Heroine Anu immanyuel

heroine anu immanyuel 1

విని వదిలేయాలి… అంతే!
27-10-2018 23:48:43
చెంపకు చారడేసి కళ్లు… పెదవంచున సన్నటి నవ్వు.. మత్తుమత్తుగా వినిపించే హస్కీ వాయిస్‌.. చీరకట్టులోనూ, బికినీలోనూ మెప్పించే టాలెంట్‌.. ఇన్ని లక్షణాలను సొంతం చేసుకున్న అనూ ఇమ్మాన్యుయేల్‌ ‘నవ్య’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాల సమాహారం..
హాయ్‌ అనూ ఎలా ఉన్నారు?
అనూ : ఐయామ్‌ గుడ్‌ అండీ!
తెరపై మీరు బాగా తెలుసు. కానీ, తెరవెనుక ఇంట్లో అనూ ఎలా ఉంటారు?
అనూ : నేను చాలా బోరింగ్‌ పర్సన్‌ని. చదువుకునే రోజుల్లోనైనా, సినిమాల్లోకి వచ్చిన తర్వాత అయినా ఖాళీ ఉంటే రోజంతా ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడతా. నా పెట్‌డాగ్‌తో ఆడతా. లేదంటే ఒంటరిగా కూర్చుని సినిమాలు చూస్తా. అయినా బోర్‌ కొడితే.. ప్రశాంతంగా నిద్రపోతా. సాయంత్రం సమయంలో షాపింగ్‌కు వెళ్లడమంటే ఇష్టం. పుస్తకాల పురుగును కాదు. కానీ నచ్చిన పుస్తకం చదవడంలో ఉన్న కిక్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తా. పర్సనాలిటీ డెవల్‌పమెంట్‌ పుస్తకాలు ఎక్కువగా చదువుతా. వాటి నుంచీ చాలా నేర్చుకుంటా. ఓప్రా విన్‌ఫ్రే రచించిన ‘వాట్‌ ఐ నో ఫర్‌ ష్యూర్‌’ నన్ను చాలా ప్రభావితం చేసిన పుస్తకం. వజ్రాలు కావాలా? పప్పీ్‌స(పెట్‌డాగ్స్‌) కావాలా? అంటే పప్సీస్‌ కావాలని కోరుకుంటా.
మీ ఫ్యామిలీ గురించి చెబుతారా?
అనూ : నాన్న తంగచ్చిన్‌ ఇమ్మాన్యుయేల్‌ కేరళలోని కొట్టాయమ్‌కు చెందిన వ్యక్తి. అమ్మ అక్కడే ఆసుపత్రిలో ఉద్యోగి. కొంతకాలం అమెరికాలో ఉన్నాం. నేను పుట్టి పెరిగిందీ, చదువుకుందీ అంతా అమెరికాలోనే! నాకొక అన్నయ్య ఉన్నాడు. ప్రస్తుతం బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చేస్తున్నాడు. నాన్నకూ, నాకూ సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన మలయాళ చిత్రాల నిర్మాత కూడా. ఆరేడేళ్ల వయసు నుంచీ నాకు సినిమాల్లో నటించాలని ఆశ. చిన్నప్పటి నుంచీ నాన్నంటే చాలా భయం. అందుకే సినిమాల ప్రస్తావన ఆయన దగ్గర తీసుకురాలేదు.
2011లో నాన్న నిర్మించిన ‘స్వప్న సుందరి’ సినిమాలో హీరోకి కూతురిగా నటించే అవకాశం ఇచ్చారు. ఆ సినిమా కోసం అమెరికాలోని డల్లాస్‌ నుంచీ కేరళకు వచ్చా. ఎందుకో ఆ షూటింగ్‌నూ, సినిమానూ ఎంజాయ్‌ చెయ్యలేకపోయా. లాభం లేదనుకుని అమెరికా ఫ్లైట్‌ ఎక్కేశా. అక్కడే చదువు కంటిన్యూ చేశా. చిన్నప్పటి నుంచీ నా తల్లితండ్రులు నచ్చింది చేసే స్వేచ్ఛనిచ్చి పెంచారు. యాక్టింగ్‌ కెరీర్‌గా ఎంచుకోవడం కూడా నా ఇష్టప్రకారమే జరిగింది. వాళ్లు నన్ను ఎంకరేజ్‌ చేశారు.
అసలు హీరోయిన్‌గా మీ ఎంట్రీ ఎలా జరిగింది?
అనూ : ఓ సందర్భంలో నాన్నకు తెలిసిన ఓ మ్యాగజైన్‌ ఎడిటర్‌తో మాట్లాడి నా ఫొటోను కవర్‌ పేజీగా వేయించారు. ఆ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దాన్ని చూసి మలయాళ హీరో నివిన్‌ పాల్‌ నన్ను సంప్రతించారు. స్కైప్‌లో ఆడిషన్‌ చేసి ‘యాక్షన్‌ హీరో బిజు’లో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. అలా కథానాయికగా మొదటి అవకాశం అందుకున్నా. ఏదన్నా చెయ్యాలని గట్టిగా సంకల్పించుకుంటే అది తప్పకుండా జరుగుతుందని మొదటి అవకాశం అందుకున్నాక అర్థమైంది.
తొలి తెలుగు అవకాశం ఎలా వచ్చింది?
అనూ : తెలుగులో నేను సైన్‌ చేసిన మొదటి సినిమా ‘ఆక్సిజన్‌’. విడుదలైంది మాత్రం నానితో నటించిన ‘మజ్ను’. ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫొటోలు చూసి దర్శకుడు విరించి వర్మ ఆడిషన్‌ చేశారు. ‘మజ్ను’లో కిరణ్మయి పాత్రకు సూటవుతానని నమ్మి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య’లో నటించా.
‘మజ్ను’ మినహాయిస్తే మీరు నటించిన చిత్రాలు అంతగా సక్సెస్‌ కాలేదు. అయినా స్టార్‌ హీరోల సరసన వరుసగా అవకాశాలు రావడం అంత తేలిక కాదేమో కదా…
అనూ : సక్సెస్‌ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం కష్టమే. సినిమా ఫెయిల్‌ అయినంత మాత్రాన అందులో నటీనటులు, వారి నటన ఫెయిల్‌ అయిందనుకోకూడదు. వాటిలో నా నటన నచ్చబట్టే స్టార్‌ల పక్కన అవకాశాలు వచ్చాయని నేననుకుంటున్నా. చేసిన పాత్ర పండినా సినిమాకు టాక్‌ బాగోకపోతే సంతృప్తి ఉండదు. అది నాకూ ఉంది. కష్టాల నుంచే సక్సెస్‌ మొదలవుతుందని భావిస్తున్నా. అపజయం నేర్పించే పాఠం ఎప్పటికీ మరచిపోలేం.
సూపర్‌హిట్‌ ‘గీత గోవిందం’లో హీరోయిన్‌గా చెయ్యలేకపోయినందుకు ఫీలయ్యారా?
అనూ : చాలా ఫీలయ్యా. ‘గీత గోవిందం’లో కథానాయికగా ఫస్ట్‌ చాయిస్‌ నేనే. కానీ అదే సమయంలో ‘నా పేరు సూర్య’ సినిమా చెయ్యడం వల్ల డేట్స్‌ క్లాష్‌ అయ్యాయి. అందుకే ఆ సినిమా చెయ్యలేకపోయా. కానీ దర్శకుడు పరశురామ్‌గారు అతిథి పాత్ర ఇచ్చారు. అదైనా దక్కినందుకు ఆనందంగా ఉంది. ఫైనల్‌గా చూస్తే ‘గీత గోవిందం’ పాత్ర మిస్‌ అవ్వడం చాలా బాధగా ఉంది.
ఓ సినిమా అంగీకరించాలంటే మీరిచ్చే ప్రాధాన్యం దేనికి?
అనూ : ఒక సినిమాకు సైన్‌ చెయ్యాలంటే ఒక్క ఎలిమెంట్‌ని బేస్‌ చేసుకోకూడదు. సినిమాకు కథ ఎంత ముఖ్యమో.. హీరో, డైరెక్టర్‌, బ్యానర్‌ అన్నీ పక్కాగా కుదిరితేనే అది మంచి సినిమా కాగలదు. ‘అజ్ఞాతవాసి’ అంగీకరించడానికి కారణం స్టార్‌ హీరో, పవన్‌కల్యాణ్‌ ఉన్నారనో, స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ ఉన్నారనో చెప్పొచ్చు. కానీ నేను వారితోపాటు కథ గురించి ఆలోచించి ఓకే చేశా. ‘అత్తారింటికి దారేది’లోని హీరోయిన్‌ ప్రణీత తరహా పాత్ర అయితే నేను చెయ్యనని ముందే చెప్పేశా. అలా ఉండదని త్రివిక్రమ్‌గారూ మాటిచ్చారు. ఆ సినిమా సరిగ్గా ఆడలేదేమో కానీ నాకు కీర్తీసురేశ్‌కూ మంచి పేరే వచ్చింది.
‘అజ్ఞాతవాసి’ మినహా అన్ని సినిమాల్లోనూ లిప్‌లాక్‌ చేసినట్టున్నారు?
అనూ : కమర్షియల్‌ సినిమాకు గ్లామర్‌ హంగు ఉండాలన్నది ఓ సూత్రం. కాబట్టి కథ డిమాండ్‌ మేరకు స్కిన్‌ షో, లిప్‌లాక్‌ తప్పనిసరి. మీరు బాగా గమనిస్తే కావాలని ఇరికించినట్టు ఎక్కడా అనిపించవు.
సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక మీలో వచ్చిన మార్పు?
అనూ : పెద్ద మార్పేమీ లేదు. నేను నాలాగే ఉండటానికి ఇష్టపడతా. అలాగే ఉన్నా. పరిస్థితుల్ని బట్టి మారాలి, మార్పును స్వీకరించాలని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఎక్కడి నుంచో వచ్చినవాళ్లు ఏ సపోర్టూ లేకుండా ఇక్కడ ఎదగడం అంత ఈజీ కాదు. చాలా కృషి చెయ్యాలి. ఏ ఇండస్ట్రీలోనైనా ఓ సాధారణ మనిషి ఎదగాలి అంటే చుట్టూ ఉన్న మనుషుల్ని హ్యాండిల్‌ చెయ్యడం నేర్చుకోవాలి. నేను భయపడేది ఫెయిల్యూర్‌కి మాత్రమే! ఈ ఫీల్డ్‌లో జయాపజయాలు సహజం. ఏదీ మన చేతిలో ఉండదు. సక్సెస్‌ వస్తే ‘గోల్డెన్‌ లెగ్‌,’ లేకపోతే ‘ఐరెన్‌లెగ్‌’ అంటారు. ఇలాంటి వాటిని జయించాలనే తపన బాగా పెరిగింది. కొన్ని సందర్భాల్లో వీటిని విని వదిలేయాలి తప్ప ఇంటి వరకూ తీసుకెళ్లకూడదనిపిస్తుంది. కంట్రోల్‌ చెయ్యడం కూడా ఎవరి వల్లా కాదని నా ఫీలింగ్‌. ఇలాంటి వాటిని మరచిపోవడానికి నేను చదివిన సైకాలజీ బాగా ఉపయోగపడుతుంది.
నటిగా ఎవరి ప్రభావమైనా మీపై ఉందా?
అనూ : అలాంటిదేమీ లేదు. నటి అయినా, వేరే రంగంవారైనా వాళ్లకంటూ ఓ స్టైల్‌ ఉండాలని నమ్ముతా. మరొకరిని చూసి ఇన్‌స్పైర్‌ కావచ్చు. కానీ అది అన్ని సందర్భాల్లోనూ కాకూడదు. నాకు శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌, సమంత అంటే చాలా ఇష్టం. నటిగా ఉన్నతమైన స్థాయిలో ఉండాలన్నది నా ఆకాంక్ష.
డ్రీమ్‌ రోల్స్‌ ఏమన్నా ఉన్నాయా?
అనూ : డ్రీమ్‌ రోల్స్‌ ఏమీలేవు కానీ ‘మహానటి’లో కీర్తీ సురేశ్‌ చేసిన పాత్ర కోసం ఎదురుచూస్తున్నా. ఆ పాత్ర తనను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఆర్టిస్ట్‌ కెరీర్‌ టర్న్‌ అవ్వాలంటే అలాంటి ఓ క్యారెక్టర్‌ పడాల్సిందే. నాకు ప్రయోగాలు చెయ్యాలని లేదు. ఎవర్నీ పోటీగా భావించను. ఇంకా నేను నేర్చుకునే దశలోనే ఉన్నాను.
మీలో మీకు ప్లస్‌ అనిపించేది?
అనూ : ఇండిపెండెంట్‌గా ఉండటం, బోల్డ్‌నెస్‌ నాలో నాకు నచ్చిన గుణాలు. ఇక నాలో ప్లస్‌ పాయింట్‌ అంటే నా కళ్లే. అవి పెద్దగా, గుండ్రంగా ఉంటాయని చిన్నప్పటి నుంచీ అందరూ చెబుతుంటారు. సినిమా అభిమానుల నుంచి వచ్చిన కాంప్లిమెంట్‌ కూడా అదే. పైకే ఇగోయి్‌స్టలా కనిపిస్తాను కానీ లోపల జాలి గుణం కాస్త ఎక్కువే.
మీ హీరోల స్వభావాల్లో మీకు నచ్చింది?
అనూ : నేను పని చేసిన ప్రతి హీరోలోనూ డెడికేషన్‌ను బాగా ఇష్టపడతా. పవన్‌కల్యాణ్‌, బన్నీ, నాని, నాగచైతన్య, రాజ్‌తరుణ్‌ ఇలా ప్రతి ఒక్కరిదీ ఓ స్టైల్‌. ఒకర్ని మించినవారు ఒకరు.
 
మీకు నచ్చినవి.. నచ్చనివి?
అనూ : ఒత్తిడి ఫీల్‌కావడం నచ్చదు. సినిమా మేకింగ్‌లో ఉన్న కిటుకులు తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. నాన్నలా సక్సెస్‌ఫుల్‌ నిర్మాత కావాలని ఉంది. కానీ ఎప్పుడో తెలీదు.
సలహా తీసుకోవడం నచ్చదు..
అనూ : ‘మజ్ను’ తర్వాత నాకు బాగా నచ్చిన సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. నటనకు స్కోపున్న పాత్ర అది. నిజజీవితంలో నాకు ఇగో ఎక్కువ. అలాంటి పాత్రే ‘శైలజారెడ్డి అల్లుడు’లో చేశా. కానీ సినిమాలో చూపించినంత ఇగోయి్‌స్టను కాదు. ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో నేను పెద్దగా మాట్లాడింది లేదు. ఇందులో కాస్త లౌడ్‌ క్యారెక్టర్‌ దక్కింది. మంచైనా, చెడు అయినా ఒకరి సలహా తీసుకోవడం నాకు నచ్చదు. నాకు నచ్చినట్లుగా ముందుకెళ్తా. ఇది చెయ్యొచ్చు అని నా మనసుకి అనిపిస్తే చేసేస్తా. కానీ రమ్యకృష్ణగారితో పనిచేశాక ఆ పద్ధతి తప్పని తెలుసుకున్నా. నాకు తెలియకుండానే ఆమె దగ్గరకు వెళ్లి అడిగి మరీ సలహాలు తీసుకున్నా. ఆమెలోని గ్రేస్‌ చూసి ఆశ్చర్యపోయేదాన్ని. ఆమె నటన, డెడికేషన్‌ చూశాక ఊరకే ఎవరూ స్టార్స్‌ కారు అనిపించింది.
మూడ్‌ను బట్టి..
అనూ : స్టైలింగ్‌ విషయంలో నా ఆలోచనలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. అప్పటి మూడ్‌ను బట్టి దుస్తులు ధరిస్తా. క్లాసిక్‌ స్టైల్‌ అంటే చాలా ఇష్టం. నా చర్మం త్వరగా డ్రై అయిపోతుంది. అందుకే ఎక్కువగా లోషన్స్‌ ఉపయోగిస్తా. నేనంత ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ని కాదు. కథానాయికకు కావలసిన ఫిట్‌నెస్‌ ఉండేలా చూసుకుంటా. అదే పనిగా వర్కవుట్స్‌ చెయ్యను. వారానికి రెండుసార్లు జిమ్‌ చేస్తా.
నా హీరోలు-నా మాట
పవన్‌ కల్యాణ్‌: మంచితనం
అల్లు అర్జున్‌: సిన్సియర్‌
నాని: రొమాంటిక్‌ పర్సన్‌
నాగ చైతన్య: కంఫర్టబుల్‌ కో-స్టార్‌
గోపీచంద్‌: కామ్‌ గోయింగ్‌
నా ఇష్టాలు
ఇష్టమైన ప్రదేశం: ఇల్లు
ఆహారం: ఫలానా అని చెప్పడం కష్టం. కానీ చైనీస్‌ ఫుడ్‌ అంటే చాలా ఇష్టం.
ఇష్టమైన సినిమా: నోట్‌బుక్‌ (ఇంగ్లిష్‌)
ఇష్టమైన పుస్తకం: ఓఫ్రా విన్‌ ఫ్రే రచన ‘వాట్‌ ఐ నో ఫర్‌ ష్యూర్‌’
ఆలపాటి మధు
ఫొటోలు: ఎం. గోపీకృష్ణ