Lyricists Bhuvanachandra – Vennelakanti


బాగా రాయకపోతే ఇంటికెళ్లాలన్నారు

ఒకరు పాటలో ఆర్ద్రత నింపితే.. ఇంకొకరు పాటకు రసికత పూస్తారు. ఒకరు మాట లోతు వెదికెతే.. ఇంకొకరు మాటను ఎవరెస్టుకు తీసుకువెళతారు. ఒకరు ఎయిర్‌ఫోర్స్‌ నుంచి పాటలవైపు వస్తే… ఇంకొకరు కవిత్వం నుంచిసినిమాలకు వచ్చారు. వీళ్లేవరంటే… శేష పూర్ణానంద పెద గురురాజు, రాజేశ్వర ప్రసాద్‌… వీరేం పాటలు రాశారు? అని మీ కళ్లు ఇంత పెద్దవయ్యాయి కదా! వాళ్లిద్దరూ భువనచంద్ర, వెన్నెలకంటి. పైరెండు అసలు పూర్తిపేర్లు. ఈ ఇద్దరూ ఒకరినొకరు ఇంటర్వ్యూ చేస్తే..

వెన్నెలకంటి: ఎయిర్‌ ఫోర్స్‌ నుంచి ఇటువైపు గాలి ఎలా మళ్లింది?
భువనచంద్ర: చివరి నాలుగు సంవత్సరాలు విజయవాడలో పనిచేశాను. అప్పుడు ప్రముఖ రచయిత్రి తెన్నేటి హేమలత గారు నా పాటలు బాగున్నాయని మద్రాసుకి తన మేనకోడలు జలంధర, ఆమె భర్త, ప్రఖ్యాత నటుడు చంద్రమోహన్‌ల దగ్గరికి పంపించారు. నాకు మొదటి అవకాశం ఇచ్చింది విజయ బాపినీడు గారు. నా ఉద్దేశం తెలుసుకున్న తరువాత మాట తీసుకున్నారు.. బాగా రాస్తే మద్రాసులో ఉండాలి, లేకపోతే వాపస్‌ ఊరెళ్లిపోవాలని. ‘నాకూ పెళ్లాం కావాలి’ తమిళ మాతృకకి కారులో పంపించారు. టైటిల్‌ సాంగ్‌ కావాలన్నారు కదా అని టైటిల్స్‌ వరకు చూసి పాట రాసుకొని వెనక్కొచ్చాను. ఆశ్చర్యపోయారు. నా పాట చూసి ఆయనే మద్రాసులో ఉండిపొమ్మన్నారు. ఓఎన్‌జీసీలోనూ ఉద్యోగం వచ్చింది. తర్వాత సినిమాల్లోకొచ్చేశా.

వె: రాయడం ఎప్పుడు మొదలుపెట్టారు?
భు: ఎయిర్‌ఫోర్స్‌లో చేరాక పాటలు రాయడం మొదలుపెట్టాను. పాటలు, కవితలు అన్నీ కలిపి నాలుగు వేలు రాసుకున్నాను. నా కోసం. సినీ రంగానికి వచ్చిన తరువాత మరొక రెండు వేలు రాసుకున్నాను. అవి నా డైరీల్లో భద్రంగా ఉన్నాయి. ‘మరల తెలుపనా ప్రియా’ వంటి హిట్‌ పాటలు కొన్ని ఇలా ముందు రాసి పెట్టుకున్నవే.

వె: మీరు రాయకూడదనుకున్న పాటలున్నాయా?
భు: అమ్మ, అక్క సెంటిమెంట్‌ పాటలు రాయను. ఎందుకో గాని అవి అనుభూతి, వివరణలకు అందనివని అనిపిస్తుంది. అయినా కరుణాకర్‌ రెడ్డి గారి పట్టుదల మీద ‘బ్యాండ్‌ బాలు’కి తల్లి మీద పాట రాయాల్సొచ్చింది. ‘అక్క’ సీరియల్‌దీ అదే పరిస్థితి. అయితే, ఆ పాట పాడిన బాలు గారు తమను పెంచి పెద్ద చేసిన అక్కను తలచుకున్నారు. చాలా సంతోషంగా అనిపించింది.

వె: మీ మీద పడిన ముద్ర గురించి మీ అభిప్రాయం?
భు: (నవ్వు) నాకొచ్చిన పాటల్లో అల్లరి పాలెక్కువ. కొసరాజు గారనగానే ‘జానపద’, సముద్రాల గారికి ‘భక్తి’, కృష్ణశాస్త్రి గారికి ‘భావ గీతాలు’, శ్రీశ్రీ గారికి ‘విప్లవం’ అని పేర్లు ఏర్పడిన్నట్టుగా నామీద ‘శృంగార, హుషారైన గీతాలన్న ముద్ర పడింది. సంతోషం. ఈ పాటలన్నీ నిజంగా హుషారుగా రాశాను. హీరోని బట్టి మాటలను ఉపయోగించాను. డ్యూయెట్‌లలో నిజానికి పెద్ద అర్థం ఉండదు. ప్రేయసీ ప్రియులు ఎంతసేపూ ఏం మాట్లాడుకుంటారు? ఏమీ ఉండదు. అయినా ఉపయోగించే పదాల్లో ఇంటిమసీ ఉండాలి. ఒక తీయదనాన్ని తీసుకురావాలి. పాట విన్నా, చూసినా హుషారనిపించాలి. ఇదంతా రాయడాన్ని బాగా ఆస్వాదించాను. వీటితోపాటు చాలా మంచి భావయుక్తంగా ఉండే పాటలు రాసే అవకాశాలు కూడా వచ్చాయి. అందుకు భగవంతుడికి ధన్యవాదాలు.

మా మనసులకు వయసు అంటదుఆకాశంలో ఎగురుతూ వెళ్లే సంగీతాన్ని, సాహిత్యాన్ని నేలకు దింపి సామాన్యుడికి అందించింది సినిమా మాత్రమే. ఈ సంగీతాన్ని గాని, సాహిత్యాన్ని గాని చులకనగా చూడకూడదు. సినీ రచయితలైనందుకు మేము గర్వపడుతున్నాం. ఎప్పుడూ హుషారైన పాటలు రాస్తూంటాం, కొత్తదనాన్ని వెతికి వాటిలో జొప్పిస్తుంటాం. అందుకే మా మనసులకి వయసు అంటదు.
ప్రమాణాలు మారుతుంటాయి1955- 60 చివరిదాకా తెలుగు సినిమాకి స్వర్ణయుగం. అద్భుతాలు అనదగిన సినిమాలు, పాటలు వచ్చాయి. అద్భుతమైన పద విన్యాసాలు, చెప్పీచెప్పని అందమైన భావాలు వెల్లడయ్యాయి. 70ల వరకు ప్రమాణాలు మారలేదు. అప్పటి ఉదాత్తమైనటువంటి పేర్లు, పాత్రలు ఉన్న దగ్గరి నుంచి నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పేర్లు, పాత్రల వరకు సినిమా మారింది. తరం మారినప్పుడంతా సంబోధన, కట్టూబొట్టూ మారతాయి. ప్రమాణాలు మారతాయి. ఇది సహజమైన విషయం. ఆ మారుతున్న ప్రమాణాలే పాటలను కూడా నిర్దేశిస్తాయి.
థియేటరే నా మహాగురువుభువనచంద్ర: నీ రచనల గురించి చెప్పు బుల్లెబ్బాయ్‌!
వెన్నెలకంటి: 11 ఏళ్ల వయసులో ఆటవెలదిలో ‘భక్త దుఃఖనాశ పార్వతీశ’ మకుటంతో శతకం రాశాను. 13 ఏళ్లకి కందంలో లలితా శతకం రాశాను. కాలేజీకొచ్చాక ఒక శ్రీరామనవమి రోజు 108 పద్యాలు రాశాను. అభ్యుదయ కవిత్వం పరిచయమయ్యాక, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో చేరాక  ‘ఉషోదయం ఆపలేవు’ కవితా సంపుటిని కూర్చాను. ‘ఆత్మావత్‌ సర్వభూతాని’, ‘యత్ర నార్యస్తు పూజ్యంతే’ సాంఘిక నాటికలు రచించాను.భు: అంత చిన్న వయసులో అంత భాష ఎలా అలవడింది తమ్ముడూ!?
వె:అంతా నా మహాగురువు దయ. (నవ్వు) నెల్లూరులో మా ఇంటి దగ్గర విజయలక్ష్మి టాకీసుండేది. అన్నీ పాత సినిమాలే, ఎక్కువగా పౌరాణికాలే ఆడేవి. ఒక్కొక్కటీ రెండుమూడు సార్లైనా చూసేవాణ్ణి. అలా అంతో ఇంతో భాష పట్టుబడింది. అందుకే ఆ థియేటరే నాకు మహాగురువు. ఆ తరువాత ఒక కవి సమ్మేళనంలో నాగభైరవ కోటేశ్వరరావు గారు పరిచయమై తదనంతరం నాకు గురువు, తండ్రి అయ్యారు. ఆయన పేరుతో పదేళ్లుగా ఏడాదికొకసారి అవార్డ్‌ ఇస్తున్నాను.

భు: నీ సినీ జీవితంలో మరచిపోలేని వ్యక్తులు?
వె: నాకు మొదటి అవకాశం ఇచ్చిన నటులు ప్రభాకర్‌ రెడ్డి గారు. నేనీ స్థితిలో ఉన్నందుకు కారణమైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. కోదండపాణి గారు బాలసుబ్రహ్మణ్యం గారి అవకాశాల కోసం ఎంత కృషి చేశారో ఈయన నాకోసం అంతకంటే ఎక్కువే చేశారు. శేష గిరీశం సంగీతానికి పాటలు రాయడం వల్ల సినిమా పాటలు రాయడం తేలికైంది. నేను బ్యాంక్‌లో పని చేస్తుండగా నటుడు, నాటక దర్శకుడు వై.కామేశ్వరరావు బాలు గారికి పరిచయం చేశారు. నేను కవిత్వంలో అన్ని శాఖాలూ రాసినా.. ‘నీకు పాట మీద పట్టుంది. దాన్ని గట్టిగా పట్టుకో’ అని సూచించింది పాత్రికేయుడు   ఎం.వి.ఎస్‌ ప్రసాద్‌. ఈ ఐదుగురినీ ఎప్పటికీ మరచిపోలేను.

భు: నీ పాటల్లో కొన్ని మరపురాని వాటి గురించి చెప్పు?
వె: నా మొదటి పాటే లాలి పాటవ్వడం (చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల) నా అదృష్టం. ‘మా వూరి మహారాజు’లో రాసిన ‘అమ్మా! నువ్వొకసారి బతకాలమ్మా’ పాటకు విలువ నేను అనుభవించినప్పుడు తెలిసింది. ఇక ‘మావయ్య అన్న పిలుపు’ గురించి చెప్పి తీరాల్సిందే. ఆ పాటని ఉన్నదున్నట్టు పెట్టమంటే భార్గవ ఆర్ట్స్‌ గోపాలరెడ్డి గారు అలాగే చేశారు. విశేషం ఏంటంటే.. ఆ తరువాత నా ఫ్రెండ్స్‌ శ్రీమతులు, అభిమానులు, అమెరికాలో ఉన్నవాళ్లూ అన్నయ్య అనడం మొదలుపెట్టారు. రాఖీ రోజున తప్పక ఫోన్‌ చేస్తారు.

భు: పిల్లలు శశాంక్‌, రాకేందులలో మాటకు ఎవరిని, పాటకు ఎవరిని పెట్టుకుంటావ్‌?
వె: వాళ్ల బలాలు నాకు తెలుసు కాబట్టి పెద్దబ్బాయ్‌ శశాంక్‌తో మాటలు, చిన్నవాడు రాకేందుతో పాటలు రాయించుకుంటా.

– గుడిమెళ్ల మాధురి, చెన్నై