నమ్రతశిరోద్కర్

ba845fb4-a7ff-499e-b957-1594fe0b1edfother side namrata sirodkar 1 other side namrata sirodkar 2

 

 

కుటుంబమే నాకు ముఖ్యం!
09-02-2019 23:44:13
మహేశ్‌… ఒకప్పుడు మూడక్షరాల పేరు నమ్రతా సమేత మహేశ్‌…
ఇప్పుడు ఓ గొప్ప బ్రాండు ‘మహేశ్‌ లేకుంటే జీవితాన్నే ఊహించుకోలేను’… అంటుందామె. ‘నమ్రతా నా జీవితాన్ని తీర్చిదిద్దింది’… అంటాడతను..
అంతేనా? ఇంకేం అంటాడు? ఇంట్లో ఎలా ఉంటాడు?… మహేశ్‌తో పద్నాలుగు వసంతాల
వైవాహిక ప్రణయగాథను పంచుకున్న నమ్రత చెప్పిన విశేషాలు
‘నవ్య’ పాఠకులకు ప్రత్యేకం!
మహేశ్‌కీ, మీకూ పెళ్లి రోజు శుభాకాంక్షలు…
థ్యాంక్యూ… థ్యాంక్యూ అండీ!
మీ పెళ్ళై నేటికి 14 ఏళ్ళు. వైవాహిక జీవితం గురించి…
ఫ్యాబ్యులస్‌! నా జీవితంలో పెళ్ళైన తర్వాత వచ్చిన రోజులన్నీ అద్భుతమే. ప్రతి అమ్మాయి జీవితంలో స్కూల్‌ లైఫ్‌, కాలేజ్‌ లైఫ్‌, మ్యారేజ్‌ లైఫ్‌… ప్రతిదీ స్పెషల్‌గా ఉంటుంది. చాలామంది అమ్మాయిలను మీ జీవితంలో ఏ లైఫ్‌ బెస్ట్‌ అంటే… కాలేజీ రోజులనో, స్కూల్‌లో చదివిన రోజులనో చెబుతారు. నన్ను అడిగితే… మ్యారేజ్‌ లైఫ్‌ ఈజ్‌ ది బెస్ట్‌. నా జీవితంలో ఈ 14 ఏళ్ళు ది బెస్ట్‌.
పెళ్ళి రోజు 10న… ప్రేమికుల రోజు 14న… పైగా ఈ 10న ప్రపంచ వైవాహిక దినోత్సవం. ఎనీ స్పెషల్‌ సెలబ్రెషన్స్‌?
(నవ్వుతూ…) మొన్నీ మధ్య బాబు (మహేశ్‌) ఎక్కడో చెప్పారు కదా! ‘పెళ్ళైన 14 ఏళ్ళ తర్వాత స్పెషల్‌ సెలబ్రేషన్స్‌ ఏముంటాయి!’ అనీ… ప్రస్తుతానికి ప్లానింగ్‌ ఏమీ లేదు. ఇప్పుడు బాబు చాలా బిజీగా ఉన్నారు. ‘మహర్షి’ పూర్తి చేస్తున్నారు. ఇంతకు ముందు అయితే షూటింగులకు కాస్త విరామం ప్రకటించి, బయటకు వెళ్ళేవాళ్ళం. ఈసారి అలాంటివి ఏమీ లేవు.
ఒక్కసారి 14 ఏళ్ళు వెనక్కి వెళదాం… మహేశ్‌ అందరితో కలిసే వ్యక్తి కాదు. మీతో ఎలా కలిశారు? ముందు ఎవరు ప్రపోజ్‌ చేశారు?
‘వంశీ’ (మహేశ్‌, నమ్రత జంటగా నటించిన తొలి, ఏకైక సినిమా) చిత్రీకరణకు న్యూజీలాండ్‌ వెళ్ళాం. అక్కడ సుమారు 25 రోజులు షూటింగ్‌ చేశాం. నేను అప్పటివరకూ అన్ని రోజులు అవుట్‌డోర్‌ (విదేశాల్లో) షూటింగ్‌ చేయలేదు. బాబు (మహేశ్‌) ఈజ్‌ వెరీ షై కదా! అందరితో ఎక్కువ మాట్లాడేవారు కాదు. నాతో బాగా మాట్లాడేవారు. అప్పటికే మా మధ్య మంచి స్నేహం ఉంది. మొదట ఇద్దరం స్నేహితులమయ్యాం. న్యూజీలాండ్‌ నుంచి వచ్చిన తర్వాత ప్రేమలో ఉన్నామని ఇద్దరికీ అర్థమైంది. ముందు నేనే ప్రపోజ్‌ చేశానని అనుకుంటున్నా! యస్‌… నేనే ప్రపోజ్‌ చేశా.
అప్పుడు మహేశ్‌ రియాక్షన్‌ ఏంటి?
(నవ్వుతూ…) ఫోనులో ప్రపోజ్‌ చేశా! ఒకరికొకరు చాలా దూరంలో ఉన్నాం కదా! తన రియాక్షన్‌ నేను చూడలేకపోయా. అప్పటికి తనూ ప్రేమలో ఉన్నాడు. నా గురించి తనకు పూర్తిగా తెలుసు. తన గురించి నాకు పూర్తిగా తెలుసు. ప్రపోజ్‌ చేశాక… పెళ్ళి చేసుకోవాలనుకున్నాం.
పెళ్ళికి నాలుగేళ్ళు ఎదురుచూశారు కదా! ఎందుకు?
పెళ్ళికి ముందే నా సినిమా షూటింగులన్నీ పూర్తి చేయాలనుకున్నా. బాబుకు ‘వంశీ’ మూడో సినిమా. అప్పుడే కెరీర్‌ స్టార్ట్‌ చేశారు కదా! ప్లానింగ్‌లో ఉన్నారు. అప్పటికి నేను కొన్ని సినిమాలు అంగీకరించా. వాటిని పూర్తి చేయాలనుకున్నా. అందుకని, టైమ్‌ పట్టింది. ఆల్మోస్ట్‌ మూడేళ్ళు ఎదురు చూశామనుకుంటున్నా.
పెళ్ళి తర్వాత నటించకూడదని అనుకున్నారా?
అవును.
ఎందుకు?
కొన్ని విషయాల్లో బాబు, నేనూ చాలా క్లియర్‌గా ఉన్నాం. నాన్‌-వర్కింగ్‌ వైఫ్‌ కావాలని బాబు అనుకున్నారు. నేనూ పెళ్ళి తర్వాత నటించాలని అనుకోలేదు. ముఖ్యంగా బాబుకు దూరంగా ఉండాలనుకోలేదు. నేను సినిమాలు చేస్తే… బాబుకు దూరంగా కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది. అది నాకిష్టం లేదు. సో… సినిమాలు చేయకూడదని అనుకున్నా.
ఎప్పుడైనా యాక్టింగ్‌ మిస్సయ్యాననే ఫీలింగ్‌…
ఎప్పుడూ లేదు!
అప్పుడప్పుడూ సరదాగా ఓ క్యారెక్టర్‌ చేయాలనిపిస్తుంటుందా?
లేదు… లేదు… అంత టైమ్‌ ఎక్కడుంది? బాబుతో, పిల్లలతో సరిపోతుంది. కనీసం నటన గురించి ఆలోచించడానికి కూడా టైమ్‌ లేదు. అయామ్‌ హ్యాపీ లైక్‌ దిస్‌! పెళ్ళి తర్వాత ఉద్యోగానికి సమయం కేటాయిస్తున్న మహిళలను, వర్కింగ్‌ ఉమెన్‌ను నేను గౌరవిస్తా. ఒకవేళ సినిమాలు చేస్తే… ఇటు కుటుంబానికి, అటు కెరీర్‌కు న్యాయం చేయలేనని నా ఫీలింగ్‌. కుటుంబమే నాకు ముఖ్యం. కెరీర్‌… కుటుంబం… రెండిటిలో ఒకదానికి ఎంచుకోమంటే కుటుంబమే మొదటిస్థానంలో ఉంటుంది.
మహేశ్‌కీ, మీకూ మధ్య సమస్య వస్తే ముందు ఎవరు సారీ చెబుతారు!?
భర్తగా, తండ్రిగా మహేశ్‌… భార్యగా, తల్లిగా నేను… మా బాధ్యతల విషయంలో క్లియర్‌గా ఉన్నాం. కొన్ని పనులు బాబు చేస్తారు. కొన్ని పనులు నేను చేస్తాను. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే… ‘ఎందుకీ సమస్య వచ్చింది? కారణం ఏంటి?’ అని ఇద్దరం కూర్చుని పరిష్కరించడానికి కృషి చేస్తాం. మెచ్యూర్డ్‌గా ఉంటాం. మా మధ్య సమస్యలు ఏమీ ఉండవు. ఇద్దరం కలిసే సమస్యను ఎదుర్కొంటాం. మేమిద్దరం ఒక్కటే! ఒక్క తీరుగా ఆలోచిస్తాం.
మహేశ్‌ ప్రతి నిర్ణయంలో మీ ప్రమేయం ఉంటుందని ఓ టాక్‌. సినిమా చేయాలన్నా…? ఇంకేదైనా…?
అయ్యో… లేదండీ! బాబు తన నిర్ణయాలను తనే స్వయంగా తీసుకుంటారు. బాబు ఈ రోజు ఇన్ని విజయాలు సాధించారన్నా… అందతా తన కృషే! క్రెడిట్‌ మొత్తం ఆయనదే. బయట అందరూ ఏదేదో చెబుతారు. అవి వినడానికి బావుంటాయి. కానీ, తనకంటూ ఓ వ్యక్తిత్వముంది. నిజం ఏంటంటే… సినిమాలపై బాబుకున్న ప్రేమ, అంకితభావం, క్రమశిక్షణ తనను ఈ స్థాయిలో నిలబెట్టాయి. బాబు ఒక విజన్‌తో ముందుకు వెళుతున్నారు.
సినిమాల గురించి మీతో డిస్కస్‌ చేస్తారా?
తప్పకుండా చేస్తారండీ! అయితే… నేను చెబితే సినిమాలు చేస్తారనేది అబద్ధం. ‘ఈ సినిమా చేయండి. ఈ సినిమా వద్దు’ అని చేప్పే ఆస్కారం లేదు. బాబుకు ఒక సినిమా చేయాలనిపిస్తే చేస్తారు. లేదంటే చేయరు. ప్రచారంలో ఉన్నట్టు బాబు నిర్ణయాలను నేను ప్రభావితం చేస్తాను లేదా నేనే నిర్ణయాలు తీసుకుంటాను అనేవి అబద్ధాలే. బాబు ఓ కథ విని సినిమా అంగీకరిస్తే… సపోర్ట్‌ చేస్తా.
 
మీ మావయ్యగారు (కృష్ణ) ఏడాదికి 18 సినిమాలు చేసేవారు. మహేశ్‌ కనీసం మూడైనా చేయాలని అభిమానులు కోరిక. కంప్లయింట్‌ కూడా!
నేనూ ఎక్కువ సినిమాలు చేయాలని చెబుతున్నానండీ! (నవ్వుతూ…) నా మాట కూడా వినడం లేదు. నిజం చెప్పాలంటే… ఇప్పుడొస్తున్న ప్రతి ఒక్క సినిమా ఎక్కువ టైమ్‌ తీసుకుంటోంది. ఇంకొకటి… రెండు సినిమాలు ప్యారలల్‌గా చేయాలనే మైండ్‌సెట్‌ కాదు బాబుది. ఆ రోజుల్లో మావయ్యగారు ఒక సెట్‌ నుంచి మరో సెట్‌కి, మరో సెట్‌ నుంచి ఇంకో సెట్‌కి వెళ్ళేవారు. రోజుకు మూడు షిఫ్టులు చేసేవారు. ఇప్పుడు ఒక్క షిఫ్ట్‌ చేయడమే సరిపోతుంది. అందులోనూ అప్పట్లో ఇప్పటిలా విజువల్‌ ఎఫెక్ట్స్‌ లేవు. వరల్డ్‌ సినిమాపై ప్రేక్షకులకు ఎక్కువ అవగాహన లేదు. సోషల్‌ మీడియా వచ్చాక… బాబుపై మాత్రమే కాదు, ప్రతి యాక్టర్‌పై ఒత్తిడి పెరిగింది.
మహేశ్‌, మీరు… ఇద్దరిలో స్ట్రిక్ట్‌ పేరెంట్‌?
(నవ్వుతూ…) బాబు పిల్లల్ని చెడగొడతారు. నేను స్ట్రిక్ట్‌గా ఉంటాను. సో… వాళ్ళకు విలన్‌ నేనే!(నవ్వులు)
నాన్న దగ్గరకు వెళ్ళి అమ్మ గురించి కంప్లయింట్‌ చేస్తారా?
ఆల్‌ ద టైమ్‌! ఎప్పుడూ నాపై కంప్లయింట్స్‌ ఇస్తారు. వాళ్ళకు ఏదైనా కావాలనుకుంటే నాన్న దగ్గరకు వెళ్ళి అడుగుతారు. నేను అయితే వాళ్ళు అడిగిన ప్రతిదానికీ ‘యస్‌’ చెప్పను. అందుకుని, నాన్న దగ్గరకు వెళతారు.
మహేశ్‌, సితార కలిసి డ్యాన్స్‌ చేస్తారట!
అవును! గౌతమ్‌ కూడా వాళ్ళతో కలిసి డ్యాన్స్‌ చేస్తాడు. పిల్లలతో కలిసి బాబు చాలా ఎంజాయ్‌ చేస్తారు. ఇప్పుడు టైమ్‌ సరిగా కుదరడం లేదు. బాబు షూటింగ్‌ నుంచి వచ్చే టైమ్‌కి పిల్లలు క్లాసులకు వెళుతున్నారు.
నటుడిగా, భర్తగా, తండ్రిగా… మహేశ్‌కి మీరెన్ని మార్కులు వేస్తారు?
నటుడిగా మహేశ్‌కి పదికి 20 మార్కులు వేస్తా. ఇండియాలో ఈతరం అత్యుత్తమ నటుల్లో మహేశ్‌ ఒకరు. తండ్రిగా, భర్తగా పదికి పది మార్కులు వేస్తా. ఏదో మాట వరసకు కాదు… నిజాయతీగా చెబుతున్నా!
‘1… నేనొక్కడినే’లో నటించిన గౌతమ్‌.. మళ్ళీ నటించేదెప్పుడు?
ఒకవేళ హీరో అయితే… గౌతమ్‌ హీరో అయినప్పుడు! హీరో అవుతాడని ఇప్పుడు చెప్పడం చాలా తొందరపాటు అవుతుంది. మేం వాణ్ణి హీరోగా చూడాలని అనుకుంటున్నాం. తనూ అదే అంటున్నాడు… హీరో అవుతానని! చూద్దాం… ఏం జరుగుతుందో!
మహేశ్‌ బయట స్టార్‌ హీరో! ఇంట్లో ఎలా ఉంటారు?
సాధారణ తండ్రిలా, మంచి భర్తగా, ఒక నార్మల్‌ పర్సన్‌లా ఉంటారు.
వంటలో మీకు సాయం చేస్తారా?
కుకింగా… (నవ్వుతూ) బాబుకు టీ పెట్టడం కూడా రాదు.
ఖాళీ సమయాల్లో మహేశ్‌ ఏం చేస్తుంటారు?
సినిమాలు చూస్తారు. పిల్లలతో సరదాగా టైమ్‌ స్పెండ్‌ చేస్తారు. హాలీడే ట్రిప్‌ ప్లాన్‌ చేస్తారు. నాకు తెలిసినంత వరకూ క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ఎవరూ లేని వ్యక్తుల్లో మహేశ్‌ ఒకరు…
మీరు మహేశ్‌తో షూటింగులకు వెళతారా?
యాడ్స్‌ షూటింగ్స్‌కి తప్పకుండా నేను ఉండాలి. లేకపోతే… బాబు వెళ్ళరు. సినిమా సెట్స్‌కు అయితే అవసరం ఉంటే తప్ప వెళ్ళను!
మహేశ్‌ సినిమాల్లో మీకిష్టమైన సినిమా?
ఒక్కటి కాదు… ఓ ఐదు ఉన్నాయి. ఫస్ట్‌ ఫేవరేట్‌ మూవీ… ‘ఒక్కడు’. తర్వాత ‘పోకిరి’, ‘దూకుడు’, ‘శ్రీమంతుడు’, ‘భరత్‌ అనే నేను’.
అభిమానుల మరో కోరిక… మహేశ్‌ని సిక్స్‌ప్యాక్‌లో చూడాలని! ‘1… నేనొక్కడినే’లో సిక్స్‌ప్యాక్‌ చూపిస్తారనుకున్నారు. కానీ, లేదు!
‘1… నేనొక్కడినే’ కథలో సిక్స్‌ప్యాక్‌ చూపించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉంటే చూపించేవారు. బాబుకు తను చేయబోయే పాత్రలు వెరీ వెరీ ఇంపార్టెంట్‌. క్యారెక్టర్‌ డిమాండ్‌ చేస్తే సిక్స్‌ప్యాక్‌ చేస్తారు. లేదంటే లేదు. ఊరికే సిక్స్‌ప్యాక్‌ చూపించడం బాబుకు ఇష్టం లేదు.
రీల్‌ లైఫ్‌లో మహేశ్‌ని ముఖ్యమంత్రిగా చూశాం! రియల్‌ లైఫ్‌లో చూసే అవకాశం ఉందా?
(రెండు చేతులు జోడించి దణ్ణం పెడుతూ) బాబును తెరపై చూస్తే చాలు. బాబుకి కూడా రాజకీయాలపై అస్సలు ఆసక్తి లేదు. ఆయన ఫోకస్‌ అంతా నటన మీదే! ఆయన ప్రేమించేది సినిమాలనే. సినిమాలు తప్ప మరో విషయం ఆయనకు అర్థం కాదు. బాబు రాజకీయాల్లోకి రారు.
మీరు వస్తారా?
నెవర్‌! ఎప్పటికీ రాను. నాకు రాజకీయాలు అర్థం కావు. రాజకీయాల్లోకి వచ్చేంత టైమ్‌ నా దగ్గర లేదు. భార్యగా, తల్లిగా సంతోషంగా ఉన్నాను. ఇల్లు, పిల్లలు, పనులతో సరిపోతుంది. పిల్లలు స్కూల్‌కి వెళ్ళగానే బాబు ఎండార్స్‌మెంట్‌ మీటింగ్స్‌ ఉంటే వాటికి అటెండ్‌ అవుతా. తర్వాత పిల్లల స్కూల్‌ నుంచి వచ్చాక… బాబు వస్తారు. రాజకీయాల్లోకి రావడానికి నేను సిద్ధంగా లేను. అయామ్‌ నాట్‌ రెడీ!
తెలుగులో, ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో… మహేశ్‌ మోస్ట్‌ హ్యాండ్సమ్‌ హీరో! ఫిట్‌గా కనిపించే హీరో! ఆయన డైట్‌ ఎలా ఉంటుంది?
తినే ఆహారం నుంచి, వేసుకునే దుస్తుల వరకూ బాబు చాలా కేర్‌ తీసుకుంటారు! ప్రతి విషయంలో పర్టిక్యులర్‌గా ఉంటారు. ప్రతిరోజూ జిమ్‌ చేస్తారు. వర్కవుట్స్‌, ఎక్సర్‌సైజులు అసలు మిస్‌ కారు. బ్యాలెన్డ్స్‌ అండ్‌ డిసిప్లిన్డ్‌ డైట్‌ ఫాలో అవుతారు. అప్పుడప్పుడూ డీటాక్స్‌ పార్లర్లకు వెళతాం. ఫిట్‌నెస్‌ గురించి బాబుకు చాలా అవగాహన ఉంది. ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండటానికి కృషి చేస్తారు.
పెళ్ళి తర్వాత మహిళలు బరువు పెరుగుతారు. ఫిట్‌నెస్‌ మీద దృష్టి తగ్గుతుంది. మీరు ఫిట్‌గా ఉన్నారు. మహిళలకు మీరిచ్చే సలహా?
ప్రతి మహిళా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలనేది నా స్ట్రాంగ్‌ ఫీలింగ్‌. మీరు యవ్వనంలో ఉన్నారా? వయసు అయిపోతుందా? అయిపోయిందా? అనేది అసలు విషయమే కాదు. ఆరోగ్యవంతమైన, సుదీర్ఘమైన జీవితం సాగించాలంటే… అందరూ తప్పకుండా ఫిట్‌గా ఉండాలి. పిల్లలు పుట్టిన తర్వాత యవ్వనంలో ఉన్నప్పుడు తెలియని చాలా విషయాలు తెలుస్తాయి. తెలుసుకుంటారు కూడా! తల్లి ఆరోగ్యంగా ఉండటం పిల్లలకు చాలా ముఖ్యం. పిల్లల్ని చూసుకోవడానికి ఆరోగ్యం ముఖ్యమే. అందుకని, పెళ్ళి తర్వాత లావయ్యామని మథనపడే తల్లులు అందరూ ఫిట్‌నెస్‌ గురించి అవగాహన పెంచుకోండి. బరువు ఎలా తగ్గాలో పుస్తకాల్లో చదవండి. తమ ఆహారపు అలవాట్లు మార్చుకోండి.
చివరగా… మహేశ్‌ మీకిచ్చిన బహుమతుల్లో మర్చిపోలేనిది?
మై మ్యారేజ్‌ వజ్‌ మై బెస్ట్‌ ్క్ష స్పెషల్‌ గిఫ్ట్‌. నా పెళ్ళే నాకు దక్కిన బహుమతుల్లో చాలా ప్రత్యేకమైనది.
గత వారమంతా పిల్లలకు ఒంట్లో బాగాలేదు. వైరల్‌ ఫీవర్‌ వచ్చింది. అందువల్ల, స్కూల్‌కి వెళ్ళలేదు. ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. సడన్‌ సర్‌ప్రైజ్‌ ఏంటంటే… బాబు ఇంటికి వచ్చారు. ఆ టైమ్‌లో సితార నిద్రపోతున్నట్టు నటించడానికి ప్రయత్నించింది. ‘అయామ్‌ స్లీపింగ్‌! స్లీపింగ్‌!’ అని అనసాగింది. బాబు వచ్చి సితార మీద పడ్డారు. గౌతమ్‌కి బాబు వాయిస్‌ వినపడింది. వెంటనే సితార రూమ్‌లోకి వచ్చి వాళ్ళ నాన్నపై పడ్డాడు. అప్పుడు ఫొటో తీశాం. వెరీ స్వీట్‌ ఫొటో!
మావయ్యగారు, బావగారు (రమేశ్‌బాబు), మా ఆడపడుచులు (పద్మావతి, మంజుల, ప్రియదర్శిని)… మాది పెద్ద కుటుంబం. ప్రతి ఒక్కరికీ తమ తమ కుటుంబాలు ఉన్నాయి. అందుకని, అందరికీ వీలైన ప్రతిసారీ కలుస్తాం. ప్రతి ఆదివారం అందరం కలిసి లంచ్‌ చేస్తాం. ఇప్పుడు బాబు బిజీగా ఉండటంతో కొన్నిసార్లు మిస్సవుతున్నాం. కుటుంబమంతా కలిస్తే సందడే సందడి. పిల్లలు, పెద్దలు కబుర్లలో మునిగిపోతాం.
వినాయకరావు, సత్య పులగం