మంచి నీళ్లు అడిగితే… మందు ఇచ్చాడు
‘చిట్టీ నీ నవ్వంటే లక్ష్మీ పటాసే… ‘జాతిరత్నాలు’లో ఫరియా అబ్దుల్లాని చూసి ఇలానే పాడుకొని ఉంటారు కుర్రాళ్లు. నిజానికి ఫరియా… నవ్వే కాదు… మనిషి కూడా పటాసే! ఎప్పుడూ చిచ్చుబుడ్డిలా విరబూస్తూనే ఉంటుంది. మతాబులా వెలుగుతూనే ఉంటుంది. టెన్ థౌజెండ్ వాలాలా.. సౌండ్ చేస్తూనే ఉంటుంది. ఫరియాలో చాలా కళలున్నాయి. తనో మంచి క్లాసికల్ డ్యాన్సర్. కవిత్వం రాస్తుంది. బొమ్మలూ వేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సకల కళా వల్లభిని. తను నటించిన ‘లైక్ షేర్ సబ్‌స్ర్కైబ్’ త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా చిట్టితో చిట్ చాట్!
పుట్టి పెరిగింది.. హైదరాబాద్‌లోనే. అయినా తెలుగు నేర్చుకోలేదు ఎందుకు?
ఆ అవసరం రాలేదు. ఇంట్లో ఉర్దూ మాట్లాడుకొంటాం. బయట ఫ్రెండ్స్‌తో చిట్‌చాట్ అంతా హైదరాబాదీ హిందీలో. కాలేజీలోనూ అంతే. ఇప్పుడు నా తెలుగు కొంచెం బెటర్. ‘జాతిరత్నాలు’ సమయంలో నా తెలుగు వింటే జడుసుకొందురు.
తెలుగు నేర్చుకోవడానికి ఎలాంటి కసరత్తు చేశారు?
నా చుట్టూ ఉన్నవాళ్లతో తెలుగులోనే మాట్లాడుతున్నా. తెలుగు పాటలు వింటున్నా. అందులో స్పష్టమైన తెలుగు పదాలు ఉంటాయి కదా.. అలా మెల్లమెల్లగా తెలుగు వచ్చేసింది. ‘జాతిరత్నాలు’ సినిమాకు నా డబ్బింగ్ నేనే చెప్పుకొన్నా. నా పాత్రకు ఎవరో డబ్బింగ్ చెబుతుంటే.. నా గొంతు పట్టేసినట్టు అనిపిస్తుంది. అందుకే కాస్త కష్టమైనా సొంత గొంతే వినిపించడానికి ప్రయత్నిస్తున్నా.
మీది సంప్రదాయ ముస్లిం కుటుంబం. ఇంట్లో సినిమాలంటే ఒప్పుకొన్నారా?
అమ్మ ముస్లిం. నాన్న కన్వెర్టెడ్ ముస్లిం. ఇస్లాంలోని పద్ధతులు, సంప్రదాయాలు నచ్చి ఆయన మతం మారారు. ఇంట్లో అన్నిరకాల పండగలూ జరుపుకొంటాం. రంజాన్, దీపావళి, హోళీ, ఓనం.. ఇలా మా ఇంటికి నెలకు రెండు మూడు పండుగలు వస్తుంటాయి. సంప్రదాయాల విషయంలో మరీ అంత పట్టు లేదు. అలాగని వాటిని వదులుకోలేదు. ఇంట్లో కూడా నాకు కావల్సినంత స్వేచ్ఛ ఇచ్చారు. స్వేచ్ఛ పేరుతో కట్టడి చేయాలని చూస్తే… పిల్లలు మొండిగా తయారైపోతారని వాళ్లకు బాగా తెలుసు.
ఖురాన్ పఠనం.. నమాజ్ చదవడం… ఇవన్నీ ఉన్నాయా?
హా..అరబ్బీ క్లాసులకు వెళ్లేదాన్ని. కానీ ఏం అర్థమయ్యేది కాదు. అర్థంకానిది ఎంతని చదువుతాం! అందుకే పక్కన పెట్టేశా. నాన్న మాత్రం ఖురాన్‌లో విషయాలకు అర్థం చెప్పేవారు. అవి మాత్రం చెవికి బాగా ఎక్కేవి. నమాజ్ అంటారా.. అది తప్పనిసరి. రంజాన్ రోజుల్లో ఉపవాసాలు కూడా ఉండేదాన్ని. అయితే ఇప్పుడు కుదరడం లేదు. కానీ ఉపవాసం శరీరానికి చాలా మంచిది.
ఫరియా అబ్దుల్లా నటిగానే తెలుసు. నటి కాకుండా మీరేంటి?
నటన నా జీవితంలో చాలా చిన్న భాగం. వాటికి మించిన విషయాలు నాలో చాలా ఉన్నాయి. నేనో క్లాసికల్ డ్యాన్సర్‌ని. దాదాపు అన్నిరకాల నృత్య రీతులూ నేర్చుకున్నా. స్టేజీ షోలు చేశా. పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. ట్రావెలింగ్ చేస్తా. కవిత్వం రాస్తా. ఒంటరిగా ప్రయాణం చేయడానికి ఎక్కువ మక్కువ చూపిస్తుంటా. సినిమాలో 24 విభాగాలుంటే వాటన్నింటి గురించి తెలుసుకోవాలని ఉంది. ఎప్పటికైనా దర్శకత్వం వహిస్తా.
నాట్యంపై మక్కువ ఎప్పటి నుంచి?
నిజానికి నేనో ఇంట్రావర్ట్‌ని. నలుగురిలో కలవడానికి భయపడతా. అలాంటి నేను.. చిన్నప్పుడు ఓ పార్టీకి వెళ్లాను. అక్కడ ‘నాకు ఈ పాట కావాలి.. అది ప్లే చేయ్…’ అని అడిగి మరీ ఓ పాట పెట్టించుకొని, ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ చేశా. నన్ను చూసి మా అమ్మా, నాన్న ఆశ్చర్యపోయారు. ‘ఇదేంటి.. దీనికి ఏమైంది’ అని కంగారు పడ్డారు. నాకు మాత్రం ‘నాలో ఏదో ఉంది’ అని అర్థమైంది. డ్యాన్స్ రూపంలో నాకో వ్యాపకం అలవాటైంది. అద్దం కనిపిస్తే.. దాని ముందు నిలబడి, సంగీతం లేకపోయునా సరే.. కాళ్లూ, చేతులూ ఆడిస్తూనే ఉంటా. ఇలా సంగీతంతో సంబంధం లేకుండా డ్యాన్స్ చేసేవారు నాలానే వేలమంది ఉన్నార్ట. వాళ్లంతా ఓ గ్రూప్‌లా తయారయ్యారు. నేనూ అందులో భాగస్వామిని అయిపోయా.
ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా రిస్క్ అనిపించిందా?
ఓసారి… అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్‌కి వెళ్లా. వెళ్లాల్సిన దూరం చాలా ఉంది. బాగా దాహం వేసింది. అటువైపు నుంచి వస్తున్న ఓ వ్యక్తిని ఆపి మంచి నీళ్లు అడిగా. తను కూడా వెంటనే ఓ బాటిల్ తీసి ఇచ్చాడు. ఓ గుటక వేశానంతే. అదేదో తేడా అనిపించింది. తీరా చూస్తే అది మంచి నీళ్లు కాదు… మందు. ‘ఇదేంటి ఇలా ఉంది’ అని అడిగితే.. అప్పుడు వాటర్ బాటిల్ అందించాడు. ఈలోగా నేను వెంటనే అలెర్ట్ అయిపోయా. ఇప్పుడు చెబితే నవ్వొస్తుంది కానీ… అప్పుడు ఓ చాకీచాన్ పోజ్ తీసుకొని, కొట్టేయడానికి సిద్ధపడ్డా. బ్యాగులోంచి ఓ చాకు కూడా బయటకు తీశా. అదృష్టం కొద్దీ ప్రమాదమేం జరగలేదు.
సినీ పరిశ్రమలో అమ్మాయిలకు రక్షణ ఉందా?
ఉంది కాబట్టే… ఇంతమంది కథానాయికలు రాగలుగుతున్నారు. ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి. మీరు క్లియర్‌గా ఉంటే… లోకం నీట్‌గా కనిపిస్తుంది. నేనెలా ఉన్నా? అనేది చాలా ముఖ్యం.ఇంట్లో స్వేచ్ఛ ఇచ్చారు కదాఅని దాన్ని అలుసుగా తీసుకోను. నేనేదో ఫ్రీగా మూవ్ అవుతున్నా కదా అని మిగిలిన వాళ్లు నా దగ్గర చనువు తీసుకోరు.
‘జీవితంలో అనుభవాలు ముఖ్యమని నమ్మేదాన్ని నేను. అందుకే రూపాయి లేకుండా ఎలా బతకాలో కూడా నేర్చుకొన్నా. ఎం.ఎం.టీ.ఎస్, ఆటో రిక్షా, ఆర్టీసీ బస్.. వీటన్నింటిలోనూ ప్రయాణం చేశా. ఎక్కడికైనా ట్రావెలింగ్ చేయాలంటే.. బడ్జెట్ వేసుకొని, అందులోనే ఆ టూర్ పూర్తి చేసేదాన్ని. ఇప్పుడు సినిమాల్లోకి వచ్చా. నాకంటూ నేను సంపాదించుకొంటున్నా. ఇప్పుడు లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నా. ఇప్పుడు కూడా సౌకర్యాలకూ, విలాసాలకూ దూరంగా ఉండాలనుకొంటే ఎలా..? చెప్పాను కదా.. జీవితంలో అన్నీ ముఖ్యమే అని. అన్నీ ఆస్వాదించాలి. అందుకే ఏదైనా మంచి డ్రస్ కనిపిస్తే.. ఖరీదు గురించి ఆలోచించకుండా కొనేస్తా’’
‘‘నాకు లెక్కలంటే పడదో.. లెక్కలకే నేనంటే పడదో అర్థమే అయ్యేది కాదు. ఎందుకంటే… స్టెప్స్ అన్నీ బాగా వేసేదాన్ని. కానీ ఆన్సర్ మాత్రం తప్పుగా వచ్చేది. ఫిజిక్స్ – మాథ్స్ కవల పిల్లలు. దానికీ నాకూ అదే సమస్య. పదో తరగతి ఎప్పుడు పూర్తవుతుందా? అని ఎదురు చూశాను. ఇంటర్‌లో అయితే ఎంపీసీ, బైపీసీ, లేదంటే సీఈసీ. కామర్స్ కూడా లెక్కలే కాబట్టి… ఏ గ్రూపులోనూ జాయిన్ అవ్వలేదు. అందుకే ఈ లెక్కల గోల లేకుండా ప్రైవేటుగా ఓ కోర్సు చేశా