హీరో ‘విశాల్’

 

hero vishal 1 hero vishal 2

 

 

 

సెలబ్రిటీ స్పీక్‌

డబ్బులు చించేశా
 

రీల్‌లైఫ్‌లో కన్నా.. రియల్‌లైఫ్‌లోనే ఎక్కువగా మాట్లాడుతుంటాడు విశాల్‌. మెత్తగా మాట్లాడిన దాఖలాల కన్నా.. గట్టిగా ప్రశ్నించిన సందర్భాలే ఎక్కువ! ఎందుకలా అంటే?  ‘‘అన్యాయాన్ని ప్రశ్నిస్తే తప్పేంటి’’ అనేది సమాధానం. ఇంత ముక్కుసూటి మనిషి ఏడాదికి మూడు సినిమాలు అవలీలగా చేసేస్తుంటాడు! పాత్ర కోసం ప్రాణం పెడతాడు. కాలికి నొప్పొచ్చినా.. కంటికి జబ్బొచ్చినా.. నో కాంప్రమైజ్‌!! ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నాడా..’ అంటే… కాదు తన సినిమాతో ఓ రైతు ఇంట్లో దీపం వెలుగుతుంది అంటాడు విశాల్‌. పందెంకోడి-2తో ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్‌హీరో విశాల్‌ ‘హాయ్‌’తో తన భావాలు పంచుకున్నాడు. డబ్బులు చించేసిన సంఘటన, కొత్త సినిమాలు, నడిగర్‌ సంఘం, తన నామినేషన్‌ తిరస్కరణ, రైతుల పోరాటం… ఇలా ఎన్నో విషయాలపై మాట్లాడాడు.

అది పెద్ద రాజకీయంజయలలిత మరణం తర్వాత నేను ఆర్‌కే నగర్‌ నియోజకవర్గం నుంచి పోటీకి దిగుదామనుకున్నా. అక్కడ మత్స్యకార కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. మహిళలు ఎక్కువగా చేపలు అమ్మి జీవనోపాధి పొందుతుంటారు. వారంతా ఉదయం వచ్చి రాత్రి వరకూ వ్యాపారం చేస్తారు. వారికి కనీస అవసరాలు తీర్చుకోవడానికి మరుగుదొడ్లు లేవు. అక్కడి మహిళలే నాకు ఈ విషయం చెప్పారు. తరతరాలుగా మరి రాజకీయ నాయకులు, పాలకులు ఏం చేశారని? గట్టిగా ప్రశ్నించాలనుకున్నా. నా పోటీ ద్వారా అక్కడున్న ఇలాంటి ఎన్నో సమస్యలను వెలుగులోకి తేవాలని భావించాను. నామినేషన్‌ వేశాను. నా నామినేషన్‌ పత్రంపై సంతకం చేసిన స్థానిక ఓటర్లను కొందరు భయపెట్టారు. ప్రలోభానికి గురిచేశారు. ‘మేం సంతకాలు చేయలేద’ని వాళ్లతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయించారు. దీనివల్ల నా నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. దీనిపై న్యాయపోరాటం చేశాను. ఎన్నికల అధికారి ఒకరిని తర్వాత విధుల నుంచి తప్పించారు.
వచ్చే ఏడాది దర్శకత్వం చేస్తా‘పందెంకోడి’లానే పందెంకోడి-2ను తమిళ, తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ‘డిటెక్టివ్‌’, ‘అభిమన్యు’ చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు చేతిలో మూడు ప్రాజెక్టులున్నాయి. ‘టెంపర్‌’ తమిళ రీమేక్‌లో నటిస్తున్నా. ‘అభిమన్యు’లా సమాజంలోని మరో కొత్త సమస్యను చెబుతూ ఇంకో సినిమా సిద్ధమవుతోంది. సుందర్‌గారితో ఒక సినిమా ఉంది. వచ్చే ఏడాది నా దర్శకత్వంలోనే సినిమా చేద్దామనుకుంటున్నా. కచ్చితంగా వచ్చే ఏడాది షూటింగ్‌ ప్రారంభిస్తా. విశాల్‌ ఫ్యాక్టరీ నుంచి కొత్తవారితోనూ సినిమాలు చేయాలనుంది. కుదరడం లేదు. కచ్చితంగా చేస్తా.
హీరో అవుదామనుకోలేదు…నాన్న(జీకేరెడ్డి) నిర్మాతైనా… నేనెప్పుడూ హీరో అవుదామనుకోలేదు. దర్శకత్వం చేయాలనేది నా కోరిక. రామ్‌గోపాల్‌వర్మగారి దగ్గర అసిస్టెంటుగా చేరతానని ఇంట్లో చెబితే వద్దన్నారు. ముంబయికి వెళితే మళ్లీ ఇంటికి రానేమోనని వారి భయం. ఇంటి బాధ్యతలూ ఉన్నాయి కదా! తర్వాత అర్జున్‌ దగ్గర అసిస్టెంట్‌గా చేశాను.
కాలేజీలోనే నటించావిజువల్‌ కమ్యూనికేషన్‌ చదివేటప్పుడు… ఒకసారి కాలేజీలో నాటకం వేస్తున్నారు. నువ్వు తప్పకుండా ఇందులో ఓ పాత్ర పోషించాలని మా ప్రొఫెసర్‌ బలవంత పెట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో నటించాను. తర్వాత దానికి మంచి పేరొచ్చింది. ఒకరకంగా నాలోని నటుడిని ముందుగా గుర్తించింది మా ప్రొఫెసరే.
రైతుల కోసం…నా సినిమాలకు అమ్ముడయ్యే ప్రతి టికెట్టుపై ఒక రూపాయిని రైతుల సంక్షేమానికి వినియోగిస్తాను. వారి ఇళ్లకు వెళ్లి పరిస్థితిని తెలుసుకొని సాయం చేస్తా. ముఖ్యంగా అన్నదాతల పిల్లలకు మంచి చదువు అందించాలనేది నా ఆశయం. దాని కోసం ఎక్కువగా ఖర్చు పెడతా. తెలుగులో నా సినిమా రిలీజ్‌ చేసేవారికీ ఈ విషయం చెప్పి రూపాయి ఇమ్మని అడుగుతున్నా. అందరూ సహకరిస్తున్నారు. ఎంతోమంది కర్షకులు కనీస సౌకర్యాలకు నోచుకోక… ఏటా నష్టాలతో ఇబ్బందులు పడుతున్నారు. వారికోసం ఏదైనా చేయాలని బలంగా కోరుకుంటాను. అందుకే సంవత్సరానికి నిరంతరాయంగా మూడు సినిమాలు చేస్తుంటా. నేను ఎన్ని ఎక్కువ సినిమాలు చేస్తే అన్ని టికెట్లు అమ్ముడవుతాయి. వాటి ద్వారా వచ్చే డబ్బుతో ఎక్కువ మందికి సాయపడగలననేది నా ఆలోచన.
తెలియక…నాన్న గారు ప్రతి శనివారం యూనిట్‌ సభ్యులకు వేతనాలు చెల్లించడానికి డబ్బులు తెచ్చి ఇంట్లో పెట్టేవారు. అవి డబ్బులనీ…దానికి ఇంత విలువుంటుందని తెలియని వయస్సు నాదీ. నాతో పాటు చెల్లి. ఒకరోజు ఆ డబ్బు మా కళ్లలో పడింది. ఇద్దరం కలిసి నోట్లని చించి కిటికీల్లోంచి బయటికి విసిరేశాం. విషయం తెలిసి నాన్న చాలా కోప్పడ్డారు.
వారానికోసారి కలుస్తాండబ్బులు చించేశాచెల్లికీ పెళ్లైపోయింది. అన్నయ్య, నేను, చెల్లి వీలు చూసుకొని వారానికోసారి కలుస్తాం. అందరం కలసి భోజనం చేస్తాం. ఇంట్లో అమ్మ వండే వంటలన్నీ ఇష్టంగా తింటాను. నాకు ప్రత్యేకంగా నచ్చిన వంటకం అంటూ లేదు. షూటింగులకు ఎక్కడికంటే అక్కడికి వెళ్తుంటాను. అక్కడి వంటలను రుచిచూస్తాను.
కన్నీళ్లు ఆగలేదుఅన్నదాతల సమస్యలపై తమిళనాడు రైతులు దిల్లీలో పెద్ద ఉద్యమం చేశారు. అందులోభాగంగా వారి కష్టాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి నేను, ప్రకాశ్‌రాజ్‌గారు మరికొంతమంది వెళ్లాం. మేం అక్కడ అరుణ్‌జైట్లీతో మాట్లాడి బయటికి వచ్చేలోపు… జంతర్‌మంతర్‌లో ఓ రైతు ఆత్మహత్యయత్నం చేశాడు. నా జీవితంలో అతిపెద్ద బాధాకర ఘటన అది. నాకు కన్నీళ్లు ఆగలేదు. మేం రైతు కుటుంబం నుంచే వచ్చాం. వారు పొలంలో నిరంతరం కష్టపడితేనే మనందరికీ భోజనం దొరుకుతుంది. మరి వారే ఆకలితో అలమటిస్తున్నారు. వారిపట్ల దశాబ్దాలుగా నిర్లక్ష్యం కొనసాగుతోంది. దీన్ని ఎలాగైనా మార్చాలనేది నా తపన.
భవనం పూర్తైన తర్వాతే పెళ్లినేను ఎవరినీ ప్రేమించలేదు. వృత్తిని, రైతులనే ప్రేమిస్తాను. నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నేను చెప్పినవన్నీ చేశాను. కొన్ని పనులు సాగుతున్నాయి. ఇందులో ముఖ్యమైనది నడిగర్‌ సంఘం భవనం. ఇది వచ్చే ఏడాదిలో ప్రారంభమవుతుంది. ఇంటీరియర్‌ పనులు జరుగుతున్నాయి. ఈ భవనాన్ని పూర్తి చేసిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను. ఈ భవనం ద్వారా వచ్చే ఆదాయాన్ని సినిమా రంగంలో పనిచేసే ఎంతోమందికి వినియోగిస్తాం. అది చాలామందికి మేలు చేస్తుంది.
నిక్కచ్చిగా ఉంటాతప్పు జరిగితే ప్రశ్నిస్తాను. ఎవరు ఏమనుకుంటారోనని వెనుకడగువేయను. అందుకే కొందరు నన్ను కోపిష్టి అని కూడా అంటారు. ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోను. వరద, కరవు.. కష్టమేదైనా బాధితులకు నా వంతు సాయం చేయడానికి ప్రయత్నిస్తుంటా.
మంచి స్నేహితులుతెలుగు పరిశ్రమలో సందీప్‌కిషన్‌ తమ్ముడిలాంటి వాడు. రానా, నితిన్‌, నానీ, అల్లరి నరేశ్‌ ఇలా అందరూ మంచి స్నేహితులు. నేను ఏ కార్యక్రమం చేసినా ప్రోత్సహిస్తారు. తెలుగులో నటించమని కొన్ని ప్రతిపాదనలు వస్తున్నాయి.
మంచి పనే నాకు ఆనందంనా అభిమానులు చాలా మంది సినిమాల్లో నా పాత్రలా వేషం వేసుకొని ఫొటోలు పంపిస్తుంటారు. దీనికన్నా మీరుండే ప్రాంతంలో ఏదైనా మంచి పనిచేసి నాకు ఫొటో పంపితే నేను ఎక్కువగా సంతోషపడతాను.