చాయ్‌ బిస్కెట్‌…ఇద్దరు స్నేహితుల కథ!

 

చాయ్‌ బిస్కెట్‌…ఇద్దరు స్నేహితుల కథ!

 

హైదరాబాదీలు దోస్తులొస్తే చాయ్‌ బిస్కెట్‌ ఇప్పిస్తారు. మరీ దగ్గరి స్నేహితులైతే సింగిల్‌ చాయ్‌లో చెరో బిస్కెట్‌ ముంచుకుని తింటారు. అందుకేనేమో తమ దోస్తీతో పుట్టిన వినోదాల వెబ్‌సైట్‌కి ‘చాయ్‌ బిస్కెట్‌’ అని పేరుపెట్టారు అనురాగ్‌, శరత్‌. ఈ సైట్‌కంటే ముందు, తెలుగు సినిమా పరిశ్రమకి తొలిసారి డిజిటల్‌ మార్కెటింగ్‌ని పరిచయం చేసిన ఘనత ఈ కుర్రాళ్లది. మామూలు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వీళ్లు ఇప్పుడు నిర్మాతలుగా మారి రెండు సినిమాలు తీస్తున్నారు. అడివి శేష్‌ ‘మేజర్‌’ చిత్రం అందులో మొదటిది. వాళ్ల జర్నీ ఇది.

‘ఏమయ్యా కొరటాలా! ఆచార్య టీజర్‌ న్యూ ఇయర్‌కీ లేదూ సంక్రాంతికీ లేదూ ఇంకెప్పుడూ? ఎప్పుడో చెప్పకపోతే లీక్‌ చేయడానికి రెడీగా ఉన్నా!’ – ఈ ఏడాది జనవరి 26న మెగాస్టార్‌ చిరంజీవి ట్విటర్‌ అకౌంట్‌లో కనిపించిన ట్వీట్‌ ఇది. ‘ఆచార్య’ దర్శకుడు కొరటాల శివని నేరుగా నిలదీస్తున్నట్టుండే ఆ ‘ఫొటో స్ట్రిప్‌’ లక్షలాది రీట్వీటులతో అప్పట్లో బాగా వైరల్‌ అయింది. ఆ ఫొటోలు చూస్తే- ఇద్దరూ ఏదో సరదాగా కలిసినప్పుడు సహజంగా తీసిన ఫొటోల్లా అనిపిస్తాయికానీ- కాదు. దాని వెనక ఓ చక్కటి డిజిటల్‌ మార్కెటింగ్‌ వ్యూహం ఉంది. ఆ వ్యూహం అనురాగ్‌-శరత్‌లది. ‘ఫలానా తేదిన టీజర్‌ వస్తుందహో!’ అని చెప్పడంకన్నా ఇలా చిరంజీవి ఎక్స్‌ప్రెషన్స్‌తో చెబితే కొత్తగా ఉంటుంది కదా! అదే చేశారు వాళ్లిద్దరూ. తాజాగా, ‘ఆచార్య’ సినిమా కోసం మరో కొత్త ప్రయోగాన్నీ చేశారు. ఆ సినిమా టీజర్‌లో కనిపించే ‘పాఠాలు చెప్పకున్నా నన్ను ఆచార్యా అనే పిలుస్తున్నారు. బహుశా… గుణపాఠాలు చెబుతానని కావొచ్చు!’ అన్న సీన్‌ని ‘రీఫేస్‌’ మొబైల్‌ ఆప్‌లో విడుదలచేశారు. అంటే, ఆ సీన్‌లోని చిరంజీవి ముఖానికి ప్రేక్షకులు తమ ముఖం తగిలించుకుని డైలాగులు చెప్పే సౌకర్యాన్ని కల్పించారన్నమాట! ఇంకేం… అభిమానులందరూ ఇప్పుడు ఆ డైలాగులు చెబుతున్నారు. ఎవరో సరదాకి ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ ముఖాన్ని తగిలిస్తే అది కూడా బాగా వైరల్‌ అవుతోంది! అనురాగ్‌, శరత్‌ల డిజిటల్‌ మార్కెటింగ్‌ సంస్థ ‘ఫస్ట్‌ షో’ రూపొందించే ప్రచార వ్యూహం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ. ఇటీవల ప్రేక్షకుల్ని అలరిస్తున్న ‘పుష్ప’ సినిమా మార్కెటింగ్‌ బాధ్యత కూడా వాళ్ల సంస్థదే. గత తొమ్మిదేళ్లలో వినూత్న ప్రచారాలతో నెటిజన్లని అలరించిన ‘అర్జున్‌రెడ్డి’, ‘భరత్‌ అనే నేను’,  వంటి సూపర్‌హిట్‌ చిత్రాలు సహా సుమారు 150 సినిమాలకి డిజిటల్‌ మార్కెటింగ్‌ వ్యూహాలు వీళ్లవే. ఇంతకీ ఇదంతా ఎలా మొదలైందీ అంటే… అనురాగ్‌, శరత్‌ పదో తరగతి నుంచీ స్నేహితులు. అనురాగ్‌ వాళ్ల నాన్న ఎల్‌ఐసీలో ఉద్యోగైతే… శరత్‌ వాళ్ల నాన్న ఓ ప్రైవేటు కంపెనీలో చేస్తుండేవారు.
అనురాగ్‌ ముందు నుంచీ చదువులతోపాటూ ఇతరత్రా ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కార్యక్రమాల పైన ఉత్సాహం చూపిస్తుండేవాడు. ‘ఓసారి మా కాన్వెంట్‌కి దేశం నలుమూలల నుంచి మూడువేల మంది విద్యార్థులొచ్చారు. దానికి స్టూడెంట్‌ ఈవెంట్‌ మేనేజర్‌గా నన్నే ఎన్నుకున్నారు. టీచర్ల సాయమున్నా… అంతమంది వివరాలు నమోదుచేసుకోవడం, వాళ్ల అవసరాలు గుర్తించడం, వాళ్ల ప్రశ్నలకి స్పందించడం… ఇవన్నీ నేను చేయగలనా అనిపించింది కానీ మా హెడ్‌మాస్టరే ‘యు కెన్‌… అనురాగ్‌’ అని భుజం తట్టారు. అది నాలో చాలా నమ్మకాన్ని నింపింది. అప్పటి నుంచి ప్రతి ఈవెంట్‌ బాధ్యతా నాకే వచ్చింది!’ అనంటాడు అనురాగ్‌. పదో తరగతిలో శరత్‌తో పరిచయమయ్యాక ఇద్దరూ కలిసి ఇలాంటివి చేయడం మొదలుపెట్టారు. ఆ భాగస్వామ్యం ఇంజినీరింగ్‌లోనూ కొనసాగింది. ‘ఇంజినీరింగ్‌లో మాది ఐదుగురు జిగిరి దోస్తుల బ్యాచ్‌. కాకపోతే, డిగ్రీ కావడానికి ముందే మిగతా ముగ్గురూ అమెరికాలో ఉద్యోగాలు కొట్టేశారు. మాకేమో ఉద్యోగాలకి వెళ్లాలనిపించలేదు… సొంత సంస్థే స్థాపించాలనుకున్నాం. కానీ ఇద్దరికీ ఎలాగూ మేనేజ్‌మెంట్‌లో ఆసక్తి ఉంది కాబట్టి ముందు ఎంబీఏ చేయాలనుకున్నాం. ఆరునెలలపాటు శ్రమించి క్యాట్‌లో మంచి స్కోర్‌ సాధించాం!’ అని గుర్తుచేసుకుంటారీ స్నేహితులు. అయితే- ఇద్దరికీ ఒకే చోట సీటు రాకపోవడంతో అనురాగ్‌ ముంబయిలోని ‘నార్సి మాంజీ ఇన్‌స్టిట్యూట్‌’లో చేరితే, శరత్‌ బెంగళూరు ‘సింబయాసిస్‌’కి వెళ్లాడు. ఆ ఎంబీఏ చదువే డిజిటల్‌ మార్కెటింగ్‌ని వీళ్లకి పరిచయం చేసింది. పట్టా చేతికి వచ్చాక ఇక ఆ రంగంలోనే అడుగేయాలనుకున్నారు. కానీ ‘చిన్నప్పటి నుంచీ మాకో పంథా ఉండేది. ఎప్పుడూ నలుగురూ నడిచే దారిలో కాకుండా కొత్తదారిలో నడవాలనుకునేవాళ్లం. ‘మరి… డిజిటల్‌ మార్కెటింగ్‌ పాతదే కదా! దాంట్లో కొత్తగా మనమేం చేయగలం’ అన్న ప్రశ్న వాళ్ల చూపుని తెలుగు సినిమా రంగంపైన పడేలా చేసింది. ఒక్క టాలీవుడ్‌లోనే కాదు దక్షిణాది మొత్తంలోనూ అప్పటికి డిజిటల్‌ మార్కెటింగ్‌ ఊసేలేదు మరి!
ఫ్లాప్‌ టాక్‌ని మార్చేశారు…
సినిమా అభిరుచిపరంగా  అనురాగ్‌-శరత్‌లు సగటు ప్రేక్షకులకంటే కాస్త ఎక్కువేనని చెప్పాలి. ‘ఇంటర్‌ నుంచీ సినిమాలపిచ్చి బాగా ఉంది మా ఇద్దరికీ! వారం వారం ఏదో ఒక కొత్త సినిమా చూసి తీరాల్సిందే. ముఖ్యంగా ఇంగ్లిష్‌ సినిమాలైతే వదిలేవాళ్లం కాదు. మేం ఈ రంగాన్నే ఎంచుకోవడానికి ఇది కూడా ఓ కారణం’ అంటాడు శరత్‌. అద్సరే… మరి కాలేజీ నుంచి అప్పుడే బయటకొచ్చిన ఈ కుర్రాళ్లని నమ్మి డిజిటల్‌ మార్కెటింగ్‌ బాధ్యతలు ఎవరు అప్పగిస్తారు! అయినా వీళ్లేమీ భయపడలేదు. తాము ఈ రంగానికి ఏమేం చేయగలమో చూపిస్తూ చక్కటి పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌లు తయారుచేసుకుని దర్శకనిర్మాతల దగ్గరకి వెళ్లడం మొదలుపెట్టారు. హాలీవుడ్‌లో ఇలాంటి డిజిటల్‌ మార్కెటింగ్‌ గురించి అవగాహన ఉన్నవాళ్లు వీళ్లతో పనిచేయడానికి ముందుకొచ్చారు. అలా, దర్శకుడు మహీరాఘవ తొలిసినిమా ‘పాఠశాల’కి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత శర్వానంద్‌ నిర్మించి నటించిన ‘కో అంటే కోటి’కి పనిచేశారు. వాటిని చూశాక నిర్మాత అనిల్‌కుమార్‌ సుంకర – మహేశ్‌బాబు చిత్రం ‘1-నేనొక్కడినే’ చిత్రానికి అవకాశమిచ్చారు. తొలి భారీ బడ్జెట్‌ చిత్రం కాబట్టి ఫేస్‌బుక్‌, ట్విటర్‌, సినిమా వెబ్‌సైట్‌ ఆప్‌లాంటివాటిల్లో ప్రేక్షకుల్ని కట్టిపడేసే ఎన్నో వినూత్న ప్రచారాలని రూపొందించారు ఇద్దరూ. అన్నింటికన్నా ఆడియో రిలీజ్‌ లైవ్‌ని థియేటర్‌లలో ప్రత్యేకంగా ప్రదర్శించడం ప్రేక్షకుల్ని అబ్బురపరిచింది. కానీ ‘మేం ఇంత చేసినా సినిమా రిలీజైన మొదటి రోజు జోరుగా ‘నెగెటివ్‌ టాక్‌’ మొదలైంది. ‘సినిమా అర్థంకాలేదనీ… సగటు ప్రేక్షకుడి స్థాయిలో లేదనీ…’ ఇలా. కాకపోతే రెండుమూడురోజుల తర్వాత కొందరు ప్రేక్షకులు ‘సినిమా చాలా ఫ్రెష్‌గా తెలుగు పరిశ్రమ ఇదివరకు చూడని కథాకథనాలతో ఉంద’ని పాజిటివ్‌గా రాయడం ప్రారంభించారు.
ఫేస్‌బుక్‌లోనూ, ట్విటర్‌లలోనూ కామెంట్‌ చేస్తున్న అలాంటివాళ్లని మేం ప్రముఖ సినిమా రేటింగ్‌ సైట్‌ ‘ఐఎండీబీ’ వైపు మళ్ళించాం. వాళ్ల స్పందనలతో చూస్తుండగానే అక్కడ సినిమా రేటింగ్‌ 10కి 8.9కి పెరిగింది! రెండువారాల్లో ‘హిట్‌ టాక్‌’ వచ్చింది. కలెక్షన్‌లూ ఊపందుకున్నాయి. అది చూశాకే ‘ఈ సినిమా 50 శాతం విజయం డిజిటల్‌ మీడియాకే దక్కుతుంది’ అని ప్రకటించారు దర్శకుడు సుకుమార్‌. అంతేకాదు… ఈ సినిమా కోసం మాకు దేశంలోనే ఉత్తమ మార్కెటింగ్‌ సంస్థగా అవార్డూ దక్కింది…’ అంటాడు అనురాగ్‌. బిజినెస్‌ పరంగా ‘ఫస్ట్‌ షో’ సంస్థ తొలి పెద్ద అడుగు అది. మరి అప్పటిదాకా  పెట్టుబడి కోసం ఏం చేశారు?

ఐదుగురితోనే…
‘అందరు తల్లిదండ్రుల్లాగే మావాళ్లూ ‘హాయిగా ఉద్యోగం చేసుకోకుండా… వ్యాపారాలు ఎందుకు?’ అన్నవాళ్లే. మేం విన్లేదు. మా ఆలోచన నుంచి వెనక్కి తగ్గడం కానీ… అసలు ఫెయిల్‌ అవుతామనే ఆలోచన కానీ రాలేదు. మా నాన్న నా కోసం దాచిన బీమా సొమ్ము మొత్తం తీసుకున్నాను. శరత్‌ కూడా అప్పుతెచ్చాడు. అలా మొదటి మూడునెలల్లో ఐదు లక్షలు పెట్టుబడి పెట్టాం. కేవలం నలుగురు ఉద్యోగులతో  2013లో మా ‘ఫస్ట్‌ షో’ మొదలైంది!’ అంటాడు అనురాగ్‌. నాలుగో నెల నుంచే సంస్థ ఆటుపోట్లేవీ లేకుండా సాగడం ప్రారంభించింది. రెండేళ్లలోనే లాభాలబాట పట్టింది. ‘మేం డిజిటల్‌ మార్కెటింగ్‌లో భాగంగా ‘18-30 మధ్య వయసువాళ్లు  ఏం చూస్తారు… చదువుతారు’ అని సర్వే చేస్తున్నప్పుడు- వాళ్లకి కావాల్సినవేవో మార్కెట్‌లో లేవు అనిపించింది. వాళ్లని ఆకట్టుకునే అంశాలతో ఓ వెబ్‌సైట్‌ పెట్టాలనుకున్నాం. ‘చాయ్‌ బిస్కెట్‌’ తాగుతూ వచ్చిన ఐడియా కాబట్టి సంస్థకి ఆ పేరే పెట్టాం!’ అంటాడు శరత్‌. యువత కోసం ఇచ్చినా ఎక్కడా అసభ్యత లేకుండా చూసుకోవడంతో అది ఎంతోమందిని కట్టిపడేసింది. ఆ ఉత్సాహంతో వీడియోలు చేయడం మొదలుపెట్టారు. వాటిని చూసి సినిమా కలలుకంటున్న ఎంతోమంది యువతీయువకులు ఇటువైపు రావడం మొదలుపెట్టారు.
ప్రధాన యూట్యూబ్‌ ఛానెల్‌కి అనుబంధంగా ఆహార విషయాలకోసం ‘ఫుడ్‌’, ‘ఫుడ్‌ మాంక్స్‌’, అమ్మాయిల కోసం ‘గర్ల్‌ ఫార్ములా’, స్ఫూర్తిదాయక కథనాల కోసం ‘చాయ్‌బిస్కెట్‌ స్టోరీస్‌’ …ఇలా 15 ప్రత్యేక ఛానెళ్లు ప్రారంభించారు.
‘30 వెడ్స్‌ 21’ వెబ్‌సిరీస్‌తో చక్కటి గుర్తింపు సాధించారు. చూస్తుండగానే ‘చాయ్‌ బిస్కెట్‌’ తిరుగులేని బ్రాండ్‌గా మారింది. అంతేకాదు, ఇక్కడ నటిస్తున్నవాళ్లూ, సాంకేతిక నిపుణులూ సినిమా పరిశ్రమలోనూ చక్కగా పేరు తెచ్చుకోవడం మొదలు పెట్టారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఉండి హీరో అయిన ‘సుహాస్‌’, ‘మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌’ ఫేమ్‌ దివ్య, తాజాగా వచ్చిన ‘మెయిల్‌’ సినిమా నాయికానాయకులు హర్షిత్‌, శ్రీప్రియలు ఇక్కడి నుంచి వచ్చినవాళ్లే! ‘కలర్‌ ఫొటో’ చిత్రం ఎడిటర్‌ పవన్‌కల్యాణ్‌ కూడా ఇక్కడివాడే.
వీళ్లందరూ తమని తాము మలచుకుని ఇంత చక్కటి గుర్తింపు సాధిస్తే… తాము మాత్రం ఉన్నచోటే ఉండిపోతే ఎలా! అందుకే అనురాగ్‌-శరత్‌లు నిర్మాతలుగా అవతారమెత్తారు!
‘మేజర్‌’ కోసం…
‘చాయ్‌ బిస్కెట్‌’ కోసం అడివి శేష్‌ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ముంబయి దాడుల్లో వీరోచితంగా పోరాడి చనిపోయిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ బయోగ్రఫీలో నటించాలని ఉందని చెప్పాడు. ఆ సినిమాను మేమే తీయాలనిపించింది. అప్పటికే శేష్‌ని హీరోగా చేయడానికి పెద్దపెద్ద సంస్థలు ముందుకొస్తున్నాయి. అయినా సరే, మాకు ఏమాత్రం అనుభవం లేకున్నా మా ఉత్సాహాన్ని చూసి ముందుకొచ్చాడు. మేజర్‌ ఉన్నికృష్ణన్‌ తల్లిదండ్రుల నుంచి అనుమతులు తీసుకోవడం దగ్గర్నుంచి ముంబయి షూటింగు అనుమతులదాకా తానూ ప్రొడక్షన్‌లో భాగమయ్యాడు. ఇదంతా ఒకెత్తయితే ఈ కథ నచ్చి మహేశ్‌బాబూ సహనిర్మాతగా మారడం మరొకెత్తు’ అంటారు అనురాగ్‌, శరత్‌. ఆ ఇద్దరి పేర్ల మొదటి అక్షరాలతో ఏర్పాటైన ‘ఎ ప్లస్‌ ఎస్‌’ బ్యానర్‌ ఈ సినిమాని తెలుగుతోపాటూ హిందీ, మలయాళంలోనూ నిర్మించింది. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. ‘ఎ ప్లస్‌ ఎస్‌’ సంస్థతోపాటూ ‘చాయ్‌బిస్కెట్‌ ఫిల్మ్స్‌’ పేరుతో మరో నిర్మాణ సంస్థనీ ఏర్పాటు చేశారు. దీనికింద కొత్త దర్శకులకి మాత్రమే అవకాశం ఇస్తామంటున్నారు. ఇప్పటికే సుహాస్‌ హీరోగా ‘రైటర్‌ పద్మభూషణ్‌’ సినిమాని పూర్తిచేశారు. ఈ సినిమాతో షణ్ముఖ అనే కొత్త దర్శకుణ్ణి పరిచయం చేస్తున్నారు! ఐదుగురితో మొదలుపెట్టిన ‘ఫస్ట్‌ షో’… ఆ తర్వాతి యూట్యూబ్‌ ఛానెళ్లూ, నిర్మాణ సంస్థల్లో కలిపి వందమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు వీళ్ల దగ్గర. వారిలో వీళ్లిద్దరితో సన్నిహితంగా మెలిగే వాళ్లని అడిగినా ‘ఆ ఇద్దరి మధ్య చిన్న మాట తేడా రావడం కూడా చూసిందే లేదండీ!’ అంటారు. అదెలా సాధ్యమని అడిగితే ‘ఏ సందర్భంలో ఎవరం ఎలా స్పందిస్తామో ఇద్దరికీ బాగా తెలుసు. పైగా స్కూలూ కాలేజీ రోజుల్లో ఇద్దరికీ బాగానే గొడవ లయ్యాయి. ఆ సరదాలు అక్కడితో తీరిపోవడంతో మళ్లీ గొడవపడే అవకాశం రాలేదు’ అని ఇద్దరూ నవ్వుతుంటే… స్నేహమనే చాయ్‌కి చెరో బిస్కెట్‌లా అనిపిస్తారు!