తెలుగు కథ… హిందీ సినిమా!

తెలుగు కథ… హిందీ సినిమా!
 

ఎఫ్‌2, ఆర్‌ఎక్స్‌ 100, అర్జున్‌రెడ్డి… ఇవి తెలుగు సినిమాలు మాత్రమే కాదు, హిందీలో రీమేక్‌ అవుతున్న మన కథలు కూడా! తెలుగు సినిమాలు ఇతర భాషల్లో రీమేక్‌ అవ్వడం, ఇతర భాషా కథలు తెలుగులోకి రావడం కొత్తేమీ కాదు గానీ, ఇటీవల కాలంలో మన కథలు మునుపెన్నడూలేని విధంగా ఇతర చిత్ర పరిశ్రమల్ని ఆకర్షిస్తున్నాయి. బాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండల్‌వుడ్‌… అందరూ తెలుగు కథని ఆసక్తిగా వింటున్నారు.

టాలీవుడ్‌లో సెన్సేషనల్‌ హిట్‌
‘అర్జున్‌రెడ్డి’… బాలీవుడ్‌లో ‘కబీర్‌ సింగ్‌’ పేరుతో రూపొందుతోంది. ఈ సినిమా కథతోపాటు, దర్శకుణ్నీ బాలీవుడ్‌ తీసుకుంది. అర్జున్‌రెడ్డి దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా హిందీ వెర్షన్‌కీ దర్శకత్వం వహిస్తున్నాడు. షాహిద్‌ కపూర్‌, కియారా అడ్వాణీ నటీనటులు. గతేడాది విడుదలైన మరో సంచలన చిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’. ఈ సినిమా కూడా బాలీవుడ్‌ని ఆకర్షించింది. వెంటనే ఆ సినిమా హిందీ హక్కులు కొనేశారు అక్కడి నిర్మాతలు. వెనకటి తరం హీరో సునీల్‌ శెట్టి తనయుడు అహాన్‌ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. సంక్రాంతికి విడుదలై బ్లాక్‌బస్టర్‌ అయిన బొమ్మ ‘ఎఫ్‌2’ కూడా బాలీవుడ్‌కి వెళ్తోంది. ఈ సినిమాతో దిల్‌రాజు నిర్మాతగానూ అక్కడ అరంగేట్రం చేయబోతున్నారు. ఇవి మాత్రమే కాదు, ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ‘ఆపరేషన్‌ గరుడవేగ’ అదే బాటలో ఉంది. ఇంకా ఆ జాబితాలో గీత గోవిందం, గూఢచారి కూడా చేరబోతున్నాయి. మరోవైపు తమిళం, కన్నడలోనూ మన సినిమాలు తరచూ రీమేక్‌ అవుతున్నాయి. అర్జున్‌ రెడ్డి, ఆర్‌ఎక్స్‌100,  గీత గోవిందం వీటిని తమిళంలోనూ రీమేక్‌ చేయబోతున్నారు.

కలెక్షన్లు అదుర్స్‌…
గతేడాది బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాల్లో భాగీ-2, సింబా ఉన్నాయి. టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా నటించిన భాగీ-2 తెలుగులో వచ్చిన ‘క్షణం’ సినిమాకి రీమేక్‌ కాగా, సింబా… జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమా ‘టెంపర్‌’కి రీమేక్‌. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన ‘సింబా’ గతేడాది డిసెంబరులో విడుదలై బాక్సాఫీసు దగ్గర రూ.400 కోట్లు వసూలు చేసింది. భాగీ 2 రూ.250 కోట్లు రాబట్టింది. ఈ సినిమానే కాదు, టైగర్‌ ష్రాఫ్‌ తన కెరీర్‌ని తెలుగు సినిమా రీమేక్‌లతోనే నిర్మించుకున్నాడని చెప్పాలి. అతడి పరిచయ చిత్రం హీరో పంటీ(పరుగు), రెండో సినిమా భాగీ(వర్షం) కూడా తెలుగు రీమేక్‌లే. ఇవి మాత్రమే కాదు, రౌడీ రాథోర్‌(విక్రమార్కుడు), వాంటెడ్‌(పోకిరి) కిక్‌(కిక్‌)… ఇలా చాలా సినిమాలే మన దగ్గర్నుంచి అక్కడికి వెళ్లాయి. తమిళంలోనూ మన కథలు కనిపిస్తాయి. ఒక్కడు, నువ్వొస్తావంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, జయం… ఇలా చాలా ఉన్నాయి. కన్నడలోనూ అత్తారింటికి దారేది, కుమారి 21ఎఫ్‌, బృందావనం, దూకుడు లాంటి సినిమాలను రీమేక్‌ చేశారు.

కథ కోసమే…
ఒక సినిమాను తెరకెక్కించాలంటే కథే మూలం. అందుకే ఊహాత్మక కథలతోపాటు పుస్తకాలూ, వాస్తవ సంఘటనలూ, బయోగ్రఫీలూ… ఇలా అన్నిదారులూ వెతుకుతుంటారు సినీ రచయితలు. ఇలా తెరకెక్కించిన కథలు అన్నిసార్లూ విజయవంతమవుతాయని చెప్పలేం. అందుకే ఇతర భాషా చిత్రాలమీదా ఓ కన్నేసి ఉంచుతారంతా. అక్కడ ఏదైనా సినిమాకి హిట్‌ టాక్‌ వస్తే వెంటనే ఆ కథా హక్కుల్ని కొనేస్తారు. హిట్‌ అయిన కథల్ని ఎంచుకుంటే రిస్కు తక్కువ. ఒక విధంగా ఇది విజయానికి దగ్గర దారి కూడా. ఈ కథలకు రూ.2-6 కోట్లు చెల్లించి కథ మీద నమ్మకం ఉండటంవల్ల చిత్రీకరణకు మరింత ఎక్కువ ఖర్చు చేయడానికి సిద్ధమవుతుంటారు నిర్మాతలు. భాష ఏదైనాగానీ, కథ, తీసే విధానం భిన్నంగా ఉంటే కచ్చితంగా హిట్‌ అవుతుందన్న నమ్మకంతోనే రీమేక్‌లకు ఓటేస్తున్నారు. మన కథలతోపాటు స్టార్‌ హీరోల డబ్బింగ్‌ సినిమాలకూ మంచి డిమాండ్‌ ఉంటోంది. మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ సినిమాల హిందీ డబ్బింగ్‌ హక్కుల్ని రూ.10-20 కోట్లకు పైనే చెల్లించి తీసుకుంటున్నారు. యువ దర్శకులూ, రచయితలతో టాలీవుడ్‌ ఇప్పుడు టాలెంట్‌వుడ్‌ అయిపోయింది మరి!