నిర్మాత దిల్ ‘రాజు’

dil raju new producer dilraju

 

ఆ మాటిచ్చే సినిమాల్లోకి వచ్చా
మనసును తాకే కథలతో… మనీనిచ్చే సినిమాలు తీయడం ఆయనకు స్క్రిప్ట్‌తో పెట్టిన విద్య. అందుకే ఆయనను దిల్‌ రాజు అనడం కంటే… దిల్‌ దిమాక్‌ రాజు అంటే బాగుంటుంది. ఆయన జడ్జిమెంట్‌కు తిరుగుండదని సినీ పరిశ్రమ భావించే నిర్మాత, పంపిణీదారు. వంతులేసుకొని పదికిలోమీటర్లు సైకిల్‌ తొక్కుకుంటూ సినిమా చూసిన రోజుల నుంచి… పరిశ్రమలో 20ఏళ్ల ప్రస్థానం గురించి ‘హాయ్‌’తో ఎన్నో విషయాలు పంచుకున్నారు.

మీ దగ్గర ఉన్నన్ని కథలు ఎవరి దగ్గరా లేవని చెబుతుంటారు. అన్ని కథలున్నాయా?
ప్రస్తుతం 12 కథలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఎవరైనా వచ్చి కథ చెబితే, అందులో చిన్న పాయింట్‌ నచ్చినా, దాన్ని పట్టుకుని మరో కొత్త కథ రాయిస్తుంటాను. నవతరం దర్శకులతో పనిచేయడం నాకు చాలా ఇష్టం. వాళ్లు ఓపిగ్గా కూర్చుని కథలు రాస్తారు. మధ్యమధ్యలో నేనూ వాళ్లతో కూర్చుని, నా ఆలోచనల్ని పంచుకుంటుంటాను. ఒక్కో కథకు యేడాది నుంచి రెండేళ్ల సమయం పట్టొచ్చు. ఒక్కోసారి కథ పూర్తయ్యాక.. అలాంటి ఆలోచనతో మరో సినిమా వచ్చేయొచ్చు. లేదంటే… ఆ కథపై మనకున్న ఇష్టం తగ్గిపోవొచ్చు. అలాంటి కథలు చాలానే పక్కన పెట్టేశాం.
ఇక సినిమాలు వద్దు.. వెనక్కి వెళ్లిపోదాం అని ఇప్పుడైనా అనుకున్నారా?
96లో అలాంటి పరిస్థితి వచ్చింది. ‘ప్రియమైన శ్రీవారు’, సౌందర్య నటించిన ‘అరుంధతి’ సినిమాలు కొని నష్టపోయాను. తిరిగి ఊరెళ్లిపోయా. చిట్‌ ఫండ్‌ మొదలెట్టా. ఆ సమయంలో కాస్ట్యూమ్‌ కృష్ణగారు కలిశారు. కన్నడలో ‘అనురాగ సంగమం’ అనే సినిమా హిట్టయ్యింది. మీరు కొంటానంటే దాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తాం’ అన్నారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘పెళ్లిపందిరి’ పేరుతో రీమేక్‌ చేశారు. చాలా పెద్ద హిట్టయ్యింది. నేను పోగొట్టుకున్న డబ్బులన్నీ సంపాదించిపెట్టింది. ఆ తరవాత ‘తొలిప్రేమ’ కొన్నాను. ఆ సినిమాతో స్థిరపడిపోయాను. 1999లో సొంత ఆఫీసు పెట్టా. ‘ఒకే ఒక్కడు’ నా తొలి సినిమా. ‘నువ్వు వస్తావని’, ‘సఖి’ ఇలా పంపిణీదారుడిగా సోలోగా చేసిన మూడు సినిమాలూ బాగా ఆడాయి. ఆ విజయాలు నా ప్రయాణానికి బాటలు వేశాయి.
మా పిల్లోడిని హీరోని చేయండి, మావాడ్ని దర్శకుడ్ని చేయండి అంటూ మీ దగ్గరకు చాలా మంది వస్తుంటారు కదా! వాళ్లందరికీ ఎలా సర్దిచెబుతుంటారు?
మా కుటుంబ సభ్యులు చాలామంది సినిమాల్లోకి వస్తామంటారు. హీరో అవ్వాలని చాలామంది వచ్చారు. వాళ్లందరినీ కూర్చోబెట్టి వాస్తవ పరిస్థితుల్ని వివరించడానికి ప్రయత్నిస్తా. ఇప్పటి వరకూ హీరోగా ఎదిగి, విజయాలు సాధించినవాళ్లు ఎంత కష్టపడ్డారో, ఎదగలేని వాళ్లు ఎన్ని ఇబ్బందులు పడ్డారో పూస గుచ్చినట్టు చెబుతా. చాలామంది అర్థం చేసుకుంటారు. ఇంకొంతమంది మొండిగా హీరోలైపోయి, సినిమాలు మొదలెట్టి చేతులు కాల్చుకున్నారు. దర్శకత్వం ఆలోచనతో వచ్చినవాళ్లకూ ఇదే మాట.
చిన్నప్పుడు ఎలాంటి సినిమాల్ని ఎక్కువగా చూసేవారు?
చిన్నప్పుడు చూసిన సినిమాలేం పెద్దగా గుర్తు లేదు. హైదరాబాద్‌ వచ్చాకే.. సినిమాలపై అవగాహన పెరిగింది. మా ఊరు నుంచి నిజామాబాద్‌ వెళ్లి సినిమా చూడాల్సివచ్చేది. నేనూ, శిరీష్‌ ఒకే సైకిల్‌పై పది కిలోమీటర్లు వెళ్లేవాళ్లం. ‘వెళ్లేటప్పుడు నేను తొక్కుతా.. వచ్చేటప్పుడు నువ్వు తొక్కు’ అని వంతులు వేసుకునేవాళ్లం. అప్పట్లో ‘సినిమాకి వెళ్తున్నాం’ అంటే ఇంట్లో డబ్బులు ఇచ్చేవాళ్లు కాదు. నేల టికెట్టు రూపాయి. ఇంట్రవెల్‌లో సమోసా. సైకిల్‌ స్టాండ్‌కి అర్ధ రూపాయి… ఉంటే సరిపోయేది.
సొంతూరి ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. మీకేం  గుర్తొస్తుంటుంది?
నా బాల్యం బాగా గుర్తొస్తుంది. చిన్నప్పుడు ఆడిన ఆటలు, వేసిన వేషాలూ గుర్తొస్తాయి. నిజానికి అప్పటికంటే ఇప్పుడే నా సొంతూరుతో ఎక్కువ అనుబంధం ఏర్పడింది. అక్కడ  వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించాను. వెళ్లినప్పుడు స్నేహితులు పలకరిస్తూనే ఉంటారు.
వేంకటేశ్వరస్వామిపై భక్తి ఎప్పటి నుంచి?
పద్దెనిమిదేళ్లకే డబ్బులు సంపాదించాలన్న కోరిక పెరిగింది. అదే ధ్యేయంగా మారింది. ఓసారి కొంత డబ్బులు సంపాదించాక… తిరుపతి వెళ్లా. అప్పటి నుంచీ అనుబంధం మొదలైంది. ఏ నిర్ణయం తీసుకున్నా తిరుపతి వెళ్లడం ఓ అలవాటుగా మార్చుకున్నా. ఇంట్లో వాళ్లందరూ స్వామి భక్తులే. అందుకే మా సంస్థకూ ఆయన పేరే పెట్టా.
భాగస్వాములు, స్నేహితులైనటువంటి శిరీష్‌, లక్ష్మణ్‌ మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. మీ మధ్య ఎప్పుడూ గొడవలు రాలేదా?
వాళ్లు నా పాయింట్‌ ఆఫ్‌ వ్యూ నుంచే ఆలోచిస్తుంటారు. ఓ కథ ఎంచుకుని, దాన్ని ఫైనల్‌ చేశాకే… వాళ్ల దగ్గరకు తీసుకెళ్తా. తమ అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా చెబుతారు. వాళ్ల నిర్ణయాల్ని, ఆలోచనల్ని గౌరవిస్తాను. చివరి నిర్ణయం మాత్రం నాదే. నా నిర్ణయాలకు వాళ్లెప్పుడూ అడ్డు చెప్పలేదు.
నటించాలని ఎప్పుడూ అనుకోలేదా?
కాలేజీలో ఇంకాస్త అందంగా ఉండేవాడ్ని. స్నేహితులంతా ‘హీరోగా ప్రయత్నించొచ్చు కదా’ అనేవారు. నేను సీరియస్‌గా తీసుకోలేదు. సినిమా అనేది ఎదగడానికి ఉపయోగపడే రంగమని ఆ రోజుల్లో నేనంతగా నమ్మేవాడ్ని కాదు. 25 ఏళ్లొచ్చాకే సినిమాకి కనెక్టయ్యా. సినిమాలపై ప్రేమ పెంచుకున్నా. డబ్బులు సంపాదించడానికి ఇదో మార్గమని అనిపించింది.
అంతకు ముందు ఆటో మొబైల్‌ వ్యాపారం చేసేవారు కదా? ఆ రంగంలోనూ మీరు హిట్టేనా?
ఆ రంగంలోనూ బాగానే సంపాదించా. దాదాపు తొమ్మిదేళ్లు ఆ వ్యాపారంలో ఉన్నాను. రోజూ ఒకే పని కావడం వల్ల విసుగొచ్చింది. ఆ తరవాతే సినిమాలవైపు దృష్టి పెట్టాను. ఇక్కడకు వచ్చిన కొత్తలో కొన్ని ఫ్లాపులు వచ్చాయి. ‘తొమ్మిదేళ్లు ఆటోమొబైల్‌ రంగంలో విజయవంతంగా ఉన్నాను. ఇక్కడ ఉండలేనా?’ అంటూ కసిగా పనిచేయడం మొదలెట్టాను. ఓ విధంగా సినిమాల్లో నా విజయానికి స్ఫూర్తి ఆటో మొబైల్‌ రంగమే. అందుకే ఆ వ్యాపారాన్ని ఇప్పటికీ వదల్లేదు. ఆ బిజినెస్‌ మా సోదరులు చూసుకుంటున్నారు.
చదువు ఎలా సాగేది?
చదువు పెద్దగా అబ్బలేదు. ఓ విధంగా చెప్పాలంటే పూర్‌ స్టూడెంట్‌నే. సీఈసీ గ్రూపు తీసుకుని.. ఓ యేడాది చదివి వదిలేశా. మా పిల్లల్నీ చదువు విషయంలో ఒత్తిడి చేయలేదు. నాకు ఓ అమ్మాయి. ఎనిమిదో తరగతి వరకూ తనకు మార్కులు చాలా తక్కువ వచ్చేవి. ‘ఇది అస్సలు చదవడం లేదు’ అంటూ మా ఆవిడ గోల పెట్టేది. ‘నేనేమైనా చదివానేంటి? తనపై ఒత్తిడి తీసుకురాకు’ అని చెప్పేవాడ్ని. అనూహ్యంగా తొమ్మిదో తరగతి నుంచి మా అమ్మాయికి చదువుపై ఆసక్తి పెరిగింది. ఆ తరవాత ఎంబీఏ చేసింది. చదువు విషయంలో పిల్లలపై ఒత్తిడి తీసుకురాకూడదు.
ఇంటికెళ్తే అందరూ ఉంటారు. మీ శ్రీమతి తప్ప. ఆ లోటు ఇప్పటికీ కనిపిస్తుందా?
ఆ జ్ఞాపకాల నుంచి బయటపడినట్టే ఉంటాను. బయటపడలేను. ఆ బాధ ఇప్పటికీ ఉంది. అది నా ఒక్కడికే తెలుస్తుంది. తను దేనికీ ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. ‘అస్తమానం సినిమాలే కాదు.. మాక్కూడా కొంచెం సమయం ఇవ్వండి’ అని అంటుండేది. నేనూ వీలైనంత సమయం కేటాయించేవాడ్ని. హాలీడేస్‌కి టూర్‌ ప్లాన్‌ చేసేవాళ్లం. ‘ఏడింటికి సినిమాకి వెళ్దాం.. రెడీగా ఉండండి’ అని చెప్పి,  మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. ‘మీరు అట్నుంచి అటు థియేటర్‌కి వచ్చేయండి..’ అని ఫోన్లో పురమాయించేవాడ్ని. తను అడిగినంత సమయం ఇవ్వలేకపోయా అన్న బాధ ఇప్పటికీ ఉంది.
మీ మనవడితో బాగా ఆడుకుంటున్నారా?
ఇప్పుడు టైమ్‌ అంతా వాడితోనే. వాడుంటే ఓ ఎనర్జీ వచ్చేస్తుంది. ‘మిస్టర్‌ మజ్ను’లోనూ నటించాడు. దర్శకుడు వెంకీ అట్లూరి నాకు బాగా తెలుసు. మా అమ్మాయి పెళ్లి వీడియో తనే తీశాడు. ‘మిస్టర్‌ మజ్ను’ స్క్రిప్టు రాసుకుంటున్నప్పుడే ‘మీ మనవడు నాకు కావాలి’ అని అడిగాడు. లండన్‌ లో షూటింగ్‌ అంటే.. మహర్షి షూటింగ్‌ వదిలేసి మనవడి కోసం లండన్‌ వెళ్లాను.
పంపిణీదారుడిగా, నిర్మాతగా చిత్రసీమలో ఇరవై ఏళ్ల అనుభవం సంపాదించుకున్నారు. సినిమాకి సంబంధించిన లాజిక్కులు, మ్యాజిక్కులు అన్నీ అర్థమైనట్టేనా?
కొంచెం కొంచెం అర్థమైనట్టే. అనుభవమే అన్నీ నేర్పుతుంది. ఒక్కోసారి అనుకున్న ఫలితం రావొచ్చు. కొన్నిసార్లు రాకపోవచ్చు. ఇంకొన్నిసార్లు మనం అనుకున్న దానికంటే సినిమా బాగా ఆడొచ్చు. ప్రతీ సినిమా ఓ పాఠం లాంటిదే. చిత్రసీమలో ఇది వరకు ప్రతీ ఐదేళ్లకు ఓసారి ట్రెండ్‌ మారేది. ఇప్పుడు అలా కాదు. యేడాదికి ఒకసారి మారిపోతోంది.
‘దిల్‌రాజు జడ్జిమెంట్‌కి తిరుగుండదు’ అని పరిశ్రమలో అందరూ చెబుతుంటారు. అది మీకెలా సాధ్యమైంది?
పంపిణీ రంగం నుంచి వచ్చి, నిర్మాతని అవ్వడం బాగా కలిసొచ్చింది. ప్రతీ సినిమానీ నేను రెండు మూడు సార్లు చూస్తుంటా. డబ్బులు పెట్టాను కదా, నా డబ్బులు వస్తాయా రావా? అనే కోణంలో ఓసారి సినిమా చూస్తా. ఆ సినిమా విడుదలయ్యాక.. ‘నాకు నచ్చింది ప్రేక్షకులకు నచ్చుతుందా? లేదా’ అనేది తెలుసుకోవడానికి మరోసారి చూస్తా. ఓ సాధారణ ప్రేక్షకుడిలా మూడోసారి సినిమా చూస్తా. కథ వింటున్నప్పుడు, స్క్రిప్టు దశలో ఉన్నప్పుడు ప్రేక్షకుడిలానే ఆలోచిస్తాను. అక్కడ నాలోని నిర్మాత బయటకు వస్తే లెక్కలు మొదలై, నా అభిరుచి మరుగున పడిపోతుంది.
ఈ రంగంలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నారా?
చాలాసార్లు. మృగరాజు, దేవీపుత్రుడు సినిమాలు కొనాలని చాలా ఆశపడ్డాను. దేవీపుత్రుడుకి అడ్వాన్సూ  ఇచ్చాను. మాకంటే డబ్బులు ఎక్కువ ఆఫర్‌ చేశారని, మరొకరికి ఆ సినిమా అమ్మారు. నేను కట్టిన మొత్తానికి వడ్డీ తీసుకుని బయటకు వచ్చేశాను. మృగరాజు చివరి నిమిషాల్లో డ్రాప్‌ అయ్యాను. ఆ రెండు సినిమాలు కొనుంటే.. పరిస్థితి ఎలా ఉండేదో అని ఆలోచించుకుంటే ఇప్పటికీ వణుకు వస్తుంటుంది. నిర్మాతగా ఇంత భయంకరమైన పరిస్థితులు రాలేదు.
ఈ సినిమా ఎందుకు తీశానా? అని బాధపడిన సందర్భాలున్నాయా?
‘మరోచరిత్ర’ విషయంలో బాధపడ్డాను. అది చేయాల్సిన సినిమా కాదు. మా కజిన్‌ నిరంజన్‌ రెడ్డి కోసం చేసిన సినిమా అది. రూ.5 కోట్లతో తీయాలనుకున్నాం. వివిధ సమస్యలతో బడ్జెట్‌ డబుల్‌ అయ్యింది. ఓ క్లాసిక్‌ సినిమాని ముట్టుకోకూడదన్న పాఠం విలువ పది కోట్లన్నమాట.. (నవ్వుతూ). ‘రామయ్య వస్తావయ్యా’ బాగా నిరాశ పరిచింది.
మీకంటే డబ్బు బాగా ఉన్నవాళ్లు, కార్పొరేట్‌ సంస్థలూ సినిమాలు తీశాయి. వాళ్లెందుకు నిలదొక్కుకోలేకపోయారు?
సినిమా అనేది అభిరుచి, పెట్టుబడుల సంగమం. నేను ఇంట్లో కూర్చుని.. ఎవరి చేతుల్లోనో డబ్బుపెట్టి ‘సినిమా తీయండి’ అంటే కుదరదు. మన డబ్బుతో, మన అభిరుచితో, మన చేతులతో మనమే సినిమా తీయాలి. చాలా మంది ‘ఒక్క సినిమా చేస్తే చాలు.. నిర్మాతగా నా పేరు చూసుకుంటే చాలు’ అనుకుని ఈ రంగంలోకి అడుగుపెడుతుంటారు. వాళ్లకు సినిమా అంటే సరైన అవగాహన ఉండదు. దీంతో ఇబ్బందులు తప్పవు.

ఆ నవలలు చదివాను
ఆటోమొబైల్‌ వ్యాపారం చేస్తున్నప్పుడు నా సగం సమయం ట్రావెలింగ్‌కే సరిపోయేది. ప్రయాణంలో కాలక్షేపం కోసం పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నా. అలా యండమూరి నవలలు అన్నీ చదివేశా. విజయానికి 5 మెట్లు చాలా స్ఫూర్తినిచ్చింది. విపుల, చతురలు బాగా చదివాను. సినిమాల్లోకి వచ్చాక స్క్రిప్టులు చదవడానికే సమయం సరిపోవడం లేదు. చాలా కాలం తరవాత రాణీ శంకరమ్మ అనే పుస్తకం చదివా. చాలా బాగుంది. 


ఫిట్‌నెస్‌ రహస్యం
నా వయసు 48 ఏళ్లు. పైకి అలా కనిపించను (నవ్వుతూ). ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. తొందరగా పడుకోవడం, ఉదయాన్నే లేవడం నా అలవాట్లు. ఆహారం విషయంలో కొన్ని పద్ధతులు పాటిస్తుంటాను. స్వీట్స్‌, ఐస్‌క్రీం అంటే చాలా ఇష్టం. బాగా తింటుంటా. లావైపోతున్నానేమో అనే అనుమానం వచ్చినప్పుడు తగ్గించేస్తా. 


ఇంట్లో వద్దన్నారు
మా కుటుంబానికీ, సినిమాకీ అస్సలు సంబంధం లేదు. సినిమాల్లోకి వెళ్తానంటే ఇంట్లోవాళ్లంతా వ్యతిరేకించారు. మా చిన్న అన్నయ్య విజయ నరసింహారెడ్డి తప్ప. చివరికి నా భార్య కూడా ‘సినిమా పరిశ్రమ మనకు అవసరమా’ అంది. అందరినీ మెల్లగా ఒప్పించాను. ‘సినిమాల్లోకి వెళ్లినా నా క్యారెక్టర్‌ని మార్చుకోను’ అని మాట ఇచ్చి ఇటువైపు వచ్చాను. 

– మహమ్మద్‌ అన్వర్‌
ఫొటోలు : వసంత్‌