కధానాయకుల పై విశ్లేషణ
మారిన మార్కెట్ ట్రెండ్‌కి అనుగుణంగా ఇప్పుడు ఏ భారీ సినిమా అయినా వందల కొద్దీ థియేటర్లలో రిలీజ్ అవుతోంది. దానికి తోడు కొద్ది నెలల క్రితం టికెట్ ధరలు కూడా పెంచడంతో ఇప్పుడు హిట్ అయిన సినిమాలు వందలాది థియేటర్లలో నోట్ల పండగ చేసుకుంటున్నాయి. ఈ ట్రెండ్‌లో మంచి టాక్ వచ్చిన సినిమా పెద్ద హిట్ అవడం ఎంత మామూలో… తేడా టాక్ వచ్చిన సినిమా బతికి బట్టకట్టడం అంత ఇంపాజిబుల్! అయితే తెలుగు సినిమాకి గత ఏడాదిలానే ఈసారి కూడా బాగా కలిసొచ్చింది. పెద్ద సినిమాల్లో ఎక్కువ శాతం హిట్ అయ్యాయి. స్టార్ హీరోల్లో చాలా తక్కువ మంది మాత్రమే విఫలమయ్యారు. స్టార్ హీరోల మధ్య నంబర్‌వన్ స్థానం కోసం కుర్చీలాట జరుగుతున్న నేపథ్యంలో ఓవరాల్‌గా తిరుగులేని నంబర్‌వన్ ఫలానా అని చెప్పడం చాలా కష్టం. అందుకే ఏ యేడాదికాయేడు ‘స్టార్ ఆఫ్ ది ఇయర్’ ఎవరని చూసుకుని రొటేషన్ పద్ధతిలో ట్రోఫీ ఇచ్చేయడమే! స్టార్ ఆఫ్ ది ఇయర్! గత ఏడాది టాప్ హిట్ ఆఫ్ ది ఇయర్ గబ్బర్‌సింగ్‌తో ‘స్టార్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచిన పవన్‌కళ్యాణ్ ఈసారి కూడా బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ది ఇయర్ దక్కించుకున్నాడు. గత ఏడాది ఆల్‌టైమ్ లిస్ట్‌లో నంబర్ 2 పొజిషన్‌తో సరిపెట్టుకున్న పవర్‌స్టార్ ఈసారి ఏకంగా ఆల్ టైమ్ నంబర్ వన్ హిట్ అందుకున్నాడు. ‘గబ్బర్‌సింగ్’ ఫ్లూక్ అని, మళ్లీ పవన్ పరాజయాల పరంపర కొనసాగిస్తాడని అనుకున్న వాళ్లు ఎవరైనా ఉంటే ‘అత్తారింటికి దారేది’తో ‘పవన్ ఈజ్ బ్యాక్’ అనేశారు. వరుసగా రెండేళ్లు టాప్ హిట్ కైవసం చేసుకున్న పవన్‌కళ్యాణ్ ఇదే జోరులో హ్యాట్రిక్ కొట్టేస్తాడా? ‘నంబర్‌వన్ ఎవరు?’ అనే డిబేట్‌కి తెరదించి కొంత కాలం ఆ సింహాసనం తనదేనని ‘గబ్బర్‌సింగ్ 2’తో స్పష్టంగా తేల్చేస్తాడా? మహేష్ 100% సూపర్‌స్టార్ మహేష్‌ది లాస్ట్ ఇయర్‌లానే ఈసారి కూడా ఒకే ఒక్క సినిమా రిలీజ్ అయింది. అది కూడా సంక్రాంతికే వచ్చింది. ‘దూకుడు’, ‘బిజినెస్‌మేన్’తో కెరీర్ బెస్ట్ ఫేజ్‌లో ఉన్నాడనిపించుకుంటున్న మహేష్ ఆ ఫామ్ ఈ ఏడాది కూడా కొనసాగించాడు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో విజయం సాధించి హిట్స్ హ్యాట్రిక్ కంప్లీట్ చేశాడు. మహేష్ ఆధిపత్యానికి పవన్‌కళ్యాణ్ నుంచి గట్టి సవాళ్లు ఎదురవుతున్నాయి. మహేష్ కంటే పెద్ద హిట్స్ సాధిస్తూ అతడిదే అనుకున్న నంబర్‌వన్ సీట్ కోసం మళ్లీ పోటీ పడేట్టు చేస్తున్నాడు పవన్. 1, ఆగడు రెండూ కూడా వచ్చే ఏడాది రిలీజ్ అవుతాయి కాబట్టి… ‘స్టార్ ఆఫ్ ది ఇయర్’ కిరీటాన్ని తిరిగి తన వశం చేసుకోవడానికి మహేష్‌కిదే బెస్ట్ ఛాన్స్. ఇక్కడ హిట్టు కొట్టి… అక్కడ పల్టీ కొట్టి! ఎన్టీఆర్‌కి ఈసారి కూడా టాప్ ఫైవ్ హిట్స్‌లో చోటు దక్కలేదు. భారీ అంచనాలతో విడుదలైన ‘బాద్‌షా’ బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ సాధించింది. ఓవరాల్‌గా నలభై అయిదు కోట్లకి పైగా షేర్ వసూలు చేసి ఎన్టీఆర్‌కి తొలిసారి నలభై కోట్ల క్లబ్‌లో స్థానం సంపాదించిపెట్టింది. కానీ ఆశించిన స్థాయిలో సంచలనాలని మాత్రం సృష్టించలేదు. నిర్మాత మరీ ఎక్కువ రేట్లకి అమ్మడంతో కొన్ని ఏరియాల్లో స్వల్ప నష్టాలు కూడా వచ్చాయని ట్రేడ్ రిపోర్ట్. ఎన్టీఆర్ స్టామినాకి ‘బాద్‌షా’ శాంపిల్ అని, ‘రామయ్యా వస్తావయ్యా’తో అసలు రేంజ్ చూపిస్తాడని ఊహించారు. కానీ ‘రామయ్య’ అనూహ్యంగా పల్టీ కొట్టాడు. ఇప్పుడు మిస్ అయినా నెక్స్‌ట్ టైమ్ రభస చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. రామ్ చరణ్‌కి కూడా ఈసారి సిమిలర్ ఎక్స్‌పీరియన్స్ ఎదురైంది. సంక్రాంతికి ‘నాయక్’గా వచ్చి మరోసారి తన ఫాలోయింగ్ ఏమిటో చూపించాడు. భారీ మల్టీస్టారర్‌తో పోటీగా వచ్చినా కానీ ‘నాయక్’ హిట్ అయింది. రచ్చ తర్వాత మరోసారి ఆర్డినరీ కంటెంట్‌తో హిట్ అయిన రామ్ చరణ్ మాస్ స్టార్‌గా బాగా ఎదిగిపోయాడనే సంగతి రుజువైంది. కానీ అతను కెరీర్‌లో తీసుకున్న అత్యంత బ్యాడ్ డెసిషన్ చరణ్ హ్యాట్రిక్ అవకాశాల్ని దెబ్బ తీసింది. తెలుగులో మంచి పొజిషన్ ఎంజాయ్ చేస్తున్న చరణ్ రాంగ్ టైమ్‌లో బాలీవుడ్‌లో అడుగుపెట్టి ఇటు తెలుగు, అటు తమిళంలో కూడా తుఫాన్/జంజీర్‌తో డిజాస్టర్ టేస్ట్ చేశాడు. ఈ తప్పు దిద్దుకోడానికి, మరో ఫ్లాప్ బారిన పడకుండా ఉండడానికి అతనికి ‘ఎవడు’తో ఛాన్స్ ఉంది. ఇదీ సంక్రాంతికే వస్తోంది కాబట్టి, మళ్లీ మహేష్‌తోనే పోటీ కాబట్టి ‘నాయక్’ స్టోరీ రిపీట్ అవుద్దేమో చూడాలి. ఘాటు పెరిగింది… జోరు తగ్గింది! ప్రభాస్‌కి ఇప్పుడు యూనివర్సల్ యాక్సెప్టన్సీ వచ్చేసింది. కేవలం మాస్ హీరోగానో, లేదా ఒక వర్గానికి మాత్రమే పరిమితమైన నటుడిగానో చూడడం లేదిప్పుడు. ప్రభాస్‌ని అన్ని వర్గాల ప్రేక్షకులు సమానంగా ఆదరిస్తున్నారు. తను ఎంచుకుంటున్న కథల్లో ఆ బ్యాలెన్స్ పాటించినట్టయితే ప్రభాస్ సినిమాకి తిరుగు ఉండదని ‘మిర్చి’తో ప్రూవ్ అయింది. సాధారణ కథే అయినా కానీ ‘మిర్చి’ బాక్సాఫీస్ వద్ద అంతలా అదరగొట్టిందంటే అందుకు ప్రభాస్ ప్రధాన కారణమని ఒప్పుకుని తీరాలి. మిర్చితో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగింది. కానీ ఇదే టైమ్‌లో అతడికి ‘బాహుబలి’ కారణంగా గ్యాప్ రానుంది. ఆ సినిమా ఎప్పుడొచ్చినా ఆ ఏడాదికి ప్రభాసే ‘స్టార్ ఆఫ్ ది ఇయర్’ అవుతాడని ఫిక్స్ అయిపోతున్నారు చాలామంది. జులాయితో హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఆ జోరు ఈసారి కొనసాగించలేకపోయాడు. పూర్ ఫామ్‌లో ఉన్న పూరి జగన్నాథ్‌తో ‘ఇద్దరమ్మాయిలతో’ చేసిన అల్లు అర్జున్ కేవలం ఓపెనింగ్స్‌తో సరిపెట్టుకున్నాడు. కానీ అల్లు అర్జున్ సినిమాల లైనప్ బాగుంది. సురేందర్‌తో ‘రేసుగుర్రం’ అనే కంప్లీట్ ఎంటర్‌టైనర్ చేస్తున్న బన్నీ ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటించబోతున్నాడు. కాబట్టి వచ్చే ఏడాది అల్లు అర్జున్ జోరు మళ్లీ పెరిగి టాప్ గేర్‌లోకి వెళ్లవచ్చు. బాలయ్య ఆబ్సెంట్, నాగ్ ఫెయిల్, వెంకీ స్ట్రగులింగ్ నిన్నటి తరం అగ్ర హీరోలు ఇప్పుడు యువ హీరోల ధాటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. గత వైభవాన్ని గత ఏడాదికే కోల్పోయిన సీనియర్లు ఈసారి కూడా విఫలమయ్యారు. బాలకృష్ణకి ఈ ఏడాదిలో సింగిల్ రిలీజ్ లేదు. శ్రీమన్నారాయణ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న బాలకృష్ణ ఇప్పుడు ‘సింహా’ దర్శకుడు బోయపాటి శ్రీనుతో ‘లెజెండ్’ చేస్తున్నారు. ఆయనలో ఇంకా మునుపటి వాడి మిగిలుందో లేదో అనేది ఈ సినిమాతో తెలుస్తుంది. నాగార్జునకి ఈ ఏడాది రెండు భారీ పరాజయాలు ఎదురయ్యాయి. గ్రీకువీరుడు కంటెంట్ ఫర్వాలేదని టాక్ వచ్చినా కానీ సమ్మర్‌లో కూడా ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేయలేకపోయింది. ఆ తర్వాత ‘భాయ్’గా స్వీయ నిర్మాణంలో నాగ్ చేసిన చిత్రం ఆయనకి పరాజయంతో పాటు పరాభవాన్ని మిగిల్చింది. విడుదలైన తర్వాత ఈ చిత్రం గురించి మాట్లాడేందుకు కూడా ఆయన ఇష్టపడలేదు. ‘జగద్గురు ఆది శంకర’ చిత్రంలో ప్రత్యేక పాత్ర చేసిన నాగార్జునకి దాంతోను మధుర స్మృతులేం దక్కలేదు. ‘మనం’తో మళ్లీ పుంజుకుంటారని అభిమానులు ఆశ పడుతున్నారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో హిట్ సొంతం చేసుకున్న వెంకటేష్‌కి ఆ సక్సెస్‌లో ఎంత క్రెడిట్ ఇవ్వాలనేది దాని ముందు, వెనుక ఆయన నటించిన సినిమాలు నిర్ణయిస్తాయని అనుకుంటే కనుక వెంకటేష్‌కి అసలు క్రెడిట్టే ఇవ్వలేని పరిస్థితి తలెత్తుంది. అలా అని సీ.వా.సి.చెలో ఆయన పాత్ర లేదనలేం. మహేష్‌లాంటి సూపర్‌స్టార్‌కి వెంకీలాంటి వెటరన్ స్టార్ తోడవడం దానికి పెద్ద అడ్వాంటేజ్ అయింది. కానీ వెంటనే ‘షాడో’తో కెరీర్‌లో అతి పెద్ద డిజాస్టర్‌ని చవిచూసిన వెంకటేష్‌కి ఆ తర్వాత మల్టీస్టారర్ ‘మసాలా’ కూడా కలిసి రాలేదు. మల్టీస్టారర్ సినిమాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్న వెంకీ నెక్స్‌ట్ ఇయర్ రామ్ చరణ్‌తో కలిసి కనిపించబోతున్నారు. అదరగొట్టారు కొంతకాలంగా వరుస వైఫల్యాలు చవిచూసిన రవితేజ ఎట్టకేలకు ‘బలుపు’ చూపించాడు. ఈ చిత్రంతో రవితేజ ఫ్లాప్ స్ట్రీక్ ఎండ్ అయి, మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇకపై మళ్లీ పట్టు కోల్పోకూడదని రవితేజ ఎప్పుడూ లేనంత కేర్‌ఫుల్‌గా ఉంటున్నాడిపుడు. బలుపు రిలీజ్ అయి ఆరు నెలలు అవుతున్నా ఇంతవరకు అతని కొత్త సినిమా మొదలు కాలేదు. గత ఏడాది ‘ఇష్క్’తో ఎనిమిదేళ్ల ఫ్లాపులకి ఫుల్‌స్టాప్ పెట్టిన నితిన్ ఈసారి అంతకుమించిన విజయాన్ని అందుకున్నాడు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఘన విజయంతో ఇప్పుడు నితిన్ ఫుల్ బిజీ అయిపోయాడు. ఇక్కడ్నుంచే అతను మరింత జాగ్రత్త పడాలి. సక్సెస్‌ని క్యాష్ చేసుకోవడం ఈజీనే కానీ నిలబెట్టుకోవడమే కష్టం. ఇన్నేళ్ల ఫ్లాపుల అనుభవంతో నితిన్ అది గ్రహించే ఉండాలి. వరుసగా రెండు భారీ ఫ్లాపులు చవిచూసిన తర్వాత ఒక ఏడాది మొత్తం సింగిల్ రిలీజ్ లేకుండా గడిపిన నాగచైతన్య ఎట్టకేలకు ‘తడాఖా’ చూపించాడు. ఈ చిత్ర విజయంతో మళ్లీ చైతన్య మునుపటిలా వేగంగా సినిమాలు చేస్తున్నాడు. రాబోయే సినిమాల్లో ఆటోనగర్ సూర్య, మనం ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాయి కాబట్టి నెక్స్‌ట్ ఇయర్ కెరీర్ పరంగా నాగచైతన్యకి చాలా కీలకం. యువ హీరోలు నిఖిల్ ‘స్వామిరారా’తో హిట్ కొట్టాడు. సుధీర్‌బాబు ‘ప్రేమకథా చిత్రమ్’తో సూపర్‌హిట్ కైవసం చేసుకున్నాడు. ఈ ఇద్దరూ ఇప్పుడు తమ తదుపరి చిత్రాలతో సేమ్ ఫీట్ రిపీట్ చేయాలని చూస్తున్నారు. బెదరగొట్టారు హీరోగా సక్సెస్ అయిన దగ్గర్నుంచి ప్రతి సంవత్సరం అత్యధిక చిత్రాల్లో నటిస్తూ వచ్చిన అల్లరి నరేష్ ఈసారి కేవలం రెండే రెండు సినిమాలతో సరిపెట్టుకున్నాడు. రెండూ కూడా ఘోరంగా ఫ్లాపయ్యాయి. యాక్షన్ 3డి, కెవ్వు కేక చిత్రాలు కామెడీ లవర్స్ పాలిట ట్రాజెడీగా మారాయి. మిడ్ రేంజ్ హీరోల్లో బ్యాంకబుల్ అనిపించుకున్న రామ్ ఇప్పుడు అందరి నమ్మకాన్ని కోల్పోతున్నాడు. గత ఏడాది ‘ఎందుకంటే ప్రేమంట’తో ఫ్లాప్ అయిన రామ్ ఈసారి ‘ఒంగోలు గిత్త’గా కొమ్ములు విరగ్గొట్టుకుని, మసాలాతో పూర్తిగా డీలా పడ్డాడు. ఇంకా తన తదుపరి చిత్రమేది అనేది అతను ఫిక్స్ కాలేదు. వీళ్లిద్దరికీ ఈ ఇయర్ వేక్`అప్ కాల్. ఇప్పటికీ జాగ్రత్త పడకపోతే ఇబ్బందులు తప్పవు. సీనియర్ హీరో శ్రీకాంత్ సేవకుడు, శత్రువు, షాడో సినిమాల్లో నటించాడు. అవకాశాలు వస్తున్నాయి కాబట్టి ఇంకా హీరోగా కొనసాగుతున్నాడేమో అనిపిస్తోంది. శ్రీకాంత్‌ని ఆడియన్స్ ఎప్పుడో పట్టించుకోవడం మానేసారు. జగపతిబాబుకి కూడా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. కేవలం ‘ఆపరేషన్ దుర్యోధన 2’ మాత్రమే చేసాడు. ఫలితం ఊహించుకోవచ్చు. రాజశేఖర్ కూడా డిట్టో. మహంకాళితో మహా ఘోరమైన ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. అతనితో మొదలుపెట్టిన సినిమాలు కూడా పూర్తి కాక అలా మధ్యలోనే ఆగిపోయి ఉన్నాయి. ఉదయ్ కిరణ్ చాలా కాలం తర్వాత మళ్లీ తెరపై కనిపించాడు. ‘జై శ్రీరామ్’ మంత్రం పఠించినా అతడ్ని రాముడు కరుణించలేదు. సిద్ధార్థ్ ఇప్పుడు పూర్తిగా తమిళ హీరోగా కన్వర్ట్ అయిపోయాడు. అతను నటించిన చివరి పూర్తి స్థాయి తెలుగు సినిమా జబర్దస్త్ మట్టి కరిచింది. అతని తమిళ చిత్రాలు అక్కడ బాగా ఆడుతూ, ఇక్కడ విఫలమవుతూ సిద్ధార్థ్‌కి తన ‘హోమ్’ ఏదనేది క్లియర్‌గా చూపిస్తున్నాయి. ‘గౌరవం’ కోసం పాకులాడిన అల్లు అరవింద్ చిన్న కొడుకు శిరీష్ మొదటి సినిమాతోనే చాలా విమర్శలు చవిచూశాడు. అయినా కానీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మారుతి భుజాలపై ఒడ్డు చేరుకోవాలని చూస్తున్నాడు. నందమూరి కళ్యాణ్‌రామ్‌కి ‘ఓం’తో నటుడిగా ఫ్లాప్ రావడంతో పాటు నిర్మాతగా తీవ్రంగా లాస్ కూడా వచ్చింది. సాయికుమార్ తనయుడు ఆది ‘సుకుమారుడు’తో ఘోరమైన పరాజయాన్ని చవిచూశాడు. నారా రోహిత్ ‘ఒక్కడినే’ అంటూ వచ్చి ఒక్కరినీ మెప్పించలేకపోయాడు. ‘ఫ్లాప్ హీరో ఆఫ్ ది ఇయర్’ కిరీటాన్ని మాత్రం వరుణ్ సందేశ్ కైవసం చేసుకున్నాడు. అందరికంటే ఎక్కువగా నాలుగు సినిమాల్లో నటించిన వరుణ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్లాప్ రికార్డ్ మెయింటైన్ చేశాడు. అతను నటించిన సినిమాలు కొన్ని ఎప్పుడు వచ్చి వెళ్లిపోతున్నాయో కూడా తెలీడం లేదు. చమ్మక్ చల్లో, ప్రియతమా నీవచట కుశలమా, సరదాగా అమ్మాయితో, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్… ఈ సినిమాల పేర్లు కూడా చాలా మంది విని ఉండకపోవచ్చు. ఇప్పటికీ ఇంకా తన చేతిలో అవకాశాలైతే ఉన్నాయి కాబట్టి వరుణ్ సందేశ్ ఇక మీదటైనా సక్సెస్ కాలేకపోతే ఆల్రెడీ ఆడియన్స్ మర్చిపోయిన అతడ్ని ఇకపై ప్రొడ్యూసర్స్ కూడా కేర్ చేయరు. ఫర్వాలేదనిపించారు గోపీచంద్ ‘సాహసం’ సినిమాతో యావరేజ్ ఫలితాన్ని అందుకున్నాడు. ఇప్పటికీ అతని కష్టాలు అయితే తొలగిపోలేదు. హీరో అయిన కొత్తల్లో వరుస విజయాలు అందుకున్న గోపీ ఇప్పుడా రోజుల కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. వెటరన్ డైరెక్టర్ బి. గోపాల్‌తో చేస్తున్న సినిమా ఎంతవరకు అతని ఎదురు చూపులకి బదులిస్తుందో మరి. మంచు సోదరుల్లో మనోజ్ ‘పోటుగాడు’ యావరేజ్ కంటే ఎక్కువగా, విష్ణు ‘దూసుకెళ్తా’ కమర్షియల్‌గా యావరేజ్ రేంజ్‌కి తక్కువగా పర్‌ఫార్మ్ చేశాయి. వీరు ఎదురు చూస్తున్న భారీ విజయాలు మంచు సోదరుల్ని ఓవర్ లుక్ చేస్తున్నాయి. ఎమ్మెస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ రెండో సినిమా ‘అంతకుముందు ఆ తరువాత’తో కొంచెం ఇంప్రెస్ చేశాడు. సునీల్ ‘మిస్టర్ పెళ్లికొడుకు’గా తిరస్కారానికి గురైనా ‘తడాఖా’ విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. గుండెల్లో గోదారితో గట్టున పడకపోయినా, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ఎక్కి సక్సెస్ గమ్యం చేరుకున్నాడు సందీప్ కిషన్. ఇతని చేతిలో ఇంట్రెస్టింగ్ మూవీస్ ఉన్నాయి కాబట్టి సందీప్ కిషన్ కెరీర్‌కి 2014 చాలా చాలా ఇంపార్టెంట్. స్టార్ హీరోల మధ్య గట్టి పోటీ జరుగుతున్నట్టే.. యువ హీరోల నడుమ కూడా కాంపిటీషన్ బాగుంది. ఒకప్పుడు బిజీ అయిన వాళ్లు ఇప్పుడు అంతగా బిజీగా లేక, ఇంతకుముందు అవకాశాల్లేని వారు ఇప్పుడు చేతి నిండా ఆఫర్లతో… హీరోలందరి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అందుకే పరిశ్రమకి అటు పెద్ద, ఇటు చిన్న సినిమాల ద్వారా విజయాలు లభించి గుడ్ టైమ్ నడుస్తోంది. వరుసగా రెండో ఏడాది కూడా తెలుగు సినిమాకి బ్రహ్మాండంగా కలిసి వచ్చింది. ఇప్పటికీ పరాజయాలు లేవని కాదు కానీ… పకడ్బందీ ఫార్ములాని, లేదా ఆకట్టుకునే కొత్తదనాన్ని, అన్నిటికీ మించి వినోదాన్ని నమ్ముకున్న హీరోలంతా సక్సెస్ అవుతున్నారు. ఫెయిల్ అవుతున్న వారంతా తాము ఎక్కడ తప్పు చేస్తున్నామనేది తెలుసుకుని, హిట్టవుతున్న హీరోలు ఎంచుకుంటున్న సినిమాల్ని చూసి తమ పొరపాట్లు దిద్దుకుంటే… వచ్చే ఏడాదిలో జీరోల కంటే హీరోలే ఎక్కువ ఉంటారు. అలాగే సీనియర్ స్టార్లు సోలో హీరోయిజంపై ఇంట్రెస్ట్ తగ్గించుకోవాల్సిన టైమ్ వచ్చిందేమో ఆత్మ పరిశీలన చేసుకుంటే యువ హీరోలకి బలమవుతారు, ఎక్కువ విజయాలకి బాటలు వేసిన వారవుతారు.