ఎందుకలా చూస్తున్నారో అర్థమయ్యేది కాదు
కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’ని ‘ఓ బేబీ’గా తీశారు. ఆ కథని తెలుగులో చెప్పాలని ఎందుకు అనిపించింది?
అయిదేళ్ల క్రితం ఆ సినిమా వచ్చింది. ఎప్పుడూ ఎవరూ చెప్పని కథ కాదు. చెప్పిన విధానం నాకు కొత్తగా అనిపించింది. చైనా, జపాన్, మలేసియా, ఫిలిప్పీన్స్.. ఇలా చాలా భాషల్లో ఈ కథని రీమేక్ చేశారు. అన్నిచోట్లా బాగా ఆడింది. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండాల్సిన బంధాన్ని చాలా అందంగా చూపించారు. ఈ కథని తెలుగువాళ్లకు చెప్పాలి అనిపించింది. అందుకే ‘ఓ బేబీ’గా తీసుకొస్తున్నాం. ఈ కథ చాలా భాషల్లో వచ్చినా నేను ‘మిస్ గ్రానీ’ని మాత్రమే చూశా. అదీ ఒక్కసారే. ఎందుకంటే… నేను తీసేది తెలుగు సినిమా. ఇక్కడి భావోద్వేగాలు వేరు. సినిమాని ప్రేక్షకుడు చూసే విధానం వేరు. 40 శాతం మార్పులూ చేర్పులూ చేసి, ఓ అచ్చమైన తెలుగు సినిమాలా ఆవిష్కరించాను.
70 ఏళ్ల బామ్మ 24ఏళ్ల పడుచు పిల్లగా మారిపోవడం ‘ఓ బేబీ’ కథ. మరి మీకా అవకాశం వస్తే ఏ వయసులోకి వెళ్లిపోవాలనుకుంటారు?
నాకింకా 70 ఏళ్లు రాలేదు కదా? (నవ్వుతూ). నిజంగా ఆ అవకాశం వస్తే నా బాల్యంలోకి వెళ్లిపోతా. ఎందుకంటే స్కూల్, కాలేజ్ లైఫ్ బాగా ఎంజాయ్ చేశాను. ఆటలు, స్నేహితులు, అమ్మమ్మ, తాత, తమ్ముడూ ఇలా సరదాగా సాగిపోయింది. దీపావళి వస్తే టపాకాయలు విపరీతంగా కాల్చేదాన్ని. సంక్రాంతికి గాలిపటాలు ఎగరేసేదాన్ని. క్రికెట్ బ్యాటు పట్టుకుంటే.. ఇక సందడే సందడి. నా బాల్య స్నేహితులు ఇప్పటికీ నాతోనే ఉన్నారు. స్కూల్లో నాటకాలు వేసేవాళ్లం. వక్తృత్వ పోటీల్లో పాల్గొనేదాన్ని. బోలెడన్ని సినిమాలు చూసేదాన్ని. వర్షం పడుతుంటే బైక్ మీద తడుచుకుంటూ షికారుకి వెళ్లేవాళ్లం. కాలేజీ గోడలు దూకి సంతోష్, స్వప్న థియేటర్లలో సినిమాలు చూశాం. ఒక్కటేంటి? నేను చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఆ రోజులన్నీ మళ్లీ రావాలనుకుంటాను.
పదకొండుమంది అబ్బాయిలు ఆడే క్రికెట్ ఆటలో.. అమ్మాయిగా మీకెలా చోటు దక్కింది?
మా ఇంటి పక్కనే క్రికెట్ ఆడుకునేవాళ్లు. రోజూ గోడ పక్కన నిలబడి చూస్తూ ఉండేదాన్ని. ఓరోజు ఓ టీమ్‌లో 10మందే వచ్చారు. మరో ప్లేయర్ కోసం వాళ్లు ఎదురుచూస్తున్నారు. ఇదే అవకాశం అనుకుని ‘నేనూ ఆడనా’ అని అడిగాను. వాళ్ల అవసరం కొద్దీ నన్ను టీమ్‌లోకి తీసుకున్నారు. బ్యాట్స్‌మెన్ కొట్టిన బంతి ఎలా ఆపాలో అర్థమయ్యేది కాదు. అందుకే నా గౌన్ అడ్డం పెట్టి ఆపేసేదాన్ని. ‘అదేంటి? అలా ఆపకూడదు’ అని గొడవ పెట్టుకుంటే.. ‘బంతిని ఆపానా? లేదా? ఎలా ఆపితే నీకేంటి?’ అని నేనూ గొడవ పెట్టుకునేదాన్ని. అలా నేను బెస్ట్ ఫీల్డర్ అయిపోయాను. అప్పటి నుంచీ ‘నందిని మాకే కావాలి’ అని రెండు జట్లూ కొట్టుకునేవి. అప్పటి నుంచి క్రికెట్ బాగా నచ్చేసింది. స్కూల్, కాలేజీ ప్రతీ చోట క్రికెట్ ఆడేదాన్ని. కోటీ ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదవడానికి కారణం కూడా ఆ కాలేజీకి పెద్ద క్రికెట్ గ్రౌండ్ ఉండడమే.
దిల్లీ జేఎన్‌యూలో పీజీ చేశారు కదా. ఆ రోజులు ఎలా గడిచాయి?
నా జీవితంలో విలువైన రోజులవి. అప్పటి వరకూ ఇల్లు, స్కూలు, ఫ్రెండ్సూ ఇదే ప్రపంచం అనుకునేదాన్ని. అక్కడకు వెళ్లాక మరో ప్రపంచం ఉంటుందని అర్థమైంది. పొలిటికల్ సైన్స్‌లో పీజీ చేశాను. క్యాంటీన్‌లో పెద్ద పెద్ద చర్చలు జరిగేవి. బడా రాజకీయ నాయకులంతా వచ్చేవారు. సామాజిక, రాజకీయ విషయాల్లో చాలా అవగాహన వచ్చింది. అప్పట్లో సివిల్స్ రాయాలని గట్టి కోరిక. అయితే నాలా ఉండేవాళ్లు సివిల్స్‌కి పనికిరారు అనిపించింది. యాడ్ ఏజెన్సీ పెట్టుకుందాం అనుకున్నాను. చివరికి గుణ్ణం గంగరాజుగారు పరిచయమయ్యారు. ఆయన దగ్గర ‘లిటిల్ సోల్జర్స్’కి సహాయ దర్శకురాలిగా పనిచేశా. అప్పటి నుంచీ జర్నీ మొదలైంది.
లైంగిక వేధింపుల కమిటీలో కీలక పాత్ర పోషిస్తున్నారు కదా? ఆ కమిటీ పనులు ఎంత వరకూ వచ్చాయి?
ఇప్పుడే ఓ విత్తనం వేశాం. మొలకెత్తడానికి సమయం పడుతుంది. అమ్మాయిలు తమ సమస్యని ధైర్యంగా చెప్పుకొనే వాతావరణం కల్పించాలి. తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు వేయొచ్చు? న్యాయపరంగా ఉన్న సమస్యలేంటి? వీటిపై మేం చర్చలు జరుపుతున్నాం. దేశంలో ఏ పరిశ్రమా వేయని అడుగు ఇది. కచ్చితంగా మంచి ఫలితాలుంటాయి.
సహాయ దర్శకురాలిగా చేసేటప్పుడు ఎలా ఉండేది?
అవును. ‘లిటిల్ సోల్జర్స్’ సెట్‌కి వచ్చినవాళ్లంతా నన్ను వింతగా చూసేవారు. నన్ను డాన్స్ అసిస్టెంటో, మేకప్ అసిస్టెంటో అనుకునేవారు. వాళ్లు అలా ఎందుకు చూస్తున్నారో నాకూ అర్థమయ్యేది కాదు. ఆ సినిమా పూర్తయ్యేసరికి ‘ఇండస్ట్రీలో అమ్మాయిలు తక్కువ. అందుకే నన్ను అలా చూస్తున్నార’న్న సంగతి తెలిసింది.
సినిమాలంటే ఇంట్లో ఒప్పుకొన్నారా?
మా కుటుంబంలో లాయర్లు, డాక్టర్లు ఎక్కువ. సినిమా నేపథ్యం అస్సలు లేదు. నా టైమింగ్స్ పూర్తిగా మారిపోయేవి. ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికి వెళ్లేదాన్ని. తెల్లవారు జామున మళ్లీ బయటకు వచ్చేసేదాన్ని. దాంతో ఇంట్లోవాళు,్ల చుట్టాలు మా అమ్మని తిట్టేవారు. కానీ నా ప్యాషన్‌ని అమ్మ అర్థం చేసుకుంది.
ప్యాంటూ, షర్టూ అలవాటు ఎప్పటి నుంచీ?
కాలేజీ అయ్యాక ఏడెనిమిది ఏళ్ల వరకూ చీరలు కట్టేదాన్ని. అయితే.. వేగంగా నడవడం నాకు అలవాటు. చీర కడితే అడుగులు చిన్నగా వేయాల్సివచ్చేది. అందుకే ఈ ట్రెండ్‌కి మారా. ఇక జుత్తు అంటారా.? నాది ఉంగరాల జుత్తు. అమ్మ జడలు వేస్తున్నప్పుడు బాగా నొప్పి పుట్టేది. అందుకే ఓసారి అమ్మకు చెప్పకుండా జుత్తు కత్తిరించుకున్నా. ఆ తరవాత చివాట్లూ తిన్నా. ఇప్పుడు ఆ హెయిర్ స్టైలే కంటిన్యూ అవుతోంది.
పుస్తకాలంటే చాలా ఇష్టం. కథలు, నవలలూ అన్నీ చదువుతా. ట్రావెలాగ్ కూడా ఇష్టం. కల్చర్‌కి సంబంధించిన పుస్తకాలంటే మరీ ఇష్టం. ఆర్‌కే నారాయణ్, రస్కిన్ బాండ్ పుస్తకాలు చదివితే, ఆ అక్షరాల్లోకి, ఆ కథల్లోకి మనమూ వెళ్లిపోయినట్టు అనిపిస్తుంది. కథ రాసే ప్రయత్నం మాత్రం చేయలేదు. అంత ప్రతిభ నాలో లేదనిపిస్తుంది. |
‘అలా మొదలైంది’కి ముందే సినిమాలు వదిలేద్దాం అనిపించింది. ఎందుకంటే అప్పటికి తొలి ఛాన్స్ కోసం ఆరేళ్లు ఎదురుచూశా. నా స్నేహితులంతా స్థిరపడిపోయారు. ఎక్కడికైనా పార్టీకి వెళ్తే.. వాళ్ల జేబుల్లోంచి డబ్బులు తీసేవాళ్లు. ‘ఇదేంటి ఇప్పటికీ మన డబ్బులు మనం సంపాదించుకోలేమా? సినిమాల్లోకి వచ్చి తప్పు చేశామా’ అనిపించేది. అయితే ఆ ఫీలింగ్ ఎక్కువ సేపు ఉండేది కాదు. ఎవరైనా ఫోన్ చేసి ‘నీ దగ్గర మంచి కథ ఉందా’ అని అడిగితే.. మళ్లీ కొత్త ఉత్సాహం వచ్చేసేది. |
* డబ్బుని ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు. అందుకే నేను నిర్మాణ రంగానికి దూరం. నిర్మాణం వేరు.. సృజనాత్మకత వేరు. ఒకటి ఆన్ అయితే మరొకటి ఆఫ్ అయిపోతుంది. * వంట చేయడం బాగా వచ్చు. కోడికూర బాగా వండుతా. * నేను మంచి స్విమ్మర్‌ని. క్రికెట్‌తో పాటు బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. |