ఇప్పుడు చాలా ధైర్యంగా ఉన్నా!
02-03-2019 23:43:56
02-03-2019 23:43:56
ఆమెకు… సున్నితమైన సినిమాలూ తెలుసు! రాటుదేలిన రాజకీయాలూ తెలుసు! సమాజాన్ని పీడిస్తున్న సమస్యలూ తెలుసు! యువతకు స్ఫూర్తిని పంచడమూ తెలుసు! ఆమే.. నగ్మా. ఒకప్పుడు టాప్ హీరోలందరితోనూ ఆడిపాడిన నార్త్ బ్యూటీ నగ్మా ‘నవ్య’తో చెప్పిన సంగతుల సమాహారం…
హాయ్ అండీ. ఈ మధ్య తెలుగు నేలపై తరచూ కనిపిస్తున్నారు…
నిజమేనండీ. నేను హీరోయిన్గా ఉన్నప్పుడు తెలుగువారు ఎలా గౌరవించేవారో, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కూడా అంతే గౌరవిస్తున్నారు. ప్రేమిస్తున్నారు. గుర్తిస్తున్నారు. ‘మనమ్మాయి’ అనే భావన చూపిస్తున్నారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. నేను పని చేసేటప్పుడు టాప్‌లో ఉండి ఉండవచ్చు. కానీ నా తర్వాత కొన్ని వందల మంది హీరోయిన్లు వచ్చారు. అయినా ఇప్పటికీ నన్ను అంతే గౌరవంగా చూడటం అనేది నేనెప్పుడో చేసుకున్న అదృష్టమే.
‘ప్రేమికుడు’, ‘ఘరానా మొగుడు’, ‘అల్లరి అల్లుడు’, ‘కిల్లర్’ వంటి సినిమాలు నిన్న మొన్న చేసినట్టే ఉంది.
మాక్కూడా మిమ్మల్ని నిన్న మొన్న హీరోయిన్గా చూసినట్టుంది. అప్పుడే లైఫ్ టైమ్ ఎఛివ్‌మెంట్ అవార్డు అందుకున్నారు…
నేను చేసిన పనికి దొరికిన గుర్తింపు అది. కళాకారులకు అవార్డులు ప్రోత్సాహాన్నిస్తాయి. ఎన్నో అవార్డులు అందుకున్నా. నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్యానెల్‌కు కూడా ఓ సారి జ్యూరీ మెంబర్‌గా వ్యవహరించాను. ఆ అనుభవంతోనే ఈ మధ్య టీఎస్సార్ నేషనల్ అవార్డులకు జ్యూరీలో ఉన్నా. సినిమా పరిశ్రమలో నా కృషిని గుర్తించి ఆయన నాకు లైఫ్‌టైమ్ ఎఛివ్‌మెంట్ ఇచ్చారు. కానీ అప్పుడే పుల్వామా దుర్ఘటన జరగడంతో ఆ వేడుకకు నేను హాజరు కాలేకపోయాను. జమ్మూ కశ్మీర్‌కి నేను ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ఇన్చార్జిగా చేస్తున్నా. నా ఆధ్వర్యంలో ఉన్న స్టేట్‌లో, అందులోనూ అంతమంది జవాన్లకు జరిగిన అన్యాయాన్ని కళ్లారా చూసిన తర్వాత ఈ అవార్డు వేడుకకు రావాలనిపించలేదు.
నగ్మా సున్నితమనస్కురాలని అంటారు. రాజకీయాలు మీకెలా సాధ్యమయ్యాయి?
ఆ ప్రస్థానం కూడా తెలుగు నేల మీద నుంచే మొదలైంది. 2003లో నేను కాంగ్రె్‌సలో జాతీయ స్థాయిలో స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేశా. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కోసం 115 మీటింగుల్లో పాల్గొన్నా. అలా ఒక్కో మెట్టూ ఎదిగి, ఇప్పుడున్న స్థాయికి చేరుకున్నా.
రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత మీలో మీరు గమనించిన మార్పులేంటి?
ధైర్యం. అంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా ధైర్యంగా ఉన్నా. సినిమాలు వేరు, రాజకీయం వేరు. సినిమాల్లో క్యూట్‌గా ఉంటాం. పాలిటిక్స్ అలా కాదు. ప్రజల్లోకి వెళ్లి సేవ చేయాలి. వాళ్ల మధ్యనే 24 గంటలూ ఉండాలి. నేను మీరట్ నుంచి 2014లో ఎంపీ ఎలక్షన్స్ కోసం లోక్‌సభకు పోటీ చేశా. చాలా టఫ్ ఎలక్షన్ అది. అయినా ఆ సమయంలో రాహుల్‌గాంధీ నాకు అవకాశం ఇచ్చి, అక్కడ నిలుచోమన్నారు. నాకేమో అక్కడి ప్రజలు కొత్త. ఆ పరిస్థితులు కొత్త. అయినా పోటీచేశా. ఆ వాతావరణం నిజంగా నాలో చాలా మార్పు తెచ్చింది. మొండి ధైర్యాన్నిచ్చింది.
సినిమాల్లో కూడా వివిధ భాషా పరిశ్రమల మధ్య చాలా తేడాలుంటాయి కదా?
ఎందుకు ఉండవు…! తేడాలుంటాయి. ఒక్కో భాషలో సినిమా ఒక్కో రకంగా ఉంటుంది. భావోద్వేగాలు, హైప్ వేరుగా ఉంటాయి. తెలుగు సినిమా అందమైన పువ్వు లాంటిది. చాలా సౌందర్యంగా ఉంటుంది. మలయాళం సినిమాలు ఇప్పటికీ నేచురల్‌గా అనిపిస్తాయి. తమిళ సినిమాల్లో ఇంకా ఆ హార్ష్నె్సని చూపిస్తున్నారు.
సినిమాలు, పాలిటిక్స్, సోషల్ సర్వీస్… ఇంత బిజీలోనూ మీరు అంత అందంగా ఎలా ఉన్నారు?
గ్లామర్‌గా ఉండాలని ఉండటం లేదు. స్ట్రెస్‌ని తలకి ఎక్కించుకోకపోతే ఎవరైనా ప్రశాంతంగా కనిపిస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలో అన్నీ జరుగుతుంటాయి. అటూ ఇటూ ఉన్న సమయంలోనూ మనం ధైర్యంగా ఉండాలి. స్ట్రాంగ్‌గా ఉంటేనే మనం అవతలివారికి సాయం చేయగలం. నీరసంగా, నిస్సత్తువగా ఉంటే, ఇతరులకు ఎలా సాయపడగలం? ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని స్ట్రాంగ్‌గా ఉండాలి.
ఆ మధ్య ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ టీచ్ చేసినట్టున్నారుగా?
మా అమ్మ ముస్లిం. మా నాన్న హిందువు. నాకు జాతీయ సమగ్రత పట్ల అవగాహన ఉంది. ఆచార్య రజనీష్ బుక్స్ కూడా ఇష్టం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి చెప్పమంటే.. అందులో ఓ బ్రీతింగ్ టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్‌ను చాలా ఏళ్లు టీచ్ చేశాను. అయితే ఒక టైమ్ తర్వాత అక్కడివారు గురూజీని కాస్తా దేవుడిగా పిలవడం మొదలుపెట్టారు. ఆయన దేవుడు కాదు, ఆయన మనిషే! ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడు. కానీ అంత మాత్రాన మనం వాళ్లని ‘దేవుడు’ అని అంటే ఎలా? సన్నటి గీతను మనం గుర్తించగలగాలి. వ్యక్తిని పట్టుకుని దేవుడిలాగా ఉన్నాడనడం వేరు. దేవుడే అయితే అది వేరే విషయం. అసలు మనిషి దేవుడు ఎలా అవుతాడు? అందువల్ల ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారితో నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఇప్పటికీ ఆ బ్రీతింగ్ టెక్నిక్ నాకు చాలా ఇష్టం.
మీకు టీచింగ్ చేయాలని ఎందుకు అనిపించింది?
ఓ మాట చెప్పనా… లైఫ్‌లో మీకు ఏది తృప్తినిస్తుందో అది చేసేయాలి. అది ఏ రంగమైనా సరే. ఒక్కోసారి మనకి ఒక్కోటి నచ్చొచ్చు. అప్పుడు అది ఎందుకు నచ్చింది? అని అడిగితే నేను ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు నచ్చింది కాబట్టి చేశాను. నాకు సినిమా చూడాలనిపిస్తే చూస్తాను. తినాలనిపిస్తే తింటాను. క్లాస్ తీసుకోవాలనిపిస్తే తీసుకుంటాను. నేను ఓ సారి క్లాత్స్ స్టోర్ ఓపెన్ చేశా. చాలా పెద్ద సక్సెస్ అయింది. ఆ తర్వాత మూసేశాను. ‘ఎందుకు మూసేశారు’ అని అడిగితే నేనెందుకు సమాధానం చెప్పాలి. నేను చేసే పనివల్ల సమాజానికి అసౌకర్యం కలిగితే అది తప్పే. అంతే తప్ప, మంచి పనులు చేయాలనే ఇష్టం ఉంటే చేయడంలో తప్పేముంది? అంతెందుకు.. ఒక భాషలో మంచి అవకాశాలున్నప్పుడు మరో భాషకు ఎందుకు వెళ్లాలి? అనేది కూడా అప్పట్లో నాకు తరచూ ఎదురైన ప్రశ్న. ‘అందులో తప్పేముంది’ అనేది నా సమాధానం. ఇన్ని భాషల్లో ఇంత ఎక్స్పీరియన్స్ చేయదగ్గ అవకాశం కళ్ల ముందు ఉన్నప్పుడు నేనెందుకు వదులుకోవాలి? కొంత మందికి ఛాయిస్ ఉండకపోవచ్చు. కానీ నాకు ఛాయిస్ ఉందిగా. అది భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదమని అనుకుంటున్నా.
తెలుగులో ఇంత కచ్చితంగా అభిప్రాయాలు చెబుతున్నారు. మీరిక్కడ సినిమాలు చేస్తున్నప్పటి నుంచే ఇంత బాగా మాట్లాడేవారా?
నాకు ఎక్కువ భాషలు నేర్చుకోవడం అంటే ఇష్టం. అందులోనూ టాప్ హీరోల పక్కన నటిస్తున్నప్పుడు ముందస్తు రిహార్సల్స్ పెద్దగా ఉండేవి కావు. వాళ్లు స్పాట్లో చాలా ఇంప్రొవైజ్ చేసేవాళ్లు. అప్పుడు దాన్ని ఆకళింపు చేసుకోవాలంటే మనకు ఆ భాష తెలియాలి. అందులోనూ ప్రతి భాషకూ ఒక సంస్కారం ఉంటుంది. దాన్ని గ్రహించాలి. మనం ఒక పనిచేసినప్పుడు మనకు కేపబిలిటీ, కెపాసిటీ లేకపోతే ఎలా? అందరికీ అన్ని అవకాశాలు దొరకవు. దొరికినప్పుడు తప్పకుండా జాగ్రత్తగా, బాధ్యతగా ఆ పనిని పూర్తి చేయాలి.
మీతో పనిచేసిన స్టార్స్‌ని ఇప్పటికీ కలుస్తుంటారా?
పరిశ్రమలో మీకు స్నేహితులెవరు?
ప్రతిరోజూ మాట్లాడటం కుదరదు. కాకపోతే ఒక వ్యక్తితో ఒకసారి మాట్లాడితే, మనకు తెలియకుండా వారితో ఒక బంధం ఏర్పడుతుంది. ఆ బంధం నిలబడాలంటే ప్రతిరోజూ మాట్లాడాల్సిన పనిలేదు. అరుదుగా కలిసినప్పటికీ పాత స్నేహంలాగా అనిపిస్తుంది. అది మళ్లీ మనకు అప్పటి రోజులను గుర్తుచేస్తుంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, రజనీకాంత్, షారుఖ్, సల్మాన్, అక్షయ్, సంజయ్‌దత్.. ఇలా చాలా మంది టాప్ హీరోలతో పనిచేశా. వాళ్లను ఎప్పుడు కలిసినా నన్ను గొప్పగా గౌరవిస్తారు.
మీ పెళ్లి మాటేమిటి?
దేవుడు పెళ్లి జరగాలని రాసిపెట్టినప్పుడు తప్పకుండా జరుగుతుంది. ఎవరి జీవితంలో పెళ్లి ఎప్పుడు కావాలి? అసలు ఉంటుందా? లేదా?… ప్రతిదీ దేవుడు ముందే రాసిపెడతాడు. నేను దాని గురించి డిసైడ్ చేయాల్సింది ఏముంది? నేను మ్యారేజ్‌కి వ్యతిరేకం కాదు.
త్వరలోనే మిమ్మల్ని అల్లు అర్జున్-త్రివిక్రమ్ చిత్రంలో సినిమాలో చూడబోతున్నామని వార్తలొస్తున్నాయే..
నన్నెవరూ సంప్రతించలేదు. ఎవరు అలాంటి న్యూస్ స్ర్పెడ్ చేస్తున్నారో కూడా నాకు తెలియదు. తెలుగులో ఓ థ్రిల్లర్ సినిమా కోసం కొందరు అప్రోచ్ అయ్యారు. ఆ కథ నచ్చింది. కానీ నేను కొన్ని మార్పులు చెప్పాను. వాళ్లు దాని మీద పనిచేస్తున్నారు. అంతా పూర్తయ్యాక సంతృప్తికరంగా అనిపిస్తే తప్పకుండా చేస్తాను. మంచి బ్యానర్లలో సినిమాలు చేయాలని నాకూ ఉంది.
మేమిద్దరం బిజీ… బిజీ..!
మా చెల్లెలు జ్యోతిక చాలా బిజీగా ఉంది. ఈ మధ్యనే తన కొత్త చిత్రం కూడా మొదలైంది. ఆ సినిమాలో గవర్నమెంట్ స్కీమ్, స్కూల్ స్కామ్ గురించి కూడా చెప్తున్నారనుకుంటా. మేం కలిసినప్పుడు అన్నీ మాట్లాడుకుంటాం. తనేమో తన కమ్‌బ్యాక్ సినిమాలతో బిజీ. నేనేమో ముంబై నుంచి లోక్‌సభకు పోటీ చేయాలనే పనుల్లో బిజీ.
అలా మాట్లాడితే ఊరుకోరు!
నా చేతిలో ఎప్పుడూ సెల్‌ఫోన్ ఉంటుంది. సెల్‌ని కేవలం మాట్లాడటానికే కాదు, సమాచారాన్ని తెలుసుకోవడానికి కూడా వాడుతుంటా. ఏ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? బూత్‌లో ఏమవుతోంది? వార్డులో ఏమవుతోంది? అని నిత్యం నేను అప్డేట్ అవుతూ ఉండాలి. ప్రతి స్టేట్‌లోనూ సమస్యలు ఉన్నాయి. వాటన్నిటినీ తెలుసుకోవాలి. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ ఎవరు ఏమడిగినా సమాధానం చెప్పగలగాలి. ఓ జాతీయస్థాయి పార్టీల్లో ఉన్నప్పుడు ఏం చెప్పినా సమగ్రంగా చెప్పాలి. అల్లాటప్పాగా మాట్లాడతానంటే మీడియా ఊరుకోదు.
పోజులెందుకు?
నేను నటించిన సినిమాల కోసం పోజులు ఇవ్వొచ్చు. కానీ సమాజానికి మంచి చేసిన ప్రతిసారీ ఫొటోలు తీసుకుని దాచుకోవాల్సిన అవసరం లేదు. నేను చేసే సేవ మూడో కంటికి తెలియాల్సిన అవసరం ఏంటి? సాయం పొందిన వారికి తెలిస్తే చాలుగా! అందరికీ డప్పు కొట్టి చెప్పుకోవడం నాకు నచ్చదు. ఇవాళ చేసిన సాయం గురించి పది రోజుల తర్వాత అడిగితే నాకే గుర్తుండదు.
మన కోసమే!
మానసికంగా మంచివాళ్లమైతే, ఆ మంచితనం బయటకు కూడా కనిపిస్తుంది. బ్యూటీ అనేది లోపల నుంచే ఉంటుంది. బయట మంచిగా కనిపిస్తూ, లోపల చెడు ఆలోచనలతో మగ్గిపోతూ ఉంటే మనలో ఉన్న అయోమయం, ఆ కన్ఫ్యూజన్ ఎదుటివారికి తెలిసిపోతుంది. పగలు ఒక పనిచేసినప్పుడు… రాత్రి ఆ పని మనకు గుర్తుకొస్తే తృప్తిగా నిద్రపోవాలి.
టైమ్‌కి తినొచ్చు, కొన్నిసార్లు తినకపోవచ్చ.. తీరిక దొరక్కపోవచ్చు. ఏదైనా కావచ్చు. కానీ మన ఆరోగ్యం మనకు కీలకం అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇదంతా ఇంకెవరి కోసమో చేస్తున్నట్టు ఫీల్ కాకూడదు. మన కోసం, మన శరీరం కోసం, మన ఆత్మశాంతి కోసం చేస్తున్న పనిగా గుర్తించాలి.
అప్పియరెన్స్ ముఖ్యం
నన్ను నేను నిర్లక్ష్యం చేసుకున్నాననుకోండి… నన్ను చూసిన వారు ‘అరే! నగ్మా చూడు! ఎలా ఉండేది… ఎలా అయిపోయింది?’ అని కామెంట్ చేస్తారు. అలా అనుకునే అవకాశాన్ని నేను అవతలివారికి ఎందుకివ్వాలి? చూడ్డానికి ప్రెజెంటబుల్‌గా, నైస్‌గా ఉండాలి. ఎందుకంటే ఇవాళ అప్పియరెన్స్ చాలా ముఖ్యం. మనం యూత్ఫుల్నేషన్లో ఉన్నాం. యూత్ పర్సెంటేజ్ మన దగ్గర ఎక్కువగా ఉంది. మనవైపు చూసే యువతకు మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది కూడా కీలకాంశం. నిజానికి మనం ప్రతిసారీ స్పీచ్‌లు అదేపనిగా ఇవ్వక్కర్లేదు. కొన్నిసార్లు మన ప్రవర్తన ఎంతో చెబుతుంది. మరికొన్ని సార్లు యువత మధ్యలో నిలుచుని వారిని ప్రోత్సహించే విధంగా నాలుగు మాటలు చెప్పినా, అది కూడా సోషల్ సర్వీసే. నేను ఈ విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటా.
డా. చల్లా భాగ్యలక్ష్మి
ఫొటో: రామినేని రాజ్‌కుమార్