కంగారులోనూ ‘గారు’ అనడం మరిచిపోరు
‘‘ప్రతి దర్శకుడు తన ప్రత్యేకతని ప్రదర్శించే ప్రయత్నంలో ఉంటాడు. చూసిన సినిమాలు, చదివిన పుస్తకాలు, జీవితంలో జరిగిన సంఘటనలే వాళ్ల శైలిపై ప్రభావం చూపిస్తుంటాయి’’ అంటారు దర్శకుడు శ్రీరామ్ వేణు. ఆయన మూడో ప్రయత్నంలోనే పవన్‌కల్యాణ్‌తో సినిమా చేసే అవకాశం సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో ‘వకీల్‌సాబ్’ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రయాణం గురించి శ్రీరామ్ వేణు ‘ఈనాడు సినిమా’ ప్రత్యేకంగా మాట్లాడారు.
పవన్ కల్యాణ్ నుంచి ప్రతి రోజూ ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఆయన అంకితభావంతో పనిచేస్తుంటారు. చుట్టూ ఉన్న మనుషులందరినీ ఒకేలా చూడటం, గౌరవించడం ఆయనలో గమనించిన మరో గొప్ప లక్షణం. కంగారులోనైనా ‘గారు’ అని సంబోధించడం మరిచిపోరు. సెట్‌లో సమయం దొరికిందంటే అందరితో సరదాగా మాట్లాడతారు. మన గురించి అన్ని వివరాలు తెలుసుకుంటారు. మొదట ‘పుస్తకాలు చదువుతారా? ఏం చదివారు?’ అని అడుగుతారు. ఆయన అభిమానిగా నేను ఫీల్ అయినవి చెప్పుకోవడానికే సమయం సరిపోయింది (నవ్వుతూ).
పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలనే కోరిక మొదట్నుంచీ ఉండేదా?
ఇష్టమైన కథానాయకుడితో సినిమా చేయాలని ప్రతి దర్శకుడికీ ఉంటుంది. పవన్ అభిమానిని నేను. ‘ఖుషి’ 22 సార్లు, ‘గబ్బర్‌సింగ్’ 23 సార్లు చూశా. ఇష్టమైన స్టార్‌తో సినిమా చేసే అవకాశం వస్తే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం.
రీమేక్ కాకుండా… సొంత కథతో చేసే అవకాశం వచ్చుంటే బాగుండేదని ఎప్పుడైనా అనిపించిందా?
మన హీరోని ఇలాంటి కథలో చూసుకోవాలనే ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయి. అలాగని రీమేక్ తక్కువ కాదు. ‘పింక్’ ఆధారంగా తెరకెక్కుతున్న ‘వకీల్‌సాబ్’… పవన్ స్థాయికి తగ్గ చిత్రం. సమాజానికి చెప్పాల్సిన కథ ఇందులో ఉంది.
‘వకీల్‌సాబ్’ అవకాశం ఎలా వచ్చింది?
‘వకీల్‌సాబ్’కి ముందు వేరే సినిమా ప్రయత్నాల్లో ఉన్నా. అప్పుడు అనుకోకుండా దిల్‌రాజుతో కలిసి త్రివిక్రమ్ దగ్గరికి వెళ్లా. ‘పింక్’ రీమేక్ గురించి వాళ్లిద్దరి మధ్య చర్చ జరిగింది. ఆ అవకాశం నాకే వస్తుందని అప్పుడు ఊహించలేదు.
విరామం తర్వాత పవన్ చేస్తున్న సినిమా. అభిమానుల అంచనాలకు తగ్గట్లు ఎలాంటి కసరత్తులు చేశారు?
ఒక మంచి మాట చెప్పడానికి… చెప్పేవాళ్లకి ఓ స్థాయి ఉండాలి. అప్పుడే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. అలా ఇందులో ఒక గొప్ప విషయం ఉంది. దాన్ని పవన్ నోటి నుంచి చెప్పించడం కంటే గొప్ప కమర్షియాలిటీ మరొకటి లేదు. ఈ కథకి కొన్ని పరిమితులున్నాయి. కానీ వాటిలోనే అభిమానులకి కావాల్సిన వాణిజ్యాంశాల్ని సృష్టించాం.
పవన్‌తో తొలి రోజు సెట్లో అనుభవమేంటి?
పవన్ భావాలకి దగ్గరగా ఉన్న సినిమా ఇది. ఆయన ఫీల్ అయిన విషయాలన్నీ చెప్పారు. కొంచెం సమయం తీసుకుని ‘నేనిలా అనుకుంటున్నాను సర్’ అని చెప్పి ఒప్పించా. తొలి రోజే ఆయన మీద సన్నివేశాల్ని తెరకెక్కించా. ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో సన్నివేశం అదే.
మీ ప్రయాణం మీకు ఏం నేర్పింది?
తొలి చిత్రం ‘ఓ మై ఫ్రెండ్’ తర్వాత ఒక సినిమా ప్రారంభమై ఆగిపోయింది. మరో సినిమా కోసం ఏడాది కష్టపడ్డాక మానేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ‘ఎమ్.సి.ఎ’ చేశాను. ఈ అనుభవాలతో వర్తమానంలో బతకడమే అలవాటైంది.
ఈ సినిమా స్క్రిప్టులో త్రివిక్రమ్ భాగస్వామ్యం ఉందా?
మొదట త్రివిక్రమ్ రాస్తారని చెప్పారు. కానీ కుదరలేదు. ఆ సమయంలో ఆయన ‘అల వైకుంఠపురములో’ హడావిడిలో ఉన్నారు. అది విడుదలైన నాలుగైదు రోజులకే ‘వకీల్‌సాబ్’ చిత్రీకరణ మొదలుపెట్టాం.
ఆ సినిమా తర్వాతి రోజు… నాన్న పోయారు!
‘నాగ్గాని ఒక్క ఛాన్స్ దొరికితేనా…’ అంటుంటారు సినిమాల్లో అవకాశం కోసం కసిగా తిరిగేవాళ్లు. ఆ ‘ఒక్క ఛాన్స్’ శ్రీరామ్ వేణుకి పెద్దగా కష్టం లేకుండానే దొరికింది! కానీ ఆ సినిమా విడుదల తర్వాతే సమస్యలు మొదలయ్యాయి. పరిస్థితులు అతణ్ణి కొలిమిలో కాల్చినట్టే కాల్చాయి. అలా ఏడేళ్లు… తనని తాను పుటం పెట్టుకున్న వేణు బంగారంలాగే బయటకొచ్చాడు. నానితో ‘ఎంసీఏ’ తీసి మంచి హిట్టిచ్చాడు. తన మూడో సినిమాతోనే పవన్ కల్యాణ్‌కి ‘యాక్షన్’ చెబుతున్నాడు! ఆ అనుభవాలని ఇలా పంచుకుంటున్నాడు…
మా ఊర్లోవాళ్లు తమకున్న దుస్తుల్లో కొన్నింటిని భద్రంగా దాచుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా శుభకార్యాలప్పుడు వాటిని వేసుకుని దర్జాగా వెళ్తుంటారు. ‘డ్రెస్సు భలే ఉంది…’ అని ఎవరైనా అనడం ఆలస్యం ‘ఎవరు కుట్టారో తెలుసా… శ్రీరామ్ కిషన్ సాబ్!’ అని గొప్పగా చెప్పుకునేవారు. ఆ కిషన్ మా నాన్న. అప్పట్లోనే బొంబాయిలోని ఓ పేరున్న టైలరింగ్ సంస్థలో పనిచేసినవాడాయన. జితేంద్ర, ధర్మేంద్రలాంటి బాలీవుడ్ హీరోలకి కాస్ట్యూమ్‌లు కుట్టాడు. అంతటివాడు తమకి దుస్తులు కుట్టిచ్చాడంటే అదెంత గర్వకారణం..! మొదట్లో ముంబయిలో పనిచేసిన నాన్న ఆ తర్వాత దుబాయ్‌కి వెళ్లాడు. దుబాయి నుంచి సెలవులకి వచ్చినప్పుడు ఊరిలో ఎవరు కష్టంలో ఉన్నా లెక్కలేవీ వేసుకోకుండా సాయం చేసేవాడు. దర్జీ పనుల కోసం ఎవరు అడ్వాన్స్ ఇచ్చినా… ఆ బట్టలు కుట్టేదాకా ఆ డబ్బుని వాడేవాడు కాదు. మనం పని పూర్తిచేసేదాకా అది మనడబ్బుకాదు… మనదికాని ఒక్క రూపాయైనా వాడకూడదు అనేవాడు. ఆ విలువలన్నీ ప్రత్యేకించి నేర్చుకోకుండానే నాకూ వచ్చాయి. ఓ రకంగా అవే నన్ను సినిమా రంగంలో నిలదొక్కుకునేలా చేశాయి.
జిల్లా టాపర్‌ని..!
జగిత్యాల జిల్లాలో మూడుబొమ్మల మేడిపల్లి అనే గ్రామం మాది. ఇంట్లో నాతోపాటూ తమ్ముడూ, చెల్లీ ఉన్నారు. నాన్న ముంబయి, దుబాయంటూ పనులకి వెళ్లిపోవడంతో అమ్మే అన్నీ తానై మమ్మల్ని పెంచారు. ఐదో తరగతి వరకూ గ్రామంలోని ప్రభుత్వ బడిలోనే చదువుకున్నా. సుద్దాల అశోక్‌తేజగారు అప్పట్లో మాకు తెలుగు టీచర్! నేను బాగా చదువుతున్నానని ఆయనే నన్ను కిసాన్ నగర్‌లో ఉండే సెయింట్ ఇ.ఎ.ఎస్ స్కూల్‌లో చేర్పించారు. టెన్త్‌లో నాటి ఆంధ్రప్రదేశ్ స్థాయిలో పదకొండో ర్యాంకు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి ర్యాంకు సాధించాను. దాంతో నన్ను ఇంజినీరింగ్ చేయించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోనైతే ఇంటర్‌తోపాటూ ఎంసెట్ కోచింగ్ కూడా ఉంటుందని పంపించారు. నేను వస్తున్నప్పుడు నాన్న ‘నువ్వు గొప్పోడివి కాకపోయినా చెడ్డోడివి మాత్రం కావొద్దు!’ అని మాత్రమే చెప్పారు. నేను చెడ్డవాడిగా అయితే పేరు తెచ్చుకోలేదుకానీ… నాన్న కోరుకున్నట్టు డాక్టర్‌ని కూడా కాలేకపోయాను. పదో తరగతిలో నాకు పరిచయమైన డ్రామాలూ, డ్యాన్సులూ నా దారి మళ్ళించాయి.
కాలేజీల నుంచి పంపేశారు!
హైదరాబాద్‌లో అప్పుడప్పుడే సిటీ కేబుల్ ఛానెల్ మొదలైంది. దాని కోసం తీస్తున్న ఓ సీరియల్‌కి 17 ఏళ్ల కుర్రాడి అవసరముందని చెబితే వెళ్లాను. ఇదివరకే డ్రామాల అనుభవం ఉంది కాబట్టి నటన నాకు ఈజీగానే వచ్చేసింది. కానీ… నా దృష్టి అప్పుడే డైరెక్టర్ ఛెయిర్ మీద పడింది. మెగాఫోన్ పట్టినవాళ్లకి మిగతా అందరిమీద ఉన్న కమాండ్ చూసి ఏదో ఒకరోజు నేనూ అందులో కూర్చోవాలనుకున్నాను. మెల్లగా సినిమా నా మనసునీ, జీవితాన్నీ ఆక్రమించడం మొదలుపెట్టింది. ఓ గొప్ప సినిమా చూస్తూ ఆత్మని ఎన్‌రిచ్ చేసుకుని చచ్చిపోయినా చాలనుకునేవాణ్ణి… ఇప్పుడూ అంతే! అప్పట్లో ఈ వ్యాపకాలతో ర్యాంకు కాదుకదా ఇంటర్ పాస్‌కావడానికే ఆపసోపాలు పడ్డాను. ఎలాగోలా గట్టెక్కాక నాన్న నన్ను ఎంసెట్ కోచింగ్‌లో చేరమన్నారు. తొలిసారి ఆయన మాటని కాదన్నాను.
సినిమాలతో ఎక్కువ సమయం గడపొచ్చని మామూలు డిగ్రీలో చేరాను. సినిమా వ్యాపకంతో కాలేజీకి హాజరు కాక, రెండు కాలేజీల నుంచి నన్ను పంపేశారు. మూడో కాలేజీలో చేరి డిగ్రీ పూర్తి చేశాను.
కల నెరవేరింది కానీ…
ఓ సారి ప్రముఖ దర్శకుడు రాజీవ్ మేనన్ ఓ ప్రకటనని చిత్రీకరించేందుకు హైదరాబాద్ వచ్చారు. ఆయనకి తెలుగు, ఇంగ్లిష్ మాట్లాడ గలిగిన సహాయ దర్శకుడు అవసరమని తెలిసినవాళ్లు చెప్పడంతో వెళ్లాను. ముంబై నుంచి మరో బృందం పవన్ కల్యాణ్‌తో ప్రకటన తీసేందుకు వస్తే… దానికీ సహాయ దర్శకుడిగా పనిచేశాను. అప్పుడే సుకుమార్ పరిచయమయ్యారు. ఆయనతో ‘ఆర్య’కి సహాయ దర్శకుడిగా పనిచేశాను. అప్పటి నుంచి నిర్మాత దిల్‌రాజు సంస్థలో ఉండిపోయాను. ‘భద్ర’, ‘బొమ్మరిల్లు’, ‘కొత్త బంగారులోకం’, ‘మున్నా’… ఇలా ఒక్కో సినిమాకీ ఒక్కో రకం బాధ్యతని తీసుకుని పనిచేశాను. ఆ తర్వాతే దిల్ రాజు దర్శకత్వం చేయమన్నారు. అప్పటికే నేను సిద్ధం చేసుకున్న ఓ కథని తెరకెక్కించాను. అదే ‘ఓ మై ఫ్రెండ్’. అప్పటికి పదిహేనేళ్లపాటు నన్ను వెంటాడిన సినిమా కల అలా సాకారమైందనుకుని గాలిలో తేలిపోయాను. అంతేకాదు… మరో నెలలో మా తమ్ముడి పెళ్లి పెట్టుకున్నాము. నాన్న మా ఇంటిపైన మరో అంతస్తు కట్టిస్తున్నాడు. ఇన్ని మంచి విషయాలు జరుగుతున్న ఆనందంలోనే నా సినిమాని ఇంటిల్లిపాదీ కలిసి చూశాం. ఆ తర్వాత అందరం తిరుపతి వెళదామనుకున్నాం. కానీ నాన్న ఇంటి నిర్మాణ పనులు మిగిలిపోయాయని ఊరెళ్లారు. ఆ తర్వాతి రోజు మధ్యాహ్నం మేం తిరుపతిలో ఉండగా ఫోన్ వచ్చింది… నాన్న కొత్తగా కడుతున్న అంతస్తు పై నుంచి కింద పడిపోయారని. మరి కాసేపటి తర్వాత అసలు నిజం తెలిసింది… నాన్న ఇక లేరని! అప్పటిదాకా పెద్దగా ఒడుదొడుకుల్లేకుండా సాగిన జీవితంలో నాకు ఎదురైన మొదటి దెబ్బ అది… చాలా పెద్ద దెబ్బ కూడా!
ఏడేళ్ల అజ్ఞాతవాసం!
నాన్న చనిపోయారనే వార్త విన్నాక… నా సినిమా ఏమైందో కూడా పట్టించుకోలేదు. అంత్యక్రియలప్పుడు కూడా నేను ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయాను. మెల్లగా… చాలా మెల్లగా నాన్న చనిపోయిన నెలరోజులకి మనిషినయ్యాను. అలా ఆ షాక్ నుంచి తేరు కున్నాక నాకొచ్చిన మొదటి ఆలోచన ‘ఫర్వాలేదు. నాన్న నేను దర్శకుణ్ణయ్యానని తెలిసిన తర్వాతే చనిపోయారు!’ అన్నది. ఆ తర్వాతే హైదరాబాద్ వచ్చాను. నా సినిమా ఏమైందని కనుక్కుంటే నిర్మాతకి డబ్బు మిగిలింది కానీ సినిమా ఆడలేదనే విషయం తెలిసింది. ఓ దర్శకుడి మొదటి సినిమా ఫ్లాపయితే దాని ప్రభావం ఎలా ఉంటుందో అప్పటికి నేను అంచనా వేయలేకపోయాను. ‘ఓ మై ఫ్రెండ్’ తర్వాత నేను పవన్ కల్యాణ్‌కే కథ రాశాను. ఆయన్ని కలవడానికి షూటింగ్ స్పాట్‌కి వెళ్లినా కుదర్లేదు. ఆ తర్వాత మరో ఇద్దరు పెద్ద హీరోలకి కథ చెప్పాను…
తిరస్కరించారు. ముగ్గురు చిన్న హీరోలూ కుదర్దన్నారు. అలా మొదటి సినిమా రిలీజైన ఐదేళ్లకి నాలుగు కథలు పట్టుకుని దాదాపు అందరు హీరోల చుట్టూ తిరిగాను. మధ్యలో ‘బెంగళూరు డేస్’ మలయాళ సినిమా రీమేక్ కోసం దిల్‌రాజు దగ్గర పనిచేస్తే అదీ
పట్టాలెక్కలేదు. ఓ కథ సిద్ధం చేసుకుని పెద్ద హీరోతో మొదలుపెట్టాం. అదీ చివరి నిమిషంలో ఆగిపోయింది. ‘ఎప్పుడూ గెలుపే జీవితం అనుకోవద్దు. మనం వెళ్లే దారుల్లో ముళ్లూ, రాళ్లూ అన్నీ ఉంటాయ’ని చెబుతుండేది మా అమ్మ అమృత. మెల్లగా ‘నా కథ నచ్చలేదంటే వాళ్లకి నచ్చేలా చెప్పలేకపోయాననే కదా!’ అన్న నిజాన్ని స్వీకరించాను. నరేషన్‌లో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ‘రెండో ఛాన్స్’ కోసం ఎదురుచూడటం మొదలుపెట్టాను.
‘ఎమ్‌సీఏ’ ఐడియా అలా వచ్చింది…
ఇంజినీరింగ్ కోసం మా తమ్ముడు హైదరాబాద్‌కి వచ్చిన కొత్తల్లో మేమిద్దరం కలిసి ఓ గదిలో ఉండేవాళ్లం. మాట్లాడుకున్నా, తిన్నా, పడుకున్నా మేమిద్దరమే. కానీ పెళ్ళయ్యాక మా మధ్యకి మూడో వ్యక్తిగా నా భార్య వచ్చింది. తన రాకతో నా తమ్ముడిలో అభద్రతాభావం కనిపించేది. ఇంతకాలం నాతో మాత్రమే ఫ్రెండ్లీగా ఉన్న అన్నయ్య జీవితంలోకి ఇంకెవరో వచ్చారనే ఉడుకుమోత్తనం ఉండేది. ప్రేమ ఉంటేనే కదా అలా అభద్రతాభావానికి గురవుతారు అనిపించింది. ఆ అనుభవానికే కమర్షియల్ హంగులు జోడించి ‘ఎమ్.సి.ఎ.’ స్క్రిప్టు సిద్ధం చేశాను. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ‘నా కెరీర్‌లో అతిపెద్ద హిట్టు నువ్వే ఇచ్చావ్!’ అన్నాడు హీరో నాని. ఆ తర్వాత రెండేళ్లపాటు నాకు నేనే లాక్‌డౌన్ విధించుకుని అల్లు అర్జున్ కోసం ‘ఐకాన్’ కథ రాశాను. కాకపోతే అది పట్టాలెక్కడానికి కాస్త ఆలస్యమైంది. ఈలోపే అనుకోకుండా ఓ మంచి అవకాశం తలుపుతట్టింది.
ఎవరు తీస్తారో…
‘ఎమ్.సి.ఎ’ తర్వాత ‘పవన్‌కల్యాణ్‌తో సినిమా చేస్తున్నట్టు కల కనవయ్యా!’ అన్నా కూడా సందేహించేవాణ్నేమో! కానీ అదే జరిగింది. ఓసారి దిల్‌రాజు నన్ను త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గరకి తీసుకెళ్లారు. వాళ్లిద్దరూ హిందీ ‘పింక్’ సినిమాని పవన్‌కల్యాణ్‌తో చేయించాలనే విషయంపైన మాట్లాడుకున్నారు. వరసగా ఇద్దరు ముగ్గురు యువ దర్శకుల పేర్లొచ్చాయి… అప్పుడు త్రివిక్రమ్ ‘వేణు అయితే తీయగలడేమో!’ అన్నారు. అలా అనుకోకుండా నా పేరు ఖరారైంది. మా నాన్న అడ్వాన్స్ తీసుకుంటే ఖర్చుపెట్టరని చెప్పాను కదా! ‘ఎమ్.సి.ఎ’ తర్వాత ముగ్గురు
నిర్మాతలు అడ్వాన్సులు ఇచ్చారు. ‘నేను చెక్ తీసుకుంటాను కానీ, సినిమా చేసేదాకా దాన్ని బ్యాంకులో వేయన’ని చెప్పాను. నేను అలా చేయబట్టే ఏ కమిట్‌మెంట్సూ లేకుండా పవన్ కల్యాణ్ సినిమాని తీసుకోగలిగాను. ఓ రకంగా నాన్నలోని ఆ గుణమే నాకు
పవన్‌తో ‘వకీల్‌సాబ్’ చేసే అవకాశాన్నీ… అదృష్టాన్నీ ఇచ్చింది!
– నర్సిమ్ ఎర్రకోట