మహేష్‌బాబు… అందానికి చిరునామాగా గుర్తింపు పొందిన ఈ సూపర్‌స్టార్‌తో జోడీ కట్టడం ప్రతి హీరోయిన్ కల. మరి అతడు చేసిన హీరోయిన్లలో కొందరి గురించి చెప్పమంటే…. ఈ శ్రీమంతుడు ఎవరి గురించి ఏమంటాడంటే..
నా సలహా పాటిస్తోంది!
నేనూ సమంతా కలిసి ‘దూకుడు’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘బ్రహ్మోత్సవం’ సినిమాల్లో నటించాం. సామ్ ఎంత అందంగా ఉంటుందో అంత బాగా నటిస్తుంది కూడా. దూకుడు చేస్తున్నప్పుడే తనకో చిన్న సలహా ఇచ్చా. అప్పుడు ఏదో మాటల మధ్యలో ఎన్ని సినిమాలు చేసినా, ఎంత అనుభవం వచ్చినా సరే… మొదటి సినిమాలానే కష్టపడాలని చెప్పా అంతే. ఆ విషయాన్ని నేను మామూలుగానే చెప్పినా దాన్ని ఇప్పటికీ పాటిస్తోందని సమంత సినిమాలు చూసినప్పుడు అర్థమవుతుంది. ప్రతి సినిమానీ ఎంతో కష్టపడి చేస్తుందని ఆమె విజయాలు చెబుతాయి. బహుశా అందుకేనేమో… మా అమ్మాయి కూడా సమంతకు పెద్ద ఫ్యాన్.
సరదాగా ఉంటుంది….
‘సరిలేరు నీకెవ్వరు’ చేస్తున్నప్పుడు మా సినిమాకు ఫ్రెష్ ఫేస్ ఉంటే బాగుంటుందని దర్శకుడు రశ్మికను తీసుకున్నాడు. అప్పటివరకూ ఆమె చేసిన సినిమాలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నం. ఇందులో ఆమె కాస్త క్యూట్‌గానే కాదు, మాస్‌గానూ కనిపించాలి. పైగా అంతా సీనియర్‌నటులు. ఇలా అందరి మధ్యా దర్శకుడు చెప్పినట్లు నటించడం అంటే కాస్త కష్టమైనా తనని తాను నిరూపించుకుంది. సినిమాలో ఎంత సరదాగా నటించిందో సెట్‌లోనూ అంతే సరదాగా ఉండే మనిషి.
పేరులోనే ఉంది!
పూజ.. ఆ పేరే ఎంతో బాగుంటుంది. ‘మహర్షి’ సినిమాలో ఆమె పాత్ర పేరు కూడా అదే. అందం విషయంలో పూజ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదేమోనని అనిపిస్తుంటుంది. చాలా తక్కువ సమయంలోనే ప్రముఖ హీరోలతో నటించే అవకాశాలు అందుకుందని తెలుసు కానీ… తనతో కలిసి చేస్తున్నప్పుడే పూజ ఎంత టాలెంటెడ్ హీరోయినో అర్థమైంది.
తనంటేనే ఇష్టం…
ఇప్పటివరకూ చాలామంది హీరోయిన్లతో కలిసి నటించినా నేను ఇష్టపడే, మనసారా ప్రేమించే నాయిక మాత్రం నమ్రతే. చెప్పాలంటే తను కూడా నా హీరోయిన్లలో ఉంది. కొన్నేళ్లక్రితం మేమిద్దరం కలిసి చేసిన ‘వంశీ’ సినిమా వల్లే ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. పెళ్లయ్యాక తాను సినిమాలు మానేసినా… నేను మాత్రం షూటింగ్‌లు అయ్యాక ఇంటికి ఓ సగటు భర్తలానే వెళ్తా. తను కూడా ఓ సగటు భార్యలానే ఇల్లూ, పిల్లల బాధ్యతల్ని చూసుకుంటోంది. ఇవే మా బంధాన్ని ఎప్పుడూ నిలబెడుతున్నాయి.
నిరాడంబరత ఆమె సొంతం!
ఇప్పటివరకూ నేను చేసిన హీరోయిన్లలో అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మేమిద్దరం కలిసి ‘ఖలేజా’ చేశాం. ఆమెతో నటిస్తున్నప్పుడు చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. పెద్దపెద్ద సినిమాలు చేసి తనకంటూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు వచ్చినా… ఇప్పటికీ ఎంతో నిరాడంబరంగా ఉండే ఆమె తీరు నాకు నచ్చుతుంది.