ప్రకాష్‌రాజ్ నా హీరో: పోనీవర్మ
పోనీ వర్మ. ఈ పేరు చదవగానో ఈవిడెవరో గుర్తుపట్టడం కష్టమే. కాని విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ శ్రీమతి అంటే మాత్రం వెంటనే గుర్తు పట్టేయొచ్చు. దక్షిణాది వాళ్లకు ప్రకాష్‌రాజ్ భార్యగా తెలిసిన ఈవిడ బాలీవుడ్‌లో పేరున్న నృత్య దర్శకురాలు. సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా తీసిన ‘డర్టీపిక్చర్’ సినిమాలో ‘ఊ లా ల.. ఊ లా ల’ పాటకు నృత్యదర్శకత్వం వహించింది ఈవిడే. ప్రకాష్ రాజ్ పోనీని పెళ్లి చేసుకునేందుకే తన మొదటి భార్యను వదిలిపెట్టాడని చాలామంది అనుకున్నారు. కాని వాళ్లిద్దరూ విడిపోయిన తరువాతే మేమిద్దరం దగ్గరయ్యాం అంటున్న ఆమె మాటల్లోనే ప్రకాష్ – పోనీల ప్రేమకథ.
“హైదరాబాద్‌లో 2005లో ‘పొన్నివేల్సమ్’ షూటింగ్ సందర్భంగా ప్రకాష్‌రాజ్‌ను మొదటిసారి కలుసుకున్నాను. అప్పుడు నాకు ఆయన ఎంత ప్రజాదరణ ఉన్న నటుడో తెలియదు. కాని పరిచయం ఏర్పడిన తరువాత ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. అప్పటికే ప్రకాష్ రాజ్, ఆయన భార్య మధ్య విడాకుల గొడవ నడుస్తోంది. ఆయనేమో కొడుకు కోల్పోయిన దుఃఖాన్ని మర్చిపోలేదు. అలాగే నేను అమ్మను కోల్పోయిన బాధలో ఉన్నాను. దగ్గరి మనుషుల్ని కోల్పోతే ఉండే బాధ మా ఇద్దర్నీ మాట్లాడుకునేలా చేసింది.
ఆ తరువాత కరైకుడి అనే ప్రాంతంలో కలిశాం. అప్పుడు నేను ‘మాలామాల్ వీక్లీ’ కోసం అక్కడికి వెళ్లాను. ప్రకాష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా షూటింగ్‌కోసం అక్కడికి వచ్చారు. ఆ సినిమాకి దర్శకుడు బాలచందర్. దానికి కొరియోగ్రఫీ చేయమని అడిగారు. నేను ఒప్పుకున్నాను. ఆ సినిమాలోని ‘పాయ్’ అనే పాట చిత్రీకరణ కోసం శ్రీలంక వెళ్లాం. అప్పుడు మా స్నేహం ఇంకా బలపడింది. ప్రతిరోజూ ఫోన్లో మాట్లాడుకునే వాళ్లం. ఆ తరువాత ఇద్దరం కలిసి చాలా సినిమాలకు పనిచేశాం. మేమిద్దరం ప్రేమలో పడ్డామనే విషయం తెలిసేది కాదు.
ఆ రోజు వచ్చింది
2007లో వెనిస్‌లో షూటింగ్ కోసం వెళ్లాం. అక్కడ ఉండగా ప్రకాష్ ఎంతో రొమాంటిక్‌గా పూల గుచ్ఛంతో ప్రపోజ్ చేశారు. నేను ఆయన ప్రేమను అంగీకరించానే కాని మా వాళ్లు పెళ్లికి ఒప్పుకుంటారో లేదో అనే భయం మనసులో ఉంది. అందుకే “మా వాళ్లు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటాన”ని చెప్పాను. మా ఇద్దరి అనుబంధాన్ని మా కుటుంబం అంగీకరించకపోవడానికి కారణాలు బోలెడు. ఆయన దక్షిణ భారతీయుడు. భార్య నుంచి విడిపోతున్నాడు. ఇద్దరు పిల్లలకు తండ్రి. ఇవన్నీ ఆలోచించి మన పెళ్లిని మా వాళ్లు అంగీకరించరు అని పదేపదే చెప్తుండేదాన్ని. కాని తనకి వాళ్లను ఒప్పించగలననే నమ్మకం ఉంది. “నేను మీ ఇంటికి వచ్చి మీ వాళ్లతో మాట్లాడతాను” అనేవారు. అయినా కూడా నాకు మనసులో భయంభయంగా ఉండేది. అలాగని ఆయన ప్రేమను వదులుకునే పరిస్థితిలో కూడా నేను లేను.
2009లో విడాకులు మంజూరు అయ్యాయి. ఆ తరువాతే మా ఇంటికి వచ్చి మా నాన్నతో, సోదరుడితో మాట్లాడారు. వాళ్లు అందుకు వెంటనే ఒప్పుకోలేదు. కొంత సమయం పట్టింది. అయినప్పటికీ ఓపికగా వాళ్లని ఒప్పించగలిగారు ప్రకాష్. 2010 ఆగస్టులో మా పెళ్లయ్యింది. పంజాబీ పద్ధతిలో బంధువులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం. “నీకంటే ఎక్కువగా నన్ను ప్రేమించే రోజొకటి వస్తుంది చూడు” అనేవారు నాతో. ఆ మాటలు నిజమయ్యాయి. మా కుటుంబ సభ్యులందరూ ఆయన్ని ఎంతో అభిమానిస్తున్నారు. ఇష్టపడుతున్నారు. ఇది ఆయన వ్యక్తిత్వం వల్లే సాధ్యపడింది. “నిన్ను పెళ్లి చేసుకుంటున్నానంటే, నీ తండ్రి, సోదరుడు…అంతెందుకు మీ కుటుంబం మొత్తాన్ని పెళ్లి చేసుకుంటున్నట్టే” అనేవారు ప్రకాష్ నాతో.
నా వల్ల విడిపోలేదు
నా వల్ల ప్రకాష్ తన మొదటి భార్యతో విడిపోయారనుకుంటారు. కాని వాళ్లిద్దరి విషయంలో నేను ఎటువంటి తప్పు చేయలేదు. మా పరిచయం అయ్యేనాటికే వాళ్లిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. అందుకే ఆ విషయాన్ని నేను పట్టించుకోలేదు. మా పెళ్లికి వచ్చిన వాళ్లందరికీ వాస్తవం తెలుసు. నిజంగానే నా వల్లే వాళ్లిద్దరూ విడిపోయినట్టయితే ఆయన మొదటి భార్య తన ఇద్దరి పిల్లల్ని మా పెళ్లికి ఎందుకు పంపిస్తుంది. అంతేకాకుండా ఆయన కూతుళ్లే తండ్రికి పసుపు రాసి, గోరింటాకు పెట్టి పెళ్లి కొడుకుగా ఎందుకు అలంకరిస్తారు? అమ్మాయిలిద్దరూ సంగీత్ నుంచి రిసెప్షన్ వరకు మా పక్కనే ఉన్నారు. సెలబ్రిటీలు కావడం వల్లే వాళ్ల మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి కొద్దీ చిలవలు పలువలుగా మాట్లాడారు.
అలాగనుకుంటే అమీర్‌ఖాన్ – రీనాలు విడిపోయారు. వాళ్ల మధ్య ఏమి జరిగింది? అమృతా సింగ్ – సైఫ్ అలీఖాన్‌ల మధ్య ఏమి జరిగిందని విడిపోయారు. వాటి గురించి మూడో వ్యక్తికి అనవసరం. జీవితంలో కొన్ని విషయాల్ని లోతుగా ఆలోచించకూడదు. ప్రపంచం మొత్తంలో నేనొక్కదాన్నే విడాకులు తీసుకున్న వ్యక్తిని పెళ్లాడలేదు. అలాగే ఆఖరి దాన్నీ కాదు. కొన్నేళ్లుగా ఇలాంటివి జరుగుతున్నాయి. ఇకపై జరుగుతాయి కూడా. హేమమాలిని, శ్రీదేవిలు కూడా నాలాగానే పెళ్లిళ్లు చేసుకున్నారు. బయటివాళ్లకు రెండో భార్యపై నిందలు వేయడం చాలా సులభం. ఆయన మాజీ భార్య లలితకు కూడా మా గురించి తెలుసు. కాని ఆమె ఏనాడూ నాకు ఫోన్ చేసి ఒక్క మాటయినా అనలేదు. ఆమె నాతో ఎప్పుడూ “నువ్వు మమ్మల్ని విడగొట్టావు” అనలేదు. వాళ్లిద్దరూ ఇష్టంతోనే విడాకులు తీసుకున్నారు.
ప్రకాష్ పెద్ద కూతురికి పద్నాలుగేళ్లు. అన్ని విషయాలను అర్థంచేసుకోగలదు. ఆ అమ్మాయితో మా పెళ్లి గురించి మాట్లాడారు ప్రకాష్. పెద్దపాపతో నన్ను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పినప్పుడు ఆ పాప “గో ఎహెడ్ డాడ్” అనిచెప్పిందట.
ఎప్పుడూ శ్రేయోభిలాషులమే
ప్రతీ మహిళా సెక్యూరిటీ గురించి ఆలోచిస్తుంది. అలాగే లలిత కూడా ఆలోచించింది. ఈ విషయంలో ఆమెని తప్పు పట్టాల్సిన అవసరంలేదు. ఆ కారణం వల్లనే వాళ్ల విడాకులు ఆలస్యం అయ్యాయి. ఈ విషయం గురించి ఇంతకంటే ఎక్కువగా నేను మాట్లాడకూడదు. పొసగలేదు కాబట్టి విడిపోయారంతే. మన చట్టాల ప్రకారం భర్త విడాకులు కోరుకుని భార్య వద్దనుకుంటే 50 యేళ్లయినా ఆమె ఆ కేసును కొనసాగించొచ్చు. భార్య ఒప్పుకునే వరకు విడాకులు మంజూరు అవ్వవు. అందుకే వీళ్ల విషయంలో కూడా ఆలస్యం అయ్యింది. గత రెండు నెలలుగా ఆయన కూతుళ్లు ఇద్దరూ నాతోనే ఉంటున్నారు. మా అత్తగారు కూడా ఎంతో ప్రేమగా ఉంటారు.
ప్రకాష్, లలిత విడిపోయారు కాబట్టి మొహాలు చూసుకోకుండా ఉంటున్నారనుకుంటే పొరపాటు. వాళ్లు ఇప్పటికీ స్నేహితులే. దానివల్ల నాకొచ్చిన ఇబ్బందేమీ లేదు. మా పెళ్లి జరిగిన రోజు లలిత శుభాకాంక్షలు పంపింది. పంజాబీ సంప్రదాయం ప్రకారం పెళ్లి తరువాత నూతన దంపతులు వాళ్ల బంధువులకి, స్నేహితులకి బహుమతులు ఇవ్వాలి. దాని ప్రకారం ‘నాకేం బహుమతి పంపుతావ’ని లలిత అడిగింది. ఈ రోజు వరకు కూడా ఆమె నాతో పోట్లాడలేదు, ప్రకాష్‌ను ఎందుకు పెళ్లి చేసుకున్నావని అడగలేదు. మేము తన శ్రేయోభిలాషులం. ఆమెకి తోడుగా ఎల్లకాలం ఉంటాం. ఒకవేళ ఆమె వివాహం చేసుకుంటే నేను, ప్రకాష్ ముందుండి పెళ్లి పనులు చూసుకుంటాం.
ప్రకాష్‌తో జీవితం
పెళ్లి తరువాత జీవితం చాలా ఆనందంగా ఉంది. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాను. జీవితం విలువ, మనుషుల ప్రేమ తెలుస్తున్నాయి. పెళ్లి తరువాత ఆరు నెలల పాటు పనికి బ్రేక్ ఇచ్చాను. నా వ్యక్తిగతానుభవం బట్టి సినిమాల్లో నెగెటివ్ పాత్రలు చేసేవాళ్లు నిజ జీవితంలో చాలా మంచిగా ఉంటారు. అందుకు ప్రకాష్ మంచి ఉదాహరణ. ప్రకాష్‌కి త్వరగా కోపం వస్తుంది. కాని విషయాల్ని బాగా అర్థం చేసుకుంటారు. తను పర్ఫెక్ట్‌గా పనులు చేయాలంటాడు. అందుకూ పూర్తి విరుద్ధం నేను. కాకపోతే అవన్నీ ఒకరినొకరం అర్థం చేసుకుని బాలెన్స్ చేసుకుంటున్నాం. మా ఇద్దరికీ బోలెడు సారూప్యతలు కూడా ఉన్నాయి. తినడం, ప్రయాణాలు చేయడమంటే మా ఇద్దరికీ చాలా ఇష్టం. మా ఇద్దరి మధ్యా పదకొండేళ్ల గ్యాప్ ఉంది. అది మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే “నీ కోసం నేను ఉన్నాననే” వ్యక్తి నా జీవితంలోకి రావాలనుకునేదాన్ని. అలాంటి వ్యక్తే దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది.
చెన్నయ్‌లో మా అత్తగారిల్లు లలిత వాళ్ల ఇంటికి దగ్గరగా ఉంటుంది. అందుకని ఆయన చెన్నయ్ వెళ్లినప్పుడల్లా లలిత వాళ్లింటికి వెళ్లాడని వార్తలు పుడుతుంటాయి. కాని 2005 నుంచి వాళ్లిద్దరూ కలిసి ఉండడం లేదు. ప్రకాష్ పెద్దకూతురు కొడైకెనాల్‌లో చదువుతోంది. మా పెళ్లి తరువాత లలితతో కలిసి మేమందరం వెళ్లి పాపను స్కూల్లో దిగబెట్టాం. ఆ పిల్లలు నన్ను సవతి తల్లిలా చూడరు. ఈ మధ్యనే పిల్లలతో కలిసి గోవా వెళ్లాం. మాది మొబైల్ కుటుంబం. ప్రకాష్ అన్ని దక్షిణాది భాషల్లో పనిచేస్తాడు కాబట్టి ముంబయి, హైదరాబాద్, చెన్నయ్, బెంగళూరుల్లో ఇళ్లు ఉన్నాయి. అలా వెళ్లినప్పుడు పిల్లలకి సెలవులు ఉంటే మాతో కలిసి వస్తారు. లలిత తన స్నేహితులతో కలిసి బయట ప్రయాణాలకు వెళ్లినప్పుడు పిల్లలు మాతోనే ఉంటారు. అంతేకాని బాధ్యతలు నేను తీసుకోను అని ఏనాడు లలితతో చెప్పలేదు. ఎందుకంటే ప్రకాష్‌ని పెళ్లి చేసుకున్నప్పుడే పిల్లల్ని కూడా నా పిల్లలు అనుకున్నా.
ఇక కెరీర్ విషయానికి వస్తే ఇండియన్ స్కూల్ ఫర్ పెర్ఫామింగ్ ఆర్ట్స్ (ఇస్పా) పేరుతో ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేశాను. పాఠశాలలకు వెళ్లి ఉచితంగా డ్యాన్స్ క్లాసులు తీసుకుంటున్నాను. సినిమాకి దర్శకత్వం చేయాలని ఉంది. కథ వెతుకుతున్నాను. కథతో పాటు ప్రకాష్ అనుమతి కూడా కావాలి. వచ్చే ఏడాది బిడ్డకు తల్లి కావాలనుకుంటున్నాను. జీవితంలో ఏదైనా చెడు జరిగితే అది మంచి కోసం ఏర్పాటు చేసిన మార్గం అనుకుంటాను నేను.”
(సావీ సౌజన్యంతో)
* మా మేనమామ బాలీవుడ్ నటుడు గోవిందా సోదరిని పెళ్లి చేసుకున్నాడు. అలా గోవిందాకి బంధువు అయ్యాను.
* అమితాబ్‌బచ్చన్, సల్మాన్‌ఖాన్, షారుక్‌ఖాన్, అక్షయ్‌కుమార్, హృతిక్‌రోషన్, అజయ్‌దేవ్‌గన్, కరీనాకపూర్, దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రా, బిపాసాబసు, విద్యాబాలన్, కత్రినా కైఫ్, లారా దత్తాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశాను.
* దర్శకుడు ప్రియదర్శన్ పరిశ్రమలో నా గాడ్ ఫాదర్. డర్టీ పిక్చర్‌లో చేసిన ‘ఊ లా లా’ పాటకు మెచ్చుకోళ్లు, అవార్డులు వచ్చాయి.