‘తుపాకి రాముడు’తో కథానాయకుడవుతున్నారంట?
చిన్న డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మొదలైన నా ప్రయాణం సినిమాల వరకు వెళ్లిందంటే అదంతా ప్రేక్షకుల దయే. ఏ పని చేతకాని ఒక వ్యక్తి అందరికి ప్రయోజనం చేకూర్చే ఒక పెద్ద పనిని ఎలా చేశాడో చెబుతుందీ చిత్రం. ఈ చిత్రంలో నేను కథానాయకుడిగా నటించా.
డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎదిగేప్పుడు పడిన కష్టాలేంటి?
ఆ జీవితం ఏమాత్రం సాఫీగా సాగలేదు. ఎన్నో కష్టాలు పడ్డా. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సభ్యత్వం పొందడానికి ఆఫీసు ముందు గంటల తరబడి నిలబడేవాడిని. ‘నేను మిమిక్రీ చేస్తాను, పాటలు పాడతా. అందుకే డబ్బింగ్ ఆర్టిస్ట్ కావాలని వచ్చా’ అని చెబితే ముఖం మీదే నవ్వేవారు. నాకు మిమిక్రీ వచ్చు. చిన్న చిన్న వేడుకలకు స్నేహితులు, బంధువుల ముందు వివిధ పాత్రలతో మిమిక్రీ చేసేవాడిని. ముకుంద రెడ్డి అనే వ్యక్తి మా ఇంటి పక్కనే ఉండేవాడు. అతడిని గమనిస్తూ ఉండేవాడిని. నా ఈ బిత్తిరి సత్తి పాత్రకు ప్రేరణ ఆయనే. యూనిట్‌లో ఉన్నవారందరిని అనుకరించి చూపించేవాడిని. ఆ సమయంలోనే వ్యవసాయానికి చెందిన ఒక ఎన్జీవోలో పనిచేసేవాడిని. అప్పుడు నా జీతం నెలకు పద్దెనిమిది వందలు. 2000 నుంచి 2005వ సంవత్సరం వరకు ఈ ఉద్యోగం చేస్తూనే అవకాశాల కోసం ప్రయత్నించేవాడిని. 2005లో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా జీవితం మొదలైంది. పదేళ్లపాటు డబ్బింగ్ చెప్పా.
అవకాశాల కోసం చేసిన ప్రయత్నాలు?
శబ్దాలయా డబ్బింగ్ థియేటర్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే కృష్ణను పరిచయం చేసుకున్నా. జనరేటర్ రూమ్ పక్కనే చిన్న గదిలో తను ఉండేవాడు. నేనూ తనతో కలిసి అక్కడే ఉండేవాడిని.. అక్కడికి ఎవరు ప్రముఖులు వచ్చినా తను నన్ను పరిచయం చేసేవాడు. అలా డబ్బింగ్ చెప్పే అవకాశాలు పెరిగాయి. డబ్బింగ్ చెబుతూనే సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవాడిని.
మొదట వీ6లో అవకాశం వచ్చినా వదులుకున్నారట…?
మొదట 6టీవీలో అవకాశం వచ్చింది. ‘నర్సయ్య తాతా’ అనే ఒక గెటప్‌తో ఎంట్రీ ఇచ్చా. అప్పుడు నాకు ఇచ్చిన జీతం ఎంతో తెలుసా అక్షరాలా ముప్పయివేల రూపాయలు. అప్పుడే వీ6 ఛానెల్ నుంచి పిలుపు వచ్చింది. కావలి రవికుమార్‌ను బిత్తిరి సత్తిగా ఈ ఛానెల్‌ను మార్చేసింది. ఈ బిత్తిరి సత్తి అనే పాత్ర… నాలుగు రకాల పాత్రల సమ్మేళనం. నలుగురు మానసిక రోగులను కలిపి ఈ పాత్రను రూపొందించా. జీతం ఎంత కావాలని అడిగారు. 35,000 కావాలని అడిగా. వారు 30,000 ఇస్తామన్నారు. నేను చేయనని చెప్పా. అలా చేతికి అందిన అవకాశాన్ని చేజార్చుకున్నా. తరువాత నేను పనిచేస్తున్న ఛానెల్ నుంచి బయటకు వచ్చేశా. మళ్లీ వీ6కి వెళ్లా. వాళ్లు కుదరదన్నారు. ఒప్పించడానికి ప్రయత్నించా. రెండు నెలల తరువాత అవకాశమిచ్చారు.
బిత్తిరి సత్తి పాత్ర ఎలా మొదలైంది?
ఈ పాత్రకు కావాల్సిన దుస్తులను నేనే డిజైన్ చేశా. పూల చొక్కా, చిన్న లాగు, చిన్న క్రాఫ్‌తో బిత్తిరి సత్తి కనిపిస్తాడు. మొదటి రోజు ఏం చేయాలో తెలియదు? ఎలా చేయాలో అర్థం కాలేదు.‘ఆడ దావత్ అయితే యాటను కోసిండ్రు మస్తు తిన్నా.. నువ్వు కూడా వస్తవా అక్కా’.. ‘యే మీది మోటరు మీది మోటరు… అంటూ కింద పడ్డా. ‘ఏ ఎవర్రా నూకెసిండ్రూ’ అంటూ వెనక్కి చూసి అరుగు తగిలిందా నేనెవరో నూకిసిండ్రు అనుకున్నా’ అంటూ ఇలా పాత్రలను చేసి చూపించా. వాళ్లకు నచ్చడంతో టెలీకాస్ట్ చేసేశారు.
ఈ మార్గంలోకి వస్తానన్నప్పుడు అమ్మానాన్న ఏమన్నారు?
నాన్న వీధినాటకాలు (యక్షగానం) వేసేవారు. ఈ నాటకాల కోసం ఆస్తులనూ అమ్మేశారు. ఆయనకు కళ అంత ఇష్టం. ఆయన దగ్గర నుంచే నాకు ఈ కళ అబ్బిందనుకుంటా. అమ్మకు మాత్రం నాపై బెంగగా ఉండేది. నాన్న ఎప్పుడూ వద్దనలేదు.
వ్యవసాయం చేశా నాతో పెరిగిన నా తోటి వారు ఒక్కోరూ ఒక్కో రంగంలో ఎదిగిపోయారు. అప్పుడే నాకనిపించింది. నాకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని. దాంతో వ్యవసాయం వైపు దృష్టి సారించా. అలా 2010లో పాలీహౌస్‌లో జర్బరా పూలను సాగు చేశా. ఆర్థికంగా బాగా నిలదొక్కుకున్నా. వ్యవసాయం చేసుకుంటూనే అవకాశాల కోసం ఆఫీస్‌ల చుట్టూ కారేసుకుని తిరిగేవాడిని. |
తట్టుకోలేక ఏడ్చేశా ఒక సినిమాలో పాత్ర అడగడం కోసం దర్శకుడిని కలవడానికి నా ఫొటోలు తీసుకుని వెళ్లా. ఆ సమయంలో అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు. ఆయన నన్ను అస్సలు పట్టించుకోలేదు. ఆ సందర్భంలో నేను ఫొటోలు ఇవ్వడంతో అతను చిరాగ్గా వాటిని నా ముఖంపైకి వేసిరేశాడు. అవి వచ్చి నా కంటికి తగిలాయి. బాధ తట్టుకోలేక ఏడ్చేశా. |
తేనేటీగలు కుట్టాయి వారం రోజుల్లో మా అక్క పెళ్లి. నేను, తనూ కలిసి పొలానికి వెళ్లాం. తను తేనె కావాలంటే తేనె తుట్టెను రాయితో కొట్టా. ఆ తేనెటీగలు వచ్చి అక్కనూ నన్నూ కుట్టాయి. అక్కకు నోటి దగ్గర కుట్టాయి. ఇంటికి వెళ్లాం. నేను చేసిన పనికి నాన్న చేతుల్లో నాకు పడిన దెబ్బలు ఇప్పటికీ గుర్తే. |
-ప్రమీల పుట్టిగారి