అయినా అదే సంస్థకు వరుసగా మూడు విజయాలు అందించాడు.
– విజయం అంటే అదీ!
పద్దెనిమిది వేల జీతాన్ని వదులుకున్నాడు.
ఇప్పుడు ‘స్టార్’ హోదా అనుభవిస్తున్నాడు!
– ప్రయాణం అంటే అదీ!
ఇది దర్శకుడు వంశీ పైడిపల్లి జర్నీ. మున్నా, బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి… చేసింది తక్కువ సినిమాలైనా, తనదంటూ ఓ ముద్ర వేశాడు. ‘మహర్షి’తో మరో విజయాన్ని సొంతం చేసుకున్న వంశీ పైడిపల్లిని ‘హాయ్’ అంటూ పలకరిస్తే.. బోలెడన్ని ఆసక్తికరమైన సంగతులు పంచుకున్నారిలా..
* ‘మహర్షి’లో విజయానికి చాలా నిర్వచనాలు వినిపించారు.. ఇంతకీ విజయానికి మీరిచ్చే నిర్వచనం?
అదేంటో తెలిస్తే బాగుంటుంది (నవ్వుతూ). ‘మహర్షి’ మహేష్ చెప్పినట్టు విజయం అనేది ప్రయాణమే. గమ్యం కాదు. ఓ విజయం సాధించినంత మాత్రాన అక్కడే ఆగిపోం. ‘మనకు కావాల్సింది ఇది కాదు కదా? ఇంకేదో ఉంది?’ అనే ఆలోచనతో కొత్త ప్రయాణం మొదలెడతాం. వ్యక్తిగా ఎదగడం కూడా ఓ విజయమే. అది ఇంకాస్త బాధ్యత పెంచుతుంది. ‘మహర్షి’ అయితే విజయానికి మించిన ఆనందాన్ని ఇచ్చింది. ఏ దర్శకుడికైనా విజయం సాధించడం చాలా అవసరం. అయితే విజయంతో పాటు మర్యాద కూడా దక్కడం గౌరవంగా భావిస్తున్నాను.
* మీ ప్రయాణంలో.. తొలిమెట్టు ‘మున్నా’. ఆ సినిమా తీసే సమయంలో మీ ఆలోచనలు ఎలా ఉండేవి?
నేనో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. 2002లో సహాయ దర్శకుడ్ని అయ్యాను. అప్పట్లో ఓ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వడమే నా లక్ష్యం. ‘ఈశ్వర్’ నా తొలి సినిమా. అక్కడే ప్రభాస్‌తో పరిచయమైంది. ఆయనే నన్ను ఎం.ఎస్.రాజుకు పరిచయం చేశారు. అలా ‘వర్షం’కీ సహాయ దర్శకుడిగా అవకాశం వచ్చింది. ‘మాస్’, ‘భద్ర’ సినిమాలకు పనిచేశా. ‘భద్ర’ సమయంలోనే ‘నువ్వు కథ రాసుకో’ అని దిల్‌రాజు ఆఫర్ ఇచ్చారు. అలా ‘మున్నా’ తయారైంది. ఇరవైఆరేళ్లకే దర్శకుడినయ్యా. ఆ సినిమా సరైన ఫలితం ఇవ్వలేదు. అది హిట్టయితే. నా ప్రయాణం ఇంకోలా ఉండేదేమో..? తొలి మెట్టు దగ్గర నిజంగా తడబడ్డా. అయితే అది కామా మాత్రమే. అప్పటి నుంచీ జాగ్రత్తగా ఉన్నా. అందుకే ‘తొలి సినిమాకీ, ఇప్పటికీ ఎంతో మారిపోయావ్ వంశీ’ అంటుంటారు దిల్‌రాజు. వయసు పెరిగే కొద్దీ అనుభవం వస్తుంటుంది. అనుభవం అన్నీ మార్చేస్తుంటుంది.
* ఆ మార్పు ఏయే విషయాల్లో…?
ఆ వయసులో కుర్రాళ్లు ఎలా ఉంటారు? నేను అంతకంటే కొంచెం ఎక్కువ పొగరుతో ఉండేవాడ్ని. ‘నాకు అన్నీ తెలుసు’ అనే పంథాలో ఆలోచించేవాడ్ని. దర్శకుడు అనేవాడు ముందు వినాలి, గ్రహించాలి, మంచిని తీసుకోవాలి. ఇవన్నీ ‘మున్నా’ సమయంలో నాకు తెలీదు.
* మీ బాల్యం ఎలా గడిచింది? సినిమాలపై ప్రేమ ఎప్పుడు పుట్టుకొచ్చింది?
అదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ మాది. ఊర్లో మాకో థియేటర్ ఉండేది. హైదరాబాద్‌లో చదువుకున్నా, సెలవులకు ఇంటికి వెళ్లేవాడ్ని. అప్పుడు నాకు థియేటరే ప్రపంచం. రీలు లోడ్ చేయడం, టికెట్లు అమ్మడం అన్నీ చేసేవాడ్ని. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ నన్ను ఆశ్చర్యపరిచిన సినిమాల్లో ఒకటి. ‘ఇదేం సినిమా రా బాబూ’ అని నోరెళ్లబెట్టా. అప్పటి నుంచీ సినిమాపై ప్రేమ మరింత పెరిగింది. ఏ సినిమా అయినా మొదటి రోజు మొదటి ఆట చూడకపోతే నిద్రపట్టేది కాదు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఏదైనా సినిమా వస్తోందంటే దిల్‌రాజు ఆఫీసు ముందు నిలబడేవాడ్ని. ఊర్లోని మా థియేటర్‌ని లీజుకి తీసుకుంది ఆయనే. వారితో నాకు పరిచయం ఉంది. టికెట్లు సంపాదించిన నన్ను చూసి మా స్నేహితులంతా ‘హీరో’ అనుకునేవాళ్లు. టికెట్ల కోసం నేనెంత కష్టపడుతున్నానో వాళ్లకు అర్థమయ్యేది కాదు. ‘టికెట్లు నావి.. పేపర్ ముక్కలు మీవి’ అని ఆర్డర్ వేసేవాడ్ని. హీరో రాగానే.. ఆ పేపర్‌ముక్కలు గాల్లో ఎగరేయడం అప్పటి నుంచీ అలవాటు.
* ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి వచ్చారు. ఇంట్లోవాళ్లు ఏమన్నారు?
నాన్న వద్దన్నారు. అమ్మ ప్రోత్సహించింది. ఎంసీఏ అయిపోయాక కొన్నాళ్లు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశా. కానీ అది నా వల్ల కాలేదు. ‘నేను అనుకున్నది ఇది కాదు కదా’ అనిపించింది. వెంటనే ఉద్యోగం మానేశా. అప్పట్లో మార్తాండ్ కె.వెంకటేష్ సోదరుడు శంకర్ నాకు బాగా తెలుసు. తను జయంత్ దగ్గర పనిచేసేవాడు. తనే ఆయనకు పరిచయం చేశాడు. నెలకు పద్దెనిమిది వేల జీతం వదిలేసి సినిమాల్లోకి వచ్చా. ‘ఈశ్వర్’కి చేసినప్పుడు నాకు జీతం కూడా ఇవ్వలేదు. పెట్రోల్‌కూ డబ్బులు ఉండేవి కావు. అమ్మ తన పొదుపు ఖాతాలోంచి నాకు డబ్బులు పంపేది. పరిశ్రమకు వచ్చే వాళ్లెవ్వరూ డబ్బులు సంపాదించడం కోసం రారు. ప్యాషన్‌తో వస్తారు. ఇదే కష్టం వాళ్లు ఏ రంగంలో చేసినా, ఇంతకంటే ఎక్కువ సంపాదిస్తారు. ఆ ప్యాషనే నన్ను ముందుకు నడిపించింది. ‘వర్షం’ సినిమాకి ఏడు వేలు ఇచ్చారు. ‘మాస్’కి నా సంపాదన పాతిక వేలకు చేరింది. ఆ చెక్కుల్ని అందుకుంటున్నప్పుడు కలిగిన ఆనందం ముందు ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువే!
ఆ అదృష్టం పేరు మాలిని
‘‘నా అర్ధాంగి మాలిని. మాది ప్రేమ వివాహం. ‘భద్ర’ షూటింగ్ సమయంలో తనను తొలిసారి చూశా. ఆ సినిమాకి పనిచేసిన శ్వేత అనే డిజైనర్‌తో ఓసారి మాలిని సెట్‌కి వచ్చింది. అదే రోజు ఫోన్ చేసి ఓ పది నిమిషాలు మాట్లాడా. కొన్ని రోజులు ఫోన్‌లో బాతాఖానీ నడిచింది. ఓ సారి తన కోసం కారులో బెంగళూరు వెళ్లిపోయా. నన్ను కలవడానికి తను వస్తే.. నా ప్రేమ సక్సెస్ అవుతుందనిపించింది. ముందు ‘రాను రాను’ అని బెట్టు చేసినా చివరికి వచ్చింది. ఎంజీ రోడ్డులో ఉన్న ఓ కాఫీ షాపులో ఇద్దరం కలుసుకున్నాం. ఆ రోజు డిసైడ్ అయిపోయాను. తనే నా జీవిత భాగస్వామి అని. తర్వాత ఓ రోజు ఫోన్ చేసి ‘మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు’ అంది. తనే వాళ్లింటో మాట్లాడింది. ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌కి అమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి ఎవరొప్పుకొంటారు? అందుకే వాళ్లు నో అన్నారు. తన ఫోను లాగేసుకున్నారు. అయినా సరే దొంగచాటుగా మాట్లాడుకునేవాళ్లం. తన కోసమైనా దర్శకుడ్ని అవ్వాలని గట్టిగా అనుకున్నా. అప్పుడే ‘మున్నా’ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆ సినిమా విడుదలకు ముందు మా ఇంట్లో విషయం చెప్పాను. నాన్నగారు కంగారు పడ్డారు. ఈలోగా ‘మున్నా’ పరాజయంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. నన్ను మామూలు మనిషిని ఎలా చేయాలో మా వాళ్లకు అర్థం కాలేదు. ‘ప్రేమించిన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే తేరుకుంటాడేమో’ అనిపించి.. మాలినితో నా పెళ్లి చేశారు. ‘నీ అదృష్టం ఎవరు?’ అని ఎవరడిగినా మాలిని పేరు చెబుతాను. తను లేకపోతే ఏమైపోయేవాడినో..’’ |
* సడన్‌గా బరువు తగ్గారు.. కారణమేంటి?
నెల రోజుల క్రితం కొన్న దుస్తులు ఈ రోజు సరిపోకపోతే ఎవరికైనా కంగారొస్తుంది కదా? రెండేళ్ల క్రితం నా పరిస్థితి అంతే. ఉండాల్సిన బరువు కన్నా 35 కిలోలు ఎక్కువయ్యా. అప్పట్లో బాగా తినేవాడ్ని. నా జీవితాంతం తినాల్సిందంతా నలభై ఏళ్లలో తినేశాను. తిండికి బానిస అయిపోయాను. ఓ దశలో భయం పట్టుకుంది. ఆహారం నా ఆరోగ్యంపై ప్రభావం చూపించడం మొదలెట్టింది. ఓసారి నా కూతురు కూడా ‘ఏంటి నాన్న బాగా లావైపోతున్నావ్!’ అంది. దాంతో బరువు తగ్గాలని గట్టిగా నిర్ణయించుకున్నా. రెండేళ్లలో సహజ సిద్ధంగా 35 కిలోలు తగ్గా. ‘మహర్షి’ సమయంలో మళ్లీ ప్రొడక్షన్ ఫుడ్ తినాలేమో అని భయపడ్డా. ఆ సమయంలో మహేష్ పిలిచి ‘నువ్వు ప్రొడక్షన్ ఫుడ్ తినకు.. మా ఇంటి నుంచి మనిద్దరికీ క్యారియర్ వస్తుంది’ అన్నారు. అలా ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు ఆయన ఇంటి భోజనమే తిన్నా.
* మీరు ఒక్కో సినిమా తీయడానికి రెండు మూడేళ్ల సమయం తీసుకుంటారు. వేగంగా తీసి డబ్బులు సంపాదించాలన్న ఆలోచన ఉండదా?
– చిన్నప్పటి నుంచీ నేను విలాసవంతమైన వాతావరణంలోనే పెరిగా. మా నాన్నగారు కావల్సినవన్నీ ఇచ్చారు. పేరున్న కాలేజీలో చదివించారు. నా లైఫ్ స్టైల్ కూడా బాగుండేది. ఇంట్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అది నా వరకూ తీసుకొచ్చేవారు కాదు. డబ్బు ప్రధానమే. కానీ అదే మొత్తం కాదు. ఇంటికెళ్తే భార్య, పిల్లలు, అమ్మా నాన్న సంతోషంగా కనిపించాలి. నవ్వుతూ పలకరించాలి. ఆ వాతావరణం లేకపోతే ఎంత సంపాదిస్తే ఏమిటి? నేను కొన్ని సినిమాలే తీయొచ్చు. కానీ తీసిన ప్రతీ సినిమా గుర్తుండిపోవాలి. అలా గుర్తుండిపోవాలంటే సమయం తీసుకోవాల్సిందే.
ఫొటోలు: జయకృష్ణ