దర్శకుడు ‘కె.ఎస్.ఆర్.దాస్’



ప్రముఖ సినీ దర్శకుడు కేఎస్ఆర్ దాస్ కన్నుమూత
గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
నేడు చెన్నైలో అంత్యక్రియలు
తెలుగు తెరపై కౌబాయ్ చిత్రాలకు ఆద్యుడు

చెన్నై, జూన్ 8 : యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరైన ప్రముఖ సినీ దర్శకుడు కేఎస్ఆర్ దాస్ (76) శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం అపోలో ఆస్పత్రికి వెళ్లిన దాస్ గుండెపోటుతో అక్కడే తుదిశ్వాసవిడిచారు. శనివారం చెన్నైలో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబీకులు తెలిపారు. సూపర్‌స్టార్ కృష్ణతో తెలుగులో తొలి కౌబాయ్ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’ రూపొందించిన దాస్‌కు మాస్‌కు నచ్చే యాక్షన్ చిత్రాలు తీస్తారనే పేరు.

నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన కేఎస్ఆర్ దాస్ అసలు పేరు కొండా సుబ్బరామదాసు. ఆయన తల్లిదండ్రులు శేషమ్మ, చెంచురామయ్య. తండ్రి వెంకటగిరి జమీందారీలో జమైదార్. దాస్ ఉద్యోగ జీవితం సినిమా హాల్లో బుకింగ్ క్లర్కుగా మొదలైంది. స్వాతంత్య్రానంతరం జమీందారీ వ్యవస్థ రద్దు కావడంతో దాస్ కుటుంబం కూడా రోడ్డున పడాల్సి వచ్చింది. అందుకే ఆయన ఎస్ఎస్ఎల్‌సీ వరకు మాత్రమే చదవగలిగారు. అనంతరం సినిమాల మీద మోజుతో చెన్నైకి చేరుకున్న దాస్ జీవిత ప్రస్థానం కూడా సినిమా కథను తలపించేలా వుంటుంది.

సీనియర్ నటి అంజలీదేవి ఆఫీస్ బాయ్ సూచనలతో మద్రాస్ రైలెక్కిన ఆయన.. ఆకలి మంటను చల్లార్చుకునేందుకు మంచినీటిని ఆశ్రయించిన రోజులెన్నో ఉన్నాయి. తర్వాత గౌరీ ప్రొడక్షన్స్ భావనారాయణ చలవతో.. ఆయన నిర్మించిన ‘బండ రాము డు’ సినిమాకు ఎడిటింగ్ అప్రెంటీస్‌గా పని చేశారు.ఆ శాఖలో శిక్షణ పొంది ‘రమా సుందరి’ సినిమాకు అసిస్టెంట్ ఎడిటర్‌గా పని చేశారు. అనంతరం ‘నువ్వా-నేనా’ సినిమాకు నెలకు రూ.250 జీతంతో ఎడిటర్‌గా పని చేశారు. 1966లో వచ్చిన ‘లోగుట్టు పెరుమాళ్లకెరుక’ దర్శకుడిగా ఆయన మొదటి సినిమా.

అందులో శోభన్‌బాబు, రాజశ్రీ హీరోహీరోయిన్లుగా నటించారు. హీరోగా శోభన్‌బాబుకు అదే తొలి సినిమా. అది ఘోర పరాజయం పొందడంతో దాస్ కొన్నాళ్లపాటు సినీరంగానికి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత.. హిందీ సినిమా ‘వఖ్త్’ను ‘రాజయోగం’ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. పేరుకు తగ్గట్టే ఈ సినిమా దాస్ యోగాన్ని మార్చేసింది. 1970లో అట్లూరి పూర్ణచంద్రరావు లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘రౌడీ రాణి’ నిర్మించారు. విజయలలిత టైటిల్ పాత్ర పోషించగా, ‘కరుణామయుడు’ ఫేం విజయచందర్‌ను హీరోగా పరిచయం చేశారు. ఆ సినిమా భారీ విజయాన్ని సాధించింది.

కృష్ణతో అత్యధికం..
దాస్ దర్శకత్వం వహించిన 102 సినిమాల్లో హీరో కృష్ణవే దాదాపు 40 చిత్రాలు ఉండటం విశేషం. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలిసినిమా.. ‘టక్కరి దొంగ-చక్కని చుక్క’. ఆ తరువాత.. మోసగాళ్లకు మోసగాడు, ఏజెంట్ గోపీ వంటి సూపర్ హిట్ సినిమాలు రూపొందించారు. ‘అల్లూరి సీతారామరాజు’ దర్శకుడు మధ్యలో చనిపోతే, దాన్ని కేఎస్ఆర్ దాసే పూర్తి చేశారు. హీరోయిన్లలో జయప్రదతో ఎక్కువ సినిమాలు తీశారు. ఎన్టీఆర్‌తో దాస్ తీసిన ‘యుగంధర్’ సంచలన విజయం సాధించింది. అక్కినేని నాగేశ్వరరావుతో తప్ప మిగిలిన హీరోలందరితో దాస్ పని చేశారు.

చిరంజీవితో బిల్లా-రంగా, రోషగాడు, పులి-బెబ్బులి సినిమాలు రూపొందించారు. రజనీకాంత్‌తో 4 చిత్రాలు రూపొందించారు. దాస్ దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘నాగులమ్మ’. దాస్ నిర్మించిన చిత్రాలు ఆర్థికంగా ఆయన్ని దెబ్బ తీయడంతో క్రమేపీ సినీ రంగానికి దూరమయ్యారు. తన చిత్రాలతో స్టార్‌లైన చాలామంది.. ఆనక తనను పట్టించుకోలేదని దాస్ తన చివరి ఇంటర్వ్యూలో ‘ఆన్‌లైన్’ వద్ద వాపోయారు. కాగా, దాస్ మృతి పట్ల టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేశారు.