జన్మించింది కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో నైనా, సంగీతం మీద పి. లీలకున్న అభిరుచి కారణంగా సంగీతం నేర్పించాలనే తలంపుతో పి. లీల తండ్రి మద్రాసులో మకాం పెట్టారు. ఆది నుంచి తెలుగువారి ప్రోత్సాహం పొందడం వల్ల తెలుగువారన్నా, తెలుగు భాష అన్నా లీలకు చాల ఇష్టం. శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ తన తొమ్మిదో ఏడాదే సంగీతకచేరి చేసారు పి.లీల. ఆంధ్రమహిళా సభలో తొలిసారి సంగీత కచేరి చేసిన ఆమెకున తెలుగు భాషమీద అభిమానం. ప్రేమ పెరిగింది. ‘భక్త తులసీదాసు’ చిత్రంకి బృందగానంలో ఒకరిగా పాడారు. తరువాత ‘మనదేశం’ చిత్రంలో బాలా త్రిపురసుందరీ….. అనే పాటను ఘంటసాల ప్రోత్సాహంతో పాడారు. అప్పటికి తెలుగు మాట్లాడడం, అర్ధం చేసుకోవడం లీలకు తెలియదు. అందుకే మలయాళంలో ఆ పాట రాసుకుని పాడారట. తెలుగు భాష రాకుండా తెలుగు పాటలు పాడితే బాగుండదని తెలుగు నేర్చుకున్నారు. తెలుగువారి వల్లనే గాయనిగా తనకు ప్రముఖ స్థానం లభించిందని పి. లీల అనేవారు. ఆకాశవాణిలో కూడా పాటలు పాడుతున్న పి.లీలను చూసి తొలుత ‘కంకణం’ తమిళ చిత్రంలో పాడించారు. ఈ చిత్రంలో పాడటానికి ముందుగానే కొలంబియా గ్రామఫోన్ కంపెనీ సరస్వతి స్టోర్స్ పి. లీల పాడిన ప్రయివేటు గీతాలను రికార్డులుగా విడుదల చేసారు. సంగీత దర్శకుడు సి.ఆర్. సుబ్బరామన్ సంగీతం సమకూర్చే తమిళ చిత్రాలకు పాటలు పాడుతూ, ఆయన వద్దనూ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు లీల.
ఘంటసాల ప్రోత్సాహంతో ఆయన సంగీత దర్శకత్వం వహించిన ‘మనదేశం’ చిత్రంలో బాలా త్రిపుర సుందరి… పాట పాడటంతో తెలుగులో గాయనిగా ఆమె కెరీర్ ప్రారంభం అయింది. కీలుగుర్రంలో దిక్కు తెలియదేమి సేతు, గుణసుందరికథలో ‘ఓ మాతా రావా, మొర వినవా…’ ‘ఉపకార గుణాలయవై ఉన్నావు కదే మాతా …,’ కల్పకమ తల్లివై ఘనత వెలిసిన గౌరి…, ‘ఏ ఊరు ఏలినావో…’ శ్రీతులసీ ప్రియ తులసీ పాటలను, ‘పాతాళభైరవి’ చిత్రంలో ‘తీయని ఊహలు హాయిని గొలిపే వసంత గానమె హాయి. కలవరమాయె మదిలో, నా మదిలో, ఎంత ఘాటు ప్రేమయో…, ‘పెళ్ళిచేసి చూడు’లో ‘మనసా నేనెవరో, నీకు తెలుసా…’ ఏడుకొండలవాడా వెంకటరమణా, ఎవరో…ఎవరో, చంద్రహారంలో ‘దయ గనవే తల్లిd…’ కృప గనవా నా మొర వినవా…’ ఏ సాధువులు ఎందు హింసలు బడకుండ… అని సాగే పద్యం, ‘మిస్సమ్మ’లో ‘తెలుసుకొనవె చెల్లిd…’ ‘కరుణించు మేరిమాతా…’ ‘రావోయి చందమామా…’ ‘ఏమిటో ఈ మాయా…’ ‘మాయాబజార్’లో ‘నీవేనా నను తలచినది..’ ‘చూపులు కలసిన శుభవేళా…’ ‘విన్నావ యశోదమ్మా..’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, నీ కోసమే నే జీవించునది… పెళ్ళి నాటి ప్రమాణాలులో ‘వెన్నెలలోనే వేడి ఏలకో..’ నీతోనే లోకము, నీతోనే స్వర్గము, లాలి మా పాపాయి ఆనందలాలీ…’ ‘అప్పుచేసి పప్పుకూడు’లో ‘రామనామ శరణం, భద్రాద్రిరామ శరణం’, ‘ఎచట నుండి వీచినో ఈ చల్లని గాలి’, ‘సుందరాంగులను చూసిన వేళల…,’ ‘ఆనందం పరమానందం..’ ‘చేయి చేయి కలుపరావె హాయి హాయిగా…,’ గుండమ్మకథలో ‘వేషము మార్చెను…’ ముద్దుబిడ్డలో జయమంగళ గౌరీదేవీ… ‘పాండవ వనవాసం’లో దేవా దీనబాంధవా… వంటి పాటలు సోలో గీతాలుగాను, యుగళగీతాలుగాను పాడారు లీలగా. తెలుగు చిత్రరంగంలో నిలదొక్కుకోడానికి, తెలుగు గాయని కాబోలు అని అనిపించుకోడానికి ఘంటసాల ప్రధాన కారకులైతే, సి.ఆర్, సుబ్బరామన్, ఓగిరాల రామచంద్రరావు, విజయా కృష్ణమూర్తి, సుసర్ల దక్షిణామూర్తి, మాస్టర్ వేణు, టి.వి.రాజు, ఎస్.రాజేశ్వరావు, పెండ్యాల ఇలా పలువురు సంగీత దర్శకులు, విజయా సంస్థ , నిర్మాతలు, దర్శకుల ప్రోత్సాహం మరుపురానిదనేవారు పి.లీల.
తన సినీ జీవితములో అనేక అవార్డులు అందుకొన్న లీలకు 1969లో కేరళ ప్రభుత్వ ఉత్తమ నేపథ్యగాయకురాలు అవార్డు అందుకొన్నది. 1992లో తమిళనాడు ప్రభుత్వం లీలను కళైమామణి పురస్కారంతో సత్కరించింది.
లీలపాడిన పాటల్లో అందమె ఆనందం, ఆనందమె జీవిత మకరందం, ఏమిటో ఈ మాయా…, లవకుశలో సుశీలతో కలిసి పాడిన పాటలు ఎంతో హాయినిస్తాయి.
సావిత్రి దర్శకత్వంలో రూపొందిన ‘చిన్నారి పాపలు’ చిత్రానికి సంగీత దర్వకత్వం నిర్వహించారు.
సినిమా సంగీతంలో వచ్చిన మార్పులు, మెలొడీకి, సాహిత్యానికి ప్రాధాన్యత తగ్గి వాయిద్యాల హోరు పెరిగి పోవడంతో పాటలు తగ్గించారు పి. లీల. పాట పాడకుండా ఉండలేని స్థితి కారణంగా జమునారాణి, ఎ.పి. కోమల ప్రభృతులతో కలసి సినిమా పాటల కచేరి, శాస్త్రీయ సంగీత కచేరీలు నిర్వహించేవారు.