గీతరచయిత ‘శ్రీమణి’

lyricist sreemani 1 lyricist sreemani 2

 

 

ప్రేమ వాళ్లది..కవిత్వం నాది! 
పాటకు మణిహారం

ప్రేమలో పడ్డారంటే ఎవ్వరైనా కవి కావాల్సిందే. యువ రచయిత శ్రీమణి స్నేహితుల ప్రేమ కోసం కవిగా మారాడు. తన కవిత్వంతో ఎన్నో ప్రేమకథల్ని కంచికి చేర్చాడు. ఆ అనుభవమే ఆయన్ని ప్రేమ పాటల స్పెషలిస్టుగా మార్చేసింది. చిత్రసీమలో కొత్త కలాల పదునెంతో చాటి చెప్పిన రచయితల్లో శ్రీమణి ఒకరు. పదాల్ని సరికొత్తగా పేర్చి… లోతైన భావుకతని నింపి… గుర్తుండిపోయే పాటలెన్నో రాశారు. ఇటీవల ‘మహర్షి’ కోసం ఆయన రాసిన పాటలన్నీ శ్రోతలకి చేరువయ్యాయి. శ్రీమణి విజయవంతమైన పాటల ప్రయాణం, ఆయన నేపథ్యం గురించి…

* పాటల రచయితగా ప్రయాణం ఎలా సాగుతోంది?
ఒక దశ నుంచి మరో దశలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతోంది. ‘మహర్షి’, ‘మిస్టర్‌ మజ్ను’ చిత్రాల్లోని గీతాలకు, ‘చిత్రలహరి’లోని ప్రేమవెన్నెల పాటకూ మంచి స్పందన వచ్చింది.

* పాటలు మొత్తం రాయాలన్నప్పుడు ఎదురయ్యే సవాళ్లేంటి?
మహేశ్‌బాబుకు ఒక పాట రాస్తే చాలనుకొన్నవాళ్లలో నేనూ ఉన్నా. మహర్షికి పాట రాయడం మొదలు పెట్టగానే… దర్శకుడు వంశీ ‘మొత్తం మీరే రాయండి’ అన్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ ప్రోత్సహించారు. ‘లవ్‌ ఫెయిల్యూర్‌’, ‘రైట్‌ రైట్‌’, ‘తొలిప్రేమ’, ‘మిస్టర్‌ మజ్ను’… చిత్రాలకు మొత్తం పాటలు రాశాను. ఎక్కువగా ప్రేమ నేపథ్యంలో పాటలు రాయడానికి ఇష్టపడేవాణ్ని. కాలేజీలో రాసిన ప్రేమకవిత్వమే కారణం. ప్రేమలో పడిన నా స్నేహితులు నాతో కవిత్వం రాయించుకొని తీసుకెళ్లేవాళ్లు. ప్రేమ వాళ్లది… కవిత్వం నాది అన్నమాట (నవ్వుతూ). నేను మాత్రం ప్రేమలో పడలేదండి. ‘మహర్షి’ సినిమా ప్రయాణం చాలా నేర్పింది. మొదటి పాటలో హీరో గెలుపుని చెబుతున్నా. విరామం సమయంలో వచ్చే పాటలో ఇదేనా నీ గెలుపు? అని ప్రశ్నిస్తా. పదరా పదరా… పాటతో ఇది కదా నీ దారి అని చెబుతున్నా. పతాక సన్నివేశాలకి వచ్చేసరికి ఇది కదా గెలుపంటే అని ఒక చిన్న సంతృప్తితో…  విజయానికి నిర్వచనం చెబుతాను. గమనిస్తే సినిమా కథంతా ఈ నాలుగు పాటలతో ప్రయాణమవుతుంది. నాకు ఇలాంటి అవకాశం నిజంగా ఒక పెద్ద సవాల్‌.  దర్శకుడు, సంగీత దర్శకుడు, కథానాయకుల ప్రోత్సాహంతో దాన్ని పూర్తిచేశా.

* అవకాశాల కోసం మీరు పడిన పాట్లు..?
పోరాటం చేయకుండా ఏదీ సులభంగా రాదు. హైదరాబాద్‌ వచ్చిన తొలినాళ్లలో ఒక పక్క సినిమా ప్రయత్నాలు చేస్తూ, మరో పక్క పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలు వెతుక్కున్నా. సాయంత్రం ఆరు నుంచి రాత్రి 11 వరకు పిజ్జా డెలివరీ బాయ్‌గా చేశా. అపోలో ఆస్పత్రిలో బి పాజిటివ్‌ అనే మేగజైన్‌కి సర్కులేషన్‌ మేనేజర్‌గా పనిచేశా. అలా ‘ఆర్య2’ సమయంలో కాశీ అనే ఒక స్నేహితుడి వల్ల తోట శ్రీనివాస్‌ పరిచయమయ్యారు. ఆయనవల్ల దర్శకుడు సుకుమార్‌కి సాహిత్యం అంటే ఎంత ఇష్టమో తెలిసింది. ఆర్య2 సినిమాలో సందర్భాలకి తగ్గట్టుగా నాకు నేను ఊరికే పాటలు రాసిచ్చాను. అవి నచ్చి ‘100% లవ్‌’ చిత్రంలో సుకుమార్‌గారు అవకాశం ఇచ్చారు.

*పాటకి ఎంత శక్తి ఉందా అని మీకనిపించిన మొదటి సంవత్సరం ఏమిట?
‘100 % లవ్‌’లో ‘అహో బాలు… పాటతో నా సినిమా ప్రయాణం మొదలైంది. ఇప్పటివరకు 300కి పైగా పాటలు రాసుంటా. ‘సెగ’ చిత్రంలో వర్షం ముందుగా… అంటూ సాగే పాటను దామినిగారు ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో పాడారు. అది నచ్చి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చాలా బాగుందని నన్ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. దాంతో ఈటీవీ, ఈనాడుల్లో ఆ పాట గురించి నా ఇంటర్వ్యూ వచ్చింది. అది చూసే దర్శకుడు త్రివిక్రమ్‌గారు నాకు ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాలకి పాటలు రాసే అవకాశాన్నిచ్చారు. ఆ పాట గురించి ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో గుర్తు చేస్తుంటారు. అలా గొప్ప గొప్ప దర్శకులతో కలిసి పనిచేసే అవకాశాన్నిచ్చిన పాట అది.

* గీత రచయిత కావాలనే ఆలోచన ఎప్పుడు కలిగింది?
ఇంటర్‌మీడియట్‌ చదువుతున్నప్పుడు ‘వర్షం’ సినిమా పాటలు విడుదలయ్యాయి. ఆ పాటలే రచయిత కావాలనే లక్ష్యానికి బీజం వేశాయి. అంతకుముందు చిన్న చిన్న కథలు, వ్యాసాలు, పద్యాలు రాసి స్కూల్‌లో వినిపించేవాణ్ని.

* చిన్నప్పుడే రచనా వ్యాసంగంపై దృష్టి ఎలా మళ్లింది?
మాది ప్రకాశం జిల్లా చీరాల. అమ్మానాన్న నా చిన్నప్పుడే పోయారు. దాంతో అమ్మమ్మ రమణమ్మగారు, తాతయ్య కె.దత్తాత్రేయులుగారి దగ్గర పెరిగాం. చిన్నప్పట్నుంచీ నేను చదువుల్లో చురుకే. తాతయ్య శివభక్తుడు. స్తోత్రాలు చదివేవారు. అమ్మమ్మ రామాయణం పారాయణం చేసేవారు.  అలా వాళ్లిద్దరివల్లే పుస్తక పఠనం అలవాటైంది. ఆ అభిరుచే నన్ను ఇలా నడిపింది. డిగ్రీ తొలి ఏడాది పూర్తి కాగానే హైదరాబాద్‌కి వచ్చా. డిగ్రీ చదువుకుంటూనే గీత రచయితగా ప్రయత్నాలు మొదలు పెట్టా. నేనింత దూరం వచ్చానంటే కారణం మా అమ్మమ్మ, తాతయ్యలే.


* మన కథానాయకులు సాహిత్యంపై చూపుతున్న మక్కువ ఎంతో ప్రోత్సాహాన్నిస్తోంది. పవన్‌కల్యాణ్‌కి సాహిత్యం అంటే చాలా ఇష్ట్టం. ‘అజ్ఞాతవాసి’కి పనిచేస్తున్నప్పుడు ‘ధగ ధగ…’ అనే  పాట గురించి చర్చించడానికి వెళ్లా. ఆ సందర్భంలో ఆయన సాహిత్యం గురించి చెప్పిన మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాగే మహేశ్‌బాబు పదాల లోతు తెలుకుంటూ ఉంటారు.
* దర్శకుల్లో సుకుమార్‌ ఒక ప్రయోగశాల అయితే… త్రివిక్రమ్‌ ఓ పాఠశాల. సుకుమార్‌తో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు. త్రివిక్రమ్‌తో ప్రయాణంలో ఎన్ని పాఠాలైనా నేర్చుకోవచ్చు. దిల్‌రాజుగారి ప్రోత్సాహం గొప్పగా ఉంటుంది.