నాన్నపోతే.. చుక్క కన్నీరు కార్చలా
‘రాక్షసి’, ‘మొండిది’, ‘రాతిగుండె’… వరుడు కావలెను సినిమా కథానాయిక భూమిక గురించి అందరూ అనుకునే మాటలివి! పనిలో దిగితే తననూ అలాగే అంటారంటుంది నవ యువ దర్శకురాలు లక్ష్మీ సౌజన్య. కాకపోతే, భూమికది ప్రేమ పోరాటమైతే… ఆ పాత్ర సృష్టికర్త సౌజన్యది బతుకు పోరాటం. సినిమా కథల్ని మించిన ఆ పోరాటగాథ తన మాటల్లోనే..
11 ఏళ్లకే ఎస్ఎస్సీ పాస్.. బాలిక రికార్డు! – 1995లో నా గురించి వచ్చిన ఓ వార్త హెడ్డింగ్ ఇది. మరో పదమూడేళ్ల తర్వాత మళ్లీ నా పేరు వార్తల్లోకెక్కింది. ఈసారి విభిన్నమైన కారణంతో. దాని శీర్షిక…తండ్రికి తలకొరివి పెట్టిన తనయ -అని. సరిగ్గా ఇంకో పదమూడేళ్లకి… కొత్త దర్శకురాలితో ‘వరుడు కావలెను’ – అన్న హెడ్డింగ్‌తో మరో వార్త వచ్చింది…
ఈ మూడు వార్తలకూ అటూ-ఇటూ ఉన్నదే నా జీవితం అని చెప్పాలి. ఆ వార్తల్లో ఇమడ్చని ఎన్నో కష్టనష్టాలూ, చూసిన జయాపజయాల పడుగూపేకే నా ఈ ప్రయాణం…స్వాతంత్య్రం తర్వాత గుంటూరు కరవు మండలాల నుంచి రాయలసీమ తుంగభద్ర నది పక్కన స్థిరపడ్డ రైతు కుటుంబాల్లో… మాదీ ఒకటి. నాన్నకి ఐదేళ్లున్నప్పుడే మా తాతయ్యవాళ్లు కర్నూలు దగ్గర్లోని వెంకటాపురం అన్న గ్రామానికొచ్చారట. నాన్న అక్కడే చదువుకుని ఎమ్మెస్సీలో గోల్డ్మెడలిస్టయ్యాడు. కాకపోతే 1970ల నాటి కర్నూలులోని యువకుల్లాగే అక్కడి ఫ్యాక్షన్ రాజకీయాలతో ఆయనకి పరిచయాలేర్పడ్డాయి. మా ఇంట్లోనూ తుపాకులూ బాంబులూ ఉండేవంటారు! ఆ తర్వాత నాన్న అవన్నీ వదిలేసి గుంటూరు నరసరావుపేటకొచ్చారు. నేను అక్కడే చదువుకున్నాను. మూడో తరగతి నుంచి నేరుగా ఐదో తరగతిలోకి, అట్నుంచటు ఏడుకి, తర్వాత ఏకంగా పదో తరగతిలోకి చేర్చుకున్నారు. ప్రత్యేక అనుమతులతో పదకొండేళ్లకే పదో తరగతి పరీక్ష రాసి పాసయ్యాను. నాన్న ప్రయివేటు ట్యూషన్లు చెప్పినా సరైన ఆదాయం లేకపోవడంతో పొలం పనులూ చేసేవారు. చిన్నప్పటి నుంచి నేనూ ఆ పనులన్నీ నేర్చుకున్నాను. మా అన్నయ్య నెలల బిడ్డగా ఉన్నప్పుడే ఏదో అంతుతెలియని వ్యాధితో కాళ్లూచేతులూ పడిపోయాయట. మాటలూ రాక మంచానికే పరిమితమయ్యాడు. అమ్మా నేనే తనకన్నీ చూసేవాళ్లం. ఆడపిల్లనైనా సరే పగలూ రాత్రని చూడకుండా సైకిల్‌మీద వెళ్లి ఇంటిక్కావాల్సిన సమస్తం తెచ్చిపెడుతుండేదాన్ని. ఈ పనుల వల్లో లేక నా స్వభావమే అంతేనేమో తెలియదు కానీ మా ప్రాంతంలో నేనో మగరాయుడిలా మారిపోయాను. దానికి మొండితనమూ జతైంది. అది ఎలా మొదలైందో చెబుతాను…
వార్డెన్ని కొట్టేశాను…
నాన్న తనలాగే నేనూ ఎమ్మెస్సీలో గోల్డ్మెడలిస్టుని కావాలని ఎంపీసీలో చేర్చారు. నాకేమో మ్యాథ్స్ అంటే చచ్చేంత భయం. నేను వద్దంటున్నా విన్లేదు. దాంతో లెక్కలపైనున్న భయాన్నంతా కోపంగా మార్చుకున్నాను. అప్పటికే టీనేజీలోకి వచ్చేశాను కదా… అబ్బాయిలెవరైనా వెకిలి వేషాలేస్తే చుక్కలు చూపించేదాన్ని. శ్రావణ శుక్రవారాలప్పుడు అనుకుంటా… అమ్మాయిలం అందరం ఓణీలు వేసుకుని వెళ్లేవాళ్లం. ఆ ఓణీలతో మేం నడిచి వెళ్లే అందం చూడాలనుకున్నాడేమో… మా క్లాసు తుంటరి ఒకడు మా సైకిల్ టైర్ల గాలి తీసేస్తుండేవాడు! మేం సైకిల్ తోసుకుంటూ వెళ్లడాన్ని సరదాగా చూస్తుండేవాడు. నాకెందుకో అనుమానం వచ్చి ఓ రోజు నిఘాపెడితే… అసలు నిజం బయటపడింది. అంతే… అసెంబ్లీలో నిలబెట్టి వాడికి లెఫ్ట్ అండ్ రైట్ పీకాను. మరోసారి, మా వార్డెన్ ఎందుకో కోపంతో నాలుక మడిచి కొట్టడానికి పైపైకి వస్తుంటే గెడ్డంకేసి గట్టిగా కొట్టాను. నోరంతా రక్తంతో నిండిపోయి విలవిల్లాడిపోయాడు. ఇలాంటివాటికి తోడు నా బుర్రకి మ్యాథ్స్ బొత్తిగా ఎక్కకపోవడంతో ఇంటర్ మొదటి ఏడాది ఫెయిలైపోయాను! ‘ఇంటికెళ్లి గేదెలు మేపుకోమ్మా’ అంటూ గేలిచేశారు అందరూ. అప్పటికి జ్ఞానోదయమై నాన్న దగ్గర బుద్ధిగా మ్యాథ్స్ నేర్చుకుని ఇంటర్ ముగించాను. ఇంతలో నాన్న నర్సరావుపేటలో నా పేరుతోనే ‘సౌజన్యా రెసిడెన్షియల్ స్కూల్’ అని పెట్టారు. ఆయనతోపాటూ నేనూ దాన్ని చూసుకోవడం ప్రారంభించాను. అందుకని డిగ్రీ కరస్పాండెన్స్లోనే చేశాను. ఉపాధ్యాయ వృత్తిలో తనకి తోడుగా నిలుస్తున్నానని నాన్న సంబరపడుతున్నప్పుడే… సినిమాలు నా దారిని మార్చాయి…
సినిమాలపైన మొదట్నుంచి నాకు పెద్ద ఆసక్తేమీ లేదు… ఊళ్ళో సెలవులప్పుడు నేలటికెట్టుతో పాత చిత్రాలు చూడటం తప్ప. కానీ లోలోపల నాకో దుగ్ధ ఉండేది. నాన్నకి ఉపాధ్యాయుడిగా ఎంత మంచి పేరున్నా బంధువులు ఆయన్ని బతకలేని బడిపంతులుగానే చూసేవారు. ప్రభుత్వోద్యోగులుగా
ఓ రోజు నాన్నకి ఈ విషయం చెబితే ‘ఇదేం పిచ్చి?! మనకి అందులో ఎవరు తెలుసని…?’ అంటూ వారించాడు. ఆయన వద్దనేకొద్దీ నాలో పట్టుదల పెరిగింది. ఆరునెలల తర్వాత ‘నువ్వు రాకపోతే పో… నేను హైదరాబాద్ వెళతాను!’ అని బయల్దేరబోయాను. చివరికి ‘ఇంత మొండితనం పనికిరాదు’ అని తిట్టి నన్ను హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆయన స్నేహితుల సాయంతో దేవదాస్ కనకాల యాక్టింగ్ స్కూల్లో చేర్చారు. అక్కడే యాంకర్ సుమతో నాకు పరిచయమైంది. మొదట్లో హాస్టల్లో ఉంటూ వచ్చిన నేను ఆ తర్వాత వాళ్లింట్లోకి మారిపోయాను. సుమతో కలిసి అప్పుడప్పుడూ షూటింగ్లకి వెళుతుండేదాన్ని. ఓ లోకల్ ఛానెల్లో న్యూస్‌రీడర్‌గా అవకాశం వస్తే చేరిపోయాను. ఆ తర్వాత ఈటీవీ, జెమిని టీవీల్లో యాంకరింగ్ చేశాను. అలా ఓసారి మహేశ్‌బాబునీ ఇంటర్వ్యూ చేసే అవకాశం దక్కింది. ఈ మధ్యలో దేవదాస్ కనకాల ఇన్స్టిట్యూట్ సాయంతో చెన్నైలోని అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో దర్శకత్వం కోర్సు కూడా చేశాను. ఆ తర్వాత చిన్నపాటి యాడ్స్ తీయడం ప్రారంభించాను. ఓసారి దూరదర్శన్ నుంచి పిలిచి ఓ యాడ్ చేయమన్నారు. ‘నేను చేయాలా?’ అని మొదట్లో తటపటాయించినా ‘దర్శకత్వం అన్నాక ఆడామగా అన్న తేడా లేదు. అన్నీ చేయాల్సిందే’ అనుకుని రంగంలోకి దిగాను… ఇంతకీ వాళ్లు చేసివ్వమన్నది ఓ కండోమ్ యాడ్..!
ది బెస్ట్ ‘ఏడీ’…
నేను చేసిన యాడ్ వెలుగులోకి రాగానే ‘ఈ యాడ్ ఎవరో అమ్మాయి చేసిందట!’ అన్న టాక్ యాడ్ రంగంలోనే కాదు… ఇటు సినిమాల్లోనూ వ్యాపించింది. ఆ యాడ్ చూశాకే దర్శకుడు తేజ తన ‘ధైర్యం’ సినిమాలో సహాయ దర్శకురాలిగా రమ్మన్నారు. అంతకన్నా కావాల్సిందేముంది… ఆ సెట్లో శాయశక్తులా శ్రమించి మంచి పేరు తెచ్చుకున్నాను. ఆ తర్వాత శేఖర్ కమ్ములగారి ‘గోదావరి’ సినిమాకీ పనిచేశాను. ఆ రెండు సినిమాలతో పరిశ్రమలో నాకు మంచి ‘ఏడీ’గా పేరొచ్చేసింది. మంచానికే పరిమితమైన మా అన్నయ్య చనిపోవడంతో అమ్మా నాన్నల్ని నా దగ్గరకి తెచ్చుకున్నాను. తర్వాత కృష్ణవంశీగారి దగ్గర చేరాను. జూనియర్ ఎన్టీఆర్ ‘రాఖీ’తో మొదలుపెట్టి మూడు సినిమాలకి పనిచేశాను. నాకు ‘రాక్షసి’ అని పేరుపెట్టింది ఆయనే!
కృష్ణవంశీగారి ‘శశిరేఖా పరిణయం’ సినిమాలో పనిచేస్తుండగానే… హైదరాబాద్‌లోని ఓ పెద్ద ప్రయివేటు ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది. ‘మీ నాన్నగారు ఇక్కడ చెకప్‌కి వచ్చారు. ఓసారి మీతో మాట్లాడాలి…’ అని చెప్పారు అక్కడి చీఫ్ డాక్టర్.
ఆయన మాటలే…
ఉరుకులు పరుగుల మీద అక్కడికి చేరుకున్నాను. ‘మీ నాన్నకి పాంక్రియాస్ క్యాన్సర్ వచ్చిందమ్మా… ఫోర్త్ స్టేజీ! ఆరు నెలలకన్నా బతకడం కష్టం’ అన్నారు డాక్టర్లు. మెదడంతా ఒక్కసారిగా మొద్దుబారిపోయింది… నిలువునా పాతాళంలోకి కూరుకుపోతున్నట్టే అనిపించింది. నాన్నని తీసుకుని ఇంటికెళ్లేలోపే- పెళ్ళి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. నాకో మగతోడు కావాలన్నది అందుకు కారణం కాదు. ‘ఒక్కగానొక్క కూతురికి పెళ్ళి చేయకుండా పోయాడే’ అన్న మాట నాన్నకి రాకూడదనుకున్నాను. ఆయన దగ్గరకెళ్లి ‘మీరు ఎవర్ని చూసినా ఓకే నాన్నా… తాళి కట్టించుకుంటాను!’ అన్నాను. నాన్న నావైపు సూటిగా చూసి ‘నిన్ను ఎవడో ఒకడి చేతుల్లో పెట్టి ‘నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో బాబూ!’ అని చెప్పేంత అబలగా నేను నిన్ను పెంచలేదు. దర్శకురాలివి కావాలి అన్న లక్ష్యంతో నువ్వు జర్నీ చేస్తున్నావు. అవసరమైతే ఆ ప్రయాణంలో చచ్చిపోకానీ… దాన్ని వదిలి మాత్రం రావొద్దు!’ అన్నాడు. ఆ మాటలకి ఆయన చేతులు పట్టుకుని భోరున ఏడ్చేశాను. నాన్న ఎంత ఠీవిగా చావుని ఆహ్వానించారంటే… తనని 51 ఏళ్లకే మరణం కబళిస్తున్నా ఏ క్షణంలోనూ భయపడ్డది లేదు. పైగా ‘నేను పోతే నువ్వు అందరిలా ఏడవకూడదురా సౌజీ! అన్ని పనులూ నువ్వే దగ్గరుండి చూడాలి. అమ్మకి పసుపుకుంకుమలు తీసే తతంగమంతా వద్దు… తన బొట్టు నాతోనే వచ్చింది కాదు… నాతో పోనూకూడదు’ అన్నారు. వైద్యులు చెప్పిందానికన్నా ఓ నెలముందే… ఓ రోజు రాత్రి ఒంటిగంటకి కన్నుమూశారు నాన్న. అప్పటికప్పుడు ఆయన భౌతికకాయంతో నరసరావుపేటలోని మా సొంతింటికెళ్లాను. తలకొరివి పెట్టడానికి – కొడుకు వరసైన అబ్బాయిలు తటపటాయిస్తుంటే… ఆ పని నేనే చేశాను. గుండెలో బాధ సుడులు తిరుగుతున్నా… నాన్నకిచ్చిన మాట ప్రకారం చుక్క కన్నీరు రానివ్వలేదు. కర్మ తర్వాత నాన్న కోరుకున్నట్టే అమ్మ చేతికి బంగారు గాజులు తొడిగాను. ఇరుగుపొరుగు నోళ్లు నొక్కుకున్నా పట్టించుకోకుండా అమ్మ బొట్టుని అలాగే ఉంచేశాను..!
నాన్న తన మరణాన్ని ఎదుర్కొన్న విధానం, స్త్రీలపైన ఆయనకున్న ఆ గౌరవం నా గుండెల్లో నిలిచిపోయాయి. వాటిలో నుంచి ఎన్నో కథలు పుట్టాయి..! ఆ కథల్నే ఊతంగా మార్చుకుని దర్శకురాలిని అయి తీరాలన్న పట్టుదలతో అడుగులేశాను. కథతో ఓ కామెడీ హీరో దగ్గరకెళితే ఆడవాళ్ల దర్శకత్వంలో చేయనని మొహానే చెప్పేశాడు. శర్వానంద్‌తో మరో సినిమా పట్టాలకెక్కినట్టే ఎక్కి ఆగిపోయింది. ఇన్ని ఇబ్బందులున్నా… మళ్లీ ఏడీగా వెళ్లదలచుకోలేదు. అలా వెళితే డబ్బొస్తుంది కానీ… ఎప్పటికీ దర్శకురాల్ని కాలేను అనిపించింది. దాంతో ఆర్థిక బాధలు చుట్టుముట్టాయి. చివరికి ఓ ఫ్రెండ్‌తో కలిసి చిన్న క్యాంటిన్ నడిపాను. సినిమా ప్రయత్నాలు ఏవీ కుదరక నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్న దశలోనే బాహుబలి ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు నన్ను నిర్మాత చినబాబు దగ్గరకు తీసుకెళ్లారు. ‘వరుడు కావలెను’ కథ చెప్పగానే ఆయనకి నచ్చింది. అప్పటి నుంచి నా తల్లిదండ్రుల తర్వాత నేను గౌరవించే వ్యక్తిగా మారారు! 2020లో మేం షూటింగ్ మొదలుపెట్టగానే కరోనా లాక్డౌన్, ఇతరత్రా కారణాలతో షూటింగ్ ఆగిపోయింది. మొదలయ్యాకా మళ్లీ ఎన్నెన్నో సమస్యలు. వాటన్నింటినీ దాటుకుని ఎన్నో ఏళ్ల నా కలని ఇప్పుడు సినిమాగా మీ ముందుకు తెచ్చాను. దీని ఫలితం నాకెంతో సంతృప్తినిచ్చినా.. నాన్న ఈ విజయాన్ని చూసుంటే బావుండేది అన్న బాధ మనసులోతుల్లో కదలాడుతూనే ఉంది.