జ్ఞాపకాలు
హైలో హైలెస్సా… హంస కదా నా పడవ
మా సొంత ఊరు తెనాలి సమీపంలోని చినరావూరు. సూరయ్య, శ్రీమతి వెంకటరత్నమ్మగార్లు నా తల్లిదండ్రులు. మాది మొదటినుంచీ వ్యవసాయకుటుంబమే ! నాకు ఇద్దరు అన్నయ్యలు. వాళ్లకు చెల్లెలు నేనొక్కదాన్నే కావడంతో నన్ను చాలా గారాబంగా చూసుకునేవారు. మా అమ్మ నేను ఒక కళాకారిణిగా ఎదిగితే చూడాలని ఆశపడేది. అందుకే నాకు చిన్నప్పటినుంచీ సంగీతం, నాట్యం నేర్పించారు. ఆ రోజుల్లో ఎం.ఎస్. శైవ అని ఓ నాట్యాచార్యుడు ఉండేవారు. ఆయన దగ్గర నాకు నాట్యశిక్షణ ఇప్పించారు. ఆయన అప్పుడు గుంటూరులో ఉండేవారు. ఆయన దగ్గర కూచిపూడి డాన్సు నేర్చుకున్నాను. నా ఐదవ ఏటనే డాన్సుప్రోగ్రామ్స్ ఇవ్వడం ప్రారంభించాను. నా అసలు పేరు సరోజిని. అయితే తెనాలిలో వి.సాంబశివరావు గారని ఉండేవారు. ఆయన నా నాట్యప్రదర్శనలు చూసి ముగ్ధులై, మా అమ్మానాన్నలతో మాట్లాడి ‘బేబీ సుజాత – పార్టీ’ అనే పేరుతో ఓ డాన్స్ ట్రూప్ పెట్టి నా పేరు సుజాతగా మార్చారు.
జీతం 300
నా విద్యాభ్యాసం అంతా తెనాలిలోని మునిసిపల్ గర్ల్స్ హైస్కూలులో సాగింది. మేమంతా స్కూలు నాటకాల్లో చాలా చురుగ్గా పాల్గొనేవాళ్లం. ఓ సారి శకుంతల నాటకం వేస్తే అందులో నేను దుష్యంతుడిగా నటించాను. నేను బాగా డాన్సు చేస్తానని పాఠశాలలో నన్ను బాగా చూసుకునేవారు టీచర్లు. నా 11వ ఏటనే నా నృత్యకౌశలాన్ని చూసి నాకు భువనగిరిలో నృత్య ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం ఇచ్చారు. వయసు చాలకపోయినా నెలకు రూ 300 జీతంతో నేను భువనగిరిలో ఉద్యోగం చేశాను. మా అమ్మానాన్నలు నా ఉత్సాహాన్ని చూసి నాతో పాటే అక్కడకు వచ్చేశారు.
నేను తెనాలిలో ఫోర్త్‌ఫారం వరకూ చదువుకున్నాను. ఆ బడిలోనే సరస్వతిగారని ఒక తెలుగు టీచరు ఉండేవారు. ఆమె కూతురికి నేను డాన్సు నేర్పేదాన్ని. ఆమెకు వినోదాసంస్థ అధినేత డి.ఎల్.నారాయణగారు తెలుసు. ఆయన ఆ సమయంలో ‘సిపాయి కూతురు’ అనే చిత్రాన్ని తీస్తున్నారు. అందులో వాంప్ వేషానికి తగిన యువతి కోసం అన్వేషిస్తూ తెనాలిలో ఎవరైనా ఉంటే చెప్పమని సరస్వతిగారిని అడిగారట. నాకు కూడా చిన్నప్పటినుండీ సినిమాలంటే ఇష్టమే! పైపెచ్చు జమునగారంటే విపరీతమైన ఆరాధన. ఆమె స్టైల్‌ను అనుకరించేదాన్ని. జమునగారిని దగ్గరగా చూడాలని, ఆమెను అక్కా అని పిలవాలని తెగ ఆరాటపడేదాన్ని. సినిమాల్లోకి వస్తే ఆ కోరిక తీరుతుందేమోననే ఆశతో సినిమాలపై మోజుపడ్డాను. కానీ మా నాన్న, అన్నయ్యలు ససేమిరా కాదన్నారు. మా కుటుంబాల్లో తర్జనభర్జనలు జరిగాయి. ఎట్టకేలకు మా అమ్మగారి పట్టుదలతో సినిమాల్లో చేరడానికని చెన్నై వచ్చాం. డి.ఎల్. నారాయణ గారు నన్ను చూసి, ‘మరీ చిన్నపిల్ల, మళ్లీ ఎప్పుడైనా చూద్దాంలే’ అనేసి, ఆ పాత్రకు ఎల్.విజయలక్ష్మిని తీసుకున్నారు. ఆమెకూ అదే మొదటి సినిమా.
పంటి మీద పన్ను కరిగింది
సరే ఇక ఏంచేద్దాం అని ఆలోచిస్తుండగా నాకు చిన్నతనంలో నాట్యం నేర్పిన ఎం.ఎస్. శైవగారు అప్పుడు చెన్నైకై వచ్చేశారని తెలిసింది. మా అమ్మావాళ్లు ఇంకా బాగా నాట్యం నేర్చుకోమని వారి వద్ద చేర్చారు. సరేనని నేనూ డాన్సు కొనసాగించాను. శైవాగారి దగ్గరకు నాటకాల వాళ్లు, సినిమాల వాళ్లు అప్పుడప్పుడూ వచ్చిపోతుండేవారు. అలా ఓ సారి నాగభూషణం గారు వస్తే, శైవగారు నన్ను వారికి సిఫారసు చేశారు. అలా ఆ నాటకంలో ఇందిర పాత్రకు నన్ను తీసుకున్నారు. ఆ పాత్రను నాకు ముందు శారదగారు వేసేవారు. నా తర్వాత వాణిశ్రీ గారు వేస్తూ వచ్చారు. ఆ నాటకం నాకు మంచిపేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘భక్త అంబరీష ‘( 1959 )చిత్రంలో ఈలపాటి రఘురామయ్యగారి సరసన శ్రీమహాలక్ష్మీగా, ‘దీపావళి'(1960) లో రంభగా ‘కన్న కొడుకు’ (1961) ‘నాగార్జున'(1962)లో సుభద్ర పాత్రను, రాజనాల సరసన నటించాను. ఆ పాత్ర కథానాయక కిందే లెక్క.
ఆ సినిమా తర్వాత బి.ఏ.సుబ్బారావు గారు ‘భీష్మ'(1962) లో మత్స్యగంధి పాత్రను వేశాను. ఈ వేషానికి మొదట సత్యవతి(రచయిత అనిసెట్టి సతీమణి) గారిని అనుకున్నారు. కానీ ఏవో కారణాలవల్ల ఆమె విరమించుకుంటే ఆ అవకాశం నాకు లభించింది. అప్పట్లో నాకు పంటిమీద పన్ను ఉండేది. సుబ్బారావుగారు ఆ పళ్లు బాగాలేదని దాన్ని కరిగించేసి, మళ్లీ ఏదో క్యాప్ వేసి చాలా శ్రద్ధ తీసుకున్నారు. హైలో హైలెస్సా పాట నామీద చిత్రీకరించారు. జమునారాణి గారు ప్లేబాక్. ఆంధ్రదేశాన్ని అదరగొట్టేసిందా పాట. ఇప్పటికీ అభిమానులు నన్ను మీరు ‘భీష్మ’ సుజాత గదా అని గుర్తుపట్టి పలకరిస్తుంటే నాకు చాలా అనందంగా ఉంటుంది. వాలి(ఆర్టు డైరెక్టరు), హరిబాబు(మేకప్‌మాన్) గార్లు చాలా శ్రద్ధతో సత్యవతి పాత్రను రూపొందించారు. అందులో ఎన్.టి.రామారావుగారికి తల్లి పాత్ర నాది. ఆ సినిమా సెట్లోనే ఎన్.టి.రామారావు గారు “సుజాతగారూ! బాగా చేయండి. మంచి వేషం, మంచి పేరొస్తుంది” అని ఆయన స్టైల్‌లో గంభీరంగా అన్నారు. ఆయన మాటే నిజమయ్యింది. ఆ పాత్ర ఈ నాటికీ తెలుగు సినిమా చరిత్ర పుటలలో నిలిచిపోయేంతగా నాకు మంచి బ్రేక్ ఇచ్చింది.
‘షావుకారు’ పాఠాలు
‘భీష్మ ‘ చిత్రం నాకు పేరైతే తీసుకువచ్చింది గానీ వెంటనే అవకాశాలు మాత్రం తీసుకురాలేదు. మరి ఖాళీగా ఉండలేం కదా, ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం గారి ట్రూపులో చేరి, ‘శ్రీకాళహస్తి మహా త్మ్యం’, ‘శాంతినివాసం’ నాటకాల్లో నటిస్తూ వచ్చాను. అదే విధంగా వల్లం నరసింహారావు, జి.వరలక్ష్మి, శారద మొదలైనవారితో ‘మనోహర’ నాటకంలో నటించాను. అప్పుడే జి.వరలక్ష్మిగారు నటనలో మెలకువలు ఎన్నో నేర్పారు. సంభాషణలు ఉచ్ఛరించేవిధానం నేర్పారు.
ఇలా నాటకాల్లో బిజీగా ఉన్న రోజుల్లోనే కన్నడ చిత్రసీమలో మంచి అవకాశాలు వచ్చాయి. ‘గౌరి’ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించాను. ఈ చిత్రంలో షావుకారుజానకిగారు నాకు తల్లిగా నటించారు. ఆమెతో నటించడం వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఆమె తీరిక దొరికినప్పుడల్లా ‘ఇలా నటించాలి, ఇలా డైలాగ్ చెప్పాలి’ అని చెప్పించేవారు. నిజానికి ఆ వయసులో మాకు అవి పాఠాలు లాంటివి. ఇంకా ‘సతిశక్తి’ ‘రణధీర కంఠీరవ’ తదితర కన్నడ చిత్రాల్లో నటించాను. తెలుగులో మదనకామరాజు కథ(1962), పరువుప్రతిష్ఠ (1963), బంగారు తిమ్మరాజు(1964) తదితర చిత్రాల్లో నటించాను.
పినిసెట్టి గారి నాటకం ‘పంజరంలో పక్షులు’ ఆ రోజుల్లో చాలా పాపులర్. ఆ నాటకాన్ని ఓ సారి చెన్నై వాణీమహల్‌లో ప్రదర్శించారు. నేను, మణిమాల అందులో హీరోయిన్లుగా నటించాం. ఇంకా అందులో ఎస్.వి.రంగారావు, శారద, రామకృష్ణ మొదలైన వారంతా నటించారు. ఆ నాటకం చూసిన వి.మధుసూదనరావు ‘వీరాభిమన్యు’ (1965)లో అవకాశం ఇచ్చారు. మొదట ఆ పాత్రకు వాణిశ్రీగారిని అనుకున్నారు. కానీ ఆ సమయంలో ఆమె బిజీగా ఉండడంతో నన్ను తీసుకున్నారు. అభిమన్యుడు స్త్రీరూపంలో ఉత్తరను సమీపించే పాత్ర అది. నాకు, కాంచనకు ఆ చిత్రంలో ఒక పాట కూడా ఉంది. ‘ తాకిన చోట చల్లదనం’ అనే పాట అది.
రాజావారి ఆంక్షలు
ఈ ‘పంజరంలో పక్షులు’ నాటకంలోనే పిఠాపురం రాజావారి మనవడు ఎం.ఎం.కె. అప్పారావు గారు ప్లేబాక్ పాడారు. ఆ నాటక ప్రదర్శనకు పెట్టుబడి కూడా ఆయనదే. ఆయన నాటకంలో నన్ను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మా ఇంట్లోవాళ్లు కూడా ఒప్పుకున్నారు. అలా మా పెళ్లి జరిగిపోయింది. ఆ పెళ్లితో నేను నిజంగానే పంజరంలో పక్షినై పోయాను. రాజావారు నన్ను సినిమాలు మానేయమని ఆంక్ష విధించారు. అప్పుడు ‘వీరాభిమన్యు’ షూటింగ్ జరుగుతోంది. సినిమాలు మానేస్తున్నానని తెలిసి శోభన్‌బాబుగారు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోమన్నారు. సినిమాలు మానేస్తే చాలా క ష్టాలు పడాల్సి వస్తుందని చాలా దూరం చెప్పిచూశారు. కానీ నేను మానుకోవాలనే నిర్ణయానికొచ్చేశాను అప్పటికే. ‘వీరాభిమన్యు’ షూటింగ్ అయిపోయిన తర్వాత వాహినీ స్టుడియోలో అందరికీ చెప్పేసి, ఫ్లోర్ నుండి వస్తూ వస్తూ, ఇక సినిమాల్లోకి రాను, ఒక వేళ వచ్చినా ఏ అమ్మ వేషాలకో, బామ్మ వేషాలకో వస్తానేమో’ అనుకుంటూ బాధతో వచ్చేశాను.
సినిమాకు ఫుల్‌స్టాప్
పెళ్లితో సినిమా జీవితం పూర్తిగా ముగిసిపోయింది. అంతఃపుర జీవితం, ఘోషా పద్ధతి..ఎవరినీ కలిసేందుకు కూడా వీలుండేది కాదు. నాకేమో ఇంట్లో ఖాళీగా కూర్చోవడం మొదటినుంచీ ఇష్టముండేది కాదు. 1967లో నాకు ఒక కొడుకు పుట్టాడు. బాబుకు ఒకటిన్నర సంవత్సరం వయసు వచ్చాక ఇక అసలు ఇంట్లో ఉండలేకపోయాను. ఎలాగో రాజావారిని ఒప్పించి ప్రాధేయపడి ఆంధ్రమహిళా సభలో బెనారస్ మెట్రిక్‌లో చేరాను. అక్కడే షావుకారి జానకి గారి కూతురు యజ్ఞప్రభ, ప్రముఖ సినీనటి శ్రీవిద్య నాకు క్లాసుమేట్సు. అక్కడ చదువుకుంటున్నపుడే ఓ రోజు షావుకారు జానకి గారు తమ కూతురిని ఇంటికి తీసుకువెళ్లడానికి కాలేజికి వచ్చారు. అక్కడి వాళ్లందరూ సినిమానటి వచ్చిందని ఆవిడ ఆటోగ్రాఫుల కోసం, ఫోటోల కోసం ఎగబడ్డారు. అది చూసిన నాకు మళ్లీ ఒక ఆలోచన ప్రారంభమయింది. ఈ వయసులో మనం చదువుకుని ఏం ఉద్యోగాలు చేస్తాం..సినిమాస్టార్‌లకు ఇంత క్రేజీ ఉంటుందా? నేనూ ఒకప్పుడు సినిమానటినే కదా? అనుకున్నాను.
నాలో అణచబడి ఉన్న కళాపిపాస పైకి లేచింది. ఇదే విషయాన్ని మా వారితో చెప్పాను. వారు ససేమిరా కాదన్నారు. సరే బాబును మా అమ్మ చూసుకుంటూ ఉండడంతో, నేను సినిమాల్లో కాకపోయినా ఏదైనా ఉద్యోగమైనా చేద్దామనుకున్నాను. వరల్డ్ ఫెయిర్ ఎగ్జిబిషన్‌లో రిసెప్షనిస్టుగా చేరాను. అలా ఆ అంతఃపురం నుంచి బయటపడి ప్రపంచాన్ని చూశాను. ఆ సమయంలోనే నా జీవితం కొద్దిపాటి ఊహించలేని మలుపు తిరిగింది. రాజావారి చేతికి ఎముక లేకపోవడం వల్ల కుటుంబం ఆర్థికపరమైన ఒడిదుడుకులకు లోనైంది. గడవడం కొంచెం కష్టమయ్యింది. ఆస్తిపాస్తులన్నీ కోర్టు వ్యవహారాల్లో చిక్కుకున్నాయి. ఇంచుమించు దిక్కుతోచని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మళ్లీ సినిమాల్లోకి రావాల్సి వచ్చింది. ఆ సమయంలో రుష్యేంద్రమణిగారు నాకు చాలా ఓదార్పునిచ్చారు.