ప్రేక్షకుడు వెండితెరపై ఒక హీరోని కాకుండా తనని తాను చూసుకుంటాడు. ‘నీదీ నాదీ ఒకే కథ’ అంటూ ఆ పాత్రలో లీనమైపోతాడు. చివరిగా నాలోనూ ఓ హీరో ఉన్నాడనుకుంటూ థియేటర్ నుంచి బయటికొస్తాడు. శ్రీవిష్ణు చేసే సినిమాలన్నీ అలాగే ఉంటాయి. వాస్తవానికి ప్రతిబింబంలా… సగటు జీవితాల్ని కళ్లకు కట్టేలా ఉంటాయి ఆయన ఎంచుకొనే కథలు. అందుకే కథానాయకుల్లో శ్రీవిష్ణుకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన సినిమా అంటే కొత్తదనం ఉంటుందనే ఓ నమ్మకం ప్రేక్షకుల్లో కనిపిస్తుంటుంది. క్రికెట్ నుంచి సినిమావైపు ఎలా వచ్చారు? ఆయన ప్రేమకథ ఏమిటి? కథల ఎంపికలో ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి? తదితర విషయాల్ని ‘హాయ్’తో పంచుకొన్నారు శ్రీవిష్ణు.
* మీరు సినిమాల్లోకి ఎలా వచ్చారు?
నాకు సినిమా అంటే పిచ్చి ఉండేది. అంతర్వేదిపాలెం మా సొంతూరు. ఆ తర్వాత భీమవరం వచ్చాం. భీమవరం, అమలాపురంలో నా పాఠశాల చదువు పూర్తయింది. విజయవాడలో ఇంటర్, విశాఖపట్నంలో డిగ్రీ చేశా. ఎక్కడికి వెళ్లినా సినిమాల్ని మాత్రం వదిలిపెట్టలేదు. చూసిన సినిమానే అయినా మళ్లీ మళ్లీ చూసేవాణ్ని. విశాఖపట్నం గీతంలో బీబీఎమ్ పూర్తి చేశాక, వెంటనే ఉద్యోగం వచ్చింది. మేనేజ్మెంట్ రంగంలో మంచి ఉద్యోగం, మంచి జీతం. పని కూడా బాగా చేస్తాననే పేరొచ్చింది. నాకు మాత్రం ఎవరికోసం, ఎందుకోసం ఈ పని అనిపించేది. ‘నీది నాదీ ఒకే కథ’లో చెప్పినట్టుగా మనస్ఫూర్తిగా చేయనప్పుడు దాన్ని చేయకపోవడమే ఉత్తమం. తర్వాత ఏం చేయాలో స్పష్టత లేదు. కానీ సినిమా అంటే ఇష్టం కాబట్టి అందులోనే ఏదో ఒకటి చేయాలనుకొన్నా. చిన్నప్పట్నుంచి కథలు రాసుకోవడం ఓ అలవాటుగా ఉండేది. దాంతో ఉద్యోగం వదిలిపెట్టాక రెండు నెలలకి దర్శకుడు కావాలని నిర్ణయించుకున్నా. ఆ ఉద్దేశంతోనే పరిశ్రమలోకి అడుగుపెట్టా.
* సినిమాల్లోకి రాకముందు మీరు క్రికెట్ ఆడేవారట కదా?
భారతదేశంలో కుర్రాళ్లకి సచిన్‌లా క్రికెటర్ కావాలనే ఓ కోరిక ఉంటుంది. చిన్నప్పుడు నేనూ అంతే. క్రికెట్లో ఆంధ్ర జట్టు తరఫున ఆడాను. క్రికెట్ అయితే ఆడుతున్నాను కానీ… ఎలా ముందుకు వెళ్లాలో తెలియలేదు. అందుకే క్రికెట్‌ని ఆడుతూ కాకుండా, చూసి ఆస్వాదిద్దామనే నిర్ణయానికొచ్చా.
* మరి కథానాయకుడు ఎలా అయ్యారు?
అప్పటికే క్రికెట్, ఉద్యోగం వదిలిపెట్టా. ఇక సినిమా తప్ప నాకు మరో ప్రత్యామ్నాయం లేదు. ఎలాగైనా ఇక్కడే సక్సెస్ కావాలి. సినిమా నాకు చాలా ముఖ్యమైన మ్యాచే కాదు, వరల్డ్‌కప్ కూడా. దాంతో జాగ్రత్తగా అడుగులు వేయాలని నిర్ణయించుకొన్నా. కానీ ఆరంభంలోనే కథానాయకుడిగా అవకాశాలొచ్చాయి. నేనేమో అప్పటికి నటించడానికి అస్సలు సిద్ధం కాలేదు. అందుకే మొదట నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ అవకాశాల్ని ఒప్పుకోలేదు. పనిగట్టుకొని చిన్న పాత్రలవైపు దృష్టిపెట్టా. చిన్న పాత్రలే అయినా… పొద్దున్నుంచి సాయంత్రం వరకు షూటింగ్‌లోనే ఉండేవాణ్ని. అన్నీ గమనిస్తూ నాలెడ్జ్ పెంచుకొనేవాణ్ని. ఇక నటన పూర్తిగా పక్కనపెట్టేసి దర్శకుడు అవుదామనుకొనేలోగా మళ్లీ కథానాయకుడిగా అవకాశాలొచ్చాయి. అయితే ఇప్పటికీ ప్రతి సినిమాకీ నేనొక సహాయ దర్శకుడిగానే పనిచేస్తుంటా.
* ఉద్యోగం వదిలేసి సినిమా అన్నప్పుడు ఇంట్లోవాళ్లు అభ్యంతరం చెప్పలేదా?
నేను ఏదడిగితే అది కాదనకుండా ఇచ్చారు మా అమ్మానాన్నలు. వాళ్లు ఎప్పట్లాగే సినిమాల్లోకి వెళతానన్నా అభ్యంతరం చెప్పలేదు. కానీ నేను ఈ నిర్ణయం తీసుకొనేటప్పటికే నాకు పెళ్లయింది. అయితే నా భార్య కూడా అడ్డు చెప్పలేదు. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. ఏం చేసినా కరెక్ట్‌గానే చేస్తాడనీ, ఏదీ అంత సులభంగా చేయడనేది తన నమ్మకం. ఎవరేమనుకొన్నా మనకు కావల్సిన బలాన్ని మాత్రం మన కుటుంబమే ఇస్తుంటుంది.
* క్రికెట్లో అయితే సచిన్, మరి సినిమాల్లో మీకు స్ఫూర్తి ఎవరు?
సచిన్ ఆరాధ్య క్రికెటరే కానీ… వ్యక్తిగతంగా బాగా ఇష్టమైన ఆటగాడు రాహుల్ ద్రవిడ్. సినిమాల్లో అయితే వెంకటేష్ నాకు స్ఫూర్తి. చిరంజీవి సినిమాల్నీ బాగా చూసేవాణ్ని. రాహుల్ ద్రవిడ్, వెంకటేష్‌ల గురించి మాత్రం ఆసక్తిగా తెలుసుకొనేవాణ్ని. వాళ్ల వ్యక్తిత్వాన్ని అనుసరించేవాణ్ని.
* ఆ వయసు కథలు చేస్తా
నవతరం కథానాయకులు చేసే కథలు దాదాపు 22 నుంచి 30 యేళ్ల వయసుకు సంబంధించినవే. కానీ ఏ మగాడు ఆ వయసులో హీరో అయిపోడు, హీరోలా ఫీలవుతాడంతే. సినిమా కాబట్టి, అబ్బ ఏం చేశాడ్రా అని ప్రేక్షకులు అనుకోవాలి కాబట్టి వాళ్లని హీరోలుగా చూపిస్తారంతే. నిజ జీవితంలో 30 నుంచి 50 యేళ్ల వయసులోనే రియల్ మేన్, రియల్ హీరోలు కనిపిస్తుంటారు. ఆ వయసు కథలు మన దగ్గర తెరకెక్కవెందుకో! నేను మాత్రం ఆ వయసు కథలపైనే దృష్టి పెడతా.
* నా కూతురు పేరు మ్రిదనాది ప్రేమ వివాహం. నా భార్య పేరు ప్రశాంతి. డిగ్రీలో మేమిద్దరం క్లాస్మేట్స్. మూడేళ్లపాటు మా ప్రేమాయణం సాగింది. డిగ్రీ అవ్వగానే పెళ్లి చేసుకున్నాం. ముందు నేనే తనని ప్రపోజ్ చేశా. మాకొక పాప. తన పేరు మ్రిద. ఇప్పుడు ఎల్కేజీ చదువుతోంది. తన పేరు నేనే పెట్టా. విష్ణు అని నాకు దేవుడి పేరు పెట్టారు. స్కూల్లో అల్లరి చేస్తున్నప్పుడు టీచర్లు ‘రేయ్ విష్ణూ.. ఏంట్రా ఆ చెత్త పనులు’ అని అరిచేవాళ్లు. ఆ సమయంలో నాకు దేవుడి పేరు ఎందుకు పెట్టారో అనిపించేది. అందుకే వచ్చే తరాలకి కొత్తగా ఉండాలని మా పాపకి మ్రిద అని నామకరణం చేశా. తీరా ఆ పేరు పెట్టాక దాని అర్థం ఈశ్వరుడు అని తెలిసింది (నవ్వుతూ). |
– నర్సిమ్ ఎర్రకోట
ఫొటో: మధు