Heroine Aditorao Hydari

aditirao hydiri5423999d-dc37-4954-a884-ff96ce4654a5ఎన్ని సార్లు అడిగినా… అమ్మకి ఆ సినిమా చూపలేదు!

అందం, అభినయంతో అటు ఉత్తరాదిలోనూ… ఇటు దక్షిణాదిలోనూ తన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకుంది  అదితీ రావ్‌ హైదరీ. ‘సమ్మోహనం’తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన అదితి పదహారణాల తెలుగమ్మాయని చాలామందికి తెలియదు. త్వరలో రాబోతున్న ‘వి’లో ఓ విభిన్న పాత్రలో అలరించడానికి సిద్ధమైన ఈ వనపర్తి యువరాణి గురించి మరిన్ని విశేషాలు తన మాటల్లోనే తెలుసుకుందామా!
నేను తెలుగు అమ్మాయినే అని చాలామందికి తెలియదు. నా పేరు పక్కన హైదరీ చూసి నేను నార్త్‌ అమ్మాయిని అనుకుంటారు. మాది తెలంగాణలోని వనపర్తి. మా తాతగారు వనపర్తి జమీందారు రామేశ్వర్‌రావ్‌. అమ్మమ్మ శాంతా రామేశ్వర్‌రావ్‌. తనది మహారాష్ట్ర. హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూలు అందరికీ తెలిసే ఉంటుంది. అది స్థాపించింది మా అమ్మమ్మే. నేను పుట్టకముందే అమ్మమ్మా వాళ్లు వనపర్తి సంస్థానం నుంచి హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డారు. అమ్మ విద్యారావ్‌. నాన్న ఇషాన్‌ హైదరీ. నాన్నా వాళ్ల నాన్న నిజాం కాలంలో హైదరాబాద్‌ ప్రధానమంత్రి. ఉస్మానియా యూనివర్శిటీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించింది ఆయనే. నానమ్మ ఆడవాళ్ల కోసం హైదరీ క్లబ్‌ ప్రారంభించింది.  అంటే – అమ్మమ్మా, నానమ్మలిద్దరివీ రాజకుటుంబాలే. అందరూ బాగా చదువుకున్నవాళ్లే. అలానే నటుడు ఆమిర్‌ ఖాన్‌ భార్య కిరణ్‌రావ్‌.. మా మేనమామ కూతురు. ప్రతి దసరాకి మేమంతా వనపర్తి వెళ్లి అక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తాం. అక్కడికెళితే మా బాల్యంలోకి వెళ్లినట్టు ఉంటుంది.
ఇక నా వ్యక్తిగత విషయాలకొస్తే… ముందు అమ్మానాన్నల గురించి చెప్పాలి. వాళ్లిద్దరిదీ ప్రేమ పెళ్లి. అప్పటికి అమ్మ దిల్లీలో వ్యాపారాలు చూసుకునేది. పెళ్లి తరవాత నాన్న కోసం హైదరాబాద్‌లోనే ఉండి పోయింది. నేను పుట్టింది కూడా ఇక్కడే. అమ్మానాన్నలకి నేను ఒక్కదాన్నే సంతానం. కానీ నాకు ఊహ తెలిసే సరికి వాళ్లిద్దరూ అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు. దాంతో అమ్మ నన్ను దిల్లీ తీసుకుని వెళ్లింది. ఒంటరిగా నన్ను పెంచుతూ అక్కడే మళ్లీ వ్యాపారాలు చూసుకోవడం మొదలుపెట్టింది. నాన్న మాత్రం ఇంకో పెళ్లి చేసుకున్నా తరచూ నన్ను కలిసేవారు. అందుకే అమ్మానాన్నల మీదున్న ప్రేమతో నా పేరు పక్కన అమ్మ పేరులోని రావ్‌నూ, నాన్న పేరులోని హైదరీని చేర్చుకుని అదితీ రావ్‌్ హైదరీని అయ్యా. కానీ ఏడేళ్ల క్రితం నాన్న లంగ్‌ క్యాన్సర్‌తో చనిపోయారు.
ఏం చదివానంటే…
నా స్కూలింగ్‌ అంతా చిత్తూరు జిల్లా మదనపల్లిలోని రిషీ వ్యాలీ స్కూల్‌లో సాగింది. అక్కడ ఇంటర్‌ అయ్యాక దిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజీలో చేరా. అక్కడే సోషియాలజీలో పీజీ చేశా. అయితే చదువు పూర్తవకుండానే సినిమాల్లో అవకాశం వచ్చింది. ఎలాగంటే నా నాలుగేళ్ల వయసులోనే అమ్మ భరతనాట్యం నేర్పించేందుకు ప్రముఖ నృత్య కళాకారిణి లీలాసామ్‌సన్‌ స్కూల్‌లో చేర్పించింది. ఆ డాన్స్‌ ప్రభావం వల్ల నాకు సినిమాలపై ఆసక్తి కలిగింది. పైగా కాలేజీకొచ్చాక మణిరత్నం సినిమాలు ఎక్కువగా చూసి హీరోయిన్‌ని అవ్వాలని కలలు కనేదాన్ని. ఆ కల నేను డిగ్రీ పూర్తి చేయకముందే తీరిందనుకోండీ. ఎలాగంటే… నేను మా డాన్స్‌ టీచర్‌ బృందంతో కలిసి దేశవిదేశాల్లో భరతనాట్య ప్రదర్శనలు ఇచ్చేదాన్ని. ఓ ప్రదర్శనలో వేదిక మీద తమిళ దర్శకురాలు శారదా రామనాథన్‌ చూశారు. ఆమెకి నా అభినయం నచ్చడంతో స్క్రీన్‌ టెస్ట్‌ కూడా చేయకుండానే ఛాన్స్‌ ఇచ్చారు. అలా నేను కెమెరా ముందుకొచ్చిన మొదటి సినిమా ‘శృంగారం’. అందులో గుడిలో నృత్యం చేసే దేవదాసిగా నటించా. కానీ ఆ సినిమా విడుదల ఆలస్యమైంది.

దిల్లీ టూ ముంబయి…
మొదటి సినిమా షూటింగ్‌తోపాటు చదువు కూడా పూర్తి చేశా. ఆ తరవాత సినిమా అవకాశాల కోసం ముంబయికి మకాం మార్చేశా. ఎవరి రికమండేషన్లూ లేకుండానే ఒక్కదాన్నే సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేదాన్ని. దాదాపు ఏడాదిపాటు ప్రయత్నాలు చేశా. అప్పటికి నేను నటించిన మొదటి సినిమా కొన్ని టెక్నికల్‌ కారణాల వల్ల విడుదల కాలేదు. అవకాశాలు రావట్లేదనే ఒత్తిడితో చాలా కుంగిపోయేదాన్ని. పైగా ఒంటరి ఆడపిల్లని కావడంతో ఎన్నో ఇబ్బందులు పడేదాన్ని. నేను సినిమా ప్రయత్నాలు చేసే క్రమంలో చాలానే చేదు అనుభవాలు ఎదురయ్యాయి. సాయంత్రం రూమ్‌కెళ్లి ఏడ్చేదాన్ని తప్ప అమ్మకి చెప్పేదాన్ని కాదు. అవన్నీ చెబితే సినిమాలు వదిలేసి వచ్చి వ్యాపారాలు చూసుకోమంటుందని బాధలన్నీ నాలో నేనే దాచుకునేదాన్ని. అలా ప్రయత్నాలు చేయగా చేయగా ఓ మలయాళం సినిమాలో అవకాశం వచ్చింది. అలా నేను నటించిన రెండో సినిమానే మొదట విడుదలైంది. ఆ తరవాత మొదటి సినిమా రిలీజ్‌ అయింది. రెండు సినిమాలకీ మంచి పేరు రావడంతో బాలీవుడ్‌లో మరిన్ని ఛాన్స్‌లు వచ్చాయి. వాటితోపాటు మణిరత్నం ద్విభాషా చిత్రమైన ‘చెలియా’తో తెలుగు ప్రేక్షకులకు కొంత దగ్గరయ్యాననే చెప్పాలి. ఆ సినిమా కోసం మణి సర్‌ స్వయంగా ఫోన్‌ చేయడం ఎప్పటికీ మర్చిపోలేని విషయం. ఆ తరవాత ‘చెలియా’లో నన్ను చూసిన ఇంద్రగంటి మోహనకృష్ణ గారు ‘సమ్మోహనం’ కోసం అడిగారు. కథ వినకముందే చేయాలని నిర్ణయించుకున్నా.
ఆ సినిమాకి నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నా. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి తెలుగులో నటిస్తున్న హీరోయిన్లు చక్కగా మన భాష నేర్చుకుని డబ్బింగ్‌ చెప్పుకుంటున్నారు. నేను పక్కా లోకల్‌ అయి ఉండి వేరే వాళ్లతో చెప్పించుకోవడం ఏంటని పట్టుదలతో తెలుగు నేర్చుకున్నా. ఆ తరవాత వచ్చిన ‘అంతరిక్షం’లోదీ గుర్తుండిపోయే పాత్రే.
జయ చెప్పారనీ…
‘పద్మావతి సినిమాలో అల్లావుద్దీన్‌ ఖిల్జీ భార్య మెహరున్నీసా పాత్రకు నువ్వు అయితే బాగుంటుంది. చేస్తావా’ అంటూ ఒకరోజు సంజయ్‌ లీలా భన్సాలీ ఫోన్‌ చేశారు. అది కలో నిజమో అర్థం కాలేదు. అసలు ఆయన్నుంచి ఫోన్‌ రావడమే నాకు గొప్పగా అనిపించింది. మరో విషయం ఏంటంటే… సంజయ్‌ లీలా భన్సాలీ మెహరున్నీసా పాత్ర కోసం వెతుకుంటే ‘అదితీ తప్ప ఆ పాత్రకి మరెవరూ సూట్‌ కారు’ అని జయా బచ్చన్‌ చెప్పారట. అందుకే ఆయన నన్ను తీసుకున్నారు. ఆమె గుర్తింపును నేను ఓ పెద్ద ప్రశంసలానే భావిస్తా. అలా నా అదృష్టం కొద్దీ ఇప్పటి వరకూ పేరున్న దర్శకుల వద్దే పనిచేశా. దానివల్ల వారిని గమనించే అవకాశం వచ్చింది. క్రియేటివ్‌గా ఆలోచించడం, కష్టపడటంతోపాటు… తమ చిత్రం కోసం పనిచేసే వాళ్లందరినీ సొంత వాళ్లలా చూసుకుంటారు. అందుకే వాళ్లు అంత సక్సెస్‌ అవుతున్నారనిపిస్తుంది.
సెట్‌లో ఉన్నప్పుడు నేను కూడా అందరితోనూ చక్కగా కలిసిపోతా. సెల్‌ఫోన్‌ పట్టుకుంటే మనచుట్టూ ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడైనా మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర్నుంచీ ఎంతో కొంత తెలుసుకోవాలని మా అమ్మమ్మ చెబుతుండేది. అందుకే సెట్‌లో బాయ్‌ దగ్గర్నుంచీ ప్రతి ఒక్కరితో మాట కలుపుతా. వాళ్ల గురించి తెలుసుకుంటా. కొందరైతేౖ నా ప్రశ్నలకి భయపడిపోతుంటారు. మణిరత్నంగారు మాత్రం ఎంత బిజీగా ఉన్నా ఓపిగ్గా సమాధానం చెప్పేవారు. మోహన్‌కృష్ణ గారు కూడా అంతే.


పాఠం…

నేను కెరీర్‌ మొదలుపెట్టిన తొలినాళ్లలో సోషల్‌ మీడియాలో ఒక ఫోటోని మార్ఫింగ్‌ చేసి..  చెత్త రాతలు రాసి పెట్టారు. అది చూసి మూడురోజులు అన్నం తినలేదు. నిద్రపోలేదు. ఏడుస్తూనే ఉన్నా.. నా బాధను చూసిన అమ్మ ఒక మాట చెప్పింది. ‘ఆ రాతలు వాళ్ల బుర్రలో నుంచి వచ్చినవి నీవి కాదు. అంటే సమస్య వాళ్లలో ఉంది. నీలో లేదు’ అంటూ ఓదార్చింది. దాదాపు మూడేళ్లు పట్టింది ఇలాంటి రూమర్స్‌ చదివినా బాధపడకుండా ఉండటానికి. ఇప్పుడవేవీ మనసుకు తీసుకోవటంలేదు.


పిండేసింది…

‘భూమి’లో అత్యాచార బాధితురాలిగా చేశా. సంజయ్‌ దత్‌ కూతురి పాత్ర నాది. రేప్‌ జరిగాక ఆ ట్రామా నుంచి కొలుకుని జీవితాన్ని తీర్చిదిద్దుకునే క్యారెక్టర్‌ అది. ఆ పాత్ర చేయడం చాలా కష్టంగా అనిపించింది. ఎంతో మంది ఆడపిల్లలు మన దేశంలో రేప్‌కి గురవుతున్నారు… ఈ సమాజం ఎలా మారుతుంది… ఇలా రకరకాల ఆలోచనలు మనసును పిండేసేవి ఆ సమయంలో. ఈ చిత్రానికి కొన్ని అవార్డులు కూడా వచ్చాయి. కానీ మా అమ్మని మాత్రం ఆ సినిమా చూడనివ్వలేదు. ఎన్ని సార్లు అడిగినా నేను ఒప్పుకోలేదు.


ప్రశంస…

ఒకసారి అమితాబ్బచ్చన్‌ సర్‌ కలిసినప్పుడు.. ‘నిన్ను తెర మీద చూస్తున్నప్పుడు చూపు తిప్పుకోవడం కష్టం’ అని చెబితే గాల్లో తేలిపోయా నంటే నమ్మండి. అలానే ‘పద్మావతి’ విడుదలయ్యాక రేఖ నాకో ఉత్తరం రాసి దాన్ని గులాబీ రేకల్లో ఉంచి ఓ పార్సిల్‌ పంపారు. ‘పూలరెక్కలు వాడిపోవచ్చు.. వాసన ఎప్పటికీ ఉంటుంది. అలానే సినిమా పాతదైపోవచ్చు.. నీ నటన వేసిన ముద్ర ఎప్పటికీ అలానే ఉంటుంది’ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.


హలీంను మిస్‌ అవుతున్నా…

చిన్నప్పుడు ప్రతి వేసవికీ హైదరాబాద్‌ వచ్చేదాన్ని. అమ్మమ్మ నాకోసం బుట్టలు బుట్టలు మామిడి పండ్లు తెప్పించి ముందు పెట్టేది. లంచ్‌కీ, డిన్నర్‌కీ అవే. ఇంకా అమ్మమ్మ చేసే పప్పుచారు, రసం చాలా ఇష్టం. ఐదేళ్ల క్రితం తను చనిపోయింది. దాంతో హైదరాబాద్‌ రావడం తగ్గిపోయింది.
* అందం, ఆరోగ్యం కోసం యోగా, ధ్యానం చేస్తా. మంచి నీళ్లు ఎక్కువగా తాగుతా. ఆకుపచ్చని కాయగూరలూ, పండ్లూ తీసుకుంటా. ప్రతిరోజూ ఆకుకూరలూ, చేపలూ తింటా. కొద్దికొద్దిగా ఎక్కువ సార్లు తింటా.
* నాకు వంట బాగా వచ్చు. అందుకే తినడం కంటే వండటానికీ, ఇతరుల ఆకలి తీర్చడానికే ఇష్టపడతా. ఎగ్‌ దోశ, బిర్యానీ, కట్టీదాల్‌.. ఇలా చాలా  వెరైటీలు చేస్తా. మా కజిన్స్‌ అందరం ఒక చోట చేరినప్పుడు అందరికీ నా చేతి వంట రుచి చూపిస్తా. కానీ అమ్మమ్మలా పప్పు చారు మాత్రం చేయలేకపోతున్నా.
* నాకు హలీం అంటే చాలా ఇష్టం. అందుకే ఏటా రంజాన్‌ సమయంలో హైదరాబాద్‌లో ఉండేలా చూసుకుంటా. దాంతోపాటు ఎక్కడెక్కడో ఉన్న నా స్నేహితులకీ, బంధువులకీ ఆ హలీంను పంపుతుండేదాన్ని. కానీ ఈసారి లాక్‌డౌన్‌ వల్ల హలీంను మిస్‌ అవుతున్నా.
* తెలుగులో పాత గీతాంజలి, పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, కంచె సినిమాలు చాలా ఇష్టం.