అవే నా డ్రీమ్ రోల్స్!
వరస విజయాలతో వెండితెరపైన దూసుకెళుతోంది నివేదా థామస్. తాజాగా ‘బ్రోచేవారెవరు’లో మెప్పించిన ఈ అందాల భామ తన ఇష్టాయిష్టాల గురించి ఏం చెప్పిందంటే…
డ్రీమ్ రోల్స్ ‘పద్మావత్’లో దీపికా పదుకొణె, ‘తను వెడ్స్ మను’లో కంగన రనౌత్ పోషించిన పాత్రల వంటివి చేయాలని కోరిక. |
అభిమానం ఏఆర్ రెహమాన్‌కు వీరాభిమానిని. ప్రయాణంలో రెహమాన్ సంగీతం విని సేద తీరుతుంటా. |
ఒత్తిడిగా అనిపిస్తే… గరిటె తిప్పుతా. నాకు వంట బాగా వచ్చు. చిన్నప్పుడే అమ్మ నేర్పించింది. |
ఓ సరదా వర్షం పడుతుంటే బాల్కనీలో నిల్చునో, బీచ్‌లో గొడుగు కింద కూర్చునో మసాలా చాయ్ తాగడం నాకు భలే సరదా. కానీ వరస సినిమాల వల్ల కుదరట్లేదు. |
నచ్చే తారలు అందాల తార శ్రీదేవి అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు టీవీలో రజినీకాంత్ సినిమాలు వస్తుంటే రెప్పవాల్చకుండా చూసేదాన్ని. కమల్‌హాసన్ నటన అంటే పడిచచ్చిపోతా. |
నైట్‌లైఫ్ అప్పుడప్పుడూ రాయల్ ఎన్‌ఫీల్డ్‌పైన రైడ్‌కి వెళుతుంటా. హెల్మెట్ పెట్టుకుంటా కాబట్టి ఎవరూ గుర్తు పట్టరు. |
ఇష్టంగా తినేది కేరళ స్పెషల్ అప్పం అంటే ఎంతిష్టమో. ఇంట్లో ఉంటే అమ్మతో రోజూ చేయించుకుని తింటా. హైదరాబాద్‌లో ఉంటే ఉలవచారు రుచి చూడాల్సిందే. చెబితే నమ్మరు ఆ పేరు తలచుకుంటేనే నాకు నోరూరిపోతుంది. |
నచ్చే సినిమా కమల్‌హాసన్, సరిత నటించిన ‘మరో చరిత్ర’ బాగా నచ్చుతుంది. ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. సరిత వాయిస్‌లో ఏదో తెలియని ఫీల్ ఉన్నట్టు అనిపించింది. |
ఆరోగ్య రహస్యం బ్యాడ్మింటన్ నా ఫిట్‌నెస్ రహస్యం. షూటింగ్ అయ్యాక అరగంటైనా ఆడతా. ఈ మధ్య ఓ అకాడమీలో కూడా చేరా. మాట్లాడే భాషలు మలయాళం, తమిళం, హిందీ, ఇంగ్లిష్, తెలుగు భాషల్లో స్పష్టంగా, వేగంగా మాట్లాడగలను. |
నచ్చే హాలిడే స్పాట్ బ్రెజిల్, ఇటలీ రాజధాని రోమ్‌లంటే చాలా ఇష్టం. ఎక్కువ రోజులు సమయం దొరికితే కుటుంబంతో కలిసి వెళ్లాలనుకుంటున్నా. |
నటికాకపోయుంటే ఆస్ట్రోనాట్ అయ్యేదాన్ని. ఒకవేళ అదీ కుదరకపోతే నాకు ఇష్టమైన ఆర్కిటెక్చర్ సబ్జెక్టును బోధించేదాన్ని. చదువు ఈ మధ్యనే బీటెక్(ఆర్కిటెక్చర్) పూర్తైంది. ఇంకా చదవాలనుంది కానీ సమయం దొరకట్లేదు. |