ఆ లోటు ఎప్పటికీ తీరదు!
‘యువత’… నిఖిల్‌ని హీరోగా నిలబెట్టింది. ‘సోలో’… నారా రోహిత్ కెరీర్‌ని మలుపు తిప్పింది. ‘ఆంజనేయులు’… రవితేజ ఖాతాలో మరో విజయాన్ని జమచేసింది. ‘శ్రీరస్తు శుభమస్తు’… అల్లు శిరీష్‌కి తొలి సూపర్‌హిట్‌ని అందించింది. ఈ సినిమాలన్నింటినీ తీసిన దర్శకుడు పరశురామ్‌కి అనుబంధాలను తెరపైన ఆవిష్కరించడంలో మంచి పట్టుందన్న పేరుంది. తన జీవితంలో తెగిపోయిన బంధాలూ, ఎదురైన పరిణామాలే సినిమాల్లో కుటుంబ విలువలకు ప్రాధాన్యమివ్వడానికి కారణమంటారాయన. అంతలా ఆయన్ని కదిలించిన సంఘటనలు ఏంటంటే…
చిన్నప్పుడంతా ఆకతాయిగా తిరిగే నేను ఎంబీయే పూర్తి చేయడానికి మా అమ్మ మాటలే ప్రేరణ. చదువైపోయాక విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకున్న నేను సినిమాల్లోకి రావడానికి అమ్మ మరణానంతర పరిస్థితులే కారణం. ఎదిగే ప్రతి దశలో అంతలా తను నాపైన ముద్ర వేసింది. నేను పుట్టింది విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంకి దగ్గర్లోని బాపిరాజు కొత్తపల్లి అనే వూళ్లొ అయినా, పెరిగింది మాత్రం చెర్లోపాలెంలో. దర్శకుడు పూరీ జగన్నాథ్, నేనూ అన్నదమ్ముల పిల్లలం. మా నాన్న కో-ఆపరేటివ్ బ్యాంకులో చిన్న ఉద్యోగి. అమ్మకి చదువంటే చాలా ఇష్టం. నన్నూ, అక్కనే కాకుండా తన ఐదుగురు అక్కచెల్లెళ్ల పిల్లలనూ అమ్మే చదివించేది. మాకున్న పౌల్ట్రీ ఫామ్ వ్యవహారాలనూ తనే చూసుకునేది. అల్లరి విషయంలో అమ్మ నన్ను కొట్టని రోజంటూ ఉండేది కాదు. సరిగ్గా చదవకుండానే మంచి మార్కులొస్తున్నప్పుడు, బాగా చదివితే ఇంకా ముందుకెళ్తావు కదా అని అంటుండేది. ఇప్పటికీ మా వూరికి బస్సులేదు. అలాంటి ప్రాంతం నుంచి వచ్చినా నేనూ, అక్కా, కజిన్స్ అంతా పీజీలు చేశామంటే కారణం అమ్మ వేసిన పునాదులే.
చాలా ఏళ్లు హాస్టల్లోనే
నేను రెండో తరగతి వరకూ చెర్లోపాలెంలో, తరవాత పెదబొడ్డేపల్లిలో ఆరో తరగతిదాకా చదివా. ఆ పైన జవహర్ నవోదయా స్కూల్ ఎంట్రెన్స్ పరీక్షలో సెలక్ట్ అవడంతో వైజాగ్‌లో హాస్టల్‌కి వెళ్లా. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ఏదో ఫంక్షన్‌కి వూరికి వెళ్లినప్పుడు కజిన్స్ అందరం దగ్గర్లోని నేలబావిలో ఈత కొట్టడానికి దిగాం. అలా ఆడుకుంటున్నప్పుడే ఓ కొబ్బరిమట్ట వచ్చి బావి మధ్యలో వేలాడింది. దాన్ని పట్టుకోవాలని నేనూ మరో పిల్లాడూ పోటీపెట్టుకున్నాం. నాకు ఈత పూర్తిగా రాకపోవడంతో కొబ్బరిమట్టను అందుకునేలోపే మునిగిపోవడం మొదలుపెట్టా. నేను చనిపోవడం ఖాయమని తెలుస్తూ ఉంది. ఒక్కసారిగా అమ్మానాన్నా అక్కా అందరూ గుర్తొచ్చి ఏడుపు తన్నుకొచ్చింది. చివరి నిమిషంలో చిన్నాన్న కొడుకు ఎలాగోలా బయటకి లాగాడు. వెంటనే అమ్మ దగ్గరికి వెళ్లి విషయం చెప్పకుండా చాలాసేపు ఏడ్చేశా. అమ్మకి చెబితే ఎలా స్పందిస్తుందోనని భయమేసి తరవాత కూడా తనకా సంగతి చెప్పలేదు. అలా రోజులు గడుస్తున్న సమయంలో ఓ వూహించని ఘటన నా జీవితాన్ని కుదిపేసింది.
అమ్మ దూరమైంది!
ఓసారి మా పౌల్ట్రీ ఫామ్‌కి వైరస్ సోకి కోళ్లన్నీ చనిపోయాయి. పెట్టుబడి మొత్తం పోయింది. అప్పటివరకూ అక్కా నేనూ ప్రభుత్వ స్కూళ్లలోనే చదివాం. సరిగ్గా డబ్బు పెట్టి పైచదువులు చదివించాలని అమ్మ ఆశపడ్డ సమయానికి అలా జరిగింది. దాంతో అమ్మ కాస్త డీలా పడింది. నేను ఆంధ్రా యూనివర్సిటీలో ఎంబీయే చదివేప్పుడు ఓ ఇంటర్నెట్ సెంటర్‌లో పార్ట్‌టైం పని చేసేవాణ్ణి. అలా రోజులు గడుస్తుండగా ఓసారి అమ్మకు ఒంట్లో బాలేదని ఫోన్ వస్తే వెళ్లా. డాక్టర్లు హెమోగ్లోబిన్ తక్కువగా ఉందన్నారు. స్నేహితులతో కలిసి రక్తం ఇచ్చి వచ్చా. ఓ పదిరోజుల తరవాత మళ్లీ అమ్మకు నీరసంగా ఉందంటే వెళ్లా. పరీక్షలు చేయిస్తే ఎక్యూట్ బ్లడ్ క్యాన్సరని తేలింది. రెండు మూడు నెలలకు మించి బతకడం కష్టమన్నారు. ఆ మాట వినగానే కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. ఏకంగా చనిపోయేంత జబ్బు ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. అక్కకు తెలిస్తే తనేదైనా చేసుకుంటుందేమోనన్న భయంతో చెప్పలేదు. నాన్న దగ్గరా ఓ పదిరోజులు దాచిపెట్టా. నటుడు జోగినాయుడు మా పెద్దమ్మ కొడుకు. తన భార్య ఝాన్సీ సాయంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం లేకపోయింది. జబ్బు బయటపడిన ఆర్నెల్లకు అమ్మ చనిపోయింది. నాకే కష్టం వచ్చినా అమ్మ ఉందిగా అనే ధైర్యం ఆ క్షణం దూరమైపోయింది.
అన్నయ్యని చూశాకే…
అమ్మ చనిపోయిన ఏడాదిలోపే ఉన్న కొద్దిపాటి భూముల్ని అమ్మేసి అక్క పెళ్లి చేశాం. తరవాత నాన్న తెలీని నైరాశ్యంలోకి జారిపోయారు. అలానే గడిపితే నేనూ డిప్రెషన్‌లోకి వెళ్తానేమోనని భయమేసి ఏదైనా ఉద్యోగం వెతుక్కుందామని హైదరాబాద్ వచ్చా. అప్పుడే ‘ఇడియట్’ సినిమా విడుదలైంది. వూళ్లొ ఉన్నప్పుడు జగనన్నయ్య దర్శకుడు అని తెలుసుకానీ, అతడి స్థాయేంటో ఇక్కడికొచ్చాకే అర్థమైంది. నా కళ్లముందు తిరిగిన వ్యక్తి కష్టపడి ఈ స్థాయికొచ్చినప్పుడు నేనెందుకు రాలేనూ అనిపించింది. అన్నయ్యని చూశాక ఆ రంగంలోకి వెళ్లాలన్న కోరిక పెరిగింది. ఓరోజు జోగి నాయుడు పిలిచి ‘నువ్వు ఒకప్పుడు సినిమాలు చూసి మా అందరికీ కళ్లకు కట్టినట్టు కథ చెప్పేవాడివి. తరవాత మేమెళ్లి సినిమా చూసినా అంత ఫీల్ వచ్చేది కాదు. ఇక్కడున్న ఎవరికీ నువ్వు తీసిపోవు. నువ్వు పెదనాన్న కాళ్లే పట్టుకుంటావో, ఏం చేస్తావో నీ ఇష్టం కానీ జగన్ దగ్గర అసిస్టెంట్‌గా చేరడమే నీ లక్ష్యంగా పెట్టుకో’ అన్నాడు. సినిమాల్లోకి రావాలనుందని జగనన్నయ్యకి చెబితే బాగా తిట్టాడు. ‘ఎంబీఏ చేశావు, అప్పట్లో విదేశాలకూ వెళ్లాలనుకున్నావు కదా. నేను పంపిస్తా వెళ్లూ’ అన్నాడు. కానీ నేను మాత్రం అన్నయ్య దగ్గరే చేరతానని కరాఖండీగా చెప్పడంతో కోపంతో కొన్నాళ్లు నాతో మాట్లాడటం మానేశాడు.
అలా ఉండగానే పెళ్లి…
ఓసారి ‘అమ్మానాన్నా ఓ తమిళమ్మాయి’ షూటింగ్ వైజాగ్‌లో జరుగుతుంటే నాన్నను తీసుకొని వెళ్లి అడిగించా. నాన్న మాట కాదనలేక అన్నయ్య నన్ను అసిస్టెంట్‌గా చేరమన్నాడు. ఆ తరవాత ‘ఆంధ్రావాలా’, ‘143’ సినిమాలకూ పనిచేశా. ఎక్కువ కాలం అన్నయ్య దగ్గరే పనిచేస్తే నా సామర్థ్యమేంటో నాకు తెలీదనిపించి వేరే ఎవరి దగ్గరైనా పనిచేస్తానని చెప్పి బయటికొచ్చేశా. తెలిసిన వాళ్ల సాయంతో దర్శకుడు దశరథ్ దగ్గర ‘శ్రీ’ సినిమాకి అసిస్టెంట్‌గా చేరా. అక్కడే దర్శకుడు చైతన్య దంతులూరి పరిచయమయ్యాడు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా చైతూ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా. అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేస్తున్నప్పుడే మా కజిన్ ద్వారా అర్చన అనే అమ్మాయి పరిచయమైంది. ఎందుకో తెలీదు కానీ క్రమంగా తనంటే ఇష్టం పెరిగింది. నేనప్పటికి కాళ్లకు హవాయి చెప్పులే వేసుకుని తిరిగేవాణ్ణి. అలాంటి సమయంలో ప్రేమా పెళ్లి గురించి ఆలోచించడం కరక్టేనా అనిపించేది. కానీ ఆమెకూ నేను నచ్చడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. వాళ్లది చాలా పెద్ద కుటుంబం. నా పరిస్థితేమో అంతంతమాత్రం. దాంతో మా పెళ్లికి వాళ్లింట్లో అంగీకరించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో పెద్దలు ఒప్పుకోకుండానే అర్చనా నేనూ ఒక్కటయ్యాం.
అవకాశం వచ్చినట్టే వచ్చి…
దశరథ్ దగ్గర పనిచేసేప్పుడు ఆ ప్రాజెక్టు ఆలస్యం కావడంతో చైతూ సాయంతో వీరూ పోట్ల దగ్గర అసిస్టెంట్‌గా చేరా. వీరూ రాసిచ్చిన కథలూ, డైలాగులన్నీ నేను ఫెయిర్ చేసేవాణ్ణి. అలా తనవల్లే రచన, డైలాగులపైనా క్రమంగా అవగాహన పెరిగింది. దురదృష్టం కొద్దీ వీరూ ప్రాజెక్టు కూడా ముందుకెళ్లలేదు. ‘పరుగు’ సినిమాకి స్క్రిప్ట్ డిస్కషన్ కోసం ఎవరైనా కావాలని భాస్కర్ వెతుకుతున్న సమయంలో చైతూ ఆ విషయం చెప్పి అతణ్ణి కలవమన్నాడు. అలా ‘పరుగు’కి అడిషనల్ డైలాగ్ రైటర్‌గా, స్క్రిప్ట్ అసిస్టెంట్‌గా పనిచేశా. కథకు కొంత అదనపు వినోదాన్ని జోడించా. నా పనితీరు దిల్ రాజుగారికి నచ్చడంతో నేను చేరిన వారంలోపే మంచి కథ తయారు చేసుకుంటే సినిమా చేద్దామన్నారాయన. ‘పరుగు’ పూర్తయ్యాక సొంతంగా ఓ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నా. అల్లు అర్జున్ కథల్ని బన్నీ వాసు వింటాడని తెలీడంతో అతనికే చెప్పా. వాసుకి కథ నచ్చింది కానీ బన్నీ పరిధికి చిన్నదవుతుందని అన్నాడు. తరవాత ‘ఆంధ్రావాలా’ నిర్మాత గిరిని కలిస్తే ఆ సినిమా చేద్దామన్నారు. కానీ ఏవో ఇబ్బందుల వల్ల అదీ ఆలస్యమైంది.
తొలిసినిమాతో పైపైకి…
సినిమా అలా వెనక్కెళ్తున్న సమయంలో ‘మంత్ర’ సినిమా తీసిన నిర్మాతలు ముందుకు రావడం, చందూ మొండేటి ద్వారా నిఖిల్ పరిచయమవడంతో నా తొలిసినిమా ‘యువత’ మొదలైంది. మా కష్టానికి మణిశర్మగారి సంగీతం తోడై సినిమా మంచి మ్యూజికల్ హిట్ అయింది. ఆ సినిమాకు అసిస్టెంట్లుగా పనిచేసిన చందూ, సుధీర్ వర్మ, కృష్ణ చైతన్యలు తరవాత దర్శకులుగా మారారు. నిఖిల్ సోలో హీరోగా నిలదొక్కుకున్నాడు. రాజారవీంద్ర ఓసారి రవితేజకు ఫోన్ చేసి ‘యువత’ సినిమా బావుందీ, చూడమని చెప్పాడు. రవికి కూడా అది నచ్చడంతో కలిసి సినిమా చేద్దామన్నారు. అలా మా ఇద్దరి కలయికలో ‘ఆంజనేయులు’ సినిమా విడుదలైంది. నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్‌నీ, దర్శకత్వంతో పాటు డైలాగ్ రైటర్‌గా నాకు మంచి పేరునీ ఆ సినిమా తీసుకొచ్చింది.
బన్నీ చెప్పిన మాట!
నా భార్య సినిమాల గురించి పెద్దగా ప్రస్తావించకపోయినా, డబుల్ మీనింగ్ డైలాగులేవీ లేకుండా కుటుంబ విలువలుండే మంచి సినిమాలు చేయమని తొలిసారి నాకు సూచించింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ‘సోలో’ కథ సిద్ధం చేసుకున్నా. నారా రోహిత్ కెరీర్లో పెద్ద విజయం సాధించిన సినిమా అది. తరవాత రవితేజతో ‘సారొచ్చారు’ సినిమా తీశా. విడుదలకు నాల్రోజుల ముందే కాపీ చూడగానే అది ఫ్లాపవుతుందని నాకు అర్థమైంది. ఆ వైఫల్యం నుంచి బయటికొచ్చి నాగచైతన్యకు ఓ కథ వినిపించా. తను సినిమా చేద్దామన్నా ఏవో కారణాల వల్ల అది ముందుకెళ్లలేదు. దర్శకుడు క్రిష్ నాకు మంచి స్నేహితుడు. ఆ కథను అతనికీ వినిపించా. అతనే బన్నీకి నా కథ గురించి చెప్పడంతో, బన్నీవాసు పిలిచి కథ చెప్పమన్నాడు. అక్కడా ఓకే కావడంతో ఆ కథపైన దృష్టిపెట్టా. ఈలోగా ఓ రోజు అరవింద్‌గారు పిలిచి ‘బన్నీ ఇప్పటికే రెండు సినిమాలు చేస్తున్నాడు. అవి పూర్తయ్యేవరకూ ఎదురుచూడటం కరెక్టు కాదు. శిరీష్‌కి ఏ కథలూ పెద్దగా నచ్చట్లేదు. పోనీ ఎవరితో సినిమా చేస్తావని అడిగితే నీ పేరు చెప్పాడు. శిరీష్‌కి ‘సోలో’ బాగా నచ్చిందట. సినిమా చేస్తావా మరి?’ అని అడిగారు. ఓరోజు బన్నీ పిలిచి ఓ చెక్కు చేతిలో పెట్టి, ‘నీ మీద నమ్మకంతో ఉన్నాం, ఏం చేస్తావో తెలీదు’ అనడంతో నా బాధ్యత మరింత పెరిగింది. ‘శ్రీరస్తు శుభమస్తు’ విడుదలవుతూనే హిట్‌టాక్ తెచ్చుకుంది. అరవింద్‌గారు పిలిచి ‘మరో కథ సిద్ధం చేసుకో, సినిమా మొదలుపెడదాం’ అన్నారు. ఆ మాట చాలు ఆయన నమ్మకం నిలబెట్టుకున్నా అనడానికి. నా తరవాతి సినిమా గీతా ఆర్ట్స్‌లోనే ఉంటుంది. చిన్నప్పుడోసారి నా కజిన్‌కి టెన్త్‌లో జిల్లా ఫస్ట్ వచ్చిందని పేపర్లో ఫొటో వేశారు. అమ్మ నాకది చూపించి, ‘ఇలా పిల్లల ఫొటోలు పేపర్లో చూసుకునే తల్లిదండ్రులది ఎంత అదృష్టమో తెలుసా’ అంది. సినిమాల్లోకి వచ్చాక నా ఫొటో చాలాసార్లు పత్రికల్లో వచ్చింది. వాటిని చూసినప్పుడల్లా అమ్మే గుర్తుకొస్తుంది. అందుకే నేను ఏ స్థాయికెళ్లినా అమ్మ లేని ఆ లోటు మాత్రం ఎప్పటికీ తీరదు.
సైన్సంటే ఇష్టం!
నాకు ఎలాంటి ఆధారం లేని సమయంలోనే నా భార్య అర్చన తోడుగా నిలిచింది. ఏదో ఒకరోజు నేను మంచి స్థానానికి వెళ్తానని నాకంటే బలంగా తనే నమ్మింది. అమ్మ స్థానాన్ని తను భర్తీ చేయకపోయుంటే నా జీవితం ఎటెళ్లేదా అనిపిస్తుంటుంది. మాకిద్దరు పిల్లలు. పెద్దబ్బాయి రిషిత్. చిన్నోడు అవ్యాన్.
* దర్శకులు చైతన్య దంతులూరి, ఆనంద్ రంగా, క్రిష్, ఎడిటర్ మార్తాండ్‌లు నాకు మంచి స్నేహితులు. నేను సినిమాలు చేయని సందర్భాల్లోనూ ఎప్పటికప్పుడు ఫోన్ చేసి నా బాగోగులూ, ప్రాజెక్టుల గురించి ఆరా తీస్తుంటారు.
* సైన్స్‌కి సంబంధించిన కొత్త పరిశోధనల గురించి తెలుసుకోవడం అంటే నాకు ఆసక్తి. మా అమ్మ ఆస్పత్రిలో ఉన్నప్పుడు బ్లడ్ క్యాన్సర్‌కి మందులేమన్నా ఉన్నాయా అన్న ఆశతో లైబ్రరీలకు వెళ్లి పత్రికలు తిరగేసేవాణ్ణి. అప్పట్నుంచీ అలా పరిశోధనల గురించి తెలుసుకోవడం అలవాటైంది.