Artist Naveen Chandra

ప్రస్తుతం కథే కింగ్‌

నా జీవితం ఎత్తుపల్లాలు లేకుండా సాగిపోతోందని చెప్పను. మంచి స్ర్కిప్ట్‌లు, పాత్రలు నా దగ్గరకు రాకపోయినా… నేనే వాటిని వెతుక్కుంటూ వెళ్తున్నా.

ప్రస్తుతం కథే కింగ్‌

 ‘హీరోగానే చేస్తా’ అనకుండా.. విభిన్నమైన పాత్రలు పోషించడానికి సిద్ధపడే నటుల్లో నవీన్‌చంద్ర ఒకరు. భానుమతి రామకృష్ణ’, ‘అమ్ము’ వంటి చిత్రాల ద్వారా మంచి నటుడిగా పేరు సంపాదించుకున్న నవీన్‌చంద్ర… ‘తగ్గేదేలే’ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కర్ణాటకలోని బళ్లారిలో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నవీన్‌చంద్ర తన ప్రస్థానాన్ని ‘నవ్య’తో పంచుకున్నారు.

‘నేను పుట్టింది సికింద్రాబాద్‌లో. పెరిగింది మాత్రం కర్ణాటకలోని బళ్లారిలో. నాన్న కర్ణాటక స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (కేఆర్‌టీసీ)లో పనిచేసేవారు. చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. నేను పదో తరగతిలో ఉండగా నాన్న అనారోగ్యంతో చనిపోయారు. దీంతో కుటుంబం భారమంతా నాపైన, అన్నయ్యపైన పడింది. ఇద్దరం పనిచేస్తే కానీ కుటుంబం నడవని పరిస్థితి! దీంతో నేను కొరియోగ్రాఫర్‌గా పని చేయటం మొదలుపెట్టా. కాలేజీ ఫంక్షన్స్‌, సంగీత్‌లు… ఇలా రకరకాల కార్యక్రమాల్లో డ్యాన్స్‌లు చేసేవాడిని. డ్యాన్స్‌ నేర్పేవాడిని. కొన్నాళ్ల తర్వాత నేను, అన్నయ్య సతీష్‌ కలిసి మా అక్క పెళ్లి చేయగలిగాం. ఆ తర్వాత నాకున్న ప్రత్యామ్నాయాలు రెండు. ఒకటి అక్కడే కొరియోగ్రాఫర్‌గా స్థిరపడిపోవడం. రెండోది నా కలల ప్రపంచమైన సినిమా రంగంలోకి రావడం. ఆ సమయంలో అన్నయ్య నన్ను ప్రోత్సహించి హైదరాబాద్‌కు పంపాడు. రెండు వేలు చేతిలో పట్టుకొని హైదరాబాద్‌ ట్రైన్‌ ఎక్కి వచ్చేశా.

తేజ ఇచ్చిన భరోసా…

హైదరాబాద్‌కు వచ్చాను కానీ… ఇక్కడ నాకు ఎవరూ తెలియదు. సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవాడిని. ఆ సమయంలో నాకు పరోక్షంగా భరోసా ఇచ్చింది తేజ గారు. ఆయన తన సినిమాల్లో కొత్త నటులకు అవకాశాలు ఇచ్చేవారు. దీని కోసం పత్రికల్లో ప్రకటనలు ఇచ్చేవారు. వాటిని పట్టుకొని అందరం ఆయన ఆఫీసుకు వెళ్లేవాళ్లం. క్యూలలో నిలబడి ఆడిషన్లు ఇచ్చేవాళ్లం. కొందరికి అవకాశాలు వచ్చేవి. తేజగారి గురించి ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నానంటే- నాలా ఏ పరిచయాలూ లేకుండా హైదరాబాద్‌ వచ్చేసిన అనేక మందికి ఆయన ప్రకటనలు భవిష్యత్తు మీద ఆశలు కల్పించేవి. ఆ సమయంలో రామానంద్‌ అనే కాస్టింగ్‌ డైరక్టర్‌ ఉండేవారు. ఆయన తేజ గారితో సహా అనేక మంది దగ్గర పనిచేసేవారు. ఆయన నాకో ఆఫర్‌ ఇచ్చారు. ‘‘నీకు చిన్న రోల్‌ ఇస్తాం. దాని వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. నువ్వు నా డ్యాన్స్‌ స్కూల్లో పనిచేయి. డబ్బు సంపాదించుకుంటూనే యాక్టింగ్‌ నేర్చుకో. అవకాశాల కోసం ట్రై చేయి. అప్పుడు స్థిరపడతావు’’ అన్నారు. దాంతో ఒక వైపు డ్యాన్స్‌ స్కూల్లో పని చేస్తూనే మరో వైపు వేషాల కోసం ప్రయత్నించేవాడిని. ఆ సమయంలోనే ‘సంభవామి యుగేయుగే’ సినిమాలో అవకాశం వచ్చింది. అది పెద్దగా ఆడలేదు. మరో రెండు సినిమాలు చేశా. అవి విడుదల కాలేదు. వీటివల్ల పేరు రాలేదు కానీ రోజువారీ ఖర్చులు గడిచిపోయేవి. ఇలా కొద్ది కాలం గడిచిన తర్వాత ‘అందాల రాక్షసి’ సినిమా వచ్చింది. ఇక అక్కడి నుంచి వేషాల కోసం వెనక్కి తిరిగి చూసుకోలేదు.

మరో మలుపు…

ఆ రోజుల్లో నేను మంచి స్ర్కిప్ట్‌ల కోసం వెతుకుతూ ఉండేవాడిని. హీరో వేషం వస్తే తప్ప చేయకూడదని అనుకొనేవాడిని. దాంతో నెలల తరబడి ఖాళీగా ఉండేవాడిని. ఆ సమయంలో నాకు రాజారవీంద్ర పరిచయమయ్యారు. ‘‘నువ్వు అనుకుంటున్న మంచి స్ర్కిప్ట్‌లు నీ దగ్గరకు ఎప్పుడొస్తాయో తెలియదు. నువ్వు ఒక నటుడివి. హీరో, విలన్‌, క్యారెక్టర్‌ యాక్టర్‌- ఇలాంటి భేదాలు లేకుండా అన్ని రకాల పాత్రలూ చేయాలి. అప్పుడు అందరికీ నువ్వు ఎవరో తెలుస్తుంది. నీలో ఉన్న టాలెంట్‌ గుర్తించగలుగుతారు. ఆ తర్వాత పాత్రలు వాటంతట అవే వస్తాయి’’ అని చెప్పారు. ఆ మాటలు నా కెరీర్‌ని మలుపు తిప్పాయి. నన్ను ప్రోత్సహించి పంపించిన మా అన్నయ్య, ఇంత కాలం నాకు అన్ని విధాలుగా అండగా నిలబడుతున్న రాజా రవీంద్రలను ఎప్పటికీ మరిచిపోను. వారిద్దరూ నాకు తండ్రి సమానులు.

లాక్‌డౌన్‌ బ్లూస్‌…

లాక్‌డౌన్‌ సమయంలో పూర్తిగా అనిశ్చితి ఏర్పడింది. సినిమాల షూటింగ్స్‌ ఆగిపోయాయి. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితి. ఓటీటీలు కూడా ఎక్కువ సినిమాలు కొనటం మానేశాయి. ఇలాంటి పరిస్థితిలో కూడా నాకు మంచే జరిగింది. ‘అమ్ము, భానుమతి రామకృష్ణ, తగ్గేదేలే’ వంటి సినిమాలు వచ్చాయి. వీటిలో ఇటీవలే విడుదలయిన ‘అమ్ము’ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఫస్ట్‌ఆఫ్‌, సెకండాఫ్‌, ఇంట్రవెల్‌ బ్యాంగ్‌… ఇలా కాకుండా ప్రేక్షకులకు హత్తుకొనే ఒక కథను చెప్పాలనుకున్నాం. ఈ చిత్రంలో భార్యను హింసించే భర్త పాత్ర నాది. అసలు అలాంటివారు ఎలా ఉంటారు? వారి భార్యలు వారిని ఎలా భరిస్తారు? ఆ సమయంలో భార్యలకు ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటి? అలాంటి అనేక విషయాలపై అనేక మందితో మాట్లాడా! ఈ సినిమా విడుదలైన తర్వాత వచ్చిన రెస్పాన్స్‌ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. చాలా మంది మగవాళ్లు భర్త పాత్రతో తమను తాము పోల్చుకుంటున్నారు. ఈ సినిమా చూసి వారందరూ మారిపోతారని.. వారిలో పరివర్తన వస్తుందని నేను భావించటంలేదు. కానీ వారిలో చిన్న పశ్చాతాపం కనిపిస్తోంది. ఈ విషయాన్ని నాకు వారు ఫోన్‌ చేసి చెబుతున్నప్పుడు సంతృప్తిగా అనిపిస్తోంది.

ఇక ‘తగ్గేదేలే’

విషయానికి వస్తే… దీనిని ఒక లవ్‌ స్టోరీగా మొదట అనుకున్నారు. ఆ తర్వాత ‘దండుపాళం’ బ్యాచ్‌ను కథలో భాగస్వాములను చేశారు. ‘దండుపాళం’ బ్యాచ్‌కు ప్రేక్షకుల్లో ఒక క్రేజ్‌ ఉంది. ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.

చివరగా…

నా జీవితం ఎత్తుపల్లాలు లేకుండా సాగిపోతోందని చెప్పను. మంచి స్ర్కిప్ట్‌లు, పాత్రలు నా దగ్గరకు రాకపోయినా… నేనే వాటిని వెతుక్కుంటూ వెళ్తున్నా. ‘పరంపర, అమ్ము, భానుమతి రామకృష్ణ’లలో చేసిన పాత్రలలాంటివి మరిన్ని చేయాలనేది నా ఉద్దేశం. ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు ఏ చిత్రాలను ఆదరిస్తారో.. ఏ చిత్రాలను తిరస్కరిస్తారో తెలియటం లేదు. కానీ మంచి కంటెంట్‌ ఉంటే ఆదరిస్తారనే నమ్మకం మాత్రం ఉంది. ‘కాంతార, ఆర్‌ఆర్‌ఆర్‌’లే దీనికి ఉదాహరణలు. అందుకే ప్రస్తుతం కథే కింగ్‌. మంచి కథలలో నేను భాగస్వామిని అయితే చాలు!

నాలాంటి నటులకు మంచి రోజులు…

ఓటీటీ వచ్చిన తర్వాత నాలాంటి నటులకు మంచి రోజులు వచ్చాయి. ఇంతకుముందులా అన్ని చిత్రాలనూ చూడటానికి ప్రేక్షకులు థియేటర్‌కు రావటం లేదు. అందువల్ల కొన్ని రకాల సినిమాలు థియేటర్‌లో విడుదల చేస్తే ఎంత మంది చూస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో ఓటీటీ ఒక మంచి ప్రత్యామ్నాయంగా మారింది. మంచి కథ ఉన్న సినిమాలకు తప్పనిసరిగా ఆదరణ లభిస్తోంది. ఉదాహరణకు ‘భానుమతి రామకృష్ణ, అమ్ము’లాంటి సినిమాలు థియేటర్‌లలో విడుదలైతే వాటికి ఎలాంటి స్పందన వచ్చేదో తెలియదు. ఓటీటీలో విడుదల అయ్యాయి కాబట్టే మంచి ఆదరణ లభించిందని భావిస్తున్నా.