ఓగిరాల రామచంద్రరావు పేరు తెలిసినవారు తక్కువే ఉండచ్చు, కానీ ఆయన గొప్పతనం తెలిసినవారు ఆయన గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. జాతీయ పురస్కారం అందుకున్న మొట్టమొదటి తెలుగు చిత్రం అయిన పెద్ద మనుషులు (1954)కి ఆయన సంగీతదర్శకుడు. 1939లో విడుదలైన జగదీశ్ పిక్చర్స్ వారి మళ్లీ పెళ్లి సంగీతదర్శకునిగా ఆయనకి మొదటి చిత్రం, ఇదే చిత్రంలో ఓగిరాల ఒక చిన్న పాత్రలో కనిపిస్తారు. ఆ చిత్రంలో బెజవాడ రాజారత్నం పాడిన “గోపాలుడే మన గోపాలుడే”, “చెలి కుంకుమమే పావనమే” వంటి పాటలు పేరుపొందాయి. ఇదే చిత్రంలో ఓగిరాల, కాంచనమాలతో కలిసి “నా సుందర సురుచిరరూపా” అనే పాటని ఆలాపించారు. ఈ పాటను ఆయన వై.వి.రావు గారికి పాడారు. ఈ విధంగా ఆయన తెలుగు చలనచిత్రసీమలో మొట్టమొదటి నేపథ్యగాయకుడు. 1939లో విడుదలైన శ్రీ వేంకటేశ్వర మహత్యంలో ఆయన శివుని వేషం వేశారు. ఆ చిత్రంలో శివుని వేషానికి ముందు వేరే నటుడిని తీసుకున్నారు, కానీ అతని మెడలో పాము వేయగానే ఆ నటుడు భయపడిపోయి ఆ వేషాన్ని వదులుకున్నాడు, దాంతో ఆ చిత్రానికి సంగీతదర్శకుడైన ఓగిరాల ఆ వేషం వేయడానికి ముందుకొచ్చారు.
1940లో విడుదలైన జగదీశ్ పిక్చర్స్ వారి విశ్వమోహినిలో బెజవాడ రాజారత్నం చేత ఓగిరాల పాడించిన పాటలు చాల పేరుపొందాయి. “ఈ పూపొదరింటా” చాలా ప్రముఖంగా వినిపించగా, “”భలే ఫేస్ భలే ఫేస్”, “మేళవింపగదే చెలియా వీణ” పాటలు కూడా బాగానే పేరు సంపాదించాయి. 1941లో విడుదలైన ప్రతిభా పిక్చర్స్ వారి మొట్టమొదటి చిత్రం పార్వతీకళ్యాణంకు ఆయన తదుపరి చిత్రం. గరుడ గర్వభంగం (1943), సీతారామజననం (1944) ఆయన తదుపరి చిత్రాలు, ఈ రెండూ చిత్రాలు ప్రతిభా పిక్చర్స్ సంస్థ నిర్మించినవే. సీతారామజననం చిత్రానికి ఓగిరాల, ప్రభల సత్యనారాయణతో కలిసి పని చేశారు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావుతో “గురు బ్రహ్మ గురు విష్ణు” శ్లోకాన్ని పాడించారు. ఆయన తదుపరి చిత్రం వాహినీ వారి స్వర్గసీమ (1945), ఈ చిత్రంలో నాగయ్య, బాలాంత్రపు రజనీకాంతరావుతో కలిసి పని చేశారు. ఈ చిత్రం పాటలన్నింటిలో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. సంగీతపరంగా స్వర్గసీమను విజయవంతం చేయడంలో ఆయన కృషి ఎంతో ఉంది. 1946లో విడుదలైన ప్రతిభా పిక్చర్స్ వారి ముగ్గురు మరాఠీలు సంగీతపరంగా విజయం సాధించింది. అక్కినేని నాగేశ్వరరావు, టి.జి.కమలాదేవి పాడిన “ఛల్ ఛలో వయ్యారీ షికారీ”, కన్నాంబ పాడిన “సతీ భాగ్యమే భాగ్యము”, “తీరుగదా ఆశా నేడు” మరియు బెజవాడ రాజారత్నం పాడిన “జీవనము యమునా జీవనము”, “రాటము భారతనారీ కవచము” తదితర పాటలు బాగా పేరు సంపాదించాయి. ఈ చిత్రంలో ముఖ్యంగా పేర్కోవలసిన పాట “జీవనము యమునా జీవనము”. ఈ విధంగా చూస్తే బెజవాడ రాజారత్నంకు గాయనిగా పేరు తెచ్చిపెట్టింది ఓగిరాల అని స్పష్టంగా తెలుస్తుంది. ఓగిరాల తదుపరి చిత్రాలు నాగయ్య గారి త్యాగయ్య (1946) మరియు వాహినీ వారి యోగి వేమన (1947). ఈ రెండూ చిత్రాలకు ఆయన నాగయ్య వద్ద సహాయకునిగా పనిచేశారు. యోగి వేమనలోని పాటలలో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన తదుపరి చిత్రం రక్షరేఖ (1949)కు హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రితో కలిసి పని చేశారు. 1949లో విడుదలైన వాహినీ వారి గుణసుందరి కథ అప్పట్లో అన్నీ రంగాలలో పెద్ద విజయం సాధించింది. 1950లో విడదలైన పరమానందయ్య శిష్యులు పరాజయం పొందినా పాటలు బాగానే పేరు సంపాదించాయి.
ఆయన తదుపరి చిత్రాలు మాయరంభ (1950), రాజేశ్వరి (1952), కుమారి (1952 – రాజేశ్వరి – తమిళం), సతీ సక్కుబాయి (1954). మాయరంభ లోని పాటలు, పద్యాలు ఓగిరాలకి బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఈ చిత్రంలో నటి అంజలీదేవి చేత ఓగిరాల ఒక బృందగీతం పాడించారు. సతీ సక్కుబాయి చిత్రంలో ఎస్.వరలక్ష్మి పాడిన పాటలు బాగా ఉంటాయి. ఆయన తదుపరి చిత్రం వాహినీ వారి పెద్ద మనుషులు (1954). పెద్ద మనుషులు తరువాత టి.వి.రాజుతో కలిసి శ్రీ గౌరీ మహత్యం చిత్రానికి పని చేశారు. నాగయ్య గారు తీసిన భక్త రామదాసు (1964) ఆయన చివరి చిత్రం. ఈ చిత్రానికి ఓగిరాల నాగయ్య, అశ్వత్థామ, హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రితో కలిసి పని చేశారు.
ఓగిరాల సంగీతం అందించిన చిత్రాలలో ముఖ్యంగా పేర్కొనవలసినవి గుణసుందరి కథ (1949) మరియు పెద్ద మనుషులు (1954). ఆ రెండూ వాహిని వారి చిత్రాలు కావడం, ఆ రెండిట్లో అద్దేపల్లి రామారావు ఓగిరాలకు సహాయకునిగా, వాద్యనిర్వాహకునిగా పనిచేయడం విశేషం. మరో విశేషం ఏమిటంటే ఆ రెండూ చిత్రాలకు నిర్మాత మరియు దర్శకుడు కె.వి.రెడ్డి గారే మరియు రెండిట్లో నాయిక శ్రీరంజని జూనియరే.
గుణసుందరి కథ చిత్రం విజయం సాధించడానికి ముఖ్య కారణాలలో ఓగిరాల సంగీతం ఒకటి. పి.లీల, టి.జి.కమలాదేవి, కస్తూరి శివరావు, శాంతకుమారి, మాలతి, ఘంటసాల తదితరులతో ఓగిరాల పాడించిన పాటలు బాగా జనాదరణ పొందాయి. ఈ చిత్రంలో పాటలన్నీ పింగళి నాగేంద్రరావు రాశారు. ఓగిరాల ఈ చిత్రంలో పి.లీల చేత పాడించిన ఒక్క “చిటి తాళం వేసెనంటే” మరియు “నాను సింగారినే మగనా” తప్ప మిగతావన్నీ భక్తి పాటలే, వాటిలో “శ్రీ తులసి ప్రియ తులసి” పాట చాలా కాలం అందరి ఇళ్ళల్లో వినిపించేది, ఆ పాట పాడుతూ ప్రతీ స్త్రీ తులసి మాతను ఆరాధించేది. శాంతకుమారి, మాలతి కలిసి పాడిన “కలకలా ఆ కోకిలేమో” మరియు “చల్లని దొరవేలె చందమామ” పాటలు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. ఘంటసాల ఈ చిత్రంలో “అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా” అనే నేపథ్యగీతం పాడారు. అలాగే కస్తూరి శివరావు, టి.జి.కమలాదేవి, వి.శివరాం పాడిన పాటలు కూడా పేరు పొందాయి.
పెద్ద మనుషుల చిత్రంలో రేలంగికి ఘంటసాల పాడిన “నందామయా గురుడ నందామయా” మరియు “శివశివ మూర్తివి గణనాథా” బాగా జనాదరణ పొందాయి. ఆ రెండూ పాటలను కొసరాజు రాశారు. పి.లీల ఈ చిత్రంలో మూడు పాటలు పాడింది, ఆమె పాడిన “నీ మీద ప్రాణాలు నిలిపింది రాధ” పాట హిందీ చిత్రం అల్‌బేలాలోని పాటకు అనుకరణగా సంగీతం అందించారు మరియు లీలనే పాడిన “అంతభారమైతినా అంధురాలనే దేవ” పాట మనస్స్సుకు హత్తుకునే విధంగా సంగీతం అందించారు. ఈ చిత్రం జాతీయ బహుమతి పొందిన మొట్టమొదటి తెలుగు చిత్రం. ఈ విధంగా జాతీయ బహుమతి పొందిన మొదటి తెలుగు చిత్రానికి సంగీతమందించిన వ్యక్తిగా ఓగిరాల కీర్తి పొందారు.
1905లో సెప్టెంబరు 10న బెజవాడలో ఓగిరాల జనార్దనశర్మ, సుబ్బమ్మ దంపతులకు జన్మించిన ఓగిరాల రామచంద్రరావు, 1957లో భక్త రామదాసు చిత్ర నిర్మాణ సమయంలో ఫ్లూ జ్వరం బారిన పడి జూన్ 17వ తేదీన మరణించారు. ఓగిరాల అంతిమయాత్రలో ఆయనంటే ఎంతో అభిమానమున్న ఘంటసాల సుమారు రెండు మైళ్ళు నడిచారు.
ఓగిరాల భార్య పేరు వరలక్ష్మి. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. కుమారుడి పేరు నరసింహమూర్తి మరియు కుమార్తె పేరు కల్పకవల్లి. నరసింహమూర్తి కొన్ని చిత్రాలలో బాలనటునిగా నటించారు. బ్రతుకుతెరువు (1953)లో సూర్యకాంతం కొడుకుగా, దొంగరాముడు (1955)లో చిన్ననాటి రాముడి స్నేహితునిగా, అప్పు చేసి పప్పు కూడు (1959)లో సూర్యకాంతం, రమణారెడ్డి కొడుకుగా నటించారు. అప్పు చేసి పప్పు కూడులో రేలంగి, నరసింహమూర్తి కలిసి పండించిన హాస్యం మరువలేనిది.. ఆయన ఈ మధ్యే కార్పరేషన్ బ్యాంక్‌లో సీనియర్ ఉద్యోగిగా పదవీ విరమణ పొందారు. ఓగిరాలకు జాతకాలు చూసే అలవాటు ఉండేది. ఓగిరాల కొంతమంది ప్రముఖ నటుల జాతకాలు రాసిపెట్టుకున్నట్టు ఆయన కుమార్తె కల్పకవల్లి చెప్పారు.