అంతర్వేదిలోనే ఆనందం
ప్ర‘విన్’
‘కొత్తబంగారులోకం’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు. ‘ప్రేమకథాచిత్రమ్’తో పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం తెలుగు హీరోల నమ్మకమైన నేస్తమైన అతడికి.. ‘సినిమా’నే సమస్తం! ఆ నటుడి పేరు ‘ప్రవీణ్’. హాస్యనటుడిగా నవ్వులు పూయించే ప్రవీణ్‌తో మాట్లాడితే బాల్యం… ఊరు.. హైదరాబాద్… ఇలా అనేక విషయాలు చెప్పుకొచ్చాడు.
నేను నటించిన తొలిచిత్రం ‘కొత్తబంగారులోకం‘ (2008 అక్టోబర్9 వ తేదీ విడుదలైంది). ఆ చిత్రం సూపర్‌హిట్ కావటంతో అవకాశాలొచ్చాయి. వాస్తవానికి ఈ సినిమాలో అవకాశం హీరో సునీల్ ద్వారా వచ్చింది. ‘ఒక ఊరిలో’ చిత్రం సమయంలో సునీల్‌గారితో నాకు పరిచయమైంది. అప్పుడప్పుడూ గోదావరి జిల్లాలకి ఆయన షూటింగ్స్‌కి వచ్చినపుడు ముందే చెప్పేవారు. నేను వెళ్లి ఆయన్ని కలిసేవాణ్ణి. ఓ సారి ‘పరుగు’ షూటింగ్ మా ఊరి దగ్గరలో జరుగుతోంటే.. అక్కడికెళ్లాను. ‘అందరూ కొత్తవాళ్లతో ఓ సినిమా చేస్తున్నాం. మీ ఫ్రెండు నటిస్తాడా?’ అని నిర్మాత దిల్‌రాజు సునీల్‌గారిని అడిగారు. ఆయన నా వైపు చూస్తే నేను ‘సరే’నన్నా. (అప్పటికే హైదరాబాద్‌కి వచ్చి పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసుకుంటూ సినిమా ట్రయల్స్ వేశా. ఎమ్.కామ్ చదివా. చివరికి అవకాశాలు రాలేదని తిరిగి మా ఊరెళ్లా). నా జీవితాన్ని ఒక గాడిలో పెట్టిన సునీల్ అన్నయ్య.. నా తోడబుట్టిన అన్నయ్య కన్నా ఎక్కువ.
‘ప్రేమకథాచిత్రమ్’ చిత్రం నా జీవితాన్ని మలుపు తిప్పింది. దాదాపు అందరి హీరోలతో కలిసి నటించా. ప్రస్తుతం.. శర్వానంద్, నరేష్‌ల పక్కన స్నేహితుడిగా నటిస్తున్నా. కమెడియన్ శ్రీనివాసరెడ్డి ‘భాగ్యనగరవీధులలో గమ్మత్తు.’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. అందులో నేనూ ఓ మంచి పాత్ర చేశా.
అక్కడి ఆనందమే వేరు
తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది మా ఊరు. అక్కడి శ్రీ లక్ష్మీనరసింహ దేవాలయం ప్రఖ్యాతిగాంచింది. మా అమ్మపేరు రత్నం, గృహిణి. నాకో తమ్ముడున్నాడు. చిన్నపుడే మా నాన్న పోయారు. ఆ తర్వాత కొన్నాళ్లు హైదరాబాద్‌లోని మా మామయ్య వాళ్లింట్లో ఉన్నా. నాకు ఆ వాతావరణం నచ్చలేదు. మళ్లీ ఊరెళ్లి డిగ్రీ వరకూ చదివా. ఎక్కడికెళ్లినా నా చుట్టూ బ్యాచ్ తయారవుతుంది. దాదాపు పరిచయమైన ప్రతి మనిషి నాకు దూరమైంది లేదు. అంతర్వేదిలో మా నానమ్మ, బంధువులుంటారు. మా నాన్నమ్మంటే నాకు ప్రాణం. అంత బాగా నన్ను పెంచింది. ఇపుడు తన ఆరోగ్యం బాలేకపోవటంతో పదిహేనురోజులకో లేదా నెలకోసారైనా మా నానమ్మ దగ్గరికెళ్తా. ఆమె బాగోగులు చూసుకుంటా. ఊరెళ్లినప్పుడు కచ్చితంగా స్నేహితుల్ని కలుస్తా. మా సొంతూరులోని ఆనందం మరెక్కడా నాకు దొరకదు.
ముసాబు వాన
గోదావరితో అనుబంధం, స్నేహితులతో ఆడిన ఆటలతో పాటు మరెన్నో జ్ఞాపకాలు నా బాల్యంలో ఉన్నాయి. నా చిన్నతనంలో వర్షం వారంపాటు ఆగకుండా పడుతూ ఉండేది. దాన్ని ‘ముసాబు’ అనేవారు. మెల్లగా వానపడుతుండేది. బయటికి వెళ్లేవారు కాదెవ్వరూ. గొడ్ల చావిడిలో, మా వీధి అరుగుమీద కబుర్లు చెప్పుకొనేవారు. ఇళ్లల్లోనే ఆటలాడుకునేవాళ్లం. కరెంటు ఉండేదికాదు. రాత్రి ఆరుగంటలకే భోజనం చేసి నిద్రపోయేవాళ్లంతా. మా ఊళ్లల్లోకి నవంబరు నుంచి సంక్రాంతివరకూ జంగందొరలనే గిరిజనులు వచ్చేవారు. ప్రతి ఇంటి దగ్గర పులి వేషం కట్టేవారు. మా ఊరిలో ఇపుడా ‘ముసాబు’ వాన పడట్లేదు. ఇంటింటికి వచ్చి అలరించే ఆ జంగం దొరలు కానరాలేదు. మా ఊరిలో భూముల ధర పెరిగి ఎకరా మూడుకోట్లు అవుతూనే.. ఇక మా పల్లె.. ‘పల్లెదనం’ కోల్పోతుందేమోనని బాధపడ్డా.
పెంకుటిల్లును కాపాడుతున్నా
మా తాతయ్య కట్టించిన 110 సంవత్సరాల క్రితం పెంకుటిల్లును ఇప్పటికీ కాపాడుకుంటున్నా. రెండేళ్లకోసారి పెంకులు పోతే, వాటిని వేసేవాళ్లు దొరకటం లేదు. అదీ పల్లెల పరిస్థితి. ఇప్పటికీ గోదావరి జిల్లాలో నిల్చిన గొప్పదనం ఏంటంటే.. ఇంటికి వచ్చిన అతిథులకు రకరకాల చేపలు వండిపెడతారు. అతిథులు బాగా తిని బ్రేవ్ అంటే వాళ్లకు సంతోషం.
పుస్తకాలు చదువుతా
చందమామ, బాలమిత్రతో పాటు ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో వచ్చే కథలు చదివేవాణ్ణి. మధుబాబు రాసిన ‘షాడో’ నవల, యండమూరి వ్యక్తిత్వవికాస పుస్తకాలు చదివా. త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అఆ’ చిత్రంలో చేసేప్పుడు ఆయన పుస్తకాలు చదవమనేవారు. ఇటీవలే దాశరథి రంగాచార్యులుగారు రాసిన ‘చిల్లర దేవుళ్లు’ చదివా. బాపుగారి కోతికొమ్మచ్చి, ఇంకోతికొమ్మచ్చి చదివి.. ప్రస్తుతం ముక్కోతికొమ్మచ్చి పుస్తకం చదువుతున్నా. ఇటీవల పెద్దవంశీగార్ని కలిసినపుడు కొడవటిగంటి కుటుంబరావుతో పాటు మరికొంత మంది రచయితల పుస్తకాలు చదవమని సలహాఇచ్చారు. ఫోన్, టీవీలు చూడటం తగ్గించి భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలు చదవాలి.
చిన్నప్పుడు హైదరాబాద్‌లో ఉన్న రెండేళ్లలో నాకు తెలంగాణ యాస బాగా అబ్బింది. నాకెందుకో యాసలంటే ఇష్టం. కోస్తాతో పాటు తెలంగాణ, రాయలసీమ మాండలికాల్ని పరిశీలిస్తుంటా.
నేను ఇండస్ట్రీకొచ్చి పదేళ్లయ్యింది. 120 చిత్రాల్లో నటించా. ‘అఆ’లోని పాలేరు పాత్ర.. రౌడీఫెలో, పటాస్ చిత్రాల్లోని నెగటివ్ టచ్ పాత్రలంటే నాకిష్టం. పూర్తి స్థాయి విలన్ పాత్రలో నటించి మెప్పించాలనే ఉంది.
శ్రీనివాస్ రెడ్డి, ధనరాజ్, సప్తగిరి, నేను, రాజేష్, వేణు.. ఇలా పన్నెండుమందితో కలిసి ఓ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశాం. ఈ గ్రూప్ పేరు ‘ఫ్లయింగ్ కలర్స్’. ప్రతినెల రెండో శనివారం సాయంత్రం ఎవరోకరి ఇంట్లో కలుస్తాం. ప్రతినెలా ఒకరు బాధ్యత తీసుకుంటారు. అందరం కలిసి అనారోగ్యంగా ఉండే నటులకు, ఆర్టిస్టుల పెళ్లిళ్లకు సాయం చేస్తుంటాం.