తెలుగు పరిశ్రమలో ఉన్న కొద్దిమంది కండల వీరుల్లో కార్తికేయ గుమ్మకొండ ఒకడు. ‘ఆర్‌ఎక్స్ 100’లో శివ పాత్రద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాడు. వరస సినిమాలతో మన ముందుకు వస్తోన్న కార్తికేయని పలకరించి సినిమా, ఫిట్‌నెస్, కాలేజీ రోజుల గురించి అడిగితే ఏం చెబుతున్నాడంటే…
ఏం చదువుకున్నారు?అమ్మానాన్నా టీచర్లు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో నాగార్జున హైస్కూల్స్ మావే. నాచేత సాధ్యమైనంతమేర చదివించేవారు. కేవలం ఆదివారంనాడు మ్యాట్నీకి వెళ్లినపుడు మాత్రమే పుస్తకంతో గ్యాప్ ఉండేది. నన్ను అమ్మ చదివించిన తీరుకి వేరొకరైతే కచ్చితంగా ఐఐటీలో ఉండాల్సిందే. నేను కాబట్టి ఎన్‌ఐటీ వరంగల్‌లో చేరాను. అక్కడ కెమికల్ ఇంజినీరింగ్ చేశాను. |
ఫిట్‌నెస్ రహస్యం?తిండి విషయంలో పెద్దగా నియమాలేవీ పెట్టుకోను. రైస్, చపాతీ, ఫిష్, చికెన్… ఇలా ఇంట్లో వండేవన్నీ తింటాను. మిల్క్‌షేక్‌లు, ఐస్‌క్రీమ్, పిజ్జాబర్గర్లు మాత్రం తినను. షూటింగ్ లేకపోతే ఒక పూటంతా జిమ్‌లోనే ఉంటాను. మార్షల్ ఆర్ట్స్ చేస్తాను. కిక్ బాక్సింగ్ రెగ్యులర్‌గా ప్రాక్టీసు చేస్తాను. |
సినిమాపిచ్చి ఎలా?సినిమా చూస్తూ భలే ఎంజాయ్ చేసేవాణ్ని. చూసి వచ్చేయడం కాదు, డైలాగుల్ని ఫ్రెండ్స్‌తోనూ చెప్పేవాణ్ని. చిరంజీవిగారి పాటలు… రామ్మా చిలకమ్మా, కొడితే కొట్టాలిరా, శంకర్‌దాదా ఎంబీబీఎస్ టైటిల్ సాంగ్… వీటిలో అన్ని స్టెప్పుల్నీ అలాగే దించేసేవాణ్ని. ఇంజినీరింగ్‌కి వెళ్లాక క్లాసులోకన్నా స్టూడెంట్ యాక్టివిటీస్ క్లబ్ దగ్గరే ఎక్కువగా ఉండేవాణ్ని. |
ఆర్‌ఎక్స్ 100కి ముందు?ఇంట్లో ఓకే చెప్పాక యాక్టింగ్ కోర్సులో చేరాను. మరోవైపు ఫిట్‌నెస్ పెంచుకున్నాను. షార్ట్‌ఫిల్మ్స్ చేశాను. నా మొదటి సినిమా ‘ప్రేమతో మీ కార్తీక్’ బాగా ఆడలేదు. తర్వాత అజయ్ భూపతి ‘ఆర్‌ఎక్స్ 100’లో ఛాన్స్ ఇచ్చాడు. నేను పడుతున్న కష్టం చూసి బాబాయి అశోక్ నిర్మాతగా ఉంటానని ముందుకొచ్చారు. తర్వాత వచ్చిన ‘హిప్పీ’ అంతగా ఆడలేదు. ‘గుణ 369’ నటుడిగా సంతృప్తినిచ్చింది. |
ఇంట్లో ఒప్పుకున్నారా..?‘ఎన్‌ఐటీలో చదువుతున్నాడు. తర్వాత యూఎస్ వెళ్తాడు…’ అని అందరికీ చెప్పేవాళ్లు అమ్మానాన్నా. సినిమా అనేసరికి ఇంట్లో చిన్నపాటి యుద్ధం జరిగింది. ‘నేను ఇంకేదైనా రంగంలో ఉండి కోట్లు సంపాదించినా సినిమా పోస్టర్ చూసిన ప్రతిసారీ సినిమాల్లోకి వెళ్లలేకపోయానే అనిపిస్తుంది’ అని చెప్పి ఒప్పించాను. |
విలన్‌గా ఎందుకు?నానీ ‘గ్యాంగ్‌లీడర్’లో నా పాత్ర విన్నాక ఛాలెంజింగ్‌గా అనిపించింది. హీరోగా కొన్ని ఎమోషన్స్ మాత్రమే పలికించగలం. ఉదాహరణకు శాడిజాన్ని హీరో పాత్ర చూపించలేదు. అందుకే ఈ సినిమా చేయడానికి సిద్ధమయ్యాను. నటుడిగా నాలోని మరో కోణం చూస్తారిందులో. |