charector artist Rallapalli

90fab080-14c1-456a-a6c5-1105114ff728 ead8c1e6-59b7-4695-aa68-cef72b608bdf fc06506e-b8a1-414e-a8c1-e59bd6fbbd25

 

ప్రముఖ నటుడు రాళ్లపల్లి కన్నుమూత
 ప్రముఖ సినీ నటుడు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు (73) కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన ఈ రోజు తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం సాయంత్రం మాదాపూర్‌లోని మ్యాక్స్‌క్యూర్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. కళాకారుడు ఎప్పుడూ నిత్యవిద్యార్థే అని చెప్పే రాళ్లపల్లి 1960లో ముఖానికి రంగులు వేసుకొని నటనా జీవితానికి శ్రీకారం చుట్టారు. అనంతరం 1974లో ‘స్త్రీ’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన రాళ్లపల్లి.. శుభలేఖ, ఖైదీ, ఆలయ శిఖరం, మంత్రిగారి వియ్యంకుడు, అభిలాష, శ్రీవారికి ప్రేమలేఖ, సితార, ఆలాపన, న్యాయానికి సంకెళ్లు, ఏప్రిల్‌ 1 విడుదల, సూర్య ఐపీఎస్‌, దొంగపోలీసు, కన్నయ్య కిట్టయ్య, సుందరకాండ, భలే భలే మగాడివోయ్‌ తదితర 850కి పైగా చిత్రాల్లో నటించారు. 1945 ఆగస్టు 15న అనంతపురం జిల్లా కంబదూరులో జన్మించిన రాళ్లపల్లికి ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తె మృతి చెందగా.. మరో అమ్మాయి అమెరికాలో ఉంటున్నారు. రాళ్లపల్లి భౌతికకాయాన్ని నిమ్స్‌లోని మార్చురీకి తరలించారు. అమెరికా నుంచి ఆయన కుమార్తె వచ్చేంత వరకు అక్కడే ఉంచనున్నారు.

‘బొంబాయి’లో హిజ్రాపాత్రతో ఔరా అన్పించారు!
తెలుగు, తమిళ చిత్రాల్లో హాస్యనటుడిగా ప్రేక్షకుల్లో విశేష ఆదరణ పొందిన రాళ్లపల్లి.. సినీ ప్రస్థానంలో తన విలక్షణమైన నటనతో ఐదు నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. దాదాపు 3 దశాబ్దాలకుపైగా సినీ పరిశ్రమకు ఆయన విశేష సేవలందించారు. మణిరత్నం దర్శకత్వంలోని ‘బొంబాయి’ చిత్రంలో హిజ్రాగా నటించి ఔరా అన్పించారు. రాళ్లపల్లికి విద్యార్థి దశ నుంచే నాటకాల పట్ల ఎంతో మక్కువ. ఆ ఇష్టంతోనే 1974లో సినీ రంగ ప్రవేశం చేశారు. దాదాపు 8వేలకు పైగా  నాటకాల్లో నటించిన ఆయన చాలా భాగం నాటకాలకు స్వయంగా దర్శకత్వం వహించారు. కేవలం హాస్య నటుడిగానే కాకుండా విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాళ్లపల్లికి చిల్లరదేవుళ్లు, చలిచీమలు వంటి చిత్రాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. జంధ్యాల, వంశీ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు.  పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో రాళ్లపల్లి ఎంఫిల్‌ చేస్తున్నారు. రాళ్లపల్లి మృతిపట్ల తెలుగు చిత్రపరిశ్రమ ప్రముఖులు, సినీ అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

తెరపై ‘రాళ్లపల్లి’ పేరు వెనుక అసలు కథ..

హైదరాబాద్‌: విలక్షణ నటుడిగా తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న రాళ్లపల్లి శుక్రవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. రంగస్థల నటుడిగా కెరీర్‌ను ఆరంభించి,  వెండితెరపై నటుడిగా చెరగని ముద్రవేశారు. అయితే, ఆయన పూర్తిపేరు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు కాగా, ఇంటి పేరుతోనే ఆయన తెలుగువారికి సుపరిచితులు. అసలు ఆయన ఇంటి పేరే ఒంటిపేరు ఎలా అయిందని అడిగితే, గతంలో ఆయన పంచుకున్న విషయాలివి…

పేరు అలా మార్చేశారు!
‘‘బాపు దర్శకత్వంలో ‘తూర్పు వెళ్లే రైలు’తో నా పేరును రాళ్లపల్లి అని వేయడం ప్రారంభించారు. అంతకు ముందు నటించిన చిత్రాల్లో రాళ్లపల్లి వెంకట నర్సింహారావు అని, ఆర్వీ నర్సింహారావు అని వేసేవారు. ఒకరోజు బాపుగారు ‘ఎందుకండీ ఇంత పెద్ద పేరు. రాళ్లపల్లి బాగుంది కదా’ అని అనడంతో నేనూ సరేనన్నాను. ఆ సినిమా నుంచి టైటిల్స్‌లో అలా వేయడం మొదలు పెట్టారు. చెన్నైలో నన్ను అందరూ ముద్దుగా ‘స్టోన్‌ విలేజ్‌’ అని పిలిచేవారు. ఎన్టీఆర్‌ తనయుడు హరికృష్ణ  కూడా ‘స్టోన్‌ విలేజ్‌’ అని పిలిచి ఆటపట్టించేవారు. ఇక నా ఇంటిపేరును అచ్చ తెలుగులో చెప్పాంటే ‘శిలా గ్రామం’’.

సినిమాలు తీయడం మానేస్తానన్న బాపు
‘‘అప్పుడు నేను రైల్వే కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నా. ‘తూర్పు వెళ్లే రైలు’ సినిమా చేసే అవకాశం వచ్చింది. దీంతో ఉద్యోగానికి వెళ్తూనే ఆ సినిమాలో చేసేవాడిని. ఒకరోజు బాపుగారి దగ్గరకు వెళ్లి ‘సర్‌ నాది అసలే కాంట్రాక్టు ఉద్యోగం. ఈ సినిమా తర్వాత నా ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియదు.’ అని అంటే, ‘ఈ సినిమా విడుదల అయిన తర్వాత మీరు ఉద్యోగం చేయాల్సిన అవసరం రాదు. ఒకవేళ మీరే మళ్లీ ఉద్యోగం చేయాల్సి వస్తే, నేను సినిమాలు తీయడం మానేసి బొమ్మలు వేసుకుంటూ బతుకుతా.’ అని అన్నారు’’

‘బొంబాయి’లో అవకాశం అలా వచ్చింది
‘‘నేను చేసిన పాత్రల్లో ‘బొంబాయి’లోని హిజ్రా పాత్ర ప్రత్యేకం. ఆ పాత్రకోసం మణిరత్నంగారు ఒక నటుడిని వెతుకుతున్నారని తెలిసింది. అదే సమయంలో ఆయన దగ్గర కో-డైరెక్టర్‌గా పనిచేసే పాణిగారు నా పేరును సూచించారు. ఆ పాత్రకు నేనైతే న్యాయం చేస్తానని చెప్పారట. దీంతో ఆ సినిమాలో పనిచేసే అవకాశం వచ్చింది. నేను కూడా ఆ పాత్ర చేయడానికి అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే ఒక నటుడికి గుర్తింపు వచ్చిన తర్వాత అదే ఇమేజ్‌లో చూస్తారు. నేను స్టార్‌ని కాదు.. ఆర్టిస్ట్‌ను మాత్రమే. నేను నటించిన వాటిల్లో డిఫరెంట్‌ క్యారెక్టర్లు ఉన్నాయి. నేను కేవలం కమెడియన్‌ను మాత్రమే కాదు. నా అదృష్టం ఏంటంటే.. భారతీ రాజా, మణిరత్నం, రాజీవ్‌మేనన్‌, విశ్వనాథ్‌, జంధ్యాలలాంటి గొప్ప వ్యక్తుల సినిమాల్లో నటించా’’

భరణి నాకు భగవంతుడు ఇచ్చిన కొడుకు
‘‘కలిసొచ్చే కాలం వస్తే, నడిచొచ్చే కొడుకు పుడతాడని సామెత ఉంది కదా! అలా భగవంతుడు ఇచ్చిన కొడుకు తనికెళ్ల భరణి. 1966-70 మధ్యలో ఇద్దరం కలిసి నాటకాలు వేసే వాళ్లం. తను మా కుటుంబంలో సభ్యుడైపోయాడు. అతనిలో మంచి రచయిత ఉన్నాడని అప్పుడే తెలుసు. ‘ప్రేమించు పెళ్లాడు’ సినిమా నిడివి తగ్గడంతో వంశీగారికి తనికెళ్ల భరిణిని నేనే పరిచయం చేశా. అంతకుముందు తను ‘కంచు కవచం’ సినిమాకు రచయితగా పనిచేశాడు. నాకు, రాజేంద్రప్రసాద్‌, వై. విజయలకు కామెడీ సీన్లు రాస్తే బాగా పండాయి. ఆ తర్వాత ‘లేడీస్‌ టైలర్‌’ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. అలా మా ప్రయాణం సాగింది’’

ఫోన్‌ చేసి ఉంటే రంగనాథ్‌ బతికి ఉండేవారేమో!
‘‘రంగనాథ్‌ చనిపోయే ఒక్కరోజు ముందు నేను ఏదో మలయాళ సినిమాకు తెలుగు డబ్బింగ్‌ చెబుదామని స్టూడియోకు వెళ్లా. లోపలికి వెళ్లే సమయంలో నా ఫోన్‌ ఒక వ్యక్తికి ఇచ్చి వెళ్లాను. అదే సమయంలో రంగనాథ్‌ ఫోన్‌ చేశారట. అయితే, బయటకు రాగానే ఆ వ్యక్తి రంగనాథ్‌ ఫోన్‌ చేసిన విషయం నాకు చెప్పలేదు. సాయంత్రం ఎప్పుడో చెప్పాడు. ‘తర్వాత మాట్లాడదాం లే’ అన్న ఉద్దేశంతో నేనూ అశ్రద్ధ చేశా! కానీ, మరుసటి రోజు ఆయన మరణవార్త విని  దిగ్భ్రాంతికి గురయ్యా. ఆ రోజు నేను ఫోన్‌ చేసి ఉంటే, నాతో ఏం మాట్లాడేవారో.. అందుకు నేను ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నా’’

 

4a838991_08-crop--581a06