నచ్చే వ్యక్తులు…అవసరాల శ్రీనివాస్: పక్కవాళ్ల గురించి ఏమాత్రం చెడుగా ఆలోచించని వ్యక్తి. ఏదో చేయాలన్న తపన ఉంటుంది. నటుడిగా ఎదగాలని మాత్రమే ఆలోచిస్తుంటాడు. అంతకు మించి లక్ష్యాలేం పెట్టుకోడు. వెంకటేష్: మనకంటే పెద్దవాళ్లతో మాట్లాడడానికి భయపడుతుంటాం. వాళ్లే సరదాగా మాట్లాడుతున్నా, శ్రద్ధగా వింటాం అంతే. కానీ వెంకటేష్‌గారి దగ్గర మాత్రం అలా అనిపించదు. ఏ వయసు వారితోనైనా ఇట్టే కలిసిపోతారు. ఆయనో జోక్ వేస్తే… మనక్కూడా ఓ జోక్ వేయాలనిపిస్తుంది. అంత చనువు ఇచ్చేస్తారు. ఇంద్రగంటి మోహనకృష్ణ: చాలా పద్ధతైన మనిషి. ఆయనకు ఇష్టమైన సినిమాని తీయడానికి, ఇష్టంగా అనుసరించే పద్ధతులు నాకెంతో ఇష్టం. నన్ను ఓ గదిలో రోజంతా బంధించేస్తే… ఆ గదిలో నాతో పాటు ఇంద్రగంటిగారు ఉండాలని కోరుకుంటా. ఎందుకంటే, చెవులప్పగించి వినే టాపిక్‌్్స ఆయన దగ్గర చాలా ఉంటాయి. రమా – వల్లి: వీళ్లిద్దరూ నన్ను చూసుకునే విధానం, పలకరించే పద్ధతీ చూస్తే, మా మధ్య ఏదో తెలియని అనుబంధం ఉందేమో అనిపిస్తుంది. ఓ పిన్నిలా, పెద్దమ్మలా కనిపిస్తారు. నివేదా థామస్: తనకేదైనా మంచి జరిగితే… మొదటి ఫోన్ నాకే వస్తుంది. నా గురించి ఎక్కడైనా ఓ మంచి విషయం చదివితే… ఓ పెద్ద మెసేజ్ పెడుతుంది. అంత నిజాయతీగా ఒకర్ని ఇష్టపడే అమ్మాయి ఈరోజుల్లో కన్పించడం చాలా కష్టం. |
మెచ్చే సినిమాలు…దళపతి: మణిరత్నం మ్యాజిక్ ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. ఆ సినిమాలో షాట్ మేకింగ్, లైటింగ్… ఇవన్నీ నాకు చాలా చాలా ఇష్టం. ఫిల్మ్‌మేకింగ్‌పై పిచ్చి పెరగడానికి ఈ సినిమా ఓ కారణం. ఆ రోజుల్లో అలాంటి సాంకేతిక విషయాలు ఎలా నోటీస్ చేశానో.. నాకే అర్థం కాదు.సీతారామయ్యగారి మనవరాలు: ఊళ్లో లేకపోతే- మా ఇల్లు పదే పదే గుర్తొస్తే- చూసే సినిమా ‘సీతారామయ్యగారి మనవరాలు’. తెలుగుదనం నూటికి నూరుపాళ్లూ ఉన్న సినిమా. మగాడు: రాజశేఖర్ ‘మగాడు’ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆ రోజుల్లో హైజాక్ స్టోరీ, కిడ్నాప్ డ్రామా డీల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. జెంటిల్‌మేన్: కమర్షియల్ సినిమాకి కొత్త అర్థం చెప్పింది. అప్పటివరకూ హీరోయిజం అంటే.. ప్రతినాయకుడిమీద పోరాటం చేయడమే. కానీ దీన్లో మాత్రం కథానాయకుడి పోరాటమంతా ఓ వ్యవస్థపై ఉంటుంది. వంశవృక్షం: బాపూగారి ‘వంశవృక్షం’ నన్ను షాక్‌కి గురిచేసిన సినిమా. ఈరోజు కూడా అలాంటి ఆలోచనతో ఓ సినిమా తీసే గట్స్ ఎవ్వరికీ లేవు. బాపు తలచుకుంటే, పెద్ద హీరోతో కమర్షియల్ సినిమా తీయొచ్చు. కానీ వాటి జోలికి వెళ్లకుండా ఏదైతే నమ్మారో, అలాంటి సినిమానే తీశారు. |
నా సినిమాలు…అష్టా చమ్మా: నా సినీ జీవితానికి- మరోరకంగా చెప్పాలంటే ఓ కొత్త జీవితానికి శ్రీకారం చుట్టింది ‘అష్టాచమ్మా’తోనే. ఆ సినిమా, అందులో నా పాత్ర, నేను కలసి పనిచేసిన వ్యక్తులూ… అన్ని విధాలా స్పెషల్. ఈగ : రాజమౌళి గారి సినిమాలో అవకాశం రావడం ఇప్పటికీ ఓ కలలా ఉంటుంది. అందులో తెరపై కనిపించేది పదిహేను నిమిషాలే. కానీ సినిమా అంతా ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ‘ఈగ 2’ తీస్తానని రాజమౌళి మాటిచ్చారు. ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఎవడే సుబ్రహ్మణ్యం: కొన్ని సినిమాలు కెరీర్‌ని మారుస్తాయి. ఇంకొన్ని మన ఆలోచనా విధానాన్ని మారుస్తాయి. ఈ రెండో కోవకు చెందే సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’. చాలామంది స్నేహితుల్ని కూడా ఇచ్చింది. భలే భలే మగాడివోయ్: నా కథల్లో వినోదం అందించే అంశాలు ఎక్కువగా ఉండాలని కోరుకుంటుంటా. ఎందుకంటే, నాకూ అలాంటివే ఇష్టం. కానీ సంపూర్ణంగా నవ్వించడానికి చేసిన సినిమా మాత్రం ఇదే. ఓ సమస్యని నవ్విస్తూ చెప్పడం మామూలు విషయం కాదు. అయినా పెద్దగా కష్టపడకుండా ఆడుతూ పాడుతూ చేసేశాను. నా సినిమాలన్నింటిలోకీ నిర్మాతలకు మంచి లాభాల్ని అందించిన చిత్రమిది. జెర్సీ: ఓ సినిమా చేస్తున్నప్పుడు నటీనటులతోనూ, సాంకేతిక నిపుణులతోనూ ఓ అనుబంధం ఏర్పడుతుంది. కానీ చేసిన పాత్రని బాగా ప్రేమించేయడం, ఆ పాత్రని వదిలి రాలేకపోవడం ‘జెర్సీ’తోనే జరిగింది. అర్జున్ పాత్రని అంతగా ఇష్టపడ్డా. షూటింగ్ పూర్తయి ఇంటికి తిరిగివస్తున్నప్పుడు గుండె బరువెక్కిపోయింది. అర్జున్‌లో ఓ స్నేహితుడ్ని చూసుకున్నా. భవిష్యత్తులో ఎన్ని విజయాలు సాధించినా వాటిలో ‘జెర్సీ’కి తప్పకుండా స్థానం ఉంటుంది. |
నోరూరిస్తాయి…అమ్మ చేతి వంట ఏదైనా ఇష్టమే. ఆఖరికి అది రసం అయినా. బయటకు వెళ్లినప్పుడు ఏదైనా కూర తింటుంటే ‘ఇది అమ్మ చేసి ఉంటే ఇంకా బాగుండేది కదా’ అనిపిస్తుంది. మా అమ్మమ్మ చేసే చేపల పులుసు నా ఆల్‌టైమ్ ఫేవరెట్. పూత రేకులు, ఉలవచారు, తిరుపతి లడ్డూ.. వీటిని తలచుకున్నప్పుడల్లా నోరూరిపోతుంటుంది. |
ఇష్టపడే ప్రదేశాలు…తిరుపతి: ఇంచుమించు ప్రతి ఏడాదీ వెళ్తా. హైదరాబాద్: దీంతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైంది. విదేశాలకు వెళ్లి తిరిగొస్తున్నప్పుడు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చూడగానే.. ‘హమ్మయ్య ఇల్లు వచ్చేసింది’ అనుకుంటా. చెన్నై: ఊరొదిలేసి ఎక్కువ కాలం ఉన్న నగరమిది. ఎప్పుడక్కడకు వెళ్లినా ఓ తెలియని ఆనందం కలుగుతుంది. హిమాలయాలు: నా మరో ఫేవరెట్ ప్లేస్. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సమయంలో 42 రోజులపాటు అక్కడ ఉన్నా. అక్కడి ప్రశాంతమైన వాతావరణాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. గోవా: అక్కడి బీచ్‌లో టేబుల్ ముందు కూర్చుని నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటూ ఉంటే.. భలే బాగుంటుంది. |
జున్నుగాడి కబుర్లు
వాడి పేరు: అమ్మాయి పుడుతుందని అంజనా, నేనూ చాలా పేర్లు సెలక్ట్ చేసి పెట్టుకున్నాం. తీరా అబ్బాయి పుట్టాడు. ‘రైడ్’లో నాపేరు అర్జున్. ఆ పేరు నాకు బాగా సూటయిందని అప్పట్లో అంజనా అంది. అందుకే ‘అర్జున్’ అని పెట్టాం. |
గుర్తుకొస్తుంటాయి…
నవీన్: చిన్నప్పట్నుంచీ అందరూ నన్ను ‘నాని’ అనే పిలిచేవారు. స్కూల్ రికార్డుల్లో మాత్రం నవీన్ అని ఉంటుంది. స్కూల్లో నవీన్ అని టీచర్ పిలిస్తే అదెవర్నో అనుకునేవాణ్ని. పక్కనున్నవాళ్లు ‘నిన్నే’ అని చెబితే అప్పుడు గుర్తొచ్చేది. స్క్రీన్‌మీద ఏ పేరు వెయ్యాలని మోహనకృష్ణగారు అడిగినపుడు… ‘నాని అనే వేయండి. నవీన్ బాగా చేశాడని పొగిడినా అది నేను కాదన్న ఫీలింగ్ ఉంటుంది’ అని చెప్పా. |