ఓ సినిమాకి సంబంధించిన ట్రెయిలర్‌లూ, టీజర్‌లూ లక్షల్లో వ్యూస్ కొల్లగొట్టడం కొత్తేం కాదు. కానీ, అసలు షూటింగే మొదలుపెట్టకుండా కేవలం గ్రాఫిక్స్ బొమ్మలతో ‘కాన్సెప్ట్ వీడియో’గా విడుదలై లక్షల వీక్షణలు కొల్లగొట్టింది ఆ మధ్య విడుదలైన ‘కార్తికేయ-2’ వీడియో. దానికింత క్రేజు రావడానికి కారణం దాని మొదటి భాగం ‘కార్తికేయ’ సాధించిన అద్భుత విజయం. ఈ రెండు ‘కార్తికేయల’ నడుమ ‘ప్రేమమ్’, ‘సవ్యసాచి’ సినిమాలు చేసి సత్తా ఉన్న యువదర్శకుడిగా పేరు తెచ్చుకున్న చందూ మొండేటి మనోగతం…
‘ఆర్య’ విడుదలైన రెండో రోజు అనుకుంటా… హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఓ టిఫిన్ సెంటర్. వేడి వేడి బజ్జీలు వేగి పోతున్నాయి. అంతకంటే వేడిగా అక్కడ సినిమా కబుర్లు మొదలయ్యాయి. ఏ నోట విన్నా ‘ఆర్య’ మాటే. ‘ఆ సీను భలే ఉంది..’, ‘సుకుమార్ ఏం తీశాడ్రా’… ఇలా ప్రతీ రీలునీ మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. అక్కడ బజ్జీలు తిని పక్కనే ఉన్న టీ బడ్డీకి వెళితే అక్కడా అవే మాటలు! ‘ఓ సినిమా తీస్తే.. జనం ఇంతలా మాట్లాడుకుంటారా, ఆ సినిమా నచ్చితే దర్శకుడ్ని ఇంతలా పైకెత్తేస్తారా’ అనిపించింది. ‘నా గురించీ ఇలా మాట్లాడుకుంటే బాగుంటుంది కదా’ అనే ఆలోచనా రేకెత్తింది. అది 2004… అంతకు ఏడాది ముందే బీటెక్ ముగించాను. హైదరాబాద్‌లో మా బావ వాళ్లింటికొచ్చాను. మా బావకి దర్శకుడు సుకుమార్ రాజోలులో ట్యూషన్ మాస్టార్‌గా ఉన్నప్పటి నుంచీ పరిచయమట. నేను అప్పుడప్పుడూ హైదరాబాద్‌కి వస్తుంటే మా బావా వాళ్ల ఫ్రెండ్సూ సుకుమార్ గురించీ, దర్శకుడిగా ఆయన చేస్తున్న ప్రయత్నాల గురించీ చెబుతుండేవారు. అప్పటిదాకా నా ఆలోచనల్లో మా బావ పరిచయస్తుల్లో ఒకడిగా మాత్రమే ఉన్న సుకుమార్… ‘ఆర్య’ తర్వాత రాత్రికిరాత్రే స్టార్ దర్శకుడైపోవడం నన్ను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. సినిమాకున్న శక్తేమిటో అప్పుడు అర్థమైంది. అదే నన్ను సినిమాలవైపు నడిపించింది.
ఎప్పుడూ సినిమా గోలే
మాది పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు. నాన్న భాస్కరరావు చెన్నైలోని ఐఎమ్‌సీసీ అనే కంపెనీలో జనరల్ మేనేజర్. మా ఇల్లు ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లోని గుమ్మడిపూండిలో ఉండేది. ముందు నుంచీ చదువంటే ‘ఎందుకొచ్చిన గొడవ’ అన్నట్టే ఉండేది నాకు. లెక్కలూ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్నీ నన్ను ఇబ్బందిపెట్టేవి… ఒక్క చరిత్ర తప్ప! ఇంగ్లిషు మాస్టారు షెర్లాక్ హోమ్స్ గురించి చెబుతుంటే నా ముందు సినిమానే కనిపించేది. అప్పుడే అనుకున్నా. నా జీవితానికి లెక్కలూ, సైన్స్ ఎందుకూ పనికిరావని. నా ఆసక్తి సృజనాత్మక సినిమా ప్రపంచంలోనే ఉంది అని. అయినా సరే… ఇంజినీరింగ్ దాకా ఎలాగో నెట్టుకొచ్చాను. కాలేజీలో కూడా నా దృష్టంతా సాహిత్యం, అంతకన్నా సినిమాలపైనే ఎక్కువ ఉండేది. సినిమాలపైన ఈ మోజు పదో తరగతప్పుడే మొదలైంది. కొత్త తెలుగు సినిమా విడుదల అవుతోందంటే.. తిరుపతి వెళ్లేవాళ్లం. మా ఊరి నుంచి తిరుపతికి నాలుగు గంటల ప్రయాణం. బైకు మీద కబుర్లు చెప్పుకుంటూ వెళ్తే అలసటే తెలిసేది కాదు. ఆరోజంతా తిరుపతిలో ఉండి నాలుగు సినిమాలు చూశాకగానీ తిరిగొచ్చేవాళ్లం కాదు. అందరూ సినిమా చూసి కాసేపు మాట్లాడుకునివదిలేస్తే నేను మాత్రం వారం వరకూ ఆ ఆలోచనల్లోనే ఉండేవాణ్ణి. ఓ సినిమాని అనౌన్స్ చేయగానే ఆ కథ ఎలా ఉంటే బాగుంటుందంటూ నాకు నేనే ఏవేవో ఊహించి స్నేహితులకి చెప్పేవాణ్ని. కొన్నిసార్లు తెరపై సినిమా కంటే నా ఊహలే బాగుండేవనిపించేది. ఏం మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా టాపిక్‌ని సినిమాలవైపు తీసుకెళ్లేవాణ్ణి. ఇదంతా చూసి.. ‘నువ్వు సినిమాల్లోకి వెళ్తే బాగుంటుంది’ అని స్నేహితులు పొగుడుతుండేేవారు. ఆ నేపథ్యంలోనే ఓసారి హైదరాబాద్ వెళ్లడం, ‘ఆర్య’ చూడటం, నేనూ సినిమాల్లోకి రావాలని నిశ్చయించుకోవడం జరిగిపోయాయి. మరి అక్కడికి ఎలా వెళ్లాలి..? పాటల రచయిత కృష్ణ చైతన్య కాలేజీలో నా జూనియర్. అప్పట్లోనే పాటలు రాసి స్టేజీ ఎక్కి పాడేవాడు. అతణ్ని కాంటాక్ట్ అయితే ‘హైదరాబాద్ వచ్చేయ్. సహాయ దర్శకుడిగా చేర్పిస్తా’ అన్నాడు. సినిమాల్లోకి వెళతానంటే ఇంట్లో ఒప్పుకోరని భయం భయంగానే అడిగినా… వాళ్లు ఒప్పుకుని నన్ను ఆశ్చర్యపరిచారు. అందులో మా అన్నయ్య రఘురామ్‌దే కీలకపాత్ర!
ఎన్నెన్ని తిప్పలో..!
నన్ను హైదరాబాద్‌కి రప్పించిన కృష్ణచైతన్య అప్పట్లో శశాంక్ హీరోగా చేస్తోన్న ఓ సినిమాకి పాటలు రాస్తుండేవాడు. నేనూ ఆ టీమ్‌లోనే సహాయకుడిగా చేరిపోయాను. చేరానే కానీ ఓ సినిమా కోసం సీన్‌లూ, డైలాగులూ ఎలా రాయాలో కూడా నాకు తెలియలేదు. ఏదో నవలలూ, కథలూ రాస్తున్నట్టు పేరాలకి పేరాలు రాసేవాణ్ణి. నేను చెన్నైలోనే చదువుకోవడం వల్ల తెలుగు రాసే అలవాటు పెద్దగా లేదు కాబట్టి వాక్య నిర్మాణాలే తప్పులూ తడకలుగా ఉండేవి. తెల్లకాగితం మీద వాక్యాలన్నీ వంకరటింకర్లుగా పోయేవి. ‘నువ్వేం రైటర్‌వయ్యా…!’ అంటూ అందరూ నవ్వేవాళ్లు. నవ్వితే సమస్య లేదుకానీ చాలామంది విసుక్కునేవాళ్లూ, కోపగించుకునేవాళ్లు కూడా. కానీ ఇదంతా ఛాలెంజ్‌గానే తీసుకున్నాను. నన్ను నేను సరిదిద్దుకోవడం, మళ్ళీ మళ్ళీ రాయడం, మంచి స్క్రిప్టుల్ని చూసి అధ్యయనం చేయడం ప్రారంభించాను. నేను పడుతున్న ఈ పాట్లన్నీ ఇద్దరు దగ్గరగా గమనిస్తూ ఉండేవారు. ఒకడు నిఖిల్… శశాంక్ హీరోగా ఉన్న సినిమాలో అతను చిన్న వేషం వేస్తుండేవాడు. మరొకడు… సుధీర్‌వర్మ. తనూ నాలాగే సహాయ దర్శకుడు.
ఆ ఇద్దరూ నాకు దగ్గరి స్నేహితులయ్యారు. కాకపోతే, మేం కలిసి పనిచేసిన సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అయినా ఎవ్వరం నిరుత్సాహ పడకుండా ఎవరి ప్రయత్నాల్లో వాళ్లం ఉండిపోయాం. ఈలోపు నిఖిల్ ‘హ్యాపీడేస్’ అడిషన్‌కి వెళ్లి… ఛాన్స్ కొట్టేశాడు. అప్పట్లో చేతినిండా పనిలేకపోయినా ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది పడలేదంటే-అది నిఖిల్ వల్లే. ఎంతో అండగా ఉండేవాడు. ఆ తర్వాత నేను లక్ష్మీకాంత్ చెన్నా, పరశురామ్‌ల దగ్గర సహాయకుడిగా చేరిపోయా.
ఆమె నాకు అమ్మానాన్నలంత!
దర్శకుడు పరశురామ్‌ది ప్రేమ వివాహం. అతని తొలిచిత్రం ‘యువత’ తీయడానికి ముందు ఓ చిన్న ఇంట్లో కాపురం ఉంటుండేవాడు. నేను వారాంతాల్లో వాళ్లింటికి వెళ్తుండేవాణ్ణి. ఓసారి పరశురామ్ భార్య చెల్లెలితోపాటూ అక్కడికొచ్చింది… సుజాత. తనని చూసిన నిమిషంలోనే ప్రేమలో పడిపోయాను. తనని ఇంప్రెస్ చేయాలని నాకున్న జ్ఞానాన్నంతా ఒలకబోశాను. తనేమో మేధావి… పీహెచ్‌డీ స్కాలర్. ఎంబీఏ కూడా ముగించిన అమ్మాయి కాబట్టి గుంభనగా ఉండిపోయింది. నా చేష్టల్లో అమాయకత్వమో నిజమైన ప్రేమో ఏదో కనిపించి ఉండాలి… నాతో స్నేహం చేసింది. అది ప్రేమగా మారింది. ఇద్దరి కుటుంబాల్లోనూ పెద్దగా వ్యతిరేకత లేకున్నా సరే… పెళ్లి మా సొంత ఖర్చుతోనే జరగాలన్నది సుజాత కోరిక. ఆ మేరకే పరశురామ్ ఇంట్లో చాలా సింపుల్‌గా జరిగింది మా పెళ్లి. కాపురం పెట్టాక నన్ను మా ఆవిడే పోషించింది! తను ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా చేస్తుండేది. స్క్రిప్టు రాయడానికి ల్యాప్‌టాప్ లేకపోతే నేను అడిగిన వెంటనే తెచ్చిచ్చింది..! ఇందుకోసం ఏడాదిపాటు ఈఎంఐలు కడుతూ… ఆ మేరకు తన సొంత ఖర్చుల్ని తగ్గించుకుంది. తను పనిచేసే కాలేజీ హైదరాబాద్ శివార్లలో ఉండేది. నేను ఓ రెండు కిలోమీటర్లు స్కూటర్ మీద దింపితే అక్కడి నుంచి రెండు బస్సులు మారాల్సి వచ్చేది తను. గర్భం దాల్చాక కూడా అంతే… కిక్కిరిసిన బస్సుల్లోనే ప్రయాణం. అంతెందుకు, కాన్పుకి రెండురోజులు ముందుకూడా ఉద్యోగానికి వెళ్లొచ్చింది! బాబు పుట్టిన రోజు ఆసుపత్రిలో ‘ఎందుకింత కష్టపడ్డావ్…?’ అని అడిగితే ‘నువ్వు దర్శకుడిగా ఎంత పెద్దవాడివైనా కుటుంబం పట్ల నీకు బాధ్యత ఉండాలనే’ అని చెప్పింది. ఆ మాటలకి కన్నీళ్లు ఆగలేదు నాకు! అప్పటి నుంచి ఇప్పటిదాకా తను నిర్దేశించిన ఏ బాధ్యత నుంచీ తప్పుకున్నది లేదు నేను. ఇక ఇంట్లో ముగ్గురం అయిపోయాం కాబట్టి నా భార్యకి చేదోడువాదోడుగా ఉండాలని సినిమా పనులు పక్కనపెట్టి సీరియళ్లూ, రియాల్టీ షోలకి రాయడం మొదలుపెట్టాను. రోజుకి రెండువేల రూపాయలు వస్తుండేవి. మంచి ఆదాయమే అయినా సరే సుజాత ఒప్పుకోలేదు.
‘నీ లక్ష్యం ఇది కాదుకదా! నువ్వు సీరియళ్లలో ఇరుక్కోవద్దు. సక్సెస్ వచ్చేదాకా సినిమాల కోసమే ప్రయత్నించు!’ అని గట్టిగా చెప్పింది. ఓ రకంగా సుజాత లేకుంటే నేను సినిమాల్లో స్థిరపడటం అసాధ్యం. అందుకే తను నాకు మా అమ్మానాన్నలంత అని చెబుతుంటాను!
అంత అభిమానం…!
కార్తికేయ సినిమాని నేను నిఖిల్ కోసమే రాశాను. ఆ కథ విని ఎందరో నిర్మాతలు ముందుకొచ్చినట్టే వచ్చి వెనక్కి తగ్గారు. చివరి నిర్మాత ఒప్పుకున్నాక కూడా ఎన్నో తటపటాయింపులతో సినిమా పట్టాలకెక్కలేదు. ఈలోపల సుధీర్ వర్మ నిఖిల్‌ని హీరోగా పెట్టి తీసిన ‘స్వామి రారా’ పెద్ద హిట్టయింది. ఆ హిట్టుతో నిఖిల్‌పైన ఇండస్ట్రీ అంచనాలు పెరగడమే కాదు… నాకున్న అడ్డంకులూ తొలగి సినిమా పట్టాలకెక్కింది. నిఖిల్, నేనూ చాలా కసిగా పనిచేశాం. మా ట్రైలర్‌ని ప్రశంసిస్తూ రాజమౌళిగారు ట్వీట్‌చేశారు. ఓ విషయం చెప్పాలి. ‘మగధీర’ వచ్చిన కొత్తల్లో అనుకుంటాను… రాజమౌళిగారూ, రమా రాజమౌళిగారూ పాల్గొన్న ఓ కార్యక్రమానికి నేనూ, మా ఆవిడా వెళ్లాం. ఆ కార్యక్రమం ముగిసి అందరూ వెళ్లాక ఆ ఇద్దరూ కూర్చున్న కుర్చీల్లో మేం కూర్చుని ఆనందించాం! రాజమౌళిగారంటే నాకు అంత అభిమానం. అలాంటిది… ఆయనే మెచ్చుకుంటూ ట్వీట్ చేస్తే అంతకన్నా ఆనందం ఉంటుందా! అంతేకాదు, కార్తికేయ విడుదలకు ముందురోజు రాత్రి నాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ రాజమౌళి తన అసిస్టెంట్‌చేత పెద్ద లేఖ రాసి దాన్ని ఫ్రేమ్‌కట్టి మరీ పంపించారు. ఓ అభిమానికి ఇంతకంటే పెద్ద కానుక ఏం ఉంటుంది?
చైతూ నేనూ!
కార్తికేయ తర్వాత నాగార్జున గారే పిలిచి ‘చైతూ కోసం ఓ కథ సిద్ధం చెయ్!’ అన్నారు. నేను ఆ పనుల్లో ఉండగానే మలయాళ సినిమా ‘ప్రేమమ్’ రీమేక్ చేసే ఆఫర్ వచ్చింది. నిజానికి రీమేక్ చేయడానికి ఏమాత్రం అవకాశం లేని కథ అది. ఆ విషయమే చెప్పి నాదైన సొంత కథ సిద్ధం చేసే పనిలో పడిపోయాను… నిర్మాతలు ఇంకె వర్నైనా దర్శకుడిగా ఎంచుకుంటారనే ఆలో చనతో. కానీ చైతూ ఫోన్ చేసి ‘ఈ సినిమా నువ్వు చేస్తే చేస్తా.. లేదంటే మానేస్తా’ అన్నాడు. దాంతో ‘ప్రేమమ్‌ని తెలుగులో తీస్తే అందులో ఏయే అంశాలుంటే బాగుంటుంది?’ అని ఆలోచించడం మొదలు పెట్టాను. అలా చైతూ మేనమామగా వెంకటేష్‌ని చూపిస్తే తిరుగుండదు అనిపించింది. అలాంటి పది పాయింట్లు రాసుకొని నిర్మాత దగ్గరకు వెళితే ‘ఓకే’ అన్నారు.
అలా ప్రేమమ్ మొదలుపెట్టాం. అది మంచి విజయం సాధించింది. ఆ తర్వాత మాటల మధ్యలో ఓసారి చైతూతో ‘సవ్యసాచి’ కథని చెబితే ‘నా కోసం ఇదొక్కటి చెయ్’ అన్నాడు. అలా ‘సవ్యసాచి’ చేశాం. అది చాలా విభిన్నమైన కాన్సెప్టే కానీ అసలు కథకి జోడించిన కమర్షియల్ హంగులు సరిగ్గా కుదరక ఆశించినంత ఫలితం రాలేదు. దాంతో నేను చాలా నిరుత్సాహానికి గురయ్యాను. దానికి చైతూ ‘ఇదంతా మామూలే. నెక్స్ట్ సినిమా కోసం ప్రయత్నించు’ అంటూ వెన్నుతట్టినా తేరుకోవడానికి కాస్త సమయం పట్టింది. అలా తేరుకున్నాకే ‘కార్తికేయ-2’ కథ రాసి నిర్మాతలకి వినిపించాను. బడ్జెట్ పరంగా నిఖిల్‌కూ, నాకూ ఉన్న మార్కెట్‌తో పోలిస్తే చాలా భారీ బడ్జెట్ సినిమా అది. అయినా సరే నిర్మాతలు దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. శ్రీకృష్ణుడి జీవితం ఆధారంగా అల్లిన సోషియో-ఫాంటసీ థ్రిల్లర్ ఇది. దాన్ని వివరిస్తూనే కాన్సెప్ట్ వీడియోని విడుదలచేశాం! దానికి అద్భుతమైన స్పందనొచ్చింది. ఆ వీడియో విడుదలయ్యాక చైతూ ఓ పెద్ద మెసేజ్ పెట్టాడు… అందులో చివరిగా ‘ఈ సినిమాతో నువ్వు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలి. అలాంటి హిట్టు నీకు వస్తే ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ సంతోషించేది నేనే!’ అని ఉంది. ఓ స్నేహితుడిగా నాకు అంతకన్నా ఏం కావాలి?!