సామాన్య జనం వినోదానికి పేరుపడిన సినిమా ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతోంది. సినిమా తయారైపోతే సరిపోలేదు, కొబ్బరి కాయ నుంచి గుమ్మడి కాయ వరకు సినిమా నిర్విఘ్నంగా పూర్తయిపోయిన తరువాత కూడా కష్టాలు రావని గ్యారంటీ లేదు. పేరు బాలేదనో, పేరులో తమకు సంబంధించినది ఏదో వుందనో, సినిమాలో విషయాలు తెలియకుండానే ఇలా వున్నట్లు తెలిసిందని ముందస్తు గొడవలు షురూ అవుతున్నాయి. ఈ బాలారిష్టాలు దాటి విడుదలయిన తరువాత ఓ మాటో, పాటో తేడా వస్తే చాలు మళ్లీ నానాయాగీ. చిత్రమేమిటంటే, అద్భుతమైన సామాజిక స్పృహతోనో, సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలను తెరకెక్కించో కాదు, కేవలం స్వయంకృతాపరాధంతో కష్టాలు కొని తెచ్చుకుంటోంది సినిమా రంగం. పంతాలకు పోయి సినిమా పెద్దలే వివాదాలకు కారణమవుతున్నారు ఒక్కోసారి. వివాదాలు చూసి, చూసి, ముచ్చటేసి చిన్న చిన్న కారణాలు చూపి వివాదాలు సృష్టిస్తున్నారు మరి కొందరు. ఈ రెండూ కాకుండా వివాదాలు వస్తే, సినిమాకు వ్యాపారం బాగా జరుగుతుందని కూడా కావాలని వివాదాలకు కాలు దువ్వుతున్నారన్న వదంతులూ వున్నాయి. ఏమైనా మొత్తానికి సినిమాకు ‘సినిమా కష్టాలు’ ప్రారంభమయ్యాయి. స్వేచ్ఛ ఏ మేరకు? ఈ దేశంలో చాలా రకమైన స్వేచ్ఛలున్నాయి. కానీ అక్కడికక్కడే విచ్చలవిడి వ్యవహారాలకు చోటు లేకుండా పలు పరిమితులూ వున్నాయి. భావ ప్రకటనా స్వేచ్ఛ వుంది. కానీ నిషేధ సాహిత్యం అనేదీ వుంది. ఒక స్థాయిలో కళాప్రదర్శనలపై కూడా కనే్నసిన సంఘటనలు మన చరిత్రలోనే వున్నాయి. సినిమా.. వందేళ్ల వెండితెర వెలుగు. మూకీ నుంచి టాకీ వరకు ఎదిగి, మారుతున్న సాంకేతిక విలువలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ, వేలు, లక్షల నుంచి వందల కోట్ల స్థాయికి చేరుకుంది. ఇండియన్ సినిమా ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా మార్కెట్ అవుతున్న డిమాండ్ వున్న సరుకు. అలాంటి సరకు తరచు ఇటీవల వివాదాలకు కేంద్రమవుతోంది. సినిమాలపై నిషేధం విధించాలనే దగ్గర నుంచి, పేర్లు మార్చాలి, సీన్లు కట్ చేయాలనే చిన్న చిన్న గొడవలకు కారణమవుతోంది. సెన్సారు ఒకసారి అనుమతిచ్చిన తరువాత మళ్లీ సినిమాపై వివాదాలెందుకు? కత్తిరింపులకు కమిటీలెందుకు?. కళను కళగా చూడాలి తప్ప, అనవసరపు రాద్ధాంతాలు చేయకూడదు. ఇదీ ఇటీవల సినిమాల్లో వివాదాలకు సంబంధించి ఆ రంగ ప్రముఖులు చెబుతున్న మాటలు. నిజమే సినిమా అరవై అయిదోదో, ఆరోదో అన్న నెంబరు తగిలించుకున్న ఓ కళ. సమాజానికి చైతన్యవంతం చేసిన బుర్రకథ, హరికథ, నాటకం తరువాతి అవతారంగా ప్రారంభమైతే, అయి వుండొచ్చు. ఆరంభంలో మాలపిల్ల, రోజులు మారాయి లాంటి మాంచి కళారూపాలను అందించి వుండొచ్చు. సత్యజిత్‌రాయ్, అదూర్ గోపాల్‌కృష్ణన్, శ్యామ్‌బెనగల్ లాంటి వారిలా సామాజిక స్పృహను అణువణువునా నింపేసుకున్న సినిమాలు కాకున్నా, కనీసం సప్తపది, శంకరాభరణాలైనా జనాల్ని రంజింపచేసి వుండొచ్చు. కానీ..ఇప్పుడు, సినిమా అంటే, కుటుంబాలకు వారాంతపు వినోదం. కుర్రాళ్లకు సరదా సందడి. ఇప్పుడు సినిమా అంటే కేవలం ఫన్. అంతకు మించి ఏమీ కాదు. నిజమే.. ఇక, సినిమా సమాజానికి దిశానిర్దేశం చేయక్కర్లేదు. సమస్యలను ప్రతిబింబించనక్కరలేదు. కనీసం జనాల్ని వెక్కిరించకుండా వుంటే చాలు. మతాల్ని కించపర్చకుండా నడిస్తే చాలు.. కులాల గుండెల్లో కుంపట్లు పెట్టకుండా వుంటే మేలు అన్నట్లుగా వుంది పరిస్థితి. భగవంతుడు రాసేది కొంత, మనిషి చేసుకునేది కొంత అన్నట్లు తయారైంది సినిమా పరిశ్రమ పరిస్థితి. ప్రభుత్వం చూసీ చూడనట్లు, సెన్సారు పేరిట అర్థం పర్థం లేని గైడ్లైన్లు రూపొందించి, రాజకీయ ఆశ్రీతులతో సెన్సారు బోర్డును నింపేసి, నిబంధనలు కాస్తా జల్లెడ మాదిరిగా మారిపోవడంతో, సినిమా నిర్మాతలు, దర్శకులు, రచయితలు ఆడింది ఆటగా పాడింది పాటగా మారిపోయింది. మరోపక్క సరియైన కథలు రూపొందించలేక, సరియైన సినిమాలు తీయలేక వెకిలి హాస్యాన్ని నమ్ముకోవడమే పర్యవసానమైంది. ఆకలి వేస్తే సింహమైనా గడ్డితినాల్సిందే అన్న చందంగా, కనీస వినోదం కూడా కరువైపోతుండడంతో ప్రేక్షకుడు ఈ తరహా హాస్యానికే పళ్లు ఇకిలించాల్సి వచ్చింది. ఈ ఇకిలింపు బాగానే కాసులు రాలుస్తుండడంతో మరికాస్తా డోసు పెంచి, ఆఖరికి వాంతులు వచ్చేలా చేయడం సినిమా నిర్మాతల పనయింది. హిందూమతం అన్నా, దేవుళ్లు, పురాణాలన్నా మహా చులకనయిపోయింది. గట్టిగా పోరాడలేని కులాలంటే మరీ తేలికయిపోయింది. భరించినన్నాళ్లు భరించిన జనం తిరగబడడం ప్రారంభించారు. నెమ్మదిగా ప్రారంభమైన ఆ తిరుగుబాటు ఇప్పుడు మరీ ముదిరింది. ఇప్పుడు ఏ మాత్రం తేడా వచ్చినా, సినిమాలపై జనం విరుచుకుపడుతున్నారు. నాయక్, తీన్మార్, కొమరంపులి, జగన్ నిర్దోషి. ఇలాంటి సినిమా పేర్లపై కూడా మండిపడే స్థాయికి ప్రేక్షకులను తీసుకువచ్చింది. చీటికి మాటికీ, అయినదానికీ కాని దానికీ కూడా సినిమాలను టార్గెట్ చేసే పరిస్థితికి కారణం సినిమావారే తప్ప వేరొకరు కాదు. వాదన సరియైనదేనా? సెన్సారు అనంతరం ఆ సినిమాను ఎవరూ టచ్ చేయకూడదన్న వాదన ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. సినిమా వాళ్లు తమకిష్టం వచ్చినట్లు తీసేసి, సెన్సారు సభ్యులను తమ మాటలతో, చేతలతో మభ్యపెట్టి, సర్ట్ఫికెట్ ఇవ్వకుంటే రచ్చకెక్కి, తెరపైకి సినిమా తీసుకువస్తే, అభ్యంతరాలు చెప్పకూడదనడం ఎంతవరకు న్యాయం? సెన్సారు అచ్చేసి వదిలిన సినిమా ఆంబోతులు, సంస్కృతినీ, సంప్రదాయాలను, సమాజ శ్రేయస్సును, జనాల మనోభావాలను కుళ్లబొడుస్తుంటే భరించాల్సిందేనా? సరే, ఇటీవల వివాదం చెలరేగిన విశ్వరూపం సంగతే చూద్దాం. ఇక్కడ కమల్ చెప్పిన బోలెడు పాయింట్లున్నాయి. ముందుగా వ్యయం సంగతి. అసలు అంత ఖర్చు చేసి ఎందుకు తీయాలి? వ్యాపారం చేసినవాడు రాను రాను భారీ స్థాయికి ఎదగాలనుకోవడం సహజం. కానీ ఆ ఎదిగే క్రమంలో పొరపాటును బొక్కబోర్లా పడితే ఎవ్వరూ అయ్యో అనరు. తనకింత నష్టం వచ్చిందంటే ఎందుకు స్పందించాలి. లాభం వచ్చినపుడు బహిరంగంగా మీటింగ్ పెట్టి, ఇంత వచ్చిందని టామ్ టామ్ చేస్తే కదా ఎపుడైనా? ఆ రిస్క్‌కు సిద్ధపడే వ్యాపారం సాగిస్తారు కదా ఎవరైనా? ఇదే కమల్ ఓ సినిమాలో ఈశ్వరుడి వేషం వేసి, డైలాగ్ చెప్పలేకపోతే డైరక్టర్ బబుల్గమ్ నోట్లో పెట్టి, నములు చాలు అంటాడు. ఇదే మరే మతం విషయంలోనైనా చేస్తే, తమ దేవుడ్ని వెక్కిరించారంటూ ఎంత యాగీ జరిగేదో కమల్‌కు గ్రహింపునకు వచ్చే వుంటుంది. గతంలో కమల్ చేసిన అనేక చిన్న సినిమాలను జనం ఎంత ఆదరించారు. సతీలీలావతి, బ్రహ్మచారి, సత్యమేశివం, ఇలా ఎన్నో. హాలీవుడ్ లెవెల్లో తీయాలన్న తపనతో ఎందుకు కిందా మీదా చూసుకోకుండా తీయాలి? హాలీవుడ్ లెవెల్లో తీయాలనుకోవడం వేరు, హాలీవుడ్ కథలనే ఎంచుకోవడం వేరు. భారతీయ కథలను హాలీవుడ్ నిర్మాతలు ఎంచుకుంటున్నారా? అక్కడివారు అక్కడి సినిమాలు తీసుకుంటున్నారు కానీ, మన సినిమాల్లా తీయాలనుకుంటున్నారా? మన సబ్జెక్ట్‌లను ఎంచుకుని తీసిన హాలీవుడ్ సినిమాలు జన్మకో శివరాత్రి చందంగా వస్తాయి. మన వాళ్లు హాలీవుడ్ స్థాయి టెక్నిక్‌తో మన కథలు తీసుకుంటే, వివాదాలు ఎందుకు వస్తాయి. మరి మనకెందుకు వారి సినిమాలపై అక్కర్లేని క్రేజ్. సినిమాలో ఏముందన్నది అనవసరం. కథాంశం చాలా సున్నితమైనదని ముందుగా తెలియదా? సెక్యులర్ దేశంలో ప్రభుత్వం సహజంగానే శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూసుకోవాలని అనుకుంటుందని తెలియదా? దశావతారం తీసినపుడూ ఇదే సమస్య. ఏనాడో అంతరించిన శివకేశవ బేధాలను మళ్లీ, ఇన్నాళ్లకు తెరపైకి తేవడం. నిజానికి సినిమాకు అది ఎంతవరకు అవసరం అన్నది ఆ సినిమా చూసిన వారందరికీ తెలిసిందే. పోనీ సీరియస్ సినిమాగా విశ్వరూపం తీసాడని అనుకుంటే, అందులోనే మళ్లీ కావాలని కామెడీ కోసం పూజాకుమార్ బ్రా వ్యవహారం ఇరికించడం ఎందుకో? బ్యాండేజీ ఎక్కడుంది అంటే, ప్రతి ఒక్కరు పదే పదే బ్రా పేరు ప్రస్తావించడం. శృంగారపు భావనల నుంచే కామెడీ పుట్టించాలన్న తహతహ ఎందుకు? గతంలో కమల్ ద్రోహి తీసినపుడు కూడా కోరి, లిప్ టు లిప్ ముద్దు సన్నివేశాలను ఇరికించారు. కమల్ అద్భుతమైన నటుడు కావచ్చు, మంచి కల్పన, ఆశలు వున్నవాడు కావచ్చు. కానీ కోరి కోరి కష్టాలు, వివాదాలకు ఎదురు వెళ్లడం, అలా వెళ్లి ఇబ్బందులు తెచ్చుకుని వగచడం అనవసరం. బహుశా ఈ ఆలోచనతోనేమో, మన తెలుగు సినీ జనాలు అచ్చమైన మాస్ సినిమాలు తీసుకుంటూ, హాయిగా కాలక్షేపం చేసేస్తున్నారు. ఎన్ని సినిమాలో? ఆ మధ్య ‘దేనికైనారెడీ’ సినిమాకు చెలరేగిన వివాదం సంగతి తెలిసిందే. ఒక సామాజికవర్గం తమను, తమ ఆచార వ్యవహారాలను కించపర్చిన రీతికి రోడ్డెక్కి, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులిచ్చి, కోర్టులను ఆశ్రయించే వరకు పోరాటం సాగింది. కానీ విశ్వరూపంలో తమిళనాడు ప్రభుత్వం మరీ తొందరగా వ్యవహరించిందనిపిస్తే, దేనికైనా రెడీ సినిమాలో మన ప్రభుత్వం పట్టీ పట్టనట్లు కాలక్షేపం చేసింది. చిత్రమేమిటంటే, విశ్వరూపం సినిమా విషయంలో కమల్‌కు వెన్నుదన్నుగా నిలబడిన రీతిగా, దేనికైనారెడీ విషయంలో ఎవరూ స్పందించలేదు. అంటే వారికీ అందులో తప్పు తెలిసిందన్న మాటేగా? పవన్ కళ్యాణ్ ‘కొమరం పులి’ పేరు విషయంలో చెలరేగిన వివాదం ఆఖరికి కొమరం అన్న పదం తొలగించే వరకు సాగింది. అదే హీరో నటించిన ‘కెమేరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం తెలంగాణా ప్రాంతంలో ఆడకుండా అడ్డుకున్న రేంజ్లో వివాదం చెలరేగింది. ఆఖరికి ఆందోళన కారుల డిమాండ్లు నెరవేరేవరకు సినిమాకు తెరలేవలేదు. ఆ మధ్య ‘దేవరాయ’ సినిమాకు పేరు వివాదం చెలరేగి సద్దుమణిగింది. ‘వుమెన్ ఇన్ బ్రాహ్మనిజం’ సంగతి కూడా తెలిసిందే. సెన్సారు ఇంకా చూడకుండానే, కొన్ని ట్రయిలర్లు నెట్లో పెట్టి, హడావుడి చేసిన సినిమా. ఈ సినిమాపై దేశవ్యాప్త నిరసన వ్యక్తం కావడంతో, దానిపై నిషేధం విధించక తప్పలేదు. చాలా కాలం క్రితం తెలుగు సినిమా తొలినాళ్లలో ‘గొల్లభామ’ సినిమా పేరు విషయంలో కూడా ఇటువంటి వివాదమే చెలరేగింది. ఆఖరికి రెండో ‘గొల్లభామ’ సినిమా పేరును ‘్భమా విజయం’గా మార్చారు. అయితే ఇలాంటి పేరు వివాదాలు సినిమా వాళ్లకు సినిమా వాళ్లకు చాలా జరిగాయి. అయితే అది వారిలో వారి అంతర్గత వ్యవహారం కాబట్టి పెద్దగా హడావుడి జరగకుండానే సద్దుమణిగాయి. తప్పా? తప్పుకోవాలా? ఇటీవల ‘కమల్ ఓదార్పు’ సమావేశంలో రచయిత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ,‘న్యూమోనియా వున్నవాడు హిమాలయాల దగ్గరగా వుండకూడదు. హిమాలయాలు అక్కడే వుంటాయి..వుండాల్సిందే’ అన్నాడు. ఆయన ఏ అర్థంలో అన్నారో అర్థం కాలేదు కానీ, నిజమే ఇండియన్ సినిమా హిమాలయమే, దీని పరిమితులు అర్థం చేసుకుని, ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలను, మత స్వేచ్ఛను, మంచిని, మానవత్వాన్ని గౌరవించేవారే ఇక్కడ సినిమాలు తీయాలి. అలా తీయలేనివారు దానికి దూరంగా జరగాలి. ఇప్పటికే మన సినిమాల పుణ్యమా అని భారతీయ సంస్కృతి చట్టబండలైపోయిందన్నది కాదనలేని వాస్తవం. అమ్మా-నాన్న-గురువు-దైవం ఎవరికీ సినిమాల్లో మర్యాద మన్ననలు లభించని రోజులివి. మన పురాణాలను మన సినిమాలో వెక్కిరించినంతగా, పరాయి మతస్తులు కూడా సాహసించరు. గురువుకు సినిమాల్లో లభిస్తున్న గౌరవం తెలిసిందే. సారీ టీచర్.. ఇది ఓ సినిమా పేరు. పరమ లోక్లాస్ బూతు సినిమా. ‘సారీ..మా ఆయన ఇంట్లో వున్నాడు’ ఇది మరో చెత్త సినిమా పేరు. సినిమా పొడవునా బూతు, చివరన నీతి. ఇవన్నీ చేసేదీ, తీసేది కళాకారులే. మరి అటువంటప్పుడు కళాకారులంటే మాత్రం ఎందుకు గౌరవం వుండాలి? వారికి ఎందుకు స్వేచ్ఛ ప్రసాదించాలి? తప్పు ఎవరిదైనా తప్పే కదా? ఇదంతా ఒక ఎత్తు. ఇలాంటి వ్యవహారం వల్ల నష్ట పోయేది, చట్టుబండలైపోయేదీ మన సంస్కృతి మాత్రమే. కానీ మరి కొన్ని వ్యవహారాలున్నాయి. మతాచారాలు, మంత్ర తంత్రాలు, కుల వ్యవహారాలు, వ్యక్తిగతాంశాలు వీటినీ టార్గెట్ చేస్తే ఏమనాలి? ఏం చేయాలి? మిగిలిన ఏకైక అంశం కోర్టు, ప్రభుత్వంపై వత్తిడి. అదిగో సరిగ్గా అప్పుడే వస్తుంది, సినిమా రంగాల వారికి కోపం. సినిమా కళ అన్న సంగతి. తాము కోట్ల నోట్ల కోసం అంగలారుస్తూ, వ్యాపారం సాగిస్తున్నామని, కళను ఏనాడో అటకెక్కించామన్న సంగతి మర్చిపోతారు. కళాకారులు అన్న కార్డు బయటకు తీస్తారు. కళాకారులైతే మంచి సినిమా తీయాలి, మంచి బొమ్మ వేయాలి. బొమ్మలేయడం వచ్చు కదా అని పరాయి స్ర్తి బొమ్మను నగ్నంగా చిత్రీకరించి కళ అంటే సహించేది ఎవరు? ఇదే పని ఓ హిందూ దేవత విషయంలో చేస్తే ఎందుకు సహించాలి? హిందూ దేవతలను బఫూన్లుగా, వెర్రి వెంగళాయిలుగా, స్ర్తి లోలురుగా తెరపై చిత్రీకరిస్తూ వుంటూ, ఎన్నాళ్లు సహించాలి? ఇవ్వాళ కమల్ విషయంలో తమిళనాడు ప్రభుత్వం తొందరపడి వుంటే వుండొచ్చు. కానీ దాదాపు సినిమాలన్నింటి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయన్నది వాస్తవం. సెన్సారుకు పని అప్పగించాం అని వదిలేస్తున్నాయి. నిజానికి సమాచార కమిషనర్లను నియమిస్తున్నంత పకడ్బందీగా కాకున్నా, సెన్సారు నియామకాలను కాస్త కట్టుదిట్టం చేయాలి. కనీసపు అర్హతలు, కాలపరిమితి, హక్కులు, నిర్ణయించడం, అవసరమైన నిబంధనలను సవరించడం చేయాల్సి వుంది. సినిమా అంటే తీసేసి వదిలేసేది కాదని, పైసల వ్యాపారం మాత్రమే కాదని, తమకూ సామాజిక బాధ్యతలున్నాయని కళాకారులు గుర్తించాలి. అప్పుడే సినిమాకు కష్టాలు తప్పేది.