిట ఓ ప్రార్థనలా పనిచేసిందండీ!’ అంటుంటే నాకు ఆనందంతో కన్నీళ్లాగలేదు!

Artist Samudra Khani

ఇంట్లోవాళ్లు నేను చనిపోయానను కున్నారు…!

 

కొందరు సాధించే విజయాలు అందించే స్ఫూర్తి… కేవలం వాళ్ల రంగానికే పరిమితం కాదు. ప్రపంచంలో ఏ రంగంలో ఉన్నవాళ్లైనా వాటితో ప్రేరణ పొందొచ్చు! దర్శక-నటుడు సముద్రఖని అందుకున్న విజయాలు అలాంటివే. తెలుగు పరిశ్రమకి మొదట్లో దర్శకుడిగానే పరిచయమైన ఆయన… గత ఏడాది ‘అలవైకుంఠపురం’లోనూ, ఇప్పుడు ‘క్రాక్‌’లోనూ విలన్‌గా అలరించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోనూ కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఈ జాతీయ ఉత్తమనటుడు ఏ స్థాయి నుంచి ఇక్కడిదాకా వచ్చారో… చూడండి…

నాతెలుగు కాస్త తేడాగా ఉన్నా నేను తెలుగువాణ్ణే. కొన్ని శతాబ్దాలకి ముందు తెలుగుగడ్డ నుంచి వెళ్లి దక్షిణ తమిళనాడులో స్థిరపడ్డవాళ్లం మేము. అక్కడి చవిటి నేలల్ని సస్యశ్యామలంగా మార్చిన రైతు కుటుంబాలవాళ్లం. మదురైకి ఆవల రాజపాళెం పట్టణానికి దగ్గర్లో సేత్తూరు అన్న గ్రామం మాది. ఎందుకో తెలియదుకానీ సాగంటే ప్రాణంపెట్టే నాన్న… సినిమాలంటే మండిపడేవాడు. అందువల్లనేమో ఎనిమిదో తరగతిదాకా నేను సినిమా థియేటర్‌లే కాదు… టీవీ కూడా చూసిందిలేదు. ఓ రోజు నా స్నేహితుడొకడు… నేను వద్దంటున్నా సినిమా థియేటర్‌కి తీసుకెళ్లాడు. శివాజీ గణేశన్‌ నటించిన ముదల్‌ మరియాదై(తెలుగులో ‘ఆత్మబంధువు’) చిత్రం అది. నేను తొలిసారిగా చూసిన ఆ రంగుల ప్రపంచం కళ్లనే కాదు… బుర్రనీ నింపేసింది. అప్పటి నుంచీ సమయం చిక్కినప్పుడల్లా థియేటర్‌లకి చెక్కేసేవాణ్ణి. ఓ రోజు ఈ విషయాన్ని కనిపెట్టి నాన్న చితకబాదాడు. నాకెవ్వరూ పైసా ఇవ్వకూడదని హుకుం జారీచేశాడు. డబ్బుల్లేకుంటేనేం… రాత్రుళ్లు నిద్రపోవడానికని డాబామీదికెళ్లేవాణ్ణి. అట్నుంచటు కిందికి దూకి, థియేటర్‌కి వెళ్లి అక్కడ గోడపక్కనే పడుకుని సినిమా చూడకున్నా డైలాగులు విని సంతోషించేవాణ్ణి. అలా వింటూనే నేను రజినీకాంత్‌కి పెద్ద ఫ్యాన్‌ అయిపోయాను. ఓసారి ఆయన సినిమా ఒకటి కొత్తగా రిలీజైతే ఎలాగైనా చూడాలనుకున్నాను. నాన్న నా చేతికి చిల్లిగవ్వ రానివ్వకపోవడంతో… ఆ థియేటర్‌లోనే జంతికలమ్మడం మొదలుపెట్టాను. అలా అమ్ముతూనే ఆ సినిమా ప్రదర్శించిన 16 రోజులూ నాలుగు ఆటలూ కలిపి మొత్తం 64 షోలు చూశాను! అక్కడితో ఆగలేదు. అప్పట్లో కొన్ని సినిమా పత్రికల వెనకాల సినీప్రముఖుల అడ్రెస్సులు ఇస్తుండేవారు. వాటన్నింటినీ సేకరించి పెట్టుకున్నాను. పదో తరగతి పరీక్షలు రాసిందే తడవుగా నాన్న జేబులోని 138 రూపాయలు దొంగిలించి చెన్నై బస్సెక్కేశాను! అక్కడ ఏ అడ్రెస్సులూ కనుక్కోలేక గోడక్కొట్టిన బంతిలా వెనక్కివచ్చాను. రాగానే నాన్న చితకబాదుతాడని అనుకున్నా కానీ… ఆయన మొహంలో అదివరకెన్నడూ చూడని దిగులు కనిపించింది. నన్ను దగ్గరకి తీసుకుని ‘నువ్వు సినిమాల్లోకి వెళ్లు కానీ ఇప్పుడు కాదు. ముందు బాగా చదువుకో..!’ అని చెప్పాడు. అనుకోకుండా మరో నెలకి గుండెపోటుతో చనిపోయాడు!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా…
నాన్న చనిపోయాక అమ్మ రైతయింది. ఎంతో ప్రయాసతో నన్ను బీఎస్సీదాకా చదివించింది. పరీక్షలు అవుతూనే, ‘డిగ్రీ పూర్తయింది కదా, ఇక నేను సినిమాల్లోకి వెళ్తానమ్మా..!’ అన్నాను. ఎంతైనా నాన్న ఇచ్చిన మాటకదా, అమ్మ రెండువేల రూపాయలు అప్పుతెచ్చి చేతిలో పెట్టి వెళ్లిరమ్మంది! నాలాగే సినిమా కలలతో చెన్నైకొచ్చిన మరో ముగ్గురితో కలిసి తలదాచుకున్నాను. నేను పరిశ్రమలోకి వచ్చింది నటుణ్ణి కావాలనే. అందుకని రకరకాల భంగిమల్లో ఫొటోలు తీయించుకున్నాను. వాటిని తీసుకుని ఓ దర్శకుడి ఆఫీసుకెళితే ‘తుమ్మ మొద్దులా ఉన్నావ్‌! అసలు నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా’ అన్నారు. ఆ మాటలకి గుండె పగిలినా ‘గొప్పోళ్లందరికీ మొదట ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయట!’ అనుకుని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. ఓ చోట ఆడిషన్‌దాకా వెళ్లాను. చిట్టచివర్లో అక్కడే ఉన్న సహాయ దర్శకుడొకడు ‘మీకు బుద్ధుందా! ఈ మొహానికెందుకు ఆడిషన్‌, టైం వేస్ట్‌ కాకపోతే!’ అని మెడపట్టి గెంటేశాడు. ఇలాంటి అవమానాలతోనే ఏడాది గడిచింది. అమ్మ ఇచ్చిన డబ్బు మొత్తం అయిపోయింది. మరో ఆరునెలల తర్వాత నా స్థితి మరింతగా దిగజారింది. చెబితే నమ్మరు… నా చెప్పులు తెగిపోయి కొత్తవి కొనుక్కోవడానికీ డబ్బుల్లేవు. ఒట్టికాళ్లతో నడిచి అరికాళ్లూ పుండ్లయ్యాయి. పాతబట్టలు చించి కాళ్లకి చుట్టుకుని నడిచేవాణ్ణి. అవి గాయాలకి అతుక్కుపోయి సలపడం మొదలుపెడితే… ఓ రోజు మా పక్క రూమతను బాత్రూమ్‌కి వెళ్లడానికి వాడే స్లిప్పర్స్‌ వేసుకుని బజారుకెళ్లాను. అతను పరుగెత్తుకుంటూ నా వెనకే వచ్చి ‘చెప్పులిస్తావా… ఇవ్వవా!’ అని గొడవపడ్డాడు. నలుగురికి అన్నం పెట్టే రైతు కుటుంబంలో పుట్టినవాణ్ణి… డిగ్రీ ఫస్ట్‌క్లాసులో పాసైనవాణ్ణి… నన్ను వాడలా చెప్పుల కోసం నలుగురిలో తిట్టడం తట్టుకోలేకపోయాను. ఆ క్షణమే ఆత్మహత్య చేసుకుందామని రైల్వే పట్టాల వైపు వెళ్తున్నాను. అప్పుడో వ్యక్తి బైకుమీద వెళుతూ… చెప్పుల్లేని నన్ను చూసి ‘ఎక్కడికెళ్లాలి… నేను డ్రాప్‌ చేస్తాను… రండి!’ అన్నాడు. వెనక కూర్చున్న నాకు కన్నీళ్లు ఆగడంలేదు. అది గమనించాడేమో ‘మీరు ఎందుకోసం ఏడుస్తున్నారో నాకు తెలియదు. కానీ ఏడ్చేకొద్దీ ప్రపంచం మనల్ని మరింతగా ఏడిపిస్తుంది… నిబ్బరంగా ఉండండి. ధైర్యంగా ముందుకెళ్లండి!’ అని చెప్పి వెళ్లిపోయాడు. అనామకుడే కావొచ్చుకానీ అతని మాటలు నాపైన మంత్రంలా పని చేశాయి. రూమ్‌కి వచ్చి… ‘ఇంకెవరిలాగో నటించడం కాదు. మనమే కొన్ని సీన్‌లు క్రియేట్‌ చేసి వాటి ప్రకారం నటించి చూపుదాం!’ అనుకున్నాను. అలా కొన్ని సీన్‌లు రాసుకుని సుందర్‌ కె.విజయన్‌ అనే టీవీ సీరియళ్ల డైరెక్టర్‌ దగ్గరకు వెళ్లాను. ఆయన చేతికి స్క్రిప్టు ఇచ్చి నటించి చూపిస్తుంటే మధ్యలోనే ఆపి… ‘నీ రాత బావుంది. నటుడిగాకాకన్నా నువ్వు మంచి రచయితవీ… కాస్త శ్రమిస్తే దర్శకుడివీ అవుతావు. నాకు అసిస్టెంట్‌గా చేరిపోరాదూ…!’ అన్నాడు. అన్ని సంవత్సరాలు నేను చేసిన తప్పేమిటో అప్పుడు అర్థమైంది. నాలోని అసలు శక్తిని గుర్తించలేక నటుణ్ణి కావాలని ఎటో కొట్టుకు పోతున్నానన్నమాట! ఆ విషయం

అర్థంకాగానే…
నటించాలనే ఆలోచన కూడా మరెప్పుడూ రాకూడదని నేను తీయించుకున్న ఫొటోలన్నీ చించిపడేశాను. ఆ తర్వాతి రోజు సహాయ దర్శకుడిగా చేరాను. నెలకి వందరూపాయలు జీతం. తొలి వంద రూపాయలతో మూడు జతల చెప్పులు కొన్నాను. అప్పటి నుంచీ చేతిలో డబ్బులున్నప్పుడల్లా చెప్పులూ, బూట్లూ కొనడం మొదలు పెట్టాను. ఆ అలవాటు ఇప్పటికీ పోలేదు!

నేను లేకుండానే… చెల్లి పెళ్లి!
చెన్నైలో నా బాధలు ఇలా ఉంటే… మా ఊళ్ళో నేను చనిపోయానని నిర్ణయానికొచ్చారట! తప్పు నాదే. ఏదో గొప్పగా సాధించేదాకా ఊరి ముఖం చూడకూడదని భీష్మించుకుని అటువైపు వెళ్లలేదు. రోజూ పడే అవమానాలు దాచి అబద్ధాలేం రాస్తామని అమ్మకి ఉత్తరాలూ రాయలేదు. చెన్నై దాకా వచ్చి నాకోసం వెతికేపాటి లోకజ్ఞానం బంధువులెవరికీ లేకపోవడంతో నేనేమయ్యానో కూడా ఎవరికీ తెలియదు. ఈలోపు మా చెల్లెలికి మంచి సంబంధం వచ్చిందట. అమ్మ ఊళ్లోవాళ్లని నా ఆచూకీ కనుక్కోమని చెబితే ‘రెండేళ్లుగా ఏ సమాచారమూ లేదంటే… చచ్చే ఉంటాడు!’ అన్నారట. అమ్మ ఏమనుకుందో తెలియదుకానీ… ఒంటిచేత్తో మా చెల్లెలికి పెళ్ళి చేసేసింది. ఆ తర్వాత ఏడాదికికానీ నేను ఊరెళ్లలేదు. అప్పటికి టీవీ రంగంలో సహాయకుడిగా దాదాపు కుదురుకున్నాను. చేతిలో ఎంతోకొంత డబ్బుంది. ఆ ఉత్సాహంతో ఊళ్లోకి అడుగుపెడితే… మా చెల్లి చంటిపాపతో ఎదురైంది! నన్ను చూడగానే కాళ్లపైన పడిపోయి బావురుమంది. అమ్మయితే పిచ్చిదానిలా నన్ను పట్టుకుని ‘నాకొడుకు చావలేదు… చూడండి!’ అంటూ ఇంటింటికీ తీసుకెళ్లి చూపింది. అక్కడే నెలరోజులుండి అమ్మ చూపిన అమ్మాయిని పెళ్ళి చేసుకుని చెన్నైకి వచ్చాను. అప్పటిదాకా సహాయ దర్శకుడిగా ఉన్నవాణ్ణి ఆ తర్వాతే అసోసియేట్‌గా ఎదిగాను.

విలువలున్నవారు…
ప్రసిద్ధ దర్శకుడు కె.బాలచందర్‌ 90లలో కొన్ని టీవీ సీరియళ్లు తీశారు. అప్పుడు నేను ఆయన దృష్టిలో పడ్డాను. ఆయన దగ్గర అసోసియేట్‌గా పనిచేస్తున్నప్పుడు దర్శకుడిగా తన పక్కన నా పేరూ వేయించేవారు! అంతపెద్ద దర్శకుడి సరసన నా పేరు రావడమేంటని నేనే ఆశ్చర్యపోయేవాణ్ణి. అప్పట్లో ఓ సీరియల్‌ ద్వారా ఎస్పీబీగారబ్బాయి చరణ్‌ని పరిచయం చేశాం. ఆ షూటింగ్‌ స్పాట్‌లో అతనితో మాట్లాడుతున్నప్పుడే ఓ పెద్ద హీరో కోసం రాసుకున్న కథ చెప్పాను. ఆ సినిమాని తానే నిర్మిస్తానన్నాడు చరణ్‌. ఎస్పీబీగారికీ కథ నచ్చింది. ఆ హీరోకీ కథ నచ్చిందికానీ… దర్శకుడిగా మాత్రం నన్ను వద్దన్నాడు. నాకు అందులో పెద్ద సమస్య లేకున్నా… ఎస్పీబీ, చరణ్‌లు ఇద్దరూ ‘నువ్వు దర్శకుడివి కాకుంటే… మాకు ఆ హీరో కాల్షీట్లు కూడా వద్దు!’ అనేశారు. అంత ఉన్నత విలువలున్నవాళ్లు ఆ తండ్రీ కొడుకులు! ఆ తర్వాత ఎస్పీచరణ్‌నే హీరోగా పెట్టి ఓ సినిమా తీశాను. గొప్ప సినిమాగా పేరొచ్చిందికానీ… వాణిజ్యరీత్యా యావరేజ్‌గా మిగిలిపోయింది. ఆ తర్వాత విజయ్‌కాంత్‌ హీరోగా ఓ చిత్రం, పృథ్వీరాజ్‌ హీరోగా తెలుగులో ‘నాలో’ అనే సినిమాలు చేశాను. రెండూ దెబ్బకొట్టాయి. దాంతో నా కెరీర్‌ అయిపోయిందనుకున్నాను. దర్శకుడు అమీర్‌, కార్తి హీరోగా చేసిన తొలి సినిమా ‘పరుత్తివీరన్‌’(మల్లిగాడు)కి సహాయకుడిగా వెళ్లాను. అప్పటికే మూడు సినిమాలకి పనిచేసినవాణ్ని సహాయకుడిగా చూస్తే బావుండదని నన్ను అసోసియేట్‌గా చేర్చుకున్నాడు అమీర్‌. ఆ సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. అమీర్‌ దగ్గర సహాయకుడిగా పనిచేస్తూ వచ్చిన శశికుమార్‌ ‘సుబ్రహ్మణ్యపురం’(అనంతపురం) సినిమా తీస్తూ ఓ కీలక పాత్ర కోసం నన్ను పూర్తిస్థాయి నటుణ్ణి చేశాడు. దాంతో నటుడిగా నాకు మరిన్ని అవకాశాలొచ్చాయి. ఆ దన్నుతోనే ‘నాడోడిగల్‌’ అనే సినిమా తీశాను. తమిళంలో పెద్ద హిట్టది! దాన్నే తెలుగులో రవితేజ హీరోగా ‘శంభో శివశంభో’ పేరుతో తీశాం. తర్వాత నానీతో ‘జెండాపై కపిరాజు’ చిత్రం చేశాను. ఈ సినిమాలతోపాటూ దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించే అవకాశాలు వచ్చాయి. అలా ‘విచారణై’ అనే తమిళ సినిమాకి 2016లో జాతీయ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకున్నాను! ధనుష్‌ నటించిన ‘రఘువరన్‌ బీటెక్‌’ కారణంగా తెలుగులోనూ అవకాశాలు రావడం మొదలయ్యాయి కానీ… మంచి ఆరంభం కోసం ఎదురుచూస్తూ వచ్చాను. ఆ ఎదురుచూపులు ఫలించే ‘అల వైకుంఠపురం’లో అప్పల్నాయుడు పాత్ర దక్కింది. ఆ చిత్రం తర్వాత గోపీచంద్‌ మలినేని క్రాక్‌ సినిమాలోని ‘కటారి కృష్ణ’ పాత్రకోసం అడిగారు. అది నిజజీవిత పాత్రకాబట్టి వాస్తవానికి దగ్గరగా నటించాను. ఈ రెండు చిత్రాలు ఏడాది గ్యాప్‌లో సంక్రాంతి రోజునే రిలీజయ్యాయి. ఆ రెండు సంక్రాంతులూ… నా కెరీర్‌లో కొత్త వెలుగుల్ని నింపాయి.

నాలాంటివాళ్ల కోసం…
వాడి పేరు గురు… చెన్నైకి వచ్చిన కొత్తల్లో నాకు ఆశ్రయమిచ్చిన మిత్రుడు. సినిమాల్లో ఎదగాలని ఎన్నో కలలు కనేవాడు. ఓసారి రోడ్డుపైన మాతో మాట్లాడుతున్న వాడల్లా వస్తూ ఉన్న ఓ బస్సు ముందుకెళ్లి ఓ దర్శకుడిలా షాట్‌ చూస్తున్నట్టు చేతులు పైకెత్తి నిల్చున్నాడు! బస్సు డ్రైవర్‌ సడన్‌బ్రేక్‌ వేయడంతో సరిపోయిందికానీ లేకపోతే ప్రాణాలు పోయేవే. మతిభ్రమించినట్లు శూన్యంలోకి చూస్తూ ఏవేవో మాట్లాడు తున్నాడు. వాణ్ణి అతికష్టంపైన రూముకి తెచ్చాం. అర్ధగంట తర్వాత ‘నాకేమైంది!’ అనడం మొదలుపెట్టాడు. మిత్రులందరం తలాకొంత వేసుకుని వాణ్ణి  వాళ్ళూరెళ్లే బస్సెక్కించాం. ‘ఇంటికెళ్లాడు కదా, బాగానే ఉంటాడులే!’ అనుకున్నాం తప్ప క్షేమసమాచారాలు కనుక్కునే ప్రయత్నం చేయలేదు. సినిమాల్లో నాకంటూ గుర్తింపు వచ్చాక వాణ్ణి కలవాలనిపించింది. వాడు ఎప్పుడో చెప్పిన గుర్తుల్ని పట్టుకుని ఊరెళ్లాను. వెళ్లాకే తెలిసింది… పిచ్చిముదిరి చానాళ్ల క్రితమే చనిపోయాడని! అప్పటి నుంచీ ఆ తల్లిదండ్రులకి నేనే కొడుకుగా అన్నీ చూస్తున్నాను. వాళ్లన్నయ్య పాపని డిగ్రీ చదివించి పెళ్ళిచేశాను. బాబుని చెన్నైకి తీసుకొచ్చి సివిల్స్‌ కోచింగ్‌లో చేర్పించాను. అంతేకాదు… ఒకప్పుడు సహాయదర్శకులుగా ఉండి ఇప్పుడు ఉపాధి కోల్పోయిన వాళ్ల పిల్లల చదువుల బాధ్యతా తీసుకుంటున్నాను. ఇప్పటిదాకా పాతికమంది ఉన్నత చదువులు ముగించి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు!
 

Singer Chitra

పిల్లల కోసమే అక్కడికి వెళ్తా..!

 
‘పాడలేను పల్లవైనా భాషరాని దానను…’ – చిత్ర పాడిన తొలి తెలుగు పాట ఇది! చిత్రమేమిటంటే పల్లవైనా పాడలేనంటూ ఇటొచ్చిన ఆమె తన మాతృభాష మలయాళంకన్నా ఇక్కడే ఎక్కువ పాటలు పాడారు. పాడేటప్పుడు ఎంతో సీరియస్‌గా ఉండే చిత్ర… మాట్లాడేటప్పుడు పసిపాపంత అమాయకంగా నవ్వుతుంటారు. ఆ పాటలూ, ఆ స్వచ్ఛమైన నవ్వులేనా చిత్ర అంటే- కాదు, అంతకుమించిన వైరుధ్యాలూ విషాదాలూ ఉన్నాయి ఆమె జీవితంలో. అవి నేర్పిన పాఠాలే తననీ స్థాయిలో నిలిపాయనే చిత్ర ఆ విషాదానందాలకి కారణమేంటో చెప్పే క్రమంలో ఇప్పటిదాకా సాగిన తన పాటల ప్రస్థానాన్నీ నెమరేసుకున్నారు ఇలా…
అప్పుడు నాకు ఐదేళ్లుంటాయి. మా తమ్ముడు మహేశ్‌ ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. మా అమ్మ ఆ ఉయ్యాల ఊపుతూ మెల్లగా ‘ప్రియతమా… ప్రియతమా!’ అంటూ మలయాళంలో పాట పాడుతోంది. అప్పుడే ఇంటికెవరో పెద్దవాళ్లొస్తేనూ  అమ్మ వాళ్లని హాల్లో కూర్చోబెట్టి మాట్లాడుతోంది… నాన్న కూడా వచ్చిన పెద్దామెతో మాటలు కలిపాడు. ఇంతలో ఉయ్యాల్లోని తమ్ముడు చిన్నగా ఏడిస్తే… నేనుఆ ఊయ్యాల ఊపుతూ అమ్మ పాడినట్టే ‘ప్రియతమా… ప్రియతమా…’ అని పాడటం మొదలుపెట్టాను. పాటలో పూర్తిగా లీనమైపోయానేమో… బయట మాటలు ఆగిపోయిన విషయం గమనించలేదు. మా ఇంటికొచ్చిన పెద్దావిడ నా పాట వింటూ వెనకే నిల్చుందన్న సంగతీ తెలియలేదు. ఆమె నన్ను వెనక నుంచే ఎత్తుకుని ముద్దు పెట్టుకుని నాన్నతో ‘కృష్ణా… పాపకి మంచి ప్రతిభ ఉందిరా! నేనే సంగీతం నేర్పాలి దీనికి!’ అన్నారు. ఆమె పేరు ఓమనకుట్టి అనీ, కేరళలో గొప్ప కళాకారుల్ని తీర్చిదిద్దిన సంగీతాచార్యురాలనీ అంత చిన్న వయసులో నాకేం తెలుస్తుంది!
ఆమె మా ప్రాంతంలో ఏదో కచేరీ ఉండి నాన్నతో ఉన్న పాత పరిచయంతో మా ఇంట్లో బసచేశారు ఆరోజు. కాకపోతే ఆమె చెప్పినట్టు నేను సంగీతం నేర్చుకోవడానికి మరో పదేళ్లు పట్టింది. నేను చిన్నప్పుడు సంగీత శిక్షణ తీసుకోలేదు. నిజానికి, నన్ను ఈ రంగంలోకి తీసుకెళ్లాలన్న ఆలోచనే మా కుటుంబానికి లేదు. మేమంతా మా అక్కయ్య బీనానే అటువైపు వెళుతుందని అనుకునేవాళ్లం. కానీ, మేమొకటి తలిస్తే… దైవం ఇంకొకటి తలచింది.

నా పేరులో అమ్మ
నా పూర్తి పేరు కె.ఎస్‌.చిత్ర అని మీకు తెలిసే ఉంటుంది. అందులో ‘కె’ మా నాన్న పేరు కృష్ణన్‌ నాయర్‌. ‘ఎస్‌’ శాంతకుమారి మా అమ్మపేరు. ‘పిల్లలకి ఇనిషియల్‌గా తండ్రిపేరే ఎందుకుండాలి… తల్లి పేరూ ఉంటే తప్పేమిటీ!’ అని నా పేరులో అమ్మ పేరునీ చేర్చిన అభ్యుదయవాది నాన్న. ఆయనతోపాటూ అమ్మ కూడా టీచరే. సంతానంలో ఎవరైనా సంగీత రంగంలోకి వెళ్లాలనే కల ఉండేది ఆ ఇద్దరికీ. మా అక్కయ్యని ఆ కలకి ప్రతిరూపంగానే చూశారు. చిన్నప్పుడే పద్ధతిగా సంగీతం నేర్పించారు. అక్కయ్య అలా నేర్చుకుంటూ ఉంటే నేనూ వెంట వెళతానని మారాం చేసేదాన్ని. చెప్పొద్దూ చిన్నప్పుడు నేను కాస్త అల్లరిపిల్లనే. అబ్బాయిలకి పోటీగా చెట్లెక్కి దూకేదాన్ని. పొట్టిగా ఉంటానని ఫస్ట్‌ బెంచ్‌లో కూర్చోబెట్టేవాళ్లు కానీ… నిజానికి నేను యావరేజ్‌ విద్యార్థినినే. సంగీతం నేర్చుకుంటున్న మా అక్క సంగీత సాధన చేసేటప్పుడు విని నేనూ స్వరం తప్పకుండా వినిపించగలిగేదాన్ని. ఓసారి ఆలిండియా రేడియోలోని ఓ నాటకంలో రెండేళ్ల కృష్ణుడికి నా చేత పాటపాడించారు. నేను చూసిన తొలి రికార్డింగ్‌ అదే. అది ప్రసారమయ్యాక బాగా ఫేమసైపోయాను. చుట్టుపక్కల ఎక్కడ కచేరీలు జరిగినా నన్ను పిలవడం మొదలుపెట్టారు. సహజంగానే, పేరు ప్రఖ్యాతులు తలకెక్కి గర్వపడే ప్రాయం కదా… అది! కానీఆ గర్వం వల్ల వచ్చే నష్టమేంటోఅమ్మానాన్నలు స్పష్టంగా చెప్పారు.
‘నీ గాత్రం దేవుడిచ్చిందమ్మా… అందులో నీ ప్రమేయం ఏమీ లేదు. నువ్వు చేయాల్సిందంతా సాధనతో దాన్ని నిలబెట్టుకోవడమే. గర్వపడ్డ ప్రతిసారీ- నీకు చేరువైన విజయం వంద అడుగులు దూరం వెళుతుంది!’ అన్నారు. జీవితంలో నేను ఇప్పటికీ పాటిస్తున్న పాఠం అది.
అక్కత్యాగం
అక్కా, నేనూ సంగీతం వైపు వెళుతున్నా… మొదట సినిమాలో పాడే అవకాశం తనకే వచ్చింది. ఇంట్లో మాఇద్దరిలో ఒక్కరే సంగీతరంగంలోకి వెళ్లే పరిస్థితి! దాంతో ఆ అవకాశం నాకు ఇచ్చి అక్క తప్పుకుంది. ఓ రకంగా తను నాకోసం చేసిన త్యాగం అది. తనలా చేయకపోయుంటే నేను ఈ రంగంలోకి వచ్చి ఉండేదాన్నీ కాదు… నాకిన్ని అవార్డులూ వచ్చుండేవీ కావు. నేను పూర్తిస్థాయిలో సంగీతం నేర్చుకోవడం కోసం కేంద్రప్రభుత్వం అందించే ‘నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ స్కాలర్‌షిప్‌’కి దరఖాస్తు చేయమన్నారు నాన్న. దానికి ఎంపిక కావాలంటే అప్పటికే రెండేళ్లపాటు శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఉండాలి. నేను సంగీతం నేర్చుకున్నదాన్ని కాకపోయినా ఏదో పాడతాను కాబట్టి దరఖాస్తు చేశాను. సెలెక్షన్‌ కోసం ఏడుగురు న్యాయనిర్ణేతల ముందు ఓ పాట పాడి వినిపించాలి. అందుకోసం తోడిరాగంలోని ఓ త్యాగరాజ కృతిని ఎంచుకుని క్యాసెట్లో విన్నది విన్నట్టు పాడేశాను. అంతా విన్నాక ఓ న్యాయనిర్ణేత ‘తోడిరాగం ఆరోహణ అవరోహణలు చెప్పమ్మా!’ అన్నారు. ‘నాకు తెలియదండీ’ అన్నాను నిజాయతీగా! న్యాయనిర్ణేతలందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ‘నువ్వు పాడిన పాటలో నీకే తెలియకుండా అసావేరికి చెందిన ఓ అద్భుతమైన ప్రయోగం చేశావు. నువ్వు ప్రతిభాశాలివే…’ అని చెప్పి స్కాలర్‌షిప్పు ఇచ్చేశారు. ఏడేళ్ల ఆ స్కాలర్‌షిప్పుతో సంగీతం నేర్చుకోవడానికి డాక్టర్‌ ఓమనకుట్టిగారినే ఎంచుకున్నాను. అప్పట్లో నా లక్ష్యం ఒక్కటే… సంగీతం లోతులు తరచి చూసి మా గురువుగారిలా సంగీతాచార్యురాలిని కావాలన్నదే. కానీ… అనుకోకుండా నా ట్రాక్‌ మారింది.
మలుపు తిప్పిన క్షణం
మా గురువు ఓమనకుట్టిగారి అన్నయ్య ఎంజీ రాధాకృష్ణన్‌ 1979లోనే ఓ సినిమాకి నన్ను పాడించారు కానీ… ఆ సినిమా రిలీజు కాలేదు. 1982లో మళ్లీ ఓసారి అవకాశమిస్తే పాడాను. అదో డ్యూయెట్‌. మొదట్లో ‘ట్రాక్‌’ కోసమని రికార్డు చేశారు. నాతోపాటు ఓమనకుట్టిగారి తమ్ముడు ఎంజీ శ్రీకుమరన్‌ పాడారు. ఆ తర్వాత శ్రీకుమరన్‌ ట్రాక్‌కి బదులు దాసన్న (కే జే ఏసుదాసు)ని ఎంచుకున్నారు. ఆయనకోసం మరోసారి నన్ను పాడమన్నారు. ఏసుదాసుగారి పక్కన నిల్చుని పాడటమన్న ఆ ఆలోచనకే గడగడా వణికిపోయాను. రికార్డింగులో తప్పులొచ్చాయి. అయినాసరే… దాసన్న ఓపిగ్గా సవరణలు చెప్పి పాడించారు. ఆ పాట బయటకొచ్చాక ‘ఏసుదాసుతో ఎవరో చిన్న పిల్ల పాడిందట!’ అంటూ ఇండస్ట్రీలోని మిగతా సంగీతదర్శకులూ నాకు అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ కొద్ది రోజుల్లోనే- ‘మరీ చిన్నపిల్లల గొంతులాగా ఉంది. పెద్దవాళ్లకి పనికిరాదు!’ అనే ముద్రపడింది. కాకపోతే నా అదృష్టం కొద్దీ- నేనలా చిన్నపిల్లలా నటి నదియా కోసం పాడిన ఓ పాట ఇళయరాజాగారి చెవిన పడింది! నా కెరీర్‌ని మలుపుతిప్పిన క్షణాలవి.

ఇళయరాజా జోస్యం
అప్పట్లో తిరువనంతపురంలోని మా ఇంటికి దగ్గర ‘శివన్‌’ అనే థియేటర్‌ ఉండేది. అందులో తమిళ సినిమాలు వేసేవారు. ప్రదర్శనలకి ముందు పెద్ద సౌండ్‌తో పాటలు వినిపిస్తుండేవారు. అరవం అర్థం కాకున్నా ఇళయరాజా పాటలతో పరిచయం అలా ఏర్పడింది! పోనుపోను ఆయన గురించి అందరూ గొప్పగా చెప్పడం వింటుండేదాన్ని. సినిమాల్లోకి వచ్చాక ఆయనతో పనిచేసే అవకాశం రాకపోతుందా అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ‘పెద్దవాళ్లకి నా గొంతు పనికిరాదు!’ అన్న విమర్శతో ఆ కలలన్నీ నీరుగారిపోయాయి. అలాంటి సందర్భంలోనే మలయాళంలో నదియా నటించి నేను పాటలు పాడిన సినిమాని దర్శకుడు ఫాజిల్‌ తమిళంలో తీయాలను కున్నారు. ఇళయరాజాగారే సంగీతం. ఆయన మలయాళం ఒరిజినల్‌లోని నా పాటలు విని ‘ఈ గొంతు కొత్తగా ఉంది… తమిళంలోనూ వాడేద్దాం!’ అన్నార్ట. దాంతో ఫాజిల్‌ ‘చెన్నై వెళితే ఓసారి రాజాగార్ని కలవండి!’ అన్నార్ట నాన్నగారితో. ఆయన చెప్పినట్టే ఓ రోజు నాన్నతోపాటూ బిక్కుబిక్కుమంటూ రాజాగారి స్టూడియోకి వెళ్లాను. శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నానని విని ఓ కీర్తన పాడమన్నారు. ‘ఇంత సౌఖ్యమని నే జెప్పజాల…’ అన్న కృతి పాడాను కానీ భయంతో ఉచ్ఛ్వాసనిశ్వాసాలు పెరిగి ‘జెప్పజా…లా’ అంటూ పదాల్ని విరిచేశాను. రాజాగారు ‘అలా పాడకూడదమ్మా…’ అని చక్కగా నేర్పించి పంపారు. అంత తప్పులుతడకలుగా పాడిన నాకేం అవకాశమిస్తారు అనుకున్నాను. కానీ, తర్వాతి వారమే నదియా నటించిన సినిమాలో అన్నిపాటలూ నా చేత పాడించారు. ఆ తర్వాతే ‘సింధుభైరవి’ వచ్చింది. ఆ సినిమా తెలుగు వెర్షన్‌లో ‘నేనొక సింధు…’ అనే సుశీలగారి పాట ఉంటుంది. దాన్ని తమిళంలో నేను పాడాను. ఆ పాట రికార్డింగ్‌ మధ్యాహ్నం పూర్తయిపోతే… సాయంత్రం ట్రెయిన్‌కి వెళ్లాలని ప్లాన్‌ చేసుకున్నాం. అప్పటికి బీఏ మ్యూజిక్‌లో డిగ్రీ అందుకుని ఎమ్మేలో చేరాను. ఆ తర్వాతి రోజే నాకు పరీక్షలు. మేం బయల్దేరుతుండగా రాజాగారు ‘ఇంకో మంచి పాట ఉంది. పాడి వెళ్తావా!’ అని అడిగారు. నాన్నేమో ‘పాపకి రేపు పరీక్షలు సార్‌…!’ అన్నారు. ‘డిగ్రీలు పక్కనపెట్టండి… ఇది అంతకన్నా పెద్దస్థాయికి తీసుకెళుతుంది!’ అన్నారు. నాన్నకేమీ పాలుపోక అమ్మకి ఫోన్‌ చేశారు. ‘తర్వాతైనా ఎమ్మే పూర్తి చేస్తానని మాటిస్తేనే పరీక్షలు మాను’ అంది అమ్మ నాతో. అలాగేనని ప్రామిస్‌ చేశాను. కానీ ఆ మాట ఎప్పటికీ నిలుపుకోలేని పరిస్థితొచ్చింది. రాజాగారి జోస్యం నిజమైంది. ‘పాడరియేన్‌…’ అనే ఆ పాట నాకు తొలి జాతీయ అవార్డునే కాదు, తీరికలేనన్ని అవకాశాల్నీ తెచ్చిపెట్టింది. దాని తెలుగు వెర్షన్‌ ‘పాడలేను పల్లవైనా…’తోనే తొలిసారి తెలుగు శ్రోతలకి పరిచయమయ్యాను.

నాకు తోడూనీడా…
నేను బీఏ సంగీతం చదువుకునేటప్పుడు వేరే కాలేజీకి చెందిన రాజీ అనే అమ్మాయి నాతో పోటీపడుతూ ఉండేది. ఎంత స్పర్థ ఉన్నా నాకు తను మంచి స్నేహితురాలు! ఆ అమ్మాయికి ఓ అన్నయ్య ఉన్న విషయం నాకు తెలియదు. అతనికి నన్ను ఇచ్చి వివాహం చేయమని మా నాన్న ఫ్రెండ్‌ ద్వారా అబ్బాయి తల్లిదండ్రులు కబురు చేశారు. అతని పేరు విజయ్‌శంకర్‌… ఎలక్ట్రికల్‌ ఇంజినీరు అని చెప్పారు. ఆ కుటుంబంలో అందరూ సంగీతకారులే కాబట్టి… నాన్న నన్ను ఆ కుటుంబానికే ఇవ్వాలనుకున్నారు. అలా 1988లో మా పెళ్లైంది. ఓ దశ దాకా రికార్డింగుల కోసమని నాన్నే నాతో వచ్చేవారు. నాన్నకి నోటి క్యాన్సర్‌ వచ్చి మంచానపడటంతో కొంతకాలం అమ్మ నా వెంట వచ్చింది. ఆ తర్వాత నా బాధ్యతంతా ఆయనే తీసు కున్నారు. కేరళలో పనిచేస్తున్న ఆయనకి ప్రతిసారీ నాతో రావడం ఇబ్బందయ్యేది. దాంతో చెన్నైకి బదిలీ చేయమని అడిగారు. కంపెనీ ఒప్పుకోకపోవడంతో రిజైన్‌ చేసేసి నాతోపాటూ వచ్చేశారు. అప్పటి నుంచీ ఆయనే అనుక్షణం నాకు తోడూనీడయ్యారు… ఇంకే ఉద్యోగమూ చేయలేదు. ‘భార్య సంపాదిస్తోంది కదా, ఇంక ఉద్యోగమెందుకు…’ అని కొందరు అనుకోవచ్చుకానీ ఉద్యోగం వదిలేసి భార్య వెంట స్టూడియోలకు తిరగడానికి చాలామందికి పురుషాహంకారం అడ్డువస్తుంది కదా! అదిలేని స్వచ్ఛమైన వ్యక్తిత్వం ఆయనది. మా అమ్మానాన్నలిద్దరూ పదేళ్ల గ్యాప్‌లో చనిపోతే… మా అత్తగారు అరచేతిలో పెట్టి చూసుకున్నారు నన్ను! ఎంత పేరుప్రఖ్యాతులున్న కోడలైనా- ఎప్పుడో ఒకసారి వంటింట్లోకి వెళ్లి ఏదో ఒకటి వండిపెట్టాలని ఎదురుచూడని అత్తలుంటారా… అదీ నిన్నటి తరంలో! కానీ మా అత్తయ్య నన్ను వంటింట్లో అడుగే పెట్టనివ్వలేదు… చనిపోయేదాకా!

నా పాప వెళ్లిపోయింది
పెళ్లైనప్పటి నుంచీ కెరీర్‌లో బాగా బిజీ అయిపోయాన్నేను. పదిహేనేళ్లలో నాలుగు దక్షిణాది భాషలతోపాటూ హిందీలోనూ పాతికవేల పాటలు పాడాను. నాలుగుదక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ అవార్డులూ అందుకున్న ఏకైక గాయనిగా పేరుతెచ్చు కున్నాను. కెరీర్‌లో అంత ఎత్తుకు ఎదిగినా… నా కడుపు పండలేదనే బాధ మమ్మల్ని పీడిస్తూనే ఉండేది. అందుకోసం వేడుకోని దైవం లేడు… చేయని నోము లేదు. అవి ఫలించాయేమో 2002 డిసెంబర్‌ 18న మాకో పాప పుట్టింది. మోడువారినట్టున్న జీవితాలకి పచ్చదనాన్ని పంచిందని నందన అని పేరుపెట్టాం. పుట్టిన కొన్నాళ్లకే పాపకు ‘డౌన్‌ సిండ్రోమ్‌’ లోపం ఉందని తెలిసినా అది మాకెప్పుడూ సమస్యగా అనిపించలేదు. తనని చూసు కోవాలనే పాటల్ని సగానికి సగం తగ్గించుకున్నాను. 2005వ సంవత్సరం హైదరాబాద్‌లో ఓ ఫంక్షన్‌కి నందనతోపాటూ వచ్చినప్పుడే నాకు పద్మశ్రీ ప్రకటించారు! దక్షిణాదికి చెందిన ఓ సినీగాయనికి పద్మ అవార్డు దక్కడం అదే తొలిసారి. అది మా పాప తెచ్చిన అదృష్టంగానే భావించాను. తను లేనిదే క్షణం గడిచేది కాదు నాకు. 2011 ఏప్రిల్‌… దుబాయ్‌లో ఏఆర్‌ రెహ్మాన్‌ కచేరీ కోసం పాపనీ  తీసుకుని వెళ్లాను. అందరితోపాటూ హోటల్‌లో ఉండకుండా ఓ విల్లాలో ఉన్నాం. పిల్లలకి నీళ్లంటే ఎంతిష్టమో చెప్పాలా… వెళ్లినప్పటి నుంచీ అక్కడున్న స్విమ్మింగ్‌ పూల్‌లో బాగా ఆడుతుండేది. ఆ రోజు వాళ్లనాన్న బయటకు వెళ్లారు. పాప హాలులో ఆడుకుంటూ ఉంది. ‘అమ్మలూ స్నానం చేసి వస్తా!’ అని చెప్పి నేను లోపలికి వెళ్లాను. పది నిమిషాలయ్యాక వచ్చి చూస్తే తను లేదు… పరుగున బయటకొచ్చి చూసినా కనిపించలేదు. చివరికి స్విమ్మింగ్‌పూల్‌లో తేలుతూ కనిపించింది. ప్రాణంతో లేదని మనసు చెబుతున్నా ఏదో ఆశతో ఆసుపత్రికి తీసు కెళ్లాను. అది అడియాసే అయ్యింది. తను లేనిదే అడుగుబయట పెట్టని ఈ అమ్మని విడిచి… తనొక్కతే తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయింది! ఆ తర్వాత ఏం జరిగిందో రోజులెలా గడిచాయో కూడా నాకు తెలీదు. మగతగా నిద్రలోకి జారుకోవడం, మెలకువ వస్తే వెక్కివెక్కి ఏడవడం- అంతే. ఎటుచూసినా నా చిట్టితల్లే… దాని అమాయకమైన నవ్వే కనిపించేది. దాదాపు పిచ్చిదాన్నయిపోయాను.
పిల్లల కోసమే వెళ్తాను
నేను కోలుకోవడానికి రెండేళ్లు పట్టింది. నందన లేని లోటుని మెల్లగా సంగీతంతో పూడ్చుకోవడం మొదలుపెట్టాను. పేదకళాకారుల కోసం మా పాప పేరుతో ‘స్నేహ నందన’ ట్రస్టు మొదలుపెట్టాను. దాని ద్వారా సుమారు పాతికమంది కళాకారులకి నెలనెలా పెన్షన్‌ ఇస్తున్నాను. అంతేకాదు, అప్పటి నుంచీ టీవీ పాటల పోటీలకి న్యాయనిర్ణేతగా ఇష్టంగావెళుతున్నాను. నిజానికి, షూటింగుల్లో ఉండే దుమ్మూధూళీ, లైట్ల వెలుగులూ- ఇవన్నీ నాకు పడవు. అయినా పిల్లలతో ఎక్కువ సమయం గడపాలనే అలా వెళు తుంటాను. వాళ్ల అల్లరినీ, నన్ను చూడగానే పరుగున వచ్చి ‘చిత్రా అమ్మా’ అంటూ చుట్టుకుపోయే అభిమానాన్నీ ఆనందంగా చూస్తుంటాను. పక్కనే కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పించుకుంటాను. వాళ్లకోసమనే సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాను. పిల్లల నోటివెంట ‘చిత్రా అమ్మా’ అన్న పిలుపు విన్న ప్రతిసారీ ‘నా నుంచి ఒకర్ని తీసుకెళ్లినా వందలమంది పిల్లల్నిచ్చావు దేవుడా!’ అనుకుంటూ ఉంటాను.

ఆ భూషణం వాళ్లదే…
పద్మభూషణ్‌ వార్త తెలిశాక నాకుగుర్తొచ్చిన మొదటి పేరు నందనే! పద్మశ్రీ వచ్చినప్పుడు తను నా పక్కనేే ఉన్న క్షణాలని బాధగా నెమరేసుకున్నాను. ఎస్పీబీగారు గుర్తొచ్చి ఆ బాధ మరింత పెరిగింది. తెలుగులో ఎలా పాడాలో నాకు నేర్పిన వారాయన. తెలుగు అక్షరాలు నా చేత దిద్దించారు. చ, ఛ-ని ఎలా పలకాలో బట్టీ పట్టించారు. ఆయన రాసిన ‘అ, ఆ’లు నా పాటల డైరీలో ఇంకా భద్రంగా ఉన్నాయి..! దేశవిదేశాల్లో ఎప్పుడు కచేరీలు చేసినా… ట్రూప్‌లో నేను తప్పనిసరిగా ఉండాలని పట్టుబట్టేవారు. అమ్మానాన్నలూ, నందనా, ఎస్పీబీ, నా గురువులూ… నాకు దూరమైన వీళ్లంతా ఏదోరకంగా నా వ్యక్తిత్వాన్నీ, సంగీతాన్నీ మలచినవారే. వాళ్లు దూరమైనా వాళ్ల జ్ఞాపకాలు నన్ను శిల్పంలా చెక్కుతూనే, వేలుపట్టి ముందుకు నడిపిస్తూనే ఉన్నాయి, ఉంటాయి. ఈ ‘పద్మభూషణ్‌’ మాత్రమే కాదు, నా జీవితం మొత్తం వాళ్లకే అంకితం!


నేనూ… వాళ్లూ!

రెహ్మాన్‌: రోజాలోని ‘నాగమణీ… నాగమణీ!’తో మొదలైంది రెహ్మాన్‌తో నా ప్రయాణం. అక్కడి నుంచి ‘మనసే తీయగా’(ఓకే బంగారం) దాకా మా కాంబినేషన్‌లో వచ్చిన పాటలు అక్షరాలా నూటపదహార్లు! ‘బొంబాయి’ హిందీ వెర్షన్‌ కోసం నేను పాడిన ‘కెహనాహి క్యా’ (తెలుగులో ‘కన్నానులే కలయికలు…’) పాటని ప్రసిద్ధ గార్డియన్‌ ఆంగ్ల పత్రిక ‘చనిపోయేలోపు వినాల్సిన 1000 పాటలు’ జాబితాలో చేర్చడం మా కాంబినేషన్‌కి దక్కిన అతిపెద్ద గౌరవం!
ఆమె పాటల వేదం!: చిన్నప్పుడు మా తమ్ముడికి ఉయ్యాలూపుతూ ‘ప్రియతమా… ప్రియతమా’ పాట పాడానని చెప్పాను కదా! అది సుశీలమ్మగారిదే. ఆ రకంగా ఆమె పాటతోనే సంగీతరంగంలోకి వచ్చాన్నేను. నేనో ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పగా విని… ఇంటికి పిలిచి మరీ ఆమె పాడిన పాటలు నాచేత పాడించుకుని ఆనందించారు!

ఆమె ప్రతిపాటా ఓ వేదంలా అభ్యసించాల్సిందేనని నమ్ముతాన్నేను.

అమ్మ… ఓ పుస్తకం: తెలుగూ, తమిళంలో పాడటం మొదలుపెట్టిన తొలిరోజుల్లో పాటకు తగ్గ భావాన్ని ఎలా వ్యక్తీకరించాలో నేర్చుకున్నది జానకిగారి పాటలతోనే! ఓసారి కచేరీ చేస్తుంటే జానకిగారు అకస్మాత్తుగా వేదికపైకి వస్తే బిత్తరపోయి… నోటమాట రాలేదు నాకు. ‘నీలాంటి కూతురు నాకుంటే ఎంత బావుణ్ణమ్మాయ్‌!’ అన్నారు ఆలింగనం చేసుకుంటూ

 

 

Artist V. Jayaprakash

ఫోన్‌ వచ్చినా వణికిపోయేవాణ్ణి!

టాలీవుడ్‌ తండ్రి పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచి… తెలుగు ప్రేక్షకుల మనసులో చెదిరిపోని స్థానం సంపాదించుకున్న నటుడు వి.జయప్రకాశ్‌. ‘నా పేరు శివ’తో తెలుగు తెరకు పరిచయం అయి వరుస సినిమాలతో దూసుకెళుతున్న ఈ నటుడి జీవితం ఆద్యంతం ఆసక్తికరం. పెట్రోల్‌ బంకులో పనివాడిగా జీవితం మొదలుపెట్టి వ్యాపారవేత్తగా, నిర్మాతగా, సినీ నటుడిగా ఎదిగారు. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న అనుభవాలూ ఎదురు దెబ్బలూ ఎందరికో పాఠాలు అంటారు జయప్రకాశ్‌. ఆ ఒడుదొడుకులన్నీ ఆయన మాటల్లోనే…
చాలామంది ‘డెస్టినీ’ అని మాట్లాడుకుంటుంటే నేను కొట్టి పారేసే వాడిని. మన కష్టమే మనల్ని ఒక తీరానికి చేర్చుతుంది, అనుకున్న చోట నిలబెడుతుంది అనుకునేవాడిని. ఎందుకంటే- నా జీవితంలో నేను చాలా అనుకున్నా… చేసేశా. కానీ, చివరికి నేను ఎన్నడూ ఊహించనీ, కోరుకోని నటనవైపు వచ్చి నటుడిగా స్థిరపడ్డా. బహుశా అదేనేమో డెస్టినీ అంటే… నా జీవితంలోకి తొంగి చూసుకుంటే అదే అనిపిస్తుంది.
మాది తమిళనాడుకు చెందిన మరాఠీ కుటుంబం. మా పూర్వీకులు నాగపట్టణం జిల్లాలోని శీర్గాళిలో స్థిరపడ్డారు. నాకు ముగ్గురు అక్కలు. నాన్నది ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాపారం. నా చిన్నతనంలో మాది సంపన్న కుటుంబమే. నేను పీయూసీకి వచ్చేసరికి నాన్న వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయారు. దాంతో వ్యాపారం తీసేసి ఓ చిన్న కంపెనీలో ఉద్యోగానికి చేరారు. చాలీచాలని ఆ జీతంతో కుటుంబాన్ని పోషించడానికీ, ఆడపిల్లల పెళ్లిళ్లు చేయడానికీ నాన్న ఎంతో కష్టపడేవారు. అవన్నీ దగ్గరగా చూసిన నాకు చదువు మీద ఆసక్తిపోయింది. దాంతో పీయూసీ తరవాత చదువు మానేశా. ఏదైనా పని చేసి మా కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నా. అలా చిన్న వయసులోనే చెన్నైకి వచ్చేశా. అక్కడ మా కజిన్‌ పెట్రోలు బంకు పెట్టాడని తెలిసి వెళ్లా. వాహనాల్లో పెట్రోల్‌ నింపే పని ఇచ్చాడు. కొంతకాలం అటెండర్‌గానూ చేశా. ఆ తరవాత క్యాషియర్‌గా నియమించారు. క్రమంగా మా కజిన్‌ మేనేజర్‌గా బాధ్యతలు అప్పగించాడు. ఆ చుట్టుపక్కల ఉన్న మరో నాలుగు బంకుల్ని చూసుకునే స్థాయికి వచ్చా. ఈ లోపులో బంకునిర్వహణకు కావల్సిన నైపుణ్యాలన్నీ వచ్చేశాయి. ఇంతలో నష్టాల్లో ఉన్న ఓ బంకును అమ్ముతున్నారని తెలిసింది. కొందామని వెళితే నేను దాచుకున్న డబ్బుకి ఇంకాస్త అవసరమవుతుందని అర్థమైంది. ఎలాగైనా దాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకున్నా. దాంతో మా ఊరు వెళ్లి నాన్నకి విషయం చెప్పి ఇల్లు అమ్ముదామని అడిగా. అప్పటికే నాన్న నష్టపోయి రాజీపడి బతుకుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇల్లు అమ్ముదామని అడగడం చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ, నామీదున్న నమ్మకంతో నాన్న మారుమాట్లాడకుండా సరే అన్నారు. అలా బంకు కొన్న నేను చాలా కాలం బాయ్‌ నుంచి మేనేజర్‌గా రకరకాల పనులు చూసుకునేవాడిని. దాన్ని అభివృద్ధి చేసి లాభాల బాట పట్టించడానికి నాకు పదేళ్లు పట్టింది. ఆ లాభాలతో డెయిరీ వ్యాపారం మొదలుపెట్టా. కానీ కొంత కాలానికి నష్టం వచ్చింది. అలాగని దాన్ని తలచుకుని బాధపడుతూ కూర్చోవడం నాకిష్టం లేదు. అంత కంటే మంచి వ్యాపారం ఏదైనా ఉంటుందా అని ఆలోచించినప్పుడు బిలియర్డ్స్‌ క్లబ్‌ గురించి తెలిసింది. అప్పటికి చెన్నైలో చాలా తక్కువ క్లబ్‌లు ఉన్నాయి. దాంతో ఓ ఖరీదైన ఏరియాలో బిలియర్డ్స్‌ క్లబ్‌ ఏర్పాటు చేశా. ఏడాది తిరిగే సరికి పెట్టుబడితోపాటు ఊహించని లాభాలు వచ్చాయి.

అదే మలుపు…
బిలియర్డ్స్‌ క్లబ్‌ నా జీవితాన్ని మలుపు తిప్పిందనే చెప్పాలి. దాని వల్ల నాకు సినీ రంగానికి చెందిన ప్రముఖులతో పరిచయాలు అయ్యాయి. అప్పటి వరకూ సినిమాల ఆలోచనే లేదు. అప్పుడప్పుడూ చూసేవాడిని అంతే. అయితే ఓ ఇద్దరు స్నేహితులు సినిమాలు చేద్దామని అడిగారు. దాంతో వారితో కలిసి ‘రోజా కంబైన్స్‌’ పేరిట నిర్మాణ సంస్థను మొదలుపెట్టి సినిమాలు తీశా. మొదట్లో వచ్చిన హిట్లు మాలో ఊపును పెంచాయి. అయితే చిన్న నిర్మాతగా రాణించడం మాత్రం చాలా కష్టమని అర్థమైంది. థియేటర్లు లభించక చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. కోట్లు పెట్టి ఉత్సాహంగా సినిమా తీసేవాళ్లం. తీరా విడుదల సమయానికి థియేటర్లు దొరక్క ఎంతో బాధపడేవాళ్లం. దాంతో కొన్నాళ్లకి సినీ రంగం నుంచి బయటకొచ్చి వ్యాపారాల మీద దృష్టి పెట్టా. కొంత కాలానికి నటుడు విజయ్‌కాంత్‌ ‘నేను కాల్షీట్లు ఇస్తా. ఓ సినిమా చేయండి’ అని అడిగారు. ఆయన మాట కాదనలేకపోయా. దాంతో 2001లో ఓ స్నేహితుడితో కలిసి ‘జీజే సినిమాస్‌’ సంస్థను ఆరంభించి ‘తవసి’ అనే సినిమా తీశా. దానికి మంచి పేరూ లాభాలూ వచ్చాయి. ఆ తరవాత పెద్ద నటులతో సినిమా తీసే అవకాశం వచ్చింది. అలానే మా బ్యానర్‌లోనే 2004లో హీరో విశాల్‌ను నటుడిగా పరిచయం చేశా. తెలుగులో ‘ప్రేమ చదరంగం’ పేరిట వచ్చిన ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. నిర్మాతగా మంచి పేరు ఎంత తొందరగా వచ్చిందో… అంతే వేగంగా ఆర్థికంగా నష్టాలు రావడమూ మొదలైంది. సరైన నిర్ణయాలు తీసుకోలేకనో మంచి కథలు ఎంచుకోకపోవడం వల్లనో సినిమాలు వరుసగా ఫ్ల్లాప్‌ అయ్యాయి. దాంతో ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. పొద్దుపొద్దునే ఫైనాన్సర్లూ, అప్పులు ఇచ్చిన వాళ్లూ ఇంటికొచ్చి డబ్బులు అడిగేవారు. బంకు దగ్గరకు వెళితే అక్కడ కొందరు నాకోసం కాచుకుని ఉండేవారు. వచ్చిన వాళ్లకి డబ్బులేదూ, నేను నష్టపోయా అని చెప్పడానికి నామోషీగా ఫీలయ్యేవాడిని. దాంతో వ్యాపారంలో వచ్చిన డబ్బులు వచ్చినట్టు అప్పులు తీర్చడానికి వాడేవాడిని. అయితే అప్పుడే ఓ పెద్ద బడ్జెట్‌ సినిమా తీసే అవకాశం వచ్చింది. ఆ సినిమా విడుదల అయితే అప్పులన్నీ తీరిపోయి గట్టెక్కుతాననిపించింది. దాంతో వ్యాపారాలు అమ్మేసి ఆ సినిమాకి పెట్టా. దురదృష్ట వశాత్తూ ఆ సినిమా విడుదల కాలేదు. దాంతో ఉన్న ఇల్లు తప్ప చేతిలో, బ్యాంకులో రూపాయి కూడా లేని పరిస్థితి వచ్చింది. ఆ బాధతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. ఫోన్‌ వచ్చినా వణికిపోయేవాడిని. అలాంటి పరిస్థితుల్లో ‘నా ఆటోగ్రాఫ్‌’ సినిమా తీసిన నా స్నేహితుడు చేరన్‌ తాను దర్శకత్వం చేస్తున్న ఓ సినిమాలో నటించమని అడిగాడు. నటించలేననీ, వేరే వాళ్లని తీసుకోమనీ చెప్పా. ‘లేదు నా సినిమాలో నువ్వే ముఖ్య పాత్ర పోషిస్తున్నావు’ అని బలవంతం చేశాడు. మొదటి రోజు సెట్‌కి వెళ్లా. కెమెరా ముందుకు వెళ్లగానే కాళ్లూ, చేతులూ వణకడం మొదలైంది. దాంతో షూటింగ్‌ మధ్యలోనే వదిలేసి ఇంటికొచ్చా. అయినా సరే మర్నాడు ఆ సీన్‌ నాతోనే చేయించాడు చేరన్‌. విడుదలయ్యాక సినిమాతోపాటు నా పాత్రకీ మంచి పేరు వచ్చింది. ఆ తరవాత మరికొందరు దర్శకులు అవకాశాలు ఇచ్చారుగానీ ఎవరూ డబ్బులు మాత్రం ఇవ్వలేదు. ఓ నాలుగైదు సినిమాల తరవాత నా నటనను చూసి అప్పుడు డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. రెండుమూడేళ్ల తరవాత నేను నటించిన ఓ సినిమాకి ఐదు జాతీయ అవార్డులు వచ్చాయి. ఊహించని స్థాయిలో అందులోని పాత్ర నాకు పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది. వ్యాపారవేత్త, నిర్మాత అనే విషయాలను దాటి నాలో ఓ నటుడు ఉన్నాడనే నమ్మకాన్ని నాకు కలిగించింది.
అప్పటి వరకూ తెలియదు
2014లో నేను టాలీవుడ్‌లో అడుగుపెట్టా. ‘రన్‌ రాజా రన్‌’లో శర్వానంద్‌ తండ్రిగా కూరగాయలు అమ్మే పాత్రలో నటించా. ఆ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఒకరోజు జీవీకే మాల్‌లో షాపింగ్‌కి వెళ్లా. వెళ్లిన దగ్గర్నుంచీ కనిపించిన వాళ్లు నన్ను చూసి నవ్వడం, దగ్గరికొచ్చి మాట్లాడటం, సెల్ఫీలు అడగడం చేస్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంకా తెలుగులో సినిమా విడుదల కూడా కాలేదు… నన్ను చూసి ఎవరు అనుకుంటున్నారో అని మనసులో భయపడ్డా. కాసేపటికి నా దగ్గరకు వచ్చిన కొందరు కాలేజీ పిల్లలతో అదే చెప్పా. ‘లేదు సర్‌… ‘నాపేరు శివ’లో మీరు కాజల్‌ తండ్రిగా నటించారు. మీ నటన చాలాబాగుంది’ అని చెప్పడంతో ఆశ్చర్యమేసింది.
తమిళంలో తీసిన ఆ సినిమాని తెలుగులోనూ విడుదల చేశారని అప్పటి వరకూ నాకు తెలియదు. రూమ్‌కి వెళ్లి గూగుల్‌లో వెతికితే అందులో నా పాత్రకి ఎన్నో మంచి రివ్యూలు వచ్చాయి. తెలుగులో నటించొచ్చు అనే ఆత్మవిశ్వాసం కూడా కలిగింది. ఆ తరవాత వచ్చిన ‘సరైనోడు’లో అల్లు అర్జున్‌కి తండ్రిగా నటించమని బోయపాటి శ్రీను అడిగారు. అంతేకాదు, తెలుగులో నన్నే డబ్బింగ్‌ చెప్పమన్నారు. దాంతో నేను సెట్‌లో రోజూ అసిస్టెంట్‌ డైరెక్టర్ల దగ్గర ట్యూషన్‌ చెప్పించుకుని తెలుగు స్పష్టంగా మాట్లాడటం నేర్చుకున్నా. అలా ఆ సినిమాకి డబ్బింగ్‌ చెప్పుకున్నా. అప్పట్నుంచీ మిగతా సినిమాలకీ చెప్పుకోవడం మొదలుపెట్టా. అఆ, అజ్ఞాతవాసి, జవాన్‌, వినయ విధేయరామ, చిత్రలహరి, జెర్సీ, అశ్వథ్థామ, వరల్డ్‌ఫేమస్‌ లవర్‌, తాజాగా వచ్చిన ‘వి’ సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలానే మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌, సీటీమార్‌, కపటధారి చిత్రాలు విడుదల కావల్సి ఉన్నాయి. నటనలోకి వచ్చాక నటుడిగా దొరికిన సంతృప్తి నాకు ఏ రంగంలోనూ దొరకలేదు. అందుకే మరో వ్యాపారంలోకి వెళ్లలేదూ, వెళ్లను కూడా.ఆ కోరిక తీరింది…

చాలామంది దర్శకులు ‘మా సినిమాలో మిమ్మల్ని తప్ప మరెవర్నీ తండ్రి పాత్రలో ఊహించుకోలేం’ అంటుంటారు. నటుడిగా నా జీవితంలో అంతకంటే పెద్ద ప్రశంస ఇంకేదీ ఉండదు. బీ నేను రజనీకాంత్‌కి వీరాభిమానిని. ఆయనతో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించాలని కలలు కనేవాడిని. ‘లింగ’లో ఆయనతో కలిసి నటించడంతో ఆ కోరిక తీరింది.
* దర్శకుడు శంకర్‌ ‘2.0’లో పక్షిరాజు పాత్రకు డబ్బింగ్‌ చెప్పమన్నప్పుడు భయమేసింది. నా వాయిస్‌లో బేస్‌ సరిపోదని కంగారుపడ్డా. కానీ శంకర్‌ దగ్గరుండి డబ్బింగ్‌ చెప్పించారు.


తను లేక నేను లేను…

మాది ప్రేమ వివాహం. నా భార్య బాగా చదువుకుంది. తొలినాళ్లలో నాకు పెట్రోలు బంకులో ఉద్యోగం ఇచ్చిన కజిన్‌కు సూపర్‌ మార్కెట్‌ ఉండేది. అప్పట్లో తను ఆ మార్కెట్‌ బాధ్యతలు చూసుకునేది. అక్కడ తనని మొదటిసారి చూసినప్పుడే ప్రేమలో పడిపోయా. మా ఇంట్లో మొదట కులాంతర వివాహానికి ఒప్పుకోలేదు. అమ్మానాన్నల్ని ఒప్పించి చివరికి పెళ్లి చేసుకున్నా. తను చాలా స్ట్రాంగ్‌ పర్సన్‌. వ్యాపారాల్లో నష్టపోయి బాధలో ఉన్నప్పుడు తనే బయటకు తీసుకొచ్చింది. అందుకే తను లేకపోతే నేను లేను అని గర్వంగా చెబుతా. పిల్లల విషయానికి వస్తే మాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దబ్బాయి నిరంజన్‌ ఆటోమొబైల్‌రంగం వైపు వెళ్లాడు. చిన్నోడు దుష్యంత్‌కి సినిమాలంటే చాలా ఇష్టం. ఓ సినిమాలో నటించాడు.

Hero Siddhu Jonnalagadda (‘Krishna and his Leela’ fame)

e5f1814a-65a2-4ff9-a55a-f577c6dd1a93

Artist Satyadev

4dac1f30-f346-415e-948b-f568bf3ebb04

 

అప్పుడు… రోజుకి రెండు గంటలే నిద్ర!

కొవిడ్‌ కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. ఇదే సమయంలో ఓటీటీలో కొన్ని సినిమాలు విడుదలవుతున్నాయి. అవ్వడమే కాదు, మంచి ఆదరణనీ పొందుతున్నాయి. సత్యదేవ్‌ కంచరాన నటించిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య…’ కూడా ఆ కోవలోకి వస్తుంది. చిన్న పాత్రలతో మొదలైన సత్య సినీ ప్రయాణం… స్వల్ప వ్యవధిలోనే కథానాయకుడి స్థాయికి చేరింది. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోవడం సత్యా ప్రత్యేకత. ఈ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తన సినిమా ప్రయాణం గురించి చెబుతున్నాడిలా…
సినిమా ఆలోచన…
ఎప్పుడెలా వచ్చిందో స్పష్టంగా తెలియదు. చిన్నప్పుడు చిరంజీవిగారి పాటలు పెడితే కానీ తినేవాణ్ని కాదట. ఊహ తెలిసినప్పట్నుంచీ సినిమానే కెరీర్‌ అనుకునేవాణ్ని. బ్యాక్‌ బెంచ్‌లో కూర్చునేవాణ్ని కానీ…80 శాతం మార్కులు వచ్చేవి. అది చాలు కదా, ఇంట్లో స్వేచ్ఛ ఇవ్వడానికి! నేను ఏ రంగంలో ఉన్నా రాణిస్తాననే నమ్మకం అమ్మానాన్నలకు ఉండేది. పుట్టి పెరిగింది వైజాగ్‌లోనే. కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ చేశాక అక్కడే కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించా. నా లక్ష్యం సినిమా. ఐశ్వర్యారాయ్‌ని ప్రేమించాలంటే ముంబయి వెళ్లాలి, అమలాపురంలో ఉంటే అవ్వదు కదా! అందుకే హైదరాబాద్‌ వచ్చా.

రాత్రి ఉద్యోగం పగలు సినిమా!
హైదరాబాద్‌లో ధైర్యంగా అడుగు పెట్టాలంటే ఒకటే మార్గం… ఉద్యోగం. అందుకోసమే ఐబీఎమ్‌లో జాబ్‌ సంపాదించా. రాత్రి ఉద్యోగం, పగలు సినిమా ప్రయత్నాలు. మధ్యలో బెంగళూరుకి బదిలీ అయింది. అప్పుడు వీకెండ్స్‌ ఆడిషన్స్‌ కోసం హైదరాబాద్‌ వచ్చేవాణ్ని. అలా ‘బ్లఫ్‌ మాస్టర్‌’ వరకూ దాదాపు ఆరేళ్లు ఉద్యోగం చేస్తూనే సినిమాల్లోనూ నటించాను. 2017లో ఇంట్లోవాళ్లకి చెప్పి ఉద్యోగం మానేశా. నిజానికి వాళ్లెప్పుడూ ఉద్యోగం చేయాల్సిందేనని చెప్పలేదు. సినిమా రంగంలో పరిస్థితులు మనం ఊహించినట్టుగా ఉండవు. అందుకే ఉద్యోగం చేస్తూనే సినిమా ప్రయత్నాలు చేశా. నిద్ర మానుకుని నా పేషన్‌ కోసం ప్రయత్నించేవాణ్ని. సినిమా కష్టాలని ప్రత్యేకంగా అంటుంటారు కానీ… కష్టాలు ఎందులో ఉండవు. చదువులోనూ, ఉద్యోగంలోనూ ఉంటాయి. నేను మాత్రం దేన్నీ కష్టంగా చూడలేదు. సినిమాలకీ, రాజకీయాలకీ విద్యార్హతలు ఏమీ ఉండవు. లక్షల మంది ప్రయత్నాలు చేస్తుంటారు.
అవకాశాలు దొరక్క వెనుదిరిగేవాళ్లూ అదే స్థాయిలోనే ఉంటారు. సినిమాల్లోకి వెళ్తున్నామంటే… ‘నువ్వేమైనా చిరంజీవి అవుతావా, వర్కవుట్‌ అవ్వదు’ అని ఉచిత సలహాలిస్తారు. చాలామంది ప్రయత్నం చేసి వచ్చేశారని చెబుతారు. వాళ్లు ఐదు కిలోమీటర్లు మట్టి దారిలో ప్రయాణం చేసొచ్చిన అనుభవం గురించే చెబుతారు. కానీ మరో ఐదు కిలోమీటర్లు వెళితే ‘హై వే’ వస్తుందేమో, ఆ దారీ చూడాలి కదా. చిన్నప్పట్నుంచీ నేను నమ్మింది ఇదే. అప్పుడు అలా ఎందుకు అనిపించేదో ఈ ప్రయాణం తర్వాత ఇంకా బాగా అర్థమైంది. ‘ఇందుకే కదా నేను
ఎవరిమాటా వినంది’ అనుకుంటుంటా.
మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌తో మొదలు…
సినిమా రంగంలో ఎవరితోనూ పెద్దగా పరిచయాలు లేకపోవడంతో ఆఫీసుల చుట్టూ ఫొటోలు పట్టుకుని తిరిగేవాణ్ని. పిలుపొస్తే ఆడిషన్లు ఇచ్చేవాణ్ని. ఆ టైమ్‌లోనే రిషీ ప్రసాద్‌ పరిచయమయ్యాడు. తను డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవాడు. ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ ఆడిషన్స్‌ జరుగుతున్నాయని అతడి ద్వారా తెలుసుకుని వెళ్లాను. అందులో ప్రభాస్‌కి స్నేహితుడిగా చేసే ఛాన్స్‌ వచ్చింది. పద్దెనిమిది రోజులు సిడ్నీలో ఉన్నాం. తొలిసారి తెరపై నన్ను నేను చూసుకున్న చిత్రమది. తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో మహేష్‌బాబుకి స్నేహితుడిగా కనిపించా. ‘అత్తారింటికి దారేది’లో ఓ ఫైట్‌లో కొన్ని సెకన్లు కనిపిస్తా. ‘ముకుంద’, ‘అసుర’ సినిమాల్లో నెగెటివ్‌ పాత్రలు చేశా. నటుడిగా రాణించాలనుకునేవాణ్ని తప్ప హీరో అవ్వాలనుకోలేదు.
నసీరుద్దీన్‌ షా, ప్రకాష్‌రాజ్‌… తమ పాత్రల్ని ఎలా పండించగలుగుతున్నారో అనుకునేవాణ్ని. ‘అసుర’ సమయంలో నటుడు రవివర్మ నా జీవితాన్ని మలుపుతిప్పే ఓ సూచన ఇచ్చారు. ‘నువ్వు భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నావ్‌’ అని అడిగారు. ‘నసీరుద్దీన్‌షా, ప్రకాష్‌రాజ్‌లాగా’ అని చెప్పినప్పుడు… ‘అలా కావాలంటే ఇంకో పదేళ్లు టైమ్‌ పడుతుంది. అప్పుడు పరిణతి వస్తుంది. ఈలోపు భిన్నమైన పాత్రలు చేయాలి. హీరో పాత్రలు ఎందుకు ప్రయత్నించకూడదు?’ అన్నారు. ‘లీడ్‌ రోల్స్‌ చేస్తే నిన్ను ప్రేక్షకులు చూసే విధానం కూడా మారుతుంద’ని చెప్పారు. ఆయన సలహాతోనే లీడ్‌ యాక్టర్‌ అవ్వాలనుకున్నాను.

జ్యోతిలక్ష్మి టర్నింగ్‌ పాయింట్‌
నా కెరీర్‌ని ‘జ్యోతిలక్ష్మి’కి ముందు-తర్వాత అని విభజించుకోవాలి. ఆ సినిమాతో నా ప్రయాణం మరో మలుపు తీసుకుంది. రవివర్మ గారూ నేనూ మాట్లాడుకున్న తర్వాత పది రోజుల్లోనే దర్శకుడు పూరీ జగన్నాథ్‌ గారి ఆఫీస్‌ నుంచి ఆడిషన్‌ కాల్‌ వచ్చింది. 500 మందిని పరీక్షించి నన్ను సెలెక్ట్‌ చేశారు. ఏ పాత్రకి అన్నది తెలీదు. అప్పటికి నా బరువు 90 కేజీలు. బరువు తగ్గాలన్నారు. రెండు నెలల్లో 16 కేజీలు తగ్గాను. అప్పుడు ఆఫీసుకి వెళితే ‘నా సినిమాలో హీరో నువ్వే’ అని చెప్పారు పూరీ సర్‌. ఏదైనా మనం బలంగా అనుకుంటే ఈ విశ్వం కూడా మనకు సహకరిస్తుందంటారు కదా… అదే జరిగింది. పూరీ సర్‌తో కలిసి చేసిన ‘జ్యోతిలక్ష్మి’ ప్రయాణమే కాదు, ఆయనతో పరిచయమే ఒక అద్భుతం. నేను ఉద్యోగం చేస్తున్నట్టు పూరీ సర్‌కి అస్సలు తెలియదు. 37 రోజులు నాన్‌స్టాప్‌గా చిత్రీకరణ జరిగింది. రాత్రంతా ఉద్యోగం, పగలంతా షూటింగ్‌. శని, ఆదివారాలు మినహా రోజుకి రెండు గంటలు మాత్రమే పడుకునేవాణ్ని. ఇప్పుడు తలచుకుంటే అలా ఎలా చేశానా అనిపిస్తోంది. ఆ సినిమా తర్వాత పరిశ్రమ నన్ను చూసే విధానమే మారిపోయింది. ఆ సినిమా చూసి ప్రకాష్‌ రాజ్‌గారు ‘మన వూరి రామాయణం’లో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా ఆర్‌.ఆర్‌. జరుగుతుండగా ప్రకాష్‌రాజ్‌ ఓ రోజు ఫోన్‌ చేసి నా నటనని ఇళయరాజా మెచ్చుకున్నారని చెప్పారు. ‘వామ్మో’ అనుకున్నా. పూరీగారు నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. ఎలాంటి సందేహం ఉన్నా ఆయన్ని అడుగుతాను. నా సినిమా రిలీజ్‌ అవుతుందంటే ‘ఆల్‌ ది బెస్ట్‌’ అంటూ మెసేజ్‌లు పెడతారు. రివ్యూలు బాగా వస్తే వాటిని నాకు పంపిస్తారు.  ఆయన చేతిమీద ఒక టాటూ ఉంటుంది. ‘నాట్‌ పర్మినెంట్‌’ అని. ఏదీ శాశ్వతం కాదు అని దానర్థం. అలాంటివి ఆయన్నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంటాయి. ఆయనోసారి మాటల్లో… ‘మా అమ్మగారికి నీ నటనంటే ఇష్టం. సత్యతో సినిమా చెయ్యి అంటుంటారు. నిర్మాత సిద్ధంగా ఉంటే నేనెప్పుడూ రెడీ సత్యా’ అన్నారు. అలా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో నాకు అవకాశం ఇచ్చారు.
అప్పుడు అనుకున్నాం కానీ…
జ్యోతిలక్ష్మి తర్వాత… క్షణం, అంతరిక్షం, ఘాజీ, బ్లఫ్‌మాస్టర్‌, బ్రోచేవారెవరురా, రాగల 24 గంటల్లో, సరిలేరు నీకెవ్వరు… ఇలా చాలా సినిమాలు చేశాను. వాటిలో కొన్ని లీడ్‌ రోల్సూ ఉన్నాయి. నేను నటించిన 47 డేస్‌, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఓటీటీలో విడుదలయ్యాయి. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘ఉమామహేశ్వర…’ నాకెంతో గుర్తింపు తెచ్చింది. ఇందులో నాది ఫొటోగ్రాఫర్‌ పాత్ర. నన్ను కొత్త ప్రేక్షకులకు పరిచయం చేసింది. 2016లో మలయాళంలో వచ్చిన ‘మహేషింతే ప్రతీకారమ్‌’కి రీమేక్‌ ఇది. హీరో తనకు ఎదురైన అవమానానికి ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడన్నది కథ. మలయాళంలో విడుదలైనపుడే దర్శకుడు ప్రదీప్‌ అద్వైతం ఈ సినిమా చూడమంటే చూశా. అద్భుత మనిపించింది. ఆ కథని తెలుగులో తీద్దామని నిర్మాతకోసం తిరిగాం. కానీ ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రయత్నాన్ని విరమించుకున్నాం. ఆ సమయంలో వెంకటేష్‌ మహా నాకో కథ వినిపించాడు. ఆ ప్రాజెక్టూ పట్టాలెక్కలేదు. తర్వాత తను ‘కేరాఫ్‌ కంచరపాలెం’ తీశాడు. దాంతో మహాకి మంచి పేరొచ్చింది. తర్వాత ఒకరోజు ‘మహేషింతే ప్రతీకారమ్‌’ని రీమేక్‌ చేద్దామని మెసేజ్‌ పెట్టాడు. నాకు చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా
అనిపించింది. కథని మహా తెలుగు వాతావరణంలోకి మార్చి అరకు నేపథ్యంలో తీసిన తీరు అద్భుతం.
పాత్రల్ని ఎంపిక చేసుకునేటప్పుడు- స్క్రిప్టు విన్నాక ఆ పాత్రలో ఇమడగలనో లేదో చూస్తాను. ఫిట్‌ అవుతాననిపిస్తే ఓకే చెబుతాను. ఇదివరకెప్పుడూ అలాంటి పాత్ర చేయకపోతే నాలోని నటుడిని సంతృప్తి పర్చడానికి చేస్తాను. కొత్తగా ఉంటే తక్కువ నిడివి పాత్ర చేయడానికీ రెడీ. ఏ పాత్రనైనా అంగీకరించాక అందుకు అవసరమైన స్కెలెటిన్‌ను మానసికంగా సిద్ధం చేస్తాను. దానికి దర్శకుడు జీవం పోస్తారు. వ్యతిరేక ఛాయలున్న పాత్రలూ, ముఖ్యమైన క్యారెక్టర్లూ, లీడ్‌ పాత్రలూ… ఇలా భిన్న రకాలుగా ప్రయాణం చేస్తున్నాను.
బీచ్‌ గాలి పట్టాల్సిందే!
నా వ్యక్తిగత జీవితంపైన వైజాగ్‌ ప్రభావం బలంగా ఉంటుంది. ఆ సముద్రం, బీచ్‌… అక్కడ కాసేపు ఒంటరిగా సేదతీరేటపుడు ఓ నిశ్శబ్దమైన గాలి మనసుని తాకుతుంది. అందుకే వీలున్నప్పుడల్లా అక్కడికి వెళ్తా. అక్కడ పుట్టి పెరిగినోళ్లలో కొంచెం వెటకారం ఉంటుంది. తెలిసినవాళ్లతో మాట్లాడే టపుడు నాలోనూ అది కనిపిస్తుంటుంది. మా ఉమామహేశ్వరుడిలాగా అప్పుడప్పుడూ ఉగ్రరూపం బయటికొస్తుంటుంది. కామన్‌ సెన్స్‌ లేకుండా ప్రవర్తించేవాళ్లని చూస్తే కోపం వస్తుంది. ఈ ప్రపంచంలో మనం మాత్రమే ఉన్నామన్నట్టుగా వ్యవహరిస్తుంటారు కొంతమంది. కారు పార్కింగ్‌ చేసే చోట, నీళ్లు వాడేచోట… ఇలా ప్రతిచోటా కనిపిస్తుంటారు. అలాంటివాళ్లకి గట్టిగా చెప్పాలనిపిస్తుంటుంది.
ఐబీఎమ్‌లో ఉద్యోగం మానేసేనాటికి నా నెల జీతం రూ.1.75 లక్షలు. అమెరికా పంపించడానికి వీసా కూడా సిద్ధం చేశారు. వర్చువల్‌ డిజైన్‌ ఆర్కిటెక్ట్‌ విభాగంలో టీమ్‌లీడర్‌గా ఉన్నాను. ఆ ఉద్యోగంలోనే కొనసాగుంటే అమెరికాలో స్థిరపడేవాణ్నేమో. కానీ నా జీవితాశయం అది కాదు. ఆర్థికంగా ఏ ఇబ్బందీ రాకూడదనే ఉద్యోగం చేశా తప్ప నా మనసంతా సినిమాపైనే. ఏ పనిచేసినా వంద శాతం న్యాయం చేయాలి… అనుకుంటా. ఉద్యోగం విషయంలో అదే చేశాను. నచ్చింది చేసినపుడు ఇంకాస్త ఎక్కువ కష్టపడాలన్నది నా పాలసీ. సినిమా విషయంలో ఇదే చేస్తున్నా!

- నర్సిమ్‌ ఎర్రకోటఇంకొంత…

నాన్న కేవీఎన్‌ ప్రసాదరావు.ఈనాడులో అడ్వర్టైజింగ్‌ విభాగంలో మేనేజర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఓ టీవీ ఛానల్‌లో పనిచేస్తున్నారు. అమ్మ లక్ష్మి గృహిణి. నా భార్య దీపిక. మేమిద్దరమూ ఒకే కాలేజీలో చదువుకున్నాం. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. తను సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేసేది. ప్రస్తుతం ఫ్యాషన్‌ డిజైనింగ్‌ రంగంలో ఉంది.
* పాటలు పాడటం ఇష్టం. ఒక మాదిరిగా పాడగలను.
* ఎంత పెద్ద హోటల్‌లో తిన్నా కూడా, కృష్ణానగర్‌లోని నారాయణ టిఫిన్‌ సెంటర్‌లో తినడం ఇష్టం.
* ఖాళీ దొరికినపుడు సినిమా కథలు రాసి పెట్టుకుంటా.
* చాలామంది నా వాయిస్‌ను మెచ్చుకుంటారు. ప్రభాస్‌మీద అభిమానంతో ‘సాహో’లో నీల్‌ నితిన్‌ ముకేష్‌కి డబ్బింగ్‌ చెప్పా. పూరీగారు నా కళ్లలోని నిజాయతీని చూసి ‘జ్యోతిలక్ష్మి’కి ఎంపికచేశారట.
* గాడ్స్‌ ఆఫ్‌ ధర్మపురి, లాక్డ్‌… వెబ్‌సిరీస్‌లలోనూ నటించాను. ప్రస్తుతం నాలుగు సినిమాలకు సంతకం చేశా!

 

Heroine Seeratkapoor

Heroine seeratkappor

Director Venu udugula

Direc venu udugula

Charecter Artist Srikanth ayyangar

Artist srikant ayyangar

Heroine Saloni Lutra

heroine saloni lutra