మొదటి ఛాన్స్…ఇంజినీరింగ్ పూర్తిచేసి… ఎంబీఏ ప్రవేశ పరీక్షకి ప్రిపేరవుతుండగా ‘ఛానల్ వి’ అందాల పోటీల్లో గెలిచాను. దాంతో మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. వాటిని చూసి ‘ఝుమ్మంది నాదం’లో నటించమని అడిగారు. ‘నాకు మీ భాష రాదు, నటన అంతకన్నా రాదు’ అని చెబితే ‘రెండూ నేర్పిస్తాం’ అని ఎంపికచేశారు. ‘సరే ప్రయత్నిద్దాం, ఫెయిలైతే చదువుకుందాం’ అని ఓకే చెప్పాను. |
రాణిలా చూస్తారుమొదటి సినిమా విడుదలవుతూనే తెలుగు, తమిళంలో ఛాన్స్‌లు వరసకట్టాయి. ఆపైన బాలీవుడ్ నుంచీ పిలుపొచ్చింది. దక్షిణాది, ఉత్తరాది మధ్య పెద్ద తేడా ఉండదు. కానీ దక్షిణాదిలో హీరోయిన్‌ని రాణిలా చూసుకుంటూ చాలా గారాబం చేస్తారు. బాలీవుడ్‌లో ‘పింక్’, ‘బేబీ’, ‘నామ్ షబాన’, ఇప్పుడు ‘బద్లా’ నాకు మంచి గుర్తింపుతెచ్చాయి. బాలీవుడ్‌లో సీరియస్ పాత్రలూ, దక్షిణాదిలో సరదాగా ఉండే అమ్మాయి పాత్రలూ ఎక్కువగా చేశాను. |
ఖాళీ దొరికితే…సినిమాలు చూసేది తక్కువ. ల్యాప్‌టాప్, టీవీల్లో సినిమా చూడ్డం నచ్చదు. ఎవరైనా మాటల మధ్యలో ఫలానా సినిమా చూశావా అంటే 90 శాతం లేదనే సమాధానం చెబుతాను. అంత తక్కువ చూస్తానన్నమాట. టైమ్ దొరికితే ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్తుంటా. అలాంటపుడు హాల్‌కి వెళ్లి సినిమా చూస్తాను. ఎక్కడున్నా అందరిలో కలిసిపోతాను. దానివల్ల అందరి మనస్తత్వాలూ అర్థమవుతాయి. అది నటనకు హెల్ప్ చేస్తున్నట్లనిపిస్తుంది. |
బిగ్‌బీతో దోస్తీఅమితాబ్‌తో ‘బద్లా’ చేస్తున్నపుడు బాగా ఎంజాయ్ చేశాను. ‘పింక్’ సమయంలోకంటే కూడా ఈ సినిమాలో చాలా ఎక్కువ సీన్లు మా మధ్య ఉన్నాయి. షూటింగ్ మధ్యలో గ్యాప్ దొరికితే ఆయనతో మాట కలిపేదాన్ని. గ్లాస్గో వెళ్లినపుడు ఒకే హోటల్‌లో ఉండేవాళ్లం. జిమ్ కూడా కలిసే చేసేవాళ్లం. |
ఇవి ఇష్టం…ఆహారం: ఛోలే భటూరే. నా బర్త్‌డే రోజు అమ్మ తప్పనిసరిగా చేస్తుంది. కేక్‌కంటే కూడా ఇష్టంగా తింటాను. వారంలో ఒకరోజు స్పైసీఫుడ్ ఉండాల్సిందే. కీరదోస జ్యూస్ ఎక్కువగా తాగుతాను. జపాన్ వంటకాలన్నా ఇష్టం. హాలిడే స్పాట్: మాల్దీవులు సినిమా: ఎక్స్ మేన్ అబ్బాయి: తన కష్టంతో జీవితంలో పైకి వచ్చినవాడైతే ఇష్టం. |
బిజినెస్ ఉమన్‌ఎంబీఏ చేసి వ్యాపార రంగంలో స్థిరపడాలనుకున్నా. కానీ యాక్టింగ్‌లోకి రావడంతో అటువైపు వెళ్లలేకపోయాను. ఆలోటు తీర్చడానికి ‘ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ’ అనే సంస్థకి సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నాను. ఈ సంస్థ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్స్‌ని నిర్వహిస్తుంది. బ్యాడ్మింటన్ లీగ్‌లో ‘పుణె 7ఏసెస్’ జట్టుకి సహ యజమానిగానూ ఉన్నాను. క్రికెట్‌కంటే బ్యాడ్మింటన్ ఎక్కువగా ఫాలో అవుతాను. భవిష్యత్తులో వ్యాపార రంగంలోనే స్థిరపడతాను. |
ముంబయిలో ఇల్లు కొన్నారట. ఇక అక్కడే స్థిరపడినట్టేనా?
నటిగా నేను పనిచేసే ప్రతి చోటునూ నా సొంత స్థలంగానే భావిస్తా. కాకపోతే ముంబయిలో నేను నివసించడానికి ఓ ఇల్లు కొన్నా. ఎప్పట్నుంచో కంటున్న కల అది. ముప్పయ్యేళ్లు వచ్చే లోపు సొంత కారు, సొంత ఇల్లు, స్థిరమైన కెరీర్ ఉండాలనుకొనేదాన్ని. ఆ కలలన్నీ నిజమైనందుకు చాలా ఆనందంగా ఉంది. మధ్య తరగతి నుంచి వచ్చిన అమ్మాయిని. ఖరీదైన ముంబయి ప్రాంతంలో సొంతంగా ఇల్లు కొనడం పెద్ద విషయం కదా. ఇక మీ తదుపరి లక్ష్యం పెళ్లేనా అని మాత్రం అడగకండి (నవ్వుతూ). కుటుంబం, పిల్లలు అనే ఆలోచన వచ్చినప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తా. అప్పటిదాకా నా కెరీరే నాకు ముఖ్యం.
కథానాయికగా ఎప్పుడో పేరు తెచ్చుకున్నారు. ఇల్లు కొనుక్కోవడానికి ఇన్నాళ్లు పట్టిందా?
దిల్లీలో పెట్టుబడి కోసం ఓ ఇల్లు కొన్నా. దాంతో అది నా సొంత ఇల్లు అనే అభిప్రాయం ఎప్పుడూ కలగలేదు. అయితే ముంబయికి వెళ్లడానికి ముందు హైదరాబాద్‌లో మంచి ఫ్లాట్ కొనాలని ప్రయత్నించా. దాదాపుగా ఖరీదు కూడా చేశా. అంతలోనే ముంబయి వెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే నా సొంత కారు కల నెరవేరింది మాత్రం హైదరాబాద్‌లో ఉన్నప్పుడే. బీఎమ్‌డబ్ల్యూ కారుని దిల్లీలో కొని, హైదరాబాద్‌కి ట్రాన్స్‌పోర్ట్ చేయించా. ఇక్కడికొచ్చాకే దాన్ని నడిపా. ముంబయి వెళ్లిపోయేటప్పుడు నాతోపాటే తీసుకెళ్లా.
చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాళ్లా?
అల్లరి ఎక్కువే కానీ, అది ఇంట్లో ఉన్నంతవరకే. స్కూల్‌కి వెళ్లాక ఉండేది కాదు. టీచర్లంటే భయమని కాదు. అక్కడ మా క్లాస్‌లో లీడర్‌ని నేనే. ఎవరైనా అల్లరి చేస్తే టీచర్లకి ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత నాది. అలా నా అల్లరి కంట్రోల్ అయ్యిందన్నమాట (నవ్వుతూ).
అగ్ర కథానాయికగా ఎదిగారు. మీరు గడిపిన మధ్య తరగతి జీవితం గుర్తుకొస్తుంటుందా?
గుర్తుకు రావడమేంటి, ఇప్పటికీ నేను మధ్య తరగతి అమ్మాయినే. కథానాయికని అయ్యాక కొన్ని సౌకర్యాలు పెరిగుండొచ్చు తప్ప నా జీవితంలో ఊహించని మార్పులేమీ లేవు. ఇప్పటికీ థియేటర్‌కి వెళ్లి సినిమా చూస్తాను. లెక్కలేసుకుంటూ షాపింగ్ చేస్తాను. ఇంట్లో మా చెల్లెలితో నాకది, నీకిదంటూ గొడవ పడుతుంటాను. అప్పటి స్నేహితులు ఇప్పుడూ నాతో టచ్‌లో ఉన్నారు. మేం కలిస్తే చిన్నప్పటి రోజుల గురించి, అప్పటి జీవితం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటుంటాం.
సినీ రంగంలోకి రాకుండా ఉండాల్సిందని ఎప్పుడైనా అనిపించిందా?
నా సినీ ప్రయాణంలో పరాజయాలు చాలానే. కానీ ఏ సందర్భంలోనూ ఎందుకొచ్చాననే ప్రశ్న తలెత్తలేదు. నాలుగు గోడల మధ్య 9 టు 5 ఉద్యోగం చేయడం నాకు మొదట్నుంచీ ఇష్టం లేదు. అందుకే మా నాన్నని ఒప్పించి ఈ రంగంలోకి వచ్చా. మనకు ఇష్టమైన రంగంలో రాణించాలనుకొన్నప్పుడు ఎన్ని కష్టాలెదురైనా లెక్కచేయం కదా. అలా పరాజయాలు ఎదురైనా కుంగిపోకుండా ముందుకు సాగా. నటిని కాకపోయుంటే ఇప్పుడు ఏ సాఫ్ట్‌వేర్ రంగంలోనో లేదంటే బిజినెస్ మేనేజ్‌మెంట్ రంగంలోనో కొనసాగుతూ ఉండేదాన్ని. నా గురించి కొద్దిమందికే తెలుసుండేది. అదే నటిని అయ్యాను కాబట్టి ఇంత మందికి చేరువయ్యాను. ఇంత మందికి వినోదం పంచుతున్నా. ఇంతకంటే ఏం కావాలి?
సెలవుల్లో అదే పనిమన సంతోషం మన చేతుల్లోనే ఉంటుందని నమ్మే వ్యక్తిత్వం నాది. చేయాలనుకొన్నది చేసే వరకు నిద్రపోయేదాన్ని కాదు. నాది రింగుల జుట్టు. చిన్నప్పుడు చాలా ఒత్తుగా ఉండేది. నా సెలవు రోజంతా జుట్టుకి నూనె పట్టించడానికి, కడగడానికే సరిపోయేది. దాంతో ఎలాగైనా జుట్టు కత్తిరించుకోవాలని అనిపించేది. ఇంట్లో చెబితే ఏమంటారో అని ఏవేవో సాకులు చెప్పి నేనే వెళ్లి కత్తిరించుకొని వచ్చేదాన్ని. ప్రాక్టికల్‌గా ఆలోచించడం చిన్నప్పట్నుంచే అలవాటైంది. ఆ మనస్తత్వం సినిమా కెరీర్‌కి ఎంతగానో ఉపయోగపడింది. చదువుల్లో నేను చాలా చురుకు. |
ఒకే సారి పది పనులు చేస్తుండాలిఇంట్లో భారం కాకూడదని, నా పాకెట్ మనీని నేనే సంపాదించుకోవాలనే లక్ష్యంతోనే కళాశాలలో ఉన్నప్పుడు మోడలింగ్ వైపు దృష్టిపెట్టాను. ఎప్పుడూ ఒక పనితో గడపడం నాకు ఇష్టం ఉండేది కాదు. ఒకేసారి పది పనులు చేయాలనిపిస్తుంటుంది. అలా చదువు, మోడలింగ్‌తో బిజీ బిజీగా గడిపా. ఇంజినీరింగ్ తర్వాత పై చదువుల ప్రణాళికల్లో భాగంగా ఏడాదిపాటు ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఆ ఏడాదే నా జీవితాన్ని మలుపు తిప్పింది. సినిమా అవకాశాలు వచ్చాయి. |
భాషపై అలా పట్టుకెమెరా ముందుకొచ్చేవరకు సినిమా గురించి నాకేమీ తెలియదు. ప్రతి శుక్రవారం కొత్త సినిమా చూడాల్సిందే అనుకునే రకాన్నీ కాదు. ఫలానా సినిమా బాగుందని ఎవరైనా చెబితే, అమ్మానాన్నలతోనో లేదంటే స్నేహితులతో కలిసి థియేటర్‌కి వెళ్లేదాన్నంతే. సినిమా వాతావరణం, భాష అన్నీ కొత్తే. దాంతో తొలి రోజు భయంగానే ‘ఆడుకలమ్’ సెట్లోకి అడుగుపెట్టా. గందరగోళ పరిస్థితుల్లో ఉన్న అమ్మాయి నేపథ్యంలోనే తొలి సన్నివేశాలు తీశారు. దాంతో ఆ సన్నివేశాలు చాలా సహజంగా వచ్చాయి. ఒక షెడ్యూల్ ‘ఆడుకలమ్’ చేస్తే, మరొక షెడ్యూల్ ‘ఝుమ్మందినాదం’ చేసేదాన్ని. ఆ రెండు సినిమాలూ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. లక్ష్మీప్రసన్న తెలుగు నేర్చుకోమని సలహా ఇచ్చింది. ఆ సలహాతో భాషపై పట్టు పెంచుకొన్నా. దాంతో చాలా విషయాల్ని నేర్చుకోగలిగా. |
వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్‌నా చెల్లెలు షగుణ్ నాకంటే నాలుగేళ్లు చిన్న. నాకు సంబంధించి ఏదైనా చెప్పుకోవాలన్నా, ఏదైనా సలహా తీసుకోవాలన్నా తననే అడుగుతుంటా. తను, నేను వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీని ఏర్పాటు చేశాం. డెస్టినేషన్ వెడ్డింగ్స్‌లో మా సంస్థకి మంచి పేరుంది. |
ఫొటో : మధు