Director Prabhu Salman

అర్ధరాత్రి దొంగల్లా పారిపోయాం!

 

మనిషికీ మనిషికీ మధ్యే కాదు… ప్రకృతికీ మనిషికీ మధ్య ఉండాల్సిన మైత్రిని చెబుతాయి దర్శకుడు ప్రభు సాల్మన్‌ చిత్రాలు. హీరో ఇమేజ్‌ని పెంచడం కోసం పర్యావరణ అంశాలని తోడుతెచ్చుకోవడం కాకుండా… ప్రకృతి పరిరక్షణే ప్రధానాంశంగా హీరోహీరోయిన్లని ఎంచుకోవడం ఆయనకున్న అలవాటు. రానా హీరోగా వచ్చిన ‘అరణ్య’ అలాంటిదే! ఇదివరకు ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’ వంటి డబ్బింగ్‌ సినిమాలతో మనకి పరిచయమైన సాల్మన్‌ సినిమాలే కాదు… జీవితం కూడా స్ఫూర్తి నింపేదే. విధి విసిరే సవాళ్లని ఎదుర్కోవడమెలాగో వివరించేదే. ఆ ప్రయాణం…

దయం ఏడుగంటలు… అప్పుడే నిద్రలేచాను. రెప్పలు విప్పబోతే వెలుగు సూదిలా గుచ్చి ఇబ్బందిపెడుతోంది. అప్పుడు కాలింగ్‌ బెల్‌ మోగింది. ‘ఎవరూ… ఇంటి ఓనరా? నిన్ననే కదా కోపంగా మాట్లాడి వెళ్లాడు… ఇల్లూ ఖాళీచేయ మన్నాడు… మళ్లీ పొద్దున్నే వచ్చాడా…!’ అనిపించింది. నేను లేద్దామా వద్దా అనుకుంటుండగానే మావాడు పరుగెత్తు కుంటూ వెళ్లి గడియ తీశాడు. ‘పాలు… బాబూ!’ అన్న గొంతు వినిపించింది.పాలప్యాకెట్‌ తీసుకుని ‘ఉండు డబ్బులు తెస్తా!’ అంటూ లోపలికి వచ్చాడు వాడు. వాళ్లమ్మని డబ్బడిగితే తను ‘నాన్నని అడుగు!’ అంటోంది. వాడొచ్చి నన్ను లేపాడు. నేను ఏమీ ఎరగనట్టు ‘ఏమిట్రా!’ అని కళ్లు నులుముకుంటూ లేస్తే విషయం చెప్పాడు. బయటకొచ్చి ‘చిల్లర లేదు, రేపిస్తా!’ అన్నాను. ‘నిన్నా… మొన్నా కూడా ఇవ్వలేదు సార్‌!’ అన్నాడు. బాగా గిల్టీగా అనిపించింది. ‘కాస్త ఆగు!’ అని చెప్పి నా బ్యాగులో ఎప్పుడో దాచిన 20 రూపాయల నోటు తెచ్చిచ్చాను. మా ఇంట్లో మిగిలిన ఆఖరి నోటు అది. ఆ రోజంతా- ఎంతో ఇష్టంగా అద్దెకు తీసుకున్న ఆ మిద్దె ఇంటిని కళ్లారా చూసుకున్నాను. నా తొలి సినిమా హిట్టయ్యాక తీసుకున్న డబుల్‌ బెడ్రూమ్‌ ఇల్లది. ఆ హిట్టుతో నిర్మాతకి బాగా లాభాలొచ్చినా నా చేతుల్లో పెద్దగా ఏమీ మిగల్లేదు. నేననుకున్న ప్రాజెక్టులేవీ పట్టాలకెక్కలేదు. అనుకోకుండా చేసినవి కాసులు రాల్చలేదు. చూస్తుండగానే ఊరంతా అప్పులైపోయాయి. ఇంటి అద్దె కూడా కట్టలేకపోయాను. మేమిచ్చిన ఆరు నెలల అడ్వాన్స్‌ కూడా తీరిపోయి ‘బాబూ! ఇల్లు ఖాళీచేస్తారా… లేదా!’ అనడం మొదలుపెట్టాడు ఓనరు. ప్రతిసారీ తలతీసేసినట్టయ్యేది. అందుకే వేరే దారేదీ లేని పరిస్థితిలో ఆ రోజు రాత్రి పెట్టేబేడా సర్దుకుని గుట్టుచప్పుడు కాకుండా ఆ ఇంటి నుంచి బయటకొచ్చేశాం. ఓ రకంగా అప్పులవాళ్లనీ, అద్దె అడిగే ఓనర్‌నీ తప్పించుకుని దొంగల్లా పారిపోయాం. నా సంగతి సరే… ఏ పాపమూ ఎరగని నా భార్యాపిల్లల్నీ నలుగురి దృష్టిలో దగాకోర్లుగా నిలబెడుతున్నానన్న బాధ నా గుండెని మెలిపెట్టింది. ఆ అర్ధరాత్రివేళ ఆటోలో వెళుతూ అమాయకంగా నిద్రపోతున్న నా పిల్లల్ని చూసి ‘మీకు అద్భుతమైన భవిష్యత్తు ఇవ్వాలనుకున్నవాణ్ణి… ఇలా చేస్తున్నాను. సారీ అమ్మా!’ అంటూ వెక్కివెక్కి ఏడ్చాను.

మరో జన్మే ఎత్తాను…
ఆ రోజు రాత్రి ఎక్కడికి పోవాలో తోచక మా ఆవిడ బలవంతం మీద చెన్నై శివార్లలో ఉన్న మా అత్తగారి ఇంటికి వెళ్లాం. నా మనసు అవమానంతో గింజుకుంటున్నా వాళ్లు మాత్రం నన్ను సొంత బిడ్డలాగే ఆదరించారు. అక్కడికెళ్లాక నెలలోనే బాగా చిక్కి పుల్లలా అయిపోయాను. మొదట్లో అప్పుల బాధవల్ల అనుకున్నాను కానీ… నెలన్నరలో ఆరు కేజీలు తగ్గడంతో ఏదో సమస్య ఉందనిపించింది. ఆసుపత్రికి వెళితే… నా కడుపులో టీబీ వచ్చిందన్న బాంబు పేల్చారు వైద్యులు. మూలిగే నక్కపైన తాడిపండన్న చందంగా మారింది పరిస్థితి. విధి నాపైన అన్నివైపుల నుంచీ దాడిచేస్తోందేమో అనిపించింది. ఓ గదిలో పెట్టి ఎటూ వెళ్లే అవకాశం లేకుండా దాడికి దిగితే పిల్లి కూడా తిరగబడుతుందంటారు! మరి నేను మనిషిని… ఆ మాత్రం విధిపైన తిరగబడలేనా అనిపించింది! శక్తినంతా కూడగట్టుకుని పోరాడటం మొదలుపెట్టాను. ప్రభుత్వాసుపత్రిలోనే చికిత్స తీసుకోవడం ప్రారంభించాను. నాపైన నేను నమ్మకం పెంచుకోవాలని అప్పటిదాకా నేను అందుకున్న విజయాల్నీ ఎదుర్కొన్న సవాళ్లనీ ఓచోట రాసుకున్నాను. వాటిని క్లుప్తంగా చెబుతాను…

తమిళనాడులోని నైవేలి అనే ప్రాంతం మాది. లిగ్నైట్‌ గనులకీ, కరెంటు ఉత్పత్తికీ ప్రసిద్ధిగాంచిన టౌన్‌షిప్‌ అది. 14 చదరపు కిలోమీటర్లున్న టౌన్‌షిప్‌లో ‘అమరావతి’ అని ఒక్క థియేటరే ఉండేది… అందులోనూ 1960లనాటి సినిమాలు మాత్రమే వేసేవారు. తిరుచ్చిరాపల్లిలో డిగ్రీలో చేరాకే అసలు సినిమాలంటే ఏమిటో తెలిసింది. అప్పట్లో కాలేజీల్లో వేసే నాటకాల్లో చురుగ్గా పాల్గొనేవాణ్ణి. నా రచనాతీరూ, నటుల నుంచి నాక్కావాల్సింది రాబట్టడం వంటివి చూసి నా స్నేహితులంతా ‘నీ డైరెక్షన్‌ బావుందిరా!’ అనేవారు. ఆ ప్రోత్సాహంతో సహజంగానే నాలో సినిమాపిచ్చి మొదలైంది. పీజీ ముగించేనాటికి అది కాస్తా ముదిరిపోయింది. ఇంట్లోవాళ్లు వద్దంటున్నా వినకుండా ‘ఒక్కసారి కెమెరాని తాకితే చాలు…’ అన్న లక్ష్యంతో చెన్నై బస్సెక్కాను. అక్కడ ఆ కోరిక నెరవేరడానికి మూడేళ్లు పట్టింది. స్టూడియోల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న నన్ను ఓ సినిమా కోసం శరత్‌కుమార్‌కి ‘డూప్‌’గా తీసుకున్నారు. అక్కడ పరిచయమైన దర్శకుడు అగత్తియన్‌ సాయంతో ‘ప్రేమలేఖ’ సినిమాకి సహాయదర్శకుణ్ణయ్యాను. అప్పట్లో ఖుష్బూ భర్త సుందర్‌ ఓ సినిమా తీస్తూ ఏదో పొరపొచ్చాలు వచ్చి మానేస్తే మిగిలిన భాగాన్ని నన్ను పూర్తిచేయమని కోరారు ఆ సినిమా నిర్మాతలు. అలా నా పేరు రాకున్నా ఆ పని చేసిపెట్టడంతో… ఆ నిర్మాణ సంస్థ తమ తర్వాత సినిమాకి నాకే దర్శకత్వ బాధ్యతలు అప్పగించింది. అలా అర్జున్‌ హీరోగా కన్నోడు కాన్బదెల్లాం (తెలుగులో ప్రేమ ఘర్షణ) అన్న సినిమా చేశాను. ఆ సినిమా మంచి హిట్టయింది. పరిశ్రమలో చక్కటి గుర్తింపొచ్చింది కానీ… చేతిలో డబ్బులు మిగల్లేదు. అయినా-దర్శకుడిగా ఓ స్థాయి మెయిన్‌టెయిన్‌ చేయాలంటూ పెద్ద ఇల్లు అద్దెకు తీసుకున్నాను. ఆడంబరాలకి పోయాను. అప్పులు చేశాను. వాటికి తాగుడు అలవాటూ ఆజ్యం పోసింది. వీటన్నింటి ఫలితమే నాటి నా ఆర్థిక పరిస్థితి. నా విజయాలూ, బలాలూ, బలహీనతలపైన ఓ స్పష్టత వచ్చాక ముందు నా ఆరోగ్యంపైన దృష్టిపెట్టాను. దురలవాట్లతో పోరాడాను… దానికి క్రైస్తవ భక్తితోపాటూ మా ఆవిడ ప్రేమా ఎంతో బలాన్నిచ్చింది. అలా మరోజన్మ ఎత్తినట్టే అనిపించింది. ఆరునెలల్లోనే తేరుకుని… ఓ సినిమా స్క్రిప్టు సిద్ధంచేశాను.

‘రోజుకి ఐదువేలు చాలు’
అప్పట్లో కరణ్‌ అనే సహాయ నటుడు హీరోగా నిలదొక్కుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటే నా స్క్రిప్ట్‌ వినిపించాను. ‘నాకు ఒక్క కెమెరా ఇచ్చి… రోజుకి ఐదువేలు డబ్బులివ్వండి చాలు, సినిమా తీసిస్తాను!’ అని చెప్పాను. టీవీ సీరియళ్లకే రోజుకి లక్షరూపాయలు ఖర్చవుతున్న రోజులవి! కరణ్‌ నేను ఆశించిన దానికంటే ఎక్కువే డబ్బులిచ్చి సినిమా తీయమన్నాడు. 2006లో వచ్చిన ‘కొక్కి’ అన్న ఆ సినిమా పెద్ద హిట్టయింది. అప్పుడు వచ్చిన డబ్బుతో నేను చేసిన మొదటి పని పాత అద్దె ఇంటి బకాయిలన్నీ తీర్చేయడం…

ఆ ఓనర్‌కి క్షమాపణ చెప్పడం. అప్పటి నుంచి నా భార్య పునీతకే ఆర్థిక బాధ్యతలు అప్పగించడంతో… ఇంకెప్పుడూ మాకు సమస్యలు రాలేదు. బయటివాళ్లు నిర్మాతగా ఉంటే నేననుకున్న సినిమాలు తీయలేననే ఆలోచనతో నేనే నిర్మాతగా మారాలనుకున్నాను. ఓ ఫైనాన్షియర్‌ దగ్గర్నుంచి ఐదు లక్షలూ, నా సొంత డబ్బు ఒకటిన్నర లక్షని పెట్టుబడిగా పెట్టి సినిమా మొదలుపెట్టాను. దక్షిణాది సినిమా అప్పటిదాకా చూడని అడవి నేపథ్యాన్ని చూపాలనుకున్నాను. అలాంటి ఓ ప్రాంతం కోసం దట్టమైన కేరళ అడవుల్లో పదివేల కిలోమీటర్లు కాలినడకన తిరిగాను. చివరికి ప్రముఖ పర్యటక ప్రాంతం మున్నార్‌ సమీపంలో ఉండే కురాంగణి అనే గ్రామాన్ని ఎంచుకున్నాను. నా పాత సినిమాల్లో సైడ్‌ క్యారెక్టర్‌ చేసిన విధార్థ్‌ని హీరోగా తీసుకున్నాను. ఎన్నో వడపోతల తర్వాత హీరోయిన్‌గా అమలాపాల్‌ని ఎంపిక చేసుకున్నాను. 2011 నాటి దీపావళినాడు విడుదలైన ‘మైనా’(తెలుగులో ప్రేమఖైదీ) ఆ రోజే వచ్చిన ఓ టాప్‌హీరో సినిమాని సైతం తోసిరాజని పెద్ద హిట్టయింది. జాతీయ అవార్డుల్నీ సంపాదించిపెట్టింది. కమల్‌హాసన్‌ ఈ సినిమా చూసి ప్రతి పాత్రనీ విశ్లేషిస్తూ గంటపాటు ప్రసంగించారు. రజినీకాంత్‌ ‘ఈ సినిమాలో ఓ చిన్న పాత్ర ఇచ్చినా నేను గర్వపడేవాణ్ణయ్యా!’ అంటూ నన్ను ఆలింగనం చేసుకున్నారు. నాకు పర్యావరణ స్పృహ ఏర్పడింది ఈ సినిమాతోనే! అలా అడవిలోకి చొచ్చుకెళుతున్న మనిషికీ- అక్కడే తరతరాలుగా ఉన్న ఏనుగులకీ మధ్య జరుగుతున్న ఘర్షణపైన ఓ కథ సిద్ధం చేసుకున్నాను. అదే ‘గుమ్కీ’…!

 

గజరాజుకి దండంపెట్టా…
శివాజీగణేశన్‌ మనవడు విక్రమ్‌ ప్రభుని ఈ సినిమాతో హీరోగా పరిచయం చేశాను. ఇందులో నటించిన కుట్టి అనే ఏనుగు ద్వారానే గజరాజుల్ని ఏ రకంగా ముద్దు చేయాలి… వాటికి ఎప్పుడు యాక్షన్‌ చెప్పాలి… అవి సృష్టించే ఒక్కో శబ్దానికీ అర్థమేమిటీ… వంటివన్నీ నేర్చుకున్నాను. ఇంత చేసినా షూటింగ్‌ చివర్లో ఓ పెద్ద సమస్యని ఎదుర్కోవాల్సి వచ్చింది. మా ఏనుగుని షూటింగ్‌ కోసం కేరళ నుంచి తమిళనాడు సరిహద్దుకు తెప్పించాల్సి వచ్చేది. మధ్యలో 14 చెక్‌పోస్టులుండేవి. అక్కడి వాళ్లందరికీ నచ్చజెప్పి తెచ్చాక… ఏనుగు చెవులకీ కళ్లకీ మధ్య ఓ చిన్న బుడిపెలాంటిదొచ్చింది. అదేమిటని అడిగితే ‘ఏనుగుకి మదం పడుతోంది సార్‌!’ అన్నాడు మావటి. మరో ఏనుగుని షూటింగ్‌కి తెచ్చేంత డబ్బు కానీ వీలుకానీ మాకు లేదు. మేం చేయాల్సింది కూడా 10 గంటల షూటింగ్‌ మాత్రమే. దాంతో నేను షూటింగ్‌ చేస్తాననే చెప్పాను. ‘నాకు తెలియదుసార్‌… జనాలని చూస్తే అది రెచ్చిపోవచ్చు. మీ ప్రాణానికి నేను హామీ ఇవ్వలేను!’ అంటూ మావటి దూరంగా వెళ్లిపోయాడు. ఏం చేయను… ఆ ఏనుగే నా దేవుడనుకుని దండం పెట్టి చివరి షెడ్యూల్‌ మొదలు పెట్టాను. అదృష్టమో దైవనిర్ణయమో తెలియదు కానీ షూటింగ్‌ జరిగినంత సేపూ ఆ ఏనుగు కామ్‌గానే ఉండిపోయింది! గుమ్కీ సినిమా తమిళంలో సూపర్‌డూపర్‌ హిట్టయింది… తెలుగులోనూ మంచి ప్రశంసలొచ్చాయి.

రానా అడవి బిడ్డే అయ్యాడు…
అసోం అడవుల్లో అభివృద్ధి పేరుతో ఏనుగుల దారిని అడ్డుకుని ప్రభుత్వం గోడకట్టిన సంఘటనే నా ‘అరణ్య’ కథకి మూలం. అలాంటిచోట ఓ సిసలైన పర్యావరణ పోరాటయోధుడు ఉంటే ఎలా ఉంటుంది అన్న ప్రశ్న వస్తే నాకు అసోంలో సొంతంగా అడవిని పెంచిన జాదవ్‌ పాయెంగ్‌ కనిపించారు. ఆయన స్ఫూర్తితోనే హీరో పాత్రని రాసుకున్నాను. ఆ పాత్రకి ఎవరెవర్నో అనుకున్నాం కానీ… ఎవరూ నాకు నచ్చలేదు. రానా పేరు చెప్పగానే ‘అరె… ఇంతకాలం ఆయనెందుకు తట్టలేదు!’ అనిపించింది. విషయం చెబితే హైదరాబాద్‌ వచ్చి కథ చెప్పమన్నారు. కథల విషయంలో సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఎంత ఖరారుగా ఉంటుందో దక్షిణాది సినీ పరిశ్రమ మొత్తానికి తెలుసు. నాకా కథ ‘చెప్పడం’ సరిగ్గా రాదు… ‘చూపడమే’ వచ్చు. అందువల్ల సురేశ్‌ బాబుగారు ఒప్పుకోరేమోనన్న అనుమానంతోనే వెళ్లాను. కానీ 20 నిమిషాలపాటు నా ఆలోచనలు టూకీగా చెప్పగానే ఆయనా, రానా కథలో లీనమైపోయారు. ఆ రోజు నుంచి మూడేళ్లపాటు మరే సినిమాలోనూ పనిచేయకుండా శ్రమించారు రానా. కేవలం శాకాహారమే తింటూ 15 కేజీల బరువు తగ్గారు! గుమ్కీలో నేను ఒక్క ఏనుగుతో షూటింగ్‌ జరిపితే ఇందులో 18 ఏనుగులతో చేయాల్సి వచ్చింది. ఏనుగులు పరుగెత్తేటప్పుడు కెమెరాలు పట్టుకుని వాటి ముందూ వెనకా పరుగెత్తడం- మామూలు కష్టం కాదు. నేను నా సినిమా స్క్రిప్టులో ఏనుగుల సంచారాన్ని అడ్డుకుంటూ కట్టిన గోడని కూల్చేసినట్టే క్లైమాక్స్‌ రాశాను… అది కేవలం నా అభిలాష మాత్రమే. అప్పటికి నిజంగా అలా జరగలేదు. కానీ, నా సినిమా విడుదల కావడానికి వారం ముందే ఆ గోడని కూల్చేసి… ఏనుగుల రాచబాటని పునరుద్ధరించారట! ఆ విషయాన్ని చెబుతూ అక్కడి అధికారులు ‘మీ స్క్రిప్టు ఆ ఏనుగుల పాలిట ఓ ప్రార్థనలా పనిచేసిందండీ!’ అంటుంటే నాకు ఆనందంతో కన్నీళ్లాగలేదు!