Director Swaroop-Hero Naveen Polisetti (Agent Sai sreenivas Atreya)


ఇద్దరికీ సినిమా పిచ్చే

కలుద్దామా…? అంటే..! వెంటనే బంజారాహిల్స్‌లోని ఓ కాఫీ షాప్‌ లొకేషన్‌ షేర్‌ చేశాడు ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ దర్శకుడు స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే. ఆ కాఫీ షాప్‌ దగ్గరికి దర్శకుడితో పాటు హీరో నవీన్‌ పోలిశెట్టి వచ్చాడు. ఇద్దరూ బిజీ ట్రాఫిక్‌లో రోడ్డు పక్కన చెట్టుకింద నిల్చొని మాట్లాడుకుంటున్నారు. విచిత్రమేంటంటే.. వాళ్లు కలవాలనుకున్న కాఫీ షాప్‌ను అక్కడ నుంచి తీసేశారు. ఇంతకీ ఈ ప్రస్తావన ఎందుకంటే.. ఏజెంట్‌…. సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేను ఇలా హైదరాబాద్‌లోని కాఫీ షాపుల్లోనే రాసుకున్నారు వీరిద్దరూ. అందుకే వీళ్లకీ కాఫీషాపులకూ ఇంత అనుబంధం. ‘ఏజెంట్‌…’ చిత్రంతో అందరి దృష్టి తనపై నిలుపుకొన్న దర్శకుడు స్వరూప్‌, తన నటనతో ఎందరి ప్రశంసలో అందుకుంటున్న హీరో నవీన్‌… ‘హాయ్‌’తో మాట్లాడారు.

వేర్వేరు దేశాల్లో ఉంటున్న మీరిద్దరూ ఇంతకీ ఎలా కలిశారు?
స్వరూప్‌ : నేను అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసేవాడ్ని. సినిమాలంటే బాగా పిచ్చి. అది పెరిగి ఉద్యోగం వదులుకొనే స్థాయికి నన్ను తీసుకెళ్లింది. ఎలాగైనా సినిమా తీయాలని ఈ కథ రాసుకున్నా. అప్పటికే నవీన్‌ యూట్యూబ్‌లో స్టార్‌. ఫేస్‌బుక్‌ ద్వారా నవీన్‌కు మెసేజ్‌ పెట్టా. దాదాపు రెండు నెలల తర్వాత రిప్లై వచ్చింది. స్టోరీని క్లుప్తంగా పంపమన్నాడు. ఒక కోడ్‌ లాంగ్వేజ్‌లో మెసేజ్‌ పెట్టాడు. ఆ కోడ్‌ భాష అర్థమేంటంటే… ‘రేపు 10 గంటలకు కాల్‌ చేస్తా’ అని. చెప్పినట్లే కాల్‌ చేసి మాట్లాడాడు. కథ చర్చలు అలా మొదలయ్యాయి. తర్వాత నేను జాబ్‌కు రిజైన్‌చేసి హైదరాబాద్‌కు వచ్చేశాను.

నవీన్‌ : నాకు చిన్నప్పటి నుంచి నటనంటే చాలా ఇష్టం. ఎన్‌ఐటీ భోపాల్‌లో చదువుకునేటప్పుడు నాటకాల్లో నటించాను. లండన్‌లో ఒక సంవత్సరం పాటు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశా. నేను ఇలా ఉద్యోగం చేసుకుంటూ కూర్చొంటే… హీరో ఎలా కాగలను? అని ఆలోచించి, రిజైన్‌ చేసి ఇక్కడికొచ్చాను. ముంబయిలో ఏఐబీ అనే యూట్యూబ్‌ ఛానల్‌లో చాలా స్కిట్‌లలో నటించాను. కొన్ని స్కిట్‌లు రాశాను. బెంగళూరు, ముంబయి నగరాల్లో నాటకాలు వేశాను. లైఫ్‌ఈజ్‌ బ్యూటిఫుల్‌, ఒన్‌-నేనొక్కడినే చిత్రాల్లో చిన్న పాత్రలు చేశాను. ఇలా ప్రయాణం సాగుతుండగా… స్వరూప్‌ నుంచి మెసేజ్‌ వచ్చింది. రెండు నెలలపాటు నేను  సమాధానం ఇవ్వకపోవడానికి కారణం… నేను  షూటింగ్‌లతో బిజీగా ఉండటమే. తర్వాత కథ నచ్చి ఇక్కడికే వచ్చేశాను.

ఇంతకీ మీ ఇద్దరివీ తెలుగు రాష్ట్రాలేనా..?
స్వరూప్‌ : నెల్లూరులో పుట్టిపెరిగా. ఆ తర్వాత తిరుపతికి షిఫ్టయ్యాం. ఇంజినీరింగ్‌ చేశాక హైదరాబాద్‌, బెంగళూరుల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేశాక అమెరికా వెళ్లా. నాకు పెళ్లయ్యింది. ఓ కూతురు. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి  నేను చూసిన తొలిచిత్రం. సినిమా పిచ్చి మొదలైంది చిరంజీవి వల్లనే.

నవీన్‌ : హైదరాబాద్‌లో పుట్టిపెరిగాను. నాన్న ఉగ్యోగరీత్యా దేశంలో చాలా ప్రదేశాల్లో ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం మీదే ఊరూ అంటే…నెల్లూరు అని చెబుతున్నా(నవ్వులు).

సినిమాల్లోకి వెళ్తామంటే ఇంట్లో వాళ్లు ఏమన్నారు?
స్వరూప్‌ : అమ్మానాన్న వద్దన్నారు. సినిమాలు మనకు పడవన్నారు. నా భార్య మీనాక్షి ప్రోత్సహించింది. నేను సినిమా తీస్తానో లేదో అని నాకే నమ్మకం లేనప్పుడు… నా భార్య నన్ను నమ్మింది. మా చెల్లి కూడా నన్ను ఎంతో ఎంకరేజ్‌ చేసింది. ఏజెంట్‌…. చిత్రం చూశాక.. మీనాక్షి ఆనందభాష్పాలు రాల్చింది.

నవీన్‌ : ఇంటర్లోనే నాకు నటనంటే ఇష్టమని ఇంట్లో చెప్పాను. ‘సరే..రా… ముందు ఇంజినీరింగ్‌ పూర్తిచెయ్యి తర్వాత నీ ఇష్టమన్నారు’ నాన్న. అది పూర్తయ్యాక… ‘ఒక్క సంవత్సరం ఉద్యోగం చేయి తర్వాత నీ ఇష్టమ’న్నారు. అలా ఉద్యోగం చేయడం మొదలుపెట్టాను. కానీ నా మనసు నటన మీదే ఉండేది. లండన్‌ నుంచి వచ్చి వర్క్‌ ఫ్రం హోం అని నాన్నకు చాలా రోజులు అబద్ధం చెప్పాను. తర్వాత నా ప్యాషన్‌ చూసి ఆయన ఏమీ అనలేకపోయారు.

కథ రాసుకోవటానికి హైదరాబాద్‌లో మీరు పడ్డ పాట్లు ఏంటి?
స్వరూప్‌ : స్క్రిప్టు రాసుకున్నాకే నిర్మాతల దగ్గరికి వెళ్దామనుకున్నాం. ఇంట్లో రాయటం కుదరదు. దీంతో మేం కాఫీ షాప్స్‌ని ఇంటిగా మార్చుకున్నాం. జస్ట్‌.. గూగుల్‌లో తక్కువ రేటింగ్‌ ఉండే షాపులు ఎంపిక చేసుకున్నాం. ఏదో ఒక కాఫీ షాపుకెళ్లి ఓ కాఫీ ఆర్డరిచ్చి అక్కడే రోజంతా తిష్టవేసేవాళ్లం. హైదరాబాద్‌లోని సగం కాఫీషాపుల్లో వారికి మా సినిమా కథ తెలుసు.

నవీన్‌ : ఒక్కకాఫీ ఆర్డరు ఇస్తే.. వైఫై, ఏసీ ఉచితం. మేం పెద్ద కాఫీ షాపులకెళ్తే.. డబ్బు వృథా. పైగా ప్రతీ ఐదు నిమిషాలకు ‘ఆర్డర్‌ సర్‌’ అంటూ నవ్వుతూ అడుగుతారు. మాకంత సీన్‌లేదు. ఎవరూ రాని దుకాణాల్లో మేముంటే.. మమ్మల్ని చూసి వేరే ఎవరైనా వస్తారనేది వాళ్ల ఆశ. అలా వాళ్లకి మేం మార్కెటింగ్‌ చేసేవాళ్లం (నవ్వులు).

సీన్‌ బాలేదనిపిస్తే మళ్లీ మళ్లీ చేసేవాళ్లం. షూటింగ్‌లో రెండో రోజు అసలు నేను డైరెక్షన్‌ చేస్తానా? అని భయమేసింది. సెట్‌లో 80 మంది జనాలు. లొకేషన్‌ టైం అయిపోతోంది. మా ప్రొడ్యూసర్‌ పిలిచి ‘ఇలాగే ఉంటుంది. భయపడకు’ అన్నారు. అది కొండంత ధైర్యమిచ్చింది.ముంబైకి వెళ్లిన తర్వాత నా కష్టాలు దేవుడికెరుక. నాటకాలేస్తుంటే డబ్బులు వచ్చేవి కావు. ఒక్కోసారి మూడుపూట్ల భోజనం వద్దనుకొని మధ్యాహ్నం ఆలస్యంగా నిద్రలేచేవాడ్ని. పగలు ఆడిషన్స్‌కి వెళ్లి.. సాయంత్రం రెస్టారెంట్లకు బ్రౌన్‌రైస్‌ సరఫరా చేస్తుండేవాడ్ని.
రాళ్లపల్లి రాజావలి, ఫొటో : రాజమౌళి