Heroine Niveda Pethuraj

heroine niveta peturajHeroine niveta peturajమల్లయుద్ధం నేర్చుకుంది!
 

 

కొన్ని సినిమాలంతే. వెండితెరపైకి వచ్చినప్పుడు పెద్దగా మెప్పించలేకపోయినా… యూట్యూబ్‌ వీడియోలతో అందరి మనసుల్నీ దోచేస్తాయి. విజయ్‌ ఆంటోనీ ‘రోషగాడు’ అలాంటిదే. ముఖ్యంగా… అందులో హీరోతో కలిసి పోలీసు హెడ్‌ కానిస్టేబుల్‌గా నివేదా పెత్తురాజ్‌ చేసిన నటనా, తన డైలాగులూ నెటిజన్ల మధ్య ‘షేర్‌’లుగా చక్కర్లు కొడుతున్నాయి. అంతకుముందు ‘మెంటల్‌ మదిలో’ చిత్రంలోనూ, ఆ తర్వాత ‘చిత్రలహరి’లోనూ ఆకట్టుకున్న నివేదా తాజాగా ‘బ్రోచేవారెవరురా’ చిత్రంతో మన ముందుకొచ్చింది.తన గురించిన విశేషాలివి…

అల్లరి చేశారో… అంతే!నివేదా పెత్తురాజ్‌కి మార్షల్‌ ఆర్ట్స్‌పైన చాలా ఆసక్తి. అదీ కరాటే, కుంగ్‌ఫూ, టేక్వాండోలాంటి పాతవాటిని వదిలి… జపాన్‌కి చెందిన జుజిట్సూ యుద్ధవిద్య నేర్చుకుంది. అంతేకాదు, తను మల్లయోధురాలు కూడా! ఈ రెండూ తనకి ధైర్యాన్నే కాదు… ఫిట్‌నెస్‌నీ అందిస్తున్నాయంటుంది నివేద. ఇక మోడలింగ్‌ కోసమంటూ డాన్స్‌ కూడా నేర్చుకుంది. అంతేకాదండోయ్‌, చిత్రలేఖనంలోనూ ప్రవేశం ఉంది.
బైకు వెనక హీరోగారు!అన్నట్టు నివేదాకి ఫార్ములా వన్‌ రేసింగ్‌లోనూ ప్రవేశం ఉంది. ‘రోషగాడు’ సినిమాలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకు నడపడానికి అదెంతో ఉపయోగపడిందట. ‘హీరో విజయ్‌ ఆంటోనీని వెనక కూర్చోబెట్టుకుని బండి నడిపే ఓ పె…ద్ద షాట్‌ షూట్‌ చేయాల్సి వచ్చింది. దానికి ఐదుగంటలు పట్టింది. అంతసేపు, నేనెలా నడుపుతానా అని అందరిలోనూ ఆందోళనే… ఒక్క నాలో తప్ప!’ అని నవ్వేస్తుంది నివేద.
తెలుగు సంగతులేమిటంటే…‘తెలుగులో నా మొదటి హీరో శ్రీవిష్ణు. ‘మెంటల్‌ మదిలో’ షూటింగ్‌ ప్రారంభమైనప్పుడు పలకరిస్తే తలెత్తకుండా నేల చూపులు చూస్తూ మాట్లాడేవాడు. అడిగిందానికి మాత్రమే సమాధానం చెప్పేవాడు… తడబడుతూ! అలాంటివాణ్ణి నేనూ, అమృతా (మరో హీరోయిన్‌) కలిసి షూటింగ్‌ ముగిసే నాటికంతా చాలా జోవియల్‌గా మార్చేశాం!’ అంటుంది నివేద.
మిస్‌ ఇండియానే కానీ…నివేద పుట్టింది మదురైలో. తర్వాత వాళ్లనాన్న పెత్తురాజ్‌కి దుబాయ్‌లో ఉద్యోగం రావడంతో కుటుంబం అక్కడే స్థిరపడింది. పద్దెనిమిదేళ్లప్పుడు మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. 2015లో ‘మిస్‌ ఇండియా యూఏఈ’గా ఎంపికైంది. ఆ విజయమే తమిళంలో… ఆ తర్వాత తెలుగులోనూ అవకాశాల్ని సాధించిపెట్టింది.
ఓ విషాదం ఉంది…ఎప్పుడూ ఎంతో చలాకీగా, నిర్భయంగా మాట్లాడే నివేదా… చిన్నప్పుడు లైంగిక వేధింపులకి గురైంది. ‘అప్పుడు నాకు ఐదేళ్లుంటాయి. మాదగ్గరి బంధువొకడు ఆ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అసలేం జరుగుతోందో కూడా నాకు ఎనిమిదేళ్లదాకా తెలియదు. తెలిశాకా అమ్మానాన్నలకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు!’ అంటుంది నివేద. అందుకే ‘తల్లిదండ్రులు తమ రెండేళ్ల చిన్నారులనైనా సరే… ప్రతి విషయం అడిగి తెలుసుకోవాలి’ అంటూ సలహా ఇస్తుంటుంది.
అది లక్కీ పేరట!అవకాశాల కోసం చూస్తున్న కొత్తల్లో ‘నీ పేరు వెనక ‘పెత్తురాజ్‌’ అని మీ నాన్న పేరు కూడా ఉండాలా. మోడర్న్‌గా లేదుకదా!’ అని చాలామంది అడిగారట. మొదట్లో డైలమాలో పడ్డ నివేద చివరికి పేరుని యథాతథంగా ఉంచాలనే చెప్పిందట. ఆ పేరుతోనే సక్సెస్‌ అయ్యింది. ఆ మధ్య తనకి సంబంధించిన వికీపీడియా పేజీ కూడా మొదలయ్యాక వాళ్లనాన్న ‘చూశావా నా పేరు నీకెంత లక్కీయో! దానివల్లే నువ్వు సెలబ్రిటీ అయిపోయావ్‌!’ అంటూ ఆటపట్టిస్తున్నాడట.