DIRECTORS

Director Raj (Mallesam film)

అందుకే ‘మల్లేశం’ నచ్చాడు

చింతకింది మల్లేశం.. ఆసుయంత్రం రూపకర్త. అయితే ఏంటి? భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. అందుకే సినిమా తీసేయాలా? ఓ పల్లెటూరి మనిషి జీవితంలో సినిమా తీసేంత ఏముంటుంది? అని ఆలోచించలేదు దర్శకుడు రాజ్‌. మల్లేశం బతుకు పోరాటంలోని స్ఫూర్తిని చూశాడతను. మల్లేశం అనుభవించిన కష్టాలను చూశాడతను. ప్రతి మనిషి జీవితంలోనూ ఉండే ఎమోషన్స్‌ను పసిగట్టాడతను. అందుకే ఓ సామాన్యుడిని ‘హీరో’గా చేస్తూ ‘మల్లేశం’ సినిమా తీశాడు. ఆ చిత్రం ఈనెల 21న విడుదల కానుంది. ఈ సినిమా ప్రయాణంలోని అనుభవాలను పంచుకున్నాడిలా…

చింతకింది మల్లేశం జీవితాన్ని అమెరికాలో ఉన్న మీరు ఎందుకు తెరకెక్కించాలనుకున్నారు?
రాజ్‌ : అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న నాకు ఓ రోజు వాట్సప్‌లో ఓ లింక్‌ వచ్చింది. అది నా స్నేహితుడు పంపాడు. ఆ యూట్యూబ్‌ వీడియో చింతకింది మల్లేశం టెడ్‌ఎక్స్‌వీడియో. ఆరోజంతా  వెంటాడింది మల్లేశం జీవిత కథ! దీంతో ఆయన కథను రాయటం మొదలెట్టా (అప్పటికే 11 ఏళ్లక్రితం ఓ తమిళ సినిమాకు స్క్రీన్‌ప్లే రాసి నిర్మాతగా మారి చేతులు కాల్చుకున్నా. మూడుకోట్ల రూపాయలు పోయి బాధలు, కష్టాలు వచ్చాయి. దీంతో అమెరికావెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నా). మల్లేశం జీవితంలో ఎన్నో సంఘటనలు మనసును కదిలించేవి ఉన్నాయి కాబట్టి సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. మార్కెట్లో వర్క్‌అవుట్‌ కాదని స్నేహితులు చెప్పారు. ఎవరెన్ని చెప్పినా.. నా మనసుకు ఆ సినిమా చేయాలనే అన్పించింది. దీంతో వెంటనే నా స్నేహితుడ్ని మల్లేశం ఇంటికి పంపించి విషయం చెప్పమన్నా.

‘మల్లేశం’ ఎందుకు మీకు అంతగా నచ్చాడు?
రాజ్‌ : ఆరోతరగతిలోనే బడి మానేసిన మల్లేశం.. ఏడేళ్లపాటు కొన్ని వందల సార్లు ఫెయిలయ్యాడు. అయినా వెనక్కితగ్గలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం చేశాడు. చివరికి ఆసుయంత్రం కనిపెట్టాడు. అమ్మకష్టాలు చూసి.. ఆ కష్టాల్ని అమ్మకే కాదు మరే అమ్మకూ రాకూడదనే ఆలోచనతో ఈ పనిచేశాడాయన. పద్మశ్రీ అయ్యాడు. పట్టింది వదలని ఆ తత్వమే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నా జీవితమూ అంతే. సినిమా తీయాలని కోలీవుడ్‌కి వెళ్లా. తీశా. ఫెయిలయ్యా. అయినా మళ్లీ కథలు రాసుకుంటున్నా. ఎన్ని కష్టాలొచ్చినా దర్శకుడిగా పనిచేయాలనే ఆశయం, స్ఫూర్తి మల్లేశం జీవితం నుంచే పొందా.

మీరు సినీ ప్రయాణం ఎలా మొదలెట్టారు?
రాజ్‌ : మాది కరీంనగర్‌. నేను పుట్టి పెరిగింది రామగుండంలోని ఎఫ్‌సీఐలో. మా నాన్న అకౌంట్‌ ఆఫీసర్‌. అమ్మ గృహిణి. అక్కడే ఇంటర్‌వరకూ చదివా. ‘ఓయూ’లో ఇంజినీరింగ్‌ చేశా. ఆర్వాత సత్యం సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశా. 1998లో అమెరికా వెళ్లా. నేను అమెరికాకి వెళ్లినపుడు అక్కడ షార్ట్‌ఫిల్మ్స్‌ కల్చర్‌ ఉండేది. మేకింగ్‌ గురించి ఏమీ తెలియని వాళ్లు అసిస్టెంట్‌గా పనిచేసేవారు. నేను బ్యాచిలర్‌ని కాబట్టి ఆ పనే చేశా. ఆ తర్వాత పెళ్లికావటంతో షార్ట్‌ఫిల్మ్స్‌ గురించి అసలే ఆలోచించలేదు. చిన్న కథలు రాస్తూ ఉండేవాణ్ణి.

మీరేమో అమెరికా… సినిమా కోసం తెలంగాణ గ్రామీణ నాడి ఎలా పట్టారు?
రాజ్‌ : స్క్రీన్‌ప్లేపై నమ్మకమున్నా డైలాగ్స్‌ మంచివి రాసుకోలేదు. అలాంటి సమయంలో రచయిత పెద్దింటి అశోక్‌కుమార్‌ను కలిశా. తర్వాత ఈ కథ మంచి స్థాయికి వెళ్లింది. నేను పుట్టిపెరిగింది తెలంగాణలో అయినా పల్లెజీవితం అనుభవించలేదు. అందుకే ఓ ఆలోచనకి వచ్చా. ప్రీప్రొడక్షన్‌ అంతా హైదరాబాద్‌లో కాకుండా ఓ మూరుమూల ఊర్లో చేయాలనుకున్నా. అలా నటులు, టెక్నీషియన్లంతా కలిపి నలభైమందిమి.. నాలుగైదు నెలలపాటు పోచంపల్లి పక్కన ఉండే రేవణపల్లిలో ఉన్నాం. అక్కడ మగ్గంమీద బతికే జీవితాల్ని దగ్గరగా చూశాం. ఆర్ట్‌డైరెక్టర్‌గా లక్ష్మణ్‌ ఏలేగారిని ఎంచుకున్నా. మగ్గం దాంతో ముడిపడిన జీవితాలు ఆయనకు తెలుసు, తెలంగాణ చరిత్ర, అనుభవం ఆయనుకుంది. సింక్‌సౌండ్‌ కోసం బాలీవుడ్‌లో ‘తితీ‘ అనే ఇంటర్నేషనల్‌ అవార్డ్‌ ఫిల్మ్‌కి పనిచేసిన నితిన్‌ లుకోజ్‌ను తీసుకున్నా. ఈ టెక్నిక్‌కే ఇరవై ఐదు లక్షలు ఖర్చుపెట్టా. కెమెరామెన్‌ బాలు, ఎడిటర్‌ రఘు.. ఇలా తెలంగాణ వ్యక్తులు కావటంతో అందరూ ప్రీప్రొడక్షన్‌లోనే సాయం చేసేవారు. చిన్న సినిమా కావటం వల్ల ఆర్టిస్టుల డేట్స్‌ అడ్జస్ట్‌ కాక షూటింగ్‌కి ఐదు నెలలు పట్టింది. మల్లేశం పాత్రలో నటించిన దర్శి, అమ్మపాత్రలో నటించిన ఝాన్సీ, మల్లేశం భార్యపాత్రలో నటించిన అనన్య చేసిన హోమ్‌ వర్క్‌ అద్భుతం. ఈ సినిమాతో ఎన్నో విషయాలు నేర్చుకున్నా.

- రాళ్లపల్లి రాజావలి

 

Director Nandinireddy


ఎందుకలా చూస్తున్నారో అర్థమయ్యేది కాదు
అమ్మాయిలంతా తొక్కుడు బిళ్ల ఆడుకుంటుంటే.. తను మాత్రం అబ్బాయిలతో పోటీపడి మరీ క్రికెట్‌ ఆడి ‘పెంకిపిల్ల’ అనిపించుకుంది. మగాళ్లు ఆధిపత్యం చలాయించే చిత్రసీమలో అడుగుపెట్టే ధైర్యం బహుశా ఆ పెంకితనమే ఇచ్చుంటుంది. ప్యాంటూ, షర్టు, ఉంగరాల జుట్టూ వాలకం చూస్తే ‘మగరాయుడే’. కాకపోతే… లోలోపల ‘అమ్మాయితనం’ అలానే ఉంది. అందుకే సున్నితమైన కథల్ని వెండి తెరపై హృద్యంగా చూపిస్తుంది. తొలి సినిమాకే దర్శకురాలిగా నంది అవార్డు అందుకుని.. ‘యాక్షన్‌’ చెప్పగలిగే దమ్ము అమ్మాయిలకూ ఉందని నిరూపించింది… నందినిరెడ్డి. ప్రస్తుతం సమంతని ‘ఓ బేబీ’గా మార్చేసింది. ఈ సందర్భంగా నందినిరెడ్డిని పలకరిస్తే.. తన బాల్యం, బలం, బలగం.. అన్నింటి గురించీ ఇలా చెప్పుకొచ్చింది.

కొరియన్‌ చిత్రం ‘మిస్‌ గ్రానీ’ని ‘ఓ బేబీ’గా తీశారు. ఆ కథని తెలుగులో చెప్పాలని ఎందుకు అనిపించింది?
అయిదేళ్ల క్రితం ఆ సినిమా వచ్చింది. ఎప్పుడూ ఎవరూ చెప్పని కథ కాదు. చెప్పిన విధానం నాకు కొత్తగా అనిపించింది. చైనా, జపాన్‌, మలేసియా, ఫిలిప్పీన్స్‌.. ఇలా చాలా భాషల్లో ఈ కథని రీమేక్‌ చేశారు. అన్నిచోట్లా బాగా ఆడింది. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండాల్సిన బంధాన్ని చాలా అందంగా చూపించారు. ఈ కథని తెలుగువాళ్లకు చెప్పాలి అనిపించింది. అందుకే ‘ఓ బేబీ’గా తీసుకొస్తున్నాం. ఈ కథ చాలా భాషల్లో వచ్చినా నేను ‘మిస్‌ గ్రానీ’ని మాత్రమే చూశా. అదీ ఒక్కసారే. ఎందుకంటే… నేను తీసేది తెలుగు సినిమా. ఇక్కడి భావోద్వేగాలు వేరు. సినిమాని ప్రేక్షకుడు చూసే విధానం వేరు. 40 శాతం మార్పులూ చేర్పులూ చేసి, ఓ అచ్చమైన తెలుగు సినిమాలా ఆవిష్కరించాను.

70 ఏళ్ల బామ్మ 24ఏళ్ల పడుచు పిల్లగా మారిపోవడం ‘ఓ బేబీ’ కథ. మరి మీకా అవకాశం వస్తే ఏ వయసులోకి వెళ్లిపోవాలనుకుంటారు?
నాకింకా 70 ఏళ్లు రాలేదు కదా? (నవ్వుతూ). నిజంగా ఆ అవకాశం వస్తే నా బాల్యంలోకి వెళ్లిపోతా. ఎందుకంటే స్కూల్‌, కాలేజ్‌ లైఫ్‌ బాగా ఎంజాయ్‌ చేశాను. ఆటలు, స్నేహితులు, అమ్మమ్మ, తాత, తమ్ముడూ ఇలా సరదాగా సాగిపోయింది. దీపావళి వస్తే టపాకాయలు విపరీతంగా కాల్చేదాన్ని. సంక్రాంతికి గాలిపటాలు ఎగరేసేదాన్ని. క్రికెట్‌ బ్యాటు పట్టుకుంటే.. ఇక సందడే సందడి. నా బాల్య స్నేహితులు ఇప్పటికీ నాతోనే ఉన్నారు. స్కూల్లో నాటకాలు వేసేవాళ్లం. వక్తృత్వ పోటీల్లో పాల్గొనేదాన్ని. బోలెడన్ని సినిమాలు చూసేదాన్ని. వర్షం పడుతుంటే బైక్‌ మీద తడుచుకుంటూ షికారుకి వెళ్లేవాళ్లం. కాలేజీ గోడలు దూకి సంతోష్‌, స్వప్న థియేటర్లలో సినిమాలు చూశాం. ఒక్కటేంటి? నేను చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఆ రోజులన్నీ మళ్లీ రావాలనుకుంటాను.

పదకొండుమంది అబ్బాయిలు ఆడే క్రికెట్‌ ఆటలో.. అమ్మాయిగా మీకెలా చోటు దక్కింది?
మా ఇంటి పక్కనే క్రికెట్‌ ఆడుకునేవాళ్లు. రోజూ గోడ పక్కన నిలబడి చూస్తూ ఉండేదాన్ని. ఓరోజు ఓ టీమ్‌లో 10మందే వచ్చారు. మరో ప్లేయర్‌ కోసం వాళ్లు ఎదురుచూస్తున్నారు. ఇదే అవకాశం అనుకుని ‘నేనూ ఆడనా’ అని అడిగాను. వాళ్ల అవసరం కొద్దీ నన్ను టీమ్‌లోకి తీసుకున్నారు. బ్యాట్స్‌మెన్‌ కొట్టిన బంతి ఎలా ఆపాలో అర్థమయ్యేది కాదు. అందుకే నా గౌన్‌ అడ్డం పెట్టి ఆపేసేదాన్ని. ‘అదేంటి? అలా ఆపకూడదు’ అని గొడవ పెట్టుకుంటే.. ‘బంతిని ఆపానా? లేదా? ఎలా ఆపితే నీకేంటి?’ అని నేనూ గొడవ పెట్టుకునేదాన్ని. అలా నేను బెస్ట్‌ ఫీల్డర్‌ అయిపోయాను. అప్పటి నుంచీ ‘నందిని మాకే కావాలి’ అని రెండు జట్లూ కొట్టుకునేవి. అప్పటి నుంచి క్రికెట్‌ బాగా నచ్చేసింది. స్కూల్‌, కాలేజీ ప్రతీ చోట క్రికెట్‌ ఆడేదాన్ని. కోటీ ఉమెన్స్‌ కాలేజీలో డిగ్రీ చదవడానికి కారణం కూడా ఆ కాలేజీకి పెద్ద క్రికెట్‌ గ్రౌండ్‌ ఉండడమే.

దిల్లీ జేఎన్‌యూలో పీజీ చేశారు కదా. ఆ రోజులు ఎలా గడిచాయి?
నా జీవితంలో విలువైన రోజులవి. అప్పటి వరకూ ఇల్లు, స్కూలు, ఫ్రెండ్సూ ఇదే ప్రపంచం అనుకునేదాన్ని. అక్కడకు వెళ్లాక మరో ప్రపంచం ఉంటుందని అర్థమైంది. పొలిటికల్‌ సైన్స్‌లో పీజీ చేశాను. క్యాంటీన్‌లో పెద్ద పెద్ద చర్చలు జరిగేవి. బడా రాజకీయ నాయకులంతా వచ్చేవారు. సామాజిక, రాజకీయ విషయాల్లో చాలా అవగాహన వచ్చింది. అప్పట్లో సివిల్స్‌ రాయాలని గట్టి కోరిక. అయితే నాలా ఉండేవాళ్లు సివిల్స్‌కి పనికిరారు అనిపించింది. యాడ్‌ ఏజెన్సీ పెట్టుకుందాం అనుకున్నాను. చివరికి గుణ్ణం గంగరాజుగారు పరిచయమయ్యారు. ఆయన దగ్గర ‘లిటిల్‌ సోల్జర్స్‌’కి సహాయ దర్శకురాలిగా పనిచేశా. అప్పటి నుంచీ జర్నీ మొదలైంది.

లైంగిక వేధింపుల కమిటీలో కీలక పాత్ర పోషిస్తున్నారు కదా? ఆ కమిటీ పనులు ఎంత వరకూ వచ్చాయి?
ఇప్పుడే ఓ విత్తనం వేశాం. మొలకెత్తడానికి సమయం పడుతుంది. అమ్మాయిలు తమ సమస్యని ధైర్యంగా చెప్పుకొనే వాతావరణం కల్పించాలి. తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు వేయొచ్చు? న్యాయపరంగా ఉన్న సమస్యలేంటి? వీటిపై మేం చర్చలు జరుపుతున్నాం. దేశంలో ఏ పరిశ్రమా వేయని అడుగు ఇది. కచ్చితంగా మంచి ఫలితాలుంటాయి.

సహాయ దర్శకురాలిగా చేసేటప్పుడు ఎలా ఉండేది?
అవును. ‘లిటిల్‌ సోల్జర్స్‌’ సెట్‌కి వచ్చినవాళ్లంతా నన్ను వింతగా చూసేవారు. నన్ను డాన్స్‌ అసిస్టెంటో, మేకప్‌ అసిస్టెంటో అనుకునేవారు. వాళ్లు అలా ఎందుకు చూస్తున్నారో నాకూ అర్థమయ్యేది కాదు. ఆ సినిమా పూర్తయ్యేసరికి ‘ఇండస్ట్రీలో అమ్మాయిలు తక్కువ. అందుకే నన్ను అలా చూస్తున్నార’న్న సంగతి తెలిసింది.

సినిమాలంటే ఇంట్లో ఒప్పుకొన్నారా?
మా కుటుంబంలో లాయర్లు, డాక్టర్లు ఎక్కువ. సినిమా నేపథ్యం అస్సలు లేదు. నా టైమింగ్స్‌ పూర్తిగా మారిపోయేవి. ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికి వెళ్లేదాన్ని. తెల్లవారు జామున మళ్లీ బయటకు వచ్చేసేదాన్ని. దాంతో ఇంట్లోవాళు,్ల చుట్టాలు మా అమ్మని తిట్టేవారు. కానీ నా ప్యాషన్‌ని అమ్మ అర్థం చేసుకుంది.

ప్యాంటూ, షర్టూ అలవాటు ఎప్పటి నుంచీ?
కాలేజీ అయ్యాక ఏడెనిమిది ఏళ్ల వరకూ చీరలు కట్టేదాన్ని. అయితే.. వేగంగా నడవడం నాకు అలవాటు. చీర కడితే అడుగులు చిన్నగా వేయాల్సివచ్చేది. అందుకే ఈ ట్రెండ్‌కి మారా. ఇక జుత్తు అంటారా.? నాది ఉంగరాల జుత్తు. అమ్మ జడలు వేస్తున్నప్పుడు బాగా నొప్పి పుట్టేది. అందుకే ఓసారి అమ్మకు చెప్పకుండా జుత్తు కత్తిరించుకున్నా. ఆ తరవాత చివాట్లూ తిన్నా. ఇప్పుడు ఆ హెయిర్‌ స్టైలే కంటిన్యూ అవుతోంది.

పుస్తకాలంటే చాలా ఇష్టం. కథలు, నవలలూ అన్నీ చదువుతా.  ట్రావెలాగ్‌ కూడా ఇష్టం. కల్చర్‌కి సంబంధించిన పుస్తకాలంటే మరీ ఇష్టం. ఆర్‌కే నారాయణ్‌, రస్కిన్‌ బాండ్‌ పుస్తకాలు చదివితే, ఆ అక్షరాల్లోకి, ఆ కథల్లోకి మనమూ వెళ్లిపోయినట్టు అనిపిస్తుంది. కథ రాసే ప్రయత్నం మాత్రం చేయలేదు. అంత ప్రతిభ నాలో లేదనిపిస్తుంది.
‘అలా మొదలైంది’కి ముందే సినిమాలు వదిలేద్దాం అనిపించింది. ఎందుకంటే అప్పటికి తొలి ఛాన్స్‌ కోసం ఆరేళ్లు ఎదురుచూశా. నా స్నేహితులంతా స్థిరపడిపోయారు. ఎక్కడికైనా పార్టీకి వెళ్తే.. వాళ్ల జేబుల్లోంచి డబ్బులు తీసేవాళ్లు. ‘ఇదేంటి ఇప్పటికీ మన డబ్బులు మనం సంపాదించుకోలేమా? సినిమాల్లోకి వచ్చి తప్పు చేశామా’ అనిపించేది. అయితే ఆ ఫీలింగ్‌ ఎక్కువ సేపు ఉండేది కాదు. ఎవరైనా ఫోన్‌ చేసి ‘నీ దగ్గర మంచి కథ ఉందా’ అని అడిగితే.. మళ్లీ కొత్త ఉత్సాహం వచ్చేసేది.
* డబ్బుని ఎలా హ్యాండిల్‌ చేయాలో తెలీదు. అందుకే నేను నిర్మాణ రంగానికి దూరం. నిర్మాణం వేరు.. సృజనాత్మకత వేరు. ఒకటి ఆన్‌ అయితే మరొకటి ఆఫ్‌ అయిపోతుంది.
* వంట చేయడం బాగా వచ్చు. కోడికూర బాగా వండుతా.
* నేను మంచి స్విమ్మర్‌ని. క్రికెట్‌తో పాటు బ్యాడ్మింటన్‌ అంటే చాలా ఇష్టం.
- మహమ్మద్‌ అన్వర్‌, ఫొటో: జయకృష్ణ

 

director Gowtam Tinnanuri

నానీకి కథ నచ్చలేదు అనుకున్నా!

జెర్సీ… టాలీవుడ్‌ని మరో మెట్టెక్కించిన సినిమాగా ప్రేక్షకులతోపాటు సినీ వర్గాలూ ప్రశంసిస్తున్నాయి. ఆంధ్రా, నైజాం, సీడెడ్‌ ప్రాంతాలూ… ఏ, బీ, సీ సెంటర్లూ అన్న తేడా లేకుండా అంతటా కలెక్షన్లు కురిపిస్తున్న ‘జెర్సీ’ వెనక కీలకవ్యక్తి దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి. సుఖంగా ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలి సినిమాల కోసం వచ్చి ఎదుర్కొన్న కష్టాల్నీ,  జెర్సీ కోసంపడ్డ శ్రమనీ, తన విజయం వెనకున్న వ్యక్తుల్నీ గుర్తుచేసుకుంటున్నాడిలా…

మా సొంతూరు రాజమండ్రి. అక్కడే ఇంటర్మీడియెట్‌ వరకూ చదువుకున్నా. 2004లో గుడ్లవల్లేరులో ఇంజినీరింగ్‌ పూర్తిచేశాక దిల్లీ వెళ్లి ఎంబీఏ చేశా. తర్వాత బెంగళూరు యాక్సెంచర్‌లో ఐటీ కన్సల్టెంట్‌గా చేరా. చదువుకునే రోజుల్లో ‘మంచి ఉద్యోగం సంపాదిస్తే జీవితంలో అంతకంటే ఏం కావాలి’ అనుకునేవాణ్ని. కానీ ఉద్యోగంలో చేరిన కొన్నేళ్లకే ఇంకేదో కావాలీ, చెయ్యాలీ అనిపించింది. అప్పటికే బెంగళూరులో స్టార్టప్‌ల సందడి బాగా ఉండేది. కొద్దిమంది ఫ్రెండ్స్‌తో కలిసి ఆ ప్రయత్నమూ చేశాను. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. అప్పుడే హైదరాబాద్‌లో ఉంటున్న స్కూల్‌ ఫ్రెండ్‌ ఫోన్‌ చేసి సినీ హీరో అయ్యే ప్రయత్నాల్లో ఉన్నట్టు చెప్పాడు. అప్పుడు నాకో ఆలోచన వచ్చింది. ‘ఒక వెబ్‌సైట్‌ పెట్టి అందులో సినిమాల్లోకి రావాలనుకునేవాళ్లు ప్రొఫైల్స్‌ పెడితే, వాటిని దర్శకనిర్మాతలు చూసి ఆఫర్లు ఇచ్చేలా చేస్తే…’ అన్నాను. వాడూ సరే అన్నాడు. హైదరాబాద్‌లో ఉంటేనే ఇది సాధ్యమని, ఇక్కడకు వచ్చి డెలాయిట్‌లో చేరాను.

అనుకోకుండా సినిమాల్లోకి…
మా వెబ్‌సైట్‌కి అనుకున్న స్పందన రాలేదు. ఆ తర్వాత కూడా మా ఫ్రెండూ నేనూ సినిమాల గురించే మాట్లాడుకునేవాళ్లం. వాడికి కొన్ని కథల ఆలోచనలు ఉండేవి. స్కూల్‌ రోజుల నుంచీ చిన్న చిన్న కథలూ, కాన్సెప్ట్‌లు రాయడం నాకు అలవాటు. మావాడి ఆలోచనలకి నా అనుభవాన్ని జోడించి కథలు రాసేవాణ్ని. అలా రాసే క్రమంలో ఒక కథ పూర్తిస్థాయి సినిమా స్క్రిప్టుగా తయారైంది. దాన్ని నిర్మాణ సంస్థలకు అమ్మే ప్రయత్నం చేశాం. అప్పుడు ఒకాయనకి మా కథ నచ్చి ‘డబ్బు పెడతా, మీరే డైరెక్షన్‌ చెయ్యండి’ అన్నాడు. నా ఫ్రెండ్‌ దర్శకుడిగా, నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా సినిమా మొదలుపెట్టాం. ఫుల్‌టైమ్‌ పనిచేయాలని ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఓ ఆరు నెలలు పూర్తిగా సినిమాకి కేటాయించాలనుకున్నాను. ఎప్పుడైనా షూటింగ్‌ చూడ్డం తప్పించి సినిమా తీసిన అనుభవం మాకు లేదు. అయినా కష్టపడి నెలరోజుల్లో షూటింగ్‌ పూర్తిచేశాం. మా ఫ్రెండ్‌ హైదరాబాద్‌లో సినిమా పనులు చూసుకుంటే, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల కోసం నేను చెన్నై వెళ్లాను. ఆ పనులు జరుగుతుండగానే నిర్మాత చేతులు ఎత్తేశాడు. ఆలోపు చెన్నైలో మా సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్‌ అందరూ నాకు ఫ్రెండ్స్‌ అయిపోయారు. వాళ్లతో పనిచేస్తున్నపుడే సినిమా తీయడం గురించి అవగాహన వచ్చింది. ఇష్టమూ పెరిగింది. అక్కడే వాళ్లకి అసిస్టెంట్‌గా ఉంటూ ఎడిటింగ్‌, సౌండ్‌ మిక్సింగ్‌… లాంటివి తెలుసుకున్నాను. 2011-12 మధ్య దాదాపు ఏడాదిన్నరపాటు అక్కడ పనిచేశా. 2012 చివర్లో మళ్లీ
హైదరాబాద్‌ వచ్చి సొంతంగా కథలు రాసేవాణ్ని. వాటిని ఎవరికైనా ఇద్దాం అని నిర్మాతల్ని సంప్రదించేవాణ్ని. కానీ సరైన స్పందన వచ్చేది కాదు. అప్పుడే డైరెక్షన్‌ వైపు వెళ్లాలనుకున్నాను.

హిట్‌ అంటే నమ్మలేదు!
కొంతమంది నిర్మాతల్ని కలిసి ‘మళ్లీరావా’ స్క్రిప్టుని వినిపించినా ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడే రాహుల్‌ యాదవ్‌ సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎవరో స్టోరీ చెబుతామంటే, విని సరిగ్గా జడ్జ్‌ చేయడానికి ఒకరు తోడుంటే బావుణ్నని చూస్తున్నాడు. ఆ సమయంలో ఒక ఫ్రెండ్‌ నన్ను రాహుల్‌కి పరిచయం చేశాడు. ఇద్దరమూ వెళ్లి కథ విన్నాం. బయటకు వచ్చాక ‘కథ ఎలా ఉంది’ అని అడిగాడు. ‘నేను చెప్పలేను’ అన్నాను. ‘లేదు చెప్పాలి’ అని గుచ్చి గుచ్చి అడిగితే నచ్చలేదని చెప్పాను. దాంతో రాహుల్‌ అతడికి ‘నో’ చెప్పేశాడు. అది జరిగిన వారం తర్వాత ఫోన్‌చేసి ‘నీ దగ్గర కథ ఉందన్నావు అది నాకు చెబుతావా’ అన్నాడు. తనకు ‘మళ్లీరావా’ స్క్రిప్టు ఇస్తే, చదివి నచ్చిందన్నాడు. ‘నాకూ పరిశ్రమ కొత్త… నేను 30 శాతం బడ్జెట్‌ పెడతాను. మిగిలిన 70 శాతం పెట్టేవాళ్లు ఎవరైనా ఉంటారేమో చూద్దాం’ అన్నాడు. నేను ఒక్క షార్ట్‌ఫిల్మ్‌ కూడా తీయలేదు… అయినా నా మీద నమ్మకంతో కొంతైనా డబ్బు పెడుతున్నాడంటే ఎలా కాదనగలను… అందుకే ఆ ప్రతిపాదనకు ఓకే చెప్పాను. ఇద్దరం కలిసి పార్ట్నర్‌ కోసం ఎంత వెతికినా దొరకలేదు. రోజులు గడిచిపోతున్నాయి. రాహుల్‌ ఓరోజు వచ్చి ‘నేనే పూర్తి బడ్జెట్‌ పెడతాను’ అన్నాడు. నామీద సానుభూతితో అలా అంటున్నాడేమోనని ‘వద్దు ఇంకొన్నాళ్లు వేచి చూద్దాం’ అన్నాను. తను మాత్రం చేద్దాం అన్నాడు. అప్పుడు నాకో ఐడియా వచ్చింది. ‘ఒక అయిదు నిమిషాల డెమో వీడియో తీద్దాం. అది బాగా వస్తే ముందుకు వెళ్దాం. లేకపోతే వద్దు’ అని రాహుల్‌కి చెప్పాను. అతను ఓకే అన్నాడు. నా కథలో భాగమైన ఒక పాటని తీశాను. అది అందరికీ నచ్చింది.  దాంతో మా ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ టీనేజ్‌లో, ఇరవైల్లో, ఇంకాస్త పెద్దయ్యాకా ఎలా ఉంటుందనేది కథ. సుమంత్‌కి కథ చెబితే నచ్చిందన్నారు. డెమో వీడియోకి పాట రాసిన కేకే, సంగీతం అందించిన శ్రావణ్‌ భరద్వాజ్‌, కెమెరామేన్‌గా పనిచేసిన సతీష్‌ ముత్యాల వీళ్లనే సినిమాకీ తీసుకున్నాను. సినిమా పూర్తిచేసి బయ్యర్లకి చూపిస్తే బాగుందన్నారు కానీ కొనడానికి వెనకాడారు. రాహుల్‌ మరో సాహసం చేసి సొంతంగా రిలీజ్‌ చేశాడు. 2017 డిసెంబరు ఎనిమిదిన రిలీజ్‌ అయింది. ఆరోజు ఉదయం ప్రసాద్స్‌ ఐమ్యాక్స్‌లో సినిమా చూస్తున్నాను. ప్రేక్షకుల నుంచి స్పందన బాగుంది. కానీ అక్కడ ఉన్నవారిలో చాలామంది మా టీమ్‌లోవాళ్లూ, బంధువులూనూ. అందుకని ఇంటర్వెల్‌ తర్వాత ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని దేవి థియేటర్‌కి వెళ్లాను. మార్నింగ్‌ షో స్టార్ట్‌ అయింది. లోపల చూస్తే 30-40 మంది కనిపిస్తున్నారు. ‘చచ్చింది గొర్రె’ అనుకున్నాను. బయటకు వచ్చాక ప్రసాద్స్‌లో షో చూసిన మావాళ్లంతా ఫోన్‌చేసి సినిమా బాగుందని చెబుతున్నారు. నాకు నమ్మబుద్ది కాలేదు. మొదటి సినిమా కదా, సరిగ్గా తీశానా లేదా అన్నది నా సందేహం. వెబ్‌సైట్లలో రివ్యూలు బాగా వచ్చాయి. మార్నింగ్‌ షోకి 10 శాతం సీట్లు నిండితే మేట్నీకి 50 శాతం, ఫస్ట్‌షోకి 80 శాతం నిండాయని రిపోర్ట్‌ వచ్చింది. అప్పుడు ఊపిరి పీల్చుకున్నాను. తక్కువ బడ్జెట్‌లో తీయడంవల్ల మా పెట్టుబడికి మంచి లాభాలే వచ్చాయి.

హిట్‌ తర్వాత పాఠాలు
‘మళ్లీరావా’ తర్వాత చాలామంది నిర్మాతలు ఫోన్లు చేసి కథ ఉంటే చెప్పమన్నారు. కానీ బ్రేక్‌ తీసుకుంటానని చెప్పి ఊరుకున్నాను. ‘మళ్లీరావా’ తీస్తున్నపుడు కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాను. నేను ఎవరి దగ్గరా అసిస్టెంట్‌గా పనిచేయలేదు. మెరుగవ్వాలంటే శిక్షణ అవసరమనిపించింది. అప్పుడు ముంబయిలోని ‘న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీ’లో నిర్వహించే మూడు నెలల స్క్రీన్‌ప్లే కోర్సులో శిక్షణ తీసుకున్నాను. సినిమా అనుభవానికి అది తోడయ్యేసరికి నా రాతలో చాలా మార్పు వచ్చింది. ఉదయం పూట క్లాసుకి వెళ్తూనే, సాయంత్రం కథలు రాసుకునేవాణ్ని. శిక్షణ పూర్తిచేసి హైదరాబాద్‌ తిరిగి వచ్చేసరికి చేతిలో రెండు కథలు ఉన్నాయి.

‘మళ్లీరావా’ని ఓ ఆప్‌లో చూశారట నిర్మాత నాగ వంశీ. ‘నాకు బాగా నచ్చింది, ఏదైనా కథ ఉంటే చెప్పు’ అని ఫోన్‌చేసి చెప్పారు. అప్పుడే ‘జెర్సీ’ కథని చెప్పాను. ఆయనకి బాగా నచ్చింది. ‘హీరోగా ఎవరిని అనుకుంటున్నావు’ అన్నారు. నానీ పేరు చెప్పాను. ఆయన అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. నానీ కథ విన్నంతసేపు ఎలాంటి ఎక్స్‌ప్రెషనూ ఇవ్వలేదు. ‘ఏంటీ ఈయనకి నచ్చడంలేదా’ అనుకున్నాను మనసులో. ఫస్ట్‌ హాఫ్‌ విన్నాక… ‘సెకండ్‌ హాఫ్‌ కూడా ఇంతే బావుంటుందా’ అన్నారు. అప్పుడు ధైర్యం వచ్చింది. సెకండ్‌ హాఫ్‌ కూడా విన్నాక… ‘బాగుంది, చేద్దాం’ అన్నారు. సచిన్‌ గొప్ప క్రికెటర్‌ ఎలా అయ్యాడన్న విషయం మీద హర్షభోగ్లే స్పీచ్‌ ఇస్తూ, టాప్‌-10లో అందరూ సచిన్‌ అంత టాలెంట్‌ ఉన్నవాళ్లే ఉంటారు. కానీ యాటిట్యూడ్‌ కారణంగా సచిన్‌ నంబర్‌వన్‌ అయ్యాడని చెప్పారు. మరి మిగిలిన తొమ్మిది మంది పరిస్థితి ఏంటన్న ఆలోచన నుంచి పుట్టిందే జెర్సీ కథ. ఈ కథకి ఆత్మ మానవ సంబంధాలూ, భావోద్వేగాలు. క్రికెట్‌ అనే కాకుండా ఫుట్‌బాల్‌, బిజినెస్‌, సినిమా… వీటిలో దేన్నైనా నేపథ్యంగా ఎంచుకోవచ్చు. కానీ నాకు క్రికెట్‌ గురించి తెలుసు కాబట్టి ఆ నేపథ్యమైతే చెప్పడానికి సులభంగా ఉంటుందని కథ అలా రాసుకున్నాను. అదే సమయంలో ఆటలో సహజత్వం లేకపోతే ప్రేక్షకుల్ని మెప్పించలేం. అందుకే ప్రొఫెషనల్‌గా కనిపించడానికి ప్రత్యేకంగా నానీ క్రికెట్‌లో శిక్షణ తీసుకున్నారు. షూటింగ్‌ సమయంలో మాతోపాటు కోచ్‌ డానియల్‌ కూడా ఉండి షాట్స్‌ ఓకే చెప్పాకే వాటిని ఫైనల్‌ చేసేవాళ్లం. హైదరాబాద్‌లోని వివిధ అకాడమీల్లోని 250 మంది క్రికెటర్లని ఎంపికచేసి వాళ్లతో షూటింగ్‌ చేశాం. ఒక ఫిజియో, డాక్టర్‌ కూడా మాతో ఉండేవారు.

చాలావరకూ సహజంగా ఆడిస్తూ వాటినుంచి చాలా క్లిప్‌లు తీసుకున్నాం. స్లిప్‌లో ఒక క్యాచ్‌ కోసం రెండున్నర గంటలపాటు ప్రయత్నించామంటే అర్థం చేసుకోండి. సినిమాలో న్యూజిలాండ్‌ జట్టుగా కనిపించింది ఇంగ్లాండ్‌కి చెందిన లివర్‌పూల్‌ కౌంటీ టీమ్‌. ఆటగాళ్లతోపాటు వాళ్ల కోచ్‌, ఫిజియో కూడా వచ్చారు. దాంతో సినిమాలో సహజత్వం వచ్చింది. సినిమా బాగా తీశానంటే ఆ క్రెడిట్‌ నా ఒక్కడిదే కాదు, మా టీమ్‌ అందరిదీ. ‘మళ్లీ రావా’కి పనిచేసిన నా డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ అంతా ఈ సినిమాకీ పనిచేసింది. వివేక్‌ సాగర్‌, వీరూ… నాకంటే అనుభవజ్ఞులు. మధ్యలో ఏ ప్రాజెక్టూ చేయకుండా నా రెండో సినిమా కోసం వేచి చూశారు. మిగతా విభాగాలకీ మంచి సాంకేతిక నిపుణుల్ని ఎంపికచేశాం. జెర్సీలాంటి హిట్‌ కెరీర్‌లో రెండో సినిమాగా రావడం నిజంగా నా అదృష్టం. కొద్దిరోజులు సినిమా ప్రపంచానికి దూరంగా స్నేహితులూ, కుటుంబ సభ్యులతో గడుపుతాను. ఆ దశలోనే మళ్లీ ఏదో ఒక అనుభవం కథ రాసేందుకు స్ఫూర్తినిస్తుంది.


ఆమె సహకారం…

నా శ్రీమతి సుధ. మాది ప్రేమ వివాహం. ఇంజినీరింగ్‌లో నా క్లాస్‌మేట్‌. పెళ్లయిన రెండేళ్లకే ఉద్యోగం మానేశాను. సినిమా ప్రయత్నంలో అయిదేళ్లపాటు ఉద్యోగానికి దూరంగా ఉన్నాను. ఆ సమయంలో తన జీతంతో ఇంటిని నడిపించేది.
* మాకో అబ్బాయి. పేరు… కార్తీక్‌.
* నాన్న గణేష్‌బాబా రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి. అమ్మ నాగమణి గృహిణి. రాజమండ్రిలోనే ఉంటారు. నా సినిమా రిలీజ్‌ ఉందంటే కచ్చితంగా హైదరాబాద్‌ వస్తారు. అమెరికాలో ఉండే మా చెల్లి కూడా వచ్చేస్తుంది.
* సినిమా తీస్తున్నన్నిరోజులూ అదే ప్రపంచం. ఖాళీ దొరికితే పుస్తకాలూ, జర్నల్స్‌ చదువుతాను. చరిత్ర పుస్తకాలంటే బాగా ఇష్టం. స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు వింటాను.

Director SivaNirvana

direc siva nirvanaమజిలీ… మా వైజాగ్‌ కథే!
తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకు ప్రభావితం కాని కుర్రాళ్లు ఉండరు. కానీ ఆ ప్రభావం చాలామందిలో తాత్కాలికమే. ఎందుకంటే సినిమా కష్టాలు ఎలా ఉంటాయో వాళ్లకి తొందరగానే అర్థమవుతుంది. అవి తెలిశాక కూడా ‘సినిమానే జీవితం’ అనుకునేవారు అతి కొద్దిమంది ఉంటారు. అలాంటివారిలో శివ నిర్వాణఒకరు. దర్శకుడిగా మారడానికి అతడు సుదీర్ఘ ప్రయాణం చేశాడు. ‘నిన్నుకోరి’ తో హిట్‌ అందుకుని, ‘మజిలీ’తో మరోసారి మనముందుకు వచ్చిన శివ సినిమా జర్నీ గురించి అతడి మాటల్లో…

 

డిగ్రీ పూర్తవగానే ‘చదివింది చాలు ఇక సినిమాల్లోకి వెళ్లాల్సిందే’… అనుకుని ఇంట్లో చెప్పాపెట్టకుండా చెన్నై రైలెక్కేశాను. కొన్నాళ్లు అక్కడ ఉండివచ్చిన ఫ్రెండ్‌ని తోడు తీసుకువెళ్లాను. అక్కడ మణిరత్నం గారి దగ్గర అసిస్టెంట్‌గా చేరి, కొన్నాళ్లు పనిచేస్తే దర్శకుణ్ని కావొచ్చన్న నమ్మకంతో నా ప్రయాణం మొదలుపెట్టాను. చెన్నైలో దిగాక రైల్వే స్టేషన్లో స్నానం చేసి, దగ్గర్లోని షాపింగ్‌ మాల్‌లో సెక్యూరిటీ దగ్గర బ్యాగులు పెట్టి మణిగారి ఆఫీసుకి వెళ్లాం. పరిస్థితి చూస్తే ఆయన్ని కలవడం కాదు, గేటు దాటడమే కష్టంగా ఉంది. అలా అయిదు రోజులు తిరిగాక ఆరో రోజు సెక్యూరిటీ గార్డు పిలిచి రోజూ వస్తున్నారెందుకని అడిగాడు. మా వాడు విషయం చెబితే, ‘రాత్రి ఈ ప్రాంతంలో పెద్ద దొంగతనం జరిగింది. అనుమానంగా కనిపిస్తే పోలీసులు మక్కెలు ఇరగ్గొట్టి బొక్కలో పడేయగలరు’ అని బెదరగొట్టేశాడు. అప్పటికి మా దగ్గరున్న డబ్బూ అయిపోయింది. ఇంట్లో వాళ్లు మమ్మల్ని వెతుకుతున్నారనీ, అమ్మ నామీద బెంగ పెట్టుకుందనీ చెప్పాడో ఫ్రెండ్‌. లాభం లేదని తిరిగి వచ్చేశాం. ఆ తర్వాత నాన్నతో సినిమాలపైన నాకున్న ఇష్టం గురించి చెప్పాను. ‘వెళ్దువుగానీ ఇంకా చదువుకో’ అన్నారు. దాంతో తొమ్మిది నెలల్లో పూర్తయిపోతుందని బీఈడీలో చేరాను. కాదు పీజీ చెయ్యి అనడంతో ఎమ్మెస్సీ చేశాను. తర్వాత 2005లో వైజాగ్‌లో ట్రైన్‌ ఎక్కి హైదరాబాద్‌ వచ్చాను. అసలు నాకు సినిమా పిచ్చి ఎక్కడ మొదలైందో చెప్పాలంటే మళ్లీ వైజాగ్‌ వెళ్లాలి.

ఆ సినిమా మార్చేసింది!
మా ఊరు విశాఖ జిల్లా సబ్బవరం. టెన్త్‌ వరకూ అందరిలాగే నాకూ సినిమాలంటే ఆసక్తి. అప్పట్లో శివరాత్రి, వినాయక చవితికి టీవీలో వీసీపీ ద్వారా సినిమాలు వేసేవారు. అలాంటపుడు అక్కడ కచ్చితంగా ఉండేది మా బ్యాచ్‌. ఇంటర్మీడియెట్‌కి వైజాగ్‌లోని బీవీకే కాలేజీలో చేరి బైపీసీ గ్రూప్‌ తీసుకున్నాను. కాలేజీ ఒంటి గంటవరకూ ఉండేది. మధ్యాహ్నం ఖాళీ… అందరికీ. కానీ నేను మాత్రం మ్యాట్నీ సినిమా చూడ్డంలో బిజీగా ఉండేవాణ్ని. వైజాగ్‌లో అప్పట్లో 25 థియేటర్లు ఉండేవి. నేను చూడని సినిమా ఏ థియేటర్‌లో ఆడితే ఆరోజు అక్కడికి వెళ్లిపోయేవాణ్ని. ఆదివారం కాలేజీకి సెలవు కాబట్టి ఆరోజు మాత్రమే సినిమాకి సెలవు. 1997లో ‘ప్రేమించుకుందాం రా’ సినిమాని జగదంబా థియేటర్‌లో చూశాను. ఆ థియేటర్‌లో సినిమా చూడ్డం అదే ఫస్ట్‌ టైమ్‌. ఏసీ, డీటీఎస్‌, 70 ఎం.ఎం. ఆ అనుభవం చాలా విలాసంగా అనిపించింది. సినిమా ప్రేక్షకుడిగా నా అనుభవాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లింది. తర్వాత నుంచి ఆ థియేటర్లో రిలీజైన హాలీవుడ్‌, బాలీవుడ్‌ సినిమాల్నీ చూసేవాణ్ని. 1998లో వచ్చిన ‘సత్య’ సినిమా చూడ్డానికి దాదాపు రోజూ వెళ్లేవాణ్ని. కానీ రోజురోజుకీ జనాలు తగ్గిపోతుండేవారు. ‘ఈ సినిమా జనాలకి నచ్చలేదు, నాకెందుకు నచ్చుతోంది’ అన్న సందేహం వచ్చింది. తర్వాత అర్థమైందేంటంటే… పాటలూ, ఫైట్లూ, హీరోహీరోయిన్లకంటే కూడా కథ, తీసిన విధానం నాకు నచ్చిందని. ఆరోజునుంచి సినిమాలకి సంబంధించిన టెక్నికల్‌ టీమ్‌ ఎవరో కూడా చూడ్డం మొదలుపెట్టాను.

సీరియల్‌కీ పనిచేశాను…
ఇంటర్‌ తర్వాత డిగ్రీకి అనకాపల్లిలో చేరాను. అక్కడా నా సినిమా ప్రయాణం కొనసాగింది. బీఈడీ అక్కడే చేశాను. ఆపైన వైజాగ్‌ వచ్చి భాష్యం స్కూల్లో సైన్స్‌ టీచర్‌గా పనిచేస్తూ దూరవిద్యలో పీజీ చేశాను. రెండేళ్ల తర్వాత హైదరాబాద్‌ వచ్చి కృష్ణానగర్‌లో వాలిపోయాను. ఎంత కష్టమొచ్చినా భరించి నా సినిమా కలని నిజం చేసుకోవాలన్న దృఢ నిశ్చయంతో వచ్చాను. కానీ ఊహించినదానికంటే ఎక్కువ కష్టాలు పడాల్సి వచ్చింది. డైరెక్టర్‌ పరశురామ్‌గారిది నర్సీపట్నం. తెలిసిన వాళ్లద్వారా ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేరాలని ప్రయత్నించాను. కానీ అప్పటికే ఆయన దగ్గర డజనుకుపైగా అసిస్టెంట్లు ఉండటంతో చోటు దొరకలేదు. రోజూ ఏదో ఒక డైరెక్టర్‌ ఆఫీసుకి వెళ్లి అసిస్టెంట్‌గా చేరుతానని అడిగేవాణ్ని. ‘రేపు రా’, ‘వారం తర్వాత కనబడు’ అనేవారు. వాళ్లు చెప్పినట్టే వెళ్లేవాణ్ని. ఖాళీల్లేవని అప్పుడు చెప్పేవారు. కానీ నా దండయాత్ర కొనసాగుతూనే ఉండేది. మధ్యలో కొన్నిసార్లు షూటింగ్‌ చూడ్డానికి వెళ్లేవాణ్ని. డైరెక్టర్‌ కాదు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అయినా కాగలమా అన్న సందేహం వచ్చేది షూటింగ్‌ స్పాట్‌లో హడావుడి చూస్తే. ఇంకొందరు ‘సీరియల్‌ చేస్తున్నాం పనిచేస్తావా’ అనేవారు. ఆ ఛాన్స్‌నీ వదులుకునేవాణ్ని కాదు. అక్కడా ‘24 ఫ్రేమ్స్‌’ ఉంటాయి కదా! వి.ఎన్‌.ఆదిత్య గారి దగ్గర ‘మనసు మాట వినదు’ సినిమాకి మొదటిసారి అసిస్టెంట్‌గా పనిచేశాను. అలా కొందరితో పరిచయం ఏర్పడింది. తర్వాత ఒకసారి రామ్‌ గోపాల్‌వర్మ గారికి ఒక కథ చెప్పడానికి కలిశాను. అది ఓకే అవ్వలేదు కానీ ఆయన అప్పుడు చేస్తున్న ‘రక్తచరిత్ర’ షూటింగ్‌ని పరిశీలించే అవకాశం ఇచ్చారు. దాదాపు నెల రోజులు ఆ సినిమాతో పరోక్షంగా ప్రయాణించాను. తర్వాత మళ్లీ పరశురామ్‌ని సంప్రదిస్తే రమ్మన్నారు. ఆయన దగ్గర ‘సోలో’, ‘సారొచ్చారు’ సినిమాలకి అసిస్టెంట్‌గా పనిచేశాను. నిజం చెప్పాలంటే అప్పుడే నాకు వర్క్‌ నేర్చుకునే అవకాశం బాగా వచ్చింది. సినిమా రంగంలో ఒకరు చేయూత ఇవ్వందే పైకి రాలేం. ఎవరూ మనకు ఊరకే చేయందించరు కూడా. మన క్రమశిక్షణ, పనితీరు, స్వభావం అన్నీ పనిచేస్తాయి. ‘అవకాశం రాకపోవడం తప్పుకాదు. కానీ, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే తప్పే’ అనుకుని పనిచేసేవాణ్ని. ఇండస్ట్రీలో ఉండాలని మనం అనుకుంటాం, అలాగే మనతోటి వాళ్లూ ఫీలైతే మన గురించి పరిశ్రమలో అందరికీ తెలుస్తుంది.

షార్ట్‌ఫిల్మ్స్‌ ఓ పాఠం
పరశురామ్‌ గారి దగ్గర అనుభవంతో సొంతంగా సినిమా తీయగలనన్న నమ్మకం వచ్చింది. దాంతో పరిశ్రమలోని కొందరు వ్యక్తుల్ని కలిసి కథలు వినిపించేవాణ్ని. వాళ్లకి కథ నచ్చినా కూడా నేను తీయలేనేమో అన్న సందేహం ఉండేది. ఇలా కాదని, నా దగ్గరున్న కొద్దిపాటి మొత్తంతో, ఫ్రెండ్స్‌ సాయం తీసుకుని 2014లో ‘వన్‌మోర్‌ స్మైల్‌’, ‘లవ్‌ ఆల్‌జీబ్రా’ అని రెండు షార్ట్‌ఫిల్మ్స్‌ తీశాను. ఎవరికైనా కథ చెప్పి తర్వాత నా షార్ట్‌ఫిల్మ్స్‌ లింక్‌లు పంపించేవాణ్ని. బడ్జెట్‌, చిత్రీకరణ వ్యవధి ఈ అంశాల్నీ క్లియర్‌గా చెప్పేవాణ్ని. నా షార్ట్‌ఫిల్మ్స్‌ని చూసిన శివ తుర్లపాటి ఫోన్‌చేసి మెచ్చుకున్నాడు. తను టాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్‌. కలిసి షార్ట్‌ఫిల్మ్స్‌ తీద్దాం అన్నాడు. నా సినిమా లక్ష్యాన్ని ఆయనకి చెప్పాను. తనూ హెల్ప్‌ చేస్తానన్నాడు. నా కథల్ని తనతో పంచుకునేవాణ్ని. అలా నేను చెప్పిన ఓ కథ లైన్‌ని ‘కోన వెంకట్‌’గారికి చెప్పాడు. ఆయనకీ నచ్చింది. దాంతో వచ్చి కలవమన్నారు. వెళ్లి కథ మొత్తం చెప్పాను. అదే ‘నిన్నుకోరి’. తర్వాత ఆయన అనుభవాన్ని జోడించి స్క్రీన్‌ప్లే, డైలాగుల్ని ఇంప్రూవ్‌చేసి స్క్రిప్టు రెడీ చేశాం. నా కథ ఒక పక్కింటి అబ్బాయి కథలా ఉంటుంది. దానికి నానీ సరిపోతారనిపించింది. నానీకి కథ చెబితే ఓకే అన్నారు. దానయ్యగారు నిర్మాతగా వచ్చారు. చాలా సినిమాలకి కథ ఓకే అనుకున్నాక హీరో డేట్స్‌ కుదిరి అన్నీ తెరకెక్కడానికి ఏడాదైనా పడుతుంది. ‘నిన్నుకోరి’ మాత్రం నానీ ఓకే అనగానే త్వరత్వరగా పట్టాలెక్కింది. రెండు నెలల్లో షూటింగ్‌ మరో రెండు నెలల్లో పోస్ట్‌ ప్రొడక్షన్‌ అన్నీ పూర్తయిపోయి, సినిమా రిలీజై హిట్‌ టాక్‌ వచ్చింది. ఆరు నెలల్లో అంతా అయిపోయింది. ‘దీనికోసమేనా ఇన్నాళ్లు కష్టపడ్డాను’ అనిపిస్తుంది. కానీ అన్నాళ్లు కష్టపడి పనిచేయకుంటే ఆ సినిమాని అంత బాగా తీయగలిగేవాణ్ని కాదేమో!

జీవితాల నుంచే కథలు…నాన్న ముత్యం నాయుడు, అమ్మ రామలక్ష్మి. చాలాసార్లు ‘నీకీ కష్టాలు అవసరమా వచ్చేయ్‌ ఇంటికి’ అన్నారు. కానీ నేను ఇష్టంగా చేస్తున్నానని నచ్చజెప్పేవాణ్ని.
* దాదాపు నాలుగేళ్లు ఎలాంటి ఆదాయం లేకుండా హైదరాబాద్‌లో ఉండటమంటే మాటలా! కానీ ఆ సమయంలో నా స్నేహితుడు సుందర్‌ రామ్‌, తమ్ముడు విజయ్‌… నా లక్ష్యం, కష్టం సినిమానే కావాలి తప్ప మరోటి కాకూడదని నాకు ఆర్థికంగా ఎంతో సాయపడ్డారు.
* జీవితంలో స్థిరపడేంతవరకూ పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. ‘నిన్నుకోరి’ తర్వాత ధైర్యం వచ్చి ఇంట్లో పెళ్లికి ఓకే చెప్పాను. గతేడాది ఏప్రిల్‌లో నా పెళ్లి జరిగింది. నా శ్రీమతి పేరు భాగ్యశ్రీ. మాకో అబ్బాయి.
* నా బలం నా డైరెక్షన్‌ టీమ్‌. వీళ్లు నా రూమ్మేట్స్‌, ఫ్రెండ్స్‌ కూడా. లక్ష్మణ్‌, నాయుడు, నరేష్‌… మేమంతా ఉంటే సినిమాని ఆడుతూ పాడుతూ చేసుకోగలం.
* నా సినిమాలకు బలం గోపీ సుందర్‌ సంగీతం కూడా. ఆయన మలయాళ సినిమాల్లోని పాటలు నాకు బాగా నచ్చుతాయి. తెలుగులోనూ మంచి పాటలు ఇచ్చారు. గోపీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఒకరోజు కూర్చుంటే రెండు మూడు ట్యూన్లు ఇచ్చేస్తారు. నచ్చకపోతే నచ్చలేదని చెప్పే ఫ్రీడమ్‌ ఉంటుంది.
* నేను కథలకోసం ఎక్కడెక్కడో ఆలోచించను. నా జీవితంలో, నా చుట్టుపక్కలవారి జీవితాల్లో జరిగే సంఘటనల్లో బాగా సంతోషం కలిగించే, బాగా బాధ పెట్టే సంఘటనల్ని స్ఫూర్తిగా తీసుకుంటాను. ఆ పాయింట్‌ నుంచి కథను అల్లుకుంటాను.

‘మజిలీ’ ఇలా…
నిన్నుకోరి తర్వాత కొందరు ఫోన్లు చేసి సినిమా తీయమని అడిగారు. కథ ఓకే అవ్వకుండా అలా మాటివ్వడం నాకు నచ్చదు. అవన్నీ కాదనుకుని ఇంటికి వెళ్లిపోయి మూడు నెలలు ఉన్నాను. దాదాపు పుష్కర కాలం తర్వాత నేను విశ్రాంతి తీసుకున్నది అప్పుడే. తర్వాత హైదరాబాద్‌ వచ్చి నా దగ్గరున్న కొన్ని కథల్ని సిద్ధం చేసుకున్నాను. ప్రేమకథలు కాకుండా కొత్తగా ప్రయత్నిద్దామనుకున్నాను. ఆ క్రమంలో నాగచైతన్య గారిని కలిశాను. ‘నిన్నుకోరి’ నాకు బాగా నచ్చింది. ఏదైనా వాస్తవిక, హృదయాన్ని హత్తుకునే కథ ఉంటే చెప్పమన్నారు. నా దగ్గర భార్యాభర్తల కథకి సంబంధించిన ఒక లైన్‌ ఉంది. దాన్ని ఇంప్రొవైజ్‌ చేసి చెప్పాను. చైతూకి నచ్చింది. జోడీగా సమంతాగారైతే బావుంటుందని చెప్పాను. తనూ విన్నాక ఓకే చెప్పారు. అలా ‘మజిలీ’ మొదలైంది. వాళ్ల కాంబినేషన్‌ అంటే ఒక మేజిక్‌లా ఉంటుంది. అది ఈ సినిమాలో బాగా కనిపించింది. కొన్ని సంభాషణలు చాలా అద్భుతంగా వచ్చాయి. ఈ సినిమాని కూడా విశాఖపట్నం నేపథ్యంలోనే తీశాను. కానీ ‘నిన్నుకోరి’ మాదిరిగా అందాల వైజాగ్‌ని కాకుండా పాత వైజాగ్‌ని చూపించాను. వైజాగ్‌లో ఉండకపోతే నాకు సినిమా ఆలోచన రాకపోయేది. నేను ఎక్కడ ఉన్నా కూడా అక్కడి సముద్రం, స్నేహితులు, ఆహారం, భాష… వీటి ప్రభావం నామీద ఉంటుంది. నా కథల్లో కనిపిస్తుంది!

Director Parasuram

ఆ లోటు ఎప్పటికీ తీరదు!

‘యువత’… నిఖిల్‌ని హీరోగా నిలబెట్టింది. ‘సోలో’… నారా రోహిత్‌ కెరీర్‌ని మలుపు తిప్పింది. ‘ఆంజనేయులు’… రవితేజ ఖాతాలో మరో విజయాన్ని జమచేసింది. ‘శ్రీరస్తు శుభమస్తు’… అల్లు శిరీష్‌కి తొలి సూపర్‌హిట్‌ని అందించింది. ఈ సినిమాలన్నింటినీ తీసిన దర్శకుడు పరశురామ్‌కి అనుబంధాలను తెరపైన ఆవిష్కరించడంలో మంచి పట్టుందన్న పేరుంది. తన జీవితంలో తెగిపోయిన బంధాలూ, ఎదురైన పరిణామాలే సినిమాల్లో కుటుంబ విలువలకు ప్రాధాన్యమివ్వడానికి కారణమంటారాయన. అంతలా ఆయన్ని కదిలించిన సంఘటనలు ఏంటంటే…

చిన్నప్పుడంతా ఆకతాయిగా తిరిగే నేను ఎంబీయే పూర్తి చేయడానికి మా అమ్మ మాటలే ప్రేరణ. చదువైపోయాక విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకున్న నేను సినిమాల్లోకి రావడానికి అమ్మ మరణానంతర పరిస్థితులే కారణం. ఎదిగే ప్రతి దశలో అంతలా తను నాపైన ముద్ర వేసింది. నేను పుట్టింది విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంకి దగ్గర్లోని బాపిరాజు కొత్తపల్లి అనే వూళ్లొ అయినా, పెరిగింది మాత్రం చెర్లోపాలెంలో. దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నేనూ అన్నదమ్ముల పిల్లలం. మా నాన్న కో-ఆపరేటివ్‌ బ్యాంకులో చిన్న ఉద్యోగి. అమ్మకి చదువంటే చాలా ఇష్టం. నన్నూ, అక్కనే కాకుండా తన ఐదుగురు అక్కచెల్లెళ్ల పిల్లలనూ అమ్మే చదివించేది. మాకున్న పౌల్ట్రీ ఫామ్‌ వ్యవహారాలనూ తనే చూసుకునేది. అల్లరి విషయంలో అమ్మ నన్ను కొట్టని రోజంటూ ఉండేది కాదు. సరిగ్గా చదవకుండానే మంచి మార్కులొస్తున్నప్పుడు, బాగా చదివితే ఇంకా ముందుకెళ్తావు కదా అని అంటుండేది. ఇప్పటికీ మా వూరికి బస్సులేదు. అలాంటి ప్రాంతం నుంచి వచ్చినా నేనూ, అక్కా, కజిన్స్‌ అంతా పీజీలు చేశామంటే కారణం అమ్మ వేసిన పునాదులే.

చాలా ఏళ్లు హాస్టల్లోనే
నేను రెండో తరగతి వరకూ చెర్లోపాలెంలో, తరవాత పెదబొడ్డేపల్లిలో ఆరో తరగతిదాకా చదివా. ఆ పైన జవహర్‌ నవోదయా స్కూల్‌ ఎంట్రెన్స్‌ పరీక్షలో సెలక్ట్‌ అవడంతో వైజాగ్‌లో హాస్టల్‌కి వెళ్లా. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ఏదో ఫంక్షన్‌కి వూరికి వెళ్లినప్పుడు కజిన్స్‌ అందరం దగ్గర్లోని నేలబావిలో ఈత కొట్టడానికి దిగాం. అలా ఆడుకుంటున్నప్పుడే ఓ కొబ్బరిమట్ట వచ్చి బావి మధ్యలో వేలాడింది. దాన్ని పట్టుకోవాలని నేనూ మరో పిల్లాడూ పోటీపెట్టుకున్నాం. నాకు ఈత పూర్తిగా రాకపోవడంతో కొబ్బరిమట్టను అందుకునేలోపే మునిగిపోవడం మొదలుపెట్టా. నేను చనిపోవడం ఖాయమని తెలుస్తూ ఉంది. ఒక్కసారిగా అమ్మానాన్నా అక్కా అందరూ గుర్తొచ్చి ఏడుపు తన్నుకొచ్చింది. చివరి నిమిషంలో చిన్నాన్న కొడుకు ఎలాగోలా బయటకి లాగాడు. వెంటనే అమ్మ దగ్గరికి వెళ్లి విషయం చెప్పకుండా చాలాసేపు ఏడ్చేశా. అమ్మకి చెబితే ఎలా స్పందిస్తుందోనని భయమేసి తరవాత కూడా తనకా సంగతి చెప్పలేదు. అలా రోజులు గడుస్తున్న సమయంలో ఓ వూహించని ఘటన నా జీవితాన్ని కుదిపేసింది.

 

అమ్మ దూరమైంది!
ఓసారి మా పౌల్ట్రీ ఫామ్‌కి వైరస్‌ సోకి కోళ్లన్నీ చనిపోయాయి. పెట్టుబడి మొత్తం పోయింది. అప్పటివరకూ అక్కా నేనూ ప్రభుత్వ స్కూళ్లలోనే చదివాం. సరిగ్గా డబ్బు పెట్టి పైచదువులు చదివించాలని అమ్మ ఆశపడ్డ సమయానికి అలా జరిగింది. దాంతో అమ్మ కాస్త డీలా పడింది. నేను ఆంధ్రా యూనివర్సిటీలో ఎంబీయే చదివేప్పుడు ఓ ఇంటర్నెట్‌ సెంటర్‌లో పార్ట్‌టైం పని చేసేవాణ్ణి. అలా రోజులు గడుస్తుండగా ఓసారి అమ్మకు ఒంట్లో బాలేదని ఫోన్‌ వస్తే వెళ్లా. డాక్టర్లు హెమోగ్లోబిన్‌ తక్కువగా ఉందన్నారు. స్నేహితులతో కలిసి రక్తం ఇచ్చి వచ్చా. ఓ పదిరోజుల తరవాత మళ్లీ అమ్మకు నీరసంగా ఉందంటే వెళ్లా. పరీక్షలు చేయిస్తే ఎక్యూట్‌ బ్లడ్‌ క్యాన్సరని తేలింది. రెండు మూడు నెలలకు మించి బతకడం కష్టమన్నారు. ఆ మాట వినగానే కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. ఏకంగా చనిపోయేంత జబ్బు ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. అక్కకు తెలిస్తే తనేదైనా చేసుకుంటుందేమోనన్న భయంతో చెప్పలేదు. నాన్న దగ్గరా ఓ పదిరోజులు దాచిపెట్టా. నటుడు జోగినాయుడు మా పెద్దమ్మ కొడుకు. తన భార్య ఝాన్సీ సాయంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం లేకపోయింది. జబ్బు బయటపడిన ఆర్నెల్లకు అమ్మ చనిపోయింది. నాకే కష్టం వచ్చినా అమ్మ ఉందిగా అనే ధైర్యం ఆ క్షణం దూరమైపోయింది.

అన్నయ్యని చూశాకే…
అమ్మ చనిపోయిన ఏడాదిలోపే ఉన్న కొద్దిపాటి భూముల్ని అమ్మేసి అక్క పెళ్లి చేశాం. తరవాత నాన్న తెలీని నైరాశ్యంలోకి జారిపోయారు. అలానే గడిపితే నేనూ డిప్రెషన్‌లోకి వెళ్తానేమోనని భయమేసి ఏదైనా ఉద్యోగం వెతుక్కుందామని హైదరాబాద్‌ వచ్చా. అప్పుడే ‘ఇడియట్‌’ సినిమా విడుదలైంది. వూళ్లొ ఉన్నప్పుడు జగనన్నయ్య దర్శకుడు అని తెలుసుకానీ, అతడి స్థాయేంటో ఇక్కడికొచ్చాకే అర్థమైంది. నా కళ్లముందు తిరిగిన వ్యక్తి కష్టపడి ఈ స్థాయికొచ్చినప్పుడు నేనెందుకు రాలేనూ అనిపించింది. అన్నయ్యని చూశాక ఆ రంగంలోకి వెళ్లాలన్న కోరిక పెరిగింది. ఓరోజు జోగి నాయుడు పిలిచి ‘నువ్వు ఒకప్పుడు సినిమాలు చూసి మా అందరికీ కళ్లకు కట్టినట్టు కథ చెప్పేవాడివి. తరవాత మేమెళ్లి సినిమా చూసినా అంత ఫీల్‌ వచ్చేది కాదు. ఇక్కడున్న ఎవరికీ నువ్వు తీసిపోవు. నువ్వు పెదనాన్న కాళ్లే పట్టుకుంటావో, ఏం చేస్తావో నీ ఇష్టం కానీ జగన్‌ దగ్గర అసిస్టెంట్‌గా చేరడమే నీ లక్ష్యంగా పెట్టుకో’ అన్నాడు. సినిమాల్లోకి రావాలనుందని జగనన్నయ్యకి చెబితే బాగా తిట్టాడు. ‘ఎంబీఏ చేశావు, అప్పట్లో విదేశాలకూ వెళ్లాలనుకున్నావు కదా. నేను పంపిస్తా వెళ్లూ’ అన్నాడు. కానీ నేను మాత్రం అన్నయ్య దగ్గరే చేరతానని కరాఖండీగా చెప్పడంతో కోపంతో కొన్నాళ్లు నాతో మాట్లాడటం మానేశాడు.

అలా ఉండగానే పెళ్లి…
ఓసారి ‘అమ్మానాన్నా ఓ తమిళమ్మాయి’ షూటింగ్‌ వైజాగ్‌లో జరుగుతుంటే నాన్నను తీసుకొని వెళ్లి అడిగించా. నాన్న మాట కాదనలేక అన్నయ్య నన్ను అసిస్టెంట్‌గా చేరమన్నాడు. ఆ తరవాత ‘ఆంధ్రావాలా’, ‘143’ సినిమాలకూ పనిచేశా. ఎక్కువ కాలం అన్నయ్య దగ్గరే పనిచేస్తే నా సామర్థ్యమేంటో నాకు తెలీదనిపించి వేరే ఎవరి దగ్గరైనా పనిచేస్తానని చెప్పి బయటికొచ్చేశా. తెలిసిన వాళ్ల సాయంతో దర్శకుడు దశరథ్‌ దగ్గర ‘శ్రీ’ సినిమాకి అసిస్టెంట్‌గా చేరా. అక్కడే దర్శకుడు చైతన్య దంతులూరి పరిచయమయ్యాడు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా చైతూ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా. అసిస్టెంట్‌ డైరక్టర్‌గా పనిచేస్తున్నప్పుడే మా కజిన్‌ ద్వారా అర్చన అనే అమ్మాయి పరిచయమైంది. ఎందుకో తెలీదు కానీ క్రమంగా తనంటే ఇష్టం పెరిగింది. నేనప్పటికి కాళ్లకు హవాయి చెప్పులే వేసుకుని తిరిగేవాణ్ణి. అలాంటి సమయంలో ప్రేమా పెళ్లి గురించి ఆలోచించడం కరక్టేనా అనిపించేది. కానీ ఆమెకూ నేను నచ్చడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. వాళ్లది చాలా పెద్ద కుటుంబం. నా పరిస్థితేమో అంతంతమాత్రం. దాంతో మా పెళ్లికి వాళ్లింట్లో అంగీకరించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో పెద్దలు ఒప్పుకోకుండానే అర్చనా నేనూ ఒక్కటయ్యాం.

అవకాశం వచ్చినట్టే వచ్చి…
దశరథ్‌ దగ్గర పనిచేసేప్పుడు ఆ ప్రాజెక్టు ఆలస్యం కావడంతో చైతూ సాయంతో వీరూ పోట్ల దగ్గర అసిస్టెంట్‌గా చేరా. వీరూ రాసిచ్చిన కథలూ, డైలాగులన్నీ నేను ఫెయిర్‌ చేసేవాణ్ణి. అలా తనవల్లే రచన, డైలాగులపైనా క్రమంగా అవగాహన పెరిగింది. దురదృష్టం కొద్దీ వీరూ ప్రాజెక్టు కూడా ముందుకెళ్లలేదు. ‘పరుగు’ సినిమాకి స్క్రిప్ట్‌ డిస్కషన్‌ కోసం ఎవరైనా కావాలని భాస్కర్‌ వెతుకుతున్న సమయంలో చైతూ ఆ విషయం చెప్పి అతణ్ణి కలవమన్నాడు. అలా ‘పరుగు’కి అడిషనల్‌ డైలాగ్‌ రైటర్‌గా, స్క్రిప్ట్‌ అసిస్టెంట్‌గా పనిచేశా. కథకు కొంత అదనపు వినోదాన్ని జోడించా. నా పనితీరు దిల్‌ రాజుగారికి నచ్చడంతో నేను చేరిన వారంలోపే మంచి కథ తయారు చేసుకుంటే సినిమా చేద్దామన్నారాయన. ‘పరుగు’ పూర్తయ్యాక సొంతంగా ఓ స్క్రిప్ట్‌ సిద్ధం చేసుకున్నా. అల్లు అర్జున్‌ కథల్ని బన్నీ వాసు వింటాడని తెలీడంతో అతనికే చెప్పా. వాసుకి కథ నచ్చింది కానీ బన్నీ పరిధికి చిన్నదవుతుందని అన్నాడు. తరవాత ‘ఆంధ్రావాలా’ నిర్మాత గిరిని కలిస్తే ఆ సినిమా చేద్దామన్నారు. కానీ ఏవో ఇబ్బందుల వల్ల అదీ ఆలస్యమైంది.

తొలిసినిమాతో పైపైకి…
సినిమా అలా వెనక్కెళ్తున్న సమయంలో ‘మంత్ర’ సినిమా తీసిన నిర్మాతలు ముందుకు రావడం, చందూ మొండేటి ద్వారా నిఖిల్‌ పరిచయమవడంతో నా తొలిసినిమా ‘యువత’ మొదలైంది. మా కష్టానికి మణిశర్మగారి సంగీతం తోడై సినిమా మంచి మ్యూజికల్‌ హిట్‌ అయింది. ఆ సినిమాకు అసిస్టెంట్లుగా పనిచేసిన చందూ, సుధీర్‌ వర్మ, కృష్ణ చైతన్యలు తరవాత దర్శకులుగా మారారు. నిఖిల్‌ సోలో హీరోగా నిలదొక్కుకున్నాడు. రాజారవీంద్ర ఓసారి రవితేజకు ఫోన్‌ చేసి ‘యువత’ సినిమా బావుందీ, చూడమని చెప్పాడు. రవికి కూడా అది నచ్చడంతో కలిసి సినిమా చేద్దామన్నారు. అలా మా ఇద్దరి కలయికలో ‘ఆంజనేయులు’ సినిమా విడుదలైంది. నిర్మాతలకు టేబుల్‌ ప్రాఫిట్‌నీ, దర్శకత్వంతో పాటు డైలాగ్‌ రైటర్‌గా నాకు మంచి పేరునీ ఆ సినిమా తీసుకొచ్చింది.

బన్నీ చెప్పిన మాట!
నా భార్య సినిమాల గురించి పెద్దగా ప్రస్తావించకపోయినా, డబుల్‌ మీనింగ్‌ డైలాగులేవీ లేకుండా కుటుంబ విలువలుండే మంచి సినిమాలు చేయమని తొలిసారి నాకు సూచించింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ‘సోలో’ కథ సిద్ధం చేసుకున్నా. నారా రోహిత్‌ కెరీర్లో పెద్ద విజయం సాధించిన సినిమా అది. తరవాత రవితేజతో ‘సారొచ్చారు’ సినిమా తీశా. విడుదలకు నాల్రోజుల ముందే కాపీ చూడగానే అది ఫ్లాపవుతుందని నాకు అర్థమైంది. ఆ వైఫల్యం నుంచి బయటికొచ్చి నాగచైతన్యకు ఓ కథ వినిపించా. తను సినిమా చేద్దామన్నా ఏవో కారణాల వల్ల అది ముందుకెళ్లలేదు. దర్శకుడు క్రిష్‌ నాకు మంచి స్నేహితుడు. ఆ కథను అతనికీ వినిపించా. అతనే బన్నీకి నా కథ గురించి చెప్పడంతో, బన్నీవాసు పిలిచి కథ చెప్పమన్నాడు. అక్కడా ఓకే కావడంతో ఆ కథపైన దృష్టిపెట్టా. ఈలోగా ఓ రోజు అరవింద్‌గారు పిలిచి ‘బన్నీ ఇప్పటికే రెండు సినిమాలు చేస్తున్నాడు. అవి పూర్తయ్యేవరకూ ఎదురుచూడటం కరెక్టు కాదు. శిరీష్‌కి ఏ కథలూ పెద్దగా నచ్చట్లేదు. పోనీ ఎవరితో సినిమా చేస్తావని అడిగితే నీ పేరు చెప్పాడు. శిరీష్‌కి ‘సోలో’ బాగా నచ్చిందట. సినిమా చేస్తావా మరి?’ అని అడిగారు. ఓరోజు బన్నీ పిలిచి ఓ చెక్కు చేతిలో పెట్టి, ‘నీ మీద నమ్మకంతో ఉన్నాం, ఏం చేస్తావో తెలీదు’ అనడంతో నా బాధ్యత మరింత పెరిగింది. ‘శ్రీరస్తు శుభమస్తు’ విడుదలవుతూనే హిట్‌టాక్‌ తెచ్చుకుంది. అరవింద్‌గారు పిలిచి ‘మరో కథ సిద్ధం చేసుకో, సినిమా మొదలుపెడదాం’ అన్నారు. ఆ మాట చాలు ఆయన నమ్మకం నిలబెట్టుకున్నా అనడానికి. నా తరవాతి సినిమా గీతా ఆర్ట్స్‌లోనే ఉంటుంది. చిన్నప్పుడోసారి నా కజిన్‌కి టెన్త్‌లో జిల్లా ఫస్ట్‌ వచ్చిందని పేపర్లో ఫొటో వేశారు. అమ్మ నాకది చూపించి, ‘ఇలా పిల్లల ఫొటోలు పేపర్లో చూసుకునే తల్లిదండ్రులది ఎంత అదృష్టమో తెలుసా’ అంది. సినిమాల్లోకి వచ్చాక నా ఫొటో చాలాసార్లు పత్రికల్లో వచ్చింది. వాటిని చూసినప్పుడల్లా అమ్మే గుర్తుకొస్తుంది. అందుకే నేను ఏ స్థాయికెళ్లినా అమ్మ లేని ఆ లోటు మాత్రం ఎప్పటికీ తీరదు.


సైన్సంటే ఇష్టం!

 

నాకు ఎలాంటి ఆధారం లేని సమయంలోనే నా భార్య అర్చన తోడుగా నిలిచింది. ఏదో ఒకరోజు నేను మంచి స్థానానికి వెళ్తానని నాకంటే బలంగా తనే నమ్మింది. అమ్మ స్థానాన్ని తను భర్తీ చేయకపోయుంటే నా జీవితం ఎటెళ్లేదా అనిపిస్తుంటుంది. మాకిద్దరు పిల్లలు. పెద్దబ్బాయి రిషిత్‌. చిన్నోడు అవ్యాన్‌.

* దర్శకులు చైతన్య దంతులూరి, ఆనంద్‌ రంగా, క్రిష్‌, ఎడిటర్‌ మార్తాండ్‌లు నాకు మంచి స్నేహితులు. నేను సినిమాలు చేయని సందర్భాల్లోనూ ఎప్పటికప్పుడు ఫోన్‌ చేసి నా బాగోగులూ, ప్రాజెక్టుల గురించి ఆరా తీస్తుంటారు.

* సైన్స్‌కి సంబంధించిన కొత్త పరిశోధనల గురించి తెలుసుకోవడం అంటే నాకు ఆసక్తి. మా అమ్మ ఆస్పత్రిలో ఉన్నప్పుడు బ్లడ్‌ క్యాన్సర్‌కి మందులేమన్నా ఉన్నాయా అన్న ఆశతో లైబ్రరీలకు వెళ్లి పత్రికలు తిరగేసేవాణ్ణి. అప్పట్నుంచీ అలా పరిశోధనల గురించి తెలుసుకోవడం అలవాటైంది.

Director VirinchiVarma

నా తొలిప్రేమ వాటిపైనే…

‘ఉయ్యాలా జంపాలా’… ఆబాలగోపాలాన్నీ అలరించిన బావామరదళ్ల కథ. ‘మజ్ను’… అబ్బాయిలు ఆనంద్‌ రూపంలో తమలోని మజ్నూనీ, అమ్మాయిలు కిరణ్మయి రూపంలో లైలానీ గుర్తుచేసుకున్న ప్రేమకథ. ఈ రెండింటినీ మనకు అందించిన యువ దర్శకుడు విరించి వర్మ గుంటూరి. ఈ గోదావరి కుర్రాడు సెల్యులాయిడ్‌ కలను ఎలా నిజం చేసుకున్నదీ చెబుతున్నాడిలా…
అందరూ సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్‌ వస్తుంటారు. నేను మాత్రం హైదరాబాద్‌ వచ్చాకే సినిమాల గురించి ఆలోచించాను. అంతకు ముందు సినిమాలకు నా జీవితంలో ప్రాధాన్యం లేదు. మా సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు దగ్గర పెండ్యాల. నేను పెరిగింది మాత్రం అమ్మమ్మ వాళ్ల వూరు ఆకివీడు దగ్గర సిద్ధాపురంలో. ఇంటర్మీడియెట్‌ దిబ్బగూడెంలో చదువుకున్నాను. ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వెళ్లడం తప్పదు… అదే డిగ్రీ నుంచే ఇక్కడ ఉంటే ఈ వాతావరణానికి అలవాటు పడతానని ఇంట్లోవాళ్లు హైదరాబాద్‌లోని మా బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకోమన్నారు. దాంతో ఇక్కడ లక్డీకాపూల్‌లోని ‘న్యూ గవర్న్‌మెంట్‌ డిగ్రీ కాలేజీ’లో బీకామ్‌లో చేరాను. డిగ్రీకి ముందు సినిమాలు చూడ్డం కూడా తక్కువే. అలాగని పుస్తకాల పురుగునీ కాదు. కాకపోతే చిన్నప్పట్నుంచీ కథల పుస్తకాలూ, నవలలూ చదివేవాణ్ని. హైదారాబాద్‌ వచ్చిన నెల రోజులకు టీవీలో సాగరసంగమం, సితార, సీతాకోకచిలుక… సినిమాలు చూశాను. అవి చూశాక మంచి ఆలోచనల్నీ, అభిప్రాయాల్నీ పంచుకోవడానికి సినిమా అద్భుతమైన వేదిక అనిపించింది. అప్పటివరకూ సాధారణ కథల పుస్తకాలూ, నవలలూ చదివిన నేను… ఆ తర్వాత చలం, గోపీచంద్‌, బాలగంగాధర్‌ తిలక్‌, శ్రీశ్రీ లాంటి వారి రచనలు ఎక్కువగా చదవడం ప్రారంభించాను. డిగ్రీ ఫైనలియర్‌లో ఉండగా సినిమాల్లోకి వెళ్లే దారేంటని ఆలోచించినపుడు… సినిమా ప్రచార చిత్రాలు డిజైన్‌ చేసే ‘కిరణ్‌ యాడ్స్‌’ నిర్వాహకుడు రమేష్‌ వర్మ తెలుసని మావాళ్లలో ఎవరో చెప్పారు. వాళ్లద్వారా ఆయన దగ్గర అసిస్టెంట్‌ డిజైనర్‌గా చేరాను. నాకు బొమ్మలు వేయడం వచ్చు. అది అక్కడ ఉపయోగపడింది. అక్కడ పనిచేస్తూనే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అయ్యేందుకు ప్రయత్నించాను. మూడేళ్లకు ఓ స్నేహితుడి సాయంతో దర్శకుడు మదన్‌గారి దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. ఆయన నాతో చాలాసేపు మాట్లాడాకే అసిస్టెంట్‌గా చేర్చుకున్నారు. అప్పటివరకూ ఇండస్ట్రీ గురించి చాలామంది రకరకాలుగా చెప్పి భయపెట్టేవారు. మదన్‌ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఇప్పటికీ ఆయన గైడెన్స్‌ మాకు ఉంటుంది. ఆయన దగ్గర పెళ్లైనకొత్తలో, గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు సినిమాలకు పనిచేశాను.

పల్లెటూరి కథ వద్దన్నారు
అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అయ్యాక సినిమాలపైన ఒక స్పష్టత రావడంతోపాటు నాలో ఆత్మవిశ్వాసం వచ్చింది. ఆ సమయంలో కథలు రాస్తూ స్నేహితులకు వినిపించేవాణ్ని. కొన్ని కథలు వారి వడపోతలో పోయేవి. ‘ఉయ్యాలా జంపాలా’ కథ రాసుకునేసరికి అసిస్టెంట్‌ డైరెక్టెర్‌గా మూడేళ్లు పూర్తయ్యాయి. ఆ కథ స్నేహితులకు వినిపిస్తే బావుందన్నారు. అది పట్టుకొని ఆరేడు మంది నిర్మాతల్ని సంప్రదించాను. ఎవ్వరికీ నచ్చలేదు. కథలో ప్రత్యేకత లేదనీ, పల్లెటూరు నేపథ్యంతో ఇప్పుడు సినిమాలు రావడమే లేదనీ… చెప్పేవారు. రామ్మోహన్‌ గారితో అదివరకు పరిచయం కూడా లేదు. ఫోన్‌ నంబర్‌ దొరికితే మాట్లాడాను, రమ్మన్నారు. ఆయనకి కథ చెబితే బావుందన్నారు. ‘కథ ఓకే. నీ టేకింగ్‌ ఎలా ఉంటుందో చూడాలి. ఒక షార్ట్‌ఫిల్మ్‌ తీసి చూపించు’ అని చెప్పి రూ.20వేలు ఇచ్చారు. షార్ట్‌ఫిల్మ్‌ కోసం నాకో ఆలోచన వచ్చింది. ఆ కథ కొత్తదేమీ కాకపోయినా కథ అక్కడ ప్రధానం కాదు, ఎమోషన్స్‌ ఎలా చూపిస్తున్నానో గమనిస్తారనిపించింది. ‘నిన్నటి వెన్నెల’ పేరుతో షార్ట్‌ఫిల్మ్‌ తీశాను. అది చూశాక సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. తర్వాత కథని నాగార్జున గారికి వినిపించాం. ఆయన నిర్మాణంలో భాగస్వామిగా చేరారు.

మా వూళ్లొ ఒక ఫ్రెండ్‌ ఉండేవాడు. మంచివాడు, అందరితో సరదాగా ఉంటాడు. అలాంటి వ్యక్తిని తెరపైన చూపిస్తే బావుంటదనిపించింది. నేనూ మా అక్క చిన్నప్పుడు బాగా కొట్టుకునేవాళ్లం. కాస్త పెద్దయ్యాక మాత్రం మా మధ్య గొడవలు పోయి ప్రేమాభిమానాలు వచ్చాయి. ఇలా చిలిపి తగాదాలూ, ఆపైన ప్రేమాభిమానాలు బావామరదళ్ల మధ్య ఉంటే ఎలా ఉంటుందో వూహించి కథ రాసుకున్నాను. సినిమాలో వాణిజ్య అంశాల్ని ఉంచుతూనే, సహజత్వం కనిపించేలా తీయాలనుకున్నాం. అందుకోసమే అందర్నీ కొత్తవాళ్లనే పెట్టుకున్నాం. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వచ్చిన రాజ్‌తరుణ్‌నే హీరోగా పెడదామన్నారు రామ్మోహన్‌. ‘బాగా చిన్నవాడిలా కనిపిస్తున్నాడు కదాండి’ అన్నాన్నేను. ఆ సినిమా కాస్టింగ్‌ డైరెక్టర్‌ గీతా గారు తరుణ్‌కి రెండు నెలలపాటు ఆక్యుపంక్చర్‌ చేయించారు. దాంతో రెండేళ్లు పెరిగినట్లు కనిపించాడు. అప్పుడు సరేననుకున్నాం. సినిమా సెట్స్‌ మీదకు వెళ్లేసరికి ఇంకాస్త సమయం పట్టింది. దాంతో సహజంగానే తరుణ్‌ సరిపోయాడు. హీరోయిన్‌ కోసం మూడు నెలలు ఇంటర్నెట్‌లో వెతికి చూశాం. ఆ సమయంలో అవికాగోర్‌ కనిపించింది. ఆమె చేసిన సీరియల్‌ నేను చూడలేదు. యూట్యూబ్‌లో ఆమెదో వీడియో చూశాక ఆడిషన్స్‌కి పిలిచాం. అమాయకత్వం, ఆవేశం, కోపంతో కూడిన ఆ అమ్మాయి స్వభావం కూడా సినిమాలో పాత్ర స్వభావానికి దగ్గరగా ఉంటుంది. తరుణ్‌ కూడా బయటకి సరదాగా కనిపిస్తాడు కానీ ముఖ్యమైన విషయాల్లో సీరియస్‌గా ఉంటాడు. ఆ సినిమాలో అతడి పాత్ర కూడా అలాంటిదే. సినిమా పూర్తయ్యాక సురేష్‌బాబు గారికి కూడా నచ్చి ఆయన కూడా కలిశారు. అలా మొదటి సినిమాతోనే పెద్దవాళ్లతో, పెద్ద బ్యానర్లతో పనిచేశాను. మిగతాదంతా చరిత్ర.