Director Jeetu Josef (Drusyam)

ప్రేమ, సినిమా… ఏది కావాలో తేల్చుకో… అంది!

 

ఏడేళ్ల క్రితం దృశ్యం, ఇప్పుడు దృశ్యం-2…! ఉత్కంఠతో ప్రేక్షకుల గుండె లయని పరుగులెత్తించడమే కాదు… వాళ్ల కళ్లనీ తడిచేయడం వల్లే ఈ సినిమాలు కోట్లు కురిపిస్తున్నాయి. దేశంమెచ్చిన ఈ చిత్రాల సృష్తికర్త జీతూ జోసఫ్‌. ఓ పెద్ద సంక్షోభాన్ని ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం ‘ఒకరి కోసం ఒకరం’ అన్నట్టు ఎదుర్కొనే తీరే ఈ సినిమాలని మిగతా క్రైమ్‌ థ్రిల్లర్‌లకన్నా భిన్నంగా నిలుపుతోంది! ‘ఆ ఫ్యామిలీ సెంటిమెంట్‌’ నా జీవితంలో నేను స్వయంగా చూసింది… నిజానికి అదే నా జీవితాన్ని నిలిపింది!’ అంటాడు జీతూ. ఎందుకో చూడండి…

‘అదో చర్చ్‌. అప్పుడే ప్రార్థన ముగిసి అందరూ బయటకొస్తున్నారు. మెట్లు దిగి వస్తున్న వాళ్ల మధ్య అప్పుడే విరిసిన గులాబీలా ఆ అమ్మాయి! మెట్లు ఎక్కుతూ ఉన్న ఆ అబ్బాయి తనని కన్నార్పకుండా చూస్తున్నాడు. ‘రేయ్‌… ఇది చర్చ్‌ రా!’ అని ఫ్రెండ్స్‌ కసురుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రార్థన కోసం కళ్లుమూసినా తనే కనిపిస్తుందని… చర్చ్‌లోపలకీ వెళ్లలేదు ఆ అబ్బాయి. బదులుగా ఆ అమ్మాయి ఏ కాలేజీయో ఆరాలు తీయడం మొదలు పెట్టాడు. తర్వాతి రోజే ఆ కాలేజీకెళ్లాడు. ఆ అమ్మాయి దగ్గరకెళ్లి ‘నిన్న మిమ్మల్ని చర్చ్‌లో చూశాను!’ అంటూ నసిగాడు. ‘అవును… నేనూ చూశా నీ వాలకాన్ని!’ విసురుగా అంది ఆ అమ్మాయి. ‘మిమ్మల్ని చూడగానే ప్రేమలో పడిపోయాను!’ అన్నాడు. ‘అదొట్టి ఆకర్షణ… ప్రేమ కాదు!’ అంది. ‘కాదండీ… నాది ప్రేమే. నా లవ్‌ ప్రపోజల్‌కి సాక్షిగా మా అమ్మానాన్నల్నీ అక్కయ్యల్నీ పిలుచు కొచ్చాను చూడండి!’ అంటూ వాళ్లవైపు చూపించాడు. వాళ్లని చూశాక ఆ అమ్మాయికి మతిపోయింది ‘ఓ ఫ్యామిలీలో ఇలా కూడా ఉంటారా!’ అని నవ్వేసింది. అతని తల్లి దండ్రులూ నవ్వుతూ దగ్గరకొచ్చారు. ఆమెతో మాట్లాడారు. ‘నా డిగ్రీ పూర్తికానివ్వండి… తర్వాత ఆలోచిద్దాం!’ అంటూ వెళ్లిపోయింది. పోతూపోతూ అతనికి మాత్రమే వినిపించేలా ‘ఐ లైక్‌ ఇట్‌’ అని చెప్పింది. అతని పెదాలపైన చిర్నవ్వు విరిసింది. తిన్నా, పడుకున్నా ఆ చిర్నవ్వు చెక్కుచెదరడం లేదు. అలా ఏడాది గడిచింది. ఆ అమ్మాయిని చూడటానికి వెళ్లాడతను. ‘పెళ్ళి నాకిష్టమే కానీ… జీవితంలో నువ్వేం చేయాలనుకుంటున్నావ్‌!’ అని అడిగింది. ‘సినిమా డైరెక్టర్‌ని అవుదామనుకుంటున్నా!’ అని చెప్పాడు. ఆ అమ్మాయి అతనివైపు సాలోచనగా చూస్తూ ‘ఆ మాట చెబితే మావాళ్లు పెళ్లికి ఒప్పుకోకపోవచ్చు. వాళ్లే కాదు సదాచార సిరియన్‌ క్రైస్తవ కుటుంబా లేవీ అంగీకరించవు. ఆలోచించుకో!’ అంది. ‘నాకు నీ ఇష్టం ఏమిటన్నదే ముఖ్యం..!’ అన్నాడతను. ‘మావాళ్ల ఇష్టమే నాది కూడా. సినిమానా… నాతో పెళ్లా… ఏదో ఒకటి తేల్చుకో!’ అంది. గుండెని ఎవరో రంపంతో కోస్తున్నంత బాధ అతనికి. కన్నీళ్లతో ఆ అమ్మాయిని చూస్తూ చెప్పాడు ‘నాకు నువ్వే కావాలి… లిండా!’ అని..’ – ఇదేదో నేను సినిమా కోసం రాసుకున్న స్క్రిప్టు కాదు. పాతికేళ్లకిందట నా జీవితంలో ఎదురైన సంఘటనలివి. అలా సినిమా ఊసెత్త కూడదనే షరతుతోనే లిండా నా జీవితం లోకి అడుగుపెట్టింది. తనకిచ్చిన మాటని అక్షరాలా పాటించాను. కానీ ఇద్దరం కలిసి సినిమాకెళ్లినప్పుడు అందులోని అద్భుతమైన షాట్లు చూసి అందరూ చప్పట్లు కొడుతున్నప్పుడు ‘ప్చ్‌… నేనూ ఇలాంటి ప్రశంసలు అందుకోవాల్సినవాణ్ణే కదా!’ అనుకుని కన్నీళ్లు పెట్టుకునేవాణ్ణి. ఈ బాధ పెరుగుతున్న కొద్దీ… అసలీ సినిమా వ్యామోహం నాలో పుట్టించినవాళ్లని చంపేయాలన్నంత కసి వచ్చేది. వాళ్లెవరంటారా… చెబుతాను.

‘వావ్‌… వాట్‌ ఏ టేక్‌!’
కేరళలో ఎర్నాకుళం జిల్లాలోని ఎలంజి అనే చిన్న గ్రామం మాది. నాన్న వి.వి.జోసఫ్‌ ఎమ్మెల్యేగా కూడా చేశారు. ఇంట్లో నాకు ముగ్గురన్నయ్యలూ, ఓ అక్క. అందరూ బాగా చదువుకుని ఉన్నతస్థానాల్లో ఉన్నవాళ్లే. నేనే వాళ్ల దృష్టిలో దారి తప్పిన తమ్ముణ్ణయ్యాను! ఇంటర్‌ దాకా బాగా చదివాను కానీ హాస్టల్‌లో ఉంటున్నప్పుడు మా పెదనాన్న పిల్లలు నన్ను సినిమాకి తీసుకెళ్లారు. వాళ్లు ఊరికే సినిమా చూడటం కాదు, ‘ఆ టేక్‌ చూశావా… ఎలా తీశాడో! అబ్బబ్బా ఏం యాంగిల్‌రా అది!’ అంటూ విశ్లేషిస్తుండేవారు. నాకు అవేవీ అర్థం కాక తెల్లమొహం వేస్తే… వివరించి చెప్పేవారు. వాళ్లు ఈ సంగతులన్నీ చెబుతున్నకొద్దీ ‘ఇందులో ఇంతుందా!’ అని ఆశ్చర్యపోతుండే వాణ్ణి. అప్పటి నుంచి సినిమాలు చూడటమే కాదు… పుస్తకాలుగా వస్తే వాటి స్క్రీన్‌ ప్లేలూ చదివేవాణ్ణి. ఇంటర్‌ ముగిసేనాటికి ఈ సినిమా పిచ్చి బాగా ముదిరిపోయింది. నాన్నతో నేను సినిమాల్లోకి వెళతానని చెబితే విస్తుపోయాడు. ‘నిన్ను ఇంజినీర్‌ని చేయాలన్నది నా కల. అది నెరవేర్చకున్నా ఫర్వాలేదు కానీ కనీసం ఏదో ఒక డిగ్రీ అయినా చెయ్యి. ఆ తర్వాత నీ ఇష్టం!’ అన్నాడు. సినిమాలు బాగా చూడొచ్చని డిగ్రీలో ఆర్ట్స్‌ గ్రూపు తీసుకున్నాను. డిగ్రీ చదువుతూ పుణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరేందుకని ఎంట్రన్స్‌కి సిద్ధమయ్యాను. మరో వారంలో పరీక్షలనగా కామెర్లు రావడంతో ఆగిపోయాను. ఆ తర్వాత ఎవరో చెప్పారు ‘కమర్షియల్‌ సినిమాలు తీయడానికి ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరక్కర్లేదు. ఎవరిదగ్గరైనా అసిస్టెంట్‌గా చేరడం మంచిది!’ అని. నేను ఎవరిదగ్గర చేరాలో అర్థం కాలేదు. ఏదో ఒక మార్గం దొరుకుతుందిలే అని చూస్తున్నప్పుడే… లిండా పరిచయమైంది. తన షరతులతో సినిమా ఆశలన్నింటినీ అటకెక్కించాను. మా పొలంలో రబ్బరు చెట్లు పెంచడం మొదలుపెట్టాను. ఈలోపు నాన్న చనిపోవడంతో మాకు టౌన్‌లో ఉన్న స్థలంలో ఓ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ కట్టించి ఆ బాధ్యతా చూస్తుండేవాణ్ణి. మొదట్లో ఇదంతా కష్టమనిపించినా ఆ తర్వాత ఇవన్నీ అలవాటైపోయాయి. జీవితానికి ఓ ఛాలెంజ్‌ అన్నది లేకుండా పోయింది. ఉదయం ఆలస్యంగా లేవడం, కాసేపు రబ్బరు తోటని చూసుకోవడం, టౌనుకి వెళ్లడం రావడం… అంతా రొటీన్‌గా మారింది! వీటికి తోడు ఉండనే ఉంది… సినిమాలు తీయలేకపోతున్నాననే బాధ. ఆ బాధని మరచిపోవడానికి మరింతగా రబ్బరు తోటల్లో పనిచేసేవాణ్ణి. ఎంతగా కప్పెట్టాలనుకున్నా ఏదైనా ఓ మంచి సినిమా చూస్తున్నప్పుడు ఆ ఆవేదన నా కళ్లలో దాగేదికాదు. నేను పడుతున్న ఈ బాధని ఎవరూ పట్టించుకోవడం లేదని అనుకుంటూ ఉండేవాణ్ణి కానీ… నా భార్య నా మనస్సునంతా ఓ పుస్తకంలా చదివేస్తోందని గ్రహించలేదు!

మళ్లీ తనవల్లే…
2000లో అనుకుంటా నా మోకాలికి కీ-హోల్‌ సర్జరీ చేయాల్సి వచ్చింది. అందుకోసం కేరళ రాజధాని తిరువనంతపురం ఆసుపత్రిలో చేరాను. సర్జరీ అయ్యాక అక్కడ ఉంటున్న మా కజిన్‌ గీత ఇంటికి నేనూ, నా భార్యా వెళ్లాము. వాళ్ల డైనింగ్‌ టేబుల్‌ మీద జైరాజ్‌ అనే మలయాళ దర్శకుడు తీసిన ‘కరుణం’ సినిమా బ్రోచర్‌ ఉంది. ‘ఇదెక్కడిది గీతా…!’ అని అడిగితే ‘మాకు తిరుచ్చూరులో ఓ ఇల్లుందిరా… ఆ ఇంటిని ఈ సినిమా డైరెక్టర్‌ అద్దెకు తీసుకున్నాడు!’ అంది. కాసేపక్కడ కబుర్లాడి నేనూ, లిండా వచ్చేశాం. వచ్చిన నాలుగు రోజులకి గీత ఫోన్‌ చేసి ‘అన్నయ్యా! దర్శకుడు జయరాజ్‌ నిన్ను కలవాలంటున్నాడు… ఓ సారి వెళ్లొస్తావా’ అంది. ‘అదేమిటీ… నా సినిమా ఇంట్రెస్ట్స్‌ గురించి నీకెవ్వరు చెప్పారు!’ అన్నాను. ‘వదిన చెప్పింది. తనవల్ల నువ్వు సినిమాలకి దూరమయ్యావని చాలా బాధపడుతోంది. ఆ రోజు జయరాజ్‌ గురించి చెప్పడం విని… తనే నీ కోసం ఛాన్స్‌ అడగమని రిక్వెస్ట్‌ చేసింది!’ అంది. నాకు కన్నీళ్లు ఆగలేదు… నా మనసులోని బాధని లిండా ఇంతగా పట్టించుకుందా..! తన పరిధిలో తాను ప్రయత్నించి ఇంత గుంభనంగా ఉండిపోయిందా!’ అన్న ఆలోచన నన్ను కదిలించింది. తన దగ్గరకెళితే ‘వ్యవసాయం, వ్యాపారంలాంటి రొటీన్‌ పనులు నీకు సెట్‌ కావు. ఇలాగే కొనసాగితే జీవితాంతం స్తబ్దంగా ఉండిపోతావు అనిపించింది. నావల్ల నువ్వు అలా కాకూడదు అనిపించింది. అందుకే ఈ చిన్న ప్రయత్నం…!’ అని చెప్పింది. అలా నా భార్య ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి అడుగుపెట్టాను. జయరాజ్‌కి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ‘బీభత్సం’ అనే హిందీ సినిమా, ‘తిలకం’ అనే మలయాళ సినిమాలకి పనిచేశాను. మూడేళ్ల తర్వాత నేనూ ఒక కథ సిద్ధం చేసుకున్నాను.

ఈసారి అమ్మ వంతు!
నా మొదటి కథ వినగానే ఓ ప్రొడ్యూసర్‌ దిలీప్‌ అనే హీరోతో చేద్దామని చెప్పాడు. ‘నేనూ డైరెక్టర్‌నైపోతున్నానోచ్‌!’ అని గాల్లో తేలిపోయాను కానీ… వారం తిరక్కుండానే గాలి తీసిన బెలూన్‌లా మారిపోయాను. కారణాలేవీ చెప్పకుండానే ఆ ప్రొడ్యూసర్‌ సినిమా చేయడం కుదరదని చెప్పేశాడు. వేరే కథ కావాలన్నాడు. నెలరోజుల్లో ‘డిటెక్టివ్‌’ అనే కథ రాసి తీసుకెళ్తే… ‘కొత్త డైరెక్టర్‌లని నమ్మి ఏ హీరో కూడా ముందుకు రావడం లేదు. సారీ…!’ అని చెప్పేశాడు. ఏడుపొక్కటే తక్కువగా అతని ఆఫీసు నుంచి బయటకొచ్చాను. అయినా నా ప్రయత్నం మానుకోకూడదని ప్రఖ్యాత హీరో సురేశ్‌గోపికి కథ వినిపించాను. ‘చాలా బావుందండీ. ప్రొడ్యూసర్స్‌ ఉంటే చెప్పండి చేద్దాం!’ అన్నాడు. సురేశ్‌గోపికి కథ నచ్చిందని చెప్పినా నిర్మాతలెవరూ ఒప్పుకోలేదు. ఓ రోజు- ఇలా అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారుతున్నాయని నేనూ, నా భార్యా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే మా అమ్మ చూసింది. ‘ఎందుకేడుస్తున్నార్రా! మనకున్న ఆస్తి మొత్తం అమ్మేద్దాం… నువ్వు కోరుకున్న సినిమా తీద్దాం. కానివ్వండి!’ అంది. అనడమే కాదు… ఆరోజే స్థలాలు తనఖాపెట్టి డబ్బు తెచ్చిచ్చింది. అలా మా అమ్మ లీలమ్మని సహనిర్మాతగా చేసుకుని డిటెక్టివ్‌ సినిమా మొదలుపెట్టాం. సగం సినిమా పూర్తిచేశాక… మళ్లీ డబ్బు సమస్య. కానీ అప్పటికే కథ వైవిధ్యంగా ఉందనే టాక్‌ వ్యాపించడంతో మహిత్‌ అనే ప్రొడ్యూసర్‌ ఆ సినిమా కొని షూటింగ్‌ పూర్తి చేయించాడు. అలా ‘డిటెక్టివ్‌’ పూర్తయింది. సినిమా పెద్ద హిట్టయింది… అమ్మ తనఖా పెట్టిన స్థలాలన్నీ మళ్లీ మా చేతుల్లోకి వచ్చేశాయి. ఆ తర్వాత నేను తిరిగి చూసుకోలేదు. గత 13 ఏళ్లలో పది సినిమాలు తీస్తే వాటిలో తొమ్మిది పెద్ద హిట్టు. వాటిల్లో ‘దృశ్యం’ భాషలకి అతీతంగా మీ అందరికీ నన్ను చేరువ చేసింది. మరి దీనికి స్ఫూర్తేమిటంటారా…

ఆయన మా నాన్నే!
కేరళలో జరిగిన ఓ హత్య కేసు దృశ్యం సినిమాకి ప్రేరణ. కాకపోతే ఆ నిజం కేసులో- ఆ వ్యక్తి పోలీసులకి దొరికిపోయాడు. అలా దొరక్కుండా తన కుటుంబం కోసం అతను చివరికంటా పోరాడితే ఎలా ఉంటుందన్నదే దృశ్యం కథ! ఇందులోని మోహన్‌లాల్‌ (తెలుగులో వెంకటేశ్‌) పాత్రలో మా నాన్న ఛాయలున్నాయి. నాన్న ఎమ్మెల్యే అయినా సరే బస్సుల్లోనే ప్రయాణించేవాడు. ఏడాదికో రెండేళ్లకో తప్ప కొత్త బట్టలూ తీసుకోడు. కరెంటూ, నీళ్లూ క్షణం వృథా అయినా సహించేవాడు కాదు. ఇదంతా నేను ‘దృశ్యం’ కథలో భాగం చేశాను. దానికి మధ్యతరగతి కుటుంబాల్లోని భయాలనీ, తమవాళ్ల కోసం ఎంతకైనా పోరాడే తెగువనీ కలిపాను. ఈ అంశాలే దృశ్యం సినిమాలని మామూలు థ్రిల్లర్‌ల కంటే భిన్నంగా నిలిపాయనుకుంటున్నాను. తెలుగు, తమిళం, హిందీలోనే కాదు చైనీస్‌లో, సింహళంలో తీసినా పెద్ద హిట్టయ్యేలా చేసిందని భావిస్తున్నాను. నిజానికి, ‘దృశ్యం’ అనే కాదు… నేను తీసిన ప్రతి సినిమాలోనూ ఏదో ఒకరకంగా ఈ సెంటిమెంట్స్‌ని తడుముతూనే ఉన్నాను. ఎన్ని సినిమాలు తీసినా… తరిగిపోనంత ‘ఫ్యామిలీ సెంటిమెంట్‌’ని నా కుటుంబమే అందిస్తూ ఉంది.

తెలుగులో తొలిసారి…
ఏడేళ్లకిందట ‘దృశ్యం’ రీమేక్‌, రెండేళ్ల క్రితం జ్యోతిక- కార్తీ అక్కాతమ్ముళ్లుగా చేసిన ‘దొంగ’ డబ్బింగ్‌ సినిమాలతో మీకు పరిచయమైన నేను ‘దృశ్యం-2’తో తొలిసారి నేరుగా తెలుగు సినిమా చేస్తున్నాను. విక్టరీ వెంకటేశ్‌కి యాక్షన్‌ చెప్పబోతున్నాను. భాష వేరైనా సరే సాధారణంగా నా సినిమాలనే మళ్లీ మళ్లీ తీయడం ఇష్టం ఉండదు. కానీ ఈ సినిమా ద్వారా ఓ సారి తెలుగు కుటుంబాల్నీ ఇక్కడి సంస్కృతినీ దగ్గరగా చూడొచ్చనిపించింది. అందుకే సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ ఆఫర్‌ ఇస్తే వద్దనలేకపోయాను!